సూర్యదేవాయ నమః
శ్రీశైలం: రథసప్తమి సందర్భంగా సోమవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో వేదపండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ ప్రత్యేకపూజలలో ఈవో సాగర్‌బాబు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా వైదిక పండితులు సూర్యయంత్రాన్ని లిఖించి పూజాధికాలకు సంబంధించిన సంకల్పం చెప్పారు. సూర్యదేవుడి అనుగ్రహంతో జనులందరికీ ఆరోగ్యం చేకూరాలని, అకాలమత్యువు రాకుండా అందరికి దీర్ఘాయువును ఉండాలని సంకల్పంలో చెప్పారు.
అనంతరం కలశస్థాపన చేసి మహాగణపతిపూజ, వైదికాచార్యులు ఆయా బీజమంత్రాలతో ప్రత్యేక ముంద్రలతోనూ సూర్యనమస్కారాలు చేశారు. ఆ తరువాత అరుణ పారాయణలు, షోడశ ఉపచారాలు, వేదపారాయణలు వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించిన అనంతరం సూర్యదేవుడికి నివేదనలు సమర్పించారు. అనంతరం భక్తులందరిపై సూర్యాభిషేక జలాన్ని ప్రోక్షించి తీర్థప్రసాదాలను అందజేశారు.
భక్తజనసాగరం..
ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రం సోమవారం వేలాది మంది భక్తులతో పోటెత్తింది. ఆదివారం సెలవుదినంతో పాటు సోమవారం రథసప్తమి, గణతంత్ర దినోత్సవం కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. దాదాపు 80వేలకు పైగా భక్తులు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయపూజావేళల్లో మార్పులు చేసి 4.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలను ప్రారంభించేలా ఈఓ సాగర్‌బాబు చర్యలు తీసుకున్నారు.