
న్యూఢిల్లీ: దేశమంతటా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జనం రంగుల్లో మునిగితేలారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. హోలీ రంగులతో ఇళ్లు, వీధులు కొత్తరూపు సంతరించుకున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాలతో గడిపారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు రెండో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది హోలీ, రంజాన్ శుక్రవారం ప్రార్థనలు ఒకేరోజు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసు కోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు.
మసీదుల వద్ద పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల డ్రోన్లు సైతం మోహరించారు. కొన్ని ప్రాంతాల్లో మసీదు కమిటీల పిలుపు మేరకు హోలీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో మొఘల్ పాలకుల కాలంనాటి షాహీ జామా మసీదులో గత ఏడాది నవంబర్‌లో సర్వే ప్రారంభించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
దీంతో అక్కడ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రంజాన్ ప్రార్థనలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదు. సంభాల్‌లో సంప్రదాయ ‘చౌపాయ్ కా జులూస్’ శాంతియుతంగా జరిగింది. పోలీసుల చర్యలు సత్ఫలితాలిచ్చాయి. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు, రంజాన్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment