సాక్షి, పెద్దపల్లి: సంక్రాంతి పండుగ అనగానే పిండి వంటలు గుర్తుకొస్తాయి.. కానీ అప్పాలు అంటే సుల్తానాపూర్ గ్రామం గుర్తుకొస్తుంది. ఆ ఊరే అప్పాలకు కేరాఫ్ అడ్రస్. ఆ గ్రామస్తుల క్వాలిటీయే వారి బ్రాండ్. చూస్తేనే నోరూరించే పిండి వంటలు. ఒక్కఫోన్ చేస్తే చాలు.. ఎంచక్కా పిండివంటలు మన ఇంటికి వచ్చేస్తాయి. శుభకార్యాలకు కావాల్సిన సారెలో అందించే అన్నిరకాల పిండివంటలను తయారుచేసి తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఇతర దేశాలకూ సరఫరా చేస్తూ స్వయం ఉపాధి పొందుతూ.. మరికొంతమందికి ఉపాధి ఇస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన మహిళలు.
మాకు చేసివ్వరా...
పదిహేడేళ్ల క్రితం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి లీడర్‌గా పదిమంది సభ్యులతో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఇంటివద్దే ఉంటూ చిన్న మొత్తాలతో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. పలురకాలుగా ఆలోచిస్తున్న సమయంలో గ్రూప్‌లోని ఒక సభ్యురాలి ఇంట్లో వివాహ వేడుకకు పెద్దమొత్తంలో అప్పాలు తయారు చేయాల్సి వచి్చంది. దీంతో తమ గ్రూప్ సభ్యుల సహకారంతో ఆ పెళ్లికి కావాల్సిన సారెను అందరూ కలిసి సరదాగా సిద్ధం చేశారు. దీంతో ఆ వేడుకకు వచి్చన బంధువులు ‘మా బిడ్డ సీమంతం ఉంది కొంచెం చేసి పెడతారా? మా కొడుకు, కోడలు అమెరికా వెళుతున్నారు..
అప్పాలు చేసి పెడతారా’అని అడగటంతో వారికి వీరు సైతం చేసిచ్చారు. అయితే ఊళ్లో ఉన్న మనకే సారె తయారు చేయడానికి ఇతరుల సహాయంతో చేయాల్సిన పరిస్థితి నెలకొందని, సిటీలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? వారు అప్పాలు పెద్దమొత్తంలో ఎలా తయారు చేసుకుంటారు? అనే ఆలోచన లక్ష్మికి తట్టింది. దీన్నే ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదని గ్రూప్ సభ్యులకు తెలిపింది. తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో కూడినది కావటంతో అందరూ సరేనన్నారు. దీంతో అప్పాలు చేయడం ఉపాధిగా మలుచుకొని లక్షణంగా లక్షలు సంపాదిస్తున్నారు.
8 గ్రూప్‌లు.. 400 మంది వర్కర్లు
గ్రూప్‌నకు ఎటువంటి పేరు, బ్రాండ్ లేకపోయినా, క్వాలిటీతో మొదట తమ గ్రూప్ సభ్యులు, వారి బంధువులు, స్నేహితులకు ఆర్డర్లపై అప్పాలు తయారు చేసి ఇచ్చేవారు. అలా నోటిమాటతో క్వాలిటీ నచ్చి ఆర్డర్లు పెరుగుతూపోయాయి. దాదాపు ఏడాదికి రూ.50 లక్షల పైనే ఆర్డర్లు వస్తుండటంతో అప్పాలు కాల్చడానికి, పిండి పిసకడానికి, సకినాలు చుట్టడానికి, ఇతరత్రా పనులకు రోజువారి వర్కర్ల సాయం తీసుకుంటూ వారికి కూడా ఉపాధి కల్పింపిస్తున్నారు. వీరిని చూసి గ్రామంలో మరో 8 సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కో గ్రూప్‌లో పదిమంది సభ్యులతోపాటు, వారికి సాయం పనికి వచ్చే 50మంది వర్కర్లతో పాటు, పిండిగిరి్న, ట్రాలీ, కట్టెలు కొట్టేవారు తదితరులతో కలిసి దాదాపు 400 మందికిపైగా ఆ గ్రామంలో అప్పాలతో ఉపాధి పొందుతున్నారు.
బాహుబలి అప్పాలు..
32 వరుసలతో చక్రాల్లా సకినాలు, కిలో పరిమాణంలో లడ్డూ, గరిజ, బెల్లం అరిసెలు, నువ్వుల లడ్డూ, మురుకులు, చెగోడీలు, గవ్వలు, ఖారా, ఇతరత్రా వంటకాలను పెద్దఎత్తున తయారు చేయడం వీరి ప్రత్యేకత.
ఆర్డర్‌పై విదేశాలకు
మా గ్రామంలో 17 ఏళ్లుగా ఆర్డర్‌పై అప్పాలను తయారు చేస్తూ ఎగుమతి చేస్తున్నాం. అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు, తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రకు సైతం పంపిస్తున్నాం. ఏడాదిలో రూ.50లక్షలపైగా ఆర్డర్లు వస్తాయి. తయారు చేసి వారు కోరుకున్న సమయానికి అందజేస్తాం.
– తానిపత్తి లక్ష్మీదేవి, గ్రూప్ లీడర్
కలిసి పనిచేస్తాం
మా బంధువులం అందరం కలిసి అప్పాలను తయారు చేస్తాం. ప్రతీ ఒక్కరికి రోజుకు రూ.500 నుంచి రూ.600 వరకు గిట్టుబాటు అవుతుంది. ఆర్డర్లు ఎక్కువ వస్తే ఇతర గ్రూప్‌లతో పంచుకుంటాం.
అందరం కలిసి పనిచేసుకుంటూ పిల్లలను మంచిగా సెటిల్ చేశాం.
– అలివేణి, సుల్తానాపూర్
ఆర్డర్లపై తయారీ
మా గ్రూప్ ద్వారా ఆర్డర్లపై సుమారు 11 ఏళ్లుగా అప్పాలను తయారు చేస్తూ విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాలతోపాటు లండన్, అమెరికాకు పంపిస్తున్నాం. మా గ్రూపు సభ్యులకు ఉపాధి కల్పించటంతోపాటు ఇతరులకు సైతం ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
– మాధవి, శ్రీరామ గ్రూప్ నిర్వాహకురాలు
Comments
Please login to add a commentAdd a comment