శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి జూలై 1 నుంచి 31వ తేదీ వరకు మొత్తం 58,067 టికెట్లు విడుదల చేసినట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో వెల్లడించిన టికెట్లలో.. సుప్రభాతం 6,542, అర్చన 120, తోమాల 120, విశేషపూజ 1,875, అష్టదళ పాదపద్మారాధన సేవ 60, నిజపాద దర్శనం 1500, కల్యాణోత్సవం 11,250, వసంతోత్సవం 12,900, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,450, సహస్రదీపాలంకార సేవ 14,250, ఊంజల్‌సేవ 3,000 టికెట్లు ఉన్నాయి. 2016–2017 ఆర్థిక సంవత్సరంలో 2.66 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకలు రూ.1,038 కోట్లు, ఈ–హుండీ ద్వారా రూ.15.64 కోట్లు, లడ్డూలు 10.43 కోట్లు, 2.48 కోట్ల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామన్నారు. తిరుమల ఆలయంలో గర్భాలయ మూలమూర్తికి నిర్వహించే అర్చన, తోమాల సేవలకు సంబంధించి ఇంటెర్నెట్ కోటాలోని 120 టికెట్లను కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. ఈనెల 14వ తేదీ తమిళ కొత్త సంవత్సరం ఉగాది పర్వదినం నుంచి ఎస్వీబీసీ తమిళ చానెల్–2 పూర్తి స్థాయిలో ప్రసారాలు సాగిస్తామన్నారు. అంతర్జాతీయ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా టీటీడీ ట్రస్టులకు విరాళాలు సమర్పించేందుకు అనువుగా మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. టీటీడీ ఆరంభించిన గోవిందా మొబైల్ యాప్ నుంచి హుండీ, ఈ–డొనేషన్, రూ.300 టికెట్లకు మంచి స్పందన లభిస్తోందన్నారు.