టీటీడీ ధర్మకర్తలమండలి నిర్ణయం
సాక్షి, తిరుమల: మధురైకి చెందిన సుప్రసిద్ధ అరవింద్ కంటి ఆస్పత్రి తిరుపతిలోనూ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఏడెకరాల స్థలాన్ని పదకొండేళ్లు లీజుకింద ఇచ్చేందుకు తిరుమల-తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదించింది. రూ. 100 కోట్ల అంచనాలతో జూపార్క్ రోడ్డులో ఐదెకరాల్లో ‘శ్రీవేంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్’, రెండెకరాల్లో పరిశోధన, శిక్షణ కార్యాలయాల నిర్వహణకు అనుమతిస్తూ బోర్డు తీర్మానం చేసినట్టు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం వెల్లడించారు. స్విమ్స్, బర్డ్, రుయా ఆస్పత్రులను కలిపి మెడికల్ హబ్‌గా మారుస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పే ఈ ఆస్పత్రిలో 50 శాతం ఉచిత వైద్యసేవలు, టీటీడీ ఉద్యోగులు, స్థానికులకు ప్రత్యేక వైద్యసేవలు అందించేందుకు అరవింద్ ఆస్పత్రి ముందుకు వచ్చిందన్నారు.
మరికొన్ని తీర్మానాలు
► హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతం లో టీటీడీకి ఉన్న 3.5 ఎకరాల స్థలంలో రూ. 13.98 కోట్ల వ్యయంతో శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీ మహాగణపతి ఆలయాలు నిర్మిస్తారు. ఇందుకోసం టెండర్ పనులకు ఆమోదం.
► ఢిల్లీలో ఈనెల 30 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే శ్రీవారి వైభవోత్సవాల సందర్భంగా గతంలో లతా మంగేష్కర్ ఆలపించిన 20,291 ‘స్వర లతార్చన’ సీడీలను భక్తులకు ఉచితంగా వితరణ.
► రూ. 12.01 కోట్లతో 41.43 లక్షల లీటర్ల టోన్డ్ పాలు, రూ. 1.54 కోట్లతో 19వేల కిలోల అగ్ మార్క్ నల్ల మిరియాలు, రూ.2.43 కోట్ల వ్యయంతో 27 వేల కిలోల యాలకులు కొనుగోలు చేయాలని తీర్మానించారు.
రూ. 100 కోట్లతో తిరుపతిలో అరవింద్ కంటి ఆస్పత్రి
Published Wed, Oct 28 2015 3:59 AM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM
Advertisement
Advertisement