సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన కమిటీ తమ పరిశీలనను వేగవంతం చేసింది. ఇప్పటికే భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంతోపాటు పోర్టల్ నిర్వహణ కంపెనీ ప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపిన కమిటీ.. శనివారం సర్వే సెటిల్‌మెంట్, దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డులకు చెందిన ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఆయా విభాగాల పరిధిలో ధరణి పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చించింది. సోమవారం సచివాలయంలో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖతో సమావేశం కావాలని, ఆ తర్వాత జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని కమిటీ నిర్ణయించింది.
ఇందుకోసం రాష్ట్రంలోని మూడు జిల్లాలను కమిటీ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. రంగారెడ్డి, నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్ లేదా ఖమ్మంలో ‘ధరణి’ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలు పూర్తయ్యాక అన్ని అంశాలను క్రోడీకరించి, ధరణి పోర్టల్ వాస్తవ పరిస్థితిని తెలి యజేస్తూ.. ప్రభుత్వానికి నివేదిక అందించాలని కమిటీ భావిస్తోంది.
మీ శాఖల్లో ఏం జరుగుతోంది?
సర్వే విభాగానికి సంబంధించి రికార్డుల జాబితా, ఖస్రా, సెస్లా పహాణీల నిర్వహణ, ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం, భూభారతి ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన సర్వే పటాల ప్రస్తుత స్థితి, ధరణి పోర్టల్ సమాచారానికి, పటాలకు మధ్య వ్యత్యాసం తదితర అంశాలపై చర్చించారు. అదే విధంగా తమ భూమిని సబ్‌డివిజన్ చేయాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే.. అందుకు అవలంబిస్తున్న పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇక వక్ఫ్ బోర్డు అధికారులతో చర్చల్లో భాగంగా.. మొత్తం వక్ఫ్ బోర్డు కింద ఉన్న భూవిస్తీర్ణం ఎంత? అందులో ఎంత కబ్జాకు గురైంది? వక్ఫ్ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్‌లో ఈ భూముల విషయంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన సమావేశంలో.. ఆ శాఖ ఆదీనంలో ఉన్న మొత్తం భూవిస్తీర్ణం, ఈ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్‌లో సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిత్తల్, మధుసూదన్, సీఎంఆర్వో పీడీ వి.లచ్చరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేల ఎకరాల్లో తేడా.. భూములను జియోట్యాగింగ్ చేసుకోండి
దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డుతో చర్చల సందర్భంగా ‘ధరణి’ కమిటీ సభ్యులు పలు వివాదాస్పద అంశాలను గుర్తించారు. దేవాదాయ శాఖ గెజిట్‌లో, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూములకు, ఆయా శాఖల పేరిట ధరణి పోర్టల్‌లో నమోదైన భూముల విస్తీర్ణానికి వేల ఎకరాల్లో తేడా ఉందని తేల్చారు. ఆ భూములన్నీ ఎటు పోయాయని అధికారులను కమిటీ సభ్యులు ప్రశ్నించారు.
ఇక దేవాదాయశాఖ గెజిట్‌లో పేర్కొనని పట్టా భూములను కూడా ధరణి పోర్టల్‌లో నిషేధిత భూములుగా చేర్చారని.. వీటిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి భూముల విషయంలో పరిష్కార మార్గాలను వెతకాలని సూచించారు. ముఖ్యంగా దేవాదాయ భూములన్నింటినీ జియోట్యాగింగ్ చేసుకోవాలని.. పట్టాదారులు తమ భూముల వివరాలను చెక్ చేసుకునే తరహాలోనే ఎప్పటికప్పుడు తమ భూముల స్థితిగతులను పరిశీలించుకోవాలని సూచించారు.
మార్గదర్శకాలు, బదలాయింపు లేనందునే సమస్యలు: ఎం.కోదండరెడ్డి
శనివారం వివిధ వర్గాలతో సమావేశం తర్వాత ‘ధరణి’కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ సమస్యలపై తమ అధ్యయనం నిరంతరం కొనసాగుతుందన్నారు. అవసరమైనప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా, రైతు సంఘాలతో మాట్లాడామన్నారు. అందరితో సంప్రదింపులు పూర్తయిన తర్వాత ప్రాథమిక నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.
‘ధరణి’ క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ
Published Sun, Feb 4 2024 5:08 AM | Last Updated on Sun, Feb 4 2024 5:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment