
త్వరలో సీజేఐకి నివేదిక
ఆరోపణలు తేలితే ఉద్వాసన!
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నగదు దొరికిన ఘటనపై దర్యాప్తు కోసం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చురుగ్గా వ్యవహరిస్తోంది. తొలి దశ దర్యాప్తును ఇప్పటికే పూర్తిచేసింది. విచారణ కీలకమైన రెండో దశకు చేరినట్లు తెలిసింది. ఈ దశలో లభించే సాక్ష్యాధారాలే జస్టిస్ వర్మ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.
త్రిసభ్య కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ జీఎస్ సంధావాలియా, కర్నాటక హైకోర్టు సీజే జస్టిస్ అనూ శివరామన్ ఉన్న విషయం తెలిసిందే. కమిటీ దర్యాప్తును సీజేఐ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. తొలి దశ దర్యాప్తులో ఫిర్యాదు ఆధారంగా కొందరు సాక్షులను మాత్రమే ప్రశ్నించారు. అందులో తేలిన అంశాల ఆధారంగా రెండో దశలో మరింత లోతుగా విచారిస్తున్నారు.
విచారణ పూర్తవగానే సీజేఐకి కమిటీ నివేదిక సమర్పించనుంది. ఇందుకు గడువేమీ నిర్దేశించలేదు. జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరికిందన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. కాలిపోయినట్లు చెబుతున్న నోట్ల కట్టల వీడియోలు, ఫొటోలను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉపాధ్యాయకు పోలీసు కమిషనర్ అందజేశారు. వాటిని ఆయన సుప్రీంకోర్టుకు సమరి్పంచారు. ఇందుకు సంబంధించి శనివారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలు, ఫొటోలు సంచలనం సృష్టించాయి.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 14న జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం సందర్భంగా తమ సిబ్బందికి అక్కడ నోట్ల కట్టలేవీ దొరకలేదని ఢిల్లీ ఫైర్ సరీ్వసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తొలుత ప్రకటించారు. తానలా అనలేదంటూ మర్నాడే వివరణ ఇచ్చారు. నోట్ల కట్టల విషయం నిజమేనని తేలితే జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ సిఫార్సు చేయవచ్చు. అనంతరం పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా హైకోర్టు న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించవచ్చు.
సీజేఐ ఖన్నాపై ప్రశంసల వర్షం
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నగదుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, కీలక డాక్యుమెంట్లను సుప్రీంకోర్టు ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావడం గొప్ప విషయమని న్యాయ నిపుణులు అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఇది చాలా అరుదైన ఘటన. ఇలాంటి ఉదంతాల్లో వివరాలను సాధారణంగా గోప్యంగా ఉంచుతుంటారు. కానీ వాటిని వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో తేవడం ద్వారా గొప్ప సంస్కరణకు సీజేఐ శ్రీకారం చుట్టారు.
ఆయనకు మా సెల్యూట్’’ అని సీనియర్ అడ్వొకేట్లు సంజయ్ హెగ్డే, ఇందిరా జైసింగ్, ఆదిష్ సి.అగర్వాల్ తదితరులు అభినందించారు. జస్టిస్ వర్మపై అంతర్గత విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటును కూడా ప్రశంసించారు. జస్టిస్ వర్మ ఇంట్లో దొరికిన డబ్బు కట్టల వీడియోను చూసి ఆందోళన చెందానని ఆదిష్ చెప్పారు. పెద్ద మొత్తంలో నగదు కాలిపోయిన స్థితిలో దొరకడం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గుతేలాలని సీనియర్ న్యాయవాది మార్కండేయ ఖట్జూ అన్నారు.
నాపై కుట్రలు: జస్టిస్ వర్మ
నా ఇంట్లో ఎలాంటి నగదూ దొరకలేదు
కాలిపోయాయంటున్న నోట్లతో సంబంధం లేదు
నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే నిరాధార ఆరోపణలు
న్యూఢిల్లీ: తన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం తర్వాత నోట్ల కట్టలేవీ లభించలేదని, తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తేల్చిచెప్పారు. పెద్ద ఎత్తున నగదు లభ్యమైనట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. నిరాధార ఆరోపణలతో తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.కె.ఉపాధ్యాయకు ఆయన లేఖ రాశారు. ఆ నోట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అవి అక్కడికెలా వచ్చాయో తనకు తెలియదన్నారు.
‘‘అగ్నిప్రమాదం జరిగిన రోజు నేను ఇంట్లో లేను. ప్రమాదం తర్వాత స్టోర్‌రూంలో కాలిన కరెన్సీ నోట్ల కట్టలను అధికారులు తొలగించడం గానీ, స్వాదీనం చేసుకోవడం గానీ జరగలేదని నా కుమార్తె, సిబ్బంది చెప్పారు. కాలిన నోట్లను అధికారులు నా కుటుంబసభ్యులకు చూపలేదు. ఆ నోట్లను వారు బయటకు తీసుకెళ్లినట్లు నా కుటుంబీకులు చూడలేదు. నాకు గానీ, నా కుటుంబీకులకు గానీ స్టోర్‌రూంలో నగదు భద్రపర్చే అలవాటు లేదు.
ఆ గదిలో మంటల్లో పాక్షికంగా కాలిన నగదు దొరికినట్లు చెప్పడం పూర్తిగా అర్థరహితం, అసంబద్ధం. దీని వెనక కుట్ర ఉంది’’ అని ఆరోపించారు. అందరూ స్వేచ్ఛగా తిరిగే స్టోర్‌రూంలో ఎవరైనా భారీగా నగదు దాస్తారా అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు లేని నోట్లు తర్వాత అక్కడెలా ప్రత్యక్షమయ్యాయో దర్యాప్తు అధికారులే తేల్చాలన్నారు. ‘‘మేం బ్యాంకు ఖాతాల నుంచే ఆర్థిక లావాదేవీలు చేస్తుంటాం. నగదు అవసరమైనప్పుడు బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తుంటాం. వాటికి అన్ని లెక్కలూ ఉన్నాయి’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment