అంతరాలయంలోంచి గర్భగుడిలోకి వెళ్తున్న అర్చకుడు (ఇన్‌సెట్‌లో) తాంత్రిక పూజ చేసిన అర్చకుడు
సాక్షి, విజయవాడ/తాడేపల్లిగూడెం: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కీలక వ్యక్తికి మేలు జరిగేందుకు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు గత నెల 26న దుర్గగుడిలో ఆ పూజలు చేశారని ఇంద్రకీలాద్రిపై ప్రచారం జరుగుతోంది. అర్ధరాత్రి అమ్మవారిని మహిషాసురమర్దనిగా అలంకరించి మరీ పూజలు నిర్వహించారని సమాచారం. నిబంధనల ప్రకారం గర్భగుడి లోకి దేవస్థానం అర్చకులు తప్ప బయట వ్యక్తులు ప్రవేశించడానికి వీలులేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా పూజ లు జరిగిన రోజు రాత్రి 11 గంటలకు ఆల యానికి సంబంధం లేని వ్యక్తి ఎర్రని దుస్తులు ధరించి అంతరాలయంలో తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయట పడటం సంచలనం సృష్టిస్తోంది.
అరగంట సేపు పూజలు..
దేవస్థానంలో రాత్రి 9.30 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతి స్తారు. ఆ తరువాత ఆలయాన్ని శుభ్రం చేసి 10 గంటలకు మూసి వేస్తారు. తిరిగి తెల్లవారుజామున 2.45 గంటలకు అమ్మవారికి అర్చన చేసిన తరువాత 4 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి ఆలయాన్ని మూసివేసేవరకు ఆలయ ఇన్‌స్పెక్టర్, సూపరింటెం డెంట్, ఎస్‌పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అయితే తాంత్రిక పూజలు జరిగిన రోజు రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దేవస్థానం ప్రధాన అర్చకుడు బదరీనాథ్ బాబు అమ్మవారిని మహిషాసురమర్దనిగా అలంకరించగా, బయట నుంచి వచ్చిన ఓ అర్చకుడు సుమారు అరగంట సేపు తాంత్రిక పూజలు నిర్వహించాడని తెలుస్తోంది. ఈ పూజలు అనంతరం తిరిగి అమ్మవారిని సాధారణ అలంకారంలోకి మార్చి 11.30 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. అదే రోజు మహిషాసురమర్దని దేవికి నివేదన పెట్టేందుకు ప్రత్యేకంగా కదంబం తయారు చేయించారని సమాచారం.
ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే!
రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తికి మేలు జరిగేలా పూజలు చేయాలంటూ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆదేశం మేరకే బయట అర్చకుడితో తాంత్రిక పూజలు చేయించారని ఇంద్రకీలాద్రిపై ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకపోతే బయటి అర్చకుడు అర్ధరాత్రి వేళ అమ్మవారి గర్భగుడిలోకి వెళ్తుంటే అక్కడి ఎస్‌పీఎఫ్ సిబ్బంది, ఆలయ అధికారులు చూస్తూ ఊరుకుంటారా? అని ఇంద్రకీలాద్రి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే తాంత్రిక పూజల విషయంపై గతనెల 30న జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు చర్చించినా.. తరువాత అంతా మౌనందాల్చారని తెలిసింది.
శుభ్రం చేసేందుకే..: ఈవో
డిసెంబర్ 26వ తేదీ రాత్రి 10 గంటలకు దర్శనాలు పూర్తయిన తరువాత ఆలయాన్ని శుద్ధి చేసేందుకే 11.30 గంటల వరకు తెరిచి ఉంచామని, తాంత్రిక పూజలు ఏమీ జరగ లేదని ఈఓ సూర్యకుమారి మంగళవారం చెప్పారు. అయితే పూజల సమాచారం తెలిసిన వెంటనే బదరీనా«థ్ బాబును ప్రధాన ఆలయం నుంచి తప్పించి, కొండదిగువున ఉన్న కామధేను అమ్మవారి ఆలయానికి మార్చా మని తెలిపారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిని కూడా విచారిస్తున్నామని తెలిపారు. కాగా, పార్థసారథిని మంగళవారం విజయవాడ వన్‌టౌన్ సీఐ కాశీవిశ్వనాథ్ విచారించారు.
దర్యాప్తు అనంతరం చర్యలు: మంత్రి మాణిక్యాలరావు
విజయవాడ కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు.
దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు!
Comments
Please login to add a commentAdd a comment