న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు | Supreme Court begins probe after cash found at Delhi High Court judge home | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు

Published Sat, Mar 22 2025 4:36 AM | Last Updated on Sat, Mar 22 2025 7:10 AM

Supreme Court begins probe after cash found at Delhi High Court judge home

ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ  అధికారిక నివాసంలో నగదు లభ్యం  

అది లెక్కల్లో చూపని అక్రమ సొమ్మేనని అంటున్న అధికారులు  

జడ్జి తీరుపై తీవ్రంగా స్పందించిన సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా  

అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు   

అంతర్గత విచారణ ప్రారంభించిన కొలీజియం  

అవినీతికి పాల్పడినట్లు తేలితే శాశ్వతంగా వేటు పడే అవకాశం   

ఈ నెల 14న సొమ్ము దొరికితే 20 దాకా విధులకు హాజరైన యశ్వంత్‌ వర్మ  

దాదాపు వారం రోజులపాటు గోప్యంగా ఉంచిన అధికారులు  

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు లభ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. ఇదంతా లెక్కల్లో చూపని అక్రమ నగదేనని అధికారులు చెబుతున్నారు. సాక్షాత్తూ న్యాయమూర్తి ఇంట్లో భారీగా సొమ్ము లభించడం రాజకీయంగా పెనుదుమారం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తీవ్రంగా స్పందించారు.

యశ్వంత్‌ వర్మపై బదిలీ వేటు వేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అవినీతికి పాల్పడి అక్రమంగా నగదు కూడబెట్టినట్లు విచారణలో తేలితే యశ్వంత్‌ వర్మను పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే, ఆయన ఇంట్లో ఎంత నగదు దొరికిందనే సంగతి అధికారులు ఇంకా బయటపెట్టలేదు. ఈ నెల 14వ తేదీన నగదు లభించగా, ఈ నెల 20దాకా ఆయన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించడం గమనార్హం. వారం రోజులదాకా విషయం బయటకు రాలేదు.  

అగ్నిప్రమాదంతో బయటపడ్డ నగదు  
ఢిల్లీ తుగ్లక్‌ రోడ్డులోని అధికారిక నివాసంలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన రాత్రి సమయంలో ఆ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 11.30 గంటల సమయంలో యశ్వంత్‌ వర్మ కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఢిల్లీ ఫైర్‌ సర్విసు సిబ్బందితోపాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అర్పివేశారు. ఆ సమయంలో యశ్వంత్‌ వర్మ ఇంట్లో లేరు. మంటలను ఆర్విన తర్వాత గదులను తనిఖీ చేస్తుండగా, ఓ గదిలో భారీగా నోట్లకట్టలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ హోంశాఖకు తెలియజేశారు. నగదు వివరాలను తెలియజేస్తూ ఒక రిపోర్టు అందజేశారు.

హోంశాఖ ఈ రిపోర్టును సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు సమర్పించింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభించడాన్ని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తీవ్రంగా పరిగణించారు. ఆయన నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సమావేశమైంది. యశ్వంత్‌ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. వాస్తవానికి యశ్వంత్‌ వర్మ 2021లో అలహాబాద్‌ హైకోర్టు నుంచే బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజా వివాదం నేపథ్యంలో యశ్వంత్‌ వర్మ శుక్రవారం విధులకు హాజరు కాలేదు. ఆయనపై సుప్రీంకోర్టు కొలీజియం అంతర్గత విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.

కేవలం బదిలీతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కొలీజియంలోని కొందరు సభ్యులు సూచించినట్లు సమాచారం. యశ్వంత్‌ వర్మ వ్యవహార శైలిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ నుంచి కొలీజియం వివరణ కోరింది. తాజా వివాదంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం విచారణ ప్రారంభించారు. యశ్వంత్‌ వర్మ విషయంలో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారంలోకి వస్తున్నా యని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయనను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నామని, విచారణతో దీనికి సంబంధం లేదని స్పష్టంచేసింది. పూర్తి విచారణ తర్వాతే చర్యలు తీసుకుంటామని  తెలియజేసింది. 

పదవి నుంచి తొలగించవచ్చా?  
న్యాయమూర్తులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే శాశ్వతంగా పదవి నుంచి తొలగించాలంటూ 1999లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. హైకోర్టు జడ్జిపై ఫిర్యాదు అందితే తొలుత ప్రధాన న్యాయమూర్తి విచారణ ప్రారంభించాలి. సదరు జడ్జి నుంచి వివరణ కోరాలి. జడ్జి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా లేక లోతైన దర్యాప్తు అవసరమని భావించినా అందుకోసం అంతర్గత కమిటీని నియమించాలి. ఆరోపణలు నిజమేనని కమిటీ దర్యాప్తులో తేలితే.. పదవికి రాజీనామా చేయాలంటూ జడ్జిని ఆదేశించాలి. శాశ్వతంగా పదవి నుంచి తొలగించడానికి అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ పార్లమెంట్‌కు సిఫా ర్సు చేయాలి. అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌ ఆమోదిస్తే జడ్జి పదవి ఊడినట్లే.  

ఫైర్‌ సిబ్బందికి నగదు దొరకలేదు: డీఎఫ్‌ఎస్‌ చీఫ్‌  
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో తమ సిబ్బందికి ఎలాంటి నగదు దొరకలేదని ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌(డీఎఫ్‌ఎస్‌) చీఫ్‌ అతుల్‌ గార్గ్‌ శుక్రవారం చెప్పారు. అగ్నిప్రమాదం జరిగినట్లు ఈ నెల 14న రాత్రి 11.35 గంటలకు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వచ్చిందని, తమ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి మంటలు ఆర్వివేశారని అన్నారు. 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ ముగిసిందన్నారు. వారికి నగదేమీ దొరకలేదన్నారు.  

పార్లమెంట్‌లో అభిశంసించాలి  
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించడం పట్ల పలువురు సీనియర్‌ న్యాయవాదులు విస్మయం వ్యక్తంచేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్జిని మరో కోర్టుకు బదిలీ చేయడం ఏమిటని అడ్వొకేట్‌ వికాస్‌ సింగ్‌ ప్రశ్నించారు. ఆయనతో వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. అవినీతిపై కఠినంగా వ్యవహరించాల్సిన వృత్తిలో ఉన్న వ్యక్తి అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఏమిటని అన్నారు.

చట్టం దృష్టిలో అందరూ సమానమేనని పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి, పూర్తి నిజాలు బయటపెట్టాలని మరో అడ్వొకేట్‌ రాకేశ్‌ ద్వివేది చెప్పారు. యశ్వంత్‌ వర్మ తప్పు చేసినట్లు రుజువైతే చట్టప్రకారం శిక్షించాలని సూచించారు. యశ్వంత్‌ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం పూర్తి పారదర్శకంగా, నిజాయతీగా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు సీనియర్‌ లాయర్‌ ఇందిరా జైసింగ్‌ వెల్లడించారు. ఈ నెల 14న నోట్ల కట్టలు దొరికితే ఈ నెల 21న విషయం బయటపడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

పనికిరాని చెత్త మాకొద్దు
యశ్వంత్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కొలీజియం సిఫార్సు చేయడాన్ని అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం వ్యతిరేకించింది. తమ హైకోర్టు చెత్తకుండీ కాదని తేల్చిచెప్పింది. పనికిరాని చెత్తను ఇక్కడికి తరలిస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించింది. ఈ మేరకు బార్‌ అసోసియేషన్‌ ఒక తీర్మానం ఆమోదించింది.  

ఎవరీ యశ్వంత్‌ వర్మ?  
వివాదానికి కేంద్ర బిందువుగా మారిన జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ 1969 జనవరి 6న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్స్‌రాజ్‌ కాలేజీలో బీకాం(ఆనర్స్‌), మధ్యప్రదేశ్‌లోని రేవా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తిచేశారు. 1992 ఆగస్టు 8న అడ్వొకేట్‌గా న్యాయవాద వృత్తి ఆరంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2014 అక్టోబర్‌ 13న అలహాబాద్‌ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 1న అదే కోర్టులో శాశ్వత జడ్జిగా ప్రమాణం చేశారు. 2021 అక్టోబర్‌ 11న ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు.  

జడ్జిల నియామకం పారదర్శకంగా జరగాలి: కపిల్‌ సిబల్‌ 
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యం కావడం నిజంగా ఆందోళనకరమైన అంశమని సీనియర్‌ అడ్వొకేట్, రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ అన్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతిని ఎంతమాత్రం సహించడానికి వీల్లేదని చెప్పారు. న్యాయ వ్యవస్థలో అవినీతి అక్రమాలు పునరావృతం కాకుండా న్యాయమూర్తుల నియామకాన్ని మరింత పారదర్శకంగా మార్చాలని అభిప్రాయపడ్డారు. జడ్జిలను చాలాచాలా జాగ్రత్తగా నియమించాలని పేర్కొన్నారు. అవినీతి అనేది మొత్తం సమాజానికే కీడు చేస్తుందని హెచ్చరించారు. దేశంలో అవినీతి తగ్గుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవినీతి పెరిగిపోతోందని కపిల్‌ సిబల్‌ స్పష్టంచేశారు.  

మరొకరైతే పెద్ద వివాదం అయ్యేది: ధన్‌ఖడ్‌  
జడ్జి యశ్వంత్‌ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము దొరకడాన్ని కాంగ్రెస్‌ ఎంపీ జైరామ్‌ రమేశ్‌ శుక్రవారం రాజ్యసభలో లేవనెత్తారు. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం అవసరమని, అందుకోసం చట్టసభలు చొరవ తీసుకోవాలని అన్నారు. దీనిపై ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కోరారు.

ఈ వ్యవహారంపై సభలో నిర్మాణాత్మక చర్చ జరగడానికి ఒక విధానం రూపొందించే విషయం ఆలోచిస్తానని ధన్‌ఖడ్‌ చెప్పారు. జడ్జి ఇంట్లో అక్రమ నగదు లభ్యమైన వెంటనే ఆ విషయం బయటకు రాకపోవడం తనను బాధించిందని వ్యాఖ్యానించారు. ఒకవేళ రాజకీయ నాయకుడు లేదా ప్రభుత్వ అధికారి లేదా పారిశ్రామికవేత్త ఇంట్లో డబ్బులు దొరికి ఉంటే వెంటనే పెద్ద వివాదం అయ్యేదని అన్నారు.

బదిలీతో చేతులు దులుపుకోవద్దు: కాంగ్రెస్‌  
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను కేవలం బదిలీ చేసి, చేతు లు దులుపుకోవడం సరైంది కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖే రా శుక్రవారం పేర్కొన్నారు. ఆ డబ్బు ఎవరిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలని డిమాండ్‌ చేశారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఈడీ, సీబీఐల కంటే అగ్నిమాపక శాఖే అద్భుతంగా పనిచేస్తోందని పవన్‌ ఖేరా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement