Department of endowment
-
‘ధరణి’ క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ పునర్నిర్మాణం కోసం ఏర్పాటైన కమిటీ తమ పరిశీలనను వేగవంతం చేసింది. ఇప్పటికే భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంతోపాటు పోర్టల్ నిర్వహణ కంపెనీ ప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపిన కమిటీ.. శనివారం సర్వే సెటిల్మెంట్, దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డులకు చెందిన ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఆయా విభాగాల పరిధిలో ధరణి పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలు, ప్రత్యామ్నాయాలపై చర్చించింది. సోమవారం సచివాలయంలో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖతో సమావేశం కావాలని, ఆ తర్వాత జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని మూడు జిల్లాలను కమిటీ ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. రంగారెడ్డి, నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్ లేదా ఖమ్మంలో ‘ధరణి’ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలు పూర్తయ్యాక అన్ని అంశాలను క్రోడీకరించి, ధరణి పోర్టల్ వాస్తవ పరిస్థితిని తెలి యజేస్తూ.. ప్రభుత్వానికి నివేదిక అందించాలని కమిటీ భావిస్తోంది. మీ శాఖల్లో ఏం జరుగుతోంది? సర్వే విభాగానికి సంబంధించి రికార్డుల జాబితా, ఖస్రా, సెస్లా పహాణీల నిర్వహణ, ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేయడం, భూభారతి ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన సర్వే పటాల ప్రస్తుత స్థితి, ధరణి పోర్టల్ సమాచారానికి, పటాలకు మధ్య వ్యత్యాసం తదితర అంశాలపై చర్చించారు. అదే విధంగా తమ భూమిని సబ్‌డివిజన్ చేయాలని రైతులు దరఖాస్తు చేసుకుంటే.. అందుకు అవలంబిస్తున్న పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక వక్ఫ్ బోర్డు అధికారులతో చర్చల్లో భాగంగా.. మొత్తం వక్ఫ్ బోర్డు కింద ఉన్న భూవిస్తీర్ణం ఎంత? అందులో ఎంత కబ్జాకు గురైంది? వక్ఫ్ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్‌లో ఈ భూముల విషయంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన సమావేశంలో.. ఆ శాఖ ఆదీనంలో ఉన్న మొత్తం భూవిస్తీర్ణం, ఈ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ధరణి పోర్టల్‌లో సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, ఎం.సునీల్‌కుమార్, రేమండ్ పీటర్, నవీన్ మిత్తల్, మధుసూదన్, సీఎంఆర్వో పీడీ వి.లచ్చరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేల ఎకరాల్లో తేడా.. భూములను జియోట్యాగింగ్ చేసుకోండి దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డుతో చర్చల సందర్భంగా ‘ధరణి’ కమిటీ సభ్యులు పలు వివాదాస్పద అంశాలను గుర్తించారు. దేవాదాయ శాఖ గెజిట్‌లో, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూములకు, ఆయా శాఖల పేరిట ధరణి పోర్టల్‌లో నమోదైన భూముల విస్తీర్ణానికి వేల ఎకరాల్లో తేడా ఉందని తేల్చారు. ఆ భూములన్నీ ఎటు పోయాయని అధికారులను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఇక దేవాదాయశాఖ గెజిట్‌లో పేర్కొనని పట్టా భూములను కూడా ధరణి పోర్టల్‌లో నిషేధిత భూములుగా చేర్చారని.. వీటిని ఆ జాబితా నుంచి తొలగించేందుకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి భూముల విషయంలో పరిష్కార మార్గాలను వెతకాలని సూచించారు. ముఖ్యంగా దేవాదాయ భూములన్నింటినీ జియోట్యాగింగ్ చేసుకోవాలని.. పట్టాదారులు తమ భూముల వివరాలను చెక్ చేసుకునే తరహాలోనే ఎప్పటికప్పుడు తమ భూముల స్థితిగతులను పరిశీలించుకోవాలని సూచించారు. మార్గదర్శకాలు, బదలాయింపు లేనందునే సమస్యలు: ఎం.కోదండరెడ్డి శనివారం వివిధ వర్గాలతో సమావేశం తర్వాత ‘ధరణి’కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. ధరణి పోర్టల్ సమస్యలపై తమ అధ్యయనం నిరంతరం కొనసాగుతుందన్నారు. అవసరమైనప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా, రైతు సంఘాలతో మాట్లాడామన్నారు. అందరితో సంప్రదింపులు పూర్తయిన తర్వాత ప్రాథమిక నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. -
నరసన్న రథం రెడీ
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ.. ప్రకటించిన గడువు కంటే ముందుగానే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయించింది. 2021లో జరగబోయే స్వామివారి కల్యాణోత్సవం నాటికి కొత్త రథాన్ని సిద్ధం చేస్తామని భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. అందుకు అనుగుణంగా రెండున్నర నెలల్లోనే రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. రథానికి రంగులు వేసే పని ఒక్కటే మిగిలి వుంది. నరసన్న కల్యాణోత్సవ సమయానికి రథం లేదనే మాట రానివ్వకూడదని ప్రభుత్వం దీని నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండున్నర నెలల్లోపే.. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం జూన్ 8 అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దగ్ధమైన విషయం విదితమే. దీనిని ఆసరా చేసుకుని కొన్ని రాజకీయ శక్తులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడితో ఆగిపోకుండా భక్తుల మనోభావాలను పరిరక్షించే లక్ష్యంతో ఘటన చోటుచేసుకున్న రెండో రోజే ప్రత్యేకత కలిగిన కొత్త రథం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విలువైన కలప, ఇతర సామగ్రిని ఆగమేఘాలపై సేకరించి అక్టోబర్ 21న రథం నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపు రెండున్నర నెలల్లోపే పూర్తి చేయించారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న జరిగే రథోత్సవం నాటికి పూర్తి చేయాలని సంకల్పించగా.. అంతకంటే ముందుగానే పూర్తి చేయడం ద్వారా తమ మనోభావాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం రథానికి సోమవారం ట్రయల్ రన్ నిర్వహించగా విజయవంతమైంది. సంప్రదాయం ప్రకారం అంతర్వేది పల్లిపాలేనికి చెందిన మత్స్యకారులే రథాన్ని ప్రయోగాత్మకంగా లాగారు. రథానికి వారే పసుపు, కుంకుమ అద్ది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఏడంతస్తులు.. 43 అడుగుల ఎత్తు.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 43 అడుగుల ఎత్తున.. 7 అంతస్తులతో రథ నిర్మాణం పూర్తయ్యింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రథానికి బ్రేకులు, జాకీ కూడా ఏర్పాటు చేశారు. జాకీ ఏర్పాటు చేయడం వల్ల రథం సులభంగా మలుపు తిరిగేందుకు వీలవుతుంది. బ్రేకుల ఏర్పాటుతో ప్రమాద రహితంగా ఉంటుంది. మొత్తంగా రథం నిర్మాణం కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. పాత రథానికి బర్మా టేకు వాడగా.. నూతన రథ నిర్మాణంలో 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకును వినియోగించారు. ఇంత తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం ఇదే తొలిసారి నేను తయారు చేసిన వాటిలో 81వ రథం ఇది. దీనికి 70 రోజులు పట్టింది. నా 21 ఏళ్ల రథాల తయారీ జీవిత ప్రస్థానంలో ఇంత తక్కువ కాల వ్యవధిలో ఇంత వేగంగా రథాన్ని తయారు చేయడం ఇదే తొలిసారి. – సింహాద్రి గణపతిశాస్త్రి, రథం తయారీదారు చాలా బాగుందయ్యా! ఇంత తక్కువ వ్యవధిలో రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో ప్రభుత్వ కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మరో 150 ఏళ్ల వరకూ ఈ రథానికి ఢోకా లేదు. – మల్లాడి వెంకటరెడ్డి, మత్స్యకారుడు, అంతర్వేది పల్లిపాలెం -
ఆలయ భూములను పవిత్రంగా భావిస్తాం
సాక్షి, అమరావతి: దేవదాయ భూములను పవిత్ర భూములుగా భావించే ప్రభుత్వం తమదని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. భీమిలిలో భూచోళ్లు అంటూ ఈనాడు అసత్య కథనాలు ప్రచురించిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలు ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. భీమిలిలో దేవదాయ భూముల లీజుల వ్యవహారంలో అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. దేవదాయ భూముల లీజుకిచ్చే వ్యవహారంలో అధికారులు నిబంధనల ప్రకారమే వ్యవహరించారన్నారు. కోట్ల విలువ చేసే 67 ఎకరాల భూముల్ని అక్రమంగా కట్టబెడుతున్నారనే ఆరోపణలు సరికావని తెలిపారు. జనవరి 28నే భూముల లీజు వేలాన్ని రద్దు చేస్తూ పత్రికల్లో ప్రకటన ఇచ్చారని పేర్కొన్నారు. దేవదాయ భూములు గజం స్థలం విక్రయించాలన్నా హైకోర్టు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. అది తెలియకుండా ఇళ్ల స్థలాలకు దేవదాయ భూములు తీసుకుంటున్నారని దుష్పప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దుష్ప్రచారం చేసిన వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల్లో అన్యమత ప్రచారం ఎక్కడ జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మఠం భూములను ఇష్టారాజ్యంగా లీజుకు ఇచ్చేశారన్నారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అర్చక సంక్షేమ నిధులపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గతంలో టీడీపీ నేతలు పెన్షన్లను కూడా మింగేశారన్నారు. -
ఒకేసారి 1,448 ఆలయాలకు..పాలక మండళ్లు
సాక్షి, అమరావతి: మరో సంచలనానికి రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. దేవదాయ శాఖ పరిధిలోని 1,448 ఆలయాలకు ఒకే విడతలో పాలక మండళ్ల నియామకానికి సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఒక్కో ట్రస్టు బోర్డులో ఉండే మొత్తం సభ్యులలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించడంతో పాటు మొత్తంగా అన్ని కేటగిరీలలో సగం పదవుల్లో మహిళలనే నియమించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వీటిలోని మొత్తం 10,256 నామినేటెడ్ పదవులకుగాను సగం అంటే.. 5128 పదవులు హిందువుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కుతాయి. అలాగే.. జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీల కేటగిరీలలోని మొత్తం 10,256 మంది నియామకాల్లో సగం అంటే 5,128 పదవులు మహిళలకే లభించనున్నాయి. ఒక్కో గుడికి 7–9 మంది చొప్పున.. రూ.25 లక్షలలోపు ఆదాయం ఉండే 1,388 ఆలయాలతో పాటు రూ.25 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఆదాయం ఉండే మరో 60 ఆలయాలకు కలిపి మొత్తం 1,448 ఆలయాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రూ.కోటిలోపు ఆదాయం ఉన్న మొత్తం 172 ఆలయాలకుగాను ప్రస్తుతం 60కి మాత్రమే పాలక మండళ్లను నియమిస్తున్నారు. దేవదాయ శాఖ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం రూ.25 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలకు ఏడుగురు సభ్యుల చొప్పున పాలక మండలిని నియమించాల్సి ఉంది. అలాగే, రూ.కోటిలోపు ఆదాయం ఉండే ఆలయాలకు తొమ్మిది మంది చొప్పున సభ్యులను నియమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం అనుమతి తెలిపిన ఆలయాల వివరాలను సంబంధిత ఆలయ కార్యనిర్వహణాధికారులు ఎక్కడికక్కడ ఆయా ఆలయాలు, పంచాయతీ, మండల కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో ఉంచుతారు. ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. గడువు ముగిసిన తర్వాత పాలక మండళ్ల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. కాగా, రూ.25 లక్షలలోపు ఆదాయం ఉండే ఆలయాలకు దేవదాయ శాఖ కమిషనర్, రూ.కోటిలోపు ఆదాయం ఉండే ఆలయాలకు థార్మిక పరిషత్ అనుమతితో పాలక మండలి సభ్యుల నియామకం జరుగుతుంది. -
గోడపై గుడి చరిత్ర!
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయం ఎవరు నిర్మించారు.. ఎప్పుడు నిర్మించారు.. ఆలయానికి వెళ్లే భక్తుల్లో చాలామందికి తెలియని విషయాలివి. కానీ, ఇప్పుడు ఆలయానికి వెళ్తే దాన్ని చారిత్రక కారణాలు, ఆలయ నిర్మాణం తర్వాత జరిగిన ఘటనలు కళ్లకు కట్టేలా గోడలపై చిత్రాలతో కూడిన వర్ణన కనిపిస్తుంది. ఈ దేవాలయం వెనక ఇంతటి నేపథ్యం ఉందా అని భక్తులు అబ్బురపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో ఆలయాల గురించి పుస్తకాల్లో తప్ప గుడిలో చెప్పేవారుండరు. అందుకే దేవాదాయశాఖ ఆలయాల చరిత్ర భక్తులకు తెలియజెప్పాలని నిర్ణయించింది. ఇక ఆలయాల చరిత్రకు ఆ గుడిగోడలు ఆలవా లం కానున్నాయి. అన్ని పురాతన దేవాలయాల నిర్మాణ నేపథ్యం వంటి వివరాలు దేవాలయాల గోడలపై రాయించాలని, చిత్రాలు వేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవా దాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవాలయంలో దాని చరిత్రను గోడలపై ఏర్పాటు చేయించారు. దేవాలయాల ప్రాధాన్యం పెంచేందుకే..... పట్టణాలు, పల్లెల్లో ఇప్పుడు విరివిగా ఆలయాలు నిర్మితమవుతున్నాయి. చెత్తకుప్పల పక్కన, చిన్న, చిన్న ఇరుకు గదుల్లో, అపార్ట్మెంట్ తరహా నిర్మాణాలోనూ గుడులు వెలుస్తున్నాయి. కొన్ని గుడుల్లో, కొన్ని సందర్భాల్లో సినిమా పాటలు, రికార్డింగ్ డాన్సులు లాంటి వాటితో హోరెత్తిస్తున్నారు. దీంతో భక్తిభావం సన్నగిల్లేలా అవకాశముందనే ఫిర్యాదులు చాలాకాలంగా ఉన్నాయి. వీటివల్ల పురాతన దేవాలయాల ప్రాభవం తగ్గుతోంది. దీన్ని గమనంలో ఉంచుకుని దేవాదాయశాఖ భక్తుల్లో ఆలయాల ప్రాధాన్యంపై అవగాహన కల్పిం చి వాటి వైభవం పెరిగేలా చేయాలని నిర్ణయించింది. పెయింటింగ్స్‌కు కంటే మెరుగైన పద్ధతిలో... స్థానికులకు, ఆలయాలపై కొంత అవగాహన ఉన్నవారికే వాటి చరిత్ర తెలుస్తోంది. కొత్త భక్తులకు వాటి నేపథ్యంపై అవగాహన ఉండటం లేదు. ఇప్పుడు భక్తులందరికీ గుడుల చారిత్రక నేపథ్యంపై అవగాహన తెచ్చేలా ఈ ఏర్పాటు చేస్తున్నారు. గోడలపై పెయింటింగ్ వేయిస్తే అది ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదు. పండుగలప్పుడు రంగులేస్తే ఈ పెయింటింగ్స్ మలిగిపోయే అవకాశం ఉంది. అవసరమైనప్పుడు వాటిని తొలగించి మళ్లీ ఏర్పాటు చేసే అవకాశం ఉండే పద్ధతులను అనుసరిస్తున్నారు. -
ముంపు ప్రాంతాలపై చర్యలు చేపట్టండి
సాక్షి,విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలైన రోటరీనగర్, భవానీపురం, కెపిహెచ్బి కాలనీలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. చిన్నపాటి వర్షానికే ఇక్కడి కాలనీలు నీట మునుగుతున్నాయని అక్కడి స్థానికులు మంత్రి వెల్లంపల్లికి వివరించారు. వెంటనే ముంపు ప్రాంతాలలో చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని మంత్రి వెల్లంపల్లి అధికారులను ఆదేశించారు. తర్వాత భవానీపురం దర్గా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ శానిటేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. -
ప్రభుత్వం మారినా పదవులను వదలరా!
సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన చేపట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారు నెలకావస్తోంది. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవులు చేపట్టిన తెలుగు తమ్ముళ్లు ఇంకా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే వారందరూ రాజీనామాలు సమర్పించాలి. వివరాల్లోకి వెళితే.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నగరంలో దేవదాయ ధర్మాదాయ శాఖ ద్వారా అందుబాటులోకి వచ్చే నామినేటెడ్ పదవులకు అభ్యర్థులను నియమించి హడావుడిగా ప్రమాణ స్వీకారాలు చేయించారు. మే 23న శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ ఘోర పరాజయం పాలైంది. రాజీనామా చేయకుండా.. వాస్తవంగా ఎన్నికల్లో గత ప్రభుత్వం విజయం సాధిస్తే ప్రస్తుతం నియమితులైన వారు నిర్ణీత పదవీకాలం పూర్తయ్యే వరకూ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. ఓటమి పాలైన వారందరూ తక్షణమే రాజీనామా చేయాలి. కానీ రాజమహేంద్రవరం నగరంలో మాత్రం టీడీపీ నాయకులు ఇంకా నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. నగరంలోని పలు ట్రస్ట్‌బోర్డులకు కమిటీల నియామకం జరిగింది. జీవకారుణ్య సంఘానికి వర్రే శ్రీనివాస్, హితకారిణి సమాజానికి యాళ్ల ప్రదీప్, శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవస్థానానికి అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్, చందాసత్రానికి ఇన్నమూరి దీపు, ఉమారాలింగేశ్వర కల్యాణ మండపానికి మజ్జి రాంబాబు, పందిరి మహదేవుడు సత్రానికి రెడ్డి మణి చైర్మన్లుగా ఉన్నారు. వీరందరూ ఇంకా పదవుల్లో కొనసాగుతూనే ఉన్నారు. -
జూన్ నుంచి ‘షుగర్ ఫ్రీ’ ప్రసాదం!
సాక్షి, హైదరాబాద్: లడ్డూ, చక్కెర పొంగలి, రవ్వ కేసరి... గుడిలో దేవునికి నైవేద్యంగా సమర్పించాక అందించే ఇలాంటి ప్రసాదాలను భక్తులు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. తీపి పదార్థాలకు దూరంగా ఉండాల్సిన మధుమేహ రోగులైతే తమ ‘కట్టుబాటు’ను పక్కనపెట్టి మరీ వాటిని లాగించేస్తారు. అయితే ఇప్పుడు మధుమేహం ఉన్న వారూ నిరభ్యంతరంగా ఈ ప్రసాదం స్వీకరించొచ్చు! దీనికి దేవాదాయశాఖ అభయం ఇస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింటిలో ఇక నుంచి ఎంచక్కా బెల్లం ప్రసాదాలు అందుబాటులోకి వస్తున్నాయి. గుడి అనగానే ఠక్కున కనిపించేది లడ్డూ ప్రసాదం. ఇప్పుడు ఆ లడ్డూ కూడా బెల్లంతో సిద్ధమవుతోంది. ఒక్క లడ్డూ మాత్రమే కాదు చక్కెర పొంగళి స్థానంలో బెల్లం పొంగలి, రవ్వ కేసరి లాంటివి కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఇన్చార్జి కమిషనర్ అనిల్ కుమార్ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రతిపాదనకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అంగీకరించడంతో ప్రయోగాత్మకంగా ఇటీవలే కొన్ని దేవాలయాల్లో బెల్లం ప్రసాదాలు ప్రారంభించారు. భక్తుల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో దాన్ని విస్తరించాలని తాజాగా నిర్ణయించారు. జూన్ ఒకటి నుంచి వీలైనన్ని ప్రధాన దేవాలయాల్లో బెల్లం ప్రసాదాలను ప్రారంభించనున్నారు. వెరసి ఇప్పుడు దేవుడికి ‘షుగర్ ఫ్రీ’నైవేద్యాలు సిద్ధమన్నమాట. దేవుడికి ప్రీతి... భక్తులకు ‘ముక్తి’.. స్వామి కైంకర్యాల్లో ప్రసాద నివేదన కీలకం. మంత్రోచ్ఛరణల్లోనూ దాని ప్రస్తావన ఉంటుంది. గుడ నైవేద్యం సమర్పయామి అంటూ నివేదిస్తుంటారు. స్వామి సేవకు పేదరికం అడ్డుకాదని చెబుతూ పత్రం పుష్పం ఫలం తోయం ప్రస్తావన తెస్తారు. అదే కోవలో నైవేద్యానికి కూడా బెల్లం ముక్క చాలు అంటూంటారు. నిజానికి స్వామి–అమ్మవార్లు బెల్లం అంటే మక్కువ చూపుతారని చెప్పడం ద్వారా దేవుడు పేదల దరిలో ఉంటాడన్న నమ్మకాన్ని కలిగిస్తారు. పూర్వకాలంలో బెల్లం ప్రసాదాల వితరణ విస్తారంగా ఉన్నా రానురానూ చక్కెర ప్రాధాన్యం పెరిగింది. అన్ని ప్రసాదాలూ చక్కెరతో నిండిపోయాయి. ఇంతకాలం తర్వాత మళ్లీ దేవుళ్లు, భక్తులను బెల్లం పలకరిస్తోంది. చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడం, బెల్లంలో పోషక విలువలు ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా మహిళలకు ఎంతో అవసరమైన ఇనుము అందులో ఎక్కువగా ఉండటం, పూర్వకాలంలో ప్రసాదంలో బెల్లానికి విశేష ప్రాధాన్యం ఉండటం... ఇలా అన్ని అంశాలు కలగలిపి బెల్లం ప్రసాదాలు చేయించాలని దేవాదాయశాఖ కమిషనర్ నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ఆయన అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే భక్తులు బెల్లం ప్రసాదాలను స్వాగతిస్తారో లేదో చూద్దామని వారం క్రితం ప్రయోగాత్మకంగా కొన్ని దేవాలయాల్లో ప్రారంభించారు. భద్రాచలం, వేములవాడ, బాసర, యాదగిరిగుట్టతోపాటు సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయం, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి గుడిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. యాదగిరిగుట్టలో చక్కెర లడ్డూలతోపాటు బెల్లం లడ్డూలు ప్రారంభించారు. ప్రస్తుతం నిత్యం దాదాపు వెయ్యి బెల్లం లడ్డూలు విక్రయిస్తున్నారు. బాసరలో కూడా అంతేమొత్తం అమ్ముతుండగా భద్రాచలంలో సాధారణ రోజుల్లో 1,500, శని, ఆదివారాల్లో 5 వేల వరకు అమ్ముతున్నారు. ఇక్కడ ఇంతకాలం అందుబాటులో ఉన్న చక్కెర పొంగళిని పూర్తిగా ఆపేసి బెల్లం పొంగళి అమ్ముతున్నారు. దీంతోపాటు రవ్వ కేసరిని కూడా బెల్లంతో చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ఇక వేములవాడలో గుడాన్న పొంగళి పేరుతో బెల్లం ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. 200 గ్రాముల బరువు తూగే పొట్లాలను కాజు, కిస్మిస్, నెయ్యి రంగరించి రుచికరంగా సిద్ధం చేస్తుండటంతో భక్తజనం సంబరంగా స్వీకరిస్తున్నారు. చక్కెర ప్రసాదం ధరలకే వీటినీ అందుబాటులో ఉంచుతున్నారు. భవిష్యత్తులో తయారీ పెంచుతాం... చక్కెరతో పోలిస్తే బెల్లం ప్రసాదం రుచిలో కొంత తేడా ఉన్నా దేవుడికి ఇష్టమైందని, ఆరోగ్యానికి మేలు చేసేదన్న ఉద్దేశంతో భక్తజనం సానుకూలంగా స్పందిస్తుండటంపట్ల అధికారులు సంబరపడుతున్నారు. ‘వేములవాడలో పొంగళికి ఎంతో ప్రాధాన్యముంది. భక్తులు ఇష్టంగా, భక్తితో దీన్ని తీసుకుంటారు. ఇప్పుడు గుడాన్న పొంగళిగా బెల్లం ప్రసాదాన్ని అందుబాటులో ఉంచడంపట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో బెల్లం ప్రసాదాల తయారీని పెంచుతాం’అని వేములవాడ కార్యనిర్వహణాధికారి రాజేశ్వర్ పేర్కొన్నారు. -
ఫిబ్రవరి 6న గద్దెపైకి సమ్మక్క
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారంలో 2020లో నిర్వహించే శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి గడియల ఆధారంగా నిర్ణయించిన జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటిం చారు. ఆదివారం మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు సమావేశమయ్యారు. ఫిబ్రవరి 5న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులను గద్దెలపైకి తీసుకువస్తారు. 6న గురువారం చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దె మీదకు తెస్తారు. 7న వనదేవతలకు మొక్కుల చెల్లింపు, 8న తల్లుల వనప్రవేశం ఉంటుందని వెల్లడించారు. మహాజాతర తేదీల ఖరారుకు సంబంధించిన లేఖను మేడారం దేవాదాయశాఖ అధికారులకు అందజేయనున్నట్లు పేర్కొ న్నారు. 2018లో జరిగిన మహాజాతరకు సంబంధిం చిన తేదీలను 6 నెలల ముందుగా ప్రకటించిన పూజారులు 2020లో జరిగే జాతర తేదీలను మాత్రం 9 నెలలు ముందుగా ప్రకటించారు. జాతర తేదీలను ముందుగా ప్రకటించడంతో అభివృద్ధి పనులు, ఏర్పాట్లు చేపట్టడానికి ప్రభుత్వానికి వీలుంటుంద న్నారు. సమావేశంలో పూజారుల సంఘం ప్రధాన కార్యదర్శి చందా గోపాల్‌రావు, ఉపాధ్యక్షు డు కాక సారయ్య, కార్యదర్శులు సిద్దబోయిన స్వామి, భోజరావు తదితరులు పాల్గొన్నారు. వరుస ఎన్నికలతో నిధుల ప్రతిపాదనలు మూలకు.. 2018లో జరిగిన పెద్ద జాతరకు హాజరైన సీఎం కేసీఆర్ జాతర శాశ్వత అభివృద్ధి పనుల కోసం రూ.200 కోట్లు కేటాయిస్తామని హామీనిచ్చారు. దీంతో జాతర అనంతరం ఆ మేరకు చేపట్టనున్న అభివృద్ధి పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ముంద స్తు అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత పార్లమెం టు ఎన్నికలు, ఆపై స్థానిక సంస్థల ఎన్నికలు రావడం తో జాతర నిధుల విషయం అటకెక్కింది. -
రమణీ లలామ..నవలావణ్య సీమ ..
సాక్షి, కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఆదివారం శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీరామ.. జయరామ... జయజయ రామ.. నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. అర్చకస్వాముల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియంలో నయనానందకరంగా సాగిన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగింది. సీతారాములు ఆశీనులైన మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. అర్చకులు తెల్లవారుజామున 2 గంటలకే దేవాలయం తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, నివేదన, శాత్తుమురై, మూలవరులకు అభిషేకం, మంగళా శాసనం జరిపించారు. తర్వాత గర్భగుడిలోని మూలమూర్తులకు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో ఆశీనులను చేసి మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తోడ్కొని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపించారు. సీతారాముల కల్యాణోత్సవ విశిష్టతను, భద్రాద్రి ఆలయ క్షేత్ర ప్రాశస్త్యాన్ని, భక్త రామదాసు సేవలను, ఆయన సీతారాములకు చేయించిన బంగారు ఆభరణాల ప్రాశస్త్యాన్ని వేద పండితులు భక్తులకు వివరించారు. సీతమ్మవారికి ఎక్కడైనా మంగళసూత్రాలు రెండే ఉంటాయని, కానీ భద్రాచలంలో మాత్రం మూడు సూత్రాలు ఉంటాయని, రామదాసు చేయించిన సూత్రం ఇక్కడ అదనంగా ఉంటుందని తెలిపారు. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, ఈసీ అనుమతితో స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. కాగా, సోమవారం మిథిలా స్టేడియం ప్రాంగణంలో స్వామి కల్యాణోత్సవం జరిగిన మండపంలోనే శ్రీరామ మహా పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు జరగనుంది. ప్రభుత్వం తరఫు న గవర్నర్ నరసింహన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. -
ఆశీర్వదించే చేతులతో అర్థిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: ‘ఆశీర్వదించే చేతులతో అర్థిస్తున్నాం. మా ఆందోళనకు సహకరించండి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మాకు వేతనాల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. మేం దేవాలయాలు మూసివేయడం లేదు. కేవలం ఆర్జిత సేవలను మాత్రమే నిలిపివేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి’అంటూ భక్తులకు రాష్ట్రంలోని దేవాలయాల అర్చకులు, ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో ఆర్జిత సేవలను నిలిపివేశారు. దీంతో ఆలయాలకు వచ్చిన భక్తులకు తమ సమస్యను వివరించి వారికి సర్దిజెప్పేందుకు ప్రయత్నించారు. రాష్ట్రం మొత్తం మీద 646 దేవాలయాలు దేవాలయ శాఖ పరిధిలో ఉండగా, 610 దేవాలయాల వరకు ఆర్జిత సేవలు నిలిపివేశామని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జె.జైపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కావడంతో కొన్ని జిల్లాల్లోని దేవాలయాల్లో ఆర్జిత సేవలు కొనసాగించక తప్పలేదన్నారు. ఆర్జిత సేవల నిలిపివేత శనివారం కూడా కొనసాగుతుందని, తమ సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు భక్తులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. -
ప్రైవేటు బ్యాంకులో ఎందుకు జమ చేశారు?
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీటీడీ) చెందిన రూ. 1000 కోట్లను ప్రైవేటు బ్యాంకు ఇండస్ ఇండ్లో డిపాజిట్ చేయడంపై హైకోర్టు మంగళవారం టీటీడీ ఈవో వివరణ కోరింది. జాతీయ బ్యాంకులు ఉండగా, ప్రైవేటు బ్యాంకులో ఎందుకు ఆ వెయ్యి కోట్ల రూపాయలను జమ చేశారో చెప్పాలంటూ టీటీడీ ఈవో, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, తిరుపతి ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీకి చెందిన రూ. వెయ్యి కోట్లను ప్రైవేటు బ్యాంకు ఇండస్ ఇండ్లో జమ చేయడాన్ని సవాలు చేస్తూ తిరుపతికి చెందిన పి.నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జక్కుల శ్రీధర్ వాదనలు వినిపిస్తూ, పెద్ద మొత్తంలో నిధులను ప్రైవేటు బ్యాంకులో జమ చేయడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, జాతీయ బ్యాంకులు ఉండగా, ఎందుకు ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేశారో చెప్పాలని టీటీడీ, దేవాదాయశాఖ అధికారులను ఆదేశించింది. -
సర్వతో 'ఛి'ద్రాలయం
సాక్షి, హైదరాబాద్: చుట్టూ భారీ బండరాయి.. దానిపై భారీ శిఖరంతో ఆలయం.. నాలుగు వైపులా నాలుగు ద్వారాలు.. ఒక్కో ద్వారం నుంచి వెళ్తే ఒక్కో రూపంలో స్వామి దర్శనం.. తూర్పు వైపు లక్ష్మీ నరసింహుడు, పశ్చిమాన నాగలి ధరించిన బలరాముడు, దక్షిణాన వేణుగోపాల స్వామి, ఉత్తరాన సీతారామలక్ష్మణులు.. చుట్టూ విస్తరించిన బండరాయి మధ్య భాగాన్నే విగ్రహంగా మలిచారు నాటి శిల్పులు.. వందల ఏళ్లనాటి ఈ అరుదైన కట్టడం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దాని ప్రత్యేకత, గొప్పతనంపై అవగాహన లేని దేవాదాయ శాఖ.. అభివృద్ధి పేరుతో ధ్వంసరచన మొదలుపెట్టింది. వెలకట్టలేని ఆ నిర్మాణాలను అపురూపంగా మరమ్మతు చేయాల్సింది పోయి, నిర్మాణ ప్రత్యేకతలు నాశనమయ్యేలా అడ్డగోలు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. భూపాలపల్లి జిల్లా నయన్పాకలో సర్వతోభద్ర నమూనాలో నిర్మితమైన ఆలయ దీన గాథ ఇది. ‘సాక్షి’ కథనంతో.. బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ ఆలయంపై గతేడాది నవంబర్‌లో ‘సాక్షి’ప్రత్యేక కథనం ప్రచురించింది. పురావస్తు శాఖ విశ్రాంత అధికారి రంగాచార్యులుతో కలసి అమెరికా ప్రొఫెసర్ వ్యాగనార్ ఈ ఆలయాన్ని సందర్శించి నిర్మాణ రహస్యాలను వెలుగులోకి తేవడాన్ని ఉటంకిస్తూ కథనం సాగింది. ఆలయాన్ని చూసి మంత్రముగ్ధుడైన వ్యాగనార్.. ఇది అత్యంత అరుదైన అద్భుత నిర్మాణంగా పేర్కొన్నారు. దీనికి అలనాటి పద్ధతిలోనే మరమ్మతు చేసి భావితరాలకు అందించాలని సూచించారు. దీంతో స్పందించిన స్పీకర్ మ ధుసూదనాచారి.. ఆలయ పురోభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు. అయితే ఆలయాన్ని మరమ్మతు చేసి భావితరాలకు అందిం చాల్సింది పోయి ఆ ప్రత్యేకతల్నే నాశనం చేసేలా ప్రణాళికలు రూపొందించి పనులు మొదలుపెట్టారు అధికారులు. నిబంధనలు పక్కనబెట్టి.. పురాతన కట్టడాల మరమ్మతు, పునరుద్ధరణకు ప్రత్యేక నిబంధనలున్నాయి. అప్పట్లో పెద్ద రాళ్లు, ఇటుకలు, డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, గుడ్డు సొన, రాతిపొడి మిశ్రమంతో నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి వాటికి మరమ్మతును ఆ మిశ్రమంతోనే పూర్తి చేయాలి. చార్మి నార్, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం సహా ఏ చిన్న నిర్మాణాలైనా ఇదే నిబంధన. కట్టడం నిర్మాణ విశిష్టత దెబ్బతినకుండా, పురావస్తు శాఖ నిపుణుల పర్యవేక్షణలోనే పనులు జరగాలి. కానీ ఇక్కడ పూర్తి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. ఆలయాన్ని అప్పగించాలని ఏఎస్ఐ కోరుతున్నందున నిధులు దానికి మళ్లించి పనులు చేయించాలని చరిత్రకారులు కోరుతున్నారు. ఆలయ గోపురాన్ని 15.2 అడుగుల ఎత్తు భారీ రాయితో, ఆ పైన 30 అడుగుల ఎత్తు పెద్దపెద్ద ఇటుకలతో నిర్మించారు. కొంతభాగం తప్ప మిగతా ఇటుక నిర్మాణం ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఇప్పుడు ఆ రాతి నిర్మాణం వరకు ఉంచి, పైన ఉన్న ఇటుక నిర్మాణాన్ని తొలగించబోతున్నారు. కానీ నాటి ఇటుక నిర్మాణాన్ని ధ్వంసం చేయకుండా దెబ్బతిన్న భాగాన్ని ఆ నమూనా ఇటుకలు రూపొందించి అప్పట్లో వాడిన మిశ్రమంతో మరమ్మతు చేయాలి. ఏం చేస్తున్నారు? దేవాలయానికి నాలుగు వైపులా 25 అడుగుల వెడల్పుతో ప్రాకార మండపాలు నిర్మించనున్నారు. అయితే నాటి ఆలయ భాగం మూసుకుపోయేలా, దాన్ని ఆనుకుని కొత్త నిర్మాణం చేపట్టరాదు. ఇప్పటి నిర్మాణాలు సిమెంటుతో చేపడతారు కాబట్టి ఆలయ ప్రత్యేకత కోల్పోయే అవకాశం ఉంది. ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించనున్నారు. ఇందుకు జిల్లా నిధులు రూ.13 లక్షలు ఖర్చు చేయనున్నారు. అయితే ఆలయానికి సంబంధించి రెండున్నర ఎకరాల భూమి వరకు గోడ నిర్మించాల్సి ఉండగా, దాన్ని తగ్గించి ఆలయానికి చేరువగా నిర్మించాలని యోచిస్తున్నారు. దేవాలయానికి చేరువగా భారీ కమ్యూనిటీ హాలు కూడా నిర్మించనున్నారు. ఇందుకు సింగరేణి సంస్థ రూ.75 లక్షలు వెచ్చించనుంది. మండపం ఫ్లోరింగుపై పూర్తిగా టైల్స్ అమర్చనున్నారు. ఇందుకోసం బ్లాస్టింగ్ చేస్తూ రాయిని పగులగొడుతున్నారు. కానీ ఇక్కడే ఈ ఆలయ ప్రత్యేకత ఉంది. చుట్టూ విస్తరించిన భారీ అఖండ రాయిపైనే ఆలయం నిర్మించారు. మధ్యలో నాలుగున్నర అడుగుల ఎత్తుతో ఆ గుట్ట రాతి భాగాన్నే విగ్రహాలుగా మలిచారు. ఆలయం చుట్టూ ఉన్న రాయిని తొలగించి టైల్స్ వేస్తే ఆలయం అసలు ప్రత్యేకత నాశనం అయ్యే అవకాశం ఉంది. బ్లాస్టింగ్ వల్ల ఆలయ ఉనికికి ప్రమాదం పొంచి ఉంది. ఈ మరమ్మతులకు దేవాదాయ శాఖ రూ.2 కోట్లు వెచ్చిస్తోంది. -
‘మాన్యం మాయం’పై ప్రభుత్వం ఆరా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో దేవాదాయ భూముల స్వాహా, రికార్డుల గల్లంతు విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. భూముల స్వాహా వెనక జరిగిన తతంగాన్ని ఆరా తీసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం కొందరు రాజకీయ నేతలు దేవాలయ భూములు స్వాహా చేసిన విషయంపై లోకాయుక్త ఆదేశంతో దేవాదాయ శాఖ పాత ఫైళ్లను వెతికి పట్టుకుని వాటిని తర్జుమా చేయిస్తున్న తీరుపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నివేదిక కోరినట్టు తెలిసింది. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రెండు రోజుల్లో ఆ శాఖ కమిషనర్‌తో భేటీ అయి ఈ మొత్తం వ్యవహారంపై చర్చించనున్నారు. జిల్లా పర్యటనలో ఉన్న తాను హైదరాబాద్‌కు రాగానే కమిషనర్‌తో చర్చిస్తానని, నిజాం కాలం నాటి రికార్డుల్లో అందుబాటులో ఉన్న పత్రాల తర్జుమా వ్యవహారాన్ని పర్యవేక్షిస్తానని ఇంద్రకరణ్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి దారుణాలు చోటుచేసుకున్నాయని, వీటిని సరిదిద్దుతామని వెల్లడించారు. అందుబాటులో ఉన్న దేవాలయ భూములను వెంటనే గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. వాటిని గుర్తించి దేవాలయాల వారీగా పాస్ పుస్తకాలను జారీ చేస్తామని, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారని వెల్లడించారు. కబ్జా అయిన భూములను గుర్తించి వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తామని పేర్కొన్నారు. -
టీటీడీలో మేం ఉద్యోగం చేయకూడదనడం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: తిరుమల, తిరుపతి దేవస్థానాలతో పాటు, ఆ దేవస్థానాల ఆర్థిక సాయంతో నడిచే ఏ దేవాలయాలు, ఇతర సంస్థల్లోనూ హిందూయేతరులను ఏ పోస్టుల్లో కూడా నియమించడానికి వీల్లేదంటున్న టీటీడీ ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో రూల్ 9(4)ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రూల్ ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు, ఈ రూల్ కింద హిందూ యేతరులమైన తమకు టీటీడీ జారీ చేసిన షోకాజ్ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ టీటీడీ పరిధిలో వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న 36 మంది క్రిస్టియన్, ముస్లిం ఉద్యోగులు పిటిషన్‌ను వేశారు. ఇందులో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ప్రభుత్వంపై ఆధారపడి టీటీడీ పనిచేయడం లేదని, ఆ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందని పిటిషనర్లు తెలిపారు. -
బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు!
-
దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు!
సాక్షి, విజయవాడ/తాడేపల్లిగూడెం: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కీలక వ్యక్తికి మేలు జరిగేందుకు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు గత నెల 26న దుర్గగుడిలో ఆ పూజలు చేశారని ఇంద్రకీలాద్రిపై ప్రచారం జరుగుతోంది. అర్ధరాత్రి అమ్మవారిని మహిషాసురమర్దనిగా అలంకరించి మరీ పూజలు నిర్వహించారని సమాచారం. నిబంధనల ప్రకారం గర్భగుడి లోకి దేవస్థానం అర్చకులు తప్ప బయట వ్యక్తులు ప్రవేశించడానికి వీలులేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా పూజ లు జరిగిన రోజు రాత్రి 11 గంటలకు ఆల యానికి సంబంధం లేని వ్యక్తి ఎర్రని దుస్తులు ధరించి అంతరాలయంలో తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయట పడటం సంచలనం సృష్టిస్తోంది. అరగంట సేపు పూజలు.. దేవస్థానంలో రాత్రి 9.30 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతి స్తారు. ఆ తరువాత ఆలయాన్ని శుభ్రం చేసి 10 గంటలకు మూసి వేస్తారు. తిరిగి తెల్లవారుజామున 2.45 గంటలకు అమ్మవారికి అర్చన చేసిన తరువాత 4 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి ఆలయాన్ని మూసివేసేవరకు ఆలయ ఇన్స్పెక్టర్, సూపరింటెం డెంట్, ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అయితే తాంత్రిక పూజలు జరిగిన రోజు రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దేవస్థానం ప్రధాన అర్చకుడు బదరీనాథ్ బాబు అమ్మవారిని మహిషాసురమర్దనిగా అలంకరించగా, బయట నుంచి వచ్చిన ఓ అర్చకుడు సుమారు అరగంట సేపు తాంత్రిక పూజలు నిర్వహించాడని తెలుస్తోంది. ఈ పూజలు అనంతరం తిరిగి అమ్మవారిని సాధారణ అలంకారంలోకి మార్చి 11.30 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. అదే రోజు మహిషాసురమర్దని దేవికి నివేదన పెట్టేందుకు ప్రత్యేకంగా కదంబం తయారు చేయించారని సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే! రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తికి మేలు జరిగేలా పూజలు చేయాలంటూ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆదేశం మేరకే బయట అర్చకుడితో తాంత్రిక పూజలు చేయించారని ఇంద్రకీలాద్రిపై ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకపోతే బయటి అర్చకుడు అర్ధరాత్రి వేళ అమ్మవారి గర్భగుడిలోకి వెళ్తుంటే అక్కడి ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆలయ అధికారులు చూస్తూ ఊరుకుంటారా? అని ఇంద్రకీలాద్రి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే తాంత్రిక పూజల విషయంపై గతనెల 30న జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు చర్చించినా.. తరువాత అంతా మౌనందాల్చారని తెలిసింది. శుభ్రం చేసేందుకే..: ఈవో డిసెంబర్ 26వ తేదీ రాత్రి 10 గంటలకు దర్శనాలు పూర్తయిన తరువాత ఆలయాన్ని శుద్ధి చేసేందుకే 11.30 గంటల వరకు తెరిచి ఉంచామని, తాంత్రిక పూజలు ఏమీ జరగ లేదని ఈఓ సూర్యకుమారి మంగళవారం చెప్పారు. అయితే పూజల సమాచారం తెలిసిన వెంటనే బదరీనా«థ్ బాబును ప్రధాన ఆలయం నుంచి తప్పించి, కొండదిగువున ఉన్న కామధేను అమ్మవారి ఆలయానికి మార్చా మని తెలిపారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిని కూడా విచారిస్తున్నామని తెలిపారు. కాగా, పార్థసారథిని మంగళవారం విజయవాడ వన్‌టౌన్ సీఐ కాశీవిశ్వనాథ్ విచారించారు. దర్యాప్తు అనంతరం చర్యలు: మంత్రి మాణిక్యాలరావు విజయవాడ కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు! -
యథావిధిగానే శ్రీవారి కైంకర్యాలు
సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో నూతన సంవత్సరం 2018, జనవరి ఒకటోతేదీ సందర్భంగా శ్రీవారి పూజా కైంకర్యాలు, ఆలయ అలంకరణల్లో యథావిధిగానే నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించరాదని దేవాదాయశాఖ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రాలకు అతీతంగా కొత్త సంవత్సరం తొలిరోజున వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుంటారు. ఈసారి కూడా అదే తరహాలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంగ్ల సంవత్సరం వేడుకలు అనే రీతిలో కాకుండా తరలివచ్చే శ్రీవారి భక్తులు, వారికి ఆలయ శోభ ఉట్టిపడేలా అలంకారాలు మాత్రం సాగించనున్నారు. సోమవారం వేకువజామున తొలుత ధనుర్మాసం తిరుప్పావై పారాయణం, ఇతర పూజలు చేస్తారు. కాగా వైకుంఠ ద్వాదశి పర్వదినం సందర్భంగా శనివారం శ్రీవారి చక్రస్నానం శాస్రోక్తంగా నిర్వహించారు. -
దేవాదాయశాఖలో అవినీతి ఆజాదు
-
‘అధర్మా’దాయం!
సాక్షి, అమరావతి: ‘అధర్మా’దా యం కూడబెట్టారన్న అభియోగంపై దేవాదాయశాఖ రాజ మహేంద్రవరం రీజనల్ జాయిం ట్ కమిషనర్(ఆర్జేసీ) శీలం సూర్యచంద్రశేఖర్ ఆజాద్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. తెలుగు రాష్ట్రాల్లోని ఆయన నివాసాలతోపాటు బంధువులు, బినామీ లకు చెందిన ఆస్తులపై 18 చోట్ల ఏసీబీ 21 బృందా లతో ఆకస్మిక సోదాలు జరిపింది. హైదరాబాద్, విజయవాడ, నూజివీడు, ఏలూరు, రాజమండ్రి, అనంతపురం తదితర ప్రాంతాల్లో సోదాలు జరిపి బ్యాంక్ పాస్ పుస్తకాలు, రికార్డులు, ఇతర డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆజాద్‌కు రూ.50 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించామని ఏసీబీ ఏలూరు డీఎస్పీ వాసంశెట్టి గోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. ఆజాద్‌ను మంగళవారం రాత్రి ఏలూరులోని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా 2000లో బాధ్యతలు చేపట్టిన ఆజాద్ శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయం, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం, శ్రీశైలం ఆలయాల్లో పనిచేశారు. ఆజాద్ పేరిట విజయవాడ గుణదలలో రూ.2 కోట్ల విలువైన భవనంతోపాటు హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారంలో న్యూటన్స్ రమ్య అపార్టుమెంట్లో ప్లాట్, భార్య పేరుతో దిల్‌సుఖ్‌నగర్‌లో ప్లాట్ ఉన్నాయి. ఆజాద్ ఇంట్లో రూ.12 లక్షల విలువైన బంగారు, వెండి సామగ్రిని గుర్తించారు. రూ. 18 కోట్లతో సోలార్ పవర్‌ప్లాంట్ ఆజాద్ తన కుటుంబ సభ్యుల పేరుతో అనంతపురం జిల్లా ఊబిచర్లలో 32.1 ఎకరాల్లో ఆబేధ్య సోలార్ పవర్ ప్లాంట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆజాద్ రూ.18 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు చెబుతున్నారు. ఆజాద్ సోదరుడు వివేకానంద వద్ద డ్రైవర్‌గా పనిచేసే సాంబశివరావు, ప్లాంట్‌లో పనిచేస్తున్న లక్ష్మణరావు, రంగమ్మల పేరుతో రైతుల నుంచి 36.63 ఎకరాలను కొనుగోలు చేసి తర్వాత వివేకానంద పేరుపై బదిలీ చేయించుకున్నారు. ఆ భూముల్లోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అలాగే ఆజాద్ విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆజాద్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు. దాడుల్లో రాజమహేంద్రవరం ఏసీబీ సీఐ సూర్య మోహనరావు, ఏసీబీ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రూ. 50 కోట్ల సంతర్పణ!
సాక్షి, హైదరాబాద్: దేవాదాయశాఖలో అడ్డదారిలో చేరిన సిబ్బంది వల్ల ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే పడుతున్న చిల్లుకు మరింత గండి పడనుంది. దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు సర్కారు వేతన సవరణ ప్రారంభించిన నేపథ్యంలో అక్రమ ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం చూసి ఉన్నతాధికారులే కంగు తినాల్సి వచ్చింది. వేతన సవరణ కోసం ఒక్కో ఉద్యోగి వివరాలు సేకరించిన సమయంలో... నియామకాలపై నిషేధం ఉన్నప్పుడు చేరిన వారి సంఖ్య దాదాపు 1,500 వరకు ఉందని తేలింది. ఇప్పుడు వేతన సవరణకు అర్హులుగా గుర్తించిన 5,260 మందిలో అక్రమ సిబ్బంది కూడా ఉండటం, వారి సగటు వేతనం రూ. 30 వేలుగా ఉండటంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా సుమారు రూ. 50 కోట్ల మేర భారం పడుతుందని స్పష్టమవుతోంది. నాటి కమిషనర్ కక్కుర్తి వల్లే... 2006కు ముందు పని చేసిన ఓ కమిషనర్ కక్కుర్తి ఇప్పుడు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. కొందరు అధికారులతో కలసి ఆలయ భూములను అన్యాక్రాంతం చేయడం ద్వారా రూ. కోట్లు దండుకున్న ఆ అధికారి అది చాలదన్నట్టు దేవాలయాల్లో వందలాది మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించాడు. ఇందుకోసం ఒక్కొక్కరి వద్ద నుంచి భారీగా వసూలు చేశాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో స్పందించిన ప్రభుత్వం...ఆ అధికారిపై వేటు వేసి అక్రమ సిబ్బందిని తొలిగించింది. అలాగే అక్రమంగా సిబ్బందిని నియమించకుండా నిషేధం విధించింది. ఎక్కడైనా అవసరమైతే ప్రత్యేక అనుమతి తీసుకుని నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. అయితే దేవాలయ పాలకమండళ్లు, కొందరు అధికారులు చాలా చోట్ల అనుమతుల అవసరం లేకుండానే వందల మందిని అక్రమంగా నియమించి సొమ్ము చేసుకున్నారు. వేతన సవరణ నేపథ్యంలో ఈ భారీ అక్రమం వెలుగుచూసింది. దీంతో అక్రమ సిబ్బందిని తొలగించాలని కొందరు అధికారులు పేర్కొంటుండగా కొందరు నేతలు మాత్రం వారికి అడ్డుపడుతున్నారు. అక్రమ సిబ్బందిని కొనసాగించేందుకు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. సగం అక్రమ సిబ్బందికే... దేవాదాయశాఖలోని ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగతా వారిని దేవాలయ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వారు ఏ ఆలయంలో పనిచేస్తే ఆ ఆలయం నుంచే వేతనాలు పొందాల్సి ఉంటుంది. ఆయా ఆలయాల ఆదాయంలో 30 శాతం మొత్తాన్ని ఉద్యోగుల వేతనాలకు కేటాయిస్తారు. తాజా వేతన సవరణతో ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఉద్యోగులు పొందుతున్న వేతనాలను ఇకపై కూడా ఆయా ఆలయాలే చెల్లించనుండగా వేతన సవరణతో పెరిగే మొత్తాన్ని ప్రభుత్వ గ్రాంటు నుంచి చెల్లిస్తా రు. 5,260 మంది ఉద్యోగులు, అర్చకులకు సంబంధించి ప్రభుత్వం సాలీనా ఇవ్వనున్న రూ. 115 కోట్ల గ్రాంటులో సగం ఈ అక్రమ ఉద్యోగుల జేబుల్లోకి వెళ్లనుంది. -
అర్చకుల వేతన సవరణలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణ వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రభుత్వం ముందు ప్రకటించినట్టుగా కాకుండా అమలు వేరే రకంగా ఉందంటూ అర్చక, ఉద్యోగులు శుక్రవారం రాత్రి వరకు దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మధ్యాహ్నం అదే కార్యాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలను సన్మానించిన ఆ ప్రతినిధులు.. తర్వాత వాస్తవం తెలిసి అదే కార్యాలయం ముందు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మేలు చేసేలా వ్యవహరిస్తే, అధికారులు మాత్రం ఆయన హామీకి విరుద్ధంగా తమకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన ప్రారంభించారు. అధికారులకే అస్పష్టత...! దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన సవరణకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీర్ఘకాలంగా దేవాలయ అర్చక, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడంతో ముఖ్యమంత్రి స్పందించారు. ఈ మేరకు చట్టసవరణ జరిగి డిసెంబర్ 1 నుంచే కొత్త వేతనాలను చెల్లించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఇంతకాలం ఏ ఆలయంలో ఉద్యోగులు, అర్చకులకు ఆ ఆలయ ఆదాయం నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు. అలా కాకుండా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి నేరుగా ప్రభుత్వమే ఉద్యోగులు, అర్చకుల బ్యాంకు ఖాతాలకు ఒకటో తేదీనే జమ చేసేలా, పీఆర్సీ అమలు చేసేలా నిర్ణయం ఉందని అంతా భావించారు. శుక్రవారం మధ్యాహ్నం చెక్కు అందజేసే కార్యక్రమానికి రావాల్సిందిగా పేర్కొనటంతో 88 మంది ప్రతినిధులు కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలు ఆంధ్రాబ్యాంకు ప్రతినిధులకు చెక్కు అందజేశారు. వెంటనే ఉద్యోగులు, అర్చక ýప్రతినిధులు ఆ ఇద్దరిని సన్మానించి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. వారు వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసి ఆగ్రహానికి గురయ్యారు. చాలా వివరాలకు అధికారుల వద్దనే స్పష్టత లేదని, అంతా గందరగోళం చేసి తమను వంచించారని వారు ఆరోపించారు చారిత్రక దినం.. దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ మేరకు ఆలయ ఉద్యోగులు, అర్చకులకు వేతన సవరణ అమలు చేస్తున్నందున డిసెంబరు ఒకటి చారిత్రక దినంగా నిలిచిపోతుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అంతకుముందు వ్యాఖ్యానించారు. సీఎం తీసుకున్న సానుకూల నిర్ణయం అర్చక, ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపుతుందని రమణాచారి పేర్కొన్నారు. ఈ సవరణ మహోన్నత నిర్ణయమని తెలంగాణ అర్చక సమాఖ్య నేతలు ఉపేంద్రశర్మ, రామశర్మలు పేర్కొన్నారు. రెండు వేల మందికే వర్తింపు ఇప్పటి వరకు ఆలయాల నుంచి తీసుకుంటున్న వేతనాలను ఆలయాల నుంచే తీసుకోవాలని, సవరణతో పెరిగే మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేస్తుందని అధికారులు పేర్కొనడంతో కంగుతినడం అర్చకుల వంతయింది. ఇక వేతన సవరణ అమలు కావాల్సిన 5,200 మందిలో కేవలం 2 వేల మందికే ప్రస్తుతం వర్తింపజేస్తున్నారని, మిగతావారి విషయంలో సాంకేతిక కారణాలతో తర్వాత పరిశీలిస్తామని అధికారులు చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. ఇక 2015 పీఆర్సీ పరిధిలో ఉన్నవారి సవరణ అంశాన్నీ పక్కన పెట్టారు. మళ్లీ దేవాలయాల నుంచి వేతనాలు పొందే విషయంలో స్థానిక కార్యనిర్వహణాధికారులు, పాలక మండళ్లతో వేధింపులు ఎదురవుతున్నాయని మొత్తుకుంటే ఇప్పుడు మళ్లీ వారి నుంచే వేతనాలు పొందాలని మెలిక పెట్టడం వెనక అధికారుల కుట్ర ఉందని అర్చక, ఉద్యోగ ప్రతినిధులు ఆరోపిస్తూ వెంటనే కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా ప్రారంభించారు. సీఎం సానుకూలంగా స్పందిస్తే అధికారులు కుట్ర చేసి ఆయన ఆలోచనను నీరుగార్చారని పేర్కొంటూ జేఏసీ నేత గంగు భానుమూర్తి ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. చివరకు అదనపు కమిషనర్లు శ్రీనివాసరావు, కృష్ణవేణి సోమవారం కమిషనర్‌తో చర్చించవచ్చని పేర్కొనటంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. -
‘ధూప దీపానికి’ మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక పరిపుష్టి లేని ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద ప్రతినెలా ఆర్థిక చేయూత అందిస్తున్న దేవాదాయ శాఖ కొత్తగా మరో 3 వేల దేవాలయాలకు దాన్ని వర్తింపచేసే క్రమంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. - దేవాదాయ చట్టం పరిధిలోని చారిటబుల్ ట్రస్టు లేదా హిందూ ధార్మిక సంస్థ జాబితాలో ఆ దేవాలయం రిజిస్టరై ఉండాలి. - కనీసం 15 సంవత్సరాల క్రితం నిర్మితమై ఉండాలి, పురాతన దేవాలయం అయితే ప్రాధాన్యం ఇస్తారు. - గ్రామం/పురపాలక సంఘం పరిధిలో మాత్రమే ఉండాలి, నగర పాలక సంస్థ పరిధిలో ఉంటే పరిగణనలోకి తీసుకోరు. - దేవాలయం పరిధిలో రెండున్నర ఎకరాలకు మించి తరి పొలం ఉండరాదు, 5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. - వార్షికాదాయం 50 వేల లోపే ఉండాలి. జాతరలు సాగే గ్రామ దేవతల ఆలయాలకు ఈ పథకం వర్తించదు. - దరఖాస్తులను సంబంధిత జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం నుంచి స్వీకరిస్తారు. - జాయింట్ కలెక్టర్, సహాయ కమిషనర్, అర్చక సమాఖ్య నియమించిన ఇద్దరు ప్రతినిధులు, ముఖ్య దేవాలయాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఆలయాన్ని తనిఖీ చేసి తప్పనిసరిగా సిఫారసు చేయాల్సి ఉంటుంది. -
ఆలయాల్లో అద్దెలు స్వాహా!
సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్ నగరంలో శంకరమఠం పేరుతో నిర్వహిస్తున్న ఆధ్మాత్మిక కేంద్రం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ మఠం కింద 55 దుకాణాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఒక్కో దుకాణానికి రూ.10 వేల వరకు నెలవారీ అద్దె ఉంది. వెరసి మఠానికి ఏటా రూ.60 లక్షలకుపైగా అద్దె వసూలుకావాలి. కానీ దేవాదాయశాఖ ఖజానాకు చిల్లిగవ్వ కూడా జమకావడం లేదు. ఆ సొమ్మంతా ప్రైవేటు వ్యక్తులు, కొందరు అధికారులు కలసి స్వాహా చేసేస్తున్నారు. ఓ మంత్రి పేరు చెప్పి కొందరు స్థానిక నేతలు, అధికారులు ఈ అద్దె సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయశాఖ ఇప్పటివరకు నామమాత్రంగా 20 వరకు నోటీసులు జారీ చేసింది. కానీ నయాపైసా కూడా జమ చేయించలేకపోయింది. నగరంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న చాలా దేవాలయాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. ఈ అద్దెల సొమ్ము ఎటుపోతోందో శాఖ కమిషనర్‌కు కూడా తెలియని పరిస్థితి నెలకొనడం గమనార్హం. లెక్కలే లేవు.. అసలు దేవాదాయశాఖకు ఎన్ని దుకాణాలున్నాయి, వాటిలో ఎన్నింటిని లీజుకిచ్చారు, ఎన్నింటిని నేరుగా అద్దెకిచ్చారు, వాటి రూపంలో దేవాదాయశాఖ ఖజానాకు రావాల్సిన మొత్తం ఎంత.. అనే లెక్కలేవీ దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో నమోదై లేవు. వెరసి ఏటా దేవుడి ఖజానాకు రావాల్సిన రూ.కోట్ల మొత్తం అధికారులు, కొందరు నేతల జేబుల్లోకి చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈ తంతును గుర్తించి నోరెళ్లబెట్టారు. వెంటనే దుకాణాల అద్దె, లీజులకు సంబంధించి పూర్తి లెక్కలు సమర్పించాలని ఆదేశించారు. కానీ నెలన్నర గడిచినా ఇప్పటివరకు అధికారులు లెక్కలు సిద్ధం చేయలేదు. కోట్ల కొద్దీ స్వాహా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అధీనంలో పెద్ద ఎత్తున భూములు, భవనాలు ఉన్నాయి. గ్రామాల్లో ఎకరాల కొద్దీ భూములు ఉండగా... పట్టణాలు, నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆలయాల పరిధిలో ఖాళీ భూములతోపాటు దుకాణాలు ఉన్నాయి. పలుచోట్ల ఈ భూములు, దుకాణాలను లీజులకు ఇవ్వగా.. మరికొన్ని చోట్ల నెలవారీగా అద్దెకిచ్చి ప్రతినెలా అద్దె సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇలా వందల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి. వాటి అద్దె రూపంలో ఏటా రూ.కోట్లు వసూలవుతాయి. ఆ సొమ్మును కాజేసేందుకు అలవాటు పడ్డ అధికారులు.. అసలు వాటికి లెక్కలే లేకుండా చేశారు. కొన్నేళ్లుగా దేవాదాయ శాఖకు పూర్తిస్థాయి కమిషనర్ లేక ఇన్చార్జి అధికారి పర్యవేక్షణలో కొనసాగుతోంది. దాంతో లెక్కలు అడిగే వారు లేకపోవటం, ప్రభుత్వం దేవాదాయ శాఖను నిర్లక్ష్యం చేయటంతో.. అధికారులు అద్దెల సొమ్మును స్వాహా చేయడం ప్రారంభించారు. దేవాలయాలు, దేవాదాయశాఖ అధీనంలో ఉన్న మఠాలకు నగరంలో వందల సంఖ్యలో దుకాణాలున్నా.. వాటి అద్దెలు, లీజుల రూపంలో ఎంతమొత్తం వసూలవుతోందో తెలియని గందరగోళం ఉంది. కొన్ని దేవాలయాల్లో అవకతవకల తీరిదీ.. - సికింద్రాబాద్‌లో బోనాల సందర్భంగా భారీ జాతర సాగే అమ్మవారి దేవాలయం దుకా ణాల్లో భారీ గోల్మాల్ జరుగుతోంది. వాణి జ్యపరంగా మంచి కేంద్రం కావడంతో దుకా ణాల అద్దె భారీగా ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా ఆ అద్దెల వివరాలను రికార్డుల్లో నమోదు చేయటం లేదు. వాటి కాగితాలూ మాయమయ్యాయి. - జూబ్లీహిల్స్‌లోని మరో అమ్మవారి దేవాలయా నికి చెందిన దుకాణాల వివరాలెక్కడా పొందుపరచలేదు. అక్కడ ఎంతమొత్తం వసూలవుతుందో తెలియని పరిస్థితి. - అమీర్‌పేటలో మంచి సెంటర్లో ఉన్న అమ్మవారి ఆలయానికి సంబంధించి రికార్డుల్లో ‘ప్రైవేట్ నెగోషియేషన్’అని మాత్రమే రాశారు. ఎవరి అధీనంలో దుకాణాలున్నాయో వివరాల్లేవు. - రెజిమెంటల్ బజార్‌లోని ఓ శివాలయం దుకాణాల అద్దెలకు సంబంధించి కొన్నేళ్లుగా లెక్కలు రాయడం లేదు. - సికింద్రాబాద్‌లో ఉన్న ఓ ధర్మశాల, షేక్‌పేట ద్వారకానగర్‌లోని మరో దేవాలయం, అమీర్‌పేట, భోలక్‌పూర్, పాన్‌బజార్, ముషీరాబాద్, ఎల్లారెడ్డిగూడల్లోని ఐదు దేవాలయాల పరిధిలోని దుకాణాలను అనధికారికంగా అద్దెకిచ్చి ఆ మొత్తాన్ని ఖజానాకు జమకట్టడం లేదు. - లాలాగూడలోని ఓ దేవాలయం దుకాణాలను 25 ఏళ్లపాటు లీజుకిచ్చినట్టు రికార్డుల్లో రాసి ఉంది. కానీ లీజు ఎప్పటితో పూర్తవుతుందనే వివరాలను మాత్రం గల్లంతు చేశారు. లీజు మొత్తం ఎంతో కూడా లేకపోవడం గమనార్హం. - కవాడిగూడలోని ఓ ఆలయం దుకాణాల లీజు 2012లో పూర్తయినట్టు రికార్డుల్లో చూపారు. తర్వాత ఆ దుకాణాలు ఎవరి అధీనంలో ఉన్నాయి. వాటి అద్దె ఎంత, లీజుకిచ్చారా లేదా అన్న వివరాలు పొందుపరచలేదు. ఆ మేరకు సొమ్మును పక్కదారి పట్టించేస్తున్నారు. -
వృద్ధ అర్చకుల ‘సవరణ’ వెతలు
కూకట్‌పల్లికి చెందిన రామశాస్త్రి స్థానిక దేవాలయంలో 20 ఏళ్లుగా అర్చకుడిగా పని చేస్తున్నారు.. ఇప్పుడు ఆయన వయసు 68 సంవత్సరాలు. ఇంతకాలం అడ్డురాని వయసు.. ఇప్పుడు ఆయన ఉపాధికే ఎసరు పెట్టింది. పదవీ విరమణ వయసు దాటినందున అర్చకుడిగా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పేదరికంలో మగ్గుతున్న ఆయనకు ఆదుకునే అండ లేకపోవడంతో ఆ కుటుంబం ఆందోళనలో పడింది. – సాక్షి, హైదరాబాద్ ఇలా ఒక్క రామశాస్త్రికే కాదు.. రాష్ట్రంలోని వందల మంది అర్చకులకు ఉన్నట్టుండి ఇబ్బంది వచ్చిపడింది. దేవాలయ అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతన సవరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో కసరత్తు మొదలెట్టిన అధికారులు అర్చకుల పదవీ విరమణ వయసుపై దృష్టి సారించారు. విరమణ వయసు దాటి అర్చకులుగా కొనసాగుతున్నవారి విషయంలో నిర్ణయం తీసుకునే దిశగా యోచిస్తున్నారు. వారి తొలగింపు విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అర్చకులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయిస్తే వందల మంది పేద అర్చకుల కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పెద్ద ఆలయాల్లోనే.. అర్చకుల పదవీ విరమణ వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలు. దేవాదాయ శాఖ పర్య వేక్షణలోని పెద్ద దేవాలయాల్లోనే ఈ ని బంధన అమలవుతోంది. చిన్న దేవాలయాల్లో నిబంధనను పట్టించుకోకపోవడంతో చాలా దేవాలయాల్లో వయసుతో నిమిత్తం లేకుండా అర్చకులు పని చేస్తున్నారు. పాలక మండళ్లు నియమించినవారు కావటంతో వారి వయసు నూ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో పేదరికంలో మగ్గుతున్న వృద్ధులు అర్చకత్వాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచే వేతనాలు.. అర్చకులకు ప్రభుత్వం నుంచే నేరుగా వేతనాలు అందేలా వేతన సవరణకు ప్రభుత్వం ఇటీవల అంగీకరించింది. దేవాలయాల నుంచి వేతనాలకు కేటాయించే 30 శాతం నిధులు, లోటు ఏర్పడితే ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఇచ్చే నిధులనుంచి వేతనాలు చెల్లించనున్నారు. ఈ క్రమంలో ఒక్కో అర్చకుడి వివరాలు సేకరిస్తున్న అధికారులకు వయసు నిబంధన ఎదురైంది. ఇంతకాలం పట్టించుకో కుండా సాగినా, వేతన సవరణ జరుపుతున్నందున నిబంధన అమలు చేయకుంటే ఎలా అన్న సందేహం తలెత్తింది. అయితే 60 ఏళ్లు దాటిన అర్చకులు వందల సంఖ్యలో ఉండ టంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. 60 ఏళ్లు దాటిన అర్చకుల్లో ఎక్కువ మంది పేదలే కావటం, వారిలో చాలామందికి మరో అండ లేకపోవటంతో.. ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పాపం.. పాలక మండళ్లదే దేవాదాయ శాఖ ఆలయ నియామకాల్లో పాలక మండళ్లదే ప్రధాన పాత్ర. ఖాళీలు, అర్హతలతో సంబంధం లేకుండా డబ్బు వసూలు చేసి నియామకాలు జరిపిన దాఖలాలు కోకొల్లలు. కానీ దీన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. నియామకాలపై నిషేధం ఉన్నా, పాత తేదీలతో పోస్టింగులు ఇవ్వడం.. పాలక మండళ్ల గడువు తీరినా, పాత తేదీలతో పైరవీ చేసి పోస్టింగులు ఇప్పించడం పరిపాటిగా మారింది. మరోవైపు చిన్న దేవాలయాల్లో వయో నిబంధన అటకెక్కింది. ఇంతకాలం నామమాత్రంగా కూడా పట్టించుకోని దేవాదాయ శాఖ.. ఇప్పుడు వారిని ఉన్నట్టుండి తొలగించే దిశగా యోచిస్తుండటం వివాదాస్పదమవుతోంది. -
దేవాదాయ శాఖలో ఔట్సోర్సింగ్ బాగోతం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవటం సాధారణం. వారి వేతన మొత్తాన్ని సిబ్బందిని సరఫరా చేసిన ఏజెన్సీకి ప్రతినెలా ప్రభుత్వం చెల్లిస్తుంది. తన కమీషన్ మినహాయించుకుని సిబ్బందికి ఆ సంస్థ వేతనాలు చెల్లిస్తుంది. అయితే అర్చకులను సరఫరా చేసే సంస్థ అంటూ ఇప్పటివరకు లేదు.. కానీ పలు దేవాలయాలకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో అర్చకులను సరఫరా చేసినట్లు నియామకాలు జరిపేశారు. అసలు అర్చకులను సరఫరా చేసే ఏజెన్సీలే లేనప్పుడు దేవాదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ అర్చకులు ఎలా వచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి... అక్రమంగా నియమించిన అర్చకుల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతన సవరణ కోసం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దేవాదాయ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇక్కడే అసలు బాగోతం బట్టబయలైంది. దీంతో ఔట్సోర్సింగ్ పేరుతో నియమితులైన అర్చకులకు వేతన సవరణ చేయకుండా ఆపేయాలని ఆ శాఖ కమిషనర్ భావిస్తుండటంతో.. సదరు అర్చకులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. అక్రమాలకు నిదర్శనం.. సాధారణంగా నియామకాలు చేపట్టేప్పుడు అర్హతలను ప్రాతిపదికగా చేసుకుంటారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఇది అమలవుతున్నా, దేవాదాయ శాఖలో మాత్రం అడ్డగోలుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. సొంతంగా దేవాలయ పాలకమండళ్లే అడ్డగోలుగా నియామకాలు జరుపుతుండటంతో అర్హతలను పరిశీలించే పద్ధతే లేకుండా పోయింది. డబ్బులు దండుకుని సిబ్బందిని నియమించటం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఔట్సోర్సింగ్ వ్యవహారం చోటుచేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. కొన్ని దేవాలయాల్లో అర్చకుల అవసరముందని ఆయా ఆలయాల నుంచి ప్రతిపాదనలు పంపారు. దాన్ని పరిశీలించిన అప్పటి అధికారులు అనుమతిచ్చేశారు. ఈక్రమంలో ఔట్ సోర్సింగ్ పేరుతో భారీ సంఖ్యలో అర్చకులను నియమించినట్లు రికార్డుల్లో రాసేశారు. కానీ.. ఏజెన్సీ పేరు, చిరునామా లాంటి వివరాలు ఎక్కడా లేవు. ఆలయ రిజిస్టర్లలో అర్చకుడి పేరు వేతన మొత్తం నమోదు చేశారు. అప్పటి నుంచి వారు అలాగే కొనసాగుతున్నారు. ఇప్పుడు వేతన సవరణ కోసం ఒక్కో అర్చకుడి వివరాలు సేకరిస్తున్న సమయంలో వారు ఔట్ సోర్సింగ్‌గా నియామకమైనట్లు గుర్తించారు. ఇటు అధికారులు, అటు పాలక మండళ్లు ఎడాపెడా డబ్బులు వసూలు చేసి ఈ నియామకాలు చేపట్టినట్టు తెలుస్తోంది. అభ్యంతరాలు రాకుండా తాత్కాలిక పద్ధతిపై నియమిస్తున్నట్లు చెప్పుకొనేందుకు ఔట్సోర్సింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి ఉంటారని, అందరికీ డబ్బులు ముట్టడంతో దీనిపై అప్పట్లో ఎవరూ ప్రశ్నించి ఉండరన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై కొందరు అర్చకులను ప్రశ్నిస్తే.. అసలు ఔట్సోర్సింగ్ సంగతే తమకు తెలియదని, తమను ఆయా నిర్వాహకులు, ఈఓలు నియమించారని పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించే విధానం సాధ్యం కాదని, ఇప్పుడు వేతన సవరణలో వారిని ఎలా పరిగణనలోకి తీసుకుంటామని కమిషనర్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎవరో చేసిన అక్రమాలకు అర్చకులను బలిచేయటం సరికాదని అర్చక సంఘాలు పేర్కొంటున్నాయి. వారిని సాధారణ అర్చకులుగానే భావించి వేతన సవరణ జరపాలని కోరుతున్నాయి. అర్హతలు లేకుండానే.. చాలా దేవాలయాల్లో పూజావిధానం తెలియని వారిని కూడా అర్చకులుగా నియమించారు. సాధారణంగా అర్చకులుగా నియమించాలంటే వేద పండితులై ఉండనప్పటికీ, షోడశోపచార పూజలు చేయటం వచ్చిన వారిని నియమిస్తారు. కానీ ఈ కనీస అర్హతలను కూడా చూడకుండానే నియమించిన దాఖలాలెన్నో. చాలా దేవాలయాల్లో కనీసం గణపతి పూజ కూడా రాని వారిని నియమించేశారు. డబ్బులు ముట్టచెబితే చాలు అర్హతల పరిశీలన కూడా అవసరం లేకుండా గుడ్డిగా నియామకాలు జరిపేశారు. -
‘సదావర్తి’ భూముల వేలం 18కి వాయిదా
సాక్షి, అమరావతి: సదావర్తి సత్రం భూముల అమ్మకానికి గురువారం జరగాల్సిన బహిరంగ వేలం వాయిదా పడింది. సుప్రీంకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈనెల 18న తిరిగి నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ముందుగా అనుకున్న ప్రకారం గురువారం జరగాల్సిన వేలంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం మధ్యాహ్నంతో గడువు ముగియగా.. నిర్ణీత గడువులోగా ఐదు బిడ్లు దాఖలయ్యాయి. తాజాగా వేలంలో పాల్గొనడానికి దరఖాస్తు స్వీకరణకు 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువును పొడిగించారు. అప్పటి వరకు అందిన దరఖాస్తులతో 18 ఉదయం 11 గంటలకు చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో బహిరంగ వేలం జరపాలని అధికారులు నిర్ణయించారు. -
నువ్విస్తానంటే... నేనొద్దంటా!
సాక్షి, అమరావతిబ్యూరో : దాతలు దానం ఇచ్చిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాతలు రూ.కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చినా.. అధికారులు మాత్రం దేవాలయాల పరిధిలోకి తీసుకురావడం లేదు. అధికారుల అలసత్వాన్ని అడ్డుపెట్టుకొని కొందరు అక్రమార్కులు వారసుల పేరుతో విలువైన ఆస్తులను స్వాహా చేస్తున్నారు. వీరికి అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలు అందిస్తున్నారు. ఇదీ ఆస్తుల దానం అసలు కథ... విజయవాడ వన్‌టౌన్ కొత్తపేటకు చెందిన బంకా కామరాజుకు చిట్టినగర్ ప్రాంతంలోని కామరాజు వీధిలో అసెస్మెంట్ నెంబర్ 4145లో 1,200 గజాల భూమి, విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో సర్వే నంబర్ 394/1, 2, 3, 4లలో 2.10 ఎకరాలు, విద్యాధరపురంలో ఆర్ఎస్ నంబర్ 81/1, 81/2ఎ,81/2లలో 6.64 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఆ భూముల విలువ రూ.30 కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఆస్తులను 1970లో తన చిన్న కుమార్తె సీతారామమ్మ తదనానంతరం స్థానిక నగరాల రామాలయానికి చెందేలా వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేశారు. కామరాజుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా, కుమారులు తండ్రిని పట్టించుకోకపోవడంతో చిన్నకుమార్తె సీతారామమ్మ వద్ద ఉండేవారు. అందువల్ల సీతారామమ్మ తదనానంతరం తన ఆస్తులను నగరాల రామాలయానికి చెందేలా వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేశారు. ఎనిమిది నెలల కిందట ఈ రిజిస్టర్డ్ వీలునామా పత్రాలు దేవాదాయ శాఖ కార్యాలయంలో బయపడ్డాయి. ఇదీ ప్రస్తుత పరిస్థితి... కామరాజు దేవాలయానికి ఇచ్చిన ఆస్తులపై కొందరు స్వార్థపరుల కన్నుపడింది. ఆ ఆస్తులకు తాము వారసులమంటూ స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజిస్టర్డ్ వీలునామా ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలతో కలిసి రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ అధికారులతో కుమ్మక్కై రికార్డులనే మార్చేశారు. కొత్తపేటలో ఉన్న విలువైన స్థలాలను దశల వారీగా విక్రయిస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.10 కోట్ల విలువైన స్థలాలను విక్రయించారు. గొల్లపూడి ప్రాంతంలో ఉన్న భూములను సైతం కాజేసేందుకు ప్రయత్నాలు మమ్మురం చేశారు. అయితే, సీతారామమ్మ కుమార్తె న్యాయవాది అయిన రమణి వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. మరోవైపు కొత్తపేటకు చెందిన దుర్గాసి వెంకయ్య మఠానికి చెందిన 800 గజాల స్థలాన్ని కూడా కొందరు ఆక్రమించుకుని విక్రయిస్తున్నారు. దీని వలువ రూ.10 కోట్లు ఉంటుంది. మాకు అధికారాలు ఇవ్వలేదు.. నగరాల రామాలయం దేవాదాయ శాఖలో ఉన్నప్పటికీ పూర్తి అధికారాలు మాత్రం పాలకవర్గమే తీసుకుంది. మా పోస్టు నామమాత్రమే. ఒక్క రికార్డు కూడా మాకు ఇవ్వలేదు. దీంతో మేం ఏం చేయలేము. – సత్యప్రసాద్బాబు, నగరాల రామాలయం ఈఓ నన్ను ముప్పుతిప్పలు పెట్టారు మా తాత కామరాజు ఆస్తులను నగరాల రామాలయానికి చెందేలా వీలునామా వాసి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ విషయం ఇటీవల దేవా దాయ శాఖ అధికారులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నేనే చెప్పాను. రూరల్ ప్రాంతంలో ఉన్న భూములు నా ఆధీనంలో ఉన్నాయి. ఆ భూములను కాజేసేందుకు కొందరు నన్ను ముప్పుతిప్పలు పెట్టారు. నాపై తొమ్మది కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. అయినా ఆ భూములు ఆలయానికి ఇచ్చే వరకు పోరాటం చేస్తా. – రమణి, సీతారామమ్మ కుమార్తె -
టెంపుల్ సిటీగా భద్రాద్రి
యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతాం ► ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి ► ఆగస్టు నాటికి పనులు ప్రారంభించాలి ► అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల సాక్షి, కొత్తగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు. యాదాద్రి తరహాలో భద్రాద్రిని కూడా టెంపుల్ సిటీగా ఏర్పాటు చేసేందుకు టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని తన చాంబర్లో గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాద్రి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నారని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి నమూనా రూపకల్పనకు దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, ఆర్కిటెక్ ఆనందసాయితో చర్చలు జరిపారు. ఆలయ అభివృద్ధి డీపీఆర్‌లను ఆగస్టు వరకు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన అనుమతులను మంజూరు చేయించుకొని, ఆగస్టులోగా టెండర్లు పిలవాలని, వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధి నమూనా విషయంలో చిన్నజీయర్ స్వామి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆర్కిటెక్ ఆనందసాయికి సూచించారు. నూతన నమూనాను రూపొందించి ఇప్పటికే చిన్నజీయర్ స్వామికి చూపించామని, ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశారని, ఆ తర్వాతే డిజైన్ ఫైనల్ చేశామని ఆనందసాయి మంత్రికి వివరించారు. అలయ అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను తుమ్మలకు వివరించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ గోపుర నమూనాలో ఎంటువంటి మార్పులు లేకుండా ఆలయ ప్రాకారం, మాడ వీధులలో మాత్రమే మార్పులు చేర్పులు చేపట్టామని వివరించారు. అలాగే స్వామి వారి కల్యాణ మండపం, బ్రహ్మత్సోవ మండపం, అన్నదాన సత్రాలను మాత్రమే పునఃనిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భక్త రామదాసు మెమోరియల్ ట్రస్ట్ డిజైన్ రూపొందించాలని ఆనందసాయికి సూచించగా, వారం రోజుల్లో డిజైన్ రూపొందిస్తామని ఆర్కిటెక్ చెప్పారు. భక్త రామదాసు మెమోరియల్ ట్రస్ట్‌కు సంబంధించి సీఎం కెసీఆర్ త్వరలోనే ఒక ప్రకటన చేస్తారని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని. ప్రధానమైన యాదాద్రి, వేములవాడ ఆలయాలకు ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సైతం గతంలోనే పలు సూచనలు చేశారని తెలిపారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భద్రాద్రి దేవాలయాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని అదికారులను కోరారు. -
అర్చకులకు ఒకటినే కచ్చితంగా వేతనాలు
-
అర్చకులకు ఒకటినే వేతనాలు
ప్రభుత్వోద్యోగుల తరహాలో వేతన చెల్లింపు విధానం: కేసీఆర్ - అవసరమైతే చట్ట సవరణ.. ఈ సమావేశాల్లోనే బిల్లు - న్యాయ నిపుణులతో చర్చించి ముసాయిదా రూపకల్పన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాల యాల్లో అర్చకులకు ఒకటో తేదీనే కచ్చితంగా వేతనాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన చెల్లింపు విధానాన్ని అమలు చేస్తామని, ఇందుకోసం దేవాదాయ చట్ట సవరణ చేస్తామని తెలిపారు. అవసరమైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతామని తెలిపారు. సమాజంలో గౌరవంగా బతికే రీతిలో వేతనాల చెల్లింపు ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించాలని అర్చకులు, దేవాలయాల ఉద్యోగులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్ల సాధన కోసం దేవాలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సలహాదారు రమణాచారి, కమిషనర్ శివశంకర్‌లతో సుదీర్ఘంగా సమీక్షించారు. అర్చక సంఘాల ప్రతినిధులు గంగు భానుమూర్తి, గంగు ఉపేంద్రశర్మ, దేవాలయ ఉద్యోగుల ప్రతినిధులు రంగారెడ్డి, మోహన్ తదితరులు కూడా భేటీలో పాల్గొన్నారు. ప్రత్యేక నిధి నుంచి... దేవాదాయ శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న 642 ఆలయాలకు సంబంధించి దాదాపు 5,800 మంది అర్చకులు, ఉద్యోగులకు వర్తించేలా కొత్త వేతన చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు చెల్లించాలని అర్చకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కోరారు. కానీ అది సాధ్యమయ్యే అవకాశం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘అర్చకత్వం గౌరవమైన వృత్తి. కానీ వారి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పోటీ సమాజంలో ఇది పెద్ద సమస్యగా మారింది. అర్చకత్వం చేసే యువకులకు పిల్లనివ్వడానికి ముందుకు రాని దుస్థితి రావడం బాధాకరం. ఈ పరిస్థితి మారాలి. వారికీ గౌరవప్రదమైన వేతనాలు అందాలి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఒకటో తారీఖునే చేతిలో పడాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రతి నెలా ఆలయాల నుంచి దేవాదాయశాఖ వసూలు చేసే 12 శాతం మొత్తాన్ని ఒకచోట నిధిగా చేసి.. దాని నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఠంచన్‌గా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని అధికారులకు సూచించారు. ఆ నిధి చాలని పక్షంలో ప్రభుత్వం కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వారి వేతనాలను కూడా క్రమబద్ధీకరించాలని.. అందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సంక్రాంతి నాటికే అర్చకులు, ఆలయ ఉద్యోగులకు కొత్త వేతన విధానం అమల్లోకి రావాలన్నారు. భూముల లెక్కలు తేల్చండి గత ప్రభుత్వాల మితిమీరిన రాజకీయ జోక్యం వద్ద ఆలయాల్లో ఆధ్యాత్మిక భావన భగ్నమైందని, కౌలు పేరుతో దేవాలయ భూములు కబ్జాకు గురయ్యాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆలయ భూముల వివరాలను పక్కాగా సేకరించి అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పాలక వర్గాల్లో ధార్మిక, భక్తి భావాలున్నవారే సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈమేరకు నియమావళి రూపొందించాలని సూచించారు. కాగా రాష్ట్రంలో 11 వేల వరకు ఆలయాలుంటే కేవలం 642 మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన గందరగోళం ఏమిటని సీఎం ప్రశ్నించారు. వేతన క్రమబద్ధీకరణ ఈ 642 ఆలయాలకే వర్తిస్తే మిగతా వారు నష్టపోతారని, అందరికీ లబ్ధి కలిగేలా చూడాలని పేర్కొన్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ.. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కూడా సమావేశమై మూడు నాలుగు రోజుల్లో పూర్తి నివేదికను తనకు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ అంశంపై శాసనసభలో బిల్లు పెడతామన్నారు. బిల్లు ముసాయిదా రూపకల్పన కోసం దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్ ఎస్పీ సింగ్, దేవాదాయ కమిషనర్ శివశంకర్, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, లాసెక్రటరీ సంతోష్‌రెడ్డి, అర్చక–ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భానుమూర్తి, ఉపేంద్రశర్మ, రంగారెడ్డి, మోహన్‌లు అందులో సభ్యులుగా ఉన్నారు. దేవాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రోస్టర్ సమస్యలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కమిటీని సీఎం ఆదేశించారు. -
మల్లన్న సన్నిధిలో.. మహాపచారం!
ఎల్లమ్మగుట్ట మీద జంతు బలులకు సన్నాహాలు - అరిష్టమని చెబుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి - రూ.30 లక్షలతో జంతుబలి, వంటషెడ్ల నిర్మాణం - భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సాక్షి, సిద్దిపేట: మల్లన్న సన్నిధిలో మహా అపచారం జరగబోతోంది. ఎల్లమ్మ తల్లికి మాంసాహార నైవేద్యం సమర్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 500 ఏళ్లుగా పసుపు బండారిని నుదుట దిద్దుకున్న భక్తులు.. ఇకపై అదే నుదుటి మీద నెత్తుటి తిలకం దిద్దుకోవాల్సి వస్తోంది. ఎల్లమ్మ తల్లికి రక్తతర్పణం మహా పాపం అని, ఇంద్రకీలాద్రికి ఎనిమిది దిక్కుల అష్ట భైరవులు క్షేత్ర పాలకులుగా ఉన్నారని, ఇక్కడ జంతు బలి ఇవ్వటం మహా అపచారం, అరిష్టమని వేద పండితులు, ఆలయ అర్చకులు చెబుతున్నా అధికారులు వినిపించుకోవడం లేదు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం లింగ బలిజలు అర్చన చేయగా. ఒగ్గు పూజారులు పట్నం వేసి, మణ్మ య పాత్రతో నివేదనం సమర్పిస్తారు. బెల్లం పొంగలి..పసుపు బువ్వ , టమాట, చిక్కుడుకాయ కూర ఇదే మల్లన్న ఇష్ట నైవేద్యం. మల్లన్నకు తలాపునే ఉన్న ఆయన చెల్లి ఎల్లమ్మ తల్లికి కూడా బెల్లం పొంగలి, పసుపు బువ్వే నైవేద్యంగా చెల్లిస్తారు. ఇది తరతరాల ఆచా రం. ఇప్పుడా ఆచారం అపచారం కాబోతోంది. ఇదంతా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సారధ్యంలో చేస్తున్నారు. కొండమీద మల్లన్న తలాపునే ఉన్న ఎల్లమ్మ గుడివద్ద రూ.30 లక్షలతో జంతు బలిపీఠం షెడ్డు, వంటశాల షెడ్డు నిర్మాణాలు చేపట్టారు. గుట్ట కింద భాగం నుంచి నేరుగా వాహనాలు వెళ్లటం కోసం దాదాపు 300 మీటర్ల పొడవైన బీటీ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. మల్లికార్జునస్వామి క్షేత్రం పడమర (చూపు)తో పడమటి శివాలయంగా ఉండడంతో ఈ క్షేత్రంలో పూజలు చేస్తే స్వామివారి అనుగ్రహం శీఘ్రంగా జరుగుతుం దని భక్తులు చెప్పుకుంటారు. కొమురవెల్లి మల్లన్న ఆలయం చుట్టు అష్టభైరవులు కాపాలాగా ఉండి అందులో ఒకటి ఆలయ గర్భగుడిలో ఉండడంతో ఇక్కడ భక్తులు పూజలు చేస్తే దుష్టశక్తుల నుంచి మల్లన్న, భైరవులు కాపాడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మల్లికార్జునస్వామి క్షేత్రం 10వ ,11వ శతాబ్దంలో, కాకతీయుల కాలంలో సుమారు 500 సంవత్సరాల క్రితం వెలసినట్లు స్థల పురాణలు చెబుతున్నాయి. మల్లన్న ఆలయంలో వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం మల్లికార్జునస్వామికి, సతీమణులైన బలిజ డలమ్మదేవి, గొల్లకేతమ్మ దేవిలు నిత్యం పూజలందుకుంటున్నారు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి శివలింగం రూపంలో పూజ లుం డగా ఇక్కడ మాత్రం శ్రీమల్లికార్జునస్వామి రూపంలో పూజలు అందుకుంటారు. బలిపీఠాలు సిద్ధం మల్లన్న గుట్ట శిఖరంలో రేణుకాఎల్లమ్మ ఆలయంలో జంతుబలుల నిర్వహణకుగాను బలి పీఠాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బలి పీఠం ఏర్పాటు చేస్తే ఆలయానికి ఆదాయం సమకూరుతుందనే కారణంతో ఈ అపచారాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించడం విశేషం. కొమురవెల్లిలో కొన్ని శతాబ్దాలుగా మల్లన్న క్షేత్రానికి వచ్చే భక్తులు నియమ నిష్టలతో మల్లన్నకు బోనాలు చెల్లిస్తారు. అనంతరం గుట్టపై ఉన్న శ్రీరేణుక ఎల్లమ్మకు బోనాలు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. మొక్కులు అప్పగించి మరుసటి రోజు కొమురవెల్లి సమీపంలోని జగదేవ్‌పూర్ మండలం తిగుల్నర్సాపూరులోని కొండ పోచమ్మ (మల్లన్న చెల్లెలు)గా భావించే నల్లపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. అక్కడ కొండ పోచమ్మ వద్ద అమ్మవారికి మాంసాహారంతో వంటలు వండి మధ్యసాకలు పెడతారు. భక్తులను కొండ పోచమ్మ వద్దకు వెళ్లకుండా ఇక్కడే ఆపగలిగితే కొండ పోచమ్మకు వచ్చే ఆదాయం ఇక్కడకు వస్తుందనే ఆలోచనతో బలిపీఠాల ఏర్పాటుకు పూనుకున్నారు. మే 4న బలిపీఠాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. బలిపీఠంపై బలిచ్చిన మేకలు,కోళ్లను వండుకునేందుకు మల్లన్న గుట్టపైనే రేకులషెడ్ నిర్మిస్తున్నారు. శాఖాహారంతో మల్లన్నకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ క్షేత్రంలో మేకలు, కోళ్లను బలి చ్చేం దుకు ఏర్పాటు చేయటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా భావించే మల్లన్న గుట్టపై జంతుబలులను నిషేధించి మల్లన్న క్షేత్ర పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. కాగా ఈ నెల 25నుంచి మల్లన్న బ్ర హ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, ఏర్పా ట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇదేం విడ్డూరం.. మల్లన్నగుట్ట మీద బలిపీఠం నిర్మాణాన్ని ఆలయ అర్చకులందరం వ్యతిరేకిస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాం. ఇక్కడికి మల్లన్న భక్తులు నియమ నిష్టలతో వస్తుంటారు. ఆలయం పవిత్రతపై మాంసం, మద్యం ప్రభావం చూపిస్తుంది. మల్ల న్న తలాపుపైన బలిపీఠం ఉంటే అరిష్టం. సకల జీవులకు అనర్ధం అని గ్రహించాలి. గుట్టపై బలిపీఠాన్ని ప్రోత్సహించకపోవడం ఉత్తమం. – ఆలయ ప్రధాన అర్చకులు -
దేవుడితో ‘అసెస్మెంట్’ దందా
దేవాదాయశాఖ పరిధిలోకి ఆలయాల మళ్లింపులో చేతివాటం - రూ. 50 వేల పరిమితి ప్రాతిపదికగా 633 ఆలయాలకే గుర్తింపు - ఇప్పుడు వాటి సిబ్బందికే కొత్త వేతన విధానం అమలు యోచన - మిగతా ఆలయాల్లో అలజడి - అస్తవ్యస్త విధానాన్ని పట్టించుకోని మంత్రివర్గ ఉపసంఘం సాక్షి, హైదరాబాద్: ‘‘నెలకు రూ.50 వేలకుపైబడి ఆదాయం ఉన్న దేవాలయాలకు కొత్త వేతన విధానం అమలు చేయాలి’’ ఇది తాజాగా దేవాదాయశాఖ పనితీరును సమీక్షించి సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక నిర్ణయం. ఇప్పుడీ వ్యవహారం దేవాదాయశాఖలోని అస్తవ్యస్త వ్యవస్థను మరోసారి బట్టబయలు చేసింది. ఇంత ఆదాయం ఉన్న ఆలయాల ఆదాయన్ని సమీక్షించి దేవాదాయశాఖ అధీనంలోకి తీసుకుని, నిర్వహణకు సిబ్బందిని నియమించి కొనసాగిస్తోంది. ఇప్పుడు ఇలాంటి ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు కొత్త వేతన విధానం అమలు చేయాలనే దిశగా అడుగులు పడుతున్నారుు. కానీ... అలా సమీక్షించిన దేవాలయాల జాబితాలో లేని ఆలయాల్లో చాలావాటి ఆదాయం మరింత ఎక్కువగా ఉంది. కానీ అవి దేవాదాయశాఖకు పన్ను చెల్లించ డం లేదు. ఇప్పటికీ పాలకమండళ్ల అధీనంలో అవి నడుస్తున్నారుు. అలాంటి ఆలయాలు దేవాదాయశాఖ అధీనంలోకి వెళ్లకుండా కొందరు తెరవెనక చక్రం తిప్పుతున్నారని, ఇందులో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయనేది తాజాగా వెల్లడైన వివాదం. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఆ దిశగా దృష్టి సారించి దేవాదాయశాఖలో జరుగుతున్న ఇష్టారాజ్యానికి చెక్ చెప్పాల్సి ఉంది. కానీ.. ఆ తేనెతుట్టెను ముట్టుకోవడం కంటే.. జాబితాలో చోటు దక్కించుకున్న తక్కువ సంఖ్యలోని ఆలయాలకే కొత్త వేతనాలను వర్తింపజేసి చేతులు దులుపుకోవాలనే సూచనలు వారి చెవులకందుతుండటం విశేషం. ఏంటీ గందరగోళం..? ప్రస్తుతం రాష్ట్రంలో దేవాదాయశాఖలో రిజిస్టర్ అరుున దేవాలయాలు 12 వేలకుపైగా ఉన్నారుు. రిజిస్టర్ కానివి వేలల్లో ఉన్నారుు. దేవాదాయశాఖ నోటిఫై చేసిన (అసెస్డ్) ఆలయాలు మాత్రం కేవలం 633. వీటిల్లో సిబ్బం దితోపాటు అర్చకులకు ఆలయ ఆదాయం నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆల య ఉద్యోగులు, అర్చకుల డిమాండ్ మేరకు ప్రభుత్వమే వారికి జీతాలు చెల్లించాలని నిర్ణరుుంచింది. ఈ నిర్ణయాన్ని కేవలం ఈ 633 ఆలయాలకే వర్తింపజేయాలనే దిశగా అడుగులు పడుతున్నారుు. ఇక్కడే వివాదం రాజు కుంది. తామేం తప్పు చేశామంటూ మిగతా ఆలయాల అర్చకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే అసలు గుట్టు వెల్లడవుతోంది. రూ. 50 వేలు వస్తున్న ఆలయాలన్నింటితో అసెస్డ్ జాబితాను రూపొందిం చారు. కానీ.. అసెస్డ్ జాబితాలో లేని చాలా ఆలయాల ఆదాయం అంతకంటే చాలారెట్లు అధికంగా ఉంది. వాటిని దేవాదాయశాఖ పరిధిలోకి వెళ్లకుండా ఆ ఆలయాల పాలకమండళ్లు తెరవెనక మంత్రాంగం నడుపుతున్నారుు. దీనివల్ల వాటి నుంచి ప్రభుత్వానికి రావాల్సిన 12 శాతం కాంట్రిబ్యూషన్ రాకపోవటమే కాకుండా, ఆలయానికి వస్తున్న భారీ ఆదాయానికి లెక్కాపత్రం లేకుండా పోరుుంది. వీటిలో కొన్ని ఆలయాలను అసెస్ చేసేందుకు దేవాదాయశాఖ నోటీసులు జారీ చేసినా స్వయంగా కొందరు మంత్రులు రంగంలోకి దిగి వాటిని ఉపసంహరింప చేస్తున్నట్టు ఆరోపణలున్నారుు. ఇటీవల ఫిల్మ్‌నగర్‌లోని దైవసన్నిధానానికి అధికారులు నోటీసు జారీ చేసినా ఓ నేత ఒత్తిడితో అది వెనక్కు మళ్లింది. చాలా ఆలయాల పరిస్థితి ఇదే. దేవాదాయశాఖలోని పరిస్థితులను చక్కదిద్దేందుకు మంత్రుల కమిటీ దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. -
విజయవాడ టు తిరుపతి, శ్రీశైలానికి హెలికాప్టర్
-
విజయవాడ టు తిరుపతి, శ్రీశైలానికి హెలికాప్టర్
- సర్వీసులు నడపడానికి ముందుకొచ్చిన సుమిత్ ఏవియేషన్ - హెలికాప్టర్ ద్వారా తిరుమల దర్శనం కోసం వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు సాక్షి, అమరావతి : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లదలిచిన వారికి త్వరలో హెలికాప్టర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా కొద్ది రోజుల్లోనే విజయవాడ నుంచి తిరుపతి, శ్రీశైలం మధ్య హెలిక్టాపర్ రాకపోకలు మొదలు కాబోతున్నారుు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు విదేశీ యాత్రికులను ఎక్కువగా ఆకర్షించేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు హెలికాప్టర్ సర్వీసులను నడపడానికి ఢిల్లీకి చెందిన సుమిత్ ఏవియేషన్ సంస్థ ముందుకొచ్చింది. తిరుపతిసహా మిగిలిన పుణ్యక్షేత్రాల వద్ద ప్రభుత్వం హెలిప్యాడ్ వసతిని కల్పించడంతోపాటు హెలికాప్టర్ ద్వారా వచ్చే యాత్రికులకు తిరుమలలో నివాస వసతి, దైవ దర్శనం ఏర్పాట్లు కల్పించాలంటూ సుమిత్ ఏవియేషన్ యజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఏవియేషన్ సంస్థ ఇందుకు ప్రభుత్వం అంగీకరించడంతో తొలి దశలో తిరుపతి, శ్రీశైలంలకు హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. హెలిప్యాడ్ల ఏర్పాటుకు ఆదేశాలు సుమిత్ ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ రాకపోకలకు ఉపయోగించుకోవడానికి ప్రత్యేకంగా విజయవాడ, తిరుపతి, శ్రీశైలంలలో యుద్ధప్రాతిపదికన హెలిప్యాడ్ల నిర్మాణానికి ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. -
అనర్హులకు ఈఓ పోస్టులు!
- దేవాదాయశాఖలో తెరవెనుక బాగోతం - కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడితో కదిలిన ఫైలు - సీనియర్ ఈఓలను మార్చి అస్మదీయులకు కేటాయించే యత్నం - ప్రధాన దేవాలయాల్లో సాగుతున్న తంతు సాక్షి, హైదరాబాద్: ప్రధాన దేవాలయాలకు అర్హత లేని అధికారులను కార్యనిర్వహణాధికారులుగా కూర్చోబెట్టేందుకు దేవాదాయశాఖలో పావులు కదులుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడి తో ఫైలు చకచకా కదిలి.. ఇప్పుడు దేవాదాయ మంత్రి వద్దకు చేరింది. దేవాదాయశాఖను ప్రక్షాళన చేసేందుకు దేవాదాయ మంత్రి చైర్మన్‌గా ఐదుగురు మంత్రులతో ఏర్పడ్డ మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫారసులు సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఈ వ్యవహారానికి తెరలేచింది. ఆదాయం ఆధారంగా దేవాలయాల స్థాయి పెంచాలని ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం, నిర్మల్ జిల్లా బాసర ఆలయాలకు అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) స్థాయి అధికారులు ఈఓలుగా ఉండాలి. ప్రస్తుతం ఏసీ పదోన్నతికి సిద్ధంగా ఉన్న అధికారులు ఇక్కడ ఈఓలుగా ఉన్నారు. ఈ దశలో సాధారణ సూపరింటెండెంట్లకు ఆ పోస్టులు కట్టబెట్టేందుకు కొందరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. రకరకాల ఆరోపణలు, కేసుల్లో ఇరుక్కుని ఉన్న సూపరింటెండెంట్లకు ఇన్చార్జి ఈవోలుగా కూర్చోబెట్టాలని వారు ఒత్తిడి ప్రారంభించారు. దీంతో అధికారులు ఆ ఫైల్‌ను దేవాదాయ మంత్రి వద్దకు పంపినట్టు తెలిసింది. ఈ ఇద్దరు సూపరింటెండెంట్లు నేరుగా ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు కాదు, అలాంటి వారిని ఈఓలుగా నియమించడం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా ఎమ్మెల్యేల ఒత్తిడితో ఫైలు చకచకా కదిలింది. వీరికి పోస్టింగ్స్ ఇస్తే మరికొందరు సూపరింటెండెంట్లు కూడా దొడ్డిదారిన ఈఓ పోస్టులు కొట్టేసేందుకు సిద్ధంగా ఉన్నారు. -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
రేపే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల దృష్ట్యా నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు సచివాలయంలోని సీ బ్లాక్‌లో మంత్రివర్గం సమావేశమవనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రాధాన్యం, ఆమోదించాల్సిన కీలక అంశాలను భేటీలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బిల్లు ప్రాధాన్యాన్ని చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఈ సమావేశంలో ఆమోదం తెలుపనుంది. గతంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను, సైబరాబాద్ కమిషనరేట్ విభజనకు సంబంధించిన ఆర్డినెన్స్‌నూ చట్టంగా మార్చేందుకు ఈ సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మంత్రి వర్గ భేటీలో ప్రధానంగా ఈ మూడు అంశాలను ఎజెండాగా చేర్చినట్లు సమాచారం. -
72 గంటల్లో రూ. 28.05 కోట్లు కట్టండి
-
72 గంటల్లో రూ. 28.05 కోట్లు కట్టండి
సదావర్తి భూములపై దేవాదాయ శాఖ పీఎల్ఆర్ సంస్థకు లేఖ సాక్షి, విజయవాడ బ్యూరో : రూ. 28.05 కోట్లు 72 గంటల్లోగా డిపాజిట్ చేస్తే సదావర్తి భూములు మళ్లీ వేలం వేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ పీఎల్ఆర్ ప్రాజెక్ట్సుకు లేఖ రాశారు. ఆ లేఖను శనివారం పత్రికలకు విడుదల చేశారు. గత ంలో రూ.22.44 కోట్లకు సదావర్తి భూములను వేలం వేయగా, ఆ మొత్తానికి మరో 25 శాతం ఎక్కువ సొమ్మును కలిపి డిపాజిట్ చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల విలువైన భూములను దేవాదాయశాఖ కారు చౌకగా వేలం వేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి బంధువులు రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఈ భూములను రూ. 22.44 కోట్లకు వేలంలో దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు రాగా, పలు సంస్థలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఈ దోపిడీని ప్రశ్నించారు. దాంతో రూ.5 కోట్లు అదనంగా చెల్లించేవారికి ఆ భూములు అప్పగిస్తామని ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి ప్రకటనలుచేశారు. వాటికి స్పందిస్తూ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 5 కోట్లు చెల్లించడానికి సిద్ధమేనని ఆసక్తి ప్రతిపాదనను పంపించింది. దీంతో వారికి కొత్తగా అనేక షరతులు పెడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ రాసిన లేఖ పలు విమర్శలకు దారి తీసింది. ఈ కొత్త షరతులేమిటని ప్రశ్నిస్తూ పీఎల్ఆర్ సంస్థ రాసిన లేఖకు స్పందిస్తూ ఇపుడు దేవాదాయశాఖ ఈలేఖ పంపించింది. ఆ డబ్బు చెల్లించడానికి మేం సిద్ధం సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవాలుకు తాము సిద్ధమని పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. రాష్ర్టప్రభుత్వం అడుగుతున్నట్లుగా రూ. 22.44 కోట్లకు అదనంగా రూ. 5.60 కోట్లు కలిపి మొత్తం రూ. 28.05 కోట్లను 72 గంటల్లోగా డిపాజిట్ చేయడానికి తాము సిద్ధమని ఆ సంస్థ పేర్కొంది. శనివారం ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తాము డబ్బు కట్టిన వెంటనే తమ సంస్థ పేరిట సదావర్తి భూములను రిజిస్టర్ చేయాలని కోరింది. అందుకు రాష్ర్టప్రభుత్వం సిద్ధమైతే తాము డబ్బు కట్టడానికి సిద్ధమేనని తెలిపింది. అలా కాకుండా సదావర్తి భూములకు మళ్లీ వేలం వేసినా ఆ వేలంలో తాము పాల్గొనడానికి సిద్ధమని, నిబంధ నల ప్రకారం ఈఎండీగా రూ. 10 లక్షలు కట్టి వేలంలో పాల్గొంటామని పేర్కొంది. ‘‘రూ.28.05 కోట్లు కట్టి వేలంలో పాల్గొనాలన్న షరతు మాకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. మిగిలిన బిడ్డర్ల మాదిరిగా రూ.10 లక్షల ఈఎండీ కట్టి వేలంలో పాల్గొనడానికి మాకూ అవకాశం ఇవ్వండి.’’అని పేర్కొంది. తొలిసారి వేలం నిర్వహించినపుడు వేలంలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలు కట్టిన ఈఎండీ మొత్తం అదేనని ఆ సంస్థ తెలిపింది. ఎవరు ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడితే వారికి ఆ భూములు అప్పగించాలని, తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని పేర్కొంది. -
గుడులు కూల్చి.. మాన్యాలు మింగుతూ
-
గుడులు కూల్చి.. మాన్యాలు మింగుతూ
ఆపై ముఖ్యమంత్రి ఎదురుదాడి ♦ సదావర్తి కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయినా బెదిరింపులు ♦ సాక్ష్యాలతో సహా బైటపెట్టడమే ‘సాక్షి’ నేరమట.. ♦ పత్రికలకు, పబ్లిషర్లకు నోటీసులిస్తామని హెచ్చరిక సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎంతవారికైనా దైవభీతి ఉంటుంది. దేవుడికి అన్యాయం కాదు కదా కనీసం అపచారం కూడా చేయడానికి భయపడతారు. కానీ విచ్చలవిడి అవినీతిలో విశ్వరూపం చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అలాంటి పట్టింపులేవీ లేనట్లు కనిపిస్తోంది. ఒకవైపు గుడులను కూల్చివేయిస్తున్నారు. కృష్ణాపుష్కరాల పేరుతో ఆలయాల విధ్వంసం జరిపించారు. అన్నివైపుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో కాస్త ఉపశమించారు. అదే సమయంలో గుడి మాన్యాలను కొల్లగొడుతున్నారు. వెయ్యికోట్ల విలువైన సదావర్తి సత్రం భూములను తమ్ముళ్లతో కలసి హాంఫట్ స్వాహా చేసేశారు. రూ.1,084 కోట్ల విలువైన 83 ఎకరాల సత్రం భూములను రూ.22 కోట్ల కారుచౌక రేటుకు కొట్టేశారు. ఈ కుంభకోణాన్ని ససాక్ష్యంగా ‘సాక్షి’ బైటపెట్టింది. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ నిజనిర్ధారణ బృందాలు ఆ ప్రాంతాలలో పర్యటించి తప్పు జరిగినట్లు నిర్ధారించాయి. ఎకరా భూమి విలువ రూ.6 కోట్లు పలుకుతున్నట్లు సాక్షాత్తూ దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ నివేదించినా ప్రభుత్వం పట్టించుకోకుండా పప్పుబెల్లాలకు వేలం వేసేసినట్లు సాక్ష్యాధారాలతో సహా బైటపడింది. రూ. 1,058 కోట్ల మేర ప్రజాధనాన్ని పథకం ప్రకారం లూటీ చేసేసిన సంగతి ప్రపంచానికి తెలిసిపోయింది. ఇంత జరిగినా ముఖ్యమంత్రి వైఖరిలో వీసమెత్తు మార్పు లేదు. తప్పు చేసినందుకు తలదించుకోవలసింది పోయి దానిని బైటపెట్టినవారిపై బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే అనేకరకాలుగా ‘సాక్షి’పై కక్షసాధింపు సాగుతోంది. సదావర్తి వ్యవహారంలో లీగల్ నోటీసులూ అందుతున్నాయి. ఎన్నో నిర్బంధాలను తట్టుకున్న ‘సాక్షి’కి ఇవేవీ కొత్త కాదు. ప్రజల పక్షాన వాస్తవాలను వెల్లడించడం, తప్పు జరిగితే నిలదీయడం వంటివి కొనసాగిస్తూనే ఉంటుంది. సదావర్తి భూముల విషయంలో ప్రభుత్వం నిబంధనల మేరకు నడుచుకోలేదని, ‘బాబు’లంతా పథకం ప్రకారం భూములు కొల్లగొట్టారని బైటపెట్టడం అందులో భాగమే... ముఖ్యమంత్రి బెదిరింపుల నేపథ్యంలో సదావర్తి కుంభకోణం జరిగిన తీరును.. అందులో జవాబులేని ప్రశ్నలను పరిశీలిద్దాం... ఇదీ కుంభకోణం.. అమరావతిలోని అమరేశ్వరాలయానికి చెందిన ‘శ్రీ సదావర్తి సత్రం’ భూములు కబ్జాకు గురవుతున్నాయని గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖరాయడం, ఆ భూమిని విక్రయించాలని ప్రతిపాదించడం, దానికి సీఎం కార్యాలయం ఆగమేఘాలపై అనుమతించడం అంతా పథకం ప్రకారం జరిగింది. ఆ వెంటనే కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కుటుంబసభ్యులు, మరో ఆరుగురు కలిసి ఆ భూములను వేలంలో కొనుగోలు చేశారు. చెన్నై సమీపంలోని తాలంబూరు ప్రాంతంలో ప్రభుత్వ ధరల ప్రకారమే ఎకరా భూమి రూ.6 కోట్లు ఉంది. అక్కడ ప్రైవేట్ రియల్ఎస్టేట్ సంస్థలు వేసిన వెంచర్లలో 200 చదరపు గజాల ఇంటిస్థలం రూ. 55 లక్షలు పలుకుతోంది. అంటే బహిరంగ మార్కెట్లో సదావర్తి భూముల ధర ఎకరా రూ. 13 కోట్లు వరకు ఉంటుంది. అయితే సత్రం ఈవో ఎకరా కేవలం రూ.50 లక్షల చొప్పున అమ్మకానికి ప్రతిపాదించారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఆ ధరను మరింత తగ్గించారు. ఎకరా రూ.27 లక్షల చొప్పున 83.11 ఎకరాలను రూ. 22.44 కోట్లకు కట్టబెట్టారు. అంటే రూ. 1,080.43 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ. 22.44 కోట్లకు కట్టబెట్టేశారన్నమాట. సర్కారు ఖజానాకు రూ. 1,058 కోట్లు నష్టం చేకూర్చారన్నమాట. ఈ ప్రశ్నలకు బదులేది? ► సదావర్తి భూములు ఎకరం రూ.6 కోట్లు విలువ చేస్తాయని తన పరిశీలనలో తేలిందని, భూముల అమ్మకంపై నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ నివేదించారా లేదా? ఆ లేఖను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ► సదావర్తి భూముల సమీపంలో సత్యభామ యూనివర్సిటీ, హిందుస్థాన్ యూనివర్సిటీ, టీసీఎస్ సహా పలు ఐటీ సంస్థలు, స్టార్ హోటళ్లు, భారీ అపార్ట్మెంట్లు, రిసార్టులు, గేటెడ్‌కమ్యూనిటీలు ఉన్న మాట వాస్తవం కాదా?అలాంటపుడు అవి విలువైన భూములని ప్రభుత్వానికి ఎందుకు అనిపించలేదు? ► సదావర్తి భూములు ఆక్రమణలో లేవని, ఆ భూముల చుట్టూ చక్కగా కంచె వేసి ఉన్నదని ప్రతిపక్ష పార్టీలైన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ నిజనిర్ధారణ బృందాల పరిశీలనలో తేలిన మాట వాస్తవం కాదా? ► అసలు ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? లేక పప్పు బెల్లాలకు విక్రయించేస్తారా? ► ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే బాధ్యత గలిగిన ఓ ఎమ్మెల్యే ఆ భూమిని రక్షించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిం చాలి. ఎవరైనా చేసేదదే. కానీ కొమ్మాలపాటి శ్రీధర్ మా త్రం అమ్మేయాలని ప్రభుత్వానికి సూచించడంలోని మతలబేమిటి? ఆయన సూచనకు సీఎం కార్యాలయం వెంటనే స్పందించడం, నెల తిరక్కుండానే దేవాదాయశాఖకు ఉత్తర్వులిచ్చేయడం వెనక గూడుపుఠాణీ జరగలేదంటారా? ► భూముల వాస్తవ ధర ఎంత ఉందో తెలిసినా సదావర్తి భూములను చౌకగా విక్రయించడానికి అనుమతి ఇచ్చినట్లు రాష్ర్టప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వివరణ ఇవ్వలేదా? సదావర్తి సత్రం భూముల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చదరపు అడుగుకు రూ. 1,700 చొప్పున ఎకరాకు రూ. 6 కోట్ల వరకు ధర ఉన్నట్లు ప్రభుత్వానికి తెలుసని దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చిన వివరణ పరిశీలిస్తే ఇందులో కుంభకోణం జరిగినట్లు అర్ధం కావడం లేదా? ► ఆక్రమణలో ఉన్నాయి కాబట్టి వేలంలో ఎకరా రూ.50 లక్షలు బేసిక్ ధరగా నిర్ణయించినట్లు చెబుతున్న ప్రభుత్వం వేలం పాట సమయంలో అప్పటికప్పుడు ఎకరం ధరను రూ. 27 లక్షలకు ఎందుకు తగ్గించి అమ్మాల్సి వచ్చింది? ► విజయవాడ దుర్గగుడి వద్ద ఈ ఏడాది చెప్పుల షాపు నిర్వహణకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. గతేడాది కన్నా రూ. 2 లక్షలు తక్కువకు పాట వచ్చిందని ఆ వేలాన్ని రెండుసార్లు వాయిదా వేసింది. 3వసారి వేలం నిర్వహించి అనుమతి తెలిపింది. అలాంటిది రూ. 1,084 కోట్ల విలువైన భూముల వేలంలో రాష్ర్టప్రభుత్వం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ► రాష్ర్టంలో ఏ గుడి అధీనంలోని దుకాణాన్నైనా అద్దెకు ఇవ్వాలంటే దేవాదాయ శాఖ ఈ - టెండర్ విధానాన్ని అమలు చేస్తోంది. సదావర్తి భూముల విక్రయానికి మాత్రం ఈ టెండర్‌ను పిలవకుండా బహిరంగ వేలం నిర్వహించింది. ఈ బహిరంగ వేలం గురించి కూడా అధికార పార్టీ నేతలు మినహా ఇతరులెవరికీ తెలియకుండా జాగ్రత్త పడడం వెనక మతలబేమిటి? ► సదావర్తి భూముల వ్యవహారంలో సమగ్ర సమాచారాన్ని తెప్పించుకున్న దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ దానికి తన అభిప్రాయాన్ని జతపరిచి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. సదావర్తి భూముల వేలం వ్యవహారంలో కనీస నిబంధనలు కూడా పాటించలేదని, ఆ వేలం ను రద్దు చేయాలని ప్రసాద్ సూచించినట్లు సమాచారం. వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్న ఆ నివేదికపై నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి జాప్యం చేయడం వెనక ఉన్న మర్మమేమిటి? -
‘వెయ్యి కోట్ల భూ దోపిడీ’పై బాబు సంతృప్తి!
సాక్షి, హైదరాబాద్: అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న విలువైన భూమిని అతి తక్కువ ధరకు టీడీపీ నేతలు దక్కించుకోవడంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సంతృప్తి చెందినట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని టీడీపీ నాయకులు వేలంలో రూ.22 కోట్లకే దక్కించుకున్న సంగతి తెలిసిందే. దేవాదాయ శాఖ అధికారులు సత్రం భూముల అమ్మకానికి సంబంధించిన ఫైళ్లతో సహా సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా భూములు అమ్మిన తీరును చంద్రబాబు పూర్తిగా సమర్థించారనే ప్రచారం జరుగుతోంది. అయితే, భూమి అమ్మకం వివరాలు బయటకు పొక్కడంపై అధికారులపై ఆయన తీవ్ర అగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గోప్యంగా ఉంచాల్సిన వివరాలు ఎలా బయటపడ్డాయని ఆయన దేవాదాయ శాఖ కమిషనర్‌పై మండిపడినట్లు సమాచారం. సదావర్తి సత్రం భూముల అమ్మకానికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్‌కు జాయింట్ కమిషనర్ రాసిన లేఖ బయటకు ఎలా పొక్కిందని ఆయన అధికారులను నిలదీసినట్లు తెలుస్తోంది. -
సదావర్తి సత్రంలో వెయ్యి కోట్లు లూటి
తమిళనాడులోని సత్రం భూములు స్వాహా ♦ అధికార పార్టీ నేతలే సూత్రధారులు, పాత్రధారులు ♦ ఎకరా రూ.13 కోట్లు ఉన్న భూమి రూ.27 లక్షలకే కైవసం ♦ రూ.1,000 కోట్ల విలువైన భూమి వేలంలో పలికింది రూ.22.44 కోట్లు ♦ భూమిని విక్రయించాలని తొలుత టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ లేఖ ♦ సీఎం కార్యాలయం సహకారంతో 83.11 ఎకరాల దేవుడి మాన్యం వేలం ♦ అడ్డగోలుగా భూమి ధర తగ్గింపు ♦ కొనుగోలుదారులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కుటుంబ సభ్యులు, మిత్రబృందం ♦ తెరవెనుక ‘ముఖ్య’ నేత కుమారుడు, మంత్రులు శ్రీసదావర్తి సత్రం భూములున్న ప్రాంతం అత్యంత ఖరీదైన ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో ఉంది. తాలంబూరు గ్రామ పరిధిలో రోడ్డు పక్కనే ఈ భూములున్నాయి. వీటి సమీపంలో సత్యభామ యూనివర్సిటీ, హిందూస్థాన్ యూనివర్సిటీ, టీసీఎస్ సహా పలు ఐటీ సంస్థలు, స్టార్ హోటళ్లు, భారీ అపార్టుమెంట్లు, రిసార్టులు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి సముద్ర తీరం కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సాక్షి, హైదరాబాద్/చెన్నై/గుంటూరు సర్కారు భూములు ఆక్రమణకు గురైతే ఏం చేయాలి? అందులోనూ విలువైన దేవాలయ భూములైతే.. ఎంత జాగ్రత్త వహించాలి? కబ్జాదారులను తరిమికొట్టి వాటి కాపాడాలి కదా..! కానీ చంద్రబాబు జమానాలో అంతా రివర్స్.. భూములు కబ్జాదారుల నుంచి బడా‘బాబు’ల చేతుల్లోకి రాజమార్గంలో చేరిపోవడానికి ప్రణాళిక రచించారు. ఆగమేఘాలపై ఫైళ్లు పుట్టుకొచ్చాయి.. శరవేగంగా పరుగులు పెట్టాయి. ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం... ఆ భూములను అమ్మేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాదించాడు.. ముఖ్యమంత్రి కార్యాలయం దేవాదాయ శాఖకు లేఖ రాసింది.. దేవాదాయ శాఖ వెంటనే వేలంపాటకు అనుమతించేసింది.... ఆనక రంగంలో దిగిన ముఖ్యమంత్రి సన్నిహితుడు... ఏరికోరి నియమించుకున్న కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ మరికొంతమంది అధికారపార్టీ నాయకులే ఆ భూములను వేలంలో కొనేశారు.. విచిత్రమేమిటంటే ఎకరా రూ.13కోట్లు పలికే భూమి ఎకరా రూ.50 లక్షల చొప్పున అమ్మితే చాలని ఈవో చేత కూడా పలికించారు. ఆ రేటుకూ ఎవరూ ముందుకు రాలేదని చెబుతూ ఎకరం రూ. 27 లక్షలకు ఫైనల్ చేసేశారు. అలా చివరకు 83.11 ఎకరాల విలువైన భూములు రూ. 22 కోట్లకు అప్పనంగా అయినవారికి కట్టబెట్టేశారు. ఇదంతా ఓ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోయింది. ప్రభుత్వ పెద్దల డెరైక్షన్‌లో ఎవరి పాత్రను వారు యథాశక్తి రక్తికట్టించారు. గద్దల్లాంటి పెద్దల దెబ్బకు దేవుడైనా అబ్బా అనాల్సిందేనని రుజువుచేశారు... భూములు కోల్పోయిన అమరేశ్వరుడు అమరావతిలో నిస్సహాయంగా నిలబడ్డాడు... ప్రజలకు అవసరమైన ఫైళ్లపై కాకుండా ఎవరికో అవసరమైన ఫైళ్లపైనే తాను సంతకం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వాఖ్యానించడం కొసమెరుపు. ఐదుగురు అధికారులతో కమిటీ గుంటూరు జిల్లా అమరావతిలో శ్రీసదావర్తి సత్రం ఉంది. స్వాతంత్య్రానికి పూర్వమే బ్రాహ్మణులకు, వేదశాస్త్రాలను అభ్యసించే పేద విద్యార్థులకు అన్నదానం నిర్వహించాలన్న లక్ష్యంతో అమరావతి జమీందారులైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులు అప్పట్లో ఈ సత్రాన్ని నిర్మించారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోగంటివారిపాలెంలో తమ పేరిట ఉన్న 72 ఎకరాలను, తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో మరో 471.76 ఎకరాలను సత్రం నిర్వహణ కోసం ఇనామ్ రూపంలో దారాదత్తం చేశారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా చెంగల్పట్టు తాలూకాలో నావలూరు, తాలంబూరు, పడూరు గ్రామాల పరిధిలో ఈ భూములున్నాయి. ఈ భూముల విక్రయానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 6న ఉత్తర్వులు (మెమో నం. 28228) జారీ చేసింది. అందులో 83.11 ఎకరాల భూమి అమ్మకానికి ఈ ఏడాది మార్చి 28న దేవాదాయ శాఖ అధికారులు వేలం పాట నిర్వహించారు. భూమి అమ్మకం జరిపేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఐదుగురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిషనర్ కార్యాలయంలో ఎస్టేట్ సంయుక్త కమిషనర్ కృష్ణాజీరావు, ఎస్టేట్ అసిస్టెంట్ కమిషనర్ విజయరాజు, రీజినల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ, గుంటూరు డిప్యూటీ కమిషనర్ సురేష్‌బాబు, అమరావతిలోని సత్రం ఈవో శ్రీనివాసరెడ్డిలను కమిటీలో సభ్యులుగా నియమించారు. ఎకరాకు రూ.50 లక్షలేనట! చెన్నై సమీపంలోని తాలంబూరులో భూముల ధరలు అధికంగా ఉండడంతో తమిళనాడు రిజిస్ట్రేషన్ శాఖ భూ లావాదేవీలలో ఎకరాకు బదులు గజా ల లెక్కన రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తోంది. ప్రభుత్వ ధరల ప్రకారమే అక్కడ ఎకరా భూమి రూ.6 కోట్ల వరకు ఉంటుంది. మరోవైపు అక్కడ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు వేసిన వెంచర్లలో 200 చదరపు గజాల ఇంటి స్థలం రూ.55 లక్షల వర కు పలుకుతోంది. అంటే బహిరంగ మార్కెట్లో ఎక రా భూమి ధర రూ.13 కోట్ల వరకు ఉన్న ట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీసదావర్తి సత్రం భూములు పూర్తిగా ఆక్రమణలో ఉన్నాయనే సాకుతో సత్రం ఈవో ఎకరా కేవలం రూ.50 లక్షల చొప్పున అమ్మకానికి ప్రతిపాదించారు. దేవాదాయ శాఖ ఉన్న తాధికారులు వెంటనే ఆమోదం తెలిపారు. వేలం పాట ద్వారా ఎకరా భూమిని రూ.50 లక్షలకు అమ్మడానికి దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతించినట్టు సత్రం ఈవో శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వేలం పాట కాదు.. దోపిడీ బాట సాధారణంగా వేలం పాటలో ప్రభుత్వం నిర్ణయిం చిన కనీస ధరకన్నా ఒక్క రూపాయి అయినా అధికంగా పోటీదారులు వేలం పాడుతుంటారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనడానికి ఎవరూ ముందుకు రాకపోతే వేలం పాటను రద్దు చేసి, మరోసారి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీసదావర్తి సత్రం భూముల అమ్మకం అంతా రివర్స్. 83.11 ఎకరాల భూమి అమ్మకానికి ఈ ఏడాది మార్చి 28న మొదటి విడత వేలం పాటలో ప్రభుత్వం నిర్ణయిం చిన ధర ఎకరా రూ.50 లక్షలకు కొనడానికి ఎవరూ ముందు కు రాలేదని పేర్కొంటూ ఆ వేలంలో పాల్గొ న్న నలుగురిలో అత్యధిక ధరకు కొనడానికి ముందుకొచ్చిన వారికే భూములను కట్టబెట్టడానికి అధికారులు సిద్ధమయ్యారు. భూముల ధరను తగ్గిస్తూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఎకరం రూ.27 లక్షల చొప్పున 83.11 ఎకరాలను రూ.22.44 కోట్లకు కట్టబెట్టారు. వేలం పాట దక్కిం చుకున్న వారు సగం డబ్బులు అంటే రూ.11 కోట్లు దేవాదాయ శాఖకు చెల్లించారు. వేలం నిబంధనల ప్రకారం పాట జరిగిన 90 రోజుల్లో అంటే జూన్ 26లోగా తక్కిన మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అక్కడికక్కడే ధర తగ్గింపు చెన్నై సమీపంలో భూములు ఉన్నచోటే వేలం పాట నిర్వహించారు. దేవాదాయ శాఖ నియమించిన కమిటీలోని ఐదుగురు సభ్యులు వేలం పాట జరిగిన రోజు అప్పటికప్పుడు... అక్కడికక్కడే భూమి ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం విచిత్రం. దీనిపై దేవాదాయ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ-టెండర్’ మరిచారు దేవాదాయ శాఖలో ప్రస్తుతం ఒక చిన్న దుకాణాన్ని అద్దెకు ఇవ్వాలన్నా ‘ఈ-టెండర్’ విధానంలో అప్పగిస్తారు. 83.11 ఎకరాల సత్రం భూముల అమ్మకానికి దేవాదాయ శాఖ అధికారులు ఈ విధానాన్ని అమలు చేయలేదు. విలువైన భూములను అధికార పార్టీ ముఖ్యులకు నామమాత్రపు ధరకు కట్టబెట్టే ఉద్దేశంతోనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఇందుకు అడ్డు చెప్పలేదన్న వాదన వినిపిస్తోంది. ఎకరా రూ.6 కోట్లకుపైనే అని చెప్పినా.. తమిళనాడులో శ్రీసదావర్తి సత్రం భూములున్న ప్రాంతంలో ఎకరం ధర రూ.6 కోట్లకుపైగానే పలుకుతోందని, వేలంలో ఎకరం రూ.27 లక్షల చొప్పున అమ్మడమేమిటని దేవాదాయ శాఖ జాయింట్ కలెక్టర్ డి.భ్రమరాంబ అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఏప్రిల్ 18న సవివరమైన లేఖ రాశారు. అయితే, ఆ అధికారి వా దనను ఏమాత్రం పట్టించుకోకుండా దేవా దాయ శాఖ కమిషనర్ అనూరాధ వేలంలో పాట దక్కించుకున్న అధికార పార్టీ నేత చలమలశెట్టి రామానుజయ కుటుంబ సభ్యులు, ఆయన మిత్ర బృందం పేరిట ఏప్రిల్ 24 సేల్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. తెరవెనుక బడా నేతలు దేవాదాయశాఖ అధికారి, శ్రీసదావర్తి సత్రం భూముల తరఫున చెన్నైలో న్యాయవాదిగా వ్యవహరించిన లాయర్ చెప్పినదాన్ని బట్టి ఎకరం రూ.6 కోట్ల చొప్పున లెక్కించినా 83.11 ఎకరాలకు రూ.500 కోట్లు అవుతుంది. బహిరంగ మార్కెట్ ధర ఎకరం రూ.13 కోట్ల వరకు ఉంది. ఈ లెక్కన 83.11 ఎకరాలకు రూ.1,080.43 కోట్లు అవుతుంది. కనీసం రూ.1,000 కోట్లకు తగ్గదని అధికారులు అంటున్నారు. రూ.1,000 కోట్ల భూ దోపిడీ వ్యవహారంలో ఒకరిద్దరు అధికార పార్టీ నేతలు, సాధారణ వ్యక్తులు కనిపిస్తున్నప్పటికీ తెరవెనుక బడా నేతలే ఉన్నారని స్పష్టమవుతోంది. దేవాదాయ శాఖలోని కీలక అధికారులు ఈ దోపిడీకి అనుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలాఖరులో భారీ మొత్తంలో నగదు లావాదేవీలను నిర్వహించరు. అలాంటిది కోట్లాది రూపాయలకు సంబంధించిన భూముల వేలం పాటను మార్చి 28న నిర్వహించడం ముందస్తు వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. ఆ పని ప్రభుత్వం చేయలేదా? శ్రీసదావర్తి సత్రం భూములు పరుల అధీనంలో ఉన్నాయని, వాటిని వేలం వేయడం ద్వారా అమరేశ్వర ఆలయానికి ఆదాయం వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ లేఖ రాయడం పకడ్బందీ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. దీనిపై వెనుకా ముందు ఆలోచించకుండా సీఎం కార్యాలయం ఆమోదం తెలపడం మరీ విచిత్రం. పొరుగు రాష్ట్రంలోని మన భూములు వివాదంలో ఉన్నాయని, వాటి విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేదని దేవాదాయ శాఖ అధికారులు అంటున్నారు. వివాదంలో ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలుచేసి, అక్కడ కార్యకలాపాలు నిర్వహించుకోగలరు గానీ ప్రభుత్వం మాత్రం ఆ పని చేయలేదట. విలువైన భూములను తొలుత అనుచరుల ద్వారా కొనుగోలు చేయించి, ఆ తరువాత వాటిని సొంతం చేసుకునేందుకు ముఖ్య నేతలు భారీ కుట్రకు పాల్పడ్డారని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ‘ముఖ్య’నేత కుమారుడు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన మంత్రులు ఈ భూ దోపిడీలో భాగస్వాములని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్రం భూముల చరిత్ర రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారసులు వాసిరెడ్డి మహలక్ష్మమ్మ 1849లో అమరావతి దేవస్థానానికి చెన్నైలోని భూములను విరాళంగా ఇచ్చారు. చెన్నై సమీపంలోని తాళంబూరు ప్రాంతంలో 473 ఎకరాలను అమరేశ్వరస్వామి దేవస్థానానికి అప్పగించారు. భూములకు సంబంధించిన రికార్డులను గుడికి అందజేశారు. ఆ తరువాత జమీందారీ పాలన ముగిశాక 1969లో భూములను శ్రీసదావర్తి సత్రానికి కేటాయించారు. భూములు పక్కరాష్ట్రంలో ఉండడంతో వాటిపై పర్యవేక్షణ లోపించింది. 473 ఎకరాల్లో చాలావరకు ఆక్రమణలకు గురైంది. ఈ నేపథ్యంలో భూముల స్వాధీనం కోసం రాజా వెంకటాద్రి నాయుడు వారసులు వాసిరెడ్డి హరిప్రసాద్ న్యాయ పోరాటం ప్రారంభించారు. కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం అమరావతి దేవస్థానం కూడా న్యాయ పోరాటం కొనసాగించింది. 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రత్యేక కమిటీ తమిళనాడుకు వెళ్లి భూములను పరిశీలించింది. భూముల స్వాధీనంపై అప్పటి చెన్నై మేయర్ స్టాలిన్‌తో చర్చించింది. స్టాలిన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో న్యాయ పోరాటం చేయగా 2014లో దేవస్థానానికి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది. 473 ఎకరాల్లో 83.11 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం అనాధీనంగా(పోరంబోకు) ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన భూమికి తమిళనాడు ప్రభుత్వం 50 ఏళ్ల క్రితమే పూర్తిస్థాయిలో పట్టాలు ఇచ్చేసింది. కోర్టులో కేసు గెలిచాక తమిళనాడు సర్కారుతో చర్చలు జరిపి అనాధీనంగా ఉన్న 83.11 ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే దీనిపై అక్రమార్కుల కన్నుపడింది. కొల్లగొట్టేందుకు భారీ కుట్ర జరిగింది. రూ.1,000 కోట్ల విలువైన భూమిని వేలంలో రూ. 22.44 కోట్లకే దక్కించుకున్నారు. 471.76 ఎకరాల్లో మిగిలింది 83.11 ఎకరాలే తన నియోజకవర్గంలోని శ్రీసదావర్తి సత్రానికి (అమరావతి ఆలయ పరిధిలోనిది) చెన్నై సమీపంలో భూములు ఉన్నాయని, అవి ఆక్రమణకు గురవుతున్నాయని, వాటి విక్రయానికి అనుమతించాలని కోరుతూ పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ 2014 ఆగస్టు 18న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. సీఎం కార్యాలయం వెంటనే స్పందించింది. 2014 సెప్టెంబర్ 12న ఆ లేఖను దేవాదాయ శాఖకు పంపింది. అన్ని ప్రక్రియలు పూర్తయి 2015 ఏప్రిల్‌లో భూముల అమ్మకానికి దేవాదాయ శాఖ అనుమతించింది. 471.76 ఎకరాల్లో ఆక్రమణలు పోను మిగిలి ఉన్న 83.11 ఎకరాలను విక్రయించేందుకు ఈ ఏడాది మార్చి 28న వేలం పాట నిర్వహించారు. వేలంలో కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ భార్య చలమలశెట్టి లక్ష్మీపార్వతి, కుమారుడు చలమలశెట్టి నిరంజన్‌బాబు, గుంటూరు జిల్లాకు చెందిన మందాల సంజీవరెడ్డితోపాటు ఎం.సునీతారెడ్డి, చావలి కృష్ణారెడ్డి, ఎం.సూర్యకిరణ్‌మౌళి, డి.పవన్‌కుమార్, ఆర్.శివరామకృష్ణరావులు కలిసి 83.11 ఎకరాలను దక్కించుకున్నారు. -
జూన్‌లోపు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి
ఎండోమెంట్ ట్రిబ్యునల్‌పై దేవాదాయ శాఖకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి జూన్ వరకు హైకోర్టు గడువునిచ్చింది. జూన్‌లోపు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయకుంటే దేవాదాయశాఖ కార్యదర్శి స్వయంగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో దేవాదాయ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌లోని దత్తాత్రేయ, నవగ్రహ దేవస్థాన పాలక మండలి హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ప్రభుత్వ వివరణ కోరారు. ట్రిబ్యునల్ ఏర్పాటు పరిశీలనలో ఉందని, 8 వారాల్లో తగిన నిర్ణయం తీసుకుంటామని దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్ కోర్టులో రాతపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ నాగార్జునరెడ్డి 8 వారాల్లో ఎండోమెంట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి, చైర్మన్, సభ్యులను నియమించాలని ఆదేశిస్తూ గత ఏడాది డిసెంబర్ 15న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంతో పిటిషనర్ దేవాదాయశాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని జస్టిస్ నాగార్జునరెడ్డి శుక్రవారం విచారించారు. -
ఆలయాల వద్ద బాణ సంచాపై నిషేధం
దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడి కోరుమిల్లి (కపిలేశ్వరపురం): కేరళ దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ఆలయాల వద్ద బాణసంచా వాడకాన్ని నిషేధించినట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లిలో సోమవారం సోమేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేరళ దుర్ఘటనను తీవ్రంగా పరిగణించి, రాష్ట్రంలో ఆలయాల వద్ద మందుగుండు సామగ్రి వినియోగించడాన్ని నిషేధించామన్నారు. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. -
అర్చకులకు వేతన నిధి!
దేవాదాయ శాఖ పరిపాలనా నిధి నుంచి ఏర్పాటుకు త్రిసభ్య కమిటీ సిఫారసు దేవాదాయ శాఖ పరిధిలోని అర్చకులు, దేవాలయ ఉద్యోగుల వేతనాల సమస్య త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లుగానే తమకూ జీతాలు చెల్లిం చాలంటూ అర్చకులు, ఆలయ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న తరుణంలో దీనిపై ఓ నిర్ణ యం తీసుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ అంశంపై గతంలో నియమించిన త్రిసభ్య కమిటీ తాజాగా నివేదికను అందజేసింది. దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సంచిత నిధి (ఎస్సీఎఫ్) నుంచి... అర్చకులు, దేవాలయ ఉద్యోగులకు దేవాదాయశాఖ పరిపాలన నిధి (ఈఏఎఫ్) నుంచి జీతాలు చెల్లించాలని సూచించింది. ముఖ్యమంత్రి ఆమోదం వస్తే ఈ విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. దీంతో సర్కారుపై దాదాపు ఏటా రూ.20 కోట్ల వరకు భారం పడనుంది. - సాక్షి, హైదరాబాద్ దేవాలయ ఉద్యోగుల డిమాండ్.. దేవాదాయశాఖ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ సంచిత నిధి నుంచి నెలనెలా వేతనాలు చెల్లిస్తుండగా... ఈ వేతనాల మొత్తాన్ని ఏడాదికోసారి దేవాదాయశాఖ తిరిగి ప్రభుత్వానికి రీయింబర్స్ చేస్తోంది. అర్చకులు, దేవాలయ ఉద్యోగులకు ఆయా దేవాలయాల నుంచే నేరుగా జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో తాము వివక్షకు గురవుతున్నామని, తమకు కూడా ట్రెజరీ నుంచే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దేవస్థానాల ఉద్యోగులు, అర్చకులు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు ప్రారంభించారు. గతేడాది ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేసి నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన సర్కారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా... తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. కమిటీ ప్రతిపాదనలు.. దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నేరుగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వానికి రీయింబర్స్ చేసే విధానం నిలిచిపోతుంది. దీంతో దేవాదాయ శాఖకు ఏటా రూ.20 కోట్ల వరకు మిగులుతాయి. ఈ మొత్తాన్ని దేవాదాయశాఖ పరిపాలన నిధికి మళ్లిస్తారు. ప్రతి దేవాలయం తన ఆదాయంలో 12 శాతాన్ని పరిపాలన నిధికి చెల్లిస్తుంది. దీనిని ఇప్పుడు 30 శాతానికి పెంచుతారు. తద్వారా దాదాపు రూ.50 కోట్లు సమకూరుతుంది. ఈ మొత్తాన్ని వేతన నిధిగా రూపొం దించి, అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ఒకేరకంగా వేతనాలను చెల్లిస్తారు. దీన్ని సెక్షన్-65 వేతన నిధిగా పరిగణిస్తారు. చట్టాన్ని సవరించాల్సిందే.. దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే జీతాల మొత్తాన్ని ఏటా దేవాదాయశాఖ తిరిగి రీయింబర్స్ చేయాలని దేవాదాయశాఖ చట్టం సెక్షన్-69 పేర్కొంటోంది. ఇప్పుడు రీయింబర్స్ విధానాన్ని తొలగించేందుకు చట్టాన్ని సవరించాల్సి ఉంది. ఇక సుప్రీంకోర్టు ఓ కేసులో వెలువరించిన తీర్పు ప్రకారం... ఏదైనా ఓ మతానికి సంబంధించిన సంస్థల్లో ప్రభుత్వ నిధులను వేతనాలుగా వినియోగించకూడదు. అందుకే ప్రభుత్వం చెల్లించే జీతాలను దేవాదాయశాఖ రీయింబర్స్ చేస్తోంది. ఇప్పుడా విధానాన్ని మార్చడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమనే వాదన వినిపిస్తోంది. అయితే దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వ నిధులు కేటాయించడం వంటివి ఇప్పటికే అమల్లో ఉన్నందున కొత్త విధానం వల్ల ఇబ్బందేమీ ఉండదనే అభిప్రాయాన్ని త్రిసభ్య కమిటీ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
రాజన్న ఆలయానికి కొత్త శోభ
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి కొత్త రూపును సంతరించుకోనుంది. ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లను 2016-17 బడ్జెట్లో కేటాయించడంతో భక్తుల సౌకర్యార్థం వివిధ పనులు చేపట్టేందుకు దేవాదాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం వాస్తునిపుణులు సాయికమలాకర్శర్మ, జీవీ.వరప్రసాద్, స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ట్‌లు నాగరాజు, ముక్తీశ్వర్, ఈవో దూస రాజేశ్వర్, ఇంజనీరింగ్ అధికారులు రాజయ్య, రఘునందన్ రాజన్న గుడి, ధర్మగుండం, గుడి చెరువు ప్రాంతాలను పరిశీలించారు. రూ.410 కోట్లతో ప్రణాళికలు రూపొందించిన మ్యాప్‌లను, రాజన్నగుడి రెండో ప్రాకారం, కల్యాణమండపాలు, నాలుగు దిక్కులా గాలి గోపురాలు, కల్యాణకట్ట, క్యూకాంప్లెక్సులు, రెండో ధర్మగుండం తదితర అంశాలను క్షుణ్ణంగా పరి శీలించారు. రాజన్న గుడి చెరువు కోసం 30 ఎకరాల స్థలాన్ని తీసుకుంటున్న క్రమంలో ఆరు ఎకరాల్లో రాజన్న గుడి రెండో ప్రాకారం, మిగతా 24 ఎకరాల్లో చెరువు, భక్తులకు ఇతర సౌకర్యాలకు వినియోగించనున్నారు. మాడవీధులు.. గాలి గోపురాలు రాజన్న సన్నిధిలో జరుపుకునే ఉత్సవాల సందర్భంగా స్వామివారలను ఊరేగించేందుకు మాడవీధులను ఏర్పాటు చేయాలనే అంశాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. 150 అడుగులతో చేపట్టే ట్యాంక్‌బండ్‌పైకి భక్తులు నేరుగా చేరుకుని అక్కడినుంచి స్వామివారి సన్నిధికి ఎలా చేరుకోవాలి, కోనేరు ఎక్కడ నిర్మించాలి, కల్యాణకట్ట ఎక్కడుండాలి, ఎక్కడినుంచి క్యూ కాంప్లెక్సుకు చేరుకోవాలి, స్వామివారి దర్శనానికి ఎలా వెళ్లాలి అనే అంశాలను చర్చించారు. ఆలయానికి 4 వైపులా గాలిగోపురాలు, భక్తులు కూర్చునేందుకు వీలుగా కైలాసం క్యూకాంప్లెక్సులు, ఉత్సవాల కోసం ప్రత్యేక కల్యాణ మండపాలు నిర్మించనున్నారు. రాజన్న గుడిలోని స్వామివారు కొలువై ఉన్న ప్రధాన ఆలయాన్ని ముట్టుకోకుండానే అభివృద్ధి పనులు చేపడతామని వాస్తు నిపుణులు సాయి కమలాకర్‌శర్మ అన్నారు. రాజన్న గుడిని వాస్తు ప్రకారం విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నామని వాస్తు నిపుణులు జీవీ వరప్రసాద్ తెలిపారు. ఆరెకరాల్లో రెండో ప్రాకా రం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. వాస్తునిపుణులు, పండితులు, ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీరింగ్ అధికారులు, స్థపతి అంతా కలసి రాజన్న గుడి పరిసరాలు, చేపట్టబోయే పనులపై సుదర్ఘంగా చర్చలు, మంతనాలు జరిపారు. తుది నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తామని, అనుమతులు పొందిన తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయగం తెలిపారు. -
‘పుష్కరాలకు’ పరుగులు
ఏటూరునాగారం : తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది జూలై 14 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా పుష్కరాల నిర్వహణకు 17 శాఖలు సుమారు రూ. 28 కోట్ల ప్రతిపాదనలు రూపొందించాయి. కాగా, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి తీరం వెంట పుష్కర ఘాట్లను నిర్మించేందుకు ఆయా శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతీ రోజు లక్షా యాభై వేల మంది భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. 12 ఏళ్ల క్రితం జరిగిన గోదావరి పుష్కరాలకు అప్పటి ప్రభుత్వం ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం వద్ద 20 మీటర్ల వెడల్పుతో ఘాట్, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 20 లక్షలు వెచ్చిం చింది. ఈ క్రమంలో ప్రస్తుతం ముల్లకట్ట గోదావరి తీరంలోని జాతీయ రహదారి వంతెనకు ఇరువైపులా వంద మీటర్ల చొప్పున ఘాట్ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే మంగపేట వద్ద 100, మల్లూరు వద్ద మరో 100 మీటర్ల పుష్కరఘాట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాగా, రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఇప్పటికే ఉన్న 20 మీటర్లతోపాటు మరో పది మీటర్ల మేర కు విస్తరించనుంది. అయితే ఈ నిర్వహ ణ పూర్తిగా ఎండోమెంట్‌శాఖ ఆధ్వర్యం లో చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 13.56 కోట్లతో ప్రతిపాదనలు.. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌ను ఏర్పాటు చేసేం దుకు నీటిపారుదల శాఖ రూ. 13.56 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో ముల్లకట్ట వద్ద 200 మీటర్ల ఘాట్‌తోపాటు ఇన్‌ఫిల్టరేషన్ బావి, మహిళల డ్రెస్సింగ్ రూముల కోసం రూ.7 కోట్లు, రామన్నగూడెం వద్ద పది మీటర్ల విస్తరణతో పాటు ఒక ఇన్‌ఫిల్టరేషన్ బావి, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కోసం రూ.36 లక్షలు, మంగపే ట వద్ద రూ.3.10 కోట్లు, మల్లూరు వద్ద రూ.3.10 కోట్ల వ్యయంతో ఘాట్లు, బ్యా టరీ ఆఫ్ ట్యాప్స్, డ్రెసింగ్ రూములు, బావులను ఏర్పాటు నిర్మించనుంది. రూ. 8.93 కోట్లతో పంచాయతీరాజ్‌శాఖ.. రూ. 8.93 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మాణం చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ. కోటితో రోడ్లు, భవనాలశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. రెవెన్యూశాఖ ద్వారా రూ. 50 లక్షలు, ఆర్డబ్ల్యూఎస్ రూ.కోటి, ట్రాన్స్‌కో రూ. 36.64 లక్షలు, దేవాదాయశాఖ రూ. 1.13 కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖ రూ. 19.17 లక్షలు, జిల్లా పంచాయతీ అధికారి ద్వారా రూ. 25 లక్షలు, ఆర్టీసీ రూ. 19.67 లక్షలు, టూరిజం విభాగం రూ. 15 లక్షలు మత్స్యశాఖ రూ. 8.58 లక్ష లు, అగ్నిమాపక శాఖ రూ.6.43 లక్షలు, ఎక్సైజ్‌శాఖ రూ. 2 లక్షలు, సమాచార పౌర సంబంధాలశాఖ రూ.50 లక్షలు, ఐసీడీఎస్ ద్వారా రూ.3 లక్షలతో ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. రహదారి సిద్ధమయ్యేనా..? గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు ఎక్కువగా జాతీయ రహదారి మీదుగా వస్తుంటారు. అయితే పస్రా నుంచి ఏటూరునాగారం వరకు రోడ్డు విస్తరణ కు రూ.39 కోట్లు ఇప్పటికే మంజూరైన విషయం తెలిసిందే. అయితే ఈ పనుల కు టెండర్లు నిర్వహించి జూలై 14 వరకు పూర్తి అయ్యే పరిస్థితి లేకపోవడంతో కనీ సం మరమ్మతులైనా చేయాల్సిన అవస రం ఉంది. లేని పక్షంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. ఆలయ నిర్మాణానికి సన్నాహాలు.. ప్రధానంగా గోదావరి పుష్కరాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ఆలయాలు ఎంతో అవసరం. జాతీయ రహదారి వం తెన నిర్మాణ ప్రవేశం వద్ద చేపట్టే పుష్కరఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేసే భక్తులకు ఆలయం అందుబాటులో లేదు. శివాలయం, గంగాలమ్మ నిర్మా ణం కోసం ప్రణాళికలను సిద్ధం చేశారు. అలాగే గతంలో ఉన్న రామన్నగూడెం వద్ద గంగాలమ్మ ఆలయ అభివృద్ధికి కోసం ప్రతిపాదనల్లో నిధులు కేటాయిం చకపోవడం బాధాకరం. అలాగే ప్రతిపాదనల్లో ముల్లకట్ట, రామన్నగూడెం గ్రామాల్లో ఉన్న అంతర్గత రోడ్ల అభివృద్ధి ఊసెత్తలేదు. -
ఆ బదిలీ రేటు అరకోటి
దేవాదాయశాఖ బదిలీలు కొందరు నేతలకు ‘ప్రసాదం’గా మారాయి. సీట్లకు రేట్లు కట్టి.. సొంతానికి సొమ్ములు మూటకట్టుకున్నారు. నిబంధనలకు పాతరేసి, తమ చేతులు తడిపిన వారిని కోరిన సీట్లో ప్రతిష్టించారు. నిబంధనల ప్రకారం మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారు ఏ స్థాయిలో ఉన్నా విధిగా బదిలీ చేయాలి. కానీ ఆ ఉత్తర్వులను జిల్లాలో మెట్ట ప్రాంతానికి చెందిన ఒక ముఖ్యనేత సోదరుడు తుంగలో తొక్కి భారీ నజరానాలు ముట్టజెప్పిన వారికి కోరుకున్న పోస్టులు కట్టబెట్టారు. * దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పోస్టుతో దందా * చక్రం తిప్పిన తెలుగుదేశం ముఖ్యనేత సోదరుడు * పదోన్నతి సాకుతో డీసీ కేడర్ అధికారికి అడ్డంకి * ఈఓల బదిలీల్లోనూ ఇష్టారాజ్యం, అడ్డగోలుతనం సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయశాఖ బదిలీలు .. అవినీతి సొమ్ములను మరిగిన వారికి అనుకోని వరంగా కలిసి వచ్చాయి. నచ్చిన వారిని అందలమెక్కించి అందినకాడికి సొమ్ము చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఆశించిన స్థానాలను పందేరం చేశారు. ఈ క్రమంలోనే ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో దేవాలయాలను పర్యవేక్షించే కాకినాడ డిప్యూటీ కమిషనర్ (డీసీ) పోస్టులో బదిలీకి రూ.అరకోటి వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్చార్జి డీసీ (ఎఫ్ఏసీ)గా లోవ దేవస్థానం ఈఓ గాదిరాజు సూరిబాబురాజు వ్యవహరిస్తున్నారు. ఆయనది అసిస్టెంట్ కమిషనర్ కేడర్. తాజా బదిలీల్లో విశాఖపట్నం కనక మహాలక్ష్మి దేవస్థానం ఈఓగా డీసీ కేడర్‌లో పని చేస్తున్న భ్రమరాంబను బదిలీ చేస్తూ జీఓ కూడా విడుదలైంది. ఇక కాకినాడ వచ్చి బాధ్యతలు చేపట్టడమే మిగిలిందనుకుంటున్న తరుణంలో మెట్ట ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత సోదరుడు చక్రం తిప్పి ఆమె బదిలీకి మోకాలడ్డారని ఆరోపణ వినిపిస్తోంది. భ్రమరాంబకు అడ్డుపడటానికి ఇప్పుడున్న వారినే కొనసాగించాలన్నదే కారణమంటున్నారు. త్వరలో ఆర్జేసీగా పదోన్నతి లభిస్తుందన్న సాకుతో భ్రమరాంబను అడ్డుకున్న వ్యవహారంలో రూ.అరకోటి చేతులు మారినట్టు సమాచారం. పదోన్నతి సాకుగా చూపి ఆమెను అడ్డుకున్న నేతలకు, ఇందుకు సహకరించిన ఉన్నతాధికారులకు.. ఏసీగా పదోన్నతి జాబితాలో ఉన్న ఉమామహేశ్వరరావును కాకినాడ బాలాత్రిపురసుందరి దేవస్థానం ఈఓగా బదిలీ చేయడం గురించి ఏమంటారని ఆ శాఖ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. కౌన్సెలింగ్‌లో లేని వారికీ స్థానచలనం.. ఇక పలువురు గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కార్య నిర్వహణాధికారుల (ఈఓ) బదిలీల్లోనూ అవినీతి బాగోతాలు జరిగాయి. జిల్లాలో ఎనిమిది మంది గ్రేడ్-1 ఈఓలను నాలుగు రోజుల క్రితం కౌన్సెలింగ్‌కు పిలిచారు. వారిలో కేవలం ఇద్దరినే (ఉమామహేశ్వరరావు, ద్రాక్షారామ ఈఓ ప్రసాద్) బదిలీ చేశారు. బిక్కవోలు గ్రూపు టెంపుల్స్ ఈఓగానూ, కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్ ఇన్చార్జిగానూ ఉన్న ఉమామహేశ్వరరావును బాలాత్రిపురసుందరి దేవస్థానం ఈఓగా బదిలీచేశారు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని మాత్రమే బదిలీ చేయాల్సి ఉండగా ఏడాదిన్నర కూడా పూర్తకాకున్నా, కౌన్సెలింగ్ జాబితాలో పేరులేకున్నా పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఈఓ కొండలరావు, బాలాత్రిపుర సుందరి దేవస్థానం ఈఓ సీహెచ్ విజయభాస్కర్రెడ్డిలను అడ్డగోలుగా బదిలీ చేశారు. బిక్కవోలు గ్రూపు టెంపుల్స్, కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్‌తో కలిపి సుమారు 30 దేవాలయాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఉమామహేశ్వరరావు బదిలీ వెనుక పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయంటున్నారు. బాలాత్రిపురసుందరి ఆలయ ప్రాధాన్యం దృష్ట్యా ఎప్పుడూ పూర్తిస్థాయి ఈఓనే ఉండేవారు. అలాంటిది గత చైర్మన్ హయాంలో పని చేసిన ఉద్యోగులందరినీ బదిలీ చేయాలన్న అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గక పోవడంతోనే ఆయనను అడ్డగోలుగా బదిలీ చేసినట్టు చెపుతున్నారు. అవినీతి అధికారులకు అండ.. పెద్దాపురం ఆర్వీబీఎస్ సత్రం ఈఓ నారాయణమూర్తి, కాండ్రకోట నూకాలమ్మ దేవస్థానం ఈఓ నాగమల్లేశ్వరరావు మూడేళ్లు పైబడే పనిచేస్తున్నారు. తమకు రాత్రి పూట భోజనం పెట్టకుండానే సొమ్ములు స్వాహా చేస్తున్నారని నారాయణమూర్తిపై విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్జేసీ విచారణ కూడా నిర్వహించారు. అలాంటి ఈఓ బదిలీ కాకుండా అడ్డుపడ్డారని, దాని వెనుక ఏమి జరిగి ఉంటుందోప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని దేవాదాయశాఖ ఉద్యోగులు అంటున్నారు. డిప్యుటేషన్‌పై కాకినాడ ఆర్జేసీ కార్యాలయంలో పని చేస్తున్న బంగారు శోభనాద్రి సత్రం ఈఓ గంగారావు పేరు కౌన్సెలింగ్ జాబితాలో ఉంది. ఆయన మూడేళ్లకు పైబడి ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ బదిలీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ రకంగా అడ్డగోలు బదిలీలతో దేవాదాయశాఖ ప్రతిష్ట మంట గలుస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుష్కరశోభ కు కసరత్తు
- నేడు పుష్కరాల ప్రణాళికపై సమీక్ష - నిధులపై భారీ ఆశలు - దేవాదాయశాఖ ప్రణాళికలు సిద్ధం - 2015 జూలై 14 నుంచి ప్రారంభం జగిత్యాల: గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు అధికారయంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటి నుంచే పకడ్బందీ ఏర్పాట్లకు సిబ్బందిని సన్నద్ధం చేస్తోంది. ఈ ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల ఆల య కమిటీలు ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. వచ్చే ఏడాది జరిగే పుష్కరాల ఏర్పాట్లను ఇప్పటికే దేవాదాయశాఖ అధికారులుపరిశీలించారు. ధర్మపురిలో పుష్కర ఏర్పాట్లను ఆర్డీవో ఎస్. పద్మాకర్ ఆదివారం పరిశీలించారు. 12 రోజులు పండగే.. 2003 జూలై 30 నుంచి 12 రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు జిల్లాలోని మల్లాపూర్ మండ లం వాల్గొండ, ధర్మపురి, కాళేశ్వరం, మంథని, కోటిలింగాల ప్రాంతంలో పుష్కరాలు జరిగాయి. ఆదిలాబాద్‌లో ప్రధానంగా బాసర, గూడెం, మంచిర్యాల ప్రాంతాల్లో జరిగాయి. ఈసారి 14 జూలై 2015 నుంచి 12 రోజులు తెలంగాణలో తొలిసారి గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో పుష్కరాలు జరుగనున్నాయి. రూ. 300 కోట్ల ప్రతిపాదనలు వచ్చే పుష్కరాల ఏర్పాట్ల కోసం జిల్లా నుంచి రూ.300 కోట్ల ప్రతిపాదలను వెళ్లనున్నాయి. ప్రధానంగా ధర్మపురి. కాళేశ్వరం, మంథని, కోటిలింగాల, వాల్గొండతోపాటు గోదావరిలో పుష్కరస్నానాలకు అనువుగా ఉండే ఇతర ప్రాంతాలను గుర్తించి అక్కడా తాత్కాలిక ఏర్పాట్లకు దేవాదాయ, ఇతర శాఖలు రూ.300 కోట్ల ప్రతిపాదనలు తయారు చేసినట్లు సమాచారం. ధర్మపురిలోని పుష్కర ఘాట్లు పెంచడం, కొత్తగా ఘాట్ల నిర్మాణాలపై ఆర్డీవో పద్మాకర్ దృష్టి సారించారు. ధర్మపురిలో ఐదు కిలో మీటర్ల మేరకు భారీ వాహనాలు లోనికి రాకుండా, పుష్కర ప్రాంతాల్లో పంటలకు క్రాప్ హాలిడే ఇవ్వాలని ఆయన కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం అధికారులు అప్రమత్తంగా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ నిధులు ఇప్పిస్తారనే ఆశలో స్థానిక అధికారులు ఉన్నారు. రూ. 500 కోట్లు ఇస్తానన్న సీఎం 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలకు లక్షలాది మంది పుష్కరస్నానాలు చేయడానికి వస్తారు. గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల ఖర్చు చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బహిరంగ సభలో ప్రకటించారు. జిల్లాకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారో చూడాలి. పుష్కరాల అభివృద్ధి ప్రణాళికల ఇదీ.. - ధర్మపురి ఆలయంలో శ్రద్ధ మండపంతోపాటు కోనేరు(బ్రహ్మపుష్కరణి) శుభ్రత, మరమ్మతు, దేవాలయంలో ఆవరణలో కొత్త నిర్మాణాలు, పాతవాటిని తొలగించిన కొత్తగా ఏర్పాటు చేయడం - పుష్కరాల సందర్భంగా తాత్కాలికంగా చలువ పందిళ్లు, షామియానాల ఏర్పాట్లు - గోదావరినది 500 మంది కేపాసిటీ కలిగిన కేశఖండనశాలల నిర్మాణం - విద్యుత్ సౌకర్యాలు, క్లాక్ రూముల ఏర్పాటు - దేవాలయానికి రంగులు, ధర్మశాలకు సున్నం వేయడం - వివిధ రూట్ మ్యాపులు, హెచ్చరిక బోర్డులు, సూచనల ప్లకార్డుల ఏర్పాటు - లడ్డు/పులిహోర ప్రసాద విక్రయకేంద్రాల ఏర్పాట్లు - 32 గదుల్లో వీఐపీలకు సేవలకు అవసరమైన సిబ్బంది. ప్రచార ఏర్పాట్లు. దేవాలయ భద్రతతోపాటు ప్రముఖల భద్రత ఏర్పాట్లు. - క్యూలైన్లు - 12 రోజులు నిరంతర అన్నదానం ఇతర ఏర్పాట్లకు ప్రణాళికలు - గోదావరినది ఒడ్డున జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని దేవాలయాల నిర్మాణం - గోదావరిలోని పుష్కర ఘాట్ల విస్తరణ, అదనంగా ఘాట్ల నిర్మాణం - గోదావరి నదిలో బారికేడ్ల నిర్మాణం - ప్రధాన జాతీయ రహదారి మరమ్మతులు - బాత్రూంలు, టాయిలెట్ల నిర్మాణాలు - శానిటేషన్‌కు ప్రత్యేక విభాగం ఏర్పాటు - మంచినీటి వసతి మెరుగుపరచడం - పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చింతమణి చెరువును తీర్చిదిద్దడం - వైద్యసౌకర్యాల కల్పనకు చర్యలు, గజ ఈతగాళ్ల ఎంపిక - వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను తిప్పడం - పోలీసుల బందోబస్తుకు ప్రత్యేక బలగాలు ఎక్సైజ్‌శాఖ మద్యనిషేధాన్ని కొనసాగించడం. వీటన్నింటికి వివిధ శాఖలకు నిధుల కేటాయింపు కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంది