
రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలో పోలీసులు
- ఐబీ జాయింట్ డెరైక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణ
- తిరుమల, తిరుచానూరులో దర్శన ఏర్పాట్లను సమీక్షించిన టీటీడీ అధికారులు
- అధికారులతో పలుమార్లు కలెక్టర్ సమావేశం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం జూలై 1న తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తిరుమలలో టీటీడీ ఈవో సాంబశివరావుతో పాటు అన్ని శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన సూచనల మేరకు రెవెన్యూ, టీటీడీ అధికారులు పలుమార్లు సమావేశమై దాదాపు ఏర్పాట్లు పూర్తిచేశారు.
కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ పలుమార్లు అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా వస్తున్నందున భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ముఖ్యంగా తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య ఇతర అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి తొలుత తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలోపే తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటున్నారు.
శ్రీవారిని దర్శించుకుని తిరుమల నుంచి సాయంత్రం 4 గంటలకు బయలు దేరుతారు. 5.50 గంటలకు రేణిగుంటకు చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగుపయనమవుతారు. సీఎం నారా చంద్రబాబునాయు డు జూలై 1వ తేదీన ఉదయం 10గంటలకు రేణిగుం ట విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకే ముఖ్యమంత్రి ముందుగా గోదావరి పుష్కరాల్లో హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా రాజ మండ్రికి బయలుదేరి వెళతారు. రాష్ట్రపతి పయనిం చే రోడ్డు మార్గాలతో పాటు, ఆయన బసచేసే పద్మావతి అతిథి గృహాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లలో పోలీసులు నిమగ్నం
రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉన్నతాధికారులు తిరుపతిలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డెరైక్టర్ చంద్రశేఖర్ అజాద్, ఇంటెలిజెన్స్ డీఐజీ పి.వి.యస్ రామకృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, సీఎం ముఖ్య భద్రతాధికారి జె.సత్యనారాయణ, గ్రెహౌండ్స్ ఎస్పీ శ్రీనివాసులు తిరుపతి అర్బన్ జిల్లాల పరిధిలోని ముగ్గురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు సమావేశమై భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు.
తిరుచానూరులో దర్శన ఏర్పాట్ల పరిశీలన
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లను సోమవారం టీటీడీ ఈవో సాంబశివరావు నేతృత్వంలో పర్యవేక్షించారు.