executive officer
-
టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు
సాక్షి,తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా ఐఏఎస్ అధికారి జె. శ్యామలరావు ఆదివారం(జూన్16) బాధత్యలు స్వీకరించారు. సంప్రదాయం ప్రకారం ఆయన ముందుగా వరాహస్వామిని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి శ్యామలరావుకు ఛార్జ్ ఇచ్చారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. జేఈవోలు తీర్థప్రసాదాలు అందించారు. -
శ్రీశైలం నూతన ఈవోగా పెద్దిరాజు
సాక్షి, నంద్యాల: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం, సింహాచలం దేవాలయాల ఈవోలు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం కొత్త ఈవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పెద్దిరాజు నియామకం అయ్యారు. వివరాల ప్రకారం.. శ్రీశైలం ఈజవో లవన్న బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీశైలం కొత్త ఈవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పెద్దిరాజు నియామకం అయ్యారు. ఇక, లవన్న.. శ్రీశైలం ఈవోగా రెండేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. అలాగే, సింహాచలం దేవస్థానం ఈవోగా శ్రీనివాసమూర్తి నియామకమయ్యారు. ఇది కూడా చదవండి: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీటీడీ చైర్మన్ భూమన -
కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవోగా శిరీష
విశాఖపట్నం: కనకమహాలక్ష్మి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష నియమితులయ్యారు. ఇంతవరకూ ఈవోగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్‌నాయుడు కృష్ణాజిల్లా తిరుపతమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. సహాయ కమిషనర్ బాధ్యతలతో పాటు కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలను శిరీష నిర్వహించనున్నారు. గతేడాది జూలై ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 29వరకు ఆమె కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆలయ ఆదాయం పెంపు, భక్తులకు సౌకర్యాలతో పాటు అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. ముఖ్యంగా అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ రామచంద్రస్వామి దేవస్థానం ఆస్తులు, అనకాపల్లిలో అన్యాక్రాంతం కాగా వాటిని స్వా«దీనం చేసుకొని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. దీంతో శిరీషాను అమ్మవారి దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో శిరీష ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
శ్రీవారి దర్శన సమాచారం ఇవ్వడానికి..
సాక్షి, తిరుమల : శ్రీవారి సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఏ సమాయానికి దర్శనమవుతుందో తెలియజేయడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే భక్తులకు సమాచార ఇచ్చేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించేందుకు చేపట్టామని అన్నారు. జూన్ మాసానికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం ఆయన ఆన్లైన్లో విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాదులో నిర్మించిన శ్రీవారి ఆలయంలో ఈ నెల 8న సాయంత్రం అంకురార్పణ, 13న విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ 13 నుంచి కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ‘మహసంప్రోక్షణ’పై పుస్తకం తెస్తాం.. తిరుమల శ్రీవారి ఆలయంలో గతేడాది నిర్వహించిన మహసంప్రోక్షణ, 2030లో నిర్వహించే మహసంప్రోక్షణ కార్యక్రమాలను పుస్తకరూపంలో తీసుకువస్తామని ఈవో వెల్లడించారు. ఆగమ సలహా మండలి సూచన మేరకు రూ.1.5 కోట్లతో రథ మండపం, రూ.23 కోట్లతో నారాయణ గిరి ఉద్యానవనంలో క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నామని తెలిపారు. రూ.4.5 కోట్లతో శ్రీవారి పుష్కరిణి ఆధునికీకరణపనులు చేస్తూన్నామని తెలిపారు. ఏఫ్రిల్ 24 నుంచి 27 వరకు వరహాస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ ఉంటుందని పేర్కొన్నారు. -
తాజా మార్పులపై అవగాహన తప్పనిసరి
తిరుపతి అర్బన్: టీటీడీ ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు తీసుకునే తాజా మార్పులపై ముందుగా టీటీడీ సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఈ విషయమై గురువారం తిరుమల, తిరుపతిలోని టీటీడీ సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్లలో పనిచేసే సిబ్బందికి శ్వేత భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్తులకు వసతి, దర్శనం, ఇతర సౌకర్యాల గురించి వివరించడంలో పాటించా ల్సిన జాగ్రత్తల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ టీటీడీలో ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను భక్తులకు సకాలంలో చేరవేయడంలో సమాచార కేంద్రాల సిబ్బంది మరింత చురుకైన పాత్ర పోషించాలన్నారు. సిబ్బందికి సంపూర్ణ అవగాహన ఉంటేనే భక్తులకు కావాల్సిన సమాచారాన్ని సమగ్రంగా, స్పష్టంగా చెప్పగలుగుతారన్నారు. భక్తుల నుంచి సూచనలు, సలహాలు, ఫిర్యాదులను స్వీకరించి ఆయా విభాగాలకు తెలియజేయాలన్నారు. దర్శనం, సేవల రద్దు సమాచారంలో జాగ్రత్తలు టీటీడీ పరిధిలోని అన్ని సమాచార కేంద్రాలు, కాల్ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది శ్రీవారి దర్ళనం వేళలు, ఆర్జిత సేవల రద్దు సమాచారం తెలుసుకుని భక్తులకు చెప్పడంలో జాగ్రత్త వహించాలని ఈఓ కోరారు. టీటీడీ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరిస్తే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. తిరుమలలో గదులకు సంబంధించిన సమస్యలపై భక్తులు కాల్ సెంటర్‌కు ఫోన్‌చేస్తే అక్కడి సిబ్బంది తక్షణం ఎఫ్ఎంఎస్ హెల్ప్‌లైన్‌కు కలపాలని ఈఓ ఆదేశించారు. అదేవిధంగా భక్తులు ఏ అంశంపై ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్నారో గుర్తించి నమోదు చేసుకోవడం ద్వారా ఆ విభాగంలోని ఉద్యోగులను అప్రమత్తం చేయవచ్చన్నారు. వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఫోన్‌ద్వారా సమాచారం అడుగుతున్న నేపథ్యంలో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సమాచారం ఇచ్చే అంశాలపై సాంకేతిక విభాగం అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించారు. టీటీడీ ప్రాజెక్ట్‌ల స్పెషలాఫీసర్ ముక్తేశ్వరరావు, శ్వేత డైరెక్టర్ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆగస్టు 12 నుంచి శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఆగస్టు కోటాలో 56,310 టికెట్లను.. ఉదయం 10.00 గంటలకు ఆన్లైన్లో పెట్టామన్నారు. ఆన్లైన్ డిప్ విధానంలో 9,960 సేవా టికెట్లు విడుదల చేశామన్నారు. వీటిల్లో సుప్రభాతం 6,805, తోమాల 80, అర్చన 80, అష్టదళపాదపద్మారాధన 120, నిజపాదదర్శనం 2,875 టికెట్లు ఉన్నాయన్నారు. విశేషపూజ 1,500, శ్రీవారి కల్యాణం 10,925, ఊంజల్‌సేవ 3,450, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,325, వసంతోత్సవం 11,550, సహస్రదీపాలంకార సేవ 12,600 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో అదనపు బూందీ పోటు శ్రీవారి ఆలయానికి మరో అదనపు బూందీ పోటు నిర్మించే యోచనలో ఉన్నట్టు సింఘాల్ తెలిపారు. ఇటీవల వరుసగా బూందీపోటులో అగ్నిప్రమాదాలు జరుగుతున్నందున మరొకటి నిర్మిస్తే రోజువారీ శుభ్రత చర్యలు చేపట్టేందుకు వీలు ఉంటుందని చెప్పారు. శ్రీవారి ఆలయానికి వెళ్లే భక్తులను క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు ఎయిర్‌పోర్టు మోడల్ తరహాలో తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 4 కంపార్ట్మెంట్లలో స్కానింగ్ కేంద్రాలు, డీఎఫ్ఎండీ, మెటల్ డిటెక్ట ర్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే సీసీ టీవీలు, వీడి యో వాల్ పనులూ పూర్తి చేస్తామన్నారు. -
వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
సాక్షి, తిరుమల: తిరుమల లో శ్రీవారి స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది. వసం తోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగారు. మహిళలు గోవింద నామ స్మరణలతో ఉత్సాహంగా రథాన్ని ముందుకు లాగారు. వేలాదిమంది భక్తులు ఊరేగింపులో పాల్గొని స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్నారు. స్వర్ణరథోత్సవం ముగిసిన తర్వాత స్వామివారిని ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మంటపానికి వేంచేపు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జీయర్ నేతృత్వంలో రామకృష్ణ దీక్షితులు ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహిం చారు. వసంతోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పట్టువస్త్రం, ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత టీటీడీ ఈవో అనిల్కుమార్సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజులతో కలిసి స్వర్ణరథోత్సవంలో పాల్గొన్నారు. -
చేసేపని మంచిదైతే..అవాంతరాలన్నీ చిన్నబోతాయ్..
దైవక్షేత్రాల్లో ఈఓ స్థాయి ఉద్యోగం చేయడమంటే కత్తిమీద సామే. అయితే తండ్రి అడుగుజాడలు, భర్త ప్రోత్సాహంతోనే సుదీర్ఘకాలం ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతున్నా. చిన్నతనం నుంచి నాకు ఓ ప్రగాఢ విశ్వాసం ఉంది. అదేంటంటే.. ‘మనం చేసే పని మంచిదైతే అవాంతరాలన్నీ చిన్నబోతాయని’. ఈ సిద్ధాంతాన్ని నమ్మి వృత్తిలో సేవే పరమావధిగా త్రికరణశుద్ధితో పనిచేస్తున్నాను.. అంటూ శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దర్బముళ్ల భ్రమరాంబ ‘సాక్షి’తో తన భావాలను పంచుకున్నారు. మాది సంప్రదాయ కుటుంబం. నలుగురు అక్కచెల్లెళ్లం. సొంతూరు విజయనగరం జిల్లా అయినా మా తండ్రి సుబ్బారావు ఉద్యోగరీత్యా విశాఖలో స్థిరపడ్డారు. మా కుటుంబంలో కట్టుబాట్లు ఎక్కువే. చదువులకు బయటకు పంపడానికి నాన్న ఒప్పుకునేవారు కాదు. అయితే బలవంతంగా ఒప్పించి మెట్రిక్యులేష న్ పూర్తి చేశాను. మా తండ్రి దేవా దాయశాఖలో పనిచేస్తూ 1982లో మృతి చెందారు. మా అక్కచెల్లెళ్లలో ఏ ఒక్కరూ ఆయన స్థానంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకురాకపోవడంతో నేను 18 ఏట ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి దేవాదాయశాఖలో వివిధ కేడర్లలో ఉద్యోగం చేసి, ప్రస్తుతం శ్రీకాళహస్తి పవిత్ర పుణ్యక్షేత్రం కార్యనిర్వాహణాధికారిగా విధులు నిర్వహిస్తున్నా ను. నా భర్త ప్రసాద్ విశాఖపట్నంలో ఎల్ఐసీ హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ పరంగా ఆయన నాకు ఎంతో అండ. లింగవివక్షతో ఉద్యోగ విరమణకు పూనుకున్నా.. స్వతహాగా మహిళను కావడంతో ఉద్యోగరీత్యా అనేక సందర్భాల్లో నేను లింగవివక్షను ఎదుర్కొన్నాను. ఒకానొ క దశలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం 2013లో రాష్ట్ర దేవాదాయ శాఖకు విన్నవించాను. అయితే వారు నా పనితనాన్ని మెచ్చి నా ఉద్యోగ విరమణ దరఖాస్తును తిరస్కరించారు. అప్పటి నుంచి ఉద్యోగరీత్యా చొరవ తీసుకుని పనిచేసే భావన నాలో పెరిగింది. బాధ్యతల్లో ఆత్మసంతృప్తి.. విజయనగరం జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో అనేక ఒత్తిళ్లు చవి చూశా. అయితే ఉద్యోగ ధర్మమే నన్ను నడిపించింది. విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగాను. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మూడుసార్లు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించే అదృష్టం నాకు దక్కింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మద్దతుగా ఉండడంతో పాటు శ్రీకాళహస్తి పాలక మండలి, అధికారుల సహకారంతో మహాకుంభాభిషేకంతో పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేయగలిగా. ఇక ఆలయ మాస్టర్‌ప్లాన్ పూర్తిచేస్తే ముక్కంటీశునికి నా సేవ పరిపూర్ణమైనట్లు భావిస్తా. -
వివాదాల్లో ఈవో.. కారణాలు ఏవేవో!
సాక్షి, విజయవాడ: దశాబ్దకాలంలో టి.చంద్రకుమార్, ఈ.గోపాలకృష్ణారెడ్డి, ఎన్.విజయకుమార్, ఎం.రఘునాథ్, కె.ప్రభాకరశ్రీనివాస్, సీహెచ్ నర్సింగరావు దుర్గగుడికి పూర్తికాలం ఈవోలుగా పనిచేశారు. ఇందులో ప్రభాకర శ్రీనివాస్, నర్సింగరావు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్లు కాగా, మిగిలిన వారు దేవాదాయశాఖలో రీజనల్ జాయింట్ కమిషనర్ కేడర్‌వారు. అయితే, వీరిలో ఏ ఒక్కరూ గట్టిగా రెండేళ్లు కూడా పనిచేసిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోపణపై అర్థంతరంగా బదిలీ అయినవారే. సీహెచ్ నర్సింగరావు ఒక అర్చకుడిని మనోవ్యధకు గురిచేయడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. అర్చకులంతా «నిరసన తెలియజేయడంతో నర్సింగరావును బదిలీ చేశారు. ఒక మహిళా ఉద్యోగినిపై తన పీఏ సహాయంతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణతో ప్రభాకర శ్రీనివాస్‌ను మార్చారు. ఈవో పీఏ ఒక మహిళా ఉద్యోగిని లైగింకంగా వేధిస్తూ ఎస్ఎంఎస్ పెట్టడం వివాదాస్పదమైంది. దేవస్థాన హుండీల్లో ఉండాల్సిన డబ్బు ఈవో కార్యాలయంలో ప్రత్యక్షమవ్వడంతో అమ్మవారి సొమ్ము దారి మళ్లుతోందంటూ రఘునాథ్‌ను ఆ సీటు నుంచి తప్పించారు. టెండర్లలో అవినీతి జరిగిందని, నిధులు దుర్వినియోగం చేశారని విజయకుమార్‌ను, ఇంద్రకీలాద్రిపై ఉన్న ఇళ్లను తొలగించేందుకు అమ్మవారి సొమ్మును చెల్లించే విషయంలో అవకతవకలు జరిగాయని చంద్రకుమార్‌ను బదిలీ చేశారు. ఇక రెండుసార్లు ఇన్చార్జిగా పనిచేసిన చంద్రశేఖర్ ఆజాద్ ఒకసారి పాలకమండలితో విభేదించి, రెండోసారి పుష్కరాలకు పూర్తిస్థాయి ఈవోను వేయాలని మార్చారు. తాత్కాలిక ఈవోగా పనిచేసిన ఆర్.కృష్ణమోహన్ హయాంలో తొక్కిసలాట జరగడంతో ఆయననూ మార్చారు. తొలి మహిళా అధికారికీ తప్పని అవమానం దుర్గగుడికి తొలి మహిళా ఐఏఎస్ అధికారి సూర్యకుమారికి అవమానం తప్పలేదు. టీటీడీ తరహాలో స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చి ఆమెను దుర్గగుడి ఈవోగా వేశారు. ఆమెపై ఆరోపణలు రావడంతో చివరకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం రద్దు చేశారు. దేవస్థానంలో తాంత్రిక పూజలు చేయించిన విషయం పొక్కడంతో ఈవో పదవి నుంచి తప్పించారు. ఈవోగా రెండేళ్లూ పనిచేయని సూర్యకుమారి తన పదవీ కాలమంతా వివాదస్పదంగానే గడిపారు. ఆదాయం పెంచడం కోసం టికెట్ రేట్లు పెంచడం, అమ్మవారి మూలధనాన్ని దుబారా చేయడం.. ఇలా అనేక విమర్శలు మూటగట్టుకున్నారు. కనీసం మూడేళ్లు ఉంటేనే అభివృద్ధి ఈవోలు కనీసం రెండేళ్లయిన పనిచేయకుండా మార్చివేయడంతో దేవాలయం అభివృద్ధి కుంటుపడుతోంది. దసరా, భవానీ దీక్షల విరమణ చేస్తే వారికి కొంత అవగాహన వస్తుంది. ఇలా అవగాహన పెంచుకుని పట్టు బిగించేలోపే ఈవోను బదిలీ చేసేస్తున్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోంది. అర్చకులతోపాటు అనేక మంది సిబ్బంది దీర్ఘకాలం దేవస్థానంలోనే ఉండటంతో వచ్చిన ఈవోలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చివరకు ఈవోలు అప్రదిష్టను మూటగట్టుకుని వెళ్తున్నారు. -
నోరు మెదపవద్దని సీఎం ఆదేశం
-
పాలకమండలి సభ్యులపై చంద్రబాబు ఆగ్రహం
సాక్షి, విజయవాడ : దుర్గగుడి పాలకమండలి సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయని వాస్తవాలు బైటపెట్టిన పాలక మండలిపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాకుండా దుర్గగుడి వివాదంపై పాలక మండలి సభ్యులు ఇకపై నోరు మెదపవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గురువారం పాలక మండలి సభ్యులతో అత్యవసర సమావేశం అయ్యారు. ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను పాలకమండలి సభ్యులకు వివరించారు. అయితే ఎటువంటి విచారణ జరగకుండానే ఆలయంలో పూజలు జరగలేదని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఎలా ప్రకటించారని పాలకమండలి సభ్యులు...ఎమ్మెల్సీని నిలదీశారు. ఈవో వ్యవహారంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఎటువంటి పరిస్థితి ఏర్పడిందని పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇలాగే ముదిరితే పాలక మండలినే రద్దు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారంటూ సభ్యులను ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. అలాగే ఈవో సూర్యకుమారి తప్పేమీ లేదని చెప్పకపోతే దుర్గగుడి ఆయల ప్రతిష్ట దెబ్బతింటుందని సూచన చేశారు. కాగా సంప్రదాయాలకు విరుద్ధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం ఇంద్రకీలాద్రిపై హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికితోడు ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారంటూ సమాచారం రావడంతో బుధవారం దీనిపైనే చర్చ జరిగింది. ఈవో సూర్యకుమారి స్థానంలో సింహాచలం ఈవో రామచంద్ర మోహన్ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, బుధవారం రాత్రి వరకూ ఈవోను మార్చుతున్నట్లు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అంతా సందిగ్ధంలో పడింది. దీనిపై పూర్తి విచారణ చేయించి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన దేవస్థానం వర్గాల్లో నెలకొంది. -
అసలేం జరిగింది?
సాక్షి, విజయవాడ: సంప్రదాయాలకు విరుద్ధంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరగడం ఇంద్రకీలాద్రిపై హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారంటూ సమాచారం రావడంతో బుధవారం దీనిపైనే చర్చ జరిగింది. ఈవో సూర్యకుమారి స్థానంలో సింహాచలం ఈవో రామచంద్ర మోహన్ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, బుధవారం రాత్రి వరకూ ఈవోను మార్చుతున్నట్లు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అంతా సందిగ్ధంలో పడింది. దీనిపై పూర్తి విచారణ చేయించి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించడంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనన్న ఆందోళన దేవస్థానం వర్గాల్లో నెలకొంది. మరోసారి బయటపడిన విభేదాలు దుర్గగుడి పాలకమండలికి, ఈవో సూర్యకుమారికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాంత్రిక పూజలు జరగడంపై తాము గతనెల 30న పాలకమండలిలో చర్చించినా ఈవో సూర్యకుమారి వేగంగా నిర్ణయం తీసుకోలేదని, అందువల్ల ఆమెను ఈవో పదవి నుంచి తొలగించి విచారణ చేయాలంటూ పాలకమండలి సభ్యులు డిమాండ్ చేశారు. అదే సమయంలో కొంతమంది సభ్యులు దేవస్థానంలో జరుగుతున్న కొన్ని అవినీతి వ్యవహారాలను మీడియా వద్ద ఏకరువు పెట్టారు. సూర్యకుమారి కూడా సాయంత్రం 4 గంటలకు తనను కలిసిన మీడియాతో మాట్లాడేటప్పుడు పాలకమండలి సభ్యులను కలుపుకోలేదు. పాలకమండలి సభ్యులు చేసిన వ్యాఖ్యలకు స్పందించలేదు. తాంత్రిక పూజలు జరిగాయని పాలకమండలి సభ్యులు చెబుతుంటే.. కేవలం శుద్ధిచేసే కార్యక్రమమే జరిగిందంటూ ఈవో సూర్యకుమారి చెప్పారు. వైదిక కమిటీ, ఆలయ అర్చకులతో ఆరోజు సంఘటనపై ఈవో సుదీర్ఘంగా చర్చించారు. అదే సమయంలో దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినేలా ఎవరూ మాట్లాడటం సరికాదంటూ ఈవో సూర్యకుమారి వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ఏం జరిగిందనే అంశంపై తాము విచారణ చేయిస్తున్నామని, మొత్తం నివేదికను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. మసకబారుతున్న ఆలయ ప్రతిష్ట దుర్గగుడిలో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు దేవాలయ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయి. ఇటీవల దేవస్థానంలో ఒక అటెండర్ చంద్రశేఖర్ టికెట్లు రీసైక్లింగ్ చేస్తుండగా అయ్యప్ప భక్తులకు పట్టుబడ్డాడు. చివరకు చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేశారు. అంతకుముందు విజిలెన్స్ నివేదికలోనూ ఏడాది కాలంగా దేవస్థానంపై జరుగుతున్న అవకతవకలను బహిర్గతం చేశారు. ప్రసాదాల తయారీ నుంచి ఇంజినీరింగ్ విభాగం వరకూ జరుగుతున్న అవినీతిని ఈ నివేదికల్లో విజిలెన్స్ అధికారులు ఏకరువు పెట్టారు. -
పూజల కోసం పిలిచారని చెప్పలేదు
-
నా మీద చాలామంది కోపంగా ఉన్నారు..
సాక్షి, విజయవాడ: దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. తాంత్రిక పూజల వ్యవహారంపై ఆమె బుధవారం ప్రెస్‌మీట్ లో మాట్లాడుతూ.. తాంత్రిక పూజలు అంటే ఏంటో తనకు తెలియదని, దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఈవో తెలిపారు. గత నెల 26వ తేదీ రాత్రి సాధారణంగా చేసే అలంకారమే జరిగిందని, అందుకు సంబంధించిన సామాగ్రిని మాత్రమే లోనికి వెళ్లిందని ఆమె పేర్కొన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 14మందికి నోటీసులు ఇచ్చామన్నారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈవో స్పష్టం చేశారు. బదిలీకి సంబంధించి తనకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఆమె తెలిపారు. నా మీద చాలామంది కోపంగా ఉన్నారు.. ‘గుడిలో నా మీద చాలామందికి కోపం ఉంది. పాలకమండలికి, నాకు మధ్య కొంత దూరం ఉంది. పాలకమండలి కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ వింగ్ ప్రారంభించాం. గుడిలో వంద గ్రూపులు ఉన్నాయి. నా మీద కొంత ఒత్తిడి వచ్చింది. కానీ నిబంధనల ప్రకారమే పని చేశాం. బయోమెట్రిక్ పెట్టడం, పని సక్రమంగా చేయడం, కొత్త పూజలు ప్రవేశ పెట్టడం కూడా కొందరికి నచ్చలేదు. హుండీ 20శాతం, టిక్కెట్ ఆదాయం 80శాతం పెరిగింది. సుమారు 130 కోట్ల వరకు డిపాజిట్ లు వున్నాయి. ఒక్క కార్తీకమాసంలో కోటి రూపాయల ఆదాయం పెరిగింది. ఇక గుడిలో పూజలకు సంబంధించి ఎస్పీఎఫ్, దేవాదాయ సిబ్బంది, ఓపిడిఎస్ స్టాఫ్ ను ఆలయ ఈఈ వెంకటేశ్వర రాజు విచారిస్తున్నారు. పాలకమండలి కూడా రెండు రోజుల కిందటే సీసీ టీవీ ఫుటేజీ చూసింది. బయటి వ్యక్తులు ఎలా వచ్చారని పాలకమండలి సభ్యులు ప్రశ్నించారు.’ అని అన్నారు. కాగా ఈ వివాదం నేపథ్యంలో ఈవో సూర్యకుమారిపై వేటు పడింది. ఆమెను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. సూర్యకుమారి స్థానంలో ఇన్చార్జ్ ఈవోగా రామచంద్ర మోహన్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సింహాచలం దేవాలయ ఈవోగా ఉన్న ఆయనను వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. -
టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు ఆన్లైన్ బుకింగ్
తిరుపతి అర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)– 2018 డైరీలు, క్యాలెండర్ల కోసం భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని పరిపాలన భవనంలో జేఈవో పోలా భాస్కర్‌తో కలసి ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో ఈ డైరీలు, క్యాలెండర్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. వీటిని ttdsevaonline.com వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేయొచ్చన్నారు. -
పట్టు చిక్కేదెప్పుడు?
సాక్షి, విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం పాలకమండలి సభ్యులు దుర్గగుడిపై పట్టుకోసం తహతహలాడుతున్నారు. దేవస్థానంలో తమ మాటే చలామణి అయ్యేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవాలయం అంతర్గత విషయాలపై చూపించే ఆసక్తి దేవస్థానానికి నిధులు రాబట్టడంపై చూపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది సభ్యులు తరచుగా ఈవో సూర్యకుమారితో విభేదించడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. నిధులు రాబట్టడంలో విఫలం పాలకమండలి సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వద్ద తమ పరపతి ఉపయోగించి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. కనీసం వారు చేసిన తీర్మానాలను ప్రభుత్వంతో అమలు చేయించలేకపోతున్నారు. దసరా ఉత్సవాలకు రూ.10 కోట్లు కావాలని తీర్మానం చేయడం మినహా ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి రాబట్టలేకపోయారు. అంతరాలయ దర్శనం రూ.300 నుంచి రూ.150 తగ్గించాలని పాలకమండలి తీర్మానం చేసినప్పటికీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కోటప్పకొండకు నిధులు విడుదల చేసింది కానీ దుర్గగుడిపై నిర్లక్ష్యం చూపింది. పరిచయాలున్నా విరాళాలు నిల్ పాలకమండలిలో కొంత మందికి అధికార పార్టీ పెద్దలతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించి దాతల నుంచి దేవస్థానానికి చందాలు రాబట్టలేక పోతున్నారు. దీంతో అమ్మవారి మూలధనం తరిగిపోతోంది. మంత్రులు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలను ఒప్పించి విరాళాలు తెప్పించి దేవస్థానాన్ని ఆదాయంలో అగ్రస్థానంలో నిలబెట్టవచ్చు. దుర్గగుడికి ఆదాయం ఇచ్చేందుకు అనేక మంది దాతలు సిద్ధంగా ఉన్నారు. అయినా వారిని గుర్తించి నిధులు రాబట్టడంపై పాలకమండలి శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిపై ప్రణాళిక ఏదీ? లడ్డూ ప్రసాదాలు ధరను తొలుత రూ.15 పెంచాలని యోచించారు. అయితే నాణ్యత పెంచి రూ.20 చేయాలని పాలక మండలి సభ్యులు నిర్ణయించారు. దీనిపై విమర్శలు రావడంతో మంత్రి ఉమామహేశ్వరరావు పిలిచి పాలకమండలిని ప్రశ్నించారు. రేట్లు ఎందుకు పెంచామో చెప్పి ఆయన్ను ఒప్పించలేక, ఆయన సూచన మేరకు లడ్డూ రేటును రూ.15కు తగ్గించారు. పాలకమండలి సమావేశం జరిగితే, ఈవోతో విభేదించడమే తప్ప, అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రణాళికలు తయారు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపాదనలు పట్టించుకోని ఈవో బియ్యం మిల్లర్ల వద్ద రూ.41 కొనడాన్ని ఆక్షేపిస్తూ టెండర్లు పిలిస్తే రూ.38కే కాంట్రాక్టర్లు సరఫరా చేస్తారనే వాదన చేశారు. అయితే రూ.38లకు లభించే బియ్యం ఒకలోడు తీసుకుని అగ్‌మార్కుకు పంపించి, వాటిని పరిశీలించిన తరువాత టెండర్ ఇద్దామనే ఈవో ప్రతిపాదనపై పాలకమండలి సభ్యులు సరిౖయెన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. అన్నదానం, ప్రసాదాలు, స్టోర్స్, కేశఖండన వంటి వాటిపై పట్టుకోసం కమిటీలు వేయమంటూ ప్రతిపాదన తెస్తున్నారు. విభాగాలకు కమిటీలు ఏర్పడితే అక్కడ పనిచేసే సిబ్బందికి సమస్యలు తప్పవు. గతంలో ఉన్న పాలకమండలి సభ్యులు గ్యాస్ సిలిండర్లు, ప్రసాదాలు కూడా దేవస్థానం నుంచే తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. పాలకమండలి వచ్చి ఐదు నెలలు గడిచినా ఈవోతో విభేదించడం తప్ప భక్తులకు పెద్దగా ఒరిగిందేది కనపడటం లేదు. ఈ పాలకమండలి ఉన్నా,లేకున్నా ఒకటేలాగా ఉందనే విమర్శలు అధికార పార్టీ నేతల నుంచే వినవస్తోంది. -
రూ.3లక్షలకే ఉద్యోగం..
సాక్షి, అమరావతి : పవిత్రమైన భగవంతుడి సన్నిధిలో గడిపే పోస్టులకూ ప్రభుత్వ పెద్దల అండతో బేరసారాలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖలో నిరుద్యోగులకు అవకాశం కల్పించటం ద్వారా భర్తీ చేయాల్సిన గ్రేడ్– 3 ఆలయ కార్యనిర్వాహక అధికారి(ఈవో) పోస్టులను సర్కారు వద్ద పలుకుబడి కలిగిన బ్రోకర్లు రూ. 3 లక్షల చొప్పున అమ్మకానికి పెట్టారు. ముందుగా లక్ష చొప్పున వసూలు చేసిన బ్రోకర్లు తాత్కాలిక సిబ్బందికి పదోన్నతులు కల్పించటం ద్వారా భర్తీ చేసేందుకు మెమో కూడా జారీ చేయించటం గమనార్హం. రంగంలోకి బ్రోకర్లు దేవాదాయ శాఖలో గ్రేడ్–3 ఈవో పోస్టులు 167 ఖాళీగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా ఆలయాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా వీటిని భర్తీ చేసేందుకు బ్రోకర్లు రంగంలోకి దిగారు. నిరుద్యోగులతో భర్తీ చేయాల్సిన ఈ పోస్టులను పదోన్నతుల ద్వారా నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ‘సాక్షి’ రెండేళ్ల కిత్రమే పలు కథనాలు ప్రచురించడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా ఆగింది. అయితే కొద్ది విరామం తరువాతబ్రోకర్లు మరోసారి దందాకు దిగారు. గుట్టుగా రూ.కోటిన్నర గుంజారు ఆలయాల్లో సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఉండదు. ఆలయ ఆదాయం నుంచే వీరికి జీతభత్యాల చెల్లింపులు జరుగుతాయి. గ్రేడ్–3 ఈవో పోస్టును మాత్రం పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తారు. వీరికి ప్రభుత్వ ట్రెజరీల నుంచి జీతాలు చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పదోన్నతి ద్వారా గ్రేడ్ –3 ఈవో పోస్టు దక్కించుకుంటే పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా పరిగణిస్తారనే ఉద్దేశంతో లక్షలు చెల్లించేందుకు సిద్ధపడటాన్ని బ్రోకర్లు అవకాశంగా మలుచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 167 మందిని గుర్తించి ఒక్కొక్కరి నుంచి ముందుగా రూ.లక్ష చొప్పున వసూలు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా రూ. కోటిన్నరకు పైగా గుంజారు. మంత్రి కార్యాలయానికీ వాటాలు..! బ్రోకర్లు నజరానాగా వాటాలు పంచడంతో పదోన్నతుల ద్వారా భర్తీకి అనుమతిస్తూ ఉన్నతాధికారులు మోమో కూడా జారీ చేసినట్టు సమాచారం. మోమో జారీలో ఓ మంత్రి కార్యాలయం ప్రమేయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే మోమో జారీ అయిన తర్వాత కూడా పోస్టులు దక్కకపోవడంతో డబ్బులు సమర్పించుకున్నవారు ప్రస్తుతం సచివాలయంలోని దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
ప్రభుత్వ అనుమతితోనే టీటీడీలో ఉద్యోగాల భర్తీ
రూ.300 స్లాట్ తరహాలో దివ్యదర్శనానికి ఏర్పాట్లు: టీటీడీ ఈవో అనిల్ కుమార్ తిరుపతి అర్బన్: ఖాళీగా ఉన్న టీటీడీ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే భర్తీచేస్తామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ టీటీడీ ఈవోతో ‘మీట్ ద ప్రెస్’ను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 5 ఏళ్ల లోపు పిల్లల తల్లి దండ్రుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు. నడిచివచ్చే భక్తులకు అమలు చేస్తున్న దివ్య దర్శనం విధానాన్ని రద్దుచేసే ఆలోచన లేదన్నారు. రూ.300 స్లాట్ తరహాలో ఈ నెల 17 నుంచి దివ్యదర్శనం భక్తులకు ప్రత్యేక విధానం ద్వారా రోజుకు 20వేల మందికి దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించి ప్రయో గాత్మకంగా పరిశీలిస్తామన్నారు. గదుల మంజూరుకూ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ విధానంతో గదులు పొందే సౌలభ్యాన్ని అమలులోకి తేనున్నా మని ఈవో వెల్లడించారు. భక్తులు గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద వివరాలను టీటీడీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగానే రెఫరెన్స్ టోకెన్ ఇచ్చి పంపేస్తారన్నారు. కేటాయించిన కాటేజీ, గది నంబర్లను వారి మొబైల్‌కు మెసేజ్ ద్వారా పంపుతామన్నారు. భక్తుడు ఆ సమయానికి కౌంటర్ వద్దకు వచ్చి డబ్బు చెల్లిస్తే గది మంజూరు చేస్తామన్నారు. -
టీటీడీ తరహాలో శ్రీశైలం అభివృద్ధి
- భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయం - మాస్టర్‌ప్లాన్ అమలులో ఇబ్బందులు - సోలార్ వ్యవస్థతో ఖర్చు తగ్గిస్తున్నాం - ·ప్రీ ఫ్యాబ్రికేషన్ గదుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం - ఏడాది పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఓ నారాయణభరత్ గుప్త శ్రీశైలం: తిరుమల తిరుపతి తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు.. చేయలేకపోయిన కార్యక్రమాలను వివరించారు. భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేసినట్లు తెలిపారు. క్షేత్రంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. ఆధునిక టాయిలెట్స్ నిర్మాణం.. కాల్‌సెంటర్ ఏర్పాటు..ప్రగతి పనులుగా చెప్పుకొచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... వసతిపై స్పష్టత లేదు.. మొత్తం రూ.580 కోట్లతో మాస్టర్‌ప్లాన్ అంచనాలను రూపొందించారు గాని.. ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటి దశలో డార్మెంటరీలు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజి వ్యవస్థ, వాటర్ ట్రీట్ మెంట్‌ప్లాంట్, మంచినీటి సరఫరా వ్యవస్థ, సివరేజ్ ప్లాంట్ మొదలైనవి ఉన్నాయి. ఇందులో ఉన్నంత వరకు దాదాపు అన్ని పూర్తిస్థాయిలో ముగింపు దశకు చేరుకున్నాయి. రెండో ఫేజ్‌లో వసతిగదుల నిర్మాణం కోసం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే అవి ఎక్కడ నిర్మించాలి, ఎలా నిర్మించాలి అన్నదానిపై స్పష్టత లేదు. మల్లికార్జునసదన్ నిర్మించి ఎనిమిదేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క గదిని కూడా దేవస్థానం కట్టించలేదు. అంటే ఏ అధికారి ఆ దిశగా ఆలోచించలేదు. ప్రత్యేక గదులు.. దేవస్థానానికి ఉన్న నిధులతో ఆర్సీసీ బిల్డింగ్ నిర్మించాలంటే కనీసం చదరపు అడుగుకు సుమారు రూ. 2వేల వరకు ఖర్చు అవుతుంది. దీనికి తోడు కాలవ్యవధి కూడా ఎక్కువవుతుంది. ఈ పరిస్థితుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రీ ప్యాబ్ కన్స్ట్రక్షన్ ద్వారా ప్రత్యేక గదులను 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని చూస్తున్నాం. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ. 1700 చదరపు అడుగుకు అవుతుంది. అయితే ఈ గదులకు కామన్ బాత్రూమ్స్ మాత్రమే ఉంటాయి. మరో 50 అడుగుల పెంపుదలతో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 1900 నుంచి రూ. 2వేల వరకు చదరపు అడుగుల వ్యయంతో ఏసీ గదులను అందులోనే అటాచ్డ్ బాత్రూమ్లతో నిర్మించే పనిలో ఉన్నాం. సోలార్ వెలుగులు.. ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణ పనులను రూ.75 కోట్లతో ఆర్కె కన్స్ట్రక్షన్ చేపడుతోంది. ప్రతి ఏటా దేవస్థానం విద్యుత్ శాఖకు సుమారు రూ. 3కోట్లకు పైగా కరెంట్ బిల్లులు చెల్లిస్తోంది. దీనిని తగ్గించుకునేందుకు ఒకే సారి పెట్టుబడి పెట్టి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నాం. ఇందులో భాగంగా దేవస్థానం అన్నపూర్ణ భవన్లో రూ 2 కోట్ల వ్యయంతో, మల్లికార్జునసదన్, వీవీఐపీ భ్రామరీసదన్, పలు కాటేజీలకు సోలార్ వ్యవస్థ ద్వారా వేడినీటితో పాటు విద్యుత్ వ్యయాన్ని కూడా తగ్గించే పనిలో ఉన్నాం. ఆయా వసతి గదుల్లో వైఫై సదుపాయాన్ని కూడా భక్తులకు కల్పిస్తున్నాం. అలాగే శ్రీశైలం టీవీ చానల్‌ను ఏర్పాటు చేయాలని భావించాం. ఇప్పటి వరకు చానల్‌కోసం రూ. 30లక్షల వరకు ఖర్చు చేశాం. దాతలు సహకరిస్తే మరింత తొందరగా చానల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ¯ð ల్లూరు ఏసిటీ నెట్వర్క్ వారి సహకారంతో ఛానెల్‌ను ఆప్లికింగ్ లేదా నెట్వర్క్ బ్యాకింగ్ ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నాం. చంద్రావతి కల్యాణమండపం నుంచి ఘంటామఠం, ఉద్యానవనం, శివాజీగోపుర మాడ వీధి అక్కడి నుంచి కృష్ణదేవరాయగోపురం నుంచి భక్తులు వచ్చేలా క్యూల నిర్మాణం జరుగుతోంది. ఇందు కోసం సుమారు రూ. 30 కోట్ల అంచనాతో ప్రణాళికను రూపొందిస్తున్నాం. కాల్ సెంటర్... భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రతి రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు ఇది పని చేస్తుంది. ఫో¯Œన్ నంబర్లు 833901351,52, 53, 54,55,56.. గడిచిన 3 నెలల్లో 16 వేల ఫోన్ కాల్స్ ను కాల్ సెంటర్ రిసీవ్ చేసుకున్నాం. అభివృద్ధి ఇదీ.. పాతాళగంగ మార్గంలోని నీలకంఠ , భ్రమరాంబా వసతి సముదాయం (పిలిగ్రామ్స్ అమినిటీస్ కాంప్లెక్స్) నుంచి భక్తులు తాత్కాలిక వసతిని పొందవచ్చు. ఈ సముదాయంలో బెడ్లు, మరుగుదొడ్లు, స్నానపు గదులతో పాటు లాకర్ సౌకర్యం కూడా కల్పించాం. భ్రమరాంబా వసతి సముదాయంలో ఏసీ సౌకర్యం ఉంది. ఆలయ సమీపంలోని అన్న పూర్ణభవనంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు అన్న ప్రసాదాలు (భోజన ప్రసాదం), సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు అల్పాహారం అందజేస్తున్నాం. అన్నదానం నిధుల నుంచి వచ్చే వడ్డీని ఆధారం చేసుకుని భక్తులకు అల్పాహార సౌకర్యాన్ని కూడా కల్పించాం. స్వామివారి అభిషేకం, శ్రీ అమ్మవారి కుంకుమార్చన, కల్యాణోత్సవం, ఏకాంత సేవ తదితర సేవా టిక్కెట్లను ముందస్తుగా ఇంటర్నెట్ నుంచిపొందవచ్చు. దేవస్థానం గదులను , కాటేజీలను, రిజర్వ్ చేసుకునే సదుపాయం కల్పించారు. వివరాలకు www.srisailamonline.com ను సందర్శించవచ్చు. క్యూ కాంప్లెక్స్చ ఆలయ ప్రాంగణంలోని ఆర్జిత సేవ కౌంటర్లు, మల్లికార్జున సదన్ , గంగా సదన్ మొదలైన చోట్ల గల ప్రత్యేక కౌంటర్ల నుంచి ఆర్జితసేవ టిక్కట్లను పొందవచ్చు. శివగంగా జలప్రసాద పథకం కింద ఆలయ ప్రాంగణం, గౌరీసదనం, మల్లికార్జున సదనం, టూరిస్ట్ బస్టాండ్ , చంద్రవతి కళ్యాణ మండపం ప్రాంతాల్లో ఉచిత రక్షిత మంచినీటి కేంద్రాలు(మినరల్‌వాటర్ ప్లాంట్లు) ఏర్పాటు చేశాం. పాతాళగంగ మార్గంలో అధునాతన కళ్యాణ కట్ట నిర్మించాం.. ఉదయం 4.30 నుండి రాత్రి 9 వరకు భక్తులు ఇక్కడ తలనీలాలను సమర్పించవచ్చు. క్షేత్రంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. శ్రీ స్వామి వార్ల కైంకర్యానికి పూలతోటలను పెంచుతున్నాం. శ్రీశైల క్షేత్రాన్ని స్వచ్ఛ శ్రీశైలంగా తీర్చి దిద్దేందుకు పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పొడిచెత్త, తడిచెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేర్వేరుగా సేకరించేందుకు డస్ట్బిన్లను ఏర్పాటు చేశాం. శ్రీశైలాలయ పరిసరాలు విశాలంగా కనిపించేందుకు మాడ వీధుల విస్తరణ పనులను చేపట్టాం. ప్రస్తుతం దక్షిణమాడ వీధి పనులు పూర్తయ్యాయి. పడమర, తూర్పు, ఉత్తర మాడ వీధి పనులు కొనసాగుతున్నాయి. దసరా శరన్నవరాత్రోత్సవాల్లోగా వీటిని పూర్తి చేస్తాం. -
టీటీడీపై రూ.50 కోట్లకుపైగా జీఎస్టీ భారం
తిరుమల: జీఎస్టీ అమలుతో తిరుమల తిరుపతి దేవస్థానంపై రూ.50 కోట్లకుపైగా అదనపు భారం పడుతున్నదని ఈవో సింఘాల్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ...బంగారు డాలర్ల విక్రయంపై 3 శాతం, రూ.1000,రూ.2500 మధ్య అద్దె ఉన్న గదులకు 12 శాతం పన్ను, రూ.2500 అద్దెపైబడిన గదులకు 15 శాతం పన్నును భక్తుల నుంచి వసూలు చేయాల్సి వస్తున్నదన్నారు. భక్తులపై భారం పడుతున్న దృష్ట్యా టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ఆయన తెలిపారు. నెలలో రెండు రోజులు వృద్దులు, దివ్యాంగులకు గతంలో 1500 టోకెట్లు ఇచ్చేవారని, ఇప్పుడు నాలుగు వేలకు పెంచామని, దీన్ని 18, 25 తేదీల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. అలాగే స్వామివారి దర్శనానికి ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు అనుమతిస్తామని, వీరికి 19, 26 తేదీలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని అన్నారు. అయితే దర్శన టికెట్లపై జీఎస్టీ ప్రభావం లేదన్నారు. కాగా, జూన్ నెలలో శ్రీవారిని 25,77,165 మంది భక్తులను దర్శించుకున్నారని, కోటి 74వేల 161మంది భక్తులకు లడ్డూలు అందించామని, ఆ నెలలో హుండీ ఆదాయం రూ.66 కోట్ల 56 లక్షలు వచ్చిందని సింఘాల్ తెలిపారు. టీటీడీ వద్ద పాతనోట్లు రూ.25 కోట్లు ఉన్నట్లు చెప్పారు. ►ఇక అక్టోబర్ నెలకు సంబంధించి 56,295 ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల ►లక్కీడిప్ విధానానికి 12,495 ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు ►సుప్రభాతం 7,780, అర్చన 120, తోమాల సేవ 120 టిక్కెట్లు ►అష్టదల పాదపద్మారాధన 300, నిజపాద దర్వనం 2300 టిక్కెట్లు ►లక్కీడిప్ కింద విశేషపూజ 1875 టిక్కెట్లు ఆన్లైన్లో ఉంచిన టీటీడీ ►లక్కీడిప్ కింద సేవా టిక్కెట్ల నమోదుకు వారం రోజుల వరకూ అవకాశం ►ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ టిక్కెట్ల కేటాయింపు ►టిక్కెట్ల కేటాయించిన భక్తులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం -
ఆలయంలో అపచారం
భద్రాద్రిలో లక్ష్మి అమ్మవారి ఆలయం తలుపులు మూయని అర్చకులు భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. గర్భగుడి ప్రాంగణంలోని లక్ష్మి తాయారమ్మవారి కోవెల తలు పులను శుక్రవారం రాత్రి మూయకుండానే వదిలేశారు. రాత్రి వేళ విధుల్లో ఉన్న సెక్యూరిటీ(ఎస్టీఎఫ్)సిబ్బంది దీనిని గుర్తించి, తెల్లవార్లూ అక్కడనే కాపలా కాయాల్సి వచ్చింది. భద్రాద్రి రామాలయ తలుపులు ప్రతిరోజు రాత్రి 9.30 గంటలకు మూస్తారు. గర్భగుడి తలుపులతో పాటు, ప్రాంగణంలో ఉన్న లక్ష్మి తాయారమ్మవారు, అభయాంజనేయ స్వామి వారి ఆలయాలను కూడా ఇదే సమయంలో మూస్తారు. అయితే శుక్రవారం రాత్రి విధు ల్లో ఉన్న అర్చకుడు పూజాది కార్యక్రమాల అనంతరం లక్ష్మి అమ్మవారి కోవెల ప్రధాన తలుపులు వేయకుండా బయట గేట్లును వేసి వెళ్లిపోయారు. అదే సమయంలో ఆలయ ప్రధాన ద్వారం(రాజగోపురం) తలుపులు కూడా వేసి బయటకు వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత ఆలయం లోపల విధులు నిర్వహిస్తున్న ఎస్టీఎఫ్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి, దీనిపై ఆలయ అర్చకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాత్రి కావటంతో ఆ సమయంలో ఎవరూ అందుబాటులోకి రాలేదని ఎస్టీఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తీసిన సమయంలో ఈ విషయాన్ని ఎస్టీఎఫ్ సిబ్బంది ఆలయ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఉదయం విధులకు హాజరైన అర్చకులు సంప్రోక్షణ అనంతరం తిరిగి యథావిధిగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ శేఖర్ ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అర్చకుడికి మెమో జారీ చేస్తాం లక్ష్మి తాయారు అమ్మవారి కోవెల తలుపులు శుక్రవారం రాత్రి వేయకుండా వదిలేసిన విషయమ వాస్తవమే. దీనిపై ఆ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడికి మెమో జారీ చేస్తాం. ఎందుకిలా జరిగిందనే దానిపై ఆయన వివరణ కోరుతాం. ఆయన ఇచ్చిన సమాధానం అనంతరం ఏ మేరకు చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాను. – ఈఓ ప్రభాకర శ్రీనివాస్ -
శ్రీవారి ఆలయంలో కొత్త క్యూలైను
- శనివారం నుంచి అమలు.. తగ్గిన 300 మీటర్ల దూరం - త్వరగా స్వామి దర్శనం, తోపులాటల నివారణకు శ్రీకారం - టీటీడీ కొత్త ఈవో సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు స్వీయ పర్యవేక్షణ సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో శనివారం నుంచి కొత్త క్యూలైను అమలు చేశారు. దీని ఫలితంగా భక్తులకు త్వరగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం లభించటంతోపాటు 300 మీటర్ల క్యూలైన్ దూరం, తోపులాటలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. గతంలో సర్వదర్శనం, కాలిబాట, రూ. 300 టికెట్ల భక్తులను శ్రీవారి దర్శనానికి మహద్వారం దాటుకున్న తర్వాత పడకావలి ఎడమవైపు రంగనాయక మండపం వెనుక నుంచి కల్యాణోత్సవం మండపం మీదుగా వెండివాకిలి ద్వారా అనుమతించేవారు. క్యూలైన్లలో తోపులాటలు, ఒకే సమయంలో ఆలయంలోకి వెళ్లిన భక్తులకు స్వామి దర్శన సమయంలో వ్యత్యాసంపై భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ కొత్త ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు కొత్త క్యూలైన్లకు శ్రీకారం చుట్టారు. పడకావలిలోని తులాభారం మండపం పక్క నుంచి తిరుమల రాయమండపం మీదుగా కల్యాణోత్సవం వెలుపల క్యూలైను మీదుగా వెండివాకిలి వరకు కొత్త క్యూలైన్ ఏర్పాటు చేశారు. సుమారు 40 మీటర్ల పొడవు, 6 అడుగుల వెడల్పుతో దీన్ని అమలు చేశారు. ఇక్కడే ఉన్న పాత క్యూలైన్‌ను రెండు లేన్లుగా విస్తరించారు. దీనివల్ల పడకావలి నుంచి ధ్వజమండపం మీదుగా నేరుగా వెళ్లే భక్తులకు, కొత్త క్యూలైన్లో వెళ్లే భక్తులకు స్వామి దర్శనం సమయంలో వ్యత్యాసం కేవలం 2 నుంచి 5 నిమిషాలు మాత్రమే ఉండనుంది. ఈ కొత్త క్యూలైన్ పక్కాగా అమలు చేయటం కోసం కొత్త ఈవో, జేఈవో వారం రోజులుగా ఆలయంలోనే ఎక్కువ సమయం ఉంటూ ఇంజనీర్లకు మార్పులుచేర్పులు చెబుతూ పనులు చేయించారు. -
దేవాదాయ శాఖలో అవినీతి జలగ
► ఈఓ సాయిబాబు ఇంట్లో ఏసీబీ సోదాలు ► రూ.కోటికి పైగా అక్రమాస్తుల గుర్తింపు ► తణుకు, భీమవరం, రేలంగి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు తణుకు: దేవాదాయ శాఖలో ధనార్జనే ధ్యేయంగా ఆస్తులు కూడగట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఓ అధికారిని ఏసీబీ అధికారులు గుర్తించారు. తూర్పుగో దావరి జిల్లా పెద్దాపురంలో దేవాదాయశాఖకు చెందిన రాజా వత్సవాయి సు బ్బు, బుచ్చమ్మ ఆశ్రమం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న చీమలకొండ సా యిబాబు నివాసంతోపాటు కార్యాల యం, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు చేశారు. ఆశ్రమంలో అన్నదానం జరగకుండా జరిగినట్టుగా రికార్డులు చూపిస్తూ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారనే ఆరోపణల కారణంగా ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ప్రాథమిక సమాచారం మేరకు సాయిబాబు కూడబెట్టిన రూ.90 లక్షల మేర అక్రమాస్తులు గుర్తించినట్టు అధికారులు చెబుతుండగా ఆయన స్థిరాస్తుల విలువ రూ.కోటికి పైగా ఉంటుందని భావిస్తున్నారు. సోమవారం వేకువజాము నుంచి మొదలైన సోదాలు సాయంత్రం వరకు కొనసాగాయి. సాయిబాబును మంగళవారం కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపారు. మొదట్నుంచీ ఆరోపణలే.. రెండేళ్లుగా పెద్దాపురం సత్రానికి ఈఓగా పనిచేస్తున్న సాయిబాబు తణుకు మండలం కోనాల, ముద్దాపురం గ్రూపు ఆలయాలకు ఇన్చార్జి ఈవోగా పదిహేనేళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకు ముందు పెంటపాడు మండలం బైరాగిమఠం (సత్రం) ఈఓగా పనిచేసిన ఆయనపై గతం నుంచి అవినీతి అరోపణలు ఉన్నాయి. ఆరుళ్ల సాయిగా అతడిని పిలుస్తుంటారు. ఇరగవరం మండలం రేలంగి స్వగ్రామం కాగా తణుకు పట్టణంలోని బ్యాంకు కాలనీలో సొంత ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. అంతేకాకుండా మరో రెండు ఇళ్లతోపాటు మూడు ఇళ్లస్థలాలు, అపార్టుమెంట్‌లోని ప్లాటు ఉన్నాయి. పెద్దాపురంలోని కార్యాలయంతోపాటు భీమవరంలోని ఆయన బావమరిది ఇల్లు, రేలంగి, తణుకులో స్నేహితుడి ఇళ్లలో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటంతోపాటు అవినీతి ఆరోపణలు ఆధారంగా కొద్దికాలంగా అతడి కదలికలపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఏసీబీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అనుమతితో కేసు నమోదు చేసి న్యాయస్థానంలో సెర్చ్ వారెంట్ తీసుకుని ఏ కకాలంలో దాడులు చేశారు. ఇల్లే కార్యాలయంగా.. సోదాల సమయంలో కోనాల గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 35 ఎకరాల భూముల డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో కార్యాలయ రికార్డులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిన అధికారులకు ఇంటినే కార్యాలయంగా వాడుకుంటున్నానని సాయిబాబా చెప్పడం కొనసమెరుపు. వీటితోపాటు కుటుంబ సభ్యుల 14 బ్యాంకు ఖాతాల పాసు పుస్తకాలు, బ్యాంకు లాకర్లకు చెందిన పత్రాలను సీజ్ చేశారు. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ విలేకరులకు చెప్పారు. కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలు ఇంట్లోకి ఎలా వచ్చాయనే వివరాలు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ సోదాల్లో డీఎస్పీ గోపాలకృష్ణతోపాటు సీఐలు విల్సన్, బి.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. దేవాదాయ శాఖలో కలకలం దేవాదాయశాఖలో ఈఓగా పనిచేస్తున్న చీమలకొండ సాయిబాబు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించడం ఆ శాఖలో కలకలం రేపింది. సోమవారం వేకువజాము నుంచి తణుకు, భీమవరం, రేలంగి ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాలు ఆ శాఖ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి. -
గదుల ముందస్తు బుకింగ్ రద్దు చేస్తే రిఫండ్
-
గదుల ముందస్తు బుకింగ్ రద్దు చేస్తే రిఫండ్
- టీటీడీ ఈవో సింఘాల్ వెల్లడి - కంపార్ట్మెంట్లలో ఉచిత ఫోన్, హెల్ప్‌డెస్క్ సౌకర్యం సాక్షి, తిరుమల: ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకున్న గదులు తిరిగి రద్దు చేసుకుంటే ఆ సొమ్మును రిఫండ్ చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. గది పొందిన తర్వాత కూడా నిర్ణీత సమయాని కంటే ముందుగా ఖాళీ చేసినా కొంత నగదు తిరిగి చెల్లిస్తామని శుక్రవారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ తర్వాత జూలై నుంచి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు తమ బంధువులతో మాట్లాడేందుకు వీలుగా ఉచితంగా ఫోన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి, ప్రతి కంపార్ట్‌మెంట్‌లోనూ జూన్ నెలాఖరులోగా ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. లక్కీడిప్ పద్ధతిలో ఆర్జిత సేవాటికెట్లు సెప్టెంబర్‌కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 16 ఉదయం 11 గంటల నుంచి లక్కీడిప్ పద్ధతిలో కేటాయిస్తామని ఈవో తెలిపారు. ఈ కొత్త విధానంలో మొదటి మూడు రోజులపాటు భక్తులు కోరుకున్న సేవా టికెట్ల కోసం నమోదు చేసుకుంటారని, ఆ తర్వాత కంప్యూటర్ ర్యాండమ్ విధానంలో లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తామన్నారు. యాగఫలంతో విస్తారంగా వర్షాలు.. తిరుమలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన కారీరిష్టియాగం, వరుణజపం ఫలితంగా వర్షాలు విస్తారంగా కురిసి దేశం, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని టీటీడీ ఈవో సింఘాల్ ఆకాంక్షించారు. శుక్రవారం పారువేట మండపం, వరాహస్వామి ఆలయాల్లో పూర్ణాహుతి కార్యక్రమంతో వరుణయాగం ముగిసింది. వరుణదేవుని అనుగ్రహం కోసం ఈ యాగం నిర్వహించామని, తద్వారా దేశంలో సాగునీరు, తాగునీటి ఇబ్బందులు తొలగి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ.. కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి ఆశీస్సులతో సుమారు 30 మంది రుత్వికులు ఈ యాగం నిర్వహించారన్నారు. -
టీటీడీ ఈవోగా ఏకే సింఘాల్
సాక్షి, తిరుమల: టీటీడీ నూతన ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10.56కు తిరుమల ఆలయం లోని రంగనాయకుల మండ పంలో బదిలీ అయిన ఈవో డి.సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల విరాళం ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఏపీ ఐఏఎస్‌లలో ముసలం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ కేడర్ అధికారులు రెండు వర్గాలుగా చీలి పోయారు. రాష్ట్రంలోని వివిధ కేడర్లకు చెందిన ఐఏఎస్‌ల బదిలీలు జరగనుండటంతో కొన్ని పోస్టులను తమకు ఇవ్వాలంటే.. తమకే ఇవ్వాలని ఉత్తరాది, దక్షిణాదికి చెందిన అధికారులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) ఈవో పోస్టింగ్ కోసం ఉత్తరాది, దక్షిణాది అధికారుల మధ్య తీవ్ర పోటి నెలకొన్నట్లు తెలిసింది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ఏకే సింఘల్ టీటీడీ ఈవో పోస్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఈ చిచ్చు రాజుకుంది. ఉత్తరాది వ్యక్తయిన సింఘల్‌కు టీటీడీ ఈవో పోస్టు ఇవ్వొద్దని, ఈవో పోస్టుకు తన పేరును పరిశీలించాలని జవహర్‌రెడ్డి కోరినట్లు తెలిసింది. కొందరు ముఖ్య అధికారులు ఏకే సింఘల్‌కు మద్దతిస్తున్నారంటూ జవహర్ రెడ్డి అభ్యంతరం కూడా వ్యక్తం చేశారని సమాచారం. ఇదిలావుండగా.. ఈవో పోస్టుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. -
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి జూలై 1 నుంచి 31వ తేదీ వరకు మొత్తం 58,067 టికెట్లు విడుదల చేసినట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో వెల్లడించిన టికెట్లలో.. సుప్రభాతం 6,542, అర్చన 120, తోమాల 120, విశేషపూజ 1,875, అష్టదళ పాదపద్మారాధన సేవ 60, నిజపాద దర్శనం 1500, కల్యాణోత్సవం 11,250, వసంతోత్సవం 12,900, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,450, సహస్రదీపాలంకార సేవ 14,250, ఊంజల్‌సేవ 3,000 టికెట్లు ఉన్నాయి. 2016–2017 ఆర్థిక సంవత్సరంలో 2.66 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకలు రూ.1,038 కోట్లు, ఈ–హుండీ ద్వారా రూ.15.64 కోట్లు, లడ్డూలు 10.43 కోట్లు, 2.48 కోట్ల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామన్నారు. తిరుమల ఆలయంలో గర్భాలయ మూలమూర్తికి నిర్వహించే అర్చన, తోమాల సేవలకు సంబంధించి ఇంటెర్నెట్ కోటాలోని 120 టికెట్లను కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. ఈనెల 14వ తేదీ తమిళ కొత్త సంవత్సరం ఉగాది పర్వదినం నుంచి ఎస్వీబీసీ తమిళ చానెల్–2 పూర్తి స్థాయిలో ప్రసారాలు సాగిస్తామన్నారు. అంతర్జాతీయ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా టీటీడీ ట్రస్టులకు విరాళాలు సమర్పించేందుకు అనువుగా మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. టీటీడీ ఆరంభించిన గోవిందా మొబైల్ యాప్ నుంచి హుండీ, ఈ–డొనేషన్, రూ.300 టికెట్లకు మంచి స్పందన లభిస్తోందన్నారు. -
సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో ఆహ్వానం
అమరావతి: ఈ నెల 10వ తేదీన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టీటీడీ ఈవో సాంబశివరావు ఆహ్వానించారు. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళిన ఈవో సీఎంను కలిసి ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవానికి హాజరుకావాలని కోరారు. శ్రీరామనవమి బ్రహోత్సవాలలో భాగంగా రాష్ట్రంలో పురాతన ప్రసిద్ధ రామ మందిరమైన ఒంటిమిట్ట దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణానికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు ఈవో తెలిపారు. -
టీటీడీ యాప్ ప్రారంభం
ఇకపై మొబైల్‌ఫోన్ నుంచే టీటీడీ సేవలు: ఈవో సాంబశివరావు సాక్షి, తిరుమల: మొబైల్ ఫోన్ నుంచే తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు, గదుల బుకింగ్, ఈ–హుండీ, ఈ–డొనేషన్ సౌకర్యాలు పొందేలా టీటీడీ మొబైల్యాప్ రూపొందించింది. ఉగాది సందర్భంగా తిరు మల ఆలయం వద్ద బుధవారం ‘గోవింద తిరుమల తిరుపతి దేవస్థానమ్స్’ పేరుతో కొత్త యాప్‌ను టీటీడీ ఈవో డాక్టర్ దొండ పాటి సాంబశివరావు ప్రారంభించారు. ఈవో మాట్లాడుతూ.. ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌తో ఇప్పటివరకు 1.30 కోట్ల మంది శ్రీవారి దర్శనం చేసుకు న్నట్లు వివరించారు. ఐటీ సంస్థ టీసీఎస్ సహకారంతో మొబైల్ యాప్ రూపొందించి నట్లు తెలిపారు. ఇకపై భక్తులు శరవేగంగా, సులభంగా ఎక్కడి నుంచైనా యాప్ సేవలు పొందవచ్చన్నారు. ప్రస్తుతానికి ఈ–హుండీ, ఈ–డొనేషన్, రూ.300 దర్శన టికెట్ల బుకింగ్, గదుల బుకింగ్ సదుపాయాలు ఉన్నాయని, త్వరలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గూగుల్ స్టోర్, టీటీడీ వెబ్సైట్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌కున్న 33 లక్షల మంది యూజర్లు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. టీటీడీ ఆన్లైన్ సేవలు భేష్: సుధానారాయణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవ స్థాపకులు సుధానారాయణమూర్తి టీటీడీ ఐటీ సేవల్ని అభినందించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా టీటీడీ శ్రీవారి భక్తులకు మరింత చేరువైందన్నారు. భక్తులు కూడా సులభతరంగా టీటీడీ సేవలు పొందవచ్చన్నారు. టీటీడీ యాప్‌ను ఈ ఆంగ్ల అక్షరాలతో "GOVINDA TIR UMALA TIRUPATI DEVASTHANAMS"డౌన్లోడ్ చేసుకోవచ్చు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయం లో బుధవారం ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ఉదయం 7 నుంచి 9 గంటల వర కు బంగారు వాకిలిలో ఆస్థానం నిర్వహిం చారు. సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి, మరోపీఠంపై విష్వక్సేనులవారిని వేంచేపు చేసి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పెద్ద జీయర్, చినజీయర్, టీటీడీ ఈవో సాంబ శివరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమ ర్పించారు. శాస్త్రోక్తంగా ఆస్థాన కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు. ఆలయ మహ ద్వారం నుంచి గర్భాలయం వరకు 60వేల కట్ పుష్పాలు, 8 టన్నుల సంప్రదాయ పుష్పాలతో చేపట్టిన ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పుష్ప కలశం, నవధాన్యాలతో శ్రీవేంకటేశ్వరుడు, ఆలయం వెలుపల పుష్పగజేంద్రుడు, పండ్ల ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
తిరుమల వీఐపీ దర్శనాల్లో మార్పులు
-
తిరుమల వీఐపీ దర్శనాల్లో మార్పులు
తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తూ టీటీడీ పాలక మండలి నిర్లయించింది. వీఐపీ దర్శనాల్లో మూడో కేటగిరిని తొలిగించామని, ఇక మెదటి రెండు కేటగిరిలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో డి.సాంబశివరావు సోమవారం మీడియాకు తెలిపారు. ఈ నిబంధన ఏప్రిల్ 7 నుంచి 10 వారాలపాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు. శుక్ర, శని వారల్లో వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలు రద్దు చేశామని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో రద్దీని బట్టి మార్పులు చేస్తామని తెలిపారు. వకులమాత అతిథి భవన నిర్మాణానికి రూ.39 కోట్లు కేటాంయించామని, రాయచోటి, అప్పలాయగుంటలో రూ.4.5 కోట్లతో కళ్యాణ మండపాలు నిర్మించనున్నట్లు ఈవో తెలిపారు. -
మళ్లీ తెరపైకి లడ్డూ ధరల పెంపు అంశం
నేడు టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చ సాక్షి, తిరుమల: తిరుమలేశుని ఆర్జిత సేవలు, వీఐపీ టికెట్లు, లడ్డూ ధరల పెంపు, కాటేజీల అద్దెలు పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సోమవారం(నేడు) జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు. ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు కూడా చేశారు. అలాగే 29వ తేదీ ఉగాది పర్వదినం సందర్భంగా సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం రద్దు చేశారు. తెల్లవారుజామున జరిగే తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. -
రామా.. ఎంత అపచారం!
మూలవరులను తాకిన భక్తులు భద్రాచలం: భద్రాచలం రామాలయంలో అపచారం జరిగింది. సోమవారం సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు భక్తులు నేరుగా గర్భగుడిలోని మూలవరుల వద్దకు వెళ్లి, స్వామి మూర్తులను తాకినట్లుగా తెలిసింది. గర్భగుడిలోని మూలవరుల వద్దకు వెళ్లకూడదనే విషయం తెలియని సదరు భక్తులు, స్వామి సేవలో తరించాలనే అలా చేసి ఉంటారని ఆలయన అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో భద్రాద్రి ఆలయంలో ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఆ సమయంలో విధులు నిర్వహించే అర్చకులు అక్కడ లేకపోవడం గమనార్హం. విషయాన్ని కొంతమంది భక్తులు ఈవో రమేష్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అర్చకులు, సిబ్బందికి మెమోలు జారీ చేస్తామని ఈవో తెలిపారు. -
అక్రమార్కులకు ఎంపీ మాగంటి వత్తాసు
► దేవస్థానం ప్రహరీ కూల్చివేయాలని హుకుం ► కుదరదన్న ఈవో కొండలరావు ► ఎండోమెంటు జేసీకి ఎంపీ ఫోన్ కొల్లేటికోట (కైకలూరు): ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధి ఆయన. అమ్మ దర్శనానికి వస్తున్నా భక్తుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్న అక్రమార్కులను అరికట్టాల్సింది పోయి, దోచుకోవడానికి దారి మార్గం కోసం ఎదురుచూస్తున్న వారికి టీడీపీ ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) వత్తాసు పలకడం విమర్శలకు దారితీసింది. వివరాలు.. జిల్లాలో ప్రసిద్ధి చెందిన కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర సోమవారం ప్రారంభమైంది. ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు హాజరయ్యారు. ఎంపీ వద్దకు సమీపంలో ఇద్దరు దుకాణదారులు మా వ్యాపారాలకు అడ్డుగా దేవస్థాన ప్రహరీ ఉందని, దారి మార్గం కల్పించాలని కోరారు. ముందుగా సిద్ధం చేసుకున్న యాత్రికులను తీసుకొచ్చి ప్రహరీకి గోడ ఉంటే బాగుండదని చెప్పించారు. దీంతో ఎంపీ దేవస్థానం ఈవో ఆకుల కొండలరావును పిలిచారు. జాతర 15 రోజులు ప్రహరీ కూల్చి దారి ఇవ్వాలన్నారు. ఇది నా పరిధి కాదని, జాయింట్ కమిషనరు అనుమతులు ఉండాలన్నారు. ఎంపీ చెప్పిన చేయరా? అంటూ దేవాదాయశాఖ జాయింట్ కమిషనరు చంద్రశేఖర్ ఆజాద్‌కు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ తీయలేదు. సమీపంలోని కొందరు ఈవో సెల్ నుంచి ఫోన్ చేయండంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. చివరకు ఫోన్ కలవకపోవడంతో మరో సారి మాట్లాడుదామని ఎంపీ వెళ్లిపోయారు. ప్రహరీ కథ ఇది..: పురాతన కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం 2.10 ఎకరాల్లో విస్తరించి ఉంది. సుమారు ఎకరం స్థలం ఆక్రమణలకు గురయ్యింది. ప్రతి ఆదివారం వచ్చే భక్తులను సమీప కొందరు దుకాణదారులు కొల్లేరు జలగల మాదిరిగా పీడిస్తూ అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. దీంతో సర్వే చేయించి రూ.14 లక్షల 50వేల నిధులతో దేవస్థానం చుట్టూ ప్రహరీ నిర్మించింది. వెనుక నడక మార్గానికి కొంత వదిలారు. ప్రహరీ వలన అమ్మ దర్శనానికి వచ్చే భక్తులు అక్రమ వసూలు బారి నుంచి తప్పించుకున్నారు. ఇప్పటి వరకు అడ్డేలేదని భావించిన వారికి ఇది మింగుడు పడలేదు. స్థానిక టీడీపీ నేతను ఆశ్రయించారు. ఆయన వచ్చి హడావుడి చేశారు. అది బెడిసి కొట్టడంతో ఇటీవల ఈవోను బెదిరించేందుకు దుకాణదారులు ప్రయత్నించారు. దీంతో ఈవో కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గుమ్మనంగా ఉన్నఆక్రమణదారులు ఎంపీ మాగంటి రాగానే రెచ్చిపోయారు. కేవలం డబ్బులు దండుకోవడానికి అలవాటు పడిన వ్యాపారులకు ఎంపీ కొమ్ముకాస్తారా? లేదా భక్తుల దోపిడీని అడ్డుకుని ప్రహరీని కాపాడతారా? అని భక్తులు, దేవాలయ సిబ్బంది ఆసక్తిగా చూస్తున్నారు. -
2,858 కోట్లతో టీటీడీ బడ్జెట్
2017– 18 వార్షిక బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2017–2018 ఆర్థిక సంవత్సరానికి రూ.2,858.48 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఆమోదించింది. 2016–17లో టీటీడీ రూ.2,678 కోట్లతో బడ్జెట్ ఆమోదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకలు రూ.1010 కోట్లు రావచ్చని అంచనా వేయగా రూ.1,110 కోట్లకు పెరిగాయని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు తెలిపారు. మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో బడ్జెట్‌తోపాటు పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్టు చైర్మన్, ఈవో ప్రకటించారు. శ్రీవారికి రూ.11 కోట్లతో కాసుల హారం తిరుమల శ్రీవారికి రూ.11 కోట్లతో 30 కిలోల బంగారు సహస్ర కాసుల హారం తయారు చేయాలని నిర్ణయించారు. 2012లో అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు రామలింగరాజు కానుకగా ఇచ్చిన రూ.10.91 కోట్ల నగదును ఈ హారం తయారీకి వాడనున్నట్టు చైర్మన్, ఈవో వెల్లడించారు. తిరుమలలో రూ.5కోట్లతో సర్వదర్శనం భక్తులకు కొత్త కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానించారు. 2017–18 ఆదాయ అంచనా ► 2017–18 ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారా రూ.1,110 కోట్లు‡రావచ్చని అంచనా వేశారు. ► వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న సుమారు రూ.10వేల కోట్లపై వడ్డీ రూ.807.72 కోట్లు రావచ్చని అంచనా వేశారు. ► ఇక రూ.500 వీఐపీ దర్శనం రూ.28 కోట్లు, రూ.50 సుదర్శనం రూ.3కోట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విక్రయం రూ.225 కోట్లు వసూలు కావచ్చని భావిస్తున్నారు. ► ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.55 కోట్లు, లడ్డూ, ఇతర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.165 కోట్లు, గదుల అద్దె వసూళ్ల ద్వారా రూ.124 కోట్లు రావచ్చని అంచనావేశారు. ► కల్యాణకట్టలో భక్తులు సమర్పించే తలనీలాల విక్రయం ద్వారా రూ.100 కోట్లు, బంగారు డాలర్ల విక్రయం వల్ల రూ.20 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్లు, ఉద్యోగుల రుణాలపై రూ.56.51 కోట్లు, దుకాణాలు, జనతా హోటళ్ల అద్దెలు, టోల్గేట్ ప్రవేశ రుసుం, పుస్తక విక్రయం, ఇతర ఆదాయాల ద్వారా 164.25 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. 2017–2018 వ్యయాల అంచనా ► ఉద్యోగుల జీతాల కోసం రూ.575 కోట్లు, పెట్టుబ డులు రూ.533.21 కోట్లు, సరుకుల కొనుగోళ్లు రూ.471.85 కోట్లు, పెన్షన్ ట్రస్టుకు రూ.185 కోట్లు, పెన్షన్ ఫండ్ రూ.75 కోట్లు కేటాయించారు. ► గ్రాంట్లు రూ.192 కోట్లు, స్థిరాస్తులు, ఔట్ సోర్సింగ్ ఖర్చులు రూ.253.25 కోట్లు, విద్యుత్ చార్జీలు రూ.52 కోట్లు, స్థిరాస్తుల నిర్వహణ ఖర్చులు రూ.85.70 కోట్లు, ఉద్యోగుల బ్రహ్మోత్సవ బహుమానం, ఇతర ఖర్చులు రూ.26 కోట్లు, ప్రచారానికి రూ.8.5 కోట్లు, ఇతర చిల్లర ఖర్చులు రూ.149.46 కోట్లు కేటాయించారు. -
ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఈవో
మంచిర్యాల: లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గీతా భవన్లో గురువారం వెలుగుచూసింది. పీఆర్డీ కార్యాలయంలో ఈవోగా పని చేస్తున్న నజీమొద్దిన్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 16 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈవోను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. -
శ్రీవారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు
దేవరపల్లి : ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 18 రోజులకు గాను వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.1,03,06,383 లభించినట్టు ఆలయ కార్యనిర్వాహణా««ధికారి వేండ్ర త్రినాథరావు తెలిపారు. 239 గ్రాముల బంగారం, 3 కేజీల 152 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీలు లభించినట్టు చెప్పారు. రూ1,15,116 విరాళం అందజేత చిన వెంకన్న ఆలయానికి మంగళవారం కామవరపుకోటకు చెందిన దాత గంటా బులిస్వామి కుటుంబ సభ్యులు 1,15,116 రూపాయలను అన్నదాన విరాళంగా అందజేశారు. విరాళాన్ని దాతలు ఈవో వేండ్ర త్రినాథరావుకు అందించారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదాన పథకానికి నగరానికి చెందిన భక్తులు విరాళం అందచేశారు. పటమటకు చెందిన కోనేరు మురళీకృష్ణ, విజయలక్ష్మి దంపతులు భోగి పండుగను పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చారు. వారు నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ల విరాళాన్ని ఈవో సూర్యకుమారికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి, ప్రసాదాలను అందజేశారు. -
పర్వదినాలకు టీటీడీ సిద్ధం
- రేపు కొత్త సంవత్సరం,8న ముక్కోటి ఏకాదశి, 9న ద్వాదశి - పకడ్బందీ ఏర్పాట్లు.. సాక్షి, తిరుమల: నూతన ఆంగ్ల సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు టీటీడీ సిద్ధమైంది. ఈ మూడు పర్వదినాల్లోనూ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నారాయణగిరి ఉద్యానవనంలో 16 తాత్కాలిక షెడ్లు నిర్మించారు. క్యూలోని భక్తులపై ఎండ, వాన, మంచు పడకుండా రేకులు అమర్చారు. ఈదురు గాలుల నుంచి రక్షించుకునేందుకు వీలుగా పక్క భాగాల్లోనూ రేకులు అమర్చారు. ఈ పర్వదినాల్లో తొలుత మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలోని 54 కంపార్ట్మెంట్లలోకి భక్తులను అనుమతిస్తారు. అవి నిండిన తర్వాత తాత్కాలిక షెడ్లలోకి అనుమతిస్తారు. ఈ క్యూల వద్దే మరుగుదొడ్లు, తాగునీరు, అన్నప్రసాదాల కేంద్రాలు, షెడ్లు అమర్చారు. ఆరు మందికే వీఐపీ దర్శనం కొత్త సంవత్సరం, 8న వైకుంఠ ఏకాదశి, 9న ద్వాదశిలో స్వామి దర్శనం కోసం వచ్చే వీఐపీల్లో ఒకరికి 6 టికెట్లు మాత్రమే ఇవ్వనున్నారు. వేకువజామున 1 నుంచి 3 గంటల్లోపే ప్రముఖులకు దర్శనం పూర్తి చేయాలని టీటీడీ నిర్ణయించింది. కేటాయించిన టికెట్లను బట్టి అరగంట అటుఇటుగా క్యూలైను అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీలు నియమించారు. 4 గంటల్లోపే సామాన్యులకు దర్శనం పర్వదినాల్లో వేకువజాము 4 గంటల్లోపే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఏకాదశిలో మాత్రం ఇతర దర్శనాలు లేకుండానే నిర్విరామంగా సర్వదర్శనం మాత్రమే అమలు చేయనున్నారు. గతేడాది అనుసరించిన విధానాన్నే ఈసారి కూడా అమలుచేయాలని ఈవో, జేఈవో నిర్ణయిం చారు. పండుగ వేళల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ రిసెప్షన్ అధికారులు వేల సంఖ్యలో గదులు ముందస్తుగానే రిజర్వు చేశారు. అయితే, సామాన్య భక్తుల రద్దీని బట్టి సామాన్యులకే ఎక్కువ సంఖ్యలో గదులు ఇవ్వాలని ఈవో సాంబశివరావు అధికారులను ఆదేశించారు. -
దుర్గమ్మను దర్శించుకున్న చైనా బృందం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లను చైనా బృందం సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మేళతాళాలు, మంగళవాయిద్యాలతో సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. అనంతరం మల్లేశ్వరాలయం , చండీయాగం విశేషాలు, అమ్మవారి ప్రసాదాల గురించి చైనా బృందానికి ఈవో సూర్యకుమారి వివరించారు. చైనా బృందం అమ్మవారి ఆలయ పరిసరాలను పరిశీలిస్తుండటంపై భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. -
ఈవోకు మంత్రి భార్య వేధింపులు
ఆలయ సిబ్బంది ఎదుట శ్రీకాళహస్తి ఈవోపై విరుచుకుపడ్డ మంత్రి సతీమణి మనస్తాపానికి గురై సెలవుపై వెళ్లే యోచనలో ఈవో భ్రమరాంబ శ్రీ కాళహస్తీశ్వరాలయ ఈవో భ్రమరాంబపై మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి మరోసారి అక్కసు ప్రదర్శించారు. బదిలీపై వెళ్లిపోండంటూ తీవ్రస్థాయిలో హుకుం జారీచేశారని తెలిసింది. సోమవారం ఆలయ పరిపాలన భవనానికి వచ్చిన మంత్రి సతీమణి బృందమ్మ ఈవో భ్రమరాంబపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఈవో తీవ్ర మనస్తాపానికి గురై సెలవుపై వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి స్థానిక టీడీపీ నాయకులు చెప్పినట్లు నడుచుకోలేదని మంత్రి సతీమణి ఈవోపై వేధింపులకు దిగారని తెలిసింది. గత ఏడాది అక్టోబర్ 8 వతేదీన భ్రమరాంబ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. అతి తక్కువ సమయంలోనే పాలనాదక్షతను ప్రదర్శించి గత ఏడాది బ్రహ్మోత్సవాలను వైభవంగా జరిపించి సామాన్య భక్తుల ప్రశంసలు అందుకున్నారు. అయితే అప్పటికే ఆలయంలో నిత్యం తనిఖీలు చేపడుతూ అధికారులు, సిబ్బందిని హడలెత్తిస్తున్న మంత్రి సతీమణి బృందమ్మ పెత్తనానికి అడ్డుకట్ట వేశారు. ‘‘ఆలయంలో పాలనావైఫల్యాలపై మాకు సూచనలివ్వండి గానీ మీరే స్వయంగా తనిఖీలు చేయవద్దు ’’ అంటూ మంత్రి సతీమణికి ఈవో స్పష్టం చేశారు. దీంతో అప్పటినుంచి ఆలయ పాలనలో మంత్రి సతీమణి పెత్తనానికి బ్రేక్ పడినట్లయింది. మాస్టర్‌ప్లాన్ లో టీడీపీ నేతలకు అనుకూలంగా ఈవో వ్యవహరించలేదని అక్కసుతోనే పరోక్ష వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయానికి వచ్చిన బృందమ్మ చైర్మన్ చాంబర్‌కు ఈవోను పిలిపించుకుని బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది ఎదుటే ఆమెను తీవ్రస్థాయిలో మందలించారని సమాచారం. ‘‘మీరు స్వచ్ఛందంగా బదిలీపై వెళ్లకుంటే మేమే బలవంతంగా సాగనంపుతాం’’ అంటూ బెదిరింపుల పర్వానికి దిగారని తెలిసింది. దీని వెనుక తమ అనుయాయుల స్వప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో ఉన్న ఓ టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన అతిథిగృహాలు గాలిగోపురానికి అతి సమీపంలో ఉండటం, మాస్టర్‌ప్లాన్ లో దానిని మినహాయించడానికి ఈవో ససేమిరా అనడంతోనే పరోక్షంగా ఈవోను టార్గెట్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనధికార వ్యక్తుల పెత్తనంపై విసిగిపోయిన ఈవో భ్రమరాంబ సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆలయంలో ఓవైపు పెద్దఎత్తున మాస్టర్‌ప్లాన్ పనులు జరుగుతున్నాయి. జనవరి ఆరో తేదీ నుంచి మహాకుంభాభిషేకం, ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో ఆలయ కార్యనిర్వహణాధికారిపై మంత్రి సతీమణి ఆధిపత్యం చెలాయించేందుకు అనధికారిక హోదాలో కర్రపెత్తనం చేస్తున్నారు. ఆలయ పెద్దలపై ఆమె అజమాయిషీని ప్రదర్శించడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ అధికారిక హోదాలో ఆమె ఆలయ పరిపాలనలో జోక్యం చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. శ్రీకాళహస్తిలో కూడా మంత్రి కుటుంబీకుల ఆగడాలు శ్రుతిమించాయని పట్టణంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తాజా సంఘటన అధికారులలో గుబులు రేపుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రంలో నిర్వహించే మహత్కార్యాలను సమిష్టిగా సమన్వయంతో నిర్వహించాల్సిన తరుణం సమీపిస్తున్న వేళ ఈవోపై ఆలయంతో ఏమాత్రం సంబంధం లేని మంత్రి సతీమణి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. -
19 రోజులు.. రూ.1.35 కోట్లు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించా రు. ఆలయ ఆవరణలో ఈవో వేండ్ర త్రినాథరావు పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. 19 రోజులకు నగదు రూపంలో రూ. 1,35,45,752, కానుకల రూపంలో 371 గ్రాముల బంగారం, 4.236 కిలోల వెండి లభించినట్టు ఈవో తెలిపారు. ఓ విదేశీ భక్తుడు అమెరికన్ కరెన్సీ నోట్ల కట్టను హుండీలో సమర్పించాడని, దీంతో పాటు ఇతర దేశాల కరెన్సీ నోట్లు లభించాయని చెప్పారు. -
దుర్గా దివ్య దర్శన్ యాత్ర
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : విజయవాడ–గుంటూరు (కాజా) మధ్య ఆలయాలను సందర్శించేలా దుర్గగుడి దేవస్థానం రూపొందించిన దుర్గా దివ్య దర్శన్ యాత్రను దుర్గగుడి ఈవో సూర్యకుమారి ఆదివారం ప్రారంభించారు. తొలుత టోల్‌గేటు సమీపంలోని కామధేను అమ్మవారి వద్ద యాత్ర బస్సుకు దుర్గగుడి ఈవో పూజలు నిర్వహించారు. అనంతరం యాత్రికులతో కలిసి ఈవో సూర్యకుమారి బస్సులో కొండపై అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారి దర్శించుకున్న యాత్రికులకు ప్రసాదాలను అందజేశారు. తొలి రోజున 16 సిట్టింగ్ బస్సు ఏర్పాటు చేయగా 11 మంది యాత్రలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దర్శనం అనంతరం పొలకంపాడు శివాలయం, తాడేపల్లిలోని నక్షత్రవన సందర్శనం, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సీతానగరం మద్వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీకృష్ణ మందిర సందర్శనంతో యాత్ర ముగిసింది. -
అనర్హులకు ఈఓ పోస్టులు!
- దేవాదాయశాఖలో తెరవెనుక బాగోతం - కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడితో కదిలిన ఫైలు - సీనియర్ ఈఓలను మార్చి అస్మదీయులకు కేటాయించే యత్నం - ప్రధాన దేవాలయాల్లో సాగుతున్న తంతు సాక్షి, హైదరాబాద్: ప్రధాన దేవాలయాలకు అర్హత లేని అధికారులను కార్యనిర్వహణాధికారులుగా కూర్చోబెట్టేందుకు దేవాదాయశాఖలో పావులు కదులుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడి తో ఫైలు చకచకా కదిలి.. ఇప్పుడు దేవాదాయ మంత్రి వద్దకు చేరింది. దేవాదాయశాఖను ప్రక్షాళన చేసేందుకు దేవాదాయ మంత్రి చైర్మన్‌గా ఐదుగురు మంత్రులతో ఏర్పడ్డ మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫారసులు సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఈ వ్యవహారానికి తెరలేచింది. ఆదాయం ఆధారంగా దేవాలయాల స్థాయి పెంచాలని ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం, నిర్మల్ జిల్లా బాసర ఆలయాలకు అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) స్థాయి అధికారులు ఈఓలుగా ఉండాలి. ప్రస్తుతం ఏసీ పదోన్నతికి సిద్ధంగా ఉన్న అధికారులు ఇక్కడ ఈఓలుగా ఉన్నారు. ఈ దశలో సాధారణ సూపరింటెండెంట్లకు ఆ పోస్టులు కట్టబెట్టేందుకు కొందరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. రకరకాల ఆరోపణలు, కేసుల్లో ఇరుక్కుని ఉన్న సూపరింటెండెంట్లకు ఇన్చార్జి ఈవోలుగా కూర్చోబెట్టాలని వారు ఒత్తిడి ప్రారంభించారు. దీంతో అధికారులు ఆ ఫైల్‌ను దేవాదాయ మంత్రి వద్దకు పంపినట్టు తెలిసింది. ఈ ఇద్దరు సూపరింటెండెంట్లు నేరుగా ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు కాదు, అలాంటి వారిని ఈఓలుగా నియమించడం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా ఎమ్మెల్యేల ఒత్తిడితో ఫైలు చకచకా కదిలింది. వీరికి పోస్టింగ్స్ ఇస్తే మరికొందరు సూపరింటెండెంట్లు కూడా దొడ్డిదారిన ఈఓ పోస్టులు కొట్టేసేందుకు సిద్ధంగా ఉన్నారు. -
నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తురాలు బుధవారం రూ.1,00,116ను విరాళంగా అందజేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడేనికి చెందిన ఉజ్జిన రాధారూప విరాళం మొత్తాన్ని నిత్యాన్నదాన సదనంలో జమచేశారు. దాతకు ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు విరాళం బాండ్‌ను, ప్రసాదాలను అందించి అభినందించారు. -
నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.5 లక్షల విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఇద్దరు భక్తులు వేర్వేరుగా శనివారం రూ.5 లక్షల విరాళం అందించారు. పాలకొల్లుకు చెందిన అడ్డాల వెంకట సత్యనారాయణ రూ.4 లక్షలు తన కుటుంబసభ్యుల పేరున అందజేశారు. పెనుగొండకు చెందిన పిల్లి సత్తిరాజు, లక్ష్మీ శైలజ దంపతులు వారి పేరున రూ.లక్ష జమచేశారు. దాతలకు ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్లు అందజేసి అభినందించారు. -
తిరుమలలో బ్యాటరీ బస్సులు
తిరుపతి అర్బన్: తిరుమల పుణ్యక్షేత్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు త్వరలో బ్యాటరీ ద్వారా నడిచే బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. తిరుపతిలోని టీటీడీ రవాణా విభాగంలో గురువారం నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీటీడీ రవాణాశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే తిరుమల, తిరుపతిలో యాత్రికుల సౌకర్యార్థం ఉచిత బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అయితే తిరుమలను పూర్తి కాలుష్య రహితంగా మార్చే క్రమంలో రెండు బ్యాటరీ(ఎలక్ట్రికల్ ఆధారిత) బస్సులను ప్రయోగాత్మకంగా నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ డ్రైవర్లు కూడా తమ నైపుణ్యం, అనుభవంతో తిరుమల ఘాట్‌రోడ్డును ప్రమాదరహితంగా మార్పుచేసి అందరి మన్ననలు పొందుతున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన డ్రైవర్లకు సూచించారు. -
వైభవంగా రథోత్సవం.. రేపు శ్రీవారికి చక్రస్నానం
తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో 8వ రోజు సోమవారం ఉదయం 7 గంటలకు రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం శ్రీవారు మల్లయప్పస్వామిగా అలంకృతుడై బ్రహ్మారధం పై మాడ వీధుల్లో ఊరేగారు. స్వామిని కనులారా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలతో అందరినీ అలరింపజేశారు. రథాన్ని లాగే క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. రథం తిరుగుతున్న సమయంలో ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించారు. రేపు (మంగళవారం) ఉదయం 6 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులు సంయమనం పాటించి సహకరించాలని టీటీడీ ఈవో సాంబశివరావు కోరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పుష్కరిణి వద్ద ఈతగాళ్లను, బోటను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. -
మద్ది ఆలయానికి రూ.2.01 లక్షల విరాళం
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం ఓ భక్తుడు రూ.2,01,116 విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని జంగారెడ్డిగూడెంకు చెందిన వందనపు స్వరాజ్య లక్ష్మి జ్ఞాపకార్థం భర్త వందనపు వెంకటేశ్వరరావు ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజులకు అందజేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు పాల్గొన్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రంలో ఈనెల 11 నుంచి 18 వరకు జరగనున్న శ్రీవారి ఆశ్వీయుజమాస బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను దేవస్థానం శోభాయమానంగా తీర్చిదిద్దుతోంది. ఆలయ గోపురాలకు విద్యుద్దీప అలంకరణలు, ప్రాకారాలకు రంగులు వేయడం వంటి పనులను సిబ్బంది శరవేగంగా నిర్వర్తిస్తున్నారు. ఆలయ ప్రధాన కూడలిలో 60 అడుగుల ద్వారకాధీశుని భారీ విద్యుత్ కటౌట్‌ను నిర్మిస్తున్నారు. శేషాచలకొండపై దేవతామూర్తుల భారీ విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రంలోని పలు ప్రధాన కూడళ్లలోను, భీమడోలు, గుండుగొలనులోను బ్రహ్మోత్సవాలను తెలిపే ఆర్చిగేట్లును నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 11న స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారునిగాను, పెండ్లికుమార్తెలుగాను ముస్తాబు చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతామని ఆలయ ఈవో వేండ్ర త్రినా«థరావు తెలిపారు. 15న రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని, మరుసటి రోజు రాత్రి శ్రీవారి రధోత్సవాన్ని క్షేత్ర పురవీధుల్లో జరుపుతామని వివరించారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి – ఈనెల 3న శ్రీవారికి సీఎం పట్టువస్రాల సమర్పణ – ఉత్సవాల్లో రెండు ఘాట్‌రోడ్లలో వాహనాల అనుమతి సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేశామని టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథి గృహంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్‌తో కలసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మీడియాకు వెల్లడించారు. అక్టోబరు 1 నుంచి 12వ తేదీ వరకు తిరుమల రెండు ఘాట్‌రోడ్లలో 24 గంటలూ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు. భక్తుల దర్శనార్థం 7వ తేదీన గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే నిర్వహిస్తామన్నారు. వాహన మండపం నుండి హథీరాంజీ మఠం వరకు ఉండే సుమారు 25 వేల మంది భక్తులను గరుడ సేవను దర్శించుకున్న తర్వాత వారిని వెలుపలకు పంపి అదే స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుమన్నారు. వాహన సేవలో హారతి కూడళ్ల వద్ద రెట్టింపు స్థాయిలో భక్తులను అనుమతించి ఉత్సవర్ల దర్శనం కల్పిస్తామన్నారు. గరుడ సేవలో శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని 24 గంటలూ తెరిచి ఉంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. రోజుకు 2 వేల ఆర్టీసీ బస్సుట్రిప్పులు, గరుడసేవలో 3800 ట్రిప్పులు తిరిగే ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9 నుండి అర్థరాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు వడ్డించే ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తుల ఫిర్యాదులు, సూచనల కోసం కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో టోల్‌ఫ్రీ నెంబరు 1800425111111 అందుబాటు ఉంటుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే లడ్డూలు వితరణ చేస్తామన్నారు. శ్రీవారి భక్తుల వైద్యసేవల కోసం 12 ప్రథమ చికిత్సా కేంద్రాలు , 10 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామన్నారు. సాధారణరోజుల్లో 3500 మంది పోలీసులు, గరుడ సేవలో మొత్తంగా 4700 మందిని భద్రతకు వినియోగిస్తామన్నారు. ఈనెల 3వ తేది ధ్వజారోహణం సందర్భంగా సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, అదే సందర్భంలో టీటీడీ డైరీ, క్యాలెండర్లు ఆవిష్కరిస్తారన్నారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, గడిచిన బ్రహ్మోత్సవాల అనుభవాన్ని దష్టిలో ఉంచుకుని మరింత ఉన్నతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. వాహన సేవలతోపాటు శ్రీవారి ఆలయంలో మూలవర్ల దర్శనంకోసం తరలివచ్చే భక్తులకోసం క్యూలైన్లు విస్తరించామన్నారు. సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ, భక్తుల భద్రతే ధ్యేయంగా భద్రత కల్పించామన్నారు. ఉత్సవాలకోసం రెట్టింప స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. -
నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమ శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విజయవాడకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు బుధవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన సదనంలో ఈవో వేండ్ర త్రినాథరావుకు విరాళం మొత్తాన్ని అందజేశారు. -
11 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల : శ్రీవారి ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 18 వరకు జరగనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ప్రారంభం రోజైన విజయదశమి నాడు స్వామివారిని పెండ్లికుమారునిగాను, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకరించడంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఉత్సవాల్లో భాగంగా వచ్చేనెల 12న ధ్వజారోహణను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ఈ ధ్వజారోహణను జరపడం పరిపాటి. 14న ఎదుర్కోలు ఉత్సవం, 15న చిన వెంకన్న దివ్య కల్యాణ మహోత్సవం జరపనున్నట్టు ఈవో చెప్పారు. 16న సాయంత్రం శ్రీవారి రథోత్సవం, 17న శ్రీచక్రవార్యూత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవాలు, ధ్వజ అవరోహణ జరుపుతారు. 18న రాత్రి జరుగనున్న శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈవో చెప్పారు. ఉత్సవాల రోజుల్లో ఉదయం, సాయంత్రం స్వామివారు వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆయా రోజుల్లో శ్రీవారి నిత్యార్జిత కల్యాణం, ఆర్జిత సేవలు రద్దుకానున్నాయని ఈవో తెలిపారు. -
డిప్యూటీ ఈవో పోస్టులు ఉన్నట్టా..? లేనట్టా?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖలో ప్రస్తుతం ఉన్న 56 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డి ప్యూటీ ఈవో) పోస్టులు రద్దయ్యాయా? ఈ ప్రశ్నకు విద్యా శాఖ మౌఖి కంగా లేదని సమాధానం చెబుతోంది. ప్రభుత్వానికి ఇటీవల విద్యా శాఖ ఇచ్చిన నివేదికలో మాత్రం ఈ పోస్టులను చూపించలేదు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రతి జిల్లాకు ఓ డీఈవోను నియమించేందుకు చర్యలు చేపట్టింది. దీనికి ప్రస్తుతమున్న 11 మంది డిప్యూటీ ఈవోలను ఇన్చార్జి డీఈవోలుగా నియమిస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ఇన్చార్జి డీఈవోలుగా వెళ్లిపోయాక ఖాళీ అయ్యే స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారన్న అంశాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. వాటి భర్తీ ప్రస్తావన లేకుండానే కొత్త జిల్లాల్లో డీఈవో కార్యాలయాలు, విద్యా విభాగం వివరాలను పొందుపరిచింది. దీంతో ఆయా పోస్టులను రద్దు చేస్తోందన్న ఆందోళన ఉపాధ్యాయ వర్గా ల్లో నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 డీఈవో పోస్టులుం డగా, కొత్తగా వచ్చే డిప్యూటీ ఈవోలు 11 మందిని కలిపి 23 పోస్టులవుతున్నాయి. మరో 4 పోస్టుల్లో ఏడీ లేదా డైట్ లెక్చరర్లను ఇన్చార్జి డీఈవోలుగా నియమించడం ద్వారా మొత్తం 27 జిల్లాలకు 27 మందిని డీఈవోలుగా నియమించనున్నట్లు తెలిసింది. మరోవైపు ఏజెన్సీ డీఈవో పోస్టులను రద్దు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఈ పోస్టులపై సందిగ్ధత నెలకొంది. ఉపాధ్యాయ సంఘాలు ఈ పోస్టులను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో 467 మండల విద్యాధికారి పోస్టులుండగా, 44 మంది పనిచేస్తున్నారు. మిగతా పోస్టుల్లో సీనియర్ హెడ్మాస్టర్లను ఇన్చార్జి ఎంఈవోలుగా నియమిస్తామని నివేదికలో పేర్కొంది. డిప్యూటీ ఈవో పోస్టులను రద్దు చేయొ ద్దని, ప్రస్తుత పాఠశాలల సంఖ్య పెరిగినందున ఈ పోస్టులను జిల్లాకు ఒకటి నియమించాలని పీఆర్టీయూ- తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. -
బ్రహ్మోత్సవాల్లో దాతలకే గదులు
సిఫారసులకు గదుల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్ రద్దు సాక్షి, తిరుమల: అక్టోబరు 3 నుంచి తిరుమలలో నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామని టీటీడీ ప్రజాసంబంధాల విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గదులు కావాల్సిన కాటేజీ దాతలు 5 రోజుల ముందుగానే సెల్ఫ్ డోనార్ స్లిప్పులు తిరుమలలోని రిసెప్షన్-1, ఉప కార్యనిర్వహణాధికారికి సమర్పించాలి. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రద్దీ కారణంగా 6, 7 తేదీల్లో దాతలకు కూడా గదులు కేటాయించడం లేదని తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా రద్దు : బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో గదుల అడ్వాన్స్ బుకింగ్‌ను టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో సాంబశివరావు, నిర్ణయించారు. సిఫారసు లేఖలు కూడా మంజూరు రద్దు చేశారు. సిఫారసుల్లో కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే గదులు మంజూరు చేయనున్నారు. -
మద్ది హుండీ ఆదాయం రూ.27,04,522
గుర్వాయిగూడెం (జంగారెడ్డిగూడెం రూరల్) : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. దేవాదాయశాఖ తనిఖీదారు కేవీవీ రమణ పర్యవేక్షణలో 85 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.27,04,522 నగదు, 10 గ్రాముల బంగారం, 134 గ్రాముల వెండి, 9 విదేశీ నోట్లు లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు చెప్పారు. చైర్మన్ ఇందుకూరి రంగరాజు, సభ్యులు పాల్గొన్నారు. -
మద్ది హుండీ ఆదాయం రూ.27,04,522
గుర్వాయిగూడెం (జంగారెడ్డిగూడెం రూరల్) : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. దేవాదాయశాఖ తనిఖీదారు కేవీవీ రమణ పర్యవేక్షణలో 85 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.27,04,522 నగదు, 10 గ్రాముల బంగారం, 134 గ్రాముల వెండి, 9 విదేశీ నోట్లు లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు చెప్పారు. చైర్మన్ ఇందుకూరి రంగరాజు, సభ్యులు పాల్గొన్నారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1.50 లక్షలు విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఓ భక్తుడు బుధవారం రూ.1,50,000 విరాళంగా అందజేశారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెంకు చెందిన కందుకూరి నాగరాజు విరాళం మొత్తాన్ని కందుకూరి విశ్వనాథ్ పేరున జమచేశారు. దాతను ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు అభినందించి విరాళం బాండ్ అందజేశారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు మంగళవారం ఓ భక్తుడు రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఏలూరుకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు జమ్మా రామకృష్ణ తన తల్లిదండ్రులు గంగరాజు, గంగామహాలక్ష్మి పేరున విరాళం అందజేశారు. ఆలయ అధికారులు దాతను అభినందించి విరాళం బాండ్ అందజేశారు. -
శ్రీవారి ఆర్జిత కల్యాణం టికెట్ ధర పెంపు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆర్జిత కల్యాణం టికెట్ ధరను పెంచినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు బుధవారం విలేకరులకు తెలిపారు. ఇప్పటివరకూ రూ.1,000 ఉన్న టికెట్ రుసుంను రూ.1,500కు పెంచామని, కొత్త ధర గురువారం నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం నిత్య కల్యాణం జరిపించుకునే దంపతులకు పంచె, కండువ, రవికతో పాటు ఐదు లడ్డూలు, రెండు పులిహోర ప్యాకెట్లు, ఒక శర్కర పొంగలి ప్యాకెట్ ఇస్తున్నారు. ధర పెంచిన నేపథ్యంలో వీటితో పాటు అదనంగా చీర కూడా అందిస్తామని ఈవో తెలిపారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళాల వెల్లువ
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఆదివారం విరాళాలు వెల్లువెత్తాయి. జంగారెడ్డిగూడేనికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం చిన్నం సుబ్బారావు, జగదీశ్వరి దంపతులు రూ.2,02,232ను విరాళంగా అందజేశారు. దీనిలో సుబ్బారావు పేరున రూ.1,01,116, జగదీశ్వరి తల్లిదండ్రుల పేరున రూ.1,01,116ను అందజేశారు. సుబ్బారావు కుమారుడు, కోడలు రాంబాబు, ప్రమీళకుమారి, కుమార్తె అల్లుడు అంబటి గాంధీ, నాగమణి ఉన్నారు. మచిలీపట్నంకు చెందిన డేరం రామకష్ణ శర్మ, సీతామహాలక్ష్మి దంపతులు తమ కుమార్తె శైలజ పేరున రూ.1,01,116ను అందజేశారు. దాతలకు ఈవో త్రినాథరావు విరాళం బాండ్లు అందజేశారు. -
వర్షాల కోసం మద్దిలో వరుణ జపం
జంగారెడ్డిగూడెం రూరల్ : వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో శుక్రవారం వరుణ జప పూజలు నిర్వహించారు. ఈ నెల 28 వరకు మూడు రోజుల పాటు వరుణ సూక్త పారాయణం, వారణానువాక జపం, రుద్రహోమాలు, సహస్ర ఘటాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు పాల్గొన్నారు. -
నేటినుంచి వరుణ జపాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్ర ఉపాలయం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి 28వ తేదీ వరకు వరుణ జపాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. దీనిలో భాగంగా జరుగనున్న సహస్ర ఘటాభిషేకం నిమిత్తం ఘటాలు గురువారం ఆలయానికి చేరుకున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి, రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ మూడు రోజులపాటువరుణ సూక్త పారాయణలు, వారుణానువాక జపాలు, రుద్రహోమం, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించనున్నారు. 28న సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. -
త్యాగధనుల ఫలాలు అందరికీ అందాలి
– ఇతర ధార్మిక సంస్థలకు టీటీడీ ఆదర్శంగా నిలవాలి – స్వాతంత్య్ర వేడుకల్లో టీటీడీ ఈవో తిరుపతి అర్బన్: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలనే త్యాగం చేసిన త్యాగధనుల ఫలాలు అందరికీ అందాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు కాంక్షించారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం టీటీడీ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈవో టీటీడీ భద్రతా దళాల కవాతును తిలకించి, గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలంగా వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సామాన్య భక్తులు కూడా శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనడమే గాక పారదర్శకత పెంచేందుకు వీలుగా ప్రతినెలా మొదటి శుక్రవారం వేలాది సేవా టికెట్లను ఇంటర్నెట్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. రూ.300 ప్రత్యేక దర్శనం భక్తుల కోసం ప్రత్యేక కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిందన్నారు. రెండో దశలో దివ్యదర్శనం(కాలి నడకన వచ్చే) భక్తులకు మెరుగైన వసతులతో కూడిన కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని లడ్డూ కౌంటర్ల వద్ద 2 గ్రాముల శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కాషన్ డిపాజిట్లు లేకుండా లాకర్ల వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చేయూత ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు, ఆధ్యాత్మిక చింతన పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భజన మండళ్ల సంఖ్యను పెంచడం ద్వారా నాటక రంగానికి చేయూతనిస్తున్నట్లు తెలిపారు. స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, కళా బృందాల నృత్యాలు, టీటీడీ సెక్యూరిటీ గార్డు తిరుపాల్ ప్రదర్శించిన మ్యాజిక్ షో ఆకట్టుకున్నాయి. 202 మందికి ఉత్తమ సేవల ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ డీఈవో విజయకుమార్, ఎఫ్ఏ అండ్ సీఏవో బాలాజీ, లా ఆఫీసర్ వెంకటరమణ, డిప్యూటీ ఈవోలు చెంచులక్ష్మి, చిన్నంగారి రమణ, విజయసారథి, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, భద్రతాధికారి శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కర ప్రత్యేక సంచిక విడుదల
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : పుష్కరాలను పురస్కరించుకుని కనకదుర్గప్రభ ధర్మ ప్రచార మాసపత్రిక కృష్ణా పుష్కర ప్రత్యేక సంచికను రూపొందించింది. బ్రాహ్మణవీధిలోని దుర్గగుడి పరిపాలనా భవనంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈవో సూర్యకుమారి ఈ సంచికను ఆవిష్కరించారు. కృష్ణా పుష్కర వైభవం, కృష్ణా పుష్కరాలు–మన కర్తవ్యం, సర్వపాప హరిణి కృష్ణవేణి, పుష్కరాల ప్రాశస్త్యం, పుష్కర వైశిష్ట్యం, పుష్కర స్నాన విధానం.. వంటి ఆధ్యాత్మిక రచనలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య, పర్యవేక్షకుడు ఈవీ సుబ్బారావు, సంపాదకుడు కె.గంగాధర్, కో–ఆర్డినేటర్ సైదా తదితరులు పాల్గొన్నారు. -
16 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
ద్వారకాతిరుమల : ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య పవిత్రోత్సవాలు వచ్చే నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరపనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ ఉత్సవాలను నిర్వహించడం పరిపాటి. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ప్రారంభం రోజైన ఆగస్టు 16న అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. 17న పవిత్రాధివాసం, 18న పవిత్రారోపణ, 19న పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈవో వివరించారు. ఆలయంలో జరగాల్సిన నిత్యార్జిత సేవలు, ఆర్జిత కల్యాణాలు ఉత్సవాల రోజుల్లో రద్దు చేయనున్నట్టు ఆయన తెలిపారు. -
20 నుంచి సమగ్ర ఆర్థిక, సామాజిక సర్వే
రెండు దశల్లో 33 రోజుల పాటు సర్వే 430-460 ఇళ్లతో ఎన్యుమరేటర్ బ్లాక్ {పతి బ్లాకుకు ఓ ఎన్యుమరేషన్ టీమ్ స్పాట్లోనే టాబ్లెట్స్‌లో ఆన్లైన్ డేటా ఎంట్రీ త్వరలో బ్లాకుల వారీగా సర్వే షెడ్యూల్ ఖరారు విశాఖపట్నం : తెలంగాణాలో మాదిరిగా ఏపీలో కూడా ఇంటింట సమగ్ర ఆర్థిక సామాజిక సర్వే (స్మార్ట్స్ పల్స్ సర్వే) చేయాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడలా ఒక్క రోజులోనే కాకుండా 33 రోజుల పాటు ఈ సర్వే చేపట్టేలా షెడ్యూల్ తయారు చేస్తున్నారు. జూన్ 20 నుంచి 30 వరకు, జూలై 6 నుంచి 31 వరకు రెండు దశల్లో ఈ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. 430-460 ఇళ్లను ఓ ఎన్యుమరేటర్ బ్లాకుగా విభజించారు. ప్రతీ బ్లాకుకు ఓ ఎన్యుమరేషన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. స్పాట్ లోనే ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయనున్నారు. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేకంగా టాబ్లెట్ పీసీలు ఇవ్వనున్నారు. ప్రతీ ఒక్కరి బయోమెట్రిక్, ఐరిష్‌లను కూడా సేకరించేందుకు యంత్రాలను సమకూర్చనున్నారు. ఇందుకోసం జిల్లా మండల కేంద్రాల్లో గణన కోసం ఎంపిక చేసిన బృందాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. బ్లాకులు, తేదీల వారీగా త్వరలో సర్వే షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సెర్ఫ్ క్లస్టర్ కో ఆర్డినేటర్, వీఏఓ, ఫీల్డ్ అసిస్టెంట్, ఎంఆర్ఐ తదితరులతోనూ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా బిల్ కలెక్టరు, వివిధ శాఖల సిబ్బంది, అధికారులతో ఈ టీమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. జీవీఎంసీ, వుడా, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది సేవలను ఇందుకోసం వినియోగించనున్నారు. బ్లాకుల్లో ఇంటింటి సర్వే ప్రణాళికా బద్ధంగా చేసేందుకు వీలుగా ఎన్యుమరేషన్ బ్లాకులు తేదీల వారీగా షెడ్యూల్ తయారు చేసి ప్రజలందరికి తెలియజేసేలా ప్రచారం చేయాలని నిర్ణయించారు. డ్వాక్రా సెర్ప్ సిబ్బందితో పాటు వివిధ శాఖల సిబ్బంది వద్ద ఉన్న టాబ్లెట్స్, ఐరిష్, బయోమెట్రిక్ యంత్రాలను సమీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వే పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని గురువారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తహశీల్దార్లను ఆదేశించారు. ఎన్యుమరేటర్లకు జిల్లా, మండల స్థాయిల్లో తక్షణమే శిక్షణా కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జేసీ నివాస్, జేసీ-2 డివి రెడ్డి, డీఆర్‌ఒ చంద్రశేఖరరెడ్డి, వుడా కార్యదర్శి ఎ.శ్రీనివాస్, జీవీఎంసీ రెవెన్యూ అధికారి వి.రవీంధ్ర, ఆర్డీఓ వెంకటేశ్వరు, సీపీఒ రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
యాగంటి ఆలయ ఈవోపై హత్యాయత్నం
-పెట్రోల్ పోసిన జూనియర్ అసిస్టెట్ యాగంటి: కర్నూలు జిల్లా యాగంటి ఈవోపై హత్యాయత్నం జరిగింది. ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి ఈ ఘటనకు పాల్పడ్డాడు. తనకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఆపారన్న అక్కసుతో కృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం ఆలయ ఈవో ఆదిశేషనాయుడుపై పెట్రోల్ పోశాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఈవోపై పోసి నిప్పు అంటిస్తానని బెదిరించడంతో అక్కడున్న సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. ఈ విషయమై ఆదిశేషనాయుడు యాగంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రింగయ్యారు.. ఖంగుతిన్నారు
భద్రాద్రిలో వేలం పాట వాయిదా భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం దుకాణాల నిర్వహణ తదితరాల కోసం బుధవారం వేలం పాటల నిర్వహణలో పాటదారులంతా రింగయ్యారు. కాంట్రాక్ట్ కాల పరిమితిని ఏడాది కాకుండా మూడేళ్లకు పెంచాలని, లేకపోతే తామంతా వేలం పాటకు దూరంగా ఉంటామని దేవస్థానం అధికారులతో తెగేసి చెప్పారు. కార్యనిర్వహణాధికారిణి(ఈఓ) కూరాకుల జ్యోతి ఒక మెట్టు దిగి, కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించేందుకు అంగీకరించారు. పాటదారులు మాత్రం ససేమిరా అన్నారు. వీరంతా రింగయ్యారని, తక్కువ మొత్తంతో ఎక్కువ కాలంపాటు పాట పాడుకునేందుకు పన్నాగం పన్నారని గ్రహించిన ఈఓ.. మొత్తంగా వేలం పాటలనే రద్దు చేశారు. ఈ అనూహ్య పరిణామంతో పాటదారులంతా ఖంగుతిన్నారు. ఇలా, కథ అడ్డం తిరగడంతో.. ‘దీన్నంతటికీ నువ్వే కారణం’ అంటూ, పాటదారులు తమ ‘రింగ్’ లీడర్‌పై కస్సుబస్సుమన్నట్టు సమాచారం. భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పరిధిలో దుకాణాలను అద్దె ప్రాతిపదికన నిర్వహించేందుకు బుధవారం జరగాల్సిన వేలం పాట వాయిదా పడింది. పర్ణశాల దేవాలయం వద్ద కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు, ఫ్యాన్సీ వస్తువులు విక్రయించేందుకు, కుటీరం వద్ద ఫొటోలు తీసేందుకు, సీతవాగు వద్ద గైడ్ లెసైన్స్ హక్కుల కోసం, భద్రాద్రి దేవాలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఫొటోలు తీసుకునేందుకు అధికారులు వేలం పాట పెట్టారు. దుమ్ముగూడెం మండలం కాశీనగరం వద్ద 2.67 ఎకరాల భూమిని మూడేళ్లపాటు కౌలుకు ఇచ్చేందుకు వేలం నిర్వహించారు. కాశీనగరం భూమి కౌలు ఏడాదికి గతంలో రూ.16,200 ఉంది. ఇది ప్రస్తుతం రూ.20వేలకు వెళ్లింది. దీంతో దీనిని దేవస్థానం అధికారులు ఖాయం చేశారు. పాటలన్నింటికీ తీవ్రమైన పోటీ ఏర్పడింది. పాటదారులంతా కాల పరిమితి పెంచాలని డిమాండ్ లేవనెత్తారు. గతంలో ఏడాదికి మాత్రమే లెసైన్స్ హక్కులు ఇచ్చేవారు. దీనిని మూడేళ్లకు పెంచకపోతే పాటలో పాల్గొనేది లేదని వారు తెగేసి చెప్పారు. వాస్తవంగా, భద్రాచలం దేవ స్థానంతోపాటు, పర్ణశాల వద్ద ఫొటోలు తీసేందుకు గతంలో తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ, వచ్చిన పాటదారులంతా.. వేలం కాల పరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించకపోతే వేలంపాటకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. వేలం పాట నిర్వహించేందుకు వచ్చిన ఇన్చార్జ్ ఏఈఓ కనకదుర్గ, సూపరింటెండెంట్ వెంకటప్పయ్య, సెక్షన్ ఇన్చార్జ్ పోతుల శ్రీను చర్చించుకున్నారు. విషయాన్ని దేవస్థానం ఈఓ జ్యోతి దృష్టికి తీసుకెళ్లారు. పాటదారుల డిమాండుకు ఈఓ కొంతవరకు తలొగ్గారు. కాల పరిమితిని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచుతామంటూ ఒక మెట్టు దిగొచ్చారు. పాటదారులు మాత్రం ససేమిరా అన్నారు. మూడేళ్లకు పొడిగిస్తేనే వేలం పాటలో పాల్గొంటామని బెట్టు చేశారు. అందరూ ఇదే మాటపై ఉండడాన్నిబట్టి, వారంతా రింగయ్యారని ఈఓ గ్రహించారు. వారి డిమాండును అంగీకరిస్తే దేవస్థానం ఆదాయం తగ్గే పరిస్థితి ఉండడంతో.. ఏకంగా వేలం పాటల నిర్వహణను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామంతా పాటదారులు ఖంగుతిన్నారు. వారిలో కొంతమంది.. తమ ‘రింగ్’ లీడర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం పాట ఆగిపోవడానికి కారణమయ్యావంటూ నిందించారు. నేడు విస్తా కాంప్లెక్స్ దుకాణాలకు వేలం గోవిందరాజ స్వామి ఆలయం వద్ద, విస్తా కాంప్లెక్స్‌లోని పలు దుకాణాల నిర్వహణకు గురువారం వేలం నిర్వహించనున్నట్టు దేవస్థానం అధికారులు ప్రకటించారు. పాదరక్షలు భద్రపరిచేందుకు, పడమర మెట్ల పక్కన పూజాది సామాగ్రి విక్రయించేందుకు మంచి పోటీ ఉండే అవకాశముంది. గతంలో వీటిని దక్కించుకున్న వారే తిరిగి పొందేందుకు పావులు కదుపుతున్నారు. దీనిపై దేవస్థానం అధికారులు అప్రమత్తంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. -
నేనూ వీఐపీనే
► శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవోతో ధర్మకర్తల మండలి సభ్యుడి వాగ్వాదం ► చివరకు సహచర సభ్యుల జోక్యంతో సహస్రలింగేశ్వరస్వామి వద్దే పూజలు శ్రీకాళహస్తి : ఆలయు ధర్మకర్తల వుండలి సభ్యుడైన నేను వీఐపీనే. సహస్రలింగేశ్వరస్వామి వద్ద పూజలు చేసుకోవడానికి అర్హత లేదా ? అంటూ సీతారావుయ్యు ఈవో భ్రమరాంబను ప్రశ్నించారు. దాంతో వారి వుధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.శుక్రవారం శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల వుండ లి సభ్యుడు సీతారావుయ్యు, ఆయన కువూర్తెతో కలిసి స్వా మివారి సమీపంలోని సహస్రలింగేశ్వరస్వామి వద్ద రూ. 2500 టికెట్ ద్వారా రాహుకేతు పూజలు చేసుకోవడానికి వె ళ్లారు. అరుుతే ఆలయు పీఆర్వో వి.బాబు వీఐపీలకు వూ త్రమే సహస్రలింగేశ్వరస్వామి వద్ద పూజలు చేరుుంచాలని ఈవో ఆదేశించారని, వీఐపీలు కానివారిని రూ.2500 టికెట్ తీసుకున్నా....వినాయుకస్వామి ఆలయుం ఉన్న వుండలంలో పూజలు చేరుుంచాలని ఈవో ఆదేశించారని చెప్పారు. ఆమె అనువుతి ఇస్తేనే సహస్రలింగేశ్వరస్వామి వద్ద పూజలు చేరుుస్తావుని స్పష్టం చేశారు. దాంతో సీతారావుయ్యు ఫోన్లో ఈవోతో వూట్లాడారు. ఆమె ధర్మకర్తల వుండలి సభ్యులకు సహస్రలింగేశ్వరస్వామి వద్ద రాహుకేత పూజలు చేసుకునే అర్హత ఉంది. కానీ కుటుంబసభ్యులకు అవకాశం లేదని చెప్పారు. దాంతో ఆయున వాగ్వాదానికి దిగారు. చివరకు సీతారావుయ్యు కువూర్తెతో కలిసి తిరిగి వెళ్లిపోతుండగా తోటి ధర్మకర్తల వుండలి సభ్యులు చిట్టివేలు జయుగోపాల్, గుర్రప్పశెట్టి,కండ్రిగ ఉవు జోక్యం చేసుకుని సహస్రలింగేశ్వరస్వామి సన్నిధిలోనే వారికి రాహుకేతు పూజలు చేరుుంచారు. -
డిసెంబర్ కు అష్టాదశ పురాణాల అనువాదం
యూనివర్సిటీ క్యాంపస్: అష్టాదశ పురాణాల అనువాద ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో సాంబశివరావు పండితులను కోరారు. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో రెండు రోజుల పాటు జరిగిన పండిత పరిషత్ సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ... అష్టాదశ పురాణాల్లో 3.70 లక్షల శ్లోకాలు ఉండగా ఇప్పటి వరకు 2.57 లక్షల శ్లోకాల అనువాదం పూర్తయిందని... మిగిలిన అనువాదం కూడా పూర్తి చేసి డిసెంబర్ నాటికి ముద్రించాలని సూచించారు. అలాగే, వ్యాస భారతం, వాల్మీకి రామాయణం గ్రంథాల ప్రచురణ పూర్తికావచ్చిందన్నారు. పబ్లికేషన్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వరరావు ప్రసంగిస్తూ... అష్టాదశ పురాణాలను ఒక్కో పురాణాన్ని ఓ చిన్న పుస్తకం రూపంలో భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు చెప్పారు. -
కారు హల్చల్పై టీటీడీ ఈవో ఆగ్రహం
తిరుమల: తిరుమలలో శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం వద్దకు ఓ కారు దూసుకురావడంపై ఈవో సాంబశివరావు స్పందించారు. ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేయడంతో పాటు కారును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఓ ఎర్ర రంగు కారు మూడు గేట్లను దాటుకుని శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం ముందు వరకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కారు టీటీడీ బోర్డు సభ్యుడు దొరస్వామి రాజుకు చెందినదిగా అధికారుల విచారణలో తేలింది.అయితే, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడడంతో ఈవో ఆగ్రహంచి చర్యలకు ఆదేశించారు. -
‘రాజన్నే’ నంబర్ వన్!
వేములవాడకు రూ.84.92 కోట్ల ఆదాయం వేములవాడ: రాష్ట్రంలో యాదాద్రి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిన వేములవాడ రాజన్న ఆలయం ఆదాయార్జనలో మాత్రం ముందంజలో నిలిచింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.84.92 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు యాదాద్రి నర్సింహస్వామి రూ.73 కోట్లతో మొదటిస్థానంలో, రాజన్న రూ.70 కోట్లతో రెండోస్థానంలో నిలిచారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతర నేపథ్యంలో భక్తులు పెద్దఎత్తున వేములవాడకు తరలివచ్చారు. ఆనవాయితీ ప్రకారం శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తద్వారా ఆలయానికి ఆదాయం పెరిగి రూ.84.92 కోట్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. యాదాద్రికి రూ.75 కోట్లతో రెండోస్థానం దక్కింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. భక్తుల సంఖ్య మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు అందుకనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. -
బంగారు వాకిలికి సొబగులు
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని ద్వారపాలకులు జయవిజయుల విగ్రహాల మధ్యలో ఉండే బంగారు వాకిలికి అమర్చిన బంగారు రేకులు శిథిలావస్థలో ఉన్నాయి. వీటికి కొత్త బంగారు రేకులు అమర్చాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అందుకు అయ్యే రూ. 86 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖర్‌కు అనుమతిస్తూ తీర్మానం చేసింది. శుక్రవారం టీటీడీ చైర్మన్ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సమావేశం వివరాలను చైర్మన్, ఈవో, జేఈవో మీడియాకు వివరించారు. తీర్మానాలు ► తిరుపతి రైల్వే స్టేషన్ విస్తరణ కోసం టీటీడీ రెండో సత్రం వద్ద 2.74 ఎకరాల స్థలాన్ని రైల్వేశాఖకు అప్పగించనున్నారు. దీనికి బదులుగా తిరుచానూరు వద్ద ఉన్న రైల్వే స్థలాన్ని టీటీడీకి అప్పగించనుంది. ► శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పోలూరు గ్రామంలోని పురాతన శ్రీఅలగమల్లారి కృష్ణస్వామి ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకోనున్నారు. ► తెలంగాణ ప్రభుత్వం శ్రీవారికి రూ. 5 కోట్ల విలువైన సాలిగ్రామహారం, ఐదు పేటల కంఠె (కంఠహారం) వితరణకు అనుమతి. ► రూ. 2.55 కోట్లతో పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అనుమతి. ► తిరుపతి కోదండరామస్వామి ఆలయం లో అమావాస్య రోజున సహస్ర కలశాభిషేకం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన సేవలు, ఆర్జిత సేవలు ప్రారంభానికి నిర్ణయం. -
దుర్గగుడి ఈవో వేధింపులపై ఆగ్రహం
అర్చకుల నిరసనలు ఆర్జిత సేవలు రద్దు నేడు ఏపీలోని13 జిల్లాల నుంచి అర్చకుల రాక విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఆలయ అర్చకులు, సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్న విజయవాడ కనకదుర్గ గుడి ఈవో నర్సింగరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలో గురువారం నుంచి నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈవో నర్సింగరావు వేధింపుల కారణంగా ఆలయ అర్చకుడు మంగళంపల్లి సుబ్బారావు ఆస్పత్రిపాలు కావడంతో ఆలయ అర్చకులు, సిబ్బంది నిరసనకు దిగారు. అర్చకులు, వేద పండితులు, వివిధ శాఖలకు చెందిన ఆలయ అధికారులు, సూపరిండెంటెంట్లు, ఏఈవోలు, రెగ్యులర్, కాంట్రాక్టు సిబ్బంది నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు మొదలైన దీక్ష రాత్రి వరకు కొనసాగింది. అమ్మవారికి నిత్యం జరిగే శ్రీచక్ర నవార్చన, చండీయాగం, కుంకుమార్చన, శాంతి కల్యాణాలను నిలిపేశారు. దీక్ష చేపట్టిన అర్చకుల్లో రాజకొండ గోపీకి ఎండ తీవ్రత కారణంగా ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దీక్షలకు మద్దతుగా 13 జిల్లాలకు చెందిన పలు అర్చక సంఘాలు, సమాఖ్యల వారు శుక్రవారం వస్తున్నట్లు దుర్గగుడి అర్చకులు తెలిపారు. అధికారుల వేధింపుల కారణంగానే అర్చకుడు మంగళపల్లి సుబ్బారావు (37) అనారోగ్యం పాలయ్యారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విధులు సరిగా నిర్వర్తించనందునే జరిమానా వేశానని, సుబ్బారావును ఎవరూ వేధించలేదని ఈవో చెప్పారు. అరసవల్లిలో అర్చకుల ఆందోళన శ్రీకాకుళం సిటీ: విజయవాడ కనకదుర్గ ఆలయ ఈవో నర్సింగరావును సస్పెండ్ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ అర్చక సంఘం ప్రతినిధులు కొత్తలంక మురళీకృష్ణ, శ్రీనివాసదీక్షితులు డిమాండ్ చేశారు. వారు గురువారం శ్రీకాకుళ ం జిల్లా అరసవల్లిలో ఆందోళన చేపట్టారు. కాగా ఈవో సీహెచ్ నర్సింగరావు సెలవుపై వెళ్లారు. తన కుమారుడు వివాహం ఉన్నందున ఈ నెల 30వరకు తాను సెలవు పెట్టినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. తాత్కాలిక ఈవోగా కాకినాడ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించారు. -
శ్రీకాళహస్తిలో ఆనం కుమారుడి వీరంగం
తిరుపతి: పదవి ఉంది.. డబ్బు ఉంది.. వ్యవస్థతో ఎలా అయినా ఆడుకోవచ్చు అనుకుంటున్నారు నేతల కుమారులు. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడి కీచక పర్వం మరచిపోకముందే తాజాగా మరో నాయకుడి కుమారుడు రెచ్చిపోయాడు. టీడీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయుడు శ్రీకాళహస్తిలో వీరంగం సృష్టించాడు. శివరాత్రి సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తికి వెళ్లిన ఆనం శుభకర్ రెడ్డి తనకు ప్రత్యేక దర్శనం కల్పించాలంటూ అధికారులపై చిందులు వేశాడు. దర్శనం కల్పిస్తారా లేదా అంటూ ఈవో భ్రమరాంబపై ఒత్తిడి తీసుకు వచ్చాడు. అందుకు నిరాకరించిన ఈవో పై శుభకర్ రెడ్డి అంతు చూస్తానంటూ దుర్భాషలాడినట్టు సమాచారం. 'గతంలో ఎంతోమంది అధికారులను బదిలీ చేయించా. సీఎం చంద్రబాబు తో మాట్లాడి నీ కథ తేలుస్తా' అంటూ ఈవో భ్రమరాంబపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు శ్రీకాళహస్తిలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దర్శనం వివాదాస్పదమవుతోంది. బాపిరాజుకు ఈ రోజు ప్రత్యేక దర్శనం కల్పించడంపై ఆలయ చైర్మన్, టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్ఎల్ఏ లకే లేని సౌకర్యాన్ని బాపిరాజుకు ఎలా కల్పిస్తారంటూ ఆలయ అర్చకులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆగ్రహంతో భక్తుల ఎదుటే వారిపై తిట్ల పురాణానికి దిగారు. -
నవమి నాటికి మూలమూర్తులకు బంగారు కవచం
* 12 కేజీల బంగారం వితరణ ఇచ్చిన బెంగళూరు భక్తుడు * 15న చినజీయర్ స్వామి రాక * విలేకరుల సమావేశంలో ఆలయ ఈఓ జ్యోతి భద్రాచలం : భక్తరామదాసు ప్రతిష్ఠించిన భద్రాద్రి రాములోరు (గర్భగుడిలోని మూలవరులు) ఇక స్వర్ణ కవచంతో మెరిసిపోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న జరిగే శ్రీసీతారాముల పెళ్లి రోజున (శ్రీరామనవమి) బంగారు కవచాన్ని వారికి అలంకరించనున్నారు. బెంగళూరుకు చెందిన పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ భక్తుడు 12 కేజీల బంగారాన్ని కొనుగోలు చేసి తమకు అందజేశారని దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భద్రాద్రి ఆలయంలోని గర్భగుడిలో ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి మూలమూర్తులకు ఈ కవచాన్ని అలంకరిస్తామని చెప్పారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వర్ణ కవచం తయారీని ప్రముఖ స్థపతి పాకున్నం రామన్‌కుట్టి దండపాణికి అప్పగించినట్లు తెలిపారు. శ్రీరామనవమి నాటికి మూలవరులకు వజ్రాలతో పొదిగిన స్వర్ణ కవచాన్ని అలంకరిస్తామని వివరించారు. శ్రీరామాయణ మహాక్రతువులో భాగంగా ఈ నెల 10 నుంచి 18 వరకు కీలక ఘట్టం ఉంటుందని, ఈ నెల 15న చినజీయర్ స్వామి హాజరుకానున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి ప్రత్యేక వేడుకలు... ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు మాట్లాడుతూ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న శతవర్ష ప్రయుక్త సువర్ణ భద్రకవచ సమర్పణాత్మక నవాహ్నిక శ్రీరామ మహాక్రతువు వేడుకలు ఈ నెల 10 నుంచి 18 వరకు కొనసాగిస్తామని తెలిపారు. 350 ఏళ్ల కిందట భక్త రామదాసు వారి ఆచార్యులైన రఘునాథ భట్టాచార్యుల చేతుల మీదుగా ప్రతిష్ఠించిన ప్రాచీన దివ్య ఉత్సవమూర్తులకు అలంకరణ చేయనున్న సువర్ణ భద్ర కవచ సమర్పణ మహాక్రతువులో భాగంగా చివరి తొమ్మిది రోజుల్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నామని చెప్పారు. తొమ్మిది రోజుల పాటు రోజుకు 12 వేల సార్లు శ్రీరామ మహామంత్రం హవనం, పంచగవ్యాభిషేకం చేస్తామని తెలిపారు. తొలిరోజు బాలకాండ, రెండవ, మూడవ రోజు అయోధ్యకాండ, 4వ రోజు అరణ్యకాండ, 5వ రోజు కిష్కిందకాండ, 6వ రోజు సుందరకాండ, 7, 8 రోజుల్లో యుద్ధకాండ, 9వ రోజు మహాపుర్ణాహుతి ప్రతిష్ఠాంగ మహాపట్టాభిషేకం నిర్వహిస్తామని వేదపండితులు వివరించారు. కార్యక్రమంలో పండితుడు మురళీకృష్ణమాచార్యులు, ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులు, స్థానాచార్యులు స్థలసాయి, ఏఈఓ శ్రావణ్‌కుమార్, డీఈ రవీందర్ పాల్గొన్నారు. -
‘న్యూ జనరేషన్ టీటీడీ వెబ్సైట్ రూపొందిస్తున్నాం’
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం కోసం విదేశీ భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో న్యూజనరేషన్ టీటీడీ వెబ్సైట్ రూపొందిస్తున్నట్లు ఈవో డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడారు. టీసీఎస్, సిఫీ సంస్థ సహకారంతో.. శ్రీవారి దర్శనంతో పాటు వసతి, లడ్డూ ప్రసాదం, ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల బుకింగ్ విధానాలను సరళీకృతం చేశామని వివరించారు. అలాగే భక్తుడి ఫొటో లేకుండా కేవలం గుర్తింపు కార్డు నంబర్ల సాయంతోనే ఈ టికెట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దాతలకు సులభంగా సేవలు అందించేందుకు ఐటీ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 16న ఏపీ, తెలంగాణ లోని సుమారు 300 ఆలయ ప్రాంతాల్లో గోపూజ నిర్వహిస్తామని వెల్లడించారు. ధర్మప్రచారం విస్తరణలో భాగంగా త్వరలో ఎస్వీబీసీ తమిళ చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇదే రికార్డు వచ్చే నెల 1 నుంచి 29 వరకు మొత్తం 54,047 ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసినట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు సంఖ్యని ఆయన చెప్పారు. -
'తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు'
-
'తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు'
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీల ప్రత్యేక దర్శనం సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. వచ్చే ఏడాది జనవరి 1న చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్లపై ఈవో స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని టీటీడీ ఈవో చైర్మన్ సాంబశివరావు తెలిపారు. వీఐపీ దర్శనాలకు సిఫారసు లేఖలు తీసుకువచ్చినా ప్రత్యేక దర్శనానికి అనుమతించేది లేదని వివరించారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 3వరకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో సాంబశివరావు వెల్లడించారు. -
ఆరు ఆవుపేడ పిడకలు రూ.10
► విక్రయించనున్న అన్నవరం దేవస్థానం ► సాంప్రదాయ పునరుద్ధరణకే.. : ఈఓ అన్నవరం : ఆర్డరిస్తే పిడకలు కూడా డోర్ డెలివరీ చేస్తామని ఆన్లైన్లో వస్తువులు విక్రయించే ఓ ప్రముఖ సంస్థ ప్రకటన ఇంటర్నెట్లో అందరినీ ఆకర్షిస్తున్న విషయం విదితమే. అయితే భోగిమంటలో వేయడానికి ఆవు పేడతో చేసిన పిడకలను విక్రయించడానికి అన్నవరం దేవస్థానం కూడా సన్నాహాలు చేస్తోంది. దేవస్థానం గోశాలలోని సుమారు రెండువందల ఆవుల పేడతో చేసిన పిడకలను జనవరి ఒకటి నుంచి భోగి పండుగ వరకూ రూ.పదికి ఆరు పెద్ద పిడకల చొప్పున విక్రయించనున్నట్టు ఈఓ నాగేశ్వరరావు సోమవారం విలేకరులకు తెలిపారు.ఆ మొత్తాన్ని దేవస్థానం గో సంరక్షణట్రస్ట్కు జమ చేస్తామన్నారు. భోగిమంటల్లో ఆవుపేడతో చేసిన పిడకలు మాత్రమే వేసే పాత సంప్రదాయం పునరుద్ధరణకే దేవస్థానం పిడకల తయూరీ, విక్రయం చేపట్టిందన్నారు. పిడకలను ఉచితంగా పంపిణీ చేద్దామనుకున్నా రూ.పది పెద్దగా భారం కాదన్న అభిప్రాయంతో ఆ ధర నిర్ణరుుంచామన్నారు. ఈఓ ఆదేశాల మేరకు గోశాల సిబ్బంది సోమవారం నుంచి పిడకల తయారీ ప్రారంభించారు. -
ఆమె 'శ్రీ' ఉండాలంటారు... ఆయన వద్దంటారు
శ్రీకాళహస్తి పేరుకు మరో శ్రీ చేర్చాలనే విషయంపై వివాదం ప్రతిపాదిస్తున్నది ఒకరు.... తిరస్కరిస్తున్నది మరొకరు అభివృద్ధి కమిటీల నియామకాలపైనా అదే పరిస్థితి శ్రీకాళహస్తి : కైలాసగిరుల్లోని పరమేశ్వరుడి క్షేత్రం శ్రీకాళహస్తి పేరుకు ముందు మరో ‘శ్రీ’ని చేర్చాలనే విషయంపై చైర్మన్, ఈవో మధ్య వివాదం సాగుతోంది. ఈవో ప్రతిపాదస్తుంటే చైర్మన్ తిరస్కరిస్తున్నారు. వీరి మధ్య నడుస్తున్న ఈ వివాదం క్షేత్రానికి సంబంధించి ఇతర విషయాలపై పడుతోంది. ముక్కంటి క్షేత్రాన్ని మూడు మూగజీవులకు చిహ్నంగా శ్రీకాళహస్తిగా ఆది నుంచి పిలుస్తున్నారు. అయితే ఆలయూల పేర్లకు ముందు గౌరవార్థంగా శ్రీ ఉండాలని చెబుతున్న ఈవో భ్రవురాంబ శ్రీ శ్రీకాళహస్తిగా పేరు మార్చాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఆమె గురువారం చైర్మన్ పోతుగుంట గురవయ్య నాయుడికి పంపగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇదేకోవలో ఆలయ అభివృద్ధి కోసం 15 కమిటీలను ఏర్పాటు చేసి వాటికి సభ్యులను నియమించేందుకు చైర్మన్ పంపిన ప్రతిపాదనను ఇదేరోజు ఈవో వెనక్కు పంపినట్లు సమాచారం. అన్ని ఆలయాలకు ముందు శ్రీ .. శ్రీ అనేది ఆలయాల గౌరవార్థం కోసం పెట్టుకునేది. అందువల్లే అన్ని ఆలయాల పేర్లకు ముందు శ్రీ వాడుతున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా శ్రీ వెంకటేశ్వరునిగా పిలుస్తున్నారు. ఇదే తరహాలో శ్రీ శ్రీకాళహస్తి దేవస్థానంగా పిలవాలని భావించాం. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అలాగే రాస్తున్నాను. - భ్రవురాంబ, ఆలయు ఈవో ఆది నుంచి ఉన్నదాన్ని మార్చడమెందుకు.. ఆది నుంచి శ్రీకాళహస్తి దేవస్థానంగానే పిలుస్తున్నాం. గౌరవార్థం అంటూ ఈవో కొత్తగా శ్రీ శ్రీకాళహస్తిగా పిలవాలని చేసిన ప్రతిపాదనను తిరస్కరించాం. శ్రీకాళహస్తి దేవస్థానంగానే పిలుస్తాం. దీనిపై ఇతర చర్చలు అనవసరం. - పోతుగుంట గురవయ్యనాయుడు, ఆలయు చైర్మన్ ఇదీ ‘శ్రీ-కాళ-హస్తి’ప్రాశస్త్యం... శ్రీకాళహస్తి అనే పేరు మూడు మూగజీవుల భక్తి ఆరాధనల ఫలితంగా వచ్చింది. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. బ్రహ్మదేవుని శాపానికి గురై ఊర్ణనాభుడనే శిల్పి భూలోకాన సాలీడుగా జన్మించి మారేడు పత్రాల మధ్య జీవించేవాడు. శివుని మెడలోని కాళం శాపంతో దక్షిణ కైలాసాన అడవిలో జన్మించి బిల్వ వ ృక్షం కింద వెలసిన శివలింగాన్ని పూజించేది. హస్తి అనే శివకింకరుడు తాను చేసిన తప్పునకు ఫలితంగా శివుడి శాపంతో భూలోకంలో ఏనుగు గా జన్మించాడు. ఏనుగు కూడా సాలెపురుగు, కాళంతోపాటు బిల్వ వనంలోనే నివసిస్తూ అక్కడే ఉన్న శివలింగాన్నే కొలిచేవి. ఈ నేపథ్యంలోనే పాము చేసిన అలంకరణలను తొలగించి ఏనుగు తన తొండంతో సువర్ణముఖి నది నుంచి జలాన్ని తెచ్చి అభిషేకించేది. ఇందుకు కోపించిన కాళం ఒకనాడు శివలింగ సమీపాన వేచి ఉండి అభిషేకం చేస్తున్న గజరాజు తొండంలో చొరబడి కుంభస్థలంలో బాధ కలిగించింది. ఆ బాధ భరించలేక గజరాజు తన తలను బండకు మోదుకుని మరణించింది. గజరాజుతోపాటు కుంభస్థలం లోపల ఉన్న పాము కూడా మరణించింది. ఆ క్షణాన శివుడు ప్రత్యక్షమై వారికి పూర్వ జన్మ వృత్తాంతం తెలియజేశాడు. వారిని అనుగ్రహించి శివైక్యం చేశాడు. అప్పటి నుంచి దక్షిణ కైలాసమని పేరొం దిన ఈ క్షేత్రానికి శ్రీ-కాళ-హస్తి అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు. -
రూ. 100 కోట్లతో తిరుపతిలో అరవింద్ కంటి ఆస్పత్రి
టీటీడీ ధర్మకర్తలమండలి నిర్ణయం సాక్షి, తిరుమల: మధురైకి చెందిన సుప్రసిద్ధ అరవింద్ కంటి ఆస్పత్రి తిరుపతిలోనూ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఏడెకరాల స్థలాన్ని పదకొండేళ్లు లీజుకింద ఇచ్చేందుకు తిరుమల-తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదించింది. రూ. 100 కోట్ల అంచనాలతో జూపార్క్ రోడ్డులో ఐదెకరాల్లో ‘శ్రీవేంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్’, రెండెకరాల్లో పరిశోధన, శిక్షణ కార్యాలయాల నిర్వహణకు అనుమతిస్తూ బోర్డు తీర్మానం చేసినట్టు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం వెల్లడించారు. స్విమ్స్, బర్డ్, రుయా ఆస్పత్రులను కలిపి మెడికల్ హబ్‌గా మారుస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పే ఈ ఆస్పత్రిలో 50 శాతం ఉచిత వైద్యసేవలు, టీటీడీ ఉద్యోగులు, స్థానికులకు ప్రత్యేక వైద్యసేవలు అందించేందుకు అరవింద్ ఆస్పత్రి ముందుకు వచ్చిందన్నారు. మరికొన్ని తీర్మానాలు ► హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతం లో టీటీడీకి ఉన్న 3.5 ఎకరాల స్థలంలో రూ. 13.98 కోట్ల వ్యయంతో శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీ మహాగణపతి ఆలయాలు నిర్మిస్తారు. ఇందుకోసం టెండర్ పనులకు ఆమోదం. ► ఢిల్లీలో ఈనెల 30 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే శ్రీవారి వైభవోత్సవాల సందర్భంగా గతంలో లతా మంగేష్కర్ ఆలపించిన 20,291 ‘స్వర లతార్చన’ సీడీలను భక్తులకు ఉచితంగా వితరణ. ► రూ. 12.01 కోట్లతో 41.43 లక్షల లీటర్ల టోన్డ్ పాలు, రూ. 1.54 కోట్లతో 19వేల కిలోల అగ్ మార్క్ నల్ల మిరియాలు, రూ.2.43 కోట్ల వ్యయంతో 27 వేల కిలోల యాలకులు కొనుగోలు చేయాలని తీర్మానించారు. -
శ్రీశైలంలో వేదిక్ లైబ్రరీ ప్రారంభం
శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలోని భ్రామరీసదన్లో ఆదివారం వేదిక్ లైబ్రరి అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ఈఓ సాగర్‌బాబు, కాకినాడ దేవాదాయ ఆర్జెసీ చంద్రశేఖర అజాద్‌లు ప్రారంభించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ వేదసంస్కృతి, సనాతన ధర్మం , హైందవ సంప్రదాయాలు, ఆచారాలు, తదితర అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తాళపత్ర గ్రంథాలు, అరుదైన గ్రంథాలతో మొత్తం లక్ష గ్రంథాలను సేకరించాలనే సంకల్పంతో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, భాగవతం, ధర్మసింధు, నిర్ణయ సింధు, భగవద్గీత, భాష్యం తదితర అంశాలకు సంబంధించిన గ్రంథాలు కూడా ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో ఏర్పాటు చేశామన్నారు. -
నవరాత్రుల్లో ఆర్జిత రుద్రహోమాలు నిలుపుదల
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 17న వినాయక చవితి సందర్భంగా ఆర్జిత రుద్రహోమాలను నిలుపుదల చేస్తున్నట్లు ఈఓ సాగర్‌బాబు మంగళవారం తెలిపారు. 17 నుంచి 26 వరకు ఆర్జిత గణపతి హోమం, రుద్రహోమం, మృత్యుంజయహోమం, నవగ్రహ హోమాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఈఓ సాగర్‌బాబు ఆదివారం తెలిపారు. అయితే టికెట్ల విక్రయ కేంద్రం, ఆన్లైన్ నుంచి వీటికి సంబంధించిన ఆర్జిత టికెట్లను నిలుపుదల చేస్తున్నామన్నారు. ఉత్సవాల ముగిసిన అనంతరం 27 నుంచి ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహిస్తామని, అలాగే అమ్మవారి ఆలయంలో నిర్వహించే చండీహోమాలు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని తెలిపారు. కాగా వినాయక చవితి సందర్భంగా ఆర్జిత ఉభయాన్ని ప్రవేశపెట్టామని, ఒక్క రోజు రూ. 2,516లు చెల్లిస్తే వారి గోత్రనామాలతో గణపతిపూజ, అభిషేకం, కుంకుమార్చన కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు. -
రాఘవేంద్రుడికి వెంకన్న పట్టువస్త్రాలు
మంత్రాలయం (కర్నూలు జిల్లా): ప్రముఖ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యారాధన వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల నేతృత్వంలో రాయరు మూలబృందావనానికి మహా పంచామృతాభిషేకం చేపట్టారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు కనకాభిషేకం, రాఘవేంద్రుల ప్రతిమను నవరత్నరథంపై కన్నులపండువగా ఊరేగించారు. ఆనవాయితీలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈఓ సాంబశివరావు పట్టువస్త్రాలను రాఘవేంద్రులకు సమర్పించారు. గజరాజు, పూర్ణకుంభం సమేతంగా మంగళవాయిద్యాల నడుమ పీఠాధిపతి స్వాగతం పలికారు. పంచామృతాభిషేకం పూర్తయ్యాక మూలబృందావనాన్ని టీటీడీ పట్టువస్త్రాలతో అలంకరించారు. సోమవారం 70 వేలకుపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అంచనా. వేడుకల్లో భాగంగా నిర్వహించిన పూజోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
శ్రీశైలం(కర్నూలు): ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం శ్రావణమాసం ఆదివారం వందలాది మంది భక్తులతో కిటకిటలాడింది. శనివారం వైఎస్ఆర్ సీపీ బంద్ కారణంగా భక్తుల రద్దీ సాధారణంగా కనిపించినా ఆదివారం ఉదయం 10గంటల తరువాత భక్తులరద్దీ ప్రారంభమైంది. దాదాపు 60వేలకు పైగా భక్తులు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. కాగా నేడు శ్రావణమాసం మూడవ సోమవారం కావడంతో రద్దీ మరింత పెరుగుతుందని భావిస్తున్న అధికారులు ఆదివారం రాత్రే సోమవారం నాటి ఆలయపూజావేళలను మార్పులు చేస్తూ మైకుల ద్వారా ప్రకటించారు. ఇందులో భాగంగా 3.30గంటల కు మంగళవాయిద్యాలు , 4 గంటలకు సుప్రభాతం, 5 గంటలకు మహామంగళహారతి 5.30 గంటల నుండి దర్శన,ఆర్జిత సేవలు ప్రారంభమయ్యేలా ఈఓ సాగర్‌బాబు ఏరాట్లు చేశారు. ఆదివారం భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు జరుగకుండా అవసరమైన చర్యలను తీసుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని మల్లన్న స్పర్శదర్శనం రద్దు చేసి దూర దర్శనం ఏర్పాటు చేశారు. కేవలం అభిషేకాలను నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించారు. దర్శనానంతరం భక్తులు, స్థానిక సందర్శనీయ స్థలాలైన సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార-పంచదారం, శిఖరేశ్వరం, నీలంసంజీవరెడ్డి డ్యాం తదితరాలను సందర్శించుకున్నారు. సోమవారం కూడా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక విధులపై ఆయా ప్రదేశాలలో సిబ్బందిని నియమిస్తూ ఈఓ ఆదేశాలు జారీ చేశారు. -
శ్రీకాళహస్తి ఆలయ ఈవో బదిలీ
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బి.రామిరెడ్డిని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా బదిలీచేశారు. ఈ మేరకు దేవాదాయశాఖ నుంచి శ్రీకాళహస్తి దేవస్థానానికి శనివారం ఉత్తర్వులు అందాయి. 2014 నవంబర్ 20వ తేదీ రామిరెడ్డి ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది గడవక ముందే నాయకుల ఒత్తిళ్లతో ఆయన బదిలీపై వెళుతున్నట్లు తెలుస్తోంది. విభజన తర్వాత ఇటీవల ఏపీకి మార్చిన భద్రాచలం ఆలయ ఈవో రఘునాథ్, కాకినాడ దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్(ఆర్జేడీ)గా పనిచేస్తున్న ఆజాద్, సింహాచలం ఆలయ ఈవోగా పనిచేస్తున్న భ్రమరాంబ శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా రావడానికి పోటీలో ఉన్నట్లు తెలిసింది. -
వరుణుడి కరుణ కోసమే యాగం
ఐరాల: రాష్ట్ర ప్రజలపై వరుణుడు కరుణించాలనే వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు కాణిపాక ఆలయ ఈవో పూర్ణచంద్రారావు తెలిపారు. వరుణయాగంలో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో స్వామివారి కల్యాణ మండపంలో జప కలశాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆ కలశాలను స్వామివారి ఆలయం వద్ద చేర్చి ప్రత్యేక పూజలు ఆచరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 19 వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వరుణయాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్దకు జప కలశాలను తీసుకువెళ్లి వేదపారాయణం, మంత్రోచ్ఛారణల మధ్య వరుణుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఏఈవో ఎన్ఆర్ క్రిష్ణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర గురుకుల్, సూపరిండెంట్ రవీంద్ర, వేదపండితులు కపిల్వాయ నరసింహమూర్తి,పలువురు పాల్గొన్నారు. -
శ్రీవారికి రూ.కోటి విరాళమిచ్చిన వ్యాపారవేత్త
తిరుమల: టీటీడీకి ఓ భక్తుడు కోటి రూపాయలను విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోటి రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో టీటీడీ ఈవో సాంబశివరావుకు అందజేశారు. ఈ నిధులను టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ బర్డ్ ట్రస్ట్‌కు విరాళంగా ఇస్తున్నట్టు తెలియజేశారు. -
సంప్రదాయ వస్త్రధారణ అమలు చేయండి
డయల్ యవర్ ఈవోలో భక్తుడి విజ్ఞపి తిరుమల : తిరుమలలో విధిగా తిరునామ ధారణ, సంప్రదాయ వస్త్రధారణ అమలు చేయాలని వైఎస్సార్ జిల్లాకు చెందిన వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ సంప్రదాయ వస్త్రధారణ అమలు చేస్తున్నామని, తిరునామం అమలుపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. భక్తులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. విజయ్‌భాస్కర్(అనంతపురం), కుమార్ (కడప): కల్యాణకట్ట, గదుల రీఫండ్ కౌంటర్ల వద్ద నగదు డి మాండ్ చేస్తున్నారు. ఈవో: ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వేంకటేశ్వరరావు(ఏలూరు): వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాన్ని అప్పుడప్పుడు రద్దు చేస్తుండడంతో ఇబ్బందిగా ఉంది. ఈవో: రద్దీ సమయాల్లోనే ముందస్తు సమాచారంతో వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నాం. రామారావు(గుంటూరు), కేశవన్ (చంద్రగిరి): రూ.50 టికెట్లు సాయంత్రం స్లాట్ రావడం లేదు. కోటాను పెంచండి. ఈవో: టికెట్ల పెంపుపై పరిశీలిస్తాం. ఎం.ప్రసాద్(విశాఖపట్నం): టీటీడీ కల్యాణ మండపాలు, ఈ-దర్శన్ కౌంటర్లలో ఆధ్యాత్మిక పుస్తకాలను విక్రయించండి. ఈవో: పరిశీలిస్తాం. శేషుబాబు(పాలకొల్లు): అదనపు లడ్డూ కౌంటర్లో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టండి. ఈవో: అక్కడి సిబ్బంది తగిన సూచనలు ఇస్తాం. పార్ధసారథి(గుంటూరు): తిరుమలలో పోటు కార్మికుల పేరు మార్చండి. ఈవో: పేరు మార్పును పరిశీలిస్తాం. సురేష్ (కాకినాడ): బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజు గ్యాలరీల్లో మరుగుదొడ్ల వసతి కల్పించండి. ఈవో: అవసరమైనన్ని మొైబైల్, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తాం. రామదాస్(తమిళనాడు): తమిళనాడు నుంచి పాదయాత్రగా తిరుమలకు వచ్చే భక్తులకు పుత్తూరులోని టీటీడీ కల్యాణమండపంలో విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించండి. ఈవో: ఎలాంటి కార్యక్రమాలు లేని సందర్భాల్లో పాదయాత్ర భక్తులకు కేటాయిస్తాం. నాగేశ్వరరావు(రేణిగుంట): తిరుపతిలోని గోవిందరాజస్వామి, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాల వద్ద భిక్షగాళ్లను అరికట్టండి. ఈవో: కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. వెంకయ్య(హైదరాబాద్): క్యూ కాంప్లెక్స్‌లో భక్తులకు అందించే అన్నప్రసాదాలు వృథా అవుతున్నాయి. ఈవో: తగిన చర్యలు తీసుకుంటాం. గోపి(తిరుపతి): తిరుచానూరు తోళప్ప గార్డెన్స్ కల్యాణమండపాల్లో కరెంటు పోతే జనరేటర్ లేదు. ఈవో: పరిశీలిస్తాం. హరనాథ్‌రెడ్డి (హైదరాబాద్): పర్వదినాల్లో దాతలకు శ్రీవారి దర్శనం కల్పించండి. ఆనందనిలయం అనంత స్వర్ణమయం గురించి తెలపండి. ఈవో: ప్రత్యేక దినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నాం. అనంతస్వర్ణమయం పథకాన్ని రద్దు చేశాం. దాతల అంగీకారం మేరకు విరాళాలను మరో పథకానికి మళ్లిస్తాం. దాతలు కోరుకుంటే తిరిగి చెల్లిస్తాం. -
ఆన్లైన్లో 25,577 ‘ఆర్జిత’ టికెట్లు
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి తిరుమల : శ్రీవేంకటేశ్వర స్వామివారిని అరుదైన ఆర్జిత సేవల్లో దర్శించుకునేందుకు వీలుగా 25,577 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్లతో కలసి విలేకరులతో మాట్లాడారు. టీటీడీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించాక ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 25,577 ఆర్జితసేవా టికెట్లను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్ బుకింగ్‌కు అందుబాటులోకి ఉంచామన్నారు. టీటీడీ ఆన్లైన్ సేవలు సులభంగా పొందేందుకు వీలుగా ‘పేమెంట్ గేట్‌వే’లోకి ఆంధ్రాబ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తోపాటు ఎస్బీఐను కూడా చేర్చామన్నారు. జూలై 31వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్ సేవలు బుకింగ్ చేసుకుని సాంకేతిక కారణాలవల్ల టికెట్లు పొందని భక్తులు ఈనెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. దాతల సూచనమేరకు నగదు వాపస్ ఆనంద నిలయం-అనంతరం స్వర్ణమయం ప్రాజెక్టును సుప్రీంకోర్టు ఉత్తర్వులతో పూర్తిగా రద్దు చేశామని ఈవో సాంబశివరావు తెలిపారు. అందుకోసం భక్తులిచ్చిన సుమారు రూ. 13 కోట్ల నగదు, 145 కిలోల బంగారాన్ని లేఖల ద్వారా భక్తుల అభిప్రాయాలకు తగ్గట్టుగా తిరిగి ఇవ్వటం, మరికొన్ని టీటీడీ ట్రస్టులు, స్కీమ్‌లకు బదిలీ చేస్తున్నామని ఓ భకుని ప్రశ్నకు బదులుగా ఈవో తెలిపారు. -
నీటి సమస్య తీర్చమన్నందుకు ఈవో దాడి
పంచాయతీ ఆఫీసును ముట్టడించిన ఆర్యవైశ్యులు పరిస్థితి ఉద్రిక్తం పోరుమామిళ్ల : మా వీధిలో నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది. బోరు వేసి నీళ్లు ఇవ్వాలని అడిగేందుకు పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన ఓ యువకుడిని పంచాయతీ కార్యదర్శి కాలితో తన్నడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై 8-30కి ఎస్సై రంగప్రవేశం చేసి కార్యదర్శిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకపోవడంతో మొత్తం సీన్ స్టేషన్‌కు చేరింది. ఆర్యవైశ్య మహిళలు భారీగా తరలిరావడంతో పరిస్థితి తీవ్రస్థాయికి వెళ్లింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి. పట్టణంలోని వైశ్యాబజారులో చేతిపంపు చెడిపోవడంతో నీళ్లు సక్రమంగా రావడం లేదని, పట్టణ శివార్లలో వేసిన బోరులో నీళ్లు పడ్డాయని తెలిసిన ఆర్యవైశ్యులు రాత్రి పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. కార్యదర్శి ముజఫర్ రహీమ్‌తో మా వీధిని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. దీంతో ఈవోతో వైశ్యులకు మాటా మాటా పెరిగింది. ఈఓ పెడసరంగా మాట్లాడ్డంతో పలుకూరి కుమార్ అనే యువకుడితో వాగ్వివాదం జరిగింది. రెచ్చిపోయిన ఈవో రహీమ్ లేచి కాలితో కుమార్‌ను తన్నడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ విషయం అందరికీ తెలియడంతో ఆర్యవైశ్యులు అక్కడకు చేరుకున్నారు. వారికి ఈవోకు మద్దతుగాఉన్నవారు, సిబ్బంది, కొందరు వార్డు సభ్యుడు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు. ఓ దశలో ఈవోతో కుమార్‌కు క్షమానణ చెప్పించే ప్రయత్నం జరిగింది. ఇంతలోనే వైశ్యమహిళలు భారీగా అక్కడకు చేరడంతో మళ్లీమొదటికి వచ్చింది. ఈ సమాచారం తెలిసి చేరుకున్న పోలీసులు అందరినీ బయటకు పంపించారు. ఎస్ఐ కృష్ణంరాజునాయక్ అక్కడకు చేరుకుని ఈవోను జీబులో ఎక్కించుకుని వెళ్లడంతో మొత్తం సీన్ స్టేషన్‌కు మారింది. న్యాయం జరక్కపోతే ధర్నాకు కూర్చుంటామని వైశ్యులు స్పష్టం చేశా రు. ఘర్షణ తెలిసి సర్పంచ్ హబీబున్నీసా హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి సమీక్షిస్తుండగానే రంగం స్టేషన్‌కు మారింది. ఎస్సై సూచన మేరకు ఈవోపై ఫిర్యాదు ఇస్తున్నట్లు తెలిసింది. -
పరవశించిన భక్తజనం
♦ రెండో రోజు భారీగా తరలివచ్చిన సాయి భక్తులు ♦ నేటితో ముగియనున్న గురుపౌర్ణమి ఉత్సవాలు ♦ ఉట్టి ఉత్సవాలతో ఘనంగా ముగింపు సాక్షి ముంబై : గురుపౌర్ణమి ఉత్సవాలతో షిర్డీ పుణ్యక్షేత్రం శుక్రవారం జనసంద్రమైంది. భారీగా తరలివచ్చిన భక్తజనం సాయి దర్శించుకుని పరవశించారు. సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో ఈ రోజు ప్రధానం కావడంతో పలు కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. దీంతో షిర్డీ పురవీధులన్ని భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం ‘శ్రీ సాయి సచ్ఛరిత్ర’ పవిత్ర గ్రంథం అఖండ పారాయణం సమాప్తి అయింది. అనంతరం శ్రీసాయి చిత్రపటం, పోతి (ధాన్యపు సంచి)ని ఊరేగించారు. సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా కోర్టు జడ్జి వినయ్ జోషీ ‘పోతి’ చేతబట్టుకోగా, మందిరం కార్యనిర్వహణ అధికారి (ఈవో) రాజేంద్ర జాదవ్, డిప్యూటీ ఈవో అప్పాసాహెబ్ షిండే సాయి చిత్రపటాన్ని చేతపట్టుకున్నారు. సాయిబాబా మందిర పరిసరాల్లోని ఐదు మందిరాలు గురుస్థాన్ మందిరంతోపాటు శని మందిరం, గణపతి మందిరం, మహాదేవ్ మందిరం, నందాదీప్ మందిరాలకు సాయిభక్తుడు విజయ్ కుమార్ సహకారంతో బంగారు పూతను అద్దారు. శ్రీ సాయి సచ్ఛరిత్రను మరాఠీ నుంచి గుజరాతీలోకి హీనాబెన్ మెహతా అనువదించారు. ఈ గ్రంథాన్ని ఈవో రాజేంద్ర జాదవ్, డిప్యూటీ ఈవో అప్పాసాహెబ్, హీనాబేన్ మెహతా సమక్షంలో అవిష్కరించారు. ఢిల్లీలోని తన మొత్తం ఆస్తిని బాబా సంస్థాన్‌కు విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్న సుధాకిరణ్‌ను ఈ సందర్భంగా సత్కరించారు. భక్తులు అందజేసిన విరాళాలతో షిర్డీ వచ్చే వారందరికీ ఉచిత ప్రసాదం, భోజనం అందిస్తున్నారు. గురుపౌర్ణమి ఉత్సవాల చివరి రోజైన శనివారం గురుస్థాన్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అదే విధంగా ఉట్టిఉత్సవాలు, ప్రత్యేక కీర్తనల కార్యక్రమాలు ఉండనున్నాయి. -
అర్థరాత్రి వరకు దర్శన టికెట్ల బుకింగ్!
తిరుపతి అర్బన్: టీటీడీ ఆధ్వర్యంలో జారీ చేస్తున్న రూ.300 ఆన్లైన్ ప్రత్యేక దర్శన టికెట్లను ఇకపై అర్థరాత్రి 12 గంటల వరకు బుక్ చేసుకునేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఈవో సాంబశివరావు వెల్లడించారు. ప్రస్తుతం రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను రాత్రి 7 గంటల వరకు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అయితే భక్తుల సౌకర్యార్థం ఈ మార్పుపై ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానంలో వచ్చే సూచనలు అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలో పోలీసులు - ఐబీ జాయింట్ డెరైక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణ - తిరుమల, తిరుచానూరులో దర్శన ఏర్పాట్లను సమీక్షించిన టీటీడీ అధికారులు - అధికారులతో పలుమార్లు కలెక్టర్ సమావేశం సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం జూలై 1న తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తిరుమలలో టీటీడీ ఈవో సాంబశివరావుతో పాటు అన్ని శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన సూచనల మేరకు రెవెన్యూ, టీటీడీ అధికారులు పలుమార్లు సమావేశమై దాదాపు ఏర్పాట్లు పూర్తిచేశారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ పలుమార్లు అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా వస్తున్నందున భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ముఖ్యంగా తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య ఇతర అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి తొలుత తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలోపే తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకుని తిరుమల నుంచి సాయంత్రం 4 గంటలకు బయలు దేరుతారు. 5.50 గంటలకు రేణిగుంటకు చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగుపయనమవుతారు. సీఎం నారా చంద్రబాబునాయు డు జూలై 1వ తేదీన ఉదయం 10గంటలకు రేణిగుం ట విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకే ముఖ్యమంత్రి ముందుగా గోదావరి పుష్కరాల్లో హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా రాజ మండ్రికి బయలుదేరి వెళతారు. రాష్ట్రపతి పయనిం చే రోడ్డు మార్గాలతో పాటు, ఆయన బసచేసే పద్మావతి అతిథి గృహాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లలో పోలీసులు నిమగ్నం రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉన్నతాధికారులు తిరుపతిలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డెరైక్టర్ చంద్రశేఖర్ అజాద్, ఇంటెలిజెన్స్ డీఐజీ పి.వి.యస్ రామకృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, సీఎం ముఖ్య భద్రతాధికారి జె.సత్యనారాయణ, గ్రెహౌండ్స్ ఎస్పీ శ్రీనివాసులు తిరుపతి అర్బన్ జిల్లాల పరిధిలోని ముగ్గురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు సమావేశమై భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. తిరుచానూరులో దర్శన ఏర్పాట్ల పరిశీలన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లను సోమవారం టీటీడీ ఈవో సాంబశివరావు నేతృత్వంలో పర్యవేక్షించారు. -
ముక్కంటిచెంత మాస్టర్ ప్లాన్
- దేవస్థానంలో భారీ మార్పులు - ఆలయం వద్ద భవనాల తొలగింపు - భవనాలన్నీ భరద్వాజతీర్థం వద్దకు తరలింపు శ్రీకాళహస్తి : మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో భారీ మార్పులు చేయనున్నట్లు ఈవో బి.రామిరెడ్డి తెలిపారు. శనివారం దేవస్థానంలోని పరిపాలన భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేవస్థానంలో భారీ మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఆల యాన్ని పరిశీలించడానికి సోమవారం(22వ తేదీ) ఆర్కియాలజీ శాఖకు చెందిన బృం దం వస్తోందని చెప్పారు. వారి సలహాల మేరకు భవనాల తొలగింపు, నిర్మాణాలు ఉంటాయన్నారు. అన్ని రకాల రాహుకేతు పూజలు ఇకపై ఆలయంలోపల కాకుండా ఆలయ ప్రాంగణంలోనే పెద్దఎత్తున భక్తులు విచ్చేసినా ఇబ్బం దులు లేకుండా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని అన్నదాన మండపం, పరిపాలన భవనం, జ్ఞానప్రసూనాంబ, త్రినేత్ర అతిథి భవనాలను తొలగించి భరద్వాజతీర్థం(ఆలయానికి 500 మీటర్ల దూరంలో) వద్ద నిర్మించనున్నట్లు చెప్పారు. సన్నిధివీధిలోని పలు ప్రైవేటు భవనాలు తొలగిస్తారని తెలిపా రు. ఆలయ ఈఈ కె.రామిరెడ్డి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్‌లో చేపట్టాల్సిన అంశాలపై ఇటీవల తమకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగుమాడ వీధుల్లో రథోత్సవం నిర్వహించడం ఇబ్బందిగా ఉందన్నారు. ట్రాఫిక్, భక్తులకు సౌకర్యాల దృష్ట్యా నాలుగు మాడ వీధుల్లోనూ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా పెద్ద ఎత్తున భవనాలు తొలగిస్తారని తెలిపారు. భరద్వాజతీర్థంలోనే గోశాలకు అవసరమైన షెడ్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. స్వర్ణముఖినదిలో మురుగునీరు తొలగించి భక్తులు స్నానాలు చేసే విధంగా మం చినీరు నిలువ ఉండడం కోసం చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. -
ముక్కంటి చెంత మార్పులకు శ్రీకారం
- రాహుకేతు పూజలు ఇకపై రెండు రకాలే ? - వీఐపీలకే రూ.2,500 రాహుకేతు పూజా టికెట్లు - అంతా ఆన్లైన్ చేసే ఆలోచనలో అధికారులు - ధూర్జటి కళాపీఠం ఏర్పాటుకు సన్నాహాలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిత్యం జరిగే పూజలతో పాటు అభిషేకాల్లో మార్పులు చేయడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఆ మేరకు ఈవో బీ.రామిరెడ్డి తన చాంబర్ లో దేవస్థానం ప్రధాన అర్చకుడు బాబుగురుకుల్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే, సాహితీవేత్త, దేవస్థానం ఆస్థాన పండితుడు సాయికృష్ణయాచేంద్రతో ఆది వారం నాలుగు గంటల పాటు చర్చించారు. పూజలతో పాటు అభిషేకాల టికెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. పలు సేవా టికెట్లు కుదించనున్నా రు. ప్రస్తుతం రూ.300, రూ.750, రూ.1500, రూ.2500 టికెట్ల ద్వారా రాహుకేతు పూజలు చేస్తున్నారు. ఇకపై అలా కాకుండా కేవలం రూ.1000 టికెట్ ద్వారా మాత్రమే ఆలయం వెలుపల ప్రత్యేక మండపంలో రాహుకేతు పూజలు చేయాలని భావిస్తున్నారు. ఆలయం లోపల కేవలం వీఐపీలకు మాత్రమే రూ.2,500 టికెట్ ద్వారా రాహుకేతు పూజలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. అవి కూడా 50లోపే కేటాయించనున్నారు. రు ద్రాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం టికెట్లనూ కుదించనున్నారు. పలు అభిషేకాల టికెట్లు రోజుకు 50లోపే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక ధూర్జటి కళాపీఠం ఏర్పాటు చేయాలని చర్చించారు. ఆలయ చరిత్రను తెలిపే అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలయంలో లభించేలా చర్యలు తీసుకోనున్నారు. సాయికృష్ణ యాచేంద్ర గతంలో(15ఏళ్ల క్రితం) ఇదిగో దక్షిణ కైలాసం అనే అద్భుతమైన సీడీని తయారుచేసి ఆలయానికి బహూకరించారు. అలాగే జ్ఞానప్రసూనాంబపై ఏడు స్తోత్రాలతో భక్తిభావాన్ని తెలిపే కీర్తనలు రూపొందించానని, త్వరలో ఆలయానికి అందజేస్తానని ఆయన ఈవోకు తెలిపారు. -
శ్రీకాళహస్తి దేవస్థానంలో ఏసీబీ తనిఖీలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో తాజాగా ఏసీబీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం పరిపాలన భవనంలో మంగళవారం రాత్రి నుంచి ఏసీబీ అధికారులు వివిధ రికార్డులను పరిశీలిస్తున్నారు. దేవస్థానంలో 2010 నుంచి 2013 వరకు జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేస్తున్నారు. అవినీతి నిరోధకశాఖ(తిరుపతి) సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో బుధవారం పలు కీలకమైన రికార్డులను పరిశీలించారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో రెండేళ్లుగా తనిఖీలు...విచారణలు జరుగుతూనే ఉన్నాయి. 2010 నుంచి 2013 వరకు జరిగి అక్రమాలపై మొదట్లో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఏడాది పాటు పలు సార్లు రికార్డులను తనిఖీలు చేశారు. పలు రికార్డులను హైదరాబాద్‌కు సైతం తరలించి నిశితంగా పరిశీలించారు. తాజాగా ఏసీబీ నేతృత్వంలో విచారణ సాగుతుంది. ప్రధానంగా అప్పట్లో వెండి కొనుగోలులో అక్రమాలు, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అవసరానికి మించి ఖర్చులు చేసినట్లు రికార్డులు చూపడం, ఉద్యోగాల నియామకాలు, హరితాభివృద్ధిలో ఉద్యోగాలు, హరితాభివృద్ధి నుంచి పలువురిని ఆలయంలోకి డెప్యూటేషన్‌పై బదిలీ చేయడం తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు. అప్పటి ఈవో శ్రీరామచంద్రమూర్తి పాలన కాలంలోనే అవినీతి అధికంగా జరిగినట్లు భావిస్తూ పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. దీంతో అవినీతి అక్రమాలకు పాల్పడినవారి గుండెల్లో గుబులు పుడుతోంది. -
విరిగిపడిన కొండచరియలు
♦ దుర్గగుడి టోల్గేట్ సమీపంలో ఘటన ♦ భయభ్రాంతులైన వాహనచోదకులు భవానీపురం : నగరంలో శుక్రవారం తెల్లవారుజామున వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీనికితోడు దుర్గగుడి వద్ద కొండచరియలు విరిగిపడడంతో జనం ఉలిక్కిపడ్డారు. అయితే కొద్దిసేపు కురిసిన వర్షానికి కొండరాళ్లు పడలేదని, యాదృచ్ఛికంగానే పడ్డాయని పోలీసులు, దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుర్గగుడి టోల్గేట్ సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పెద్ద కొండరాయి ఉదయం 7 గంటల సమయంలో అకస్మాత్తుగా విరిగిపడింది. సరిగ్గా ఆ సమయంలో నందిగామ నుంచి విజయవాడవైపు వస్తున్న కారు డోరుకు రాళ్లు తగిలాయి. కారులోపల ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఏమీ కాకపోవడంతో వారు ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. ట్రాఫిక్ ఏసీపీ ఎం.చిదానందరెడ్డి, భవానీపురం సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐలు ప్రసాద్, రామకృష్ణుడు సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం జేసీబీతో పడిపోయిన కొండరాళ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఐరన్ మెష్‌తో బారికేడింగ్ ఏర్పాటు చేస్తాం : ఈవో నరసింగరావు విషయం తెలిసిన వెంటనే శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో నరసింగరావు, ఈఈలు కోటేశ్వరరావు, మురళీబాలకృష్ణ, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఈవో మీడియాతో మాట్లాడుతూ కొండప్రాంతం లూజ్‌సాయిల్ కావడంతోపాటు పిండిరాళ్లు కావడంతో మామూలుగానే పడిపోయిందని చెప్పారు. ఘాట్ రోడ్లో కొండరాళ్లకు ఏర్పాటు చేసినట్లుగానే టోల్గేట్ నుంచి సుమారు 60 అడుగుల పొడవున (దేవస్థానం సరిహద్దు వరకు) ఐరన్ మెష్తోకూడిన డబుల్ బారికేడింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
7న శ్రీశైలంలో కుంభోత్సవం
కర్నూలు: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబాదేవికి మంగళవారం వార్షిక కుంభోత్సవం జరగనుంది. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత అమ్మవారికి సాత్విక బలి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశిని సమర్పిస్తారు. అదే రోజు సాయంత్రం శ్రీ మల్లికార్జునస్వామివారికి ప్రదోషకాల పూజలు నిర్వహించిన అనంతరం అన్నాభిషేకంతో లింగాన్ని కప్పివేసి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. సాయంత్రం స్వామివారి దర్శనం ఉండదు. అమ్మవారి ఆలయంలో సింహమండపం వద్ద వండిన అన్నం కుంభరాశిగా పోస్తారు. సాంప్రదాయానుసారం స్త్రీ వేషంలోని పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పిస్తారు. ఆ తర్వాత అమ్మవారి దర్శనార్థం భక్తులను అనుమతిస్తారు. కుంభోత్సవం సందర్భంగా క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులను నిషేధించినట్లు ఈవో సాగర్‌బాబు తెలిపారు. ఎవరైనా ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే మూడు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు దేవాదాయ చట్ట ప్రకారం జరిమానా విధించబడుతుందన్నారు. -
క్షీరా రామం..భక్తిధామం
పొలకొలనుగా.. క్షీరపురిగా విలసిల్లిన పాలకొల్లు పట్టణంలోని శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం (పెదగోపురం) పంచారామ క్షేత్రాల్లో ఒకటి భాసిల్లుతోంది. క్షీరా రామలింగేశ్వరుడి పేరుతో ఇక్కడ కొలువైన పరమ శివుణ్ణి దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. కార్తీక మాసంలో లక్షలాది మంది ఇక్కడి శివలింగాన్ని దర్శించి పునీతులవుతారు. గోదావరి నది సముద్రంలో సంగమించే నరసాపురం పట్టణం పాలకొల్లుకు అతి సమీపంలో ఉండటంతో పుష్కర యాత్రికులు క్షీరా రామలింగేశ్వరుడిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ పెదగోపురాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.85 లక్షలను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో క్షీరపురిలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయ అర్చకులు, ఆలయ పరిధిలోని దుకాణాల యజమానుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చల్లపు సూర్యచంద్రరావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. భక్తులు, అర్చుకులు, దుకాణాల యజమానులతో మాట్లాడారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్ ఇలా సాగింది. ఈవో : అమ్మా.. నా పేరు సూర్యచంద్రరావు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా వచ్చాను. మీ సమస్యలేమిటో చెప్పండి. విజయలక్ష్మి, భక్తురాలు : ప్రతి సోమవారం స్వామికి ఇచ్చే పంచ హారతులను దర్శించుకునే భాగ్యం కేవలం ముందు వరుసలో భక్తులకు మాత్రమే కలుగుతోంది. ఆలయానికి వచ్చే వారందరికీ పంచహారతులు దర్శించుకోవడానికి అవకాశం కల్పించండి. ఈవో : మంచి సూచన చేశారు. వచ్చే సోమవారం నుంచి భక్తులందరికీ పంచహారతుల దర్శన భాగ్యం కల్పిస్తాం. ఆదిమూల నాగేశ్వరరావు, భక్తుడు : నమస్కారమండీ. ఆలయం ముందు దుకాణాలు పెట్టడం వల్ల భక్తులకు ఇబ్బందిగా ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. అయినా స్పందన లేదు. ఈవో : నిజమే కొద్దిరోజులుగా సమస్య తీవ్రమైంది. దుకాణాలున్న ప్రాంతం మునిసిపాలిటీది కావడం వల్ల మునిసిపల్ కమిషనర్‌కి లేఖ రాశాం. ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే. లింగం సత్యనారాయణ, భక్తుడు : మాది పూలపల్లి. పొరుగూరు నుంచి వచ్చే భక్తులకు వాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం ఆలయ పరిసరాల్లో లేదు. గుడికి దగ్గరలో పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. ఈవో : పుష్కరాల నేపథ్యంలో దేవుని హాలును అభివృద్ధి చేస్తున్నాం. రూ.35 లక్షలతో నిర్మించే అభిషేకాల మండపం దిగువ భాగంలో పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తాం. నీలకంఠేశ్వరి, భక్తురాలు : పొరుగూరు నుంచి వచ్చే భక్తులకు విశ్రాంతి తీసుకోవడానికి సరైన సదుపాయం లేదు. దూర ప్రాంత భక్తులు స్వామి దర్శనానంతరం కొద్దిసేపు సేదతీరే అవకాశం ఆలయ పరిసరాల్లో కల్పించాలి. ఈవో : పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా అభిషేకాల మండపం నిర్మిస్తున్నాం. దీంట్లో భక్తులు సేదతీరే వీలుంటుంది. మార్కండేయులు, భక్తుడు : నిత్యం గుడిలోనే ఉంటా. గర్భగుడిలో వీఐపీల పేరుతో కొంతమందికి ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. దీనివల్ల సామాన్య భక్తులు దర్శన భాగ్యం కోసం గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. ఈవో : కార్తీక మాసం, పర్వ దినాల్లో ఈ సమస్య తలెత్తుతోంది. గర్భగుడి లో అభిషేకాలను ఇకనుంచి చేయని వ్వం. అభిషేకాల కోసం పుష్కర నిధులతో ప్రత్యేక మండపం నిర్మిస్తున్నాం. ఎస్.గణపతి, భక్తుడు : ఈవో గారూ. పుష్కరాల సందర్భంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్నసమారాధన చేయాలి. అవసరమైతే మైకుల్లో ప్రచారం చేయండి. భక్తుల నుంచి విరాళాలు వసూలు చేయండి. సాధారణ రోజుల్లో ప్రతి సోమవారం భక్తులకు అన్నసమారాధన చేయించండి. ఈవో : మంచి సూచన చేశారు. ఇకనుంచి ముందు పట్టణేతరులకు టోకెన్లు ఇచ్చి ఆ తరువాత మిగిలితే స్థానికులకు భోజనం పెట్టే ఏర్పాటు చేస్తాం. అనంతరం ఈవో సూర్యచంద్రరావు పురోహితుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈవో : అర్చక స్వాములూ.. మీ సమస్యలేమిటో చెప్పండి. కోట నాగబాబు, పురోహితుడు : మాకంటూ ప్రత్యేకంగా సమస్యలు లేవు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నివిధాలా సేవలందిస్తాం. పుష్కర సమయాల్లో అరగంట మాత్రమే విశ్రాంతి ఇస్తాం. మద్దూరి సూర్యనారాయణమూర్తి, పురోహితుడు : గత పుష్కరాల్లో పురోహితులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఈ పుష్కరాలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కోరుతున్నాం. ఈవో : ఈ విషయమై శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశాం. తప్పనిసరిగా పురోహితులందరికీ గుర్తింపు కార్డులిచ్చే ఏర్పాట్లు చేస్తాం. అనంతరం ఆలయానికి చెందిన షాపులను లీజుకు తీసుకు వ్యాపారాలు చేస్తున్న వారితో ఈవో మాట్లాడారు. వివిధ సమస్యలను వ్యాపారులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఆలయానికి సంబంధించి 42 షాపులు ఉన్నాయని, తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో షాపుల్లో పనిచేసే గుమాస్తాలు, యజమానులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. వీటిలో నీటి సౌకర్యం లేదని, ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. పుష్కర నిధులతో మరుగుదొడ్లకు మరమ్మతులు చేస్తున్నామని ఈవో సమాధానమిచ్చారు. స్థలాభావం వల్ల అదనపు మరుగుదొడ్లు నిర్మించే అవకాశం లేదన్నారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పుష్కర యాత్రికులకు సమస్యలు రానివ్వం పుష్కర యాత్రికులకు ఎలాంటి సమస్యలు రానివ్వం. దూర ప్రాంతాల నుంచి వచ్చే పుష్కర యాత్రికుల కోసం 12 రోజులపాటు పట్టణంలోని అన్నసమారాధన సత్రాల సహకారంతో మెయిన్ రోడ్డులోని రేపాక వారి సత్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. భక్తుల విశ్రాంతి కోసం అన్నదాన సత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు భక్తుల సౌకర్యాల కోసం ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు రూ.85 లక్షలు మంజూరు చేయించారు. రూ.50 లక్షలతో ఆలయానికి రంగులు, వైరింగ్ మరమ్మతులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు చేయిస్తున్నాం. మరో రూ.35 లక్షలతో అభిషేక మండపాల నిర్మిస్తున్నాం. ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తవుతాయి. - చల్లపు సూర్యచంద్రరావు, ఈవో -
ఈవో ముందుచూపు
వేసవిలో భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సత్వర సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు వసతి గృహాల మరమ్మతులు చేపట్టండి పెండింగ్ పనుల పూర్తికి కార్యాచరణ టీటీడీ అధికారులకు ఈవో సాంబశివరావు ఆదేశం తిరుపతి కల్చరల్: వేసవిలో అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాల్లో (పీఏసీ) ఎలాంటి మరమ్మతులు లేకుండా చర్యలు చేపట్టాలని టీటీఈ ఈవో సాంబ శివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన్‌లోని తన కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్రికుల వసతి సముదాయాల్లో లాకర్లు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ సమస్యలు ఏవైనా ఉంటే సత్వరం గుర్తించి మరమ్మతులు చేయాలని కోరారు. ఇందు కోసం తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరావు అధ్యక్షతన చీఫ్ ఇంజినీర్, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారితో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ పెండింగ్ పనులను గుర్తించి నెలరోజుల్లోపు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. భక్తుల భద్రత దృష్ట్యా అన్ని పీఏసీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల ఒకటి, రెండో ఘాట్ రోడ్లలో సమర్థవంతంగా పరిశుభ్రత పనులు చేపట్టాలని కోరారు. నడక దారుల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలని ఆదేశించారు. తిరుమల, తిరుపతిలోని ఐటీ సమస్యలను త్వరిగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఈవో ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ కల్యాణ మండపాల్లో సివిల్, ఎలక్ట్రికల్ వంటి మరమ్మతులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో సివిల్ పనులను వేగవంతం చేయాలన్నారు. పవన విద్యుత్, సౌర విద్యుత్‌ను టీటీడీ అవసరాలకు వినియోగించుకునేందుకు మరింత అధ్యయనం చేయాలని ఈవో సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
ఆది దంపతుల పురవిహారం
శ్రీకాళహస్తి: కొత్త పెళ్లికొడుకైన శ్రీకాళహస్తీశ్వరస్వామి శనివారం రాత్రి అశ్వవాహనంపై శ్రీకాళహస్తి పురవిహారం చేశారు. నూతన వధువైన జ్ఞానప్రసూనాంబ సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కైలాసగిరి ప్రదక్షిణ సందర్భంగా ఉదయం వెళ్లిన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు తిరిగి సాయంత్రానికి పట్టణ పొలిమేర్లకు వేంచేపుచేశారు. ఈ సందర్భంగా భక్తులు భారీసంఖ్యలో ఎదురువెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత అశ్వవాహనంపై స్వామివారు అధిరోహించారు. సింహవాహనంపై అమ్మవారు ఆశీనులయ్యారు. విద్యుత్ దీపాల కాంతిలో వివిధ కళా బృందాల సమక్షంలో ఊరేగింపు వేడుకగా జరిగింది. భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకుని కర్పూరహారతులిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో రామిరెడ్డి దంపతులతో పాటు అధికారులు పాల్గొన్నారు. -
'జరగని ఘటనను మీడియాకు అందించటం దురదృష్టకరం'
తిరుపతి : కలియుగ దైవం శ్రీనివాసుడికి సుప్రభాత సేవ ఆలస్యమైందంటూ వచ్చిన వార్తలపై టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వివరణ ఇచ్చారు. బంగారు వాకిలి తాళం చెవి విరిగిపోవటంతో వాటిని వాటిని పగలగొట్టి ఉదయం 2.30 గంటలకు తెరిచామని ఆయన తెలిపారు. సుప్రభాత సేవను యథావిధిగానే తెల్లవారుజామున మూడు గంటలకు నిర్వహించామని, ఎక్కడా ఆలస్యం జరగలేదని జేఈవో తెలిపారు. జరగని ఘటనను మీడియా సమాచారం అందించటం దురదృష్టకరమన్నారు. కాగా సుప్రభాత సేవ సమయంలో బంగారు వాకిలి తలుపులు త్వరగా తెరవలేదంటూ సిబ్బందితో పాటు అర్చకులపైనా టీటీడీ ఈవో సాంబశివరావు మండిపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై టీటీడీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
టీటీడీ సిబ్బందిపై ఈవో మండిపాటు
తిరుమల: టీటీడీ సిబ్బంది తీరుపై టీటీడీ ఈవో సాంబశివరావు మండిపడ్డారు. సుప్రభాత సేవ సమయంలో బంగారు వాకిలి తలుపులు త్వరగా తెరవలేదంటూ సిబ్బందితో పాటు, అర్చకులపై ఆయన బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన వచ్చిన సమయంలో బుధవారం వేకువజామన ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై టీటీడీ అధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. కాగా, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే. -
శ్రీలంక అధ్యక్షుడితో ఈవో భేటీ
శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన దంపతులతో మాట్లాడుతున్న ఈవో సాంబశివరావు, పక్కన జేఈవో శ్రీనివాసరాజు తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు బేటీ అయ్యారు. మంగళవారం రాత్రి తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికిన తర్వాత మర్యాదపూర్వకంగా సిరిసేను కలిశారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని, ఆలయ విశిష్టతను, భక్తులకు టీటీడీ కల్పించే సౌకర్యాలను సిరిసేనకు వివరించారు. ఆయన చాలా ఆసక్తిగా విన్నారు. బుధవారం సుప్రభాత సేవలో సిరిసేన బృందం స్వామివారిని దర్శించుకోనుంది. అంతకుముందు రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా సిరిసేనను కలసి స్వాగతం పలికారు. -
కృష్ణా పుష్కర పనులకు ఏప్రిల్‌లో శ్రీకారం
సాక్షి, విజయవాడ : వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో పవిత్ర కృష్ణానదిలో స్నానాలు చేయడానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు వచ్చే ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. విజయవాడ కృష్ణానదీ తీరంలో దుర్గాఘాట్, వీఐపీ ఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్, పద్మావతి ఘాట్లు ఉన్నప్పటికీ దుర్గాఘాట్కే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సౌకర్యాల కల్పనపై దేవస్థానం అధికారులు త్వరలో సమావేశం ఏర్పాటుచేసి పనులు ప్రారంభించాలని ఈవో సీహెచ్ నర్సింగరావు నిర్ణయించారు. రూ.25 లక్షలు మంజూరు... దుర్గాఘాట్ నిర్వహణ మాత్రమే దేవస్థానం పరిధిలో ఉంది. మిగిలిన ఘాట్లు ఇరిగేషన్ అధికారుల ఆధీనంలో ఉంటాయి. అందువల్ల దుర్గాఘాట్‌కు రూ.25 లక్షల దేవస్థానం నిధులు విడుదల చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.25 లక్షల నుంచి 50 లక్షల నిధులు రాబట్టి పనులు చేయాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. తొలుత కేశఖండన శాలలో మార్పులు... దుర్గాఘాట్‌లో తలనీలాలు సమర్పించేందుకు కేశఖండన శాల ఉంది. దీన్ని భవనం పై అంతస్తులోకి మార్చి కింద భాగంలో భక్తుల కోసం మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా సెప్టిక్‌ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్‌లో ఉన్న చెత్త(సిల్ట్)ను తొలగించి నీటిని శుభ్రం చేస్తారు. ఇదంతా పుష్కర ఏర్పాట్ల ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని నిర్ణయించారు. భక్తులకు కల్పించే సౌకర్యాలు ఇవీ... పుష్కరాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఒకేసారి 200 మంది జల్లు స్నానాలు చేసేవిధంగా 200 షవర్లను ఏర్పాటు చేస్తారు. నదిలో నుంచి 60 మీటర్ల వరకు పైపులు వేసి జల్లు సాన్నాలకు శుభ్రమైన నీరు వచ్చే విధంగా ఐదారు మోటార్లు వినియోగిస్తారు. ఘాట్‌లో ఉన్న నీరు కలుషితం కాకుండా ఉండేందుకు ఇక్కడి దుకాణాల్లో సబ్బుల విక్రయాలు నిషేధిస్తారు. కేవలం పసుపు, కుంకుమల విక్రయానికే అనుమతి ఇస్తారు. ⇒ భక్తుల కోసం అందుబాటులో ఉన్న స్థలంలోనే మరుగుదొడ్లు 30, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు మరో 30 ఏర్పాటు చేస్తారు. ⇒ వృద్ధులు, వికలాంగులు నదిలోకి దిగి స్నానాలు చేయదలిస్తే వారి కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ర్యాంపును ఉపయోగంలోకి తెస్తారు. ⇒ వేలాది మంది భక్తులు స్నానాలు చేస్తే ఘాట్‌లో నీరు మురికి అయ్యే అవకాశం ఉన్నందున ఘాట్‌కు ఆరేడు మీటర్ల దూరంలోనే నీటిని క్లోరినేషన్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల భక్తులకు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. ⇒ పెద్దపెద్ద మోటార్లను ఉపయోగించి ఘాట్‌లోని నీటిని నదిలోకి పంపుతూ ఘాట్‌లోకి శుభ్రమైన నీరు వచ్చే విధంగా వాటర్ రీప్లేస్మెంట్ స్కీమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ⇒ భక్తుల సౌకర్యం కోసం ఆరేడు హెల్ప్‌లైన్ సెంటర్లు, వైద్య బృందాలు ఏర్పాటు చేస్తారు. ⇒ ఘాట్‌లో స్నానాలు చేసే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న ఏడు బస్సులకు అదనంగా మరో ఐదారు ఏర్పాటు చేస్తారు. కొండపై నుంచి బస్టాండ్, రైల్వేస్టేషన్లకు ఉచిత సర్వీసులు నడుపుతారు. ⇒ కొండపైన ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేసి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. -
మాన్యం భూములపై మాటేశారు
►తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు యత్నం ►వేలంపాట పాడకుండా అడ్డుకుంటున్న వైనం ►800 ఎకరాలు ఉన్నా స్వామికి దీపం పెట్టే దిక్కులేదు ►శిథిలావస్థకు చేరిన బంగారుపేట వేణుగోపాలస్వామి ఆలయం సాక్షి ప్రతినిధి, నెల్లూరు : బంగారుపేటలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ భూములపై టీడీపీ నేతలు కన్నేశారు. వేలంపాట జరగనివ్వకుండా చేసి ఆ భూములను పంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే వందల ఎకరాల ఆసామి అయిన శ్రీవేణుగోపాలస్వామికి దీపం పెట్టే వారు కరువయ్యారు. ప్రస్తుతం ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. వివరాల్లో కెళితే... వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని బంగారుపేటలో శ్రీవేణుగోపాలస్వామి పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయానికి బాలాయపల్లి మండలపరిధిలో సర్వేనంబర్ 180ఏ, 150, 154, 155, 156, 157లో సుమారు 803.30 ఎకరాల భూములున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 180ఏ, 150, 154 సర్వే నంబర్లలోని 165.25 ఎకరాలను ఇప్పటికే కొందరు వేలంపాట ద్వారా దక్కించుకుని పంటలు సాగుచేస్తున్నారు. ఎకరం ఏడాదికి కేవలం రూ.600 చొప్పునే దక్కించుకున్నారు. ఇదే విషయాన్ని ఈఓ రామచంద్రరావు స్పష్టం చేశారు. వేలంపాట ద్వారా మాన్యం భూములపై మాటేశారు దక్కించుకున్న వారిలో ఎక్కువమంది టీడీపీకి చెందిన నాయకులేనని స్థానికులు చెబుతున్నారు. వేలంపాట ద్వారా పాడుకున్న పొలంలో నిబంధనలకు విరుద్ధంగా పంటలు సాగుచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. దీర్ఘకాలిక పంటలు, బోర్లు వేయకూడదని నిబంధనలు ఉన్నా.. కొందరు టీడీపీ నేతల అనుచరులు నిమ్మతోటలు, బోర్లువేసి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సాగుచేసుకుంటున్న వారిలో టీడీపీ నేతల బినామీలు కూడా ఉన్నారు. వేలం జరగనివ్వకుండా అడ్డుకుంటున్న తమ్ముళ్లు 157-1,2,3,4,5,6,7,8లోని మరో 171.05 ఎకరాలకు వేలంపాట పెట్టేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే రెండు పర్యాయాలు వేలంపాట పెట్టారు. ఓసారి వేణుగోపాలపురంలో.. మరోసారి కయ్యూరులో జరిపినా.. టీడీపీ నేతలు కొందరు వాయిదా వేయించారు. వేలంపాటకు ఎవరూ రాకపోతే ఎకరం రూ.600కే దక్కించుకునేందుకు పథకం వేశారు. అయితే బంగారుపేట గ్రామానికి చెందిన కూన మల్లికార్జునయ్యతో పాటు మరికొందరు స్థానికులు డబ్బులతో వేలం వద్దకు చేరుకున్నారు. అయితే పాట పాడనివ్వకుండా కారణం లేకుండానే అడ్డుకున్నారు. ఎలాగైనా మాన్యం భూములను టీడీపీ నేతలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు అధికారులు కొందరు సహకరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి మాన్యం ఎన్ని ఎకరాలున్నాయో సంబంధిత అధికారులుకు ఇప్పటికీ తెలియకపోవటం గమనార్హం.శిథిలావస్థకు చేరిన ఆలయం.. బంగారుపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. దీపం పెట్టేవారు కూడా కరువయ్యారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీని సైతం కూల్చివేసి ఉన్నారు. అదేవిధంగా పిచ్చిమొక్కలు మొలిచి అధ్వానంగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఆలయం మాన్యం భూముల నుంచి ప్రతి ఏటా సుమారు రూ.60 వేల వరకు కౌలు వస్తోందని ఈఓ రామచంద్రరావు స్పష్టం చేశారు. అదేవిధంగా ఆలయ పూజారి నివసిస్తున్న నివాసం కూడా శిథిలమైంది. ప్రతి ఏటా శ్రీవేణుగోపాలస్వామి ఉత్సవాల సందర్భంగా పెద్దరథం ఊరేగింపు జరిగేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రస్తు తం రథం లేదు.. రథం షెడ్డు కూలిపోయి దర్శనమిస్తోంది. ధూపదీప నైవేద్యాలు జరుపుతున్నాం: ఈఓ రామచంద్రరావు శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిపిస్తున్నాం. ఒక పూజారి, వాచ్‌మన్‌ను ఉన్నారు. వారికి ప్రతినెలా రూ.3వేల చొప్పున ఇస్తున్నాం. మాన్యం భూములకు సంబంధించి వేలంపాట వాయిదాపడింది. త్వరలో జరిపించేందుకు ప్రయత్నిస్తున్నాం. -
రూ.180 కోట్లకు లెక్కల్లేవ్!
టీటీడీలో పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలు కొందరు విభాగాధిపతుల నిర్లక్ష్యంతో పెరుగుతున్న అభ్యంతరాల చిట్టా {పతి రెండు నెలలకు బదులు ఆరు నెలలకోసారి ఇంటర్నల్ ఆడిట్ సమీక్షల వల్లే సమస్యలు ఆడిట్ నిపుణులతో నేడు ఈవో సమీక్ష శ్రీవారి భక్తుల కానుకలతో నడిచే టీటీడీ వ్యవహారాలు కంచే చేను మేసే చందంగా తయారయ్యాయి. లోపభూయిష్టమైన ఆడిట్ వ్యవహారాల వల్ల టీటీడీలో దాదాపుగా రూ.180 కోట్లకు సరైన లెక్కల్లేవు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆడిట్ అభ్యంతరాలున్నాయని ఇప్పటికే నిపుణులు తేల్చినా.. అలాంటి పరిస్థితులే పునరావృతం అయ్యేలా టీటీడీ తయారైందని విమర్శలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తిరుమల: సుమారు రూ.2,400 కోట్ల బడ్జెట్‌తో కూడిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మినీ గవర్నమెంట్ తరహాలో ఖర్చులు, వాటికి సంబంధించిన పద్దులు సాగుతుంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీటీడీ నిర్వహించే అన్ని రకాల పద్దులకు ఇంటర్నల్ ఆడిట్, మలి దశలో రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. అన్నీ సవ్యంగా ఉంటేనే ఆయా పద్దులకు క్లియరెన్స్ ఉంటుంది. లేకుంటే అభ్యంతరాలు తలెత్తుతాయి. అలాంటి అభ్యంతరాలు గుర్తించి సకాలంలో పరిష్కరించుకోగలితే ఎలాంటి సమస్యా రాదు. లేకుంటే అభ్యంతరాలు సాగుతూనే ఉంటాయి. అయితే, టీటీడీలో ఉండే దాదాపు అన్ని విభాగాల్లోనూ ఆడిట్ ఆభ్యంతరాలున్నాయి. అభ్యంతరం లేని విభాగం లేదంటే అతిశయోక్తి లేదు. ఖర్చుకు, అందుకు సంబంధించిన పద్దుకు సరైన ఆధారాలు, పత్రాలు లేకపోవడం, ఎదురైన అభ్యంతరాలను పరిష్కరించడంలో సంబంధిత విభాగాధిపతి నిర్లక్ష్యం, పద్దుకు సంబంధించి టీటీడీ బోర్డు అనుమతిలో పెండింగ్ ఉండడం, ప్రభుత్వ అనుమతిలో జాప్యం ఉండటం.. ఇలా ఎన్నో కారణాలతో అభ్యంతరాల చిట్టా చాంతాండంత పెరిగిపోతూనే ఉంది. ఇలా రెండు దశాబ్దాల కాలంగా దాదాపు మొత్తం రూ.180 కోట్లకు సంబంధించి టీటీడీ పద్దుల్లో అభ్యంతరాలున్నట్టు గతంలోనే నిపుణులు గుర్తించారు. ఇదే విషయాన్ని ప్రస్తుత రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అంగీకరించారు. 2004కు ముందు ఇదే శాఖ నిర్వహించి రోజుల్లోనూ, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉంటూ శాసనసభ పద్దుల కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తూ టీటీడీ సమీక్షల్లోనూ ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అభ్యంతరాలు పరిష్కరించడంలో టీటీడీ తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శలు గుప్పించారు. టీటీడీ ఆడిట్ అభ్యంతరాల పరిష్కరించడంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ‘కాగ్’ కూడా సమీక్ష చేయించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇంటర్నల్ ఆడిట్‌లోనూ టీటీడీ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీటీడీ చేసే ఖర్చుల లెక్కల పద్దులు తేల్చడంలో ఎప్పటికప్పుడు ఆయా విభాగాలకు నేతృత్వం వహించే ఉన్నతాధికారులు చొరవ చూపాలి. ఆ తర్వాత ప్రతి రెండు నెలలకొకసారి టీటీడీ ఈవో, ఇద్దరు జేఈవోల నేతృత్వంలో ఇంటర్నల్ ఆడిట్ సమావేశాలు నిర్వహించాలి. ఇలాంటి కనీస సమావేశాలు కూడా లేకపోవడం వల్లే గోవిందుని కొలువులో కానుకల రూపంలో భక్తులిచ్చిన రూ.180 కోట్ల అభ్యంతరాలు మురుగుతూనే ఉన్నాయి. భవిష్యత్‌లో అలాంటి పరిస్థితి కొనసాగకుండా ఈవో స్థాయి అధికారుల్లో ఒకరిద్దరు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో చొరవ చూపలేకపోయారనే విమర్శలున్నాయి. ఆడిట్ అభ్యంతరాలపై ఈవో సాంబశివరావు సీరియస్.. నేడు నిపుణులతో సమీక్ష ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా పనిచేసిన అధికారిగా పేరున్న ప్రస్తుత టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలను తీవ్రంగా పరిగణించారు. గతానికి సంబంధించి లెక్కల అభ్యంతరాలు పరిష్కరించడం, లెక్కలు లేని విభాగాలపై సంబంధితులపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్ ఆడిట్ అభ్యంతరాలకు అవకాశం లేకుండా చేయడంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఆడిట్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నరసింహన్, శరత్‌కుమార్ నేతృత్వంలో సోమవారం తిరుపతి పరిపాలన భవనంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని విభాగాలతో సమీక్షించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇద్దరు జేఈవోలతో కలసి నిపుణులతో బేటీ అయ్యి అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చించాలని ఈవో సాంబశివరావు నిర్ణయించారు. -
అప్పన్న ఆలయ ధ్వజస్తంభం తొలగింపు
బయల్పడిన బ్రిటీష్ కాలం నాటి వెండి, రాగి నాణేలు 19వ శతాబ్ధం నాటివిగా నిర్ధారణ ఫిబ్రవరి 9న నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట సింహాచలం: వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధ్వజస్తంభాన్ని బుధవారం తొలగించారు. 1894లో (120 ఏళ్ల కిందట) ప్రతిష్టించిన ధ్వజస్తంభం కర్ర పుచ్చిపోవడంతో ఈనెల 26 నుంచి తొలగింపు పనులు చేపట్టారు. బుధవారం ధ్వజస్తంభం అడుగుభాగాన్ని పూర్తిగా తొలగించారు. ధ్వజస్తభం అడుగుభాగం వెలికి తీసిన తరువాత గరుడ యంత్రం లభించడంతో దానికి శాస్త్రోక్తంగా హారతులిచ్చి ఆలయంలో స్వామి దగ్గర ఉంచారు. అనంతరం మట్టి తీసే సమయంలో బ్రిటీష్‌కాలం నాటి వెండి, రాగి నాణేలు బయల్పడ్డాయి. ఇవి బ్రిటీష్‌కాలంనాటి నాణేలుగా ఈవో రామచంద్రమోహన్ పేర్కొన్నారు. నాణేలు 1,800 నుంచి 1,890 వరకు ఉన్న సంవత్సరాలు ముద్రించి ఉన్నాయి. మొత్తం చిన్నా, పెద్దా కలిపి 1,658 రాగి నాణేలు, 140 గ్రాములు బరువు ఉన్న 43 వెండి నాణేలు, తీగముక్కలు, నమూనా ధ్వజస్తంభం లభ్యమయ్యాయి. అలాగే 22 గ్రాముల బరువు ఉన్న బంగారం రేకుముక్కలు, నమూనా చిన్న ధ్వజస్తభం లభించాయి. 18 పగడాలు, రెండు ముత్యాలు లభ్యమయ్యాయి. అలాగే అడుగు భాగంలో లభ్యమైన అప్పటి ఆకు ఇంకా పచ్చగానే ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవాదాయశాఖ విశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇ.వి.పుష్పవర్ధన్, చినగదిలి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, వీఆర్వో సత్యం దొర, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, డీఈ మల్లేశ్వరరావు, ఏఈవో ఆర్.వి.ఎస్. ప్రసాద్, ఇన్చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, అర్చకులు తొలగింపు పనులు పర్యవేక్షించారు. ఫిబ్రవరి 9న నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట ఫిబ్రవరి 9న నూతన ధ్వజస్తంభం ప్రతిష్టా కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి వెభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులు శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి సూచనల మేరకు నూతన ధ్వజస్తభం ప్రతిష్టను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ధ్వజస్తంభం వెలికితీతలో లభ్యమైన నాణేలు నూతన ధ్వజస్తంభం ప్రతిష్టలో తిరిగి వేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, శాస్త్ర ప్రకారం, వైదికుల సూచనల ప్రకారం నడుచుకుంటామన్నారు. శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నూతన ధ్వజస్తభం ప్రతిష్ట నిర్వహిస్తామని స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. -
సూర్యదేవాయ నమః
శ్రీశైలం: రథసప్తమి సందర్భంగా సోమవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో వేదపండితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ ప్రత్యేకపూజలలో ఈవో సాగర్‌బాబు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా వైదిక పండితులు సూర్యయంత్రాన్ని లిఖించి పూజాధికాలకు సంబంధించిన సంకల్పం చెప్పారు. సూర్యదేవుడి అనుగ్రహంతో జనులందరికీ ఆరోగ్యం చేకూరాలని, అకాలమత్యువు రాకుండా అందరికి దీర్ఘాయువును ఉండాలని సంకల్పంలో చెప్పారు. అనంతరం కలశస్థాపన చేసి మహాగణపతిపూజ, వైదికాచార్యులు ఆయా బీజమంత్రాలతో ప్రత్యేక ముంద్రలతోనూ సూర్యనమస్కారాలు చేశారు. ఆ తరువాత అరుణ పారాయణలు, షోడశ ఉపచారాలు, వేదపారాయణలు వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించిన అనంతరం సూర్యదేవుడికి నివేదనలు సమర్పించారు. అనంతరం భక్తులందరిపై సూర్యాభిషేక జలాన్ని ప్రోక్షించి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తజనసాగరం.. ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రం సోమవారం వేలాది మంది భక్తులతో పోటెత్తింది. ఆదివారం సెలవుదినంతో పాటు సోమవారం రథసప్తమి, గణతంత్ర దినోత్సవం కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. దాదాపు 80వేలకు పైగా భక్తులు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయపూజావేళల్లో మార్పులు చేసి 4.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలను ప్రారంభించేలా ఈఓ సాగర్‌బాబు చర్యలు తీసుకున్నారు. -
కొండెక్కిన టెంకాయ
కొబ్బరికాయలు దేవస్థానం నిర్ణయించిన ధరలకే అమ్మాలని ఆదేశించి, అమలయ్యేలా గట్టి చర్యలు తీసుకుంటాను. అధిక ధరలకు అమ్మితే లెసైన్సు రద్దు చేయడానికి కూడా వెనుకాడను. వ్రతపురోహితులు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, అధికారులు, ఇతర సిబ్బంది కలిపి దాదాపు వెయ్యిమంది పనిచేస్తున్నారు. వారందరి సంక్షేమానికీ చర్యలు తీసుకుంటాను. ట్రస్టు బోర్డు సమావేశంలో చర్చించి అన్నదానం విస్తరిలో ప్రసాదం పెట్టేలా చూస్తాను. పుష్కరాల సమయంలో భక్తుల సౌకర్యార్థం రూ.కోటితో మరుగుదొడ్లు, స్నానపు గదులు, షామియానాలు ఏర్పాటు చేస్తాం. భక్తుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ చేసిన ప్రయత్నం అభినందనీయం. - ఈరంకి జగన్నాథరావు ఈఓ (ఎఫ్ఏసీ) ఈఓ జగన్నాథరావు : ఏమండీ మీపేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? వ్రతం, దర్శనం ఎలా జరిగాయి? మీరేమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? భక్తుడు : సార్ నా పేరు చలసాని రవీంత్రనాథ్ ఠాగూర్. విశాఖపట్నం నుంచి వచ్చామండి. వ్రతం, దర్శనం బాగానే జరిగిందండి. మీరేమో అధికారిలా ఉన్నారు. ‘సాక్షి’ మైకు పట్టుకున్నారు. ఏమనుకోనంటే ఒక్క సమస్య చెబుతాను.. ఒక్క కొబ్బరికాయ రూ.20 పెట్టి కొనాలంటే ఎలాగో మీరే చెప్పండి. ఇంత దారుణంగా అమ్ముతున్నారే. కొబ్బరికాయ, ఇతర సామగ్రి సెట్టుకు రూ.150 పైనే తీసుకొంటున్నారు. మాలాంటి మధ్యతరగతి వాళ్లకు ఇబ్బంది కదా సార్.. ఏదైనా ధరలు తగ్గించేలా చూడండి. కేశఖండన శాలలో సిబ్బంది రూ.10 డిమాండ్ చేస్తున్నారు. మీరే చర్యలు తీసుకోవాలి. ఈఓ : ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు. కొబ్బరికాయలతో పాటు ఇతర వస్తువుల ధరలు నియంత్రిస్తాను. (మరొకరితో) అబ్బాయి నీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? భోజనం క్యూలైన్లో ఉన్నారు కదా, ఏమైనా ఇబ్బందులుంటే చెప్పండి చెప్పండి. భక్తుడు : నాపేరు రామారావు. మాది కడియం సర్. ఇప్పటికే అరగంట నుంచి క్యూలైన్లోనే ఉన్నాం. ఇంత సమయం ఉండాలంటే వృద్ధులు, పిల్లల తల్లులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈఓ : ఏమి చేస్తే ఆ ఇబ్బందులు తొలగిపోతాయో మీరే సూచించండి. అవకాశమున్న మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. రామారావు : సర్.. వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఈఓ భోజన శాలలో) : బాబూ నీపేరేంటి ? మీదే ఊరు? భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయా? భక్తుడు: నాపేరు శ్రీనివాస్ సర్. మా ఊరు తుని మండలం తేటగుంట సర్. భోజన ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కానీ ఒక్కటే వెలితి.. గతంలో భోజనం విస్తరాకులో పెట్టేవారు. ఇప్పుడు పెట్టడం లేదు. ఆకులో పెడితే అదో సంతృప్తి సార్.. ఒక్కసారి ఆలోచించండి. ఈఓ : ఇదివరకు ఆకులో ప్రసాదం వేయడం నిజమే. బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటాం.. సరేనా? (మరొకరితో) నీ పేరేమిటి, ఉద్యోగిలా ఉన్నావు, ఏ విభాగంలో పనిచేస్తున్నావు. అన్నదాన సత్రంలో ఏర్పాట్లు ఏమిటి? ఇబ్బందులేంటి? ఉద్యోగి : గుడ్‌మార్నింగ్ సర్ నా పేరు భాస్కరరావు. భోజనశాలలో సూపరింటెండెంట్‌ను. పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా వస్తున్నారు. రెండు చోట్ల భోజన సత్రాలు నిర్వహిస్తున్నాం. భక్తులందరికీ ఒకే చోట పెట్టేలా భవనం ఉంటే బాగుంటుంది సర్, ఈఓ : ఏమయ్యా నీపేరేమిటి? భోజనం వద్ద ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? భక్తుడు : నా పేరు వెంకటేశ్వరరావు సర్. భోజనం క్యూలైన్లలో ఎక్కువమంది ఉన్నప్పుడు కొందరు ఎండలో ఇబ్బంది పడుతున్నారు సర్. పాత భోజన శాల నుంచి కొత్త భోజనశాలకు మధ్య ఎండలో పిల్లలు మాడిపోతున్నారు సర్. ఈఓ : రెండు చోట్లా భోజన ఏర్పాట్లకు, రెండింటికీ మధ్య షెడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. (మరొకరితో) మీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? సత్యదేవుని వ్రతం, దర్శనం చేసుకున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? భక్తుడు : నాపేరు ఇల్ల సత్యనారాయణండీ. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం నుంచి వచ్చామండీ. నోములు బాగానే చేసుకున్నాం. దర్శనం కూడా బాగానే అయ్యింది. సౌకర్యాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. ఈఓ : మీకు ధన్యవాదాలు. స్వామివారిని మరోసారి దర్శించుకోండమ్మా. (మరొకరితో) మీపేరేంటి స్వామీ? ఎక్కడి నుంచి వచ్చారు? కొండపై సమస్యలేమైనా ఎదుర్కొన్నారా? భక్తుడు : సర్ నాపేరు రాంబాబు. గన్నవరం నుంచి వచ్చాము. భక్తులకు మెట్ల మార్గంలో సరైన తాగునీటి ఏర్పాట్లు లేవు. అంతరాలయ దర్శనానికి రూ.100 టిక్కెట్టు మరీ ఎక్కువ సారూ. సాధారణ దర్శనం చేసుకున్నాం. ఈఓ : ఆ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఓకేనా. (ప్రసాదం తయారీ విభాగంలో) నీ పేరేమిటి బాబూ? ఎన్నాళ్ల నుంచి ప్రసాదం సెక్షన్లో పనిచేస్తున్నావు? ప్రసాదం తయారీ, ప్యాకింగ్‌లో ఇబ్బందులున్నాయా? ఉద్యోగి : నమస్కారం సారూ. నా పేరు లింగంపల్లి చిన్నారావండీ. ప్రసాదం ప్యాకరుగా 1986 నుంచి పనిచేస్తున్నాను సర్. ప్రసాదం గతంలో పుల్లల పొయ్యిపై తయారయ్యేది. పాలు వినియోగించే వారు. ఎక్కువకాలం నిల్వ కోసం పాలు వేయడం మానేశారు. ఈఓ : మీకు ఏప్రాతిపదికన వేతనం ఇస్తున్నారు? ఉద్యోగి : అమ్మకం జరిగిన ప్యాకెట్టుపై 35 పైసల చొప్పున ఇస్తే మేమంతా పంచుకుంటున్నామండీ. కమీషన్ పద్ధతి తీసేసి జీతాలివ్వాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. కాస్త పుణ్యం కట్టుకోండయ్యా. ఈఓ : ఎలాగూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నామంటున్నారు కదా.. నేను కూడా నా వంతు ప్రయత్నిస్తాలే (మరొకరితో) ఏమయ్యా నీపేరు? ఎన్నాళ్ల నుంచి ప్రసాదం కావిళ్లు మోస్తున్నావు? జీతమెంత? ఉద్యోగి : నాపేరు నంబారు కాగితమ్మ. సుమారుగా 24 ఏళ్లుగా పనిచేస్తున్నా. కమీషన్‌గా నెలకు ప్రసాదం అమ్మకాన్ని బట్టి ఆరేడు వేలు వస్తోందయ్యా. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉందయ్యా. ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నామయ్యా.. కమీషన్ పెంచాలయ్యా. ఈఓ : మీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. (భక్తురాలితో) అమ్మా మీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? కొండపై మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా? భక్తురాలు : నాపేరు కృష్ణవేణి సార్, మాది రాజమండ్రి. వ్రతం, దర్శనం చేసుకున్నాం. ఎక్కడా ఇబ్బంది లేదండీ. - ప్రజెంటర్స్ : లక్కింశెట్టి శ్రీనివాసరావు, పోతుల జోగేష్, తోట చక్రధర్. - ఫొటోలు : గరగ ప్రసాద్ -
12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు. 12న ఉదయం నుంచి మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు విశేషపూజలు, వాహన సేవలు, గ్రామోత్సవం ఉంటాయన్నారు. 15న మకర సంక్రమణం రోజున వాహన సేవ, పార్వతీపరమేశ్వర కల్యాణం ఉంటుందని తెలిపారు. 16న మృగయాగోత్సవం, 17న ఉత్సవమూర్తులకు రుద్రయాగం, పూర్ణాహుతి, ధ్వజారోహణ, 18న స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తారన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత కల్యాణోత్సవం, రుద్రహోమం, గణపతి హోమం సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. -
దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో కోత
* తగ్గనున్న 20 గ్రాములు * ఈనెల 18 నుంచి అమలు సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీ నుంచి లడ్డూ సైజు తగ్గించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం భక్తులకు 100 గ్రాముల లడ్డూ రూ. 10కి విక్రయిస్తుండగా, ఇక నుంచి అదే రేటుకు 80 గ్రాముల లడ్డూను ఇస్తామని ఈవో సీహెచ్ నర్సింగరావు ‘సాక్షి’కి చెప్పారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకే లడ్డూ సైజు తగ్గిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒక లడ్డూ తయారు చేయడానికి దేవస్థానానికి రూ. 11.40 ఖర్చు అవుతుండగా భక్తులకు రూ.10కే విక్రయిస్తున్నారు. ఒక్కొక్క లడ్డూపైన రూపాయి 40 పైసలను దేవస్థానం భరించాల్సి వస్తోంది. అందువల్ల లడ్డూ సైజును 80 గ్రాములు చేస్తే భక్తులు చెల్లించే రూ.10లకు సరిపోతుంది. దీనివల్ల దేవస్థానానికి లాభం కాని, నష్టం కాని ఉండదు. సాధారణ రోజుల్లో రోజుకు 45 వేల నుంచి 50 వేల లడ్డూలు, శుక్ర, ఆదివారాల్లో 60 వేల నుంచి 75 వేల లడ్డూలు దేవస్థానం విక్రయిస్తోంది. భవానీ దీక్షలు, దసరా ఉత్సవాల్లో రోజుకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు విక్రయాలు జరుగుతాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల లడ్డూ తయారీ ఖరీదు పెరిగిపోయింది. ఇప్పటి వరకు సైజు తగ్గించకుండా దేవస్థానమే నష్టాన్ని భరిస్తూ వస్తోంది. ఇదే విషయాన్ని దేవస్థానం అధికారులు కమిషనర్ అనూరాధకు తెలియపరచడంతో లడ్డూ సైజు తగ్గించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లడ్డూ నాణ్యత పెంచాలి ఈవో నర్సింగరావు వచ్చిన తరువాత పులిహోర నాణ్యత కొంతమేర మెరుగుపడింది. ఆయన లడ్డూపై దృష్టి సారించి నాణ్యత పెంచాలని పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దేవస్థానం పాలకమండలి అధికారంలో ఉన్న రోజుల్లో లడ్డూ ప్రసాదాలపై పూర్తిస్థాయి దృష్టిసారించి వాటి నాణ్యతను పెంచారు. ఆ తరువాత కిందిస్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శించడంతో నాణ్యత తగ్గిపోయింది. ఇప్పుడు సైజు కూడా తగ్గిస్తుండటంతో భక్తులు పెదవి విరుస్తున్నారు. నష్టం వస్తోందని సైజు తగ్గించినా కనీసం నాణ్యతైనా పెంచాలని కోరుతున్నారు. -
ఆ బదిలీ రేటు అరకోటి
దేవాదాయశాఖ బదిలీలు కొందరు నేతలకు ‘ప్రసాదం’గా మారాయి. సీట్లకు రేట్లు కట్టి.. సొంతానికి సొమ్ములు మూటకట్టుకున్నారు. నిబంధనలకు పాతరేసి, తమ చేతులు తడిపిన వారిని కోరిన సీట్లో ప్రతిష్టించారు. నిబంధనల ప్రకారం మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారు ఏ స్థాయిలో ఉన్నా విధిగా బదిలీ చేయాలి. కానీ ఆ ఉత్తర్వులను జిల్లాలో మెట్ట ప్రాంతానికి చెందిన ఒక ముఖ్యనేత సోదరుడు తుంగలో తొక్కి భారీ నజరానాలు ముట్టజెప్పిన వారికి కోరుకున్న పోస్టులు కట్టబెట్టారు. * దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పోస్టుతో దందా * చక్రం తిప్పిన తెలుగుదేశం ముఖ్యనేత సోదరుడు * పదోన్నతి సాకుతో డీసీ కేడర్ అధికారికి అడ్డంకి * ఈఓల బదిలీల్లోనూ ఇష్టారాజ్యం, అడ్డగోలుతనం సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయశాఖ బదిలీలు .. అవినీతి సొమ్ములను మరిగిన వారికి అనుకోని వరంగా కలిసి వచ్చాయి. నచ్చిన వారిని అందలమెక్కించి అందినకాడికి సొమ్ము చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఆశించిన స్థానాలను పందేరం చేశారు. ఈ క్రమంలోనే ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో దేవాలయాలను పర్యవేక్షించే కాకినాడ డిప్యూటీ కమిషనర్ (డీసీ) పోస్టులో బదిలీకి రూ.అరకోటి వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్చార్జి డీసీ (ఎఫ్ఏసీ)గా లోవ దేవస్థానం ఈఓ గాదిరాజు సూరిబాబురాజు వ్యవహరిస్తున్నారు. ఆయనది అసిస్టెంట్ కమిషనర్ కేడర్. తాజా బదిలీల్లో విశాఖపట్నం కనక మహాలక్ష్మి దేవస్థానం ఈఓగా డీసీ కేడర్‌లో పని చేస్తున్న భ్రమరాంబను బదిలీ చేస్తూ జీఓ కూడా విడుదలైంది. ఇక కాకినాడ వచ్చి బాధ్యతలు చేపట్టడమే మిగిలిందనుకుంటున్న తరుణంలో మెట్ట ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత సోదరుడు చక్రం తిప్పి ఆమె బదిలీకి మోకాలడ్డారని ఆరోపణ వినిపిస్తోంది. భ్రమరాంబకు అడ్డుపడటానికి ఇప్పుడున్న వారినే కొనసాగించాలన్నదే కారణమంటున్నారు. త్వరలో ఆర్జేసీగా పదోన్నతి లభిస్తుందన్న సాకుతో భ్రమరాంబను అడ్డుకున్న వ్యవహారంలో రూ.అరకోటి చేతులు మారినట్టు సమాచారం. పదోన్నతి సాకుగా చూపి ఆమెను అడ్డుకున్న నేతలకు, ఇందుకు సహకరించిన ఉన్నతాధికారులకు.. ఏసీగా పదోన్నతి జాబితాలో ఉన్న ఉమామహేశ్వరరావును కాకినాడ బాలాత్రిపురసుందరి దేవస్థానం ఈఓగా బదిలీ చేయడం గురించి ఏమంటారని ఆ శాఖ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. కౌన్సెలింగ్‌లో లేని వారికీ స్థానచలనం.. ఇక పలువురు గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కార్య నిర్వహణాధికారుల (ఈఓ) బదిలీల్లోనూ అవినీతి బాగోతాలు జరిగాయి. జిల్లాలో ఎనిమిది మంది గ్రేడ్-1 ఈఓలను నాలుగు రోజుల క్రితం కౌన్సెలింగ్‌కు పిలిచారు. వారిలో కేవలం ఇద్దరినే (ఉమామహేశ్వరరావు, ద్రాక్షారామ ఈఓ ప్రసాద్) బదిలీ చేశారు. బిక్కవోలు గ్రూపు టెంపుల్స్ ఈఓగానూ, కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్ ఇన్చార్జిగానూ ఉన్న ఉమామహేశ్వరరావును బాలాత్రిపురసుందరి దేవస్థానం ఈఓగా బదిలీచేశారు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని మాత్రమే బదిలీ చేయాల్సి ఉండగా ఏడాదిన్నర కూడా పూర్తకాకున్నా, కౌన్సెలింగ్ జాబితాలో పేరులేకున్నా పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఈఓ కొండలరావు, బాలాత్రిపుర సుందరి దేవస్థానం ఈఓ సీహెచ్ విజయభాస్కర్రెడ్డిలను అడ్డగోలుగా బదిలీ చేశారు. బిక్కవోలు గ్రూపు టెంపుల్స్, కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్‌తో కలిపి సుమారు 30 దేవాలయాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఉమామహేశ్వరరావు బదిలీ వెనుక పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయంటున్నారు. బాలాత్రిపురసుందరి ఆలయ ప్రాధాన్యం దృష్ట్యా ఎప్పుడూ పూర్తిస్థాయి ఈఓనే ఉండేవారు. అలాంటిది గత చైర్మన్ హయాంలో పని చేసిన ఉద్యోగులందరినీ బదిలీ చేయాలన్న అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గక పోవడంతోనే ఆయనను అడ్డగోలుగా బదిలీ చేసినట్టు చెపుతున్నారు. అవినీతి అధికారులకు అండ.. పెద్దాపురం ఆర్వీబీఎస్ సత్రం ఈఓ నారాయణమూర్తి, కాండ్రకోట నూకాలమ్మ దేవస్థానం ఈఓ నాగమల్లేశ్వరరావు మూడేళ్లు పైబడే పనిచేస్తున్నారు. తమకు రాత్రి పూట భోజనం పెట్టకుండానే సొమ్ములు స్వాహా చేస్తున్నారని నారాయణమూర్తిపై విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్జేసీ విచారణ కూడా నిర్వహించారు. అలాంటి ఈఓ బదిలీ కాకుండా అడ్డుపడ్డారని, దాని వెనుక ఏమి జరిగి ఉంటుందోప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని దేవాదాయశాఖ ఉద్యోగులు అంటున్నారు. డిప్యుటేషన్‌పై కాకినాడ ఆర్జేసీ కార్యాలయంలో పని చేస్తున్న బంగారు శోభనాద్రి సత్రం ఈఓ గంగారావు పేరు కౌన్సెలింగ్ జాబితాలో ఉంది. ఆయన మూడేళ్లకు పైబడి ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ బదిలీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ రకంగా అడ్డగోలు బదిలీలతో దేవాదాయశాఖ ప్రతిష్ట మంట గలుస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రక్షాళన జరిగేనా..!
దుర్గగుడికి ‘కొత్త’కళ * ఏడాది తర్వాత పూర్తిస్థాయి ఈవో నియామకం * త్వరలోనే పాలక మండలి ఏర్పాటు * ఇంద్రకీలాద్రిపై అవినీతి అంతం చేయాలి.. * కాంట్రాక్టర్ల హవాను అడ్డుకోవాలని భక్తుల వినతి సాక్షి, విజయవాడ : ప్రతిష్టాత్మక దుర్గగుడికి కొత్తనీరు రానుంది. ఏడాది తర్వాత పూర్తిస్థాయి కార్యనిర్వహణ అధికారిని నియమించారు. చాలాకాలం అనంతరం దేవస్థానానికి పాలకమండలిని ఏర్పాటుచేయనున్నారు. ఈ క్రమంలో కొత్త పాలకమండలి, ఈవో సమన్వయంతో పనిచేస్తూ దుర్గగుడిలో నెలకొన్న అవి నీతిని ప్రక్షాళన చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్ల హవాకు అడ్డుకట్ట వేయాలి. సిబ్బంది నిర్లక్ష్యం పైనా దృష్టి సారించి భక్తులకు మెరుగైన సేవలు అందేలా చూడాలి. పాలకమండలి చైర్మన్‌గా రంగప్రసాద్! బీజేపీ రాష్ట్ర నాయకుడు రంగప్రసాద్ చైర్మన్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. తొమ్మిది మంది సభ్యుల్లో ఒకరు బీజేపీ నుంచి, మిగిలినవారు టీడీపీ నాయకులు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిసింది. కొత్త సంవత్సరంలో నూతన పాలకమండలి కొలువుదీరుతుందని టీడీపీ, బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన బదిలీల్లో ఇన్చార్జి ఈవో త్రినాథరావును ద్వారకా తిరుమల ఈవోగా నియమించారు. రెవెన్యూ శాఖకు చెందిన నర్సింగరావును దుర్గగుడి ఈవోగా నియమించారు. ఆయన ఈ నెల 27న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈవో, పాలకమండలి సమన్వయంతో పనిచేసి దేవాలయ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని భక్తులు కోరుతున్నారు. సిబ్బంది నుంచే మొదలు కావాలి... దుర్గగుడిలో ఏఈవోల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తున్నారు. బదిలీలపై ఇతర దేవస్థానాలకు వెళ్లినా రెండు, మూడేళ్లు పూర్తవగానే తిరిగి ఇక్కడికే వస్తున్నారు. దీంతో అధికారులు, ఉద్యోగులే పలు కాంట్రాక్టులను బినామీ పేర్లతో నిర్వహిస్తున్నారు. దుర్గాఘాట్‌లో షాపులు, చీరల కాంట్రాక్టు, దేవస్థానానికి సరుకుల సరఫరా, ప్రసాదాల తయారీ తదితర విషయాల్లో వీరిపాత్ర ఉందనేది బహిరంగ రహస్యం. అర్చకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్లు డ్యూటీలు చేయకుండా అసిస్టెంట్లతోనే అన్ని పనులు ముగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లదే హవా! దేవస్థానంలో కాంట్రాక్టర్ల హవా సాగుతోంది. ఐదుగురు కాంట్రాక్టర్లు కొండపై తిష్టవేసి అధికారులను సైతం శాసిస్తున్నారు. ఈ ఐదుగురే దుర్గగుడి సిబ్బంది సహాయంతో కీలక కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు. వీరికి కాంట్రాక్టులు రాకపోతే కోర్టులకు వెళ్లి పనులు సాగకుండా అడ్డుకుంటున్నారు. దుకాణాల తొలగింపుపై దృష్టి పెట్టాలి ఇంద్రకీలాద్రి కొండపైన గడువు ముగిసినప్పటికీ దుకాణాలకు టెండర్లు పిలవలేదు. రాజకీయ నాయకుల చేతుల్లో దుకాణాలు ఉండటంతో దేవాదాయ శాఖ అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. కొత్తగా వచ్చే పాలకమండలి అయినా ఈ విషయంపై దృష్టి సారించాలి. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలి.. భక్తులకు సౌకర్యాలు కూడా మెరుగపరాల్చిన అవసరం ఉంది. ముఖ్యంగా కాటేజీలు, మల్లికార్జున మహామండపం, రాజగోపురం పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు జిల్లాలో పర్యాటక ప్రదేశాల సమాచారం అందించాలి. -
నేత్రపర్వం అమరేశ్వర తెప్పోత్సవం
అమరావతి: పంచారామ క్షేత్రాలలో ప్రథమారామ క్షేత్రమైన అమరావతి బాల చాముండికా సమేత అమరేశ్వరుని తెప్పోత్సవం గురువారం రాత్రి పవిత్ర కృష్ణానదీలో నేత్ర పర్వంగా సాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తొలుత స్వామి వారి ఉత్సవ మూర్తులను మేళతాళాల నడుమ చిరు రథంపై పురవీథుల్లో ఊరేగించారు. అనంతరం అమరేశ్వర స్నానఘాట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి అధ్వర్యంలో వేద పండితులు పవిత్ర కృష్ణవేణికి ఏకాదశహారతులు, అష్టోత్తర హారతి, కుంభహారతి, నక్షత్ర హారతులు ఇచ్చారు. ఆలయ స్థానాచార్యుడు జగర్లపూడి వెంకటేశ్వరశాస్త్రి నదీ హారతి విశిష్టత వివరించారు. పవిత్ర నదులను కార్తీకపౌర్ణమినాడు పూజించటం శ్రేష్టమన్నారు. ఆ తరువాత హంస వాహనంలా తీర్చిదిద్దిన పడవను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివార్లను ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు, భజనలు చేస్తూ, మేళతాళాలతో, బాణసంచాలతో కృష్ణానది అలలపై కన్నుల పండువగా తెప్పోత్సవం నిర్వహించారు. అనంతరం తూర్పు ద్వారం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం కిందుగా స్వామి వారిని ఆలయంలోకి తీసుకువచ్చారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించారు. -
దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీశైలం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. గురువారం నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలకు సన్నాహాలు పూర్తి చేశామని ఈఓ సాగర్‌బాబు బుధవారం తెలిపారు. ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబాదేవిని శైలపుత్రి అలంకారరూపంలో అలంకరించి ప్రత్యేకపూజలను చేస్తారు. శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులను భృంగీవాహనంపై ఆవహింపజేసి వాహనపూజలను చేసి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8గంటలకు శ్రీ స్వామిఅమ్మవార్లకు కల్యాణోత్సవం, ఏకాంతసేవ తదితర ప్రత్యేకపూజలు చేస్తారు. ఆరంభ పూజలు ఉదయం 8.30 గంటల నుంచి: శ్రీశైలమహాక్షేత్రంలో దేవీశరన్నవరాత్రోత్సవాలు గురువారం ఉదయం 8.30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఆశ్వియుజ శుద్ధపాఢ్యమి ఆరంభ ఘడియల్లో యాగశాలా ప్రవేశం చేస్తారు. అనంతరం శివసంకల్పం, గణపతిపూజ,స్వస్తి పుణ్యహవాచన, దీక్షా సంకల్పం, తదితర వివేషపూజలను నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటల నుంచి పారాయణలు, జపానుష్ఠానములు, అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, నవావరణార్చన, కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలు చేస్తారు. రాత్రి 9గంటల నుండి సువాసినీ పూజ, కాళరాత్రిపూజ, మహా మంగళహారతులు నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణలు ఉంటాయి. విద్యుత్ దీపాలంకరణ.. ఉత్సవాల సందర్భంగా శ్రీశైలాలయ ప్రాంగణం విద్యుత్ దీపాలంకరణలతో శోభాయమానంగా కనిపిస్తోంది. ప్రధాన రాజగోపురం మొదలుకొని స్వామివార్ల ఆలయప్రాంగణం వెలిగిపోతోంది. -
మంత్రి ప్రత్తిపాటి పీఎస్‌గా వేంకటేశ్వర్లు
అన్నవరం : అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఈఓ పి.వేంకటేశ్వర్లును ఆయన మాతృసంస్థ రెవెన్యూ శాఖకి సరెండర్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. దాంతో బాటు ఆయనను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించింది. ఈ విషయాన్ని ఈఓ వేంకటేశ్వర్లు గురువారం రాత్రి ‘సాక్షి’కి ధృవీకరించారు. ఈఓగా వేంకటేశ్వర్లు సుమారు రెండేళ్లు పనిచేశారు. సుమారు 150 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనం రూ.తొమ్మిదివేలకు, పల్లకీబోయీలకు వేతనాన్ని రూ.ఎనిమిదివేలకు పెంచిన వేంకటేశ్వర్లు వారి శ్రమను గుర్తించిన ఈఓగా పేరొందారు. అయితే ఇటీవల వివాహాల సీజన్లో దేవస్థానం అధికారుల తప్పుడు సలహాలతో పెళ్లిబృందాలకు గదులు ఇచ్చే విషయంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. మొత్తం మీద దేవస్థానంలో నిజాయితీపరుడైన అధికారిగా పేరు పొందారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో దేవస్థానం మాస్టర్‌ప్లాన్‌పై ఏర్పాటైన సమావేశంలో పాల్గొంటానని, శనివారం అన్నవరం వస్తానని వేంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. కాగా ఆయన స్థానంలో దేవస్థానం ఈఓగా ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇక్కడ ఏసీగా పనిచేస్తున్న ఈరంకి జగన్నాథరావును లేదా కాకినాడ ఆర్జేసీ, డీసీలలో ఒకరిని కొద్దికాలం ఇన్‌ఛార్జి ఈఓగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఈఓ వేంకటేశ్వర్లు సోమవారం రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. ఈఓగా రావాలని పలువురి ఆరాటం ఈఓ వేంకటేశ్వర్లు బదిలీ విషయం తెలియడంతో పలువురు దేవాదాయశాఖ అధికారులు ఆ స్థానంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక్కడ గతంలో ఈఓగా పనిచేసిన ఎం.రఘునాథ్, సింహాచలం దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్, గుంటూరు ఆర్జేసీ, విజయవాడ దుర్గగుడి ఈఓ పి.త్రినాథ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో రఘునాథ్‌కే అధికార పార్టీ ప్రముఖుల మద్దతు ఎక్కువగా ఉందని సమాచారం. -
స్టడీ..రెడీ
సర్వేకు సిద్ధం కండి చెక్‌లిస్ట్ రూపొందించిన జీహెచ్ఎంసీ స్టిక్కర్ విడుదలజేసిన కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: ‘కుటుంబ సమగ్ర సర్వే’పై ప్రజలకు ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఈ నెల 19న ఇళ్లకు వచ్చే సర్వే సిబ్బందికి ఎలాంటి ఆధారాలు చూపించాలన్న అంశంపై ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ వద్ద ఉంచుకోవాల్సిన వివరాల జాబితాను జీహెచ్ఎంసీ అధికారులు రూపొందించారు. దీనిపై అధికారులు విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రంగుల కరపత్రాలు ముద్రించి దినపత్రికలతో పాటు ఇంటింటికీ పంపిణీ చే యనున్నారు. రెండు రోజుల ముందు నుంచే ఎన్యుమరేటర్లు ఇళ్లకు వెళ్లి ప్రజలకు అవసరమైన సమాచారం అందజేస్తారు. వారు వెళ్లిన ఇళ్లకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా తయారుచేసిన స్టిక్టర్‌ను అంటిస్తారు. దానిపై స్టిక్కర్‌పై సర్వేకు ముందు 17, 18 తేదీల్లో.. సర్వే రోజున 19న ఎన్యుమరేటర్లు వచ్చినట్లు నమోదు చేసే బాక్స్‌లున్నాయి. ఎన్యూమరేటర్ ఫోన్ నంబరుకూడా ఉంటుంది. సందేహాలుంటే ఆ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 17న ఎన్యుమరేటర్ ఇంటికి రాకుంటే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నంబరు 040-21111111కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. దానిని పలిరిశీలించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. దాదాపు 60 వేల నుంచి 70 వేలమంది ఎన్యుమరేటర్లు విధుల్లో పాల్గొంటున్నారు. గ్యాస్ కనెక్షన్, పాస్‌పోర్టు, ఇతర సదుపాయాలు కావాలనుకునేవా రు కుటుంబ వివరాలు తప్పనిసరి గా అందజేయాలి. ఆస్తిపన్ను, విద్యుత్, నల్లాకనెక్షన్లకు సంబంధిం చిన బిల్లు రసీదులు, కుల, వికలాం గ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలి. సిక్టర్ ఆవిష్కణ సర్వే సందర్భంగా జీహెచ్ఎంసీ తయారుచేసిన స్టిక్కర్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ప్రజల కు ఎలాంటి సందేహాలు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలందించేందుకు ప్రజలు ఇళ్లవద్ద ఉండాలని కోరారు. అన్ని ఇళ్ల వివరాల డేటాబేస్ రూపకల్పనకు ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని చెప్పారు. -
మూగవానికి మాట..
ఏడుకొండలవాడి మహిమేనంటున్న ఎన్నారై కుటుంబం సాక్షి, తిరుమల: ఆపద మొక్కులవాడా.. అనాథ రక్షకా.. గోవిందా.. గోవిందా.. అంటూ భక్తితో కొలిచే భక్తులను శ్రీవేంకటేశ్వరుడు కంటికి రెప్పలా కాపాడతాడని పురాణ గాథల్లో చదివాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువైంది. శ్రీవారినే నమ్ముకున్న ఓ బధిరుడికి మాటలు వచ్చాయి. పుట్టుకతో మూగవాడైన తన కుమారుడు దీపక్ (18) శ్రీనివాసుని దర్శనం తర్వాతే బాగా మాట్లాడగలుగుతున్నాడని ఇంగ్లండ్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయురాలు ప్రతిమ మీడియాకు వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన ప్రతిమ, సుభాష్ దంపతులు వృత్తిరీత్యా ఇంగ్లండ్‌లోని హ్యారో నగరంలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దీపక్ (18) పుట్టు మూగ . చిన్నపాటి శారీరక సమస్యలు కూడా ఉన్నాయి. కుమారుడికి మాటలు రావాలని, ఆరోగ్యం కుదుటపడాలని దీపక్‌కు నాలుగేళ్ల వయసులో తల్లి ప్రతిమ తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. అనేక రకాల థెరపీలు చేయించగా 14 ఏళ్లు వయసులో చిన్నచిన్న మాటలు చెప్పటం ప్రారంభించాడు. శ్రీవారికి మొక్కులు చెల్లిస్తే ఫలితం ఉంటుందని భావించిన వారు శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. తన కుమారుడికి మాటలు రప్పించాలని తల్లి ప్రతిమ స్వామికి మొరపెట్టుకున్నారు. అంతే... ఆలయంలో ఉండగానే అద్భుతం జరిగిందని, అంతవరకు పొడిపొడిగా మాట్లాడే దీపక్ బాగా మాడ్లాడటం ప్రారంభించాడని ప్రతిమ చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. అనంతరం దీపక్ స్వామి వారికి తలనీలాలు సమర్పించి, మొక్కులు పరిపూర్ణం చేశారు. తర్వాత టీటీడీ ఈవో జి.గోపాల్‌ను కలసి ఈ విషయాన్ని వారితో పంచుకున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి లీలలు ఇన్నాళ్లు విన్నామని, శనివారం ప్రత్యక్షంగా చూశామని టీటీడీ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు దేవదేవుని సన్నిధిలో నిత్యం జరుగుతుంటాయని, అయితే కొన్నే వెలుగులోకి వస్తాయని ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చెప్పారు. -
సర్వే.. సందేహాలు
ఎలాంటి అపోహలకు గురికావద్దు సామాజిక ఆర్థిక సర్వే మాదిరిగానే సమగ్ర కుటుంబ సర్వే సర్వే అంశాల్లో పలుమార్పులు నీలగిరి : సమగ్ర కుటుంబ సర్వే పట్ల ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలో పేర్కొన్న అంశాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ సర్వే కారణంగా రేషన్‌కార్డులు తొలగిస్తారా.. పెన్షన్లు రాకుండా పోతాయా.. ఒక ఇంటిలో ఒకే పొయ్యి ఉంటే వంట గదిని ప్రామాణికంగా తీసుకుని సర్వే చేస్తే గ్యాస్ కనెక్షన్లు రద్దు చేస్తారా..వంటి అనేక సందేహాలు ప్రజలను వెంటాడుతున్నాయి. సర్వేలో ఎన్యుమరేటర్ అడిగిన వివరాలన్నింటిని చెప్పకుండా రహస్యంగా ఉంచితే జరిగే నష్టం ఏమిటి..? లాంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతోంది. అయితే ఇలాంటి అపోహలు, అనుమానాలకు తెరదించుతూ ప్రభుత్వం సర్వే ముఖ్య ఉద్దేశాన్ని సవివరంగా పేర్కొంది. జిల్లా ప్రణాళిక విభాగం నిర్వహించే సామాజిక ఆర్థిక సర్వే తరహాలోనే సమగ్ర కుటుంబ సర్వే ఉంటుందని తేల్చిచెప్పింది. దీనివల్ల రేషన్ కార్డులు తీసేయడం.. పెన్షన్లు రద్దు చేయడం..ఇతర సంక్షేమ పథకాల ఫలాలు అందకుండా పోతాయోమని ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ శుక్రవారం జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించేందుకుగాను ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనర్హులకు కాకుండా అర్హులకు అందేలా ఈ సర్వే దోహదపడుతుంది. మార్పులు.. చేర్పులు... తొలుత జారీచేసిన నమూనాలో స్థానికత దృష్టిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రానికి చెందిన వారి వివరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నారనే అంశాలను చేర్చారు. కానీ తాజా సవరణలో ఆ కాలాన్ని పూర్తిగా తొలగించారు. దీంతోపాటు కుటుంబ వివరాల్లో సామాజిక వర్గంతోపాటు కులాన్ని తె లియజేయాలి. అదే విధంగా మాతృభాష కూడా తెలపాలి. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులను మినహాయిస్తే మిగతా కుటుంబ సభ్యుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అయితే విద్యార్థులు చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు వివరాలను మాత్రం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగులు తాము పనిచేస్తున్న ప్రాంతాల్లోనే వివరాలను నమోదు చేసుకోవచ్చు. తాత్కాలికంగా ఉపాధి కోసం వలస వెళ్లిన వారు మాత్రం సర్వే రోజున సొంత గ్రామానికి రావాల్సి ఉంటుంది. ఎన్యుమరేటర్ మీ వద్దకు వచ్చే సమయానికి మీ వద్ద దిగువ పేర్కొన్న సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లు రేషన్‌కార్డు (తెలుపు/పింక్/అన్నపూర్ణ/అంత్యోదయ) బ్యాంకు ఖాతా నంబరు మొబైల్ నంబరు గ్యాస్ కనెక్షన్ వివరాలు, నంబరు పెన్షన్ పుస్తకం (వృద్ధాప్య/వితంతువు/వికలాంగులు/చేనేత/కల్లుగీత కార్మికులు) వయసు ధ్రువీకరణ పత్రాలు (పిల్లలు చదువుకున్న వారయితే) ఓటరు ఐడీ నంబర్లు వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు (సదరమ్ సర్టిఫికెట్ కలిగి ఉంటే) వ్యవసాయ భూమి వివరాలు (పాస్ బుక్/టైటిల్ డీడీ) పశుసంపద వివరాలు సొంత స్థిర, చరాస్తుల వివరాలు దీర్ఘకాలిక వ్యాధుల వివరాలు కరెంటు మీటరు నంబర్ భూమి, వాహన వివరాలు కచ్చితంగా నమోదు చేయించుకోవాలి. భవిష్యత్తులో ఆ.. ఆస్తులను వారసులకు ఇవ్వాలన్నా లేదా అమ్మాలన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. -
హవ్వా.. ఇదే మి చోద్యం!
వేటపాలెం : సామాజిక ఆర్థిక కులగణన ముసాయిదా జాబితా తప్పులు తడకగా ఉంది. ఇంటింటికీ తిరిగి సర్వే చేయాల్సిన ఎన్యుమరేటర్స్ ఒక చోట కూర్చొని ఇష్టం వచ్చింది రాసుకుని చేతులు దులుపుకున్నారు. ఫలితంగా సర్వేలో అవాక్కయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2011-12 సంవత్సరంలో గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల గణన చేశారు. దాని తాలూకా ముసాయిదా జాబితాను ప్రజల పరిశీలనకు ఈ నెల ఒకటో తేదీన మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో ఉంచారు. జాబితాల్లో పొందు పరిచిన కుటుంబ వివరాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. ముసాయిదా జాబితాలో తప్పులు సరి చేసేందుకు 30 రోజుల గడువు విధించారు. సర్వే జాబితాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెల సరి వేతనం రూ.5 వేలలోపేనని నమోదు చేసి పలువురిని ఆశ్చర్యపరిచారు. ప్రతి ఇంటికి రెండు గదులే ఉన్నట్లు రికార్డు చేశారు. ఉద్యోగులను వ్యసాయ కూలీలుగా నమోదు చేశారు. దాదాపు ఊరంతా వ్యవసాయ కులీలుగా జాబితాల్లో రూపొందించారు. ఉద్యోగులు ప్రాథమిక విద్య మాత్రమే చదివినట్లు ఎన్యుమరేటర్లు తమ సర్వేలో పొందుపరిచి తమ నిర్లక్ష్యాన్ని బహిరంగ పరిచారు. మండలంలోని రామచంద్రాపురంలో మహిళలంతా వితంతువులుగా నమోదు చేశారు. వేటపాలెం 7,8,9 వార్డుల్లోని కుటుంబాల నెలసరి ఆదాయం రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపుగా నమోదు చేశారు. దాదాపు 40 ఎకరాల రైతులకు అసలు సాగుభూమీలేదన్నారు. రూ. లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తువారు వ్యవసాయ కులీలుగా మారారు. కోటి రూపాయల విలువైన ఇళ్లు ఉన్న వారికి కేవలం రెండు గదుల ఇళ్లు ఉన్నట్లు చూపారు. ఆధారాలు ఇవిగో.. వేటపాలెం 8వ వార్డుకు చెందిన పి.మోహన్‌రావు టెలిఫోన్‌శాఖలో లైన్మెన్గా పనిచేస్తుంటాడు. సర్వే జాబితాల్లో ఆయనకు రెండు గదుల ఇల్లు, నెలకు రూ.5 నుంచిరూ.10 వేలలోపు ఆదాయమని, వ్యవసాయ పనులు చేస్తున్నట్లు నమోదు చేశారు. వేటపాలేనికి చెందిన టి.కోటేశ్వరరావు పోస్టుమాస్టర్. ఇతనికి నెల సరి ఆదాయం రూ.5 వేలులోపుగా జాబితాలో నమోదు చేశారు. ఈయనా వ్యవసాయ కులేనట, రెండు గదుల ఇంట్లో ఉంటున్నట్లు చూపారు. డీవీఆర్ నాగరాజు ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయుడు. ఈయనకు రెండు గదుల ఇల్లు ఉన్నట్లు రాశారు. వ్యవసాయ కూలి పనులతో జీవనం గడుపుతున్నట్లు నమోదు చేశారు. ఈయన ఆదాయం కూడా రూ.5 వేల లోపేనట. రిఫ్రిజరేటర్ లేదని, సెల్‌ఫోన్ వాడరని చెప్పారు. పుల్లరిపాలెం పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో మహిళలంతా వితంతువులుగా నమోదు చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సర్వే రికార్డులో 80 శాతం తప్పుల తడకలుగా నమోదు చేశారు. ఈ వివరాలతో ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి కైనా సంబంధిత అధికారులు స్పందించి రీసర్వే నిర్వహించి వాస్తవ వివరాలు తెలియజేయాల్సి ఉందని పలువురు పేర్కొన్నారు. -
8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి పర్యటన
విశాఖ రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగస్టు 8, 9 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఖరారైన పర్యటన కొద్దిమార్పులు చేర్పులతో ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 9న ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా నగరంలో నిర్వహించనున్న గిరిజనోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజన విద్యార్థులు, కళా బృందాలు రానున్నాయని, నగరంలో వేదిక ఖరారు కావలసి ఉందని వివరించారు. -
ఈవో x ఉద్యోగులు
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈవో రఘునాథ్, ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈవో వేధిస్తున్నార ని ఆరోపిస్తూ సహాయ నిరాకరణ చేపట్టిన ఉద్యోగులు, అర్చకు లు ఆందోళనను ఉధృతం చేశారు. ఈవో పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మం డపానికి ఎదురుగా ఆదివారం రిలే నిరాహార దీక్షలకు దిగారు. దేవస్థానం స్థానాచార్యులు కె.ఇ.స్థలశాయి, ఉపప్రధానార్చకులు కోటి రామస్వరూప్ రాఘవాచార్యులు, ఎస్.శ్రీనివాసాచార్యులు, అర్చకులు బి.రామకృష్ణబాబు, ఉద్యోగులు కె.సతీష్, టి.వెంకటరత్నం, కృష్ణమాచారి, వెంకన్న దీక్షల్లో కూర్చున్నారు. భక్తులకు అంతరాయం... ఉద్యోగులు, అర్చకులు రిలే నిరాహార దీక్ష చేస్తుండడంతో ఆదివారం భక్తులకు సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో స్వామివారికి చేరువగా వెళ్లి పూజలు చేయించుకోవాలనుకున్న భక్తులు సాధారణ పూజలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరికొద్ది రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు, ఆదివారం కావటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అయితే అందరికీ సరిపడా ప్రసాదం(పులిహార) అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఆలయ ఉద్యోగులంతా సహాయ నిరాకరణలో ఉండటంతో కార్యాలయ తలుపులు కూడా తెరుచుకో లేదు. ముదురుతున్న వివాదం... రామాలయంలో ఈవో, అర్చకులకు మధ్య తలెత్తిన వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఈవో వివిధ కారణాలతో ఉద్యోగులను వే ధిస్తున్నారనే ఆరోపణలు ఇప్పటి వరకూ వినిపించ గా, ఇది మత పరమైన అంశాలకు ముడిపడటంతో వివాదం మరింత రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈవో రఘునాధ్ కూడా ఈ విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధర్వణ వేదపండితులైన జి.మురళీ కృష్ణమాచార్యులను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాసినట్లు ఈవోకు అనుకూలంగా ఉన్న అర్చకులు అంటున్నా రు. కాగా, మత పరమైన ఈ వివాదంలో ఆలయం బయట ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు కూడా కల్పించుకోవటంతో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంలో కల్పించుకొని వివాదం సమసిపోయేలా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దీక్షలకు జేఏసీ మద్దతు... అర్చకులు, ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను జేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు ప్రారంభించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ఉద్యోగులు, అర్చకులకు ఈవో ఇచ్చిన మెమోలను వెంటనే వెనక్కు తీసుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులను ఈవో వేధిస్తున్నారనే విషయాన్ని ఇప్పటికే టీజేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈవోపై తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింహరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన మెమోలను బేషరతుగా వెనక్కు తీసుకోవాలన్నారు. ఈవో ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు రవీందర్, నిరంజన్ కుమార్, పీఆర్వో సాయిబాబా పాల్గొన్నారు. కాగా దీక్షలకు పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ఎస్కే గౌసుద్ధీన్, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, బాలకృష్ణ సంఘీభావం తెలిపారు. -
మల్లన్నకు అష్టదిగ్బంధనమా?
భక్తుల్లో వ్యతిరేకత ఈఓ నిర్ణయాలతో ఏకీభవించని ట్రస్ట్‌బోర్డు శ్రీశైలం, శ్రీశైల మహాక్షేత్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీమల్లికార్జున స్వామిని అష్టదిగ్బంధనం చేయాలనే ఈవో ఆజాద్ నిర్ణయంపై భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవో నిర్ణయానికి వైదిక కమిటీ తన ఆమోదాన్ని తెలపలేదు. ఆదివారం నిర్వహించిన ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ముందు ఆమోదం తెలిపినా..విమర్శలు వెల్లువెత్తుతాయన్న భయంతో ఆ వెంటనే నిర్ణయాన్ని వాయిదా వేశారు. లింగం చుట్టూ గాడి (ఖాళీ) ఏర్పడిందని. అందులోకి పంచామృతాభిషేకాల జలాలు ప్రవహించడం వల్ల దుర్గంధం వస్తుందనే అభిప్రాయంతో గాడిని పూడ్చివేయాలని ఈవో నిర్ణయించారు. మల్లికార్జునుడి పానుమట్టం కింద మరో పది పానుమట్టాలుంటాయనేది ప్రతీతి. కాలక్రమంలో భూ ఉపరితలం పెరుగుతుండటంతో లింగానికి పానుమట్టాలను అమరుస్తూ వచ్చారని.. ప్రస్తుతం ఉన్నది 11వ పానుమట్టంగా భావిస్తున్నారు. అందువల్లే లింగం చుట్టూ గాడి ఉండటంతో పాటు అందులో నిరంతరం జలం ఊరుతోంది. -
అంతా శివమయం
రామతీర్థం(నెల్లిమర్ల), : రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థానికి శివరాత్రి మరుసటి రోజైన శుక్రవారం కూడా భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినంకంటే మరుసటి రోజునే లక్షలాదిమంది భక్తులు వచ్చి ఇక్కడి సీతారాములు, శివుడ్ని దర్శించుకున్నారు. గురువారం రాత్రంతా భక్తులు దేవస్థానానికి వస్తూనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. రెండురోజుల్లో మొత్తం నాలుగు లక్షలమంది భక్తులు హాజరైనట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాదితో పోల్చిచూస్తే ఈ ఏడాది భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. అయితే శుక్రవారం మా టత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అధికసంఖ్యలో భక్తులు వచ్చారు. వేకువజామున రద్దీ మరింత ఎక్కువైంది. ఇటు గొర్లిపేట నుం చి రామతీర్థం దాకా రోడ్డంతా భక్తులతో నిండిపోయింది. వాహనాలను సీతారామునిపేట జంక్షన్‌లోనే నిలిపివేసినప్పటికీ నెల్లిమర్ల రహదారి భక్తులతో కిక్కిరిసింది. ఒకదశలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు నిర్వహించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అలా గే అటువైపు దేవుని నెలివాడ నుంచి ఆలయందాకా రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా దేవస్థానం ముందున్న తిరువీధి ఇసుక వేస్తే రాలనంతా భక్తులతో నిండిపోయింది. మధ్యాహ్నం మూడుగంటలదాకా స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఈసారి రెండువైపులా ద్వారాలు తెరిచి దర్శనాలకు అనుమతించడంతో భక్తులు గతంలో మాదిరి ఇబ్బంది పడలేదు. క్షేత్రపాలకుడు శ్రీఉమా సదాశివస్వామి ఆలయానికి ఈ సారి భ క్తులు పోటెత్తారు. లోపలికి వెళ్లేందుకు చాంతాడంత క్యూ ఉండడంతో ఆలయం వెలుపలే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించడం కనిపించింది. జాగారం చేసిన భక్తులు శుక్రవారం అధిక సంఖ్యలో బోడికొండ ఎక్కి, అక్క డి కోదండరామ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ ప్రత్యేకాధికారి ఎన్వీఎస్ఎ న్ మూర్తి, ఈఓ బాబూరావు భక్తులకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. రామతీర్ధంలో రెండు రోజుల పాటు భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు సేవలందించాయి. -
నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి మార్చి 2వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రోజూ వాహన సేవలు, 27న మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణ మహోత్సవం చేస్తారు. 28న రథోత్సవం నిర్వహిస్తామని ఈవో ఆజాద్ తెలిపారు. ఉ. 9 గంటలకు యాగశాల ప్రవేశం, గణ పతి పూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 24న రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 23 వరకే స్వామివార్ల స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. 24 నుంచి మార్చి 2 వరకు అలంకార దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 20 నుంచి మార్చి 1 వరకు వరకు ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు. -
‘వైకుంఠా’ వాసా.. భక్తులపై కేసా !
ఐదు శాతమే వీఐపీలు, అర్హత లేనివారికి ఏకాదశి టికెట్లు సామాన్య భక్తులపై కేసుతో మరోసారి తెరపైకి పాసుల గోల టికెట్ల కేటాయింపుల్లో ధర్మకర్తల మండలి, సీఎం తమ్ముళ్ల హవా సాక్షి, తిరుమల: వేంకటేశ్వరుడు అందరి వాడు... కుల, మత, లింగ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా ఏడుకొండలవాడిని ఎవరైనా దర్శించుకోవచ్చు. కానీ.. ‘అధికార, ధన దర్పం’ సామాన్యుడికి వేంకటేశ్వరుని దర్శనాన్ని జఠిలం చేస్తోంది. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి, గంటల కొద్ది క్యూలో నిల్చుని అలసట చెందిన భక్తుడు ఒక్క నిమిషం శ్రీనివాసుడ్ని దర్శించుకోగానే ఆ అలసటనంతా మర్చిపోతాడు. కానీ, ఆ ఒక్క నిమిషం దర్శనం కూడా గగనం చేస్తే... ఆ ఆగ్రహమే కట్టలు తెంచుకుంది. కానీ, టీటీడీ అధికారులు మాత్రం తమ తప్పును కప్పిపుచ్చునేందుకు సామాన్య భక్తులపై కేసులు పెడుతున్నారు. - ఈసారి ఏకాదశి రోజు 8 వేల మందికి వీఐపీ టికెట్లు కేటాయించారు. - వారిలో ఐదు శాతం మంది మాత్రమే వీఐపీలు న్నారు. మిగిలినవారు వీఐపీల పేరుతో వచ్చిన అర్హతలేని వ్యక్తులేనని టికెట్ల చిట్టా చెబుతోంది. - టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, సభ్యులు దాదాపుగా 3వేల టికెట్లు పంచుకున్నారు. వీటిలో అధికంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు చెందిన కార్పొరేట్ కుటుంబాలకే కేటాయించారు. - బోర్డు సభ్యుల్లో ముగ్గురు వీఐపీ పాసులను బ్లాక్మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. - సీఎం కిరణ్ పేషీ పేరుతో సుమారు 200 టికెట్లు కేటాయించారు. - సీఎం సోదరుడు కిశోర్‌రెడ్డి, మరో సోదరుడు సంతోష్ తమ సొంత నియోజవర్గం, బంధుగణం కోసం 200 టికెట్లు కేటాయించుకుని అందరికంటే ముందుగానే శ్రీవారి దర్శనాన్ని పూర్తిచేసుకున్నారు. - తనకు వీఐపీ టికెట్లు వద్దని పైకి చెప్పుకుంటూ వచ్చిన దేవాదాయశాఖమంత్రి సి.రామచంద్రయ్య ఆఖరి క్షణంలో టీటీడీ ఉన్నతాధికారులపై వత్తిడి చేసి సుమారు 300 టికెట్లు తీసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. - వీఐపీల టికెట్ల జాబితాను బహిర్గతం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. - వివాదం ముదిరిపోవడంతో టీటీడీ సర్దుబాటుచర్యలకు ఉపక్రమించింది. మంత్రి సి.రామచంద్రయ్య కూడా మధ్యవర్తిత్వం చేశారు. చట్టప్రకారమే కేసులు... అయినా ఎత్తివేస్తాం: ఈవో గిరిధర్‌గోపాల్ టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలలో ధర్నాలు, ఆందోళనలు నిషేధం. నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చేసినవారిపై కేసులు పెట్టాం. ధార్మిక క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఇలా చేశాం. అయితే, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వాటిని ఉపసంహరించుకున్నాం. టీటీడీ క్షమాపణలు చెప్పాలి: కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి రోజున వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులపై కేసులు పెట్టిన టీటీడీ పాలకమండలి చర్య దౌర్భాగ్యకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వెంటనే కేసులను ఉపసంహరించుకోవడంతోపాటు భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు వైకుంఠ ఏకాదశి రోజున(ఈ నెల 11న) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్, ఈవో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తొమ్మిదివేల వీఐపీ పాస్‌లు జారీచేసి సామాన్య భక్తులకు దర్శనం లేకుండా చేసిన వారిపై చర్యలు చేపట్టాలని టీడీపీ, బీజేపీ నేతలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేతలు గిరిధర్, శ్రీధర్‌రావులు కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని గురువారం వేర్వేరుగా కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. టీటీడీ చైర్మన్ ఒక్కరే రెండువేల పాస్‌లు తీసుకున్నారని, ఓ మంత్రి 300 పాస్‌లు తీసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు సంతోష్‌రెడ్డికి మొదటగా దర్శనం కల్పించారని ఆరోపించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్.. దీనిపై టీటీడీతో సంబంధం లేని అధికారులతో విచారణ జరిపించి 30వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. పుణ్యక్షేత్రంలో ఆందోళన సరికాదు సాక్షి, తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు ఆందోళనలు చేయడం సరికాదని గవర్నర్ నరసింహన్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని, అందుకు తగ్గట్టుగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. భక్తులు కూడా టీటీడీకి సహకరించాలన్నారు. -
టీటీడీ ఛైర్మన్, ఈవోలపై కేసులు!
వైకుంఠ ఏకదశి రోజున ఆందోళనకు దిగిన శ్రీవారి భక్తులపై టీటీడీ అధికారులు కేసులు నమోదు చేయడంపై బీజేపీ మండిపడింది. శ్రీవారి భక్తులపై టీటీడీ అధికారులు వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు బీజేపీ నేతలు సమాయత్తమైయ్యారు. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవోలపై ప్రైవేట్ కేసును దాఖలు చేయనున్నట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. వైకుంఠ ఏకదశి పర్వదినం పురస్కరించుకుని శనివారం తిరుమల భక్తులతో పోటెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రులు, ప్రముఖులు తదితర వీవీఐపీలకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దాంతో శ్రీవారి దర్శనం ఆలస్యం అవుతుందంటూ సామాన్య భక్తులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో టీటీడీ ఛైర్మన్ కార్యాలయం వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు. అయితే తిరుమలలో ఆందోళనలు నిషేధం కావటంతో ధర్నా చేసిన భక్తుల (గుర్తుతెలియని వ్యక్తుల)పై ఏవీఎస్వో గోవిందరెడ్డి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోడ్డుపై బైఠాయించి సిబ్బంది విధులకు ఆటంకం కలిగించటం, ఇతర వాహనదారులకు అసౌకర్యం కలిగించటం వంటి అభియోగాలతో తిరుమలలోని టూ టౌన్ పోలీసులు సెక్షన్-341 ప్రకారం కేసు నమోదు చేశారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలో ఉన్న వ్యక్తులు, టీటీడీ విజిలెన్స్ తీసిన వీడియో, ఫొటోల ఆధారంగా ఆందోళన చేసిన భక్తులను గుర్తించనున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాద్‌కు చెందిన పలువురిని గుర్తించినట్టు సమాచారం. -
శంషాబాద్ ఈవో సస్పెన్షన్
శంషాబాద్, న్యూస్‌లైన్: అక్రమ నిర్మాణల విషయంలో శంషాబాద్ ఈఓ సుదర్శన్‌పై వేటు పడింది. అలాగే ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇద్దరు బిల్కలెక్టర్లపై కేసులు నమోదు కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. శంషాబాద్‌లో అక్రమ నిర్మాణాల విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ దీనిపై ఓ అధికారి చేత పూర్తిస్థాయిలో విచారణ జరిపించారు. అనుమతులు రద్దు చేసిన వాటికి ఇంటి నంబర్లు కేటాయించినట్లు వెల్లడి కావడంతో ఈఓ సుదర్శన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న బిల్ కలెక్టర్లు సాయిరాజ్, నర్సింహలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా శంషాబాద్ ఈవోఆర్డీని కలెక్టర్ ఆదేశించారు. జీవో 111 పరిధిలో ఉన్న రాళ్లగూడ, సిద్దంతి బస్తీలో భారీ ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలను చేపట్టారు. ఈ ఏడాది ఎప్రిల్ నెలలోనే వీటి అనుమతులు రద్దు చేసిన జిల్లా ఉన్నతాధికారులు వాటిని కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందుకు విరుద్ధంగా జీహెచ్ఎంసీలో శంషాబాద్‌ను విలీనం చేయడానికి రెండు రోజుల ముందు ఆగమేఘాల మీద భవనాలకు ఆస్తిపన్ను మదింపు చేసి, నంబర్లు కూడా కేటాయించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ‘అక్రమార్కులపై చర్యలకు సిద్ధం’ శీర్షికన గురువారమే ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. -
వారానికి రెండు రోజులు!
గుంతకల్లు, న్యూస్‌లైన్: కసాపురంలోని ఆంజనేయస్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ అధికారి(ఈఓ) సురేష్ బాబు వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ.. సంవత్సరానికి రూ.6 కోట్ల ఆదాయం ఆర్జించే దేవాలయాన్ని పర్యవేక్షించాల్సిన అధికారి వారంలో రెండు రోజులు మాత్రమే విధి నిర్వహణలో ఉంటారని, మిగిలిన ఐదు రోజులు ‘టూర్’ పేరుతో ఎగనామం పెడతారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా రాయాల్సిన ‘టూర్ డైరీ’ని నమోదు చేయకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది. ప్రతి శనివారం ఉదయం డ్యూటీకి వచ్చే ఆయన మరుసటి రోజు ఆదివారం రాత్రి వెళ్లిపోతున్నా ప్రశ్నించే అధికారి లేకపోవడంతో ‘ఆడిందే ఆట.. పాడిండే పాట’ చందంగా తయారైంది. ఈయన తీరుపై జిల్లా కలెక్టరుకు సమాచారం అందకుండా దేవాదాయ శాఖలోని కొందరు సిబ్బంది అడ్డుపడుతున్నారని బాహాటంగా చెప్పుకుంటున్నారు. గాడి తప్పిన పాలన.. మూడు సంవత్సరాల క్రితం ఈఓగా సురేష్‌బాబు బాధ్యతలు చేపట్టారు. విజయవాడకు చెందిన ఈయనకు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయి. ఎక్కువ రోజులు ఆఫీసులో ఉండకపోవడంతో ఆలయ అధికారులు, సిబ్బందిలో నిర్లక్ష్యం, అవినీతి పెచ్చుమీరిపోయాయి. పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఆలయ సిబ్బంది గ్రూపులుగా విడిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో సౌకర్యాలు అందక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దేవస్థానం పరిధిలో రూ.5.5 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి పెరిగింది. పనుల్లో నాణ్యత లేదని ఓ గ్రూపు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా ‘మామూళ్లు’ డిమాండ్ చేసిన అనధికార ఈఓకు ఆశించిన మేరకు సొమ్ము ముట్టకపోవడంతో పరోక్షంగా వర్గాన్ని ప్రోత్సహిస్తూ.. ఫిర్యాదులకు తెరతీశారని చర్చించుకుంటున్నారు. ఆలయ వ్యవహారాలపై ఆందోళన చెందిన ఆలయ ధర్మకర్త సుగుణమ్మ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనధికార ఈఓ తీరుతో గ్రూపులుగా సిబ్బంది కసాపురం దేవస్థానంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ అధికారి ఏకంగా అనధికార ఈఓగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆలయ పరిపాలనలో ఆశ్రీత పక్షపాతం పెరిగిపోయింది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కాంట్రాక్టు పనులను బంధువుల పేర్ల మీద పనులు చేయిస్తూ అర్హత ఉన్న కాంట్రాక్టర్లను వేధిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారికి.. ఈఓకు ఫిర్యాదు చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ అవమానిస్తున్నాడని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కాణిపాకంలో స్వామి వారికి ధ్వజారోహణం
చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలోని వరసిద్ది వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి ధ్వజారోహాణం కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్బంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమూర్తి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ రోజు సాయంత్రం స్వామివారు హంస వాహనంపై గ్రామ పుర వీధుల్లో ఉరేగనున్నారు. కాణిపాకం వరసిద్ధ వినాయకుని బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాణిపాకం చేరుకున్నారు. భక్తుల కోసం కాణిపాకం ఆలయ ఉన్నతాధికారులు పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
ఏసీబీకి పట్టుబడ్డ బాచుపల్లి ఈవో
హైదరాబాద్: అవినీతి జలగలు రోజూ ఏదో మూల పట్టుబడుతూనే ఉన్నారు. వాణిజ్య పన్నులశాఖలో ఓ ఉన్నతాదికారి చిక్కిన ఘటన మరువకముందే మరో అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాచుపల్లి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు దొరికిపోయాడు. ఓ బిల్డర్‌ను లంచం డిమాండ్ చేసిన సంగతి తెలుసుకున్న ఏసీబీ అధికారులు అకస్మికంగా దాడి చేశారు. బిల్డర్ లంచం ఇస్తుండగా అడ్డంగా దొరికిపోయాడు. మంగళవారం వాణిజ్య పన్నులశాఖ హైదరాబాద్ రూరల్ డిప్యూటీ కమిషనర్ నీలకొట్టం శ్రీనివాసులు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి పలు అక్రమ ఆస్తులు గుర్తించారు. శ్రీనివాసులు అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు హైదరాబాద్ వింగ్ ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో కలిసి బల్కంపేటలోని ఆయన నివాసంతోపాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరపారు. ఈ ఘటనలో భారీ అక్రమ ఆస్తులతో అతను పట్టుబడ్డ సంగతి తెలిసిందే.