
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా శనివారం త్రిసభ్య కమిటీ నియమించారు. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్‌ను సభ్యులుగా నియమించారు.
మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మకు ఎలాంటి న్యాయ సంబంధిత విధులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు.
సీజేఐకి నివేదిక సమర్పించిన జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ
జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు లభ్యమైన ఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ తమ నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు లభించడంపై జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ అంతర్గత విచారణ చేపట్టారు. సాక్ష్యాధారాలు, సమాచారం సేకరించారు. సంబంధిత అధికారులతో చర్చించారు. అన్ని అంశాలతో నివేదిక సిద్ధం చేసి, సీజేఐకి అందజేశారు. దీని ఆధారంగా జస్టిస్ యశ్వంత్ వర్మపై సుప్రీంకోర్టు తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.