
అనర్హులకు ఈఓ పోస్టులు!
- దేవాదాయశాఖలో తెరవెనుక బాగోతం
- కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడితో కదిలిన ఫైలు
- సీనియర్ ఈఓలను మార్చి అస్మదీయులకు కేటాయించే యత్నం
- ప్రధాన దేవాలయాల్లో సాగుతున్న తంతు
సాక్షి, హైదరాబాద్: ప్రధాన దేవాలయాలకు అర్హత లేని అధికారులను కార్యనిర్వహణాధికారులుగా కూర్చోబెట్టేందుకు దేవాదాయశాఖలో పావులు కదులుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడి తో ఫైలు చకచకా కదిలి.. ఇప్పుడు దేవాదాయ మంత్రి వద్దకు చేరింది. దేవాదాయశాఖను ప్రక్షాళన చేసేందుకు దేవాదాయ మంత్రి చైర్మన్‌గా ఐదుగురు మంత్రులతో ఏర్పడ్డ మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫారసులు సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఈ వ్యవహారానికి తెరలేచింది. ఆదాయం ఆధారంగా దేవాలయాల స్థాయి పెంచాలని ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం, నిర్మల్ జిల్లా బాసర ఆలయాలకు అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) స్థాయి అధికారులు ఈఓలుగా ఉండాలి.
ప్రస్తుతం ఏసీ పదోన్నతికి సిద్ధంగా ఉన్న అధికారులు ఇక్కడ ఈఓలుగా ఉన్నారు. ఈ దశలో సాధారణ సూపరింటెండెంట్లకు ఆ పోస్టులు కట్టబెట్టేందుకు కొందరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. రకరకాల ఆరోపణలు, కేసుల్లో ఇరుక్కుని ఉన్న సూపరింటెండెంట్లకు ఇన్‌చార్జి ఈవోలుగా కూర్చోబెట్టాలని వారు ఒత్తిడి ప్రారంభించారు. దీంతో అధికారులు ఆ ఫైల్‌ను దేవాదాయ మంత్రి వద్దకు పంపినట్టు తెలిసింది. ఈ ఇద్దరు సూపరింటెండెంట్లు నేరుగా ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు కాదు, అలాంటి వారిని ఈఓలుగా నియమించడం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా ఎమ్మెల్యేల ఒత్తిడితో ఫైలు చకచకా కదిలింది. వీరికి పోస్టింగ్స్ ఇస్తే మరికొందరు సూపరింటెండెంట్లు కూడా దొడ్డిదారిన ఈఓ పోస్టులు కొట్టేసేందుకు సిద్ధంగా ఉన్నారు.