Sun God
-
మకర సంక్రాంతి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి!
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అతి ముఖ్యమైన పండుగు, భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజులను విశేషంగా భావిస్తున్నారు. ఈ ఏడాది 2024 జనవరి 15 మకర సంక్రాంతి జరుపుకుంటున్నారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కాలాన్ని సూర్య చంద్ర, నక్షత్రాల ఆధారంగా లెక్కిస్తారు.అలా సూర్య భగవానుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించిన పుణ్యసమయమే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి నాడు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రోజు చేసే దానం అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. సకల శుభాలు కలగాలంటే ఖచ్చితంగా ఈ బియ్యం, కిచిడీ, బెల్లం, నల్ల నువ్వులు, దుప్పట్లు దానం చేయాలని కూడా చెబుతారు. పితృదేవతలకు తర్పణం సంక్రాంతి రోజు సూర్యునికి అర్ఘ్యం, నైవేద్యం సమర్పించడం ద్వారా కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చని పండితులు చెబుతారు. అలాగే సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రాలు దానం చేస్తే విశేష ఫలము లభిస్తుందలకేవలం మకర సంక్రాంతి రోజు పితృ దేవతలకు నువ్వులతో తర్పణాలు వదలుతారు కూడా. నూతన వస్త్రములను దానం చేయాలి. సత్యనారాయణ వ్రతం మకర సంక్రాంతి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా విశేషం. సంక్రాంతి రోజున నవధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వస్త్రములు వంటివి దానము చేసినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలము లభిస్తుందని పండితులు మాట. ప్రత్యేకంగా నువ్వులు దానం,పూజ సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి శని దేవుడు నల్ల నువ్వులతో స్వాగతం పలుకుతాడని, దీనికి మెచ్చిన సూర్యుడు ఈ రోజు తనను నువ్వు పూజించిన వారికి సకల సంతోషాలు కలుగుతాయని దీవించాడని పురాణాలు చెబుతున్నాయి. దీంతో మరక సంక్రాంతి రోజు సూర్యుడికి పూజలు చేయడంతోపాటు, నల్లనువ్వులు కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించాలి. అలాగే శనికి ప్రీతికరమైన నల్లనువ్వులను ధారపోసినా, నదానమిచ్చినా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని, ఏలిన నాటి శని దోషాలు తొలగి జీవితంలో వెలుగులు ప్రసరిస్తాయట. ఈ రోజు నెయ్యి దానం చేయడం వల్ల అన్ని రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే జాతకంలో సూర్యుడు-గురు గ్రహ స్థానం బలపడుతుంది. సంక్రాంతి నాడు బెల్లం దానం చేస్తారు. అటుకులు బెల్లం కలిపి దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంకా ఈ రోజు మినపపప్పు, బియ్యంతో చేసిన ఖిచ్డీని దానం చేస్తారు. ఫలితంగ మనుషుల జాతకంలో సూర్యుడు, చంద్రుడు , బృహస్పతి స్థానం బలంగా ఉంటుందని చెబుతారు. -
Bhogi Festival: భోగం వైభోగం.. భోగి పళ్లు ఎందుకు?
Bhogi 2022: మన మహర్షులు కాలంలో జరిగే మార్పులను గమనించి, ఖగోళంలో జరిగే మార్పులను తెలుసుకుని, ఆయా సమయాల్లో మనం ఏ విధంగా ప్రవర్తించాలో, దైవాన్ని ఎలా ఆరాధించాలో, ఏమేమి చెయ్యాలో తెలియజేస్తూ మనకు అనేక పండుగలను, పర్వదినాలను ఏర్పరిచారు. ఈ సంక్రాంతి పండుగ గోవులకు, ప్రకృతికి, పరమాత్మకు, పల్లెలకు, పొలాలకు, పంటలకు, మానవులకు సంబంధించిన పండుగ. మన సంస్కృతికి సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు, కృతజ్ఞతా ప్రకటనకు సంబంధించిన పండుగ. మనది – వ్యవసాయ ప్రధానమైన దేశం. పంటలు చేతికొచ్చి, ఫలసాయం అందినందువల్ల దానిని పది మందికీ పంచుతూ అలా పంచటంలోని ఆనందాన్ని అనుభవించటం భారతీయులందరికీ ఆచారం. ప్రకృతిలో జరిగే గొప్ప మార్పు సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించటం. దీనినే మకర సంక్రమణం, ’మకర సంక్రాంతి’ పండుగ అంటాము. ఈ మకర సంక్రమణం ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను సమర్పిస్తూ కృతజ్ఞతలు ప్రకటించ వలసిన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన రోజు. దైవారాధన – సూర్యారాధన చెయ్యవలసిన రోజు. దీనికి ముందురోజు భోగి పండగ జరుపుకుంటాం. భోగి అంటే భోగం, సౌఖ్యం. భోగాన్ని అనుభవించేవాడు భోగి. అతను మహా యోగి, ఇతను మహా భోగి అంటుండటం వాడుకలో గమనిస్తాము. భోగాలను అనుభవించమని ప్రబోధించే పండుగ భోగి పండుగ. ఈ పండుగలో ఏ రోజు విశిష్టత ఆ రోజుదే అయినా, భోగి పండుగ నాడు మనమందరమూ ఆచరించే విశేషమైన అంశాలెన్నో ఉన్నాయి. భోగి పండుగ మానవులందరినీ భోగము ననుభవించమని, ఆనందంగా ఉండమనీ చెప్తోంది. పరమాత్మ పంచభూతాత్మకమైన, భోగ స్వరూపమైన ప్రకృతిని సృష్టించి, ఆ సృష్టిలోని భోగాలను ఎలా అనుభవించాలో ఆ జ్ఞానాన్ని విధి నిషేధ రూపమైన వేద విజ్ఞానరూపంగా అనుగ్రహించాడు. మనం ఆ నియమాలను పాటిస్తూ భోగాలననుభవించాలి. భోగి పండుగనాడు సూర్యోదయానికంటే ముందే ఇంటిల్లిపాదీ నిద్ర లేచి, ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని, అందరూ కలిసి ఆరుబైటకు చేరి, భక్తితో భోగిమంటలు వెయ్యటం అన్నది మనకి అనాదిగా వస్తున్న సంప్రదాయం. భోగిమంటల కోసం దైవ నామ స్మరణ చేస్తూ, ఆవుపేడ పిడకలను, సమిధలను పెట్టి, కర్పూరంతో అగ్నిని రగిలిస్తారు. అగ్నిదేవుని ప్రార్ధిస్తారు. ఆ మంటలు కాస్త పెరిగాక, ఇంట్లో ఉన్న పాత సామాన్లను, అక్కర్లేని చెక్కముక్కలను అన్నింటినీ ఆ మంటల్లో వేస్తారు. అంటే అక్కర్లేని చెత్తను వదిలించుకుని కొత్తదనాన్ని కోరటం కనిపిస్తుంది. భోగిమంటల వల్ల మనకు కలిగే మరొక లాభమేమిటంటే, ఈ భోగి మంటలలో ఆవుపేడ పిడకలను, సమిథలను వెయ్యటం వలన అవి కాలుతున్నప్పుడు వచ్చే ధూమం వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. పిల్లలందరూ ఈ భోగి మంటలను ఉత్సాహంగా చేస్తారు, ఎంతో ఆనందిస్తారు. భోగి మంటలలోని అంతరార్ధం ఏమిటంటే, బాధ కలిగించే అక్కర్లేని ఆలోచనలను, రాగద్వేషాది దుర్గుణాలను, కోపతాపాలను అగ్నిలో దగ్ధం చెయ్యాలి అంటే రాగద్వేషాలను వదిలెయ్యాలి అని గ్రహించటం. అందరితో సౌమనస్యంతో ఉండాలని నిర్ణయించుకోవటం. భోగి పండుగ నాడు శ్రీ సూర్యనారాయణ స్వామిని, కుల దైవాన్ని, ఇష్టదైవాన్ని, శ్రీ కృష్ణ పరమాత్మను, త్రిలోకాధిపతియై, సకల భోగాలను అనుభవిస్తున్న దేవేంద్రుని ఆరాధించి, కొత్త బియ్యంతో వండిన పొంగలి, పరమాన్నాలను దేవతలకు నివేదించి, ఆ ప్రసాదాన్ని మనం తినాలి. భోగి పళ్లు ఎందుకు? రేగు పళ్ళనే భోగిపళ్ళు అంటాము. భోగిపళ్ళు పొయ్యటానికి రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, పచ్చదనాన్ని కోరుతూ పచ్చి శనగలను అంటే హరిబూట్ గింజలను, గురు గ్రహ అనుగ్రహం కోసం నానబెట్టిన శనగలను, దిష్టిని పోగొట్టే కొన్ని ద్రవ్యాలను, వక్కల లాంటి నల్లని గింజలను కలిపి, శుభాన్ని కలిగించే చామంతి, గులాబీ, బంతిపూల వంటి పూరేకలను, అక్షతలను, రాగి నాణాలను లేక చిల్లర నాణాలను అన్నింటినీ కలిపి రెండు చేతులతో తీసుకుని, పిల్లలను తూర్పుముఖంగా కూర్చోబెట్టి వారికి పైనుంచి కిందికి దిగతుడిచి, తరువాత గుండ్రంగా సవ్యంగా, అపసవ్యంగా పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ ‘ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, మంచివాళ్ళ దిష్టి, చెడ్డవాళ్ళ దిష్టి, ఎంత అందంగా ఉన్నారనే వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి‘ అంటూ వారి తల మీద పొయ్యాలి. అలా దిగ తుడవటం వల్ల పిల్లలకు ఏదైనా దిష్టి తగిలితే, అది తొలగిపోతుంది. కాలమంతా దైవ స్వరూపమే అయినా, ఏ మంచి సమయంలో ఎటువంటి మంచి పనులను చేస్తే, అఖండమైన మంచి జరుగుతుందో మన మహర్షులు చెప్పారు. దానిని ఆచరిస్తూ మనమందరమూ సమస్త సన్మంగళములను పొందుదుము గాక !! ఆ మంటల అంతరార్థం మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమనీ ప్రార్ధిస్తూ అగ్నిహోత్రుని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలేమైనా ఉంటే వాటిని, మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో – అజ్ఞానాన్ని వేసి దగ్ధం చేసుకోవటం, భోగాన్ని, మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం. కాస్త జ్ఞానం కలవారు, ఈ రోజుతో చలి వెళ్ళి పోతోంది. సూర్యభగవానునిలోని తేజస్సు పెరగబోతోంది, వృద్ధి అవుతుంది అనే భావనతో భోగి మంటలు వేస్తారు. గోదాదేవిని ఆండాళ్ తల్లి అంటారు. ఈమె శ్రీ రంగనాథ స్వామిని భర్తగా పొంద గోరింది. ఇందుకోసం ఆ కాలంలో కాత్యాయనీ వ్రతాన్నాచరించిన గోపికలను ఆదర్శంగా తీసుకుంది. తాను ధనుర్మాసం నెలరోజులు మార్గళీ వ్రతాన్నాచరించి, తిరుప్పావై పాశురాలతో స్వామిని కీర్తించి, పరమాత్మ అనుగ్రహం పొందింది. మహా పర్వదినమైన భోగినాడు శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకుని, పరమమైన భోగాన్ని పొందింది. మనం భోగి పండుగనాడు శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణం జరిపించి, దర్శించి ఆనందిస్తాము. భోగి పండుగ నాటి విశేషం పిల్లలకు భోగి పళ్ళు పొయ్యటం. భోగి పండుగ నాడు ముత్తైదువులను ఇంటికి పిలిచి, ఇంటి పెద్దలందరూ కలిసి ఇంట్లో ఉన్న ఐదారు సంవత్సరాల లోపు పిల్లలకు దృష్టి దోషం తగలకుండా దిష్టి తీస్తూ, భోగిపళ్ళు పోసి, సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తారు. మంగళ హారతినిస్తారు. ఇది మన సంప్రదాయం. కనుక భోగిపళ్ళు పొయ్యటం వెనక అంతరార్థం దృష్టి దోషం పరిహరించటం, చెడు సోకకూడదని కోరుకోవటం, శుభం కలగాలని ఆశీర్వదించటం. ఇదే వేదంలో చెప్పిన ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. దీనిని పసితనం నుంచే పిల్లలకు నేర్పిస్తున్నామన్నమాట. – సోమంచి రాధాకృష్ణ -
అగ్నిదేవుడికి నమస్కారం
నాయనా.. భౌతికమైన మంటల్లో భౌతికమైనవాటిని వేస్తాం. అభౌతికమైన వాటిని అభౌతికమైన మంటల్లో వెయ్యాలి. ‘అభౌతికమైన మంటలా? ఎక్కడ ఉంటాయవి?’ మన ఇన్సైడ్. లోపల. మనమే రాజేసుకోవాలి. ఆత్మ సంస్కారంతో, ఆత్మ సంఘర్షణతో, ఆత్మ విమర్శతో, ఆత్మ సాక్షాత్కారంతో అగ్నిని రాజేసుకుని... ఇదిగో ఈ ప్రవచనకారులు ఇలాగే చెప్తారు కానీ.. భోగిమంట వేశారా? అయితే అగ్నిదేవుడికి ఒక నమస్కారం చేసెయ్యండి. ఎందుకంటారా? నేడొక్కరోజే సూర్య ఇక్కడుండేది. ‘ఏంటి!, అల్లుడుగారు అప్పుడే డ్యూటీకి హైదరాబాద్ వెళ్లిపోతాడా! సంక్రాంతికి అరిసెల పని పట్టకుండా, కనుమకు నాన్‌వెజ్‌ను చీల్చి చెండాడకుండా!’. అల్లుడు సూర్య సంగతి కాదు. లోకానికి కాంతినిచ్చేవాడు, తొమ్మిదివేల యోజనాల పొడవైన రథం గలవాడు, రథానికి సప్తాశ్వాలు ఉన్నవాడు, విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను వివాహమాడినవాడు, హనుమంతుడికి యాజ్ఞవల్క్యుడికి వేదశాస్త్రాలు నేర్పినవాడు.. ఆ సూర్యుడు. అతడు వెళ్లిపోతున్నాడు నేడు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ఏగుతున్నాడు. ఏం గొప్ప? భూమధ్య రేఖ మీద ఇటు సౌత్‌లో అడుగు తీసి అటు నార్త్‌లో అడుగు వెయ్యడమేగా. టోల్గేట్లు ఉంటాయా, ట్రాఫిక్‌జామ్‌లు ఉంటాయా? గగన విహారమే కదా లార్డ్ సూర్య చేసేది. అల్లుడుగారొచ్చిన రూట్లో జర్నీ చేస్తే తెలుస్తుంది.. అల్లుడు గొప్పో, సూర్యుడు గొప్పో.‘ఓ గొప్ప అల్లుడుగారు.. లేవండి, లేవండి, అమ్మాయి భోగి మంటలు రాజేస్తోంది. మీరూ ఒక ఎండు పుల్ల వేసి భగ్గుమనిపిద్దురు రండి. మంచుకు చలి కాపుదాం రండి, చేతులు రుద్దుకుని వేకువ చెవులకు అద్దుదాం రండి. ఎంత మంచి సంప్రదాయమోనండీ..’ఇంకెక్కడి అల్లుడుగారు. చలిలో ఇంద్రా బస్సు దిగి, నేరుగా పడమటి దిక్కున పడగ్గదిలో వాలిపోయాడు. లేపండి లేపండి. అగ్ని లేకుండా భోగి లేదు. అల్లుడు లేవకుండా చిటపటల్లేవు. ‘భోగి మంటలు ఎందుకేస్తారు?’ ఎవర్రా అడిగింది? అల్లుడు గారు కాదు. ఎవరో పిలగాడు. అల్లుడుగారు మాత్రం పిలగాడు కాదా. పిలగాడేంటి? పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరైతేనూ. ఇంజనీరే, సాఫ్టువేరే. అయినా పిలగాడే. ఎందుకయ్యాడు పిలగాడు? భోగిమంటలు ఎందుకేస్తారని అడిగింది అల్లుడుగారేనట. ఎవర్నడిగారట? అమ్మాయినడిగాడట. అమ్మాయి ఏం చెప్పిందట. అడిగి చెప్తానందట. ఎవర్నడిగి చెప్తానందట? భోగిమంటను అడిగి, అగ్నిదేవుళ్లను అడిగి. అగ్నిదేవుళ్లా. ఒక్కడే కదా అగ్నిదేవుడు. అతడే కదా అష్టదిక్పాలకులలో ఒకడు. ‘మరి అగ్నికేతుడు, అగ్నితీర్థుడు, అగ్నిదత్తుడు, అగ్నిదేశ్యుడు, అగ్నిద్యోతనుడు, అగ్నిపూర్ణుడు, అగ్నిముఖుడు, అగ్నివేశుడు, అగ్నివర్ణుడు, అగ్నిసంభవుడు, అగ్నిసోముడు, అగ్నిహోత్రుడు .. వీళ్లంతా ఎవరు? సూర్యుడికి సినానిమ్స్ కాదా!’ కాదు. పేరులో ఫైర్ ఉంటే, తీరులో ఫైర్ ఉన్నట్లేనా? అగ్నిదేవుడు ఒక్కడే. ఫైర్ ఉన్నది ఆ ఒక్కడిలోనే. మరి జమదగ్ని ఎవరు? గాడ్.. అతడు సన్నాఫ్ సత్యవతి, రుచీక. విశ్వామిత్రుడికి మేనల్లుడు. జమదగ్ని భార్య రేణుక. చిత్రరథుడు అనే వ్యక్తి మీద ఆమె మనసు పడిందని అనుమానించి, ‘ఏరా బళ్లా. మీ అమ్మణి చంపాళని నీకెప్పుడైనా అనిపించిందా’ అని నాజర్, రానాని ‘బాహుబలి 2’లో అడిగినట్లు తన కొడుకుల్ని అడిగాడు జమదగ్ని. ‘అనిపించలేదు’ అన్నారు కొడుకులంతా. ‘అనిపించింది’ అన్నాడు ఇంకో కొడుకు పరశురాముడు. ‘అయితే వధించు’ అన్నాడు జమదగ్ని. తల్లిని వధించాడు పరశురాముడు. తర్వాత బోరుమన్నాడు. ‘ఏడ్వకు. వరం కోరుకో’ అన్నాడు జమదగ్ని పరశురాముడితో. ‘నా తల్లిని బతికించు నాన్నా. అదే నాకు వరం’ అన్నాడు పరశురాముడు. రేణుక బతికింది. ‘అవునా! దెన్, హూ ఈజ్ జటాగ్ని?’ జటాగ్ని ఎవరూ లేరు. జటాయువు ఉన్నాడు. జటాలిక ఉంది. జటాసరుడు ఉన్నాడు. వీళ్లెవరిలోనూ ఫైర్ లేదు. జఠరాగ్నిలో ఫైర్ ఉంది కానీ, అది కడుపులోని అగ్ని. డైజెస్టివ్ ఫైర్. కడుపులో ఏదైనా పడితేనే అది చల్లారుతుంది. ఏది అందుబాటులో ఉంటే అది వేసేయాలి. పిజ్జా ఉంటే పిజ్జా. బర్గరుంటే బర్గర్. వేరేదీ దొరక్కపోతే మ్యారీగోల్డ్. ‘అయితే ఈ స్వామీజీలంతా ఏంటి మరీ.. కడుపులో ఇంత పడేయండి అనకుండా, కడుపులో ఉన్న దాన్ని తీసి బయట పడేయండి అంటారు!’ఎవరు? జగ్జీ వాసుదేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్ వీళ్లేనా? వీళ్లు స్వామీజీలు కాదు. జ్ఞానాగ్ని పుత్రులు. అహాన్ని దగ్ధం చేసుకుని.. మహోన్నతిని, మహోజ్వలతను, సాక్షాత్కారం చేయిస్తున్నవారు. అవును వీళ్లే. భోగి వచ్చిన ప్రతిసారీ ఇదే ప్రవచనం, ఇదే ప్రబోధన. ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేస్తాం కదా, అలాగే ఒంట్లోని పనికిమాలిన ఫీలింగ్స్ అన్నిటినీ మంటల్లో వేయమంటారు? ఎలా సాధ్యం? ఎండు పుల్లల్ని, పాత చీపుళ్లను, పిడకల్ని, చెక్క ముక్కల్ని వేసినట్లు మనసు లోపలి భావాలను అగ్నికి ఎలా ఆహుతి చెయ్యగలం? అవి భౌతికమైనవి కావే... చేత్తో పట్టుకుని, మంటల్లో వెయ్యడానికి! నాయనా.. భౌతికమైన మంటల్లో భౌతికమైనవాటిని వేస్తాం. అభౌతికమైన వాటిని అభౌతికమైన మంటల్లో వెయ్యాలి. అభౌతికమైన మంటలా? ఎక్కడ ఉంటాయవి? మన ఇన్సైడ్. లోపల. మనమే రాజేసుకోవాలి. ఆత్మ సంస్కారంతో, ఆత్మ సంఘర్షణతో, ఆత్మ విమర్శతో, ఆత్మ సాక్షాత్కారంతో అగ్నిని రాజేసుకుని.. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను అందులో కాల్చి బూడిద చేసుకోవాలి. అప్పుడు క్లీన్ అయిపోతాం. న్యూ లుక్ వచ్చేస్తుంది. కొత్త సంక్రాంతి లుక్. పండక్కి అల్లుడొచ్చాక ఇంటికి వస్తుంది కదా ఆ లుక్. రైతులు పాడి పశువులకు స్నానం చేయించి, ఎండకు మిలమిల్లాడిస్తారు కదా ఆ లుక్. కానీ ఆ తల్లిని అనుమానించడం బాధగా ఉంది. ఏ తల్లి? జమదగ్ని భార్య రేణుకేనా? మళ్లీ అక్కడికెందుకు వెళ్లాల్సి వచ్చింది? రేణుక చేసిందని జమదగ్ని అనుమానించిన తప్పు కన్నా, రేణుకను అనుమానించడం జమదగ్ని చేసిన పెద్ద తప్పుగా అనిపిస్తోంది. ముందు అనుమానాన్ని మంటల్లో వెయ్యాలి. అనుమానం నుంచే ఈ చెడంతా. భర్త భార్యను అనుమానిస్తాడు. పెద్దలు పిల్లల్ని అనుమానిస్తారు. యజమాని సేవకుడిని అనుమానిస్తాడు. మంచిని చెడు అనుమానిస్తుంది. లేమిని కలిమి అనుమానిస్తుంది. ద్వేషం ప్రేమను అనుమానిస్తుంది. ఒక దేశం ఇంకో దేశాన్ని అనుమానిస్తుంది.ఎటు వెళ్తున్నాం. వెళ్లడం లేదు. వచ్చేశాం. ముంగిట్లోని భోగిమంటల దగ్గరికి. ఈ మంటల వెలుగుల్లో ముఖాలు ఎంత స్వచ్ఛంగా మారుతున్నాయి! వెలుగు స్నానం మురికిని తొలగిస్తోంది. మెల్లిగా వేకువ అవుతోంది. ఇక చాలు లేవండి, నేనొచ్చేస్తున్నాను కదా అంటున్నాడు ఆదిత్యుడు. అవునవునని తలూపుతూ వస్తున్నాయి.. ఆవూ లేగదూడ. అవునూ.. భోగి మంటలు ఎందుకు వేస్తారు? కడుపులో ఉన్న కోపం, అసూయ, ద్వేషం.. ఇలాంటివి తీసి పడేయడానికి అని చెప్పారు నిజమే. ఫిలసాఫికల్‌గా కాకుండా, పిలకాయలకు అర్థమయ్యేలా చెబుదురూ. పంటొచ్చే వేళ ఇంటికి పురుగూ వస్తుంది. సూర్యుడు మకరరాశిలోకి వెళ్లే వేళ చలి శిఖరానికి చేరుతుంది. పురుగును తరిమికొట్టడానికి, సంక్రాంతి నుంచి మొదలయ్యే ‘కొత్త వేడి’కి అలవాటు పడటానికే భోగి మంట. ‘అమ్మా.. అల్లుడుగారు లేచారా?’‘లేచారు నాన్నా.. స్నానం చేశాక భోగి మంట దగ్గరికి వస్తారట. ఈలోపు కర్పూరం తెమ్మని పంపించారు.’అవును. అదే సంప్రదాయం. స్నానం చెయ్యకుండా దేవుడి పటం ముందుకు వెళ్లం. స్నానం చేయకుండా భోగిమంటల దగ్గరికి వెళ్లకూడదు. భోగిమంటల్ని కర్పూరంతో వెలిగించాలి. కిరోసిన్‌తో, పెట్రోల్‌తో కాదు. మరి ఇంత తెలిసినవాడు భోగిమంటలు ఎందుకేస్తారని అమ్మాయిని ఎందుకు అడిగాడు! అమ్మాయికి తెలుసో లేదో తెలుసుకుందామనీ. -
సూర్యదేవాయ నమః
శ్రీశైలం: రథసప్తమి సందర్భంగా సోమవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో వేదపండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ ప్రత్యేకపూజలలో ఈవో సాగర్‌బాబు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా వైదిక పండితులు సూర్యయంత్రాన్ని లిఖించి పూజాధికాలకు సంబంధించిన సంకల్పం చెప్పారు. సూర్యదేవుడి అనుగ్రహంతో జనులందరికీ ఆరోగ్యం చేకూరాలని, అకాలమత్యువు రాకుండా అందరికి దీర్ఘాయువును ఉండాలని సంకల్పంలో చెప్పారు. అనంతరం కలశస్థాపన చేసి మహాగణపతిపూజ, వైదికాచార్యులు ఆయా బీజమంత్రాలతో ప్రత్యేక ముంద్రలతోనూ సూర్యనమస్కారాలు చేశారు. ఆ తరువాత అరుణ పారాయణలు, షోడశ ఉపచారాలు, వేదపారాయణలు వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించిన అనంతరం సూర్యదేవుడికి నివేదనలు సమర్పించారు. అనంతరం భక్తులందరిపై సూర్యాభిషేక జలాన్ని ప్రోక్షించి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తజనసాగరం.. ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రం సోమవారం వేలాది మంది భక్తులతో పోటెత్తింది. ఆదివారం సెలవుదినంతో పాటు సోమవారం రథసప్తమి, గణతంత్ర దినోత్సవం కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. దాదాపు 80వేలకు పైగా భక్తులు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయపూజావేళల్లో మార్పులు చేసి 4.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలను ప్రారంభించేలా ఈఓ సాగర్‌బాబు చర్యలు తీసుకున్నారు.