అగ్నిదేవుడికి నమస్కారం | sankranthi festival bhogi mantalu | Sakshi
Sakshi News home page

అగ్నిదేవుడికి నమస్కారం

Published Sun, Jan 13 2019 11:56 PM | Last Updated on Mon, Jan 14 2019 11:45 AM

sankranthi festival bhogi mantalu - Sakshi

నాయనా.. భౌతికమైన మంటల్లో భౌతికమైనవాటిని వేస్తాం. అభౌతికమైన వాటిని అభౌతికమైన మంటల్లో వెయ్యాలి. ‘అభౌతికమైన మంటలా? ఎక్కడ ఉంటాయవి?’ మన ఇన్‌సైడ్‌. లోపల. మనమే రాజేసుకోవాలి. ఆత్మ సంస్కారంతో, ఆత్మ సంఘర్షణతో, ఆత్మ విమర్శతో, ఆత్మ సాక్షాత్కారంతో అగ్నిని రాజేసుకుని... ఇదిగో ఈ ప్రవచనకారులు ఇలాగే చెప్తారు కానీ.. భోగిమంట వేశారా? అయితే అగ్నిదేవుడికి ఒక నమస్కారం చేసెయ్యండి. ఎందుకంటారా? 

నేడొక్కరోజే సూర్య ఇక్కడుండేది. ‘ఏంటి!, అల్లుడుగారు అప్పుడే డ్యూటీకి హైదరాబాద్‌ వెళ్లిపోతాడా! సంక్రాంతికి అరిసెల పని పట్టకుండా, కనుమకు నాన్వెజ్‌ను చీల్చి చెండాడకుండా!’. అల్లుడు సూర్య సంగతి కాదు. లోకానికి కాంతినిచ్చేవాడు, తొమ్మిదివేల యోజనాల పొడవైన రథం గలవాడు, రథానికి సప్తాశ్వాలు ఉన్నవాడు, విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను వివాహమాడినవాడు, హనుమంతుడికి యాజ్ఞవల్క్యుడికి వేదశాస్త్రాలు నేర్పినవాడు.. ఆ సూర్యుడు. అతడు వెళ్లిపోతున్నాడు నేడు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ఏగుతున్నాడు. ఏం గొప్ప? భూమధ్య రేఖ మీద ఇటు సౌత్‌లో అడుగు తీసి అటు నార్త్‌లో అడుగు వెయ్యడమేగా.

టోల్‌గేట్‌లు ఉంటాయా, ట్రాఫిక్‌జామ్‌లు ఉంటాయా? గగన విహారమే కదా లార్డ్‌ సూర్య చేసేది. అల్లుడుగారొచ్చిన రూట్‌లో జర్నీ చేస్తే తెలుస్తుంది.. అల్లుడు గొప్పో, సూర్యుడు గొప్పో.‘ఓ గొప్ప అల్లుడుగారు.. లేవండి, లేవండి, అమ్మాయి భోగి మంటలు రాజేస్తోంది. మీరూ ఒక ఎండు పుల్ల వేసి భగ్గుమనిపిద్దురు రండి. మంచుకు చలి కాపుదాం రండి, చేతులు రుద్దుకుని వేకువ చెవులకు అద్దుదాం రండి. ఎంత మంచి సంప్రదాయమోనండీ..’ఇంకెక్కడి అల్లుడుగారు. చలిలో ఇంద్రా బస్సు దిగి, నేరుగా పడమటి దిక్కున పడగ్గదిలో వాలిపోయాడు. లేపండి లేపండి. అగ్ని లేకుండా భోగి లేదు. అల్లుడు లేవకుండా చిటపటల్లేవు.   ‘భోగి మంటలు ఎందుకేస్తారు?’ ఎవర్రా అడిగింది? అల్లుడు గారు కాదు. ఎవరో పిలగాడు. అల్లుడుగారు మాత్రం పిలగాడు కాదా. పిలగాడేంటి? పెద్ద సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరైతేనూ.

ఇంజనీరే, సాఫ్టువేరే. అయినా పిలగాడే. ఎందుకయ్యాడు పిలగాడు? భోగిమంటలు ఎందుకేస్తారని అడిగింది అల్లుడుగారేనట. ఎవర్నడిగారట? అమ్మాయినడిగాడట. అమ్మాయి ఏం చెప్పిందట. అడిగి చెప్తానందట. ఎవర్నడిగి చెప్తానందట? భోగిమంటను అడిగి, అగ్నిదేవుళ్లను అడిగి. అగ్నిదేవుళ్లా. ఒక్కడే కదా అగ్నిదేవుడు. అతడే కదా అష్టదిక్పాలకులలో ఒకడు. ‘మరి అగ్నికేతుడు, అగ్నితీర్థుడు, అగ్నిదత్తుడు, అగ్నిదేశ్యుడు, అగ్నిద్యోతనుడు, అగ్నిపూర్ణుడు, అగ్నిముఖుడు, అగ్నివేశుడు, అగ్నివర్ణుడు, అగ్నిసంభవుడు, అగ్నిసోముడు,  అగ్నిహోత్రుడు .. వీళ్లంతా ఎవరు? సూర్యుడికి సినానిమ్స్‌ కాదా!’ కాదు. పేరులో ఫైర్‌ ఉంటే, తీరులో ఫైర్‌ ఉన్నట్లేనా? అగ్నిదేవుడు ఒక్కడే. ఫైర్‌ ఉన్నది ఆ ఒక్కడిలోనే. మరి జమదగ్ని ఎవరు? గాడ్‌.. అతడు సన్నాఫ్‌ సత్యవతి, రుచీక. విశ్వామిత్రుడికి మేనల్లుడు. జమదగ్ని భార్య రేణుక.

చిత్రరథుడు అనే వ్యక్తి మీద ఆమె మనసు పడిందని అనుమానించి, ‘ఏరా బళ్లా. మీ అమ్మణి చంపాళని నీకెప్పుడైనా అనిపించిందా’ అని నాజర్, రానాని ‘బాహుబలి 2’లో అడిగినట్లు తన కొడుకుల్ని అడిగాడు జమదగ్ని. ‘అనిపించలేదు’ అన్నారు కొడుకులంతా.  ‘అనిపించింది’ అన్నాడు ఇంకో కొడుకు పరశురాముడు. ‘అయితే వధించు’ అన్నాడు జమదగ్ని. తల్లిని వధించాడు పరశురాముడు. తర్వాత బోరుమన్నాడు. ‘ఏడ్వకు. వరం కోరుకో’ అన్నాడు జమదగ్ని పరశురాముడితో. ‘నా తల్లిని బతికించు నాన్నా. అదే నాకు వరం’ అన్నాడు పరశురాముడు. రేణుక బతికింది. ‘అవునా! దెన్, హూ ఈజ్‌ జటాగ్ని?’ జటాగ్ని ఎవరూ లేరు. జటాయువు ఉన్నాడు. జటాలిక ఉంది. జటాసరుడు ఉన్నాడు. వీళ్లెవరిలోనూ ఫైర్‌ లేదు. జఠరాగ్నిలో ఫైర్‌ ఉంది కానీ, అది కడుపులోని అగ్ని. డైజెస్టివ్‌ ఫైర్‌. కడుపులో ఏదైనా పడితేనే అది చల్లారుతుంది.

ఏది అందుబాటులో ఉంటే అది వేసేయాలి. పిజ్జా ఉంటే పిజ్జా. బర్గరుంటే బర్గర్‌. వేరేదీ దొరక్కపోతే మ్యారీగోల్డ్‌.  ‘అయితే ఈ స్వామీజీలంతా ఏంటి మరీ.. కడుపులో ఇంత పడేయండి అనకుండా, కడుపులో ఉన్న దాన్ని తీసి బయట పడేయండి అంటారు!’ఎవరు? జగ్జీ వాసుదేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌ వీళ్లేనా? వీళ్లు స్వామీజీలు కాదు. జ్ఞానాగ్ని పుత్రులు. అహాన్ని దగ్ధం చేసుకుని..  మహోన్నతిని, మహోజ్వలతను, సాక్షాత్కారం చేయిస్తున్నవారు. అవును వీళ్లే. భోగి వచ్చిన ప్రతిసారీ ఇదే ప్రవచనం, ఇదే ప్రబోధన. ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేస్తాం కదా, అలాగే ఒంట్లోని పనికిమాలిన ఫీలింగ్స్‌ అన్నిటినీ మంటల్లో వేయమంటారు? ఎలా సాధ్యం? ఎండు పుల్లల్ని, పాత చీపుళ్లను, పిడకల్ని, చెక్క ముక్కల్ని వేసినట్లు మనసు లోపలి భావాలను అగ్నికి ఎలా ఆహుతి చెయ్యగలం? అవి భౌతికమైనవి కావే... చేత్తో పట్టుకుని, మంటల్లో వెయ్యడానికి! నాయనా.. భౌతికమైన మంటల్లో భౌతికమైనవాటిని వేస్తాం.

అభౌతికమైన వాటిని అభౌతికమైన మంటల్లో వెయ్యాలి. అభౌతికమైన మంటలా? ఎక్కడ ఉంటాయవి? మన ఇన్‌సైడ్‌. లోపల. మనమే రాజేసుకోవాలి. ఆత్మ సంస్కారంతో, ఆత్మ సంఘర్షణతో, ఆత్మ విమర్శతో, ఆత్మ సాక్షాత్కారంతో అగ్నిని రాజేసుకుని.. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను అందులో  కాల్చి బూడిద చేసుకోవాలి. అప్పుడు క్లీన్‌ అయిపోతాం. న్యూ లుక్‌ వచ్చేస్తుంది. కొత్త సంక్రాంతి లుక్‌. పండక్కి అల్లుడొచ్చాక ఇంటికి వస్తుంది కదా ఆ లుక్‌. రైతులు పాడి పశువులకు స్నానం చేయించి, ఎండకు మిలమిల్లాడిస్తారు కదా ఆ లుక్‌. కానీ ఆ తల్లిని అనుమానించడం బాధగా ఉంది. ఏ తల్లి? జమదగ్ని భార్య రేణుకేనా? మళ్లీ అక్కడికెందుకు వెళ్లాల్సి వచ్చింది? రేణుక చేసిందని జమదగ్ని అనుమానించిన తప్పు కన్నా, రేణుకను అనుమానించడం జమదగ్ని చేసిన పెద్ద తప్పుగా అనిపిస్తోంది.

ముందు అనుమానాన్ని మంటల్లో వెయ్యాలి. అనుమానం నుంచే ఈ చెడంతా. భర్త భార్యను అనుమానిస్తాడు. పెద్దలు పిల్లల్ని అనుమానిస్తారు. యజమాని సేవకుడిని అనుమానిస్తాడు. మంచిని చెడు అనుమానిస్తుంది. లేమిని కలిమి అనుమానిస్తుంది. ద్వేషం ప్రేమను అనుమానిస్తుంది. ఒక దేశం ఇంకో దేశాన్ని అనుమానిస్తుంది.ఎటు వెళ్తున్నాం. వెళ్లడం లేదు. వచ్చేశాం. ముంగిట్లోని భోగిమంటల దగ్గరికి. ఈ మంటల వెలుగుల్లో ముఖాలు ఎంత స్వచ్ఛంగా మారుతున్నాయి! వెలుగు స్నానం మురికిని తొలగిస్తోంది. మెల్లిగా వేకువ అవుతోంది. ఇక చాలు లేవండి, నేనొచ్చేస్తున్నాను కదా అంటున్నాడు ఆదిత్యుడు. అవునవునని తలూపుతూ వస్తున్నాయి.. ఆవూ లేగదూడ. అవునూ.. భోగి మంటలు ఎందుకు వేస్తారు? కడుపులో ఉన్న కోపం, అసూయ, ద్వేషం.. ఇలాంటివి తీసి పడేయడానికి అని చెప్పారు నిజమే. ఫిలసాఫికల్‌గా కాకుండా, పిలకాయలకు అర్థమయ్యేలా చెబుదురూ. 

పంటొచ్చే వేళ ఇంటికి పురుగూ వస్తుంది. సూర్యుడు మకరరాశిలోకి వెళ్లే వేళ చలి శిఖరానికి చేరుతుంది. పురుగును తరిమికొట్టడానికి, సంక్రాంతి నుంచి మొదలయ్యే ‘కొత్త వేడి’కి అలవాటు పడటానికే భోగి మంట. ‘అమ్మా.. అల్లుడుగారు లేచారా?’‘లేచారు నాన్నా.. స్నానం చేశాక భోగి మంట దగ్గరికి వస్తారట. ఈలోపు కర్పూరం తెమ్మని పంపించారు.’అవును. అదే సంప్రదాయం. స్నానం చెయ్యకుండా దేవుడి పటం ముందుకు వెళ్లం. స్నానం చేయకుండా భోగిమంటల దగ్గరికి వెళ్లకూడదు. భోగిమంటల్ని కర్పూరంతో వెలిగించాలి. కిరోసిన్‌తో, పెట్రోల్‌తో కాదు. మరి ఇంత తెలిసినవాడు భోగిమంటలు ఎందుకేస్తారని అమ్మాయిని ఎందుకు అడిగాడు! 
అమ్మాయికి తెలుసో లేదో తెలుసుకుందామనీ. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement