దేవాదాయశాఖ బదిలీలు .. అవినీతి సొమ్ములను మరిగిన వారికి అనుకోని వరంగా కలిసి వచ్చాయి. నచ్చిన వారిని అందలమెక్కించి అందినకాడికి సొమ్ము చేసుకున్నారు.
దేవాదాయశాఖ బదిలీలు కొందరు నేతలకు ‘ప్రసాదం’గా మారాయి. సీట్లకు రేట్లు కట్టి.. సొంతానికి సొమ్ములు మూటకట్టుకున్నారు. నిబంధనలకు పాతరేసి, తమ చేతులు తడిపిన వారిని కోరిన సీట్లో ప్రతిష్టించారు. నిబంధనల ప్రకారం మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారు ఏ స్థాయిలో ఉన్నా విధిగా బదిలీ చేయాలి. కానీ ఆ ఉత్తర్వులను జిల్లాలో మెట్ట ప్రాంతానికి చెందిన ఒక ముఖ్యనేత సోదరుడు తుంగలో తొక్కి భారీ నజరానాలు ముట్టజెప్పిన వారికి కోరుకున్న పోస్టులు కట్టబెట్టారు.
* దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పోస్టుతో దందా
* చక్రం తిప్పిన తెలుగుదేశం ముఖ్యనేత సోదరుడు
* పదోన్నతి సాకుతో డీసీ కేడర్ అధికారికి అడ్డంకి
* ఈఓల బదిలీల్లోనూ ఇష్టారాజ్యం, అడ్డగోలుతనం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేవాదాయశాఖ బదిలీలు .. అవినీతి సొమ్ములను మరిగిన వారికి అనుకోని వరంగా కలిసి వచ్చాయి. నచ్చిన వారిని అందలమెక్కించి అందినకాడికి సొమ్ము చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఆశించిన స్థానాలను పందేరం చేశారు. ఈ క్రమంలోనే ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో దేవాలయాలను పర్యవేక్షించే కాకినాడ డిప్యూటీ కమిషనర్ (డీసీ) పోస్టులో బదిలీకి రూ.అరకోటి వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్‌చార్జి డీసీ (ఎఫ్‌ఏసీ)గా లోవ దేవస్థానం ఈఓ గాదిరాజు సూరిబాబురాజు వ్యవహరిస్తున్నారు.
ఆయనది అసిస్టెంట్ కమిషనర్ కేడర్. తాజా బదిలీల్లో విశాఖపట్నం కనక మహాలక్ష్మి దేవస్థానం ఈఓగా డీసీ కేడర్‌లో పని చేస్తున్న భ్రమరాంబను బదిలీ చేస్తూ జీఓ కూడా విడుదలైంది. ఇక కాకినాడ వచ్చి బాధ్యతలు చేపట్టడమే మిగిలిందనుకుంటున్న తరుణంలో మెట్ట ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత సోదరుడు చక్రం తిప్పి ఆమె బదిలీకి మోకాలడ్డారని ఆరోపణ వినిపిస్తోంది. భ్రమరాంబకు అడ్డుపడటానికి ఇప్పుడున్న వారినే కొనసాగించాలన్నదే కారణమంటున్నారు.
త్వరలో ఆర్‌జేసీగా పదోన్నతి లభిస్తుందన్న సాకుతో భ్రమరాంబను అడ్డుకున్న వ్యవహారంలో రూ.అరకోటి చేతులు మారినట్టు సమాచారం. పదోన్నతి సాకుగా చూపి ఆమెను అడ్డుకున్న నేతలకు, ఇందుకు సహకరించిన ఉన్నతాధికారులకు.. ఏసీగా పదోన్నతి జాబితాలో ఉన్న ఉమామహేశ్వరరావును కాకినాడ బాలాత్రిపురసుందరి దేవస్థానం ఈఓగా బదిలీ చేయడం గురించి ఏమంటారని ఆ శాఖ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.
కౌన్సెలింగ్‌లో లేని వారికీ స్థానచలనం..
ఇక పలువురు గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కార్య నిర్వహణాధికారుల (ఈఓ) బదిలీల్లోనూ అవినీతి బాగోతాలు జరిగాయి. జిల్లాలో ఎనిమిది మంది గ్రేడ్-1 ఈఓలను నాలుగు రోజుల క్రితం కౌన్సెలింగ్‌కు పిలిచారు. వారిలో కేవలం ఇద్దరినే (ఉమామహేశ్వరరావు, ద్రాక్షారామ ఈఓ ప్రసాద్) బదిలీ చేశారు. బిక్కవోలు గ్రూపు టెంపుల్స్ ఈఓగానూ, కాకినాడ ఎంఎస్‌ఎన్ చారిటీస్ ఇన్‌చార్జిగానూ ఉన్న ఉమామహేశ్వరరావును బాలాత్రిపురసుందరి దేవస్థానం ఈఓగా బదిలీచేశారు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని మాత్రమే బదిలీ చేయాల్సి ఉండగా ఏడాదిన్నర కూడా పూర్తకాకున్నా, కౌన్సెలింగ్ జాబితాలో పేరులేకున్నా పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి ఈఓ కొండలరావు, బాలాత్రిపుర సుందరి దేవస్థానం ఈఓ సీహెచ్ విజయభాస్కర్‌రెడ్డిలను అడ్డగోలుగా బదిలీ చేశారు.
బిక్కవోలు గ్రూపు టెంపుల్స్, కాకినాడ ఎంఎస్‌ఎన్ చారిటీస్‌తో కలిపి సుమారు 30 దేవాలయాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఉమామహేశ్వరరావు బదిలీ వెనుక పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయంటున్నారు. బాలాత్రిపురసుందరి ఆలయ ప్రాధాన్యం దృష్ట్యా ఎప్పుడూ పూర్తిస్థాయి ఈఓనే ఉండేవారు. అలాంటిది గత చైర్మన్ హయాంలో పని చేసిన ఉద్యోగులందరినీ బదిలీ చేయాలన్న అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గక పోవడంతోనే ఆయనను అడ్డగోలుగా బదిలీ చేసినట్టు చెపుతున్నారు.
అవినీతి అధికారులకు అండ..
పెద్దాపురం ఆర్వీబీఎస్ సత్రం ఈఓ నారాయణమూర్తి, కాండ్రకోట నూకాలమ్మ దేవస్థానం ఈఓ నాగమల్లేశ్వరరావు మూడేళ్లు పైబడే పనిచేస్తున్నారు. తమకు రాత్రి పూట భోజనం పెట్టకుండానే సొమ్ములు స్వాహా చేస్తున్నారని నారాయణమూర్తిపై విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్‌జేసీ విచారణ కూడా నిర్వహించారు. అలాంటి ఈఓ బదిలీ కాకుండా అడ్డుపడ్డారని, దాని వెనుక ఏమి జరిగి ఉంటుందోప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని దేవాదాయశాఖ ఉద్యోగులు అంటున్నారు.
డిప్యుటేషన్‌పై కాకినాడ ఆర్‌జేసీ కార్యాలయంలో పని చేస్తున్న బంగారు శోభనాద్రి సత్రం ఈఓ గంగారావు పేరు కౌన్సెలింగ్ జాబితాలో ఉంది. ఆయన మూడేళ్లకు పైబడి ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ బదిలీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ రకంగా అడ్డగోలు బదిలీలతో దేవాదాయశాఖ ప్రతిష్ట మంట గలుస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.