Cadalavada Krishna Murthy
-
రూ. 100 కోట్లతో తిరుపతిలో అరవింద్ కంటి ఆస్పత్రి
టీటీడీ ధర్మకర్తలమండలి నిర్ణయం సాక్షి, తిరుమల: మధురైకి చెందిన సుప్రసిద్ధ అరవింద్ కంటి ఆస్పత్రి తిరుపతిలోనూ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఏడెకరాల స్థలాన్ని పదకొండేళ్లు లీజుకింద ఇచ్చేందుకు తిరుమల-తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదించింది. రూ. 100 కోట్ల అంచనాలతో జూపార్క్ రోడ్డులో ఐదెకరాల్లో ‘శ్రీవేంకటేశ్వర అరవింద్ ఐ హాస్పిటల్’, రెండెకరాల్లో పరిశోధన, శిక్షణ కార్యాలయాల నిర్వహణకు అనుమతిస్తూ బోర్డు తీర్మానం చేసినట్టు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం వెల్లడించారు. స్విమ్స్, బర్డ్, రుయా ఆస్పత్రులను కలిపి మెడికల్ హబ్‌గా మారుస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పే ఈ ఆస్పత్రిలో 50 శాతం ఉచిత వైద్యసేవలు, టీటీడీ ఉద్యోగులు, స్థానికులకు ప్రత్యేక వైద్యసేవలు అందించేందుకు అరవింద్ ఆస్పత్రి ముందుకు వచ్చిందన్నారు. మరికొన్ని తీర్మానాలు ► హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతం లో టీటీడీకి ఉన్న 3.5 ఎకరాల స్థలంలో రూ. 13.98 కోట్ల వ్యయంతో శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీ మహాగణపతి ఆలయాలు నిర్మిస్తారు. ఇందుకోసం టెండర్ పనులకు ఆమోదం. ► ఢిల్లీలో ఈనెల 30 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే శ్రీవారి వైభవోత్సవాల సందర్భంగా గతంలో లతా మంగేష్కర్ ఆలపించిన 20,291 ‘స్వర లతార్చన’ సీడీలను భక్తులకు ఉచితంగా వితరణ. ► రూ. 12.01 కోట్లతో 41.43 లక్షల లీటర్ల టోన్డ్ పాలు, రూ. 1.54 కోట్లతో 19వేల కిలోల అగ్ మార్క్ నల్ల మిరియాలు, రూ.2.43 కోట్ల వ్యయంతో 27 వేల కిలోల యాలకులు కొనుగోలు చేయాలని తీర్మానించారు. -
రామయ్యకు వెంకన్న అండ!
కడప కల్చరల్ : నవ్యాంధ్రలో ప్రభుత్వ లాంఛనాలతో నవమి ఉత్సవాలకు ఎంపికైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం నేడు (బుధవారం) తిరుమల-తిరుపతి దేవస్థానాల్లో విలీనం కానుంది. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, డిప్యూటీ ఈఓ కోలా భాస్కర్, పాలక మండలి సభ్యులు భాను ప్రకాశ్‌రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్, దాదాపు 40 మంది అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వేద పండితులు ఈ కార్యక్రమ నిర్వహణకు ఉదయం 6.55 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. ఆలయ ప్రస్తుత కార్యనిర్వహణాధికారి, జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ టీటీడీ అధికారులకు ఆలయ నిర్వహణ బాధ్యతతోపాటు ఆలయ ఆస్తులన్నింటినీ అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు టీటీడీలో విలీనమైన ఆలయాల పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల నుంచి లడ్డూలు తెప్పించి విక్రయించడం మినహా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. ఒంటిమిట్ట రామాలయం కూడా ఆ జాబితాలో చేరిపోతుందా అనే భయం వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీ మేరకు ఈ ఆలయాన్ని ప్రభుత్వమే అభివృద్ధి చేసి ఉంటే బావుండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొర వినరా... జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 2006 సెప్టెంబరు 10న టీటీడీ విలీనం చేసుకుంది. అనంతరం వేంపల్లె గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని, జమ్మలమడుగు శ్రీ నారాపురస్వామి దేవాలయం, తాళ్లపాక ఆలయాలను కూడా విలీనం చేసుకున్నారు. అనంతరం ఏడు సంవత్సరాలు అభ్యర్థించగా, అర్చకులకు మాత్రం పే స్కేల్ మంజూరు చేశారు. కానీ, దేవుని కడప ఆలయంలోని 13 మంది, గండి క్షేత్రంలోని 12 మంది దిగువ స్థాయి ఉద్యోగులను మాత్రం సంస్థలో విలీనం చేయలేదు. టీటీడీలో విలీనమైనపుడు వీరితోపాటు ఇతర ఆలయాల్లో దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈఓ స్థాయి పదోన్నతులు సాధించి మంచి జీతం తీసుకుంటున్నారు. కానీ, పైన పేర్కొన్న విలీన ఆలయాల్లోని ఉద్యోగులకు మాత్రం ఇప్పటికీ కేవలం రూ.5 వేలు మాత్రమే వస్తోంది. దీంతో ఎలా బతకాలని వారు ఎనిమిదేళ్లుగా మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జీతాలు చాలక గండి క్షేత్రంలోని ఓ చిరుద్యోగి ఆలయ ఆవరణంలోనే 2013లో ఆకలి బాధతో మరణించాడు. దేవుని కడపలో పూర్తి స్థాయి సర్వీసు అందించిన వేద పండితుడు ప్రస్తుతం ఎలాంటి పెన్షన్ బెనిఫిట్ లేకుండానే ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఇదే ఆలయంలో 30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులు కూడా ఎలాంటి పెన్షన్ బెనిఫిట్లు లేకుండా రిక్త హస్తాలతో ఉద్యోగ విరమణ చేశారు. దెబ్బ మీద దెబ్బ తమ వేతనం పెంచాలని చిరుద్యోగులు విన్నవిస్తున్న తరుణంలో ఇలాంటి వారందరినీ తొలగిస్తున్నామని జనవరిలో టీటీడీ తేల్చిచెప్పింది. సొసైటీగా ఏర్పడితే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుంటామని చెప్పింది. దీనిపై కోర్టుకెళ్లిన బాధిత ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఫలితం శూన్యం. ఈ దశలో వీరు కాపునాడు నేత నారాయణస్వామి రాయల్ ద్వారా జూన్‌లో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి తమ బాధను విన్నవించుకున్నారు. ఆయన వీరి వేతనం పెంచడానికి అంగీకరించినా అందుకు సంబంధించి ఆదేశాలు వెలువడలేదు. నేడు ఒంటిమిట్ట రామయ్య సన్నిధిలో మరో సారి ఆయన్ను కలిసి ఈ ఉద్యోగులు వినతిపత్రం అందజేయనున్నారు. -
చదలవాడ X వెంకటరమణ
టీటీడీ చైర్మన్ పదవి చదలవాడకు దక్కకుండా చేసేందుకు వెంకటరమణ ఎత్తులు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ చదలవాడపై సీఎంకు ఫిర్యాదు వెంకటరమణ తీరుపై మండిపడుతున్న చదలవాడ తనకే టీటీడీ చైర్మన్ పదవంటూ ధీమా సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబుపై చదలవాడ ఒత్తిడి తెస్తున్నారు. చదలవాడ తనకు వ్యతిరేకంగా పనిచేశారని.. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వొద్దంటూ ఎమ్మెల్యే వెంకటరమణ సీఎం కు ఫిర్యాదు చేశారు. వెంకటరమణతో సీఎం చంద్రబాబే ఫిర్యాదు అస్త్రాన్ని సంధింపజేశారనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తిరుపతి నియోజకవర్గం నుంచి 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చదలవాడ కృష్ణమూర్తి ఆ శాసనసభ స్థానానికి ఇన్చార్జ్గా వ్యవహరించేవారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకే టికెట్ దక్కుతుందని చదలవాడ భావించారు. కానీ చదలవాడ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లుతూ చివరి నిముషంలో కాంగ్రెస్‌ను వీడి సైకిలెక్కిన వెంకటరమణను తిరుపతి శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించారు. టికెట్ చేజారడంతో అసంతృప్తితో ఉన్న చదలవాడను చంద్రబాబు బుజ్జగించారు. వెంకటరమణ విజయానికి కృషి చేస్తే.. టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానంటూ చదలవాడకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు చంద్రబాబు రాతపూర్వకంగా ఓ లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు. ఎన్నికల్లో వెంకటరమణ విజయం సాధించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తనకు టీటీడీ చైర్మన్ పదవి దక్కడం ఖాయమని చదలవాడ తన అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇదే అంశంపై చంద్రబాబును అనేక సందర్భాల్లో చదలవాడ కలిశారు. చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఇష్టం లేని చంద్రబాబు.. వెంకట రమణను ఎగదోసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు డెరైక్షన్ మేరకు ఎన్నికల్లో చదలవాడ తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ వెంకటరమణ ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసి ఆ మేరకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో చదలవాడ ఆందోళనకు గురయ్యారు. కానీ.. మంగళవారం దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత టీటీడీ పాలక మండలిని నియమిస్తామని చెప్పారు. ఆ ప్రకటన వెలువడిన వెంటనే మంత్రి మాణిక్యాలరావుతో వెంకటరమణ స మావేశమయ్యారు. చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వొద్దంటూ ప్రతిపాదిం చారు. స్థానికుడిని టీటీడీ చైర్మన్‌గా నియమిస్తే ఎమ్మెల్యేగా తన ప్రాధాన్యం తగ్గిపోతుందంటూ సరికొత్త వాదనను కూడా మంత్రికి వినిపించారు. ఈ వాద న వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉన్నట్లు టీటీపీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి నియోజకవర్గానికే చెందిన చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవిని అప్పగిస్తే.. ఆ శాసనసభ స్థానం టీడీపీలో వర్గ విభేదాలకు బీజం వేసినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. వర్గ విభేదాలకు చెక్ పెట్టాలన్న నెపంతోనే చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు వెంకటరమణ సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల్లో తన సేవలు వినియోగించుకుని.. గెలిచాక వెంకటరమణ వ్యవహరిస్తోన్న తీరుపై చదలవాడ తన అనుయాయుల వద్ద మండిపడుతున్నారు. వెంకటరమణ విజయానికి కృషి చేస్తే.. ఇప్పుడు తనకు పదవి ఇవ్వకూడదంటూ ఫిర్యాదు చేస్తారా అంటూ చదలవాడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి చదలవాడ తీసుకెళ్లినా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన లభించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తనకు రాతపూర్వకంగా చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి తనకే దక్కుతుందని ఇన్నాళ్లూ ధీమాతో ఉన్న చదలవాడ ఇప్పుడు చంద్రబాబు సానుకూలంగా స్పందించకపోవడంతో ఆందోళన చెందుతున్నట్లు ఆయన వర్గీయులు వెల్లడించారు.