
రాజన్న ఆలయానికి కొత్త శోభ
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి కొత్త రూపును సంతరించుకోనుంది. ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లను 2016-17 బడ్జెట్‌లో కేటాయించడంతో భక్తుల సౌకర్యార్థం వివిధ పనులు చేపట్టేందుకు దేవాదాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం వాస్తునిపుణులు సాయికమలాకర్‌శర్మ, జీవీ.వరప్రసాద్, స్థపతి వల్లినాయగం, ఆర్కిటెక్ట్‌లు నాగరాజు, ముక్తీశ్వర్, ఈవో దూస రాజేశ్వర్, ఇంజనీరింగ్ అధికారులు రాజయ్య, రఘునందన్ రాజన్న గుడి, ధర్మగుండం, గుడి చెరువు ప్రాంతాలను పరిశీలించారు. రూ.410 కోట్లతో ప్రణాళికలు రూపొందించిన మ్యాప్‌లను, రాజన్నగుడి రెండో ప్రాకారం, కల్యాణమండపాలు, నాలుగు దిక్కులా గాలి గోపురాలు, కల్యాణకట్ట, క్యూకాంప్లెక్సులు, రెండో ధర్మగుండం తదితర అంశాలను క్షుణ్ణంగా పరి శీలించారు. రాజన్న గుడి చెరువు కోసం 30 ఎకరాల స్థలాన్ని తీసుకుంటున్న క్రమంలో ఆరు ఎకరాల్లో రాజన్న గుడి రెండో ప్రాకారం, మిగతా 24 ఎకరాల్లో చెరువు, భక్తులకు ఇతర సౌకర్యాలకు వినియోగించనున్నారు.
మాడవీధులు.. గాలి గోపురాలు
రాజన్న సన్నిధిలో జరుపుకునే ఉత్సవాల సందర్భంగా స్వామివారలను ఊరేగించేందుకు మాడవీధులను ఏర్పాటు చేయాలనే అంశాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. 150 అడుగులతో చేపట్టే ట్యాంక్‌బండ్‌పైకి భక్తులు నేరుగా చేరుకుని అక్కడినుంచి స్వామివారి సన్నిధికి ఎలా చేరుకోవాలి, కోనేరు ఎక్కడ నిర్మించాలి, కల్యాణకట్ట ఎక్కడుండాలి, ఎక్కడినుంచి క్యూ కాంప్లెక్సుకు చేరుకోవాలి, స్వామివారి దర్శనానికి ఎలా వెళ్లాలి అనే అంశాలను చర్చించారు. ఆలయానికి 4 వైపులా గాలిగోపురాలు, భక్తులు కూర్చునేందుకు వీలుగా కైలాసం క్యూకాంప్లెక్సులు, ఉత్సవాల కోసం ప్రత్యేక కల్యాణ మండపాలు నిర్మించనున్నారు.
రాజన్న గుడిలోని స్వామివారు కొలువై ఉన్న ప్రధాన ఆలయాన్ని ముట్టుకోకుండానే అభివృద్ధి పనులు చేపడతామని వాస్తు నిపుణులు సాయి కమలాకర్‌శర్మ అన్నారు. రాజన్న గుడిని వాస్తు ప్రకారం విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నామని వాస్తు నిపుణులు జీవీ వరప్రసాద్ తెలిపారు. ఆరెకరాల్లో రెండో ప్రాకా రం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. వాస్తునిపుణులు, పండితులు, ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీరింగ్ అధికారులు, స్థపతి అంతా కలసి రాజన్న గుడి పరిసరాలు, చేపట్టబోయే పనులపై సుదర్ఘంగా చర్చలు, మంతనాలు జరిపారు. తుది నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తామని, అనుమతులు పొందిన తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయగం తెలిపారు.