Bhogimantalu
-
భోగి వైభోగం
సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ భోగి. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. కర్రపుల్లలు, పిడకల దండలు, పాత సామాన్లు, కొబ్బరిమట్టలు... లాంటివాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. పాత వస్తువులతో పాటు, మనుషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆరోజు నుంచి కొత్త ఆయనంలోకి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచనగా భావిస్తారు. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ రోజున భోగి మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి తోటి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలికాచుకుంటూ కోలాహలంగా కనిపిస్తారు. సైన్సుపరంగా చెప్పాలంటే, చలికాలం వాతావరణంలో సూక్ష్మక్రిములు అభివృద్ధి చెందడానికి అనువైన కాలం. అందువల్ల అందరూ ఏకకాలంలో భోగిమంటలు వేయడం వల్ల సూక్ష్మక్రిములన్నీ నశించిపోయి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అదేవిధంగా ఎప్పటెప్పటి నుంచో మూలన పడి ఉన్న పాత సామానును ఏడాదికోసారి ఈ విధంగా వదిలించుకోవడం వల్ల దుమ్ము, ధూళి, ఎలుకలు, వాటిని తినడానికి పాములు చేరకుండా ఉంటాయనేది పెద్దల మాట. భోగం అంటే పిల్లలకు భోగం చేయడం. పిల్లలకు భోగిపళ్లు పోసేటప్పుడు రేగు పళ్లు, రాగి పైసలు, పువ్వులు మూడిటినీ కలిపి తలచుట్టూ మూడుసార్లు తిప్పి తలమీద పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగ ముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూలరేకలు అన్నీ కలిపి పోస్తారు. దీనివల్ల దృష్టి దోషం పోతుందని విశ్వాసం. పిల్లలు కూర్చునే పీటకింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరవాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు. చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో ఆరోగ్యానికి ఉపకరించే మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క ఇస్తారు. మన పండుగల వెనుక సంప్రదాయంతోపాటు ఆరోగ్య కోణమూ దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగా వస్తున్నాయి.వస్తు వ్యామోహానికి మంటమనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరూ వినరు కాబట్టి భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. ఇక పోతే, భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదని దాని అర్థం. రేగుపండ్లు శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఆకలి పుట్టిస్తాయి. రేగుపండ్లకున్నప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. మహా భక్తురాలైన గోదాదేవి భోగినాడే రంగనాథుని పతిగా పొందిందని ద్రవిడ వేదం చెబుతోంది. అందువల్ల విష్ణ్వాలయాలలో భోగిరోజు గోదా రంగనాథులకు కల్యాణం జరిపిస్తారు. – డి.వి.ఆర్. -
అగ్నిదేవుడికి నమస్కారం
నాయనా.. భౌతికమైన మంటల్లో భౌతికమైనవాటిని వేస్తాం. అభౌతికమైన వాటిని అభౌతికమైన మంటల్లో వెయ్యాలి. ‘అభౌతికమైన మంటలా? ఎక్కడ ఉంటాయవి?’ మన ఇన్సైడ్. లోపల. మనమే రాజేసుకోవాలి. ఆత్మ సంస్కారంతో, ఆత్మ సంఘర్షణతో, ఆత్మ విమర్శతో, ఆత్మ సాక్షాత్కారంతో అగ్నిని రాజేసుకుని... ఇదిగో ఈ ప్రవచనకారులు ఇలాగే చెప్తారు కానీ.. భోగిమంట వేశారా? అయితే అగ్నిదేవుడికి ఒక నమస్కారం చేసెయ్యండి. ఎందుకంటారా? నేడొక్కరోజే సూర్య ఇక్కడుండేది. ‘ఏంటి!, అల్లుడుగారు అప్పుడే డ్యూటీకి హైదరాబాద్ వెళ్లిపోతాడా! సంక్రాంతికి అరిసెల పని పట్టకుండా, కనుమకు నాన్‌వెజ్‌ను చీల్చి చెండాడకుండా!’. అల్లుడు సూర్య సంగతి కాదు. లోకానికి కాంతినిచ్చేవాడు, తొమ్మిదివేల యోజనాల పొడవైన రథం గలవాడు, రథానికి సప్తాశ్వాలు ఉన్నవాడు, విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను వివాహమాడినవాడు, హనుమంతుడికి యాజ్ఞవల్క్యుడికి వేదశాస్త్రాలు నేర్పినవాడు.. ఆ సూర్యుడు. అతడు వెళ్లిపోతున్నాడు నేడు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ఏగుతున్నాడు. ఏం గొప్ప? భూమధ్య రేఖ మీద ఇటు సౌత్‌లో అడుగు తీసి అటు నార్త్‌లో అడుగు వెయ్యడమేగా. టోల్గేట్లు ఉంటాయా, ట్రాఫిక్‌జామ్‌లు ఉంటాయా? గగన విహారమే కదా లార్డ్ సూర్య చేసేది. అల్లుడుగారొచ్చిన రూట్లో జర్నీ చేస్తే తెలుస్తుంది.. అల్లుడు గొప్పో, సూర్యుడు గొప్పో.‘ఓ గొప్ప అల్లుడుగారు.. లేవండి, లేవండి, అమ్మాయి భోగి మంటలు రాజేస్తోంది. మీరూ ఒక ఎండు పుల్ల వేసి భగ్గుమనిపిద్దురు రండి. మంచుకు చలి కాపుదాం రండి, చేతులు రుద్దుకుని వేకువ చెవులకు అద్దుదాం రండి. ఎంత మంచి సంప్రదాయమోనండీ..’ఇంకెక్కడి అల్లుడుగారు. చలిలో ఇంద్రా బస్సు దిగి, నేరుగా పడమటి దిక్కున పడగ్గదిలో వాలిపోయాడు. లేపండి లేపండి. అగ్ని లేకుండా భోగి లేదు. అల్లుడు లేవకుండా చిటపటల్లేవు. ‘భోగి మంటలు ఎందుకేస్తారు?’ ఎవర్రా అడిగింది? అల్లుడు గారు కాదు. ఎవరో పిలగాడు. అల్లుడుగారు మాత్రం పిలగాడు కాదా. పిలగాడేంటి? పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరైతేనూ. ఇంజనీరే, సాఫ్టువేరే. అయినా పిలగాడే. ఎందుకయ్యాడు పిలగాడు? భోగిమంటలు ఎందుకేస్తారని అడిగింది అల్లుడుగారేనట. ఎవర్నడిగారట? అమ్మాయినడిగాడట. అమ్మాయి ఏం చెప్పిందట. అడిగి చెప్తానందట. ఎవర్నడిగి చెప్తానందట? భోగిమంటను అడిగి, అగ్నిదేవుళ్లను అడిగి. అగ్నిదేవుళ్లా. ఒక్కడే కదా అగ్నిదేవుడు. అతడే కదా అష్టదిక్పాలకులలో ఒకడు. ‘మరి అగ్నికేతుడు, అగ్నితీర్థుడు, అగ్నిదత్తుడు, అగ్నిదేశ్యుడు, అగ్నిద్యోతనుడు, అగ్నిపూర్ణుడు, అగ్నిముఖుడు, అగ్నివేశుడు, అగ్నివర్ణుడు, అగ్నిసంభవుడు, అగ్నిసోముడు, అగ్నిహోత్రుడు .. వీళ్లంతా ఎవరు? సూర్యుడికి సినానిమ్స్ కాదా!’ కాదు. పేరులో ఫైర్ ఉంటే, తీరులో ఫైర్ ఉన్నట్లేనా? అగ్నిదేవుడు ఒక్కడే. ఫైర్ ఉన్నది ఆ ఒక్కడిలోనే. మరి జమదగ్ని ఎవరు? గాడ్.. అతడు సన్నాఫ్ సత్యవతి, రుచీక. విశ్వామిత్రుడికి మేనల్లుడు. జమదగ్ని భార్య రేణుక. చిత్రరథుడు అనే వ్యక్తి మీద ఆమె మనసు పడిందని అనుమానించి, ‘ఏరా బళ్లా. మీ అమ్మణి చంపాళని నీకెప్పుడైనా అనిపించిందా’ అని నాజర్, రానాని ‘బాహుబలి 2’లో అడిగినట్లు తన కొడుకుల్ని అడిగాడు జమదగ్ని. ‘అనిపించలేదు’ అన్నారు కొడుకులంతా. ‘అనిపించింది’ అన్నాడు ఇంకో కొడుకు పరశురాముడు. ‘అయితే వధించు’ అన్నాడు జమదగ్ని. తల్లిని వధించాడు పరశురాముడు. తర్వాత బోరుమన్నాడు. ‘ఏడ్వకు. వరం కోరుకో’ అన్నాడు జమదగ్ని పరశురాముడితో. ‘నా తల్లిని బతికించు నాన్నా. అదే నాకు వరం’ అన్నాడు పరశురాముడు. రేణుక బతికింది. ‘అవునా! దెన్, హూ ఈజ్ జటాగ్ని?’ జటాగ్ని ఎవరూ లేరు. జటాయువు ఉన్నాడు. జటాలిక ఉంది. జటాసరుడు ఉన్నాడు. వీళ్లెవరిలోనూ ఫైర్ లేదు. జఠరాగ్నిలో ఫైర్ ఉంది కానీ, అది కడుపులోని అగ్ని. డైజెస్టివ్ ఫైర్. కడుపులో ఏదైనా పడితేనే అది చల్లారుతుంది. ఏది అందుబాటులో ఉంటే అది వేసేయాలి. పిజ్జా ఉంటే పిజ్జా. బర్గరుంటే బర్గర్. వేరేదీ దొరక్కపోతే మ్యారీగోల్డ్. ‘అయితే ఈ స్వామీజీలంతా ఏంటి మరీ.. కడుపులో ఇంత పడేయండి అనకుండా, కడుపులో ఉన్న దాన్ని తీసి బయట పడేయండి అంటారు!’ఎవరు? జగ్జీ వాసుదేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్ వీళ్లేనా? వీళ్లు స్వామీజీలు కాదు. జ్ఞానాగ్ని పుత్రులు. అహాన్ని దగ్ధం చేసుకుని.. మహోన్నతిని, మహోజ్వలతను, సాక్షాత్కారం చేయిస్తున్నవారు. అవును వీళ్లే. భోగి వచ్చిన ప్రతిసారీ ఇదే ప్రవచనం, ఇదే ప్రబోధన. ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేస్తాం కదా, అలాగే ఒంట్లోని పనికిమాలిన ఫీలింగ్స్ అన్నిటినీ మంటల్లో వేయమంటారు? ఎలా సాధ్యం? ఎండు పుల్లల్ని, పాత చీపుళ్లను, పిడకల్ని, చెక్క ముక్కల్ని వేసినట్లు మనసు లోపలి భావాలను అగ్నికి ఎలా ఆహుతి చెయ్యగలం? అవి భౌతికమైనవి కావే... చేత్తో పట్టుకుని, మంటల్లో వెయ్యడానికి! నాయనా.. భౌతికమైన మంటల్లో భౌతికమైనవాటిని వేస్తాం. అభౌతికమైన వాటిని అభౌతికమైన మంటల్లో వెయ్యాలి. అభౌతికమైన మంటలా? ఎక్కడ ఉంటాయవి? మన ఇన్సైడ్. లోపల. మనమే రాజేసుకోవాలి. ఆత్మ సంస్కారంతో, ఆత్మ సంఘర్షణతో, ఆత్మ విమర్శతో, ఆత్మ సాక్షాత్కారంతో అగ్నిని రాజేసుకుని.. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను అందులో కాల్చి బూడిద చేసుకోవాలి. అప్పుడు క్లీన్ అయిపోతాం. న్యూ లుక్ వచ్చేస్తుంది. కొత్త సంక్రాంతి లుక్. పండక్కి అల్లుడొచ్చాక ఇంటికి వస్తుంది కదా ఆ లుక్. రైతులు పాడి పశువులకు స్నానం చేయించి, ఎండకు మిలమిల్లాడిస్తారు కదా ఆ లుక్. కానీ ఆ తల్లిని అనుమానించడం బాధగా ఉంది. ఏ తల్లి? జమదగ్ని భార్య రేణుకేనా? మళ్లీ అక్కడికెందుకు వెళ్లాల్సి వచ్చింది? రేణుక చేసిందని జమదగ్ని అనుమానించిన తప్పు కన్నా, రేణుకను అనుమానించడం జమదగ్ని చేసిన పెద్ద తప్పుగా అనిపిస్తోంది. ముందు అనుమానాన్ని మంటల్లో వెయ్యాలి. అనుమానం నుంచే ఈ చెడంతా. భర్త భార్యను అనుమానిస్తాడు. పెద్దలు పిల్లల్ని అనుమానిస్తారు. యజమాని సేవకుడిని అనుమానిస్తాడు. మంచిని చెడు అనుమానిస్తుంది. లేమిని కలిమి అనుమానిస్తుంది. ద్వేషం ప్రేమను అనుమానిస్తుంది. ఒక దేశం ఇంకో దేశాన్ని అనుమానిస్తుంది.ఎటు వెళ్తున్నాం. వెళ్లడం లేదు. వచ్చేశాం. ముంగిట్లోని భోగిమంటల దగ్గరికి. ఈ మంటల వెలుగుల్లో ముఖాలు ఎంత స్వచ్ఛంగా మారుతున్నాయి! వెలుగు స్నానం మురికిని తొలగిస్తోంది. మెల్లిగా వేకువ అవుతోంది. ఇక చాలు లేవండి, నేనొచ్చేస్తున్నాను కదా అంటున్నాడు ఆదిత్యుడు. అవునవునని తలూపుతూ వస్తున్నాయి.. ఆవూ లేగదూడ. అవునూ.. భోగి మంటలు ఎందుకు వేస్తారు? కడుపులో ఉన్న కోపం, అసూయ, ద్వేషం.. ఇలాంటివి తీసి పడేయడానికి అని చెప్పారు నిజమే. ఫిలసాఫికల్‌గా కాకుండా, పిలకాయలకు అర్థమయ్యేలా చెబుదురూ. పంటొచ్చే వేళ ఇంటికి పురుగూ వస్తుంది. సూర్యుడు మకరరాశిలోకి వెళ్లే వేళ చలి శిఖరానికి చేరుతుంది. పురుగును తరిమికొట్టడానికి, సంక్రాంతి నుంచి మొదలయ్యే ‘కొత్త వేడి’కి అలవాటు పడటానికే భోగి మంట. ‘అమ్మా.. అల్లుడుగారు లేచారా?’‘లేచారు నాన్నా.. స్నానం చేశాక భోగి మంట దగ్గరికి వస్తారట. ఈలోపు కర్పూరం తెమ్మని పంపించారు.’అవును. అదే సంప్రదాయం. స్నానం చెయ్యకుండా దేవుడి పటం ముందుకు వెళ్లం. స్నానం చేయకుండా భోగిమంటల దగ్గరికి వెళ్లకూడదు. భోగిమంటల్ని కర్పూరంతో వెలిగించాలి. కిరోసిన్‌తో, పెట్రోల్‌తో కాదు. మరి ఇంత తెలిసినవాడు భోగిమంటలు ఎందుకేస్తారని అమ్మాయిని ఎందుకు అడిగాడు! అమ్మాయికి తెలుసో లేదో తెలుసుకుందామనీ. -
సంక్రాంతి శోభ
రాష్ట్రంలో సంక్రాంతి సందడి ఆరంభమైంది. స్వగ్రామాలకు జనం తరలి వెళ్లడంతో మంగళవారం బస్సులు, రైళ్లు కిక్కిరిశాయి. బుధవారం భోగి పండుగను కాలుష్య, ప్రమాద రహితంగా జరుపుకుందామని పర్యావరణ శాఖ పిలుపునిచ్చింది. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లను పోలీసు యంత్రాంగం చేపట్టింది. అనేక ప్రాంతాల్లో అగ్నిమాపక వాహనాల్ని సిద్ధంగా ఉంచారు. సాక్షి, చెన్నై: భోగి మంటలు, రేగి పండ్లు, గొబ్బెలు, గంగిరెద్దులు, హరిదాసుల కృష్ణార్పణాల మేళవింపుతో సంక్రాంతి శోభ రానే వచ్చింది. బుధవారం భోగి, గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమ, శనివారం కానం పొంగళ్ పర్వదినాల్ని జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు. పండుగ సమయం ఆసన్నం కావడంతో షాపింగ్ సందడి ముగిసినట్టు అయింది. కొత్త బట్టలు కొనుగోలు చేసిన ప్రజలు, ఇక భోగి అనంతరం పొంగళ్లు పెట్టి పూజాది కార్యక్రమాల వస్తువుల మీద దృష్టి పెట్టనున్నారు. పూజా సామగ్రి వస్తువులు మార్కెట్లలో కొలువు దీరాయి. అరటి పండ్లు, ఆపిల్, ఆరెంజ్ తదితర పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. చెరకు ధరలు అమాంతంగా పెరిగాయి. పది చెరకుల కట్ట రూ.300 వరకు పలికింది. మదురై, దిండుగల్ చెరకులకు భలే డిమాండ్ ఏర్పడింది. అరటి గెలలకు సైతం రెక్కలు రాగా, పువ్వుల ధర ప్రియంగా మారింది. బోగి తప్పెట్లు: కష్టాలు వైదొలగి, తమ బాధలన్నీ మంటల్లో ఆహుతినిచ్చే రీతిలో బోగి మంటల్ని వేయడం జరుగుతోంది. ఇళ్లలోని పాత వస్తువుల్ని, చాప, చీపురు కట్టలు ఇలా పలు వస్తువులను ఈ బోగి మంటల్లో వేస్తారు. ఈ బోగి పండుగను చిన్న పిల్లలు భలే సరదాగా ఆనందిస్తుంటారు. తప్పెట్లు వాయిస్తూ కేకలు పెడుతూ ఆనందాన్ని ఆస్వాదించే ఈ పండుగ కోసం మార్కెట్లో తప్పెట్లు కొలువు దీరాయి. మెట్టు పాళయం, పెరంబూరు, చూళై, ఆరుదొడ్డిల్లోని గ్రామీణ కళాకారులు తీర్చిదిద్దిన ఈ తప్పెట్లు బుధవారం వేకువ జామున బోగి సందర్భంగా మర్మోగనున్నాయి. బోగీకి సర్వం సిద్ధం చేసుకున్న జనం తప్పెట్ల కొనగోళ్లలో బిజీ అయ్యారు. ఈ తప్పెట్ల ధరలు రూ. 25 నుంచి రూ.50 వరకు పలికాయి. స్వగ్రామాలకు జనం ఇంటిల్లిపాది ఆనందంతో జరుపుకునే పెద్ద పండుగకు సెలువులూ ఎక్కువే. దీంతో నగరంలో పనిచేస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్లు పండగ కోసం తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. దక్షిణాది జిల్లాలకు చెందిన వేలాదిమంది ఉద్యోగం, వ్యాపారం, చదువు తదితర పనుల నిమిత్తం చెన్నైలో ఉంటున్నారు. వీరంతా ఒక్కసారిగా తమ ప్రాంతాలకు తరలడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిశాయి. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్లలో దక్షిణాది జిల్లాల వైపుగా పది వరకు రైళ్లు పయనిస్తుండడంతో ఆ రైళ్ల బోగీలు ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడాయి. రిజర్వేషన్ లేని వాళ్ల కోసం ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేసి బోగీల్లోకి రైల్వే పోలీసులు అనుమతించారు. ఇక కోయంబేడు బస్టాండ్ జన సందోహంతో నిండింది. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడిపింది. ముందస్తు రిజర్వేషన్లు లేని వారికి టోకెన్లను అందజేశారు. ఆ టోకెన్ల ఆధారంగా బస్సుల్లో టికెట్లను తీసుకునే అవకాశం కల్పించారు. ఆమ్నీ బస్సుల వద్దకు సైతం జనం పరుగులు తీయక తప్పలేదు. ప్రభుత్వ బస్సులు కిటకిటలాడడంతో ఆమ్నీ యాజమాన్యాలు తమ పనితనాన్ని ప్రదర్శించే యత్నం చేశారని చెప్పవచ్చు. ప్రమాద రహితంగా... : పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం గట్టి భద్రతకు ఆదేశించింది. చెన్నై మహానగరంలో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో భద్రతను పెంచారు. బోగి రోజున టైర్లు, ప్లాస్టిక్ వస్తువులను కాల్చితే మాత్రం చర్యలు తప్పదని హెచ్చరించారు. పర్యావరణానికి ఆటంకం కల్గని రీతిలో, ప్రమాదాల రహితంగా బోగీని జరుపుకుందామని ప్రజలకు పోలీసులు, పర్యావరణ శాఖ పిలుపు నిచ్చింది. ప్రధానంగా గుడిసె ప్రాంతాలు, పెట్రోల్ బంకుల సమీపాల్లో అగ్నిమాపక వాహనాల్ని సిద్ధం చేసి ఉంచారు. -
భోగి భాగ్యాల సంక్రాంతి
పల్లెకు పండగొచ్చింది. ప్రతి ఇంటి లోగిళ్లు రంగు రంగుల రంగవల్లులతో కళకళలాడుతున్నాయి. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారంతా ఓ చోట చేరారు. చిన్నాపెద్దా తేడా లేకుండా భోగి మంటల సందడిలో భాగస్వాములై సంతోషం పంచుకుంటున్నారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరిలో ఆత్మీయ అనుబంధాలను సంక్రాంతి తట్టిలేపుతోంది. ఊరూవాడా కోలాహలం నింపింది. నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్: సంక్రాంతి సంబరాలతో ఊరూవాడా సందడిగా మారింది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా పండగకు ముస్తాబయ్యాయి. రంగవల్లులు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగిమంటలు, పిండి వంటలు, బంధుమిత్రుల సందడితో ఊళ్లన్నీ కళకళలాడుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే భోగి మంటలు అంబరాన్నంటాయి. తాటాకులు, కొయ్యలు, టైర్లు, ఇళ్లలో పనికిరాని వస్తువులతో భోగి మంటలు వేశారు. నగరం నుంచి పల్లె వరకు ప్రతి చోట యువకులు బృందాలుగా ఏర్పడి కూడళ్లలో మంటలు వేశారు. మంటలు వేయడంలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. భోగినాడు తిట్లు తిట్టించుకుంటే మంచిదనే నమ్మకంతో ఇతరులకు చెందిన కొయ్యలు, తడికలు, దుంగలను తెచ్చి మంటల్లో కాల్చేశారు. మరోవైపు కుటుంబసభ్యులు, బంధువులు స్నేహితులు కలిసి పిండివంటలు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. మంగళవారం వేకువజాము నుంచి పండగలో ప్రధాన ఘట్టం మొదలుకానుంది. ఇంటిల్లపాది నూతన వస్త్రాలతో సందడి చేయనున్నారు. కొత్త అల్లుళ్లకు మాంసాహార విందులు, బావలను మరదళ్లు ఆటపట్టించడం, కోడి పందేలు, ఎడ్ల పందేలు, వివిధ రకాల ఆటల పోటీలతో పండగ శోభ వెల్లివిరియనుంది. సాయంత్రం భోగి కల్యాణాలు( గోదాదేవి కల్యాణం) నేత్రపర్వంగా జరగనున్నాయి. సంక్రాంతికి సర్వం సిద్ధం సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధమైంది. మకర సంక్రాతిని పురస్కరించుకుని బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వ రకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం పితృదేవతలకు తర్పణం వదలడం, తమ నివాసాల్లో వారికి దుస్తులు పెట్టుకుని పూజిస్తారు. బ్రాహ్మణులను ఇళ్లకు ఆహ్వానించి మోయిన ఇస్తారు. ప్రధానంగా గుమ్మడికాయ దానానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పితృదేవతలకు పూజలు చేసేందుకు నెల్లూరు బోడిగాడితోటలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సమాధుల వద్ద నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. బుధవారం పెద్దసంఖ్యలో ప్రజలు ఇక్కడకు తరలిరానున్నారు. ప్రతి ఒక్కరూ తమ పెద్దలకు వస్త్రాలు, పిండి వంటలు సమర్పించి, వారిని స్మరించుకుని జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు తమ పితృదేవతల సమాధులను రంగులు వేస్తున్నారు. నేత్రపర్వంగా గోదాదేవి కల్యాణం నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్: రాపత్తు ఉత్సవాల్లో భాగంగా నగరంలోని మూలాపేటలో కొలువైన రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి దివ్యసన్నిధిలో గోదాదేవి కల్యాణం సోమవారం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ అర్చకుడు శ్రీనివాస అయ్యంగార్ ఆధ్వర్యంలో అర్చకులు తొలుత రుక్మిణీ, సత్యభామ సమేతంగా గోదాదేవి, వేణుగోపాలస్వామివారి ఉత్సవమూర్తులను కల్యాణవేదికపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబరాలు, వజ్రవైఢుర్యాలు, సుగంధపరిమళాలు వెదజల్లే పవిత్ర పుష్పాలతో దేవదేవేరులు భక్తులకు దర్శనమిచ్చారు. తదుపరి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం చేశారు. అనంతరం రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వస్త్ర బహుమానం, కన్యాదానాన్ని జరిపారు. అనంతరం భక్తజనుల హర్షధ్వానాలు, మేళతాళాల నడుమ నేత్రపర్వంగా గోపాలుడు, గోదాదేవికి మాంగల్యధారణ చేశారు. అనంతరం తలంబ్రాలు, మంగళహారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులు సామూహికంగా విష్ణుసహస్రనామ పారాయణం చేశారు. ఉభయకర్తలుగా గండవరపు నిరంజన్‌రెడ్డి కుటుంబసభ్యులు వ్యవహరించారు. ఆలయ మేనేజర్ కృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో వ్యవస్థాపక ధర్మకర్తలు, పురప్రముఖులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు కావలి, న్యూస్‌లైన్: పట్టణ వాసుల ఇలవేల్పు శ్రీకలుగోళ శాంభవీదేవి అమ్మవారి సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా కావలిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అమ్మవారి ఆలయం ఎదుట సోమవారం రాత్రి శివతాయి మండలి నిర్వాహకులు ఆధ్వర్యంలో ప్రదర్శించిన చింతామణి నాటకం ఆసక్తికరంగా సాగింది. అద్దంకి, పులివెందులకు చెందిన కళాకారులు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. సుబ్బిశెట్టి పాత్రను అద్దంకికి చెందిన శ్రీను, చింతామణి పాత్రను పులివెందులకు చెందిన వసంతలక్ష్మి పోషించారు. పెద్దపవని బస్టాండ్ సెంటర్లో స్నేహ యూత్ ఆధ్వర్యంలో నృత్యప్రదర్శన జరిగింది. సాయిమహల్ సెంటర్లో వడ్డిపాలెం యూత్ ఆధ్వర్యంలో సినీపాట కచేరి నిర్వహించారు. పోటాపోటీగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కావలిలో కోలాహల వాతావరణం నెలకొంది. కళుగోళ శాంభవీ ఆలయం, పట్టణంలోని పలు రోడ్లలో చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నేడు గ్రామోత్సవం అమ్మవారి గ్రామోత్సవం మంగళవారం ప్రారంభం కానుంది. బుధవారం వరకు జరిగే ఈ ఉత్సవం సర్వాయపాళెం చేరుకుంటుంది. కోలాహలం హిందువులు సంక్రాంతిని పెద్ద పండగగా భావిస్తారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ శక్తి మేర పండగను ఘనంగా చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ దుస్తుల కొనుగోలు, పిండి వంటల తయారీకి ప్రాధాన్యం ఇస్తారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రధాన పట్టణాలన్ని సోమవారం జనంతో కిటకిటలాడాయి. నెల్లూరుతో పాటు సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, వింజమూరు తదితర పట్టణాల్లోని దుకాణాలు జనంతో కిక్కిరిశాయి. నెల్లూరులోని షాపింగ్‌మాళ్లు, ప్రముఖ వస్త్ర దుకాణాలు, రెడిమేడ్ దుస్తుల షోరూమ్‌లు, మద్రాస్ బస్టాండ్, స్టోన్‌హౌస్‌పేట, చిన్నబజార్, పెద్దబజార్‌లోని చిల్లర సామాన్ల దుకాణాలు, కూరగాయలు, పూలు, సండే మార్కెట్లలో పూర్తి రద్దీగా మారాయి. కోళ్లు, పొట్టేళ్ల విక్రయాలు కూడా జోరుగా సాగాయి.