
రామయ్యకు వెంకన్న అండ!
కడప కల్చరల్ : నవ్యాంధ్రలో ప్రభుత్వ లాంఛనాలతో నవమి ఉత్సవాలకు ఎంపికైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం నేడు (బుధవారం) తిరుమల-తిరుపతి దేవస్థానాల్లో విలీనం కానుంది. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, డిప్యూటీ ఈఓ కోలా భాస్కర్, పాలక మండలి సభ్యులు భాను ప్రకాశ్‌రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్, దాదాపు 40 మంది అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వేద పండితులు ఈ కార్యక్రమ నిర్వహణకు ఉదయం 6.55 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు.
ఆలయ ప్రస్తుత కార్యనిర్వహణాధికారి, జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ టీటీడీ అధికారులకు ఆలయ నిర్వహణ బాధ్యతతోపాటు ఆలయ ఆస్తులన్నింటినీ అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు టీటీడీలో విలీనమైన ఆలయాల పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల నుంచి లడ్డూలు తెప్పించి విక్రయించడం మినహా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. ఒంటిమిట్ట రామాలయం కూడా ఆ జాబితాలో చేరిపోతుందా అనే భయం వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీ మేరకు ఈ ఆలయాన్ని ప్రభుత్వమే అభివృద్ధి చేసి ఉంటే బావుండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మొర వినరా...
జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 2006 సెప్టెంబరు 10న టీటీడీ విలీనం చేసుకుంది. అనంతరం వేంపల్లె గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని, జమ్మలమడుగు శ్రీ నారాపురస్వామి దేవాలయం, తాళ్లపాక ఆలయాలను కూడా విలీనం చేసుకున్నారు. అనంతరం ఏడు సంవత్సరాలు అభ్యర్థించగా, అర్చకులకు మాత్రం పే స్కేల్ మంజూరు చేశారు. కానీ, దేవుని కడప ఆలయంలోని 13 మంది, గండి క్షేత్రంలోని 12 మంది దిగువ స్థాయి ఉద్యోగులను మాత్రం సంస్థలో విలీనం చేయలేదు.
టీటీడీలో విలీనమైనపుడు వీరితోపాటు ఇతర ఆలయాల్లో దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈఓ స్థాయి పదోన్నతులు సాధించి మంచి జీతం తీసుకుంటున్నారు. కానీ, పైన పేర్కొన్న విలీన ఆలయాల్లోని ఉద్యోగులకు మాత్రం ఇప్పటికీ కేవలం రూ.5 వేలు మాత్రమే వస్తోంది. దీంతో ఎలా బతకాలని వారు ఎనిమిదేళ్లుగా మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జీతాలు చాలక గండి క్షేత్రంలోని ఓ చిరుద్యోగి ఆలయ ఆవరణంలోనే 2013లో ఆకలి బాధతో మరణించాడు.
దేవుని కడపలో పూర్తి స్థాయి సర్వీసు అందించిన వేద పండితుడు ప్రస్తుతం ఎలాంటి పెన్షన్ బెనిఫిట్ లేకుండానే ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఇదే ఆలయంలో 30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులు కూడా ఎలాంటి పెన్షన్ బెనిఫిట్లు లేకుండా రిక్త హస్తాలతో ఉద్యోగ విరమణ చేశారు.
దెబ్బ మీద దెబ్బ
తమ వేతనం పెంచాలని చిరుద్యోగులు విన్నవిస్తున్న తరుణంలో ఇలాంటి వారందరినీ తొలగిస్తున్నామని జనవరిలో టీటీడీ తేల్చిచెప్పింది. సొసైటీగా ఏర్పడితే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుంటామని చెప్పింది. దీనిపై కోర్టుకెళ్లిన బాధిత ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఫలితం శూన్యం. ఈ దశలో వీరు కాపునాడు నేత నారాయణస్వామి రాయల్ ద్వారా జూన్‌లో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి తమ బాధను విన్నవించుకున్నారు. ఆయన వీరి వేతనం పెంచడానికి అంగీకరించినా అందుకు సంబంధించి ఆదేశాలు వెలువడలేదు. నేడు ఒంటిమిట్ట రామయ్య సన్నిధిలో మరో సారి ఆయన్ను కలిసి ఈ ఉద్యోగులు వినతిపత్రం అందజేయనున్నారు.