అర్చకులకు వేతన నిధి! | Pay treasure to the priests ! | Sakshi
Sakshi News home page

అర్చకులకు వేతన నిధి!

Published Sun, Apr 3 2016 3:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

అర్చకులకు వేతన నిధి!

అర్చకులకు వేతన నిధి!

దేవాదాయ శాఖ పరిపాలనా నిధి నుంచి ఏర్పాటుకు త్రిసభ్య కమిటీ సిఫారసు
 

 దేవాదాయ శాఖ పరిధిలోని అర్చకులు, దేవాలయ ఉద్యోగుల వేతనాల సమస్య త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లుగానే తమకూ జీతాలు చెల్లిం చాలంటూ అర్చకులు, ఆలయ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న తరుణంలో దీనిపై ఓ నిర్ణ యం తీసుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ అంశంపై గతంలో నియమించిన త్రిసభ్య కమిటీ తాజాగా నివేదికను అందజేసింది. దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సంచిత నిధి (ఎస్‌సీఎఫ్) నుంచి... అర్చకులు, దేవాలయ ఉద్యోగులకు దేవాదాయశాఖ పరిపాలన నిధి (ఈఏఎఫ్) నుంచి జీతాలు చెల్లించాలని సూచించింది. ముఖ్యమంత్రి ఆమోదం వస్తే ఈ విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. దీంతో సర్కారుపై దాదాపు ఏటా రూ.20 కోట్ల వరకు భారం పడనుంది.
- సాక్షి, హైదరాబాద్
 
 దేవాలయ ఉద్యోగుల డిమాండ్..
 దేవాదాయశాఖ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ సంచిత నిధి నుంచి నెలనెలా వేతనాలు చెల్లిస్తుండగా... ఈ వేతనాల మొత్తాన్ని ఏడాదికోసారి దేవాదాయశాఖ తిరిగి ప్రభుత్వానికి రీయింబర్స్ చేస్తోంది. అర్చకులు, దేవాలయ ఉద్యోగులకు ఆయా దేవాలయాల నుంచే నేరుగా జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో తాము వివక్షకు గురవుతున్నామని, తమకు కూడా ట్రెజరీ నుంచే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దేవస్థానాల ఉద్యోగులు, అర్చకులు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు ప్రారంభించారు. గతేడాది ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేసి నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన సర్కారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా... తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
 
 కమిటీ ప్రతిపాదనలు..
 దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నేరుగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వానికి రీయింబర్స్ చేసే విధానం నిలిచిపోతుంది. దీంతో దేవాదాయ శాఖకు ఏటా రూ.20 కోట్ల వరకు మిగులుతాయి. ఈ మొత్తాన్ని దేవాదాయశాఖ పరిపాలన నిధికి మళ్లిస్తారు. ప్రతి దేవాలయం తన ఆదాయంలో 12 శాతాన్ని పరిపాలన నిధికి చెల్లిస్తుంది. దీనిని ఇప్పుడు 30 శాతానికి పెంచుతారు. తద్వారా దాదాపు రూ.50 కోట్లు సమకూరుతుంది. ఈ మొత్తాన్ని వేతన నిధిగా రూపొం దించి, అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ఒకేరకంగా వేతనాలను చెల్లిస్తారు. దీన్ని సెక్షన్-65 వేతన నిధిగా పరిగణిస్తారు.
 
 చట్టాన్ని సవరించాల్సిందే..
 దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే జీతాల మొత్తాన్ని ఏటా దేవాదాయశాఖ తిరిగి రీయింబర్స్ చేయాలని దేవాదాయశాఖ చట్టం సెక్షన్-69 పేర్కొంటోంది. ఇప్పుడు రీయింబర్స్ విధానాన్ని తొలగించేందుకు చట్టాన్ని సవరించాల్సి ఉంది. ఇక సుప్రీంకోర్టు ఓ కేసులో వెలువరించిన తీర్పు ప్రకారం... ఏదైనా ఓ మతానికి సంబంధించిన సంస్థల్లో ప్రభుత్వ నిధులను వేతనాలుగా వినియోగించకూడదు. అందుకే ప్రభుత్వం చెల్లించే జీతాలను దేవాదాయశాఖ రీయింబర్స్ చేస్తోంది. ఇప్పుడా విధానాన్ని మార్చడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమనే వాదన వినిపిస్తోంది. అయితే దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వ నిధులు కేటాయించడం వంటివి ఇప్పటికే అమల్లో ఉన్నందున కొత్త విధానం వల్ల ఇబ్బందేమీ ఉండదనే అభిప్రాయాన్ని త్రిసభ్య కమిటీ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement