Durgagudi
-
దుర్గగుడి పాలకమండలి సమావేశం.. భక్తులకు గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు(సోమవారం) జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలకు మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఎస్వీబీసీ మాదిరిగా దుర్గగుడికి ఎస్డీఎంబీసీ ఛానల్‌ను అందుబాటులోకి తెస్తామని ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. ఇక, పాలక మండలి సమావేశం అనంతరం దుర్గగుడి ఛైర్మన్ రాంబాబు మాట్లాడుతూ.. ‘త్వరలో శివాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తాం. శివాలయంలో రూ.40లక్షల అంచనాలతో నవగ్రహ మండపం ఏర్పాటు చేస్తాం. వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ వాహనాలతో పాటు రెండు డీజిల్ వాహనాలను ఏర్పాటు చేస్తాం. ఏడాదిలోపు చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. దూరప్రాంత భక్తులకు మహామండపం మొదటి అంతస్తులో డార్మిటరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రతీ భక్తుడికి అమ్మవారి కుంకుమ ప్రసాదం.. దుర్గగుడి ఫ్లై ఓవర్ మీద వెళ్లే భక్తులకు కనిపించేలా అమ్మవారి చిత్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. అలాగే, దుర్గాఘాట్‌ను త్వరలోనే అందుబాటుకి తీసుకువస్తామన్నారు. అమ్మవారి సేవలను సోషల్ మీడియా యూట్యాబ్‌లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. టీటీడీ ఎస్వీబీసీ మాదిరిగా దుర్గగుడికి ఎస్డీఎంబీసీ ఛానల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. పౌర్ణమి నుంచి ప్రతీ భక్తుడికి అమ్మవారి కుంకుమ ప్రసాదం అందించనున్నట్టు తెలిపారు. 2వేల మంది అన్న ప్రసాదం స్వీకరించేలా అన్నదాన భవన్ విస్తరిస్తున్నామన్నారు. అన్నదాన భవన్‌కు రాబోయే నెలరోజుల్లో శంకుస్థాపన చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: వినాయక చవతిపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన -
దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్ విన్యాసాలు: ‘క్రిమినల్ కేసు నమోదు’
సాక్షి, విజయవాడ: విజయవాడలో బైక్ రేసర్లు రెచ్చిపోయారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్‌లకు పాల్పడుతూ వాహనదారులకు దడపుట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఈ బైక్ స్టంట్స్‌పై ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్ సాక్షి టీవీతో మాట్లాడారు. ‘‘మైనర్ విద్యార్థులు ఫ్లైఓవర్‌పై విన్యాసాలు చేస్తున్నారు.. ఇవి అత్యంత ప్రమాదకరం. గత ఏప్రిల్‌లో ఐదుగురు విద్యార్థులును పట్టుకున్నాం. తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చాం. తాజాగా దుర్గగుడి ఫ్లైఓవర్సై స్టంట్లు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. (చదవండి: చెన్నైలో ఆటో రేసింగ్.. ఒళ్లు గగుర్పొడవడం ఖాయం) ‘‘ఇద్దరు యువకులు స్టంట్లు చేసినట్టు గుర్తించాం. యువకులు టాయ్ గన్ తో విన్యాసాలు చేశారు. బైక్ రేసులు, విన్యాసాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. బైక్ రేసులు, స్టంట్లు చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నాం. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విజువల్స్ చూశాం. ఇప్పుడు వచ్చిన విజువల్స్‌లో ఉన్న యువకుడిని కూడా అదుపులోకి తీసుకుంటాం. రేసింగ్, స్టంట్లు చేసిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇక నుంచి ఖాళీ రోడ్లు, ఫ్లై ఓవర్లపై నిఘా పెడతాం. యువకుల చేతిలో ఉన్నది డూప్లికేట్ గన్‌గా నిర్ధారించాం’’ అన్నారు. చదవండి: Hyderabad Bike Racer: రికార్డులే రికార్డులు -
ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండ చరియలు
సాక్షి, అమరావతి బ్యూరో/ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయ ఆవరణలో బుధవారం కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులు, ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయానికి గంట ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అవధూత మౌన మునిస్వామి విగ్రహం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అదే ప్రాంతంలో దసరా ఉత్సవాలకు దేవస్థానం భారీ షెడ్డు ఏర్పాటు చేసింది. అందులో మీడియా, పోలీస్, పారిశుధ్య సిబ్బందితో పాటు కాంట్రాక్టర్ల వద్ద పని చేసేందుకు వచ్చిన సుమారు 20 మంది కూర్చుని ఉన్నారు. సీఎం కాన్వాయ్ వచ్చే సమయం దగ్గర పడిందని పోలీస్ సిబ్బంది అక్కడున్న వారిని పక్కకు పంపే ప్రయత్నం చేస్తుండగా.. ఇంతలో భారీ శబ్దంతో కొండరాళ్లు విరిగిపడ్డాయి. షెడ్డులోని వారంతా బయటకు పరుగులు తీయగా.. క్యూలైన్ల వద్ద విధుల్లో ఉన్న సివిల్ ఏఈ సత్యసాయి చరణ్ కాలికి తీవ్ర గాయమైంది. ఘటనాస్థలం వద్ద విరిగిపడిన కొండచరియలు అటెండర్ సుధాకర్‌తో పాటు ఏఆర్ కానిస్టేబుల్ కె.కిరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలయం కొండపైకి ఘాట్ రోడ్డులోనే వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం రాకను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అధికారులు అమ్మవారి దర్శనాలను నిలిపివేసి, ఆ ప్రాంతంలోకి భక్తులు రాకుండా నిలువరించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ధ్వంసమైన షెడ్డును యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 3.30 గంటలకు ముఖ్యమంత్రి ఇంద్రకీలాద్రికి చేరుకోవాల్సి ఉండగా.. 5.05 గంటలకు మార్పు చేశారు. కొండ చరియలు విరిగిపడిన ప్రదేశంలో ఆలయ అర్చకులు శాంతి పూజలు నిర్వహించారు. భక్తుల రక్షణకు తగిన చర్యలు తీసుకోండి ఇంద్రకీలాద్రిపై భక్తుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దుర్గ గుడి ఘాట్రోడ్లో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచి, తిరిగి వెళ్లే సమయంలో కాసేపు అక్కడ ఆగారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌కు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. -
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ వారికి దసరా ఉత్సవాల సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వ్రస్తాలు సమరి్పంచారు. సంప్రదాయ పంచకట్టు వస్త్ర ధారణలో ఆలయానికి చేరుకున్న సీఎం జగన్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద సీఎం తలకు స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పరివట్టం చుట్టారు. పట్టు వ్రస్తాలున్న పళ్లెంను తలపై పెట్టుకుని అమ్మవారి సన్నిధికి చేరుకున్న సీఎం.. వాటిని సమర్పించి, ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి, ప్రసాదాలు అందజేశారు. పాలక మండలి, అధికారులు దేవస్థానం తరఫున అమ్మవారి చిత్రపటం అందజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 2021 నూతన సంవత్సర క్యాలండర్‌ను సీఎం ఆవిష్కరించారు. అంతకు ముందు ఘాట్ రోడ్డు మార్గంలో ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు దేవదాయ శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్, ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావు, పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, రాజ్యసభ సభ్యులు మోపిదేవి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వల్లభనేని వంశీ, జోగి రమేష్, కొలుసు పార్థసారథి, వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కాగా, అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంలో భాగంగా సరస్వతీదేవిగా అలంకరింపబడిన దుర్గమ్మను సీఎం వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ఆ నిధులతో మెరుగైన సౌకర్యాల కల్పన ► విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయటానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు చెప్పారు. బుధవారం సీఎం జగన్ అమ్మవారి దర్శనానంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. ► ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌లో రూపొందించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆమోదం తెలిపారన్నారు. ► కొండ చరియలను పటిష్ట పరచడం, నిత్యాన్నదానం వంటశాల, ప్రసాదాల తయారీ భవనం, కేశఖండనశాల భవనం, సోలార్ విద్యుత్ ఏర్పాటు తదితర నిర్మాణాలకు ఈ నిధులను వెచ్చిస్తామని తెలిపారు. ► ఆలయ అభివృద్ధికి, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి తక్షణం స్పందించి ఆమోదం తెలపడం పట్ల దేవస్థానం పాలకవర్గం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. నిధుల కేటాయింపునకు సంబంధించిన ఆదేశాలు అధికారికంగా వెలువడనున్నాయని చెప్పారు. ఇదే తొలిసారి ► రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ దుర్గ గుడి అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు చేయడం పట్ల దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేశారు. దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ► దుర్గగుడి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వాలు భక్తులు సమరి్పంచిన కానుకలతోనే ఆలయ అభివృద్ధి పనులు చేయించేవి. అమ్మవారి ఆలయ ఫిక్స్డ్ డిపాజిట్లు డ్రా చేసి నిర్మాణాలు చేశారే తప్ప ఇప్పటి వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించలేదు. సీఎం నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
దుర్గగుడి నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, విజయవాడ : నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, దర్శనానికి వచ్చే వాళ్లు మాస్క్ సహా అన్ని నిబంధనలు పాటించాలని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు అన్నారు. దసరా సందర్భంగా ఆలయ దర్శనానికి ఇప్పటికే 74వేల టికెట్లు ఆన్లైన్లో బుక్ అయ్యాయని, ప్రస్తుతం కేవలం 1500 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఏడాది నుంచి నిర్మాణంలో ఉన్న శివాలయం పూర్తయిన సందర్భంగా రేపటి నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. (ప్రారంభమైన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్) ఆన్లైన్లో దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని ఆలయ ఈవో సురేష్ బాబు అన్నారు. ఇకవేళ టికెట్ సమస్యలు ఉన్నవాళ్లకి పున్నమి ఘాట్,మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయని తెలిపారు. మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మవారికి పట్టు చీరను సమర్పిస్తారని ఈవో పేర్కొన్నారు. ఈసారి సామూహిక పూజలు లేవని, విఐపిలకు ఉదయం 7 నుంచి 9 వరకు సాయంత్రం 3నుంచి 5 గంటలు వరకే అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. వీఐపీలు కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని ఆ టైం స్లాట్ ప్రకారమే దర్శనానికి రావాల్సిందిగా తెలిపారు. (నేటితో తీరనున్న విజయవాడ వాసుల కష్టాలు) -
గుడులను ‘ఊడ్చే’ గుత్తేదార్!
సాక్షి, విజయవాడ: టీడీపీ హయాంలో విజయవాడలోని కనకదుర్గ గుడితోపాటు మరో ఆరు దేవాలయాల్లో పారిశుధ్య పనుల కాంట్రాక్టును అత్యధిక ధరలకు దక్కించుకున్న సంస్థ దీన్ని మరి కొన్నేళ్లు పొడిగించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సంస్థకు టెండర్ కొనసాగించడం దేవస్థానానికి భారంగా మారుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు. లోకేష్ బంధువు సంస్ధ.... మాజీ మంత్రి నారా లోకేష్‌కు బంధువైన తిరుపతికి చెందిన భాస్కరనాయుడు ఆధ్వర్యంలోని పద్మావతి హాస్పిటాలిటీస్ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ పలు దేవాలయాల్లో పారిశుధ్య పనులను నిర్వహిస్తోంది. గతంలో టీటీడీలో స్వీపింగ్, క్లీనింగ్ కాంట్రాక్టు పనులను దక్కించుకున్న ఈ సంస్థ తీరు వివాదాస్పదం కావడంతో పక్కనపెట్టారు. అయితే టీడీపీ పెద్దల ఒత్తిడితో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం తదితర చోట్ల స్వీపింగ్, క్లీనింగ్ పనులను ఇదే సంస్థకు కట్టబెట్టారు. ఎలాంటి టెండర్లు లేకుండానే అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ మూడేళ్ల పాటు ఈ పనులను కాంట్రాక్టుపై అప్పగించడం గమనార్హం. 2018లో మరో ఏడాది పాటు దీన్ని పొడిగించారు. ఈ ఏడాది ఆగస్టుతో కాంట్రాక్టు గడువు ముగియనుంది. దేవస్థానంపై అదనపు భారం... 2015 వరకు దుర్గగుడిలో పారిశుద్ధ్య పనులకు స్థానికంగా దేవస్థానం అధికారులే టెండర్ పిలిచి అర్హత కలిగిన సంస్థకు అప్పగించేవారు. సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించి స్వీపింగ్, క్లీనింగ్ మెటీరియల్‌ను దేవస్థానమే కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించింది. ఇందుకోసం నెలకు రూ.25 లక్షల వరకు దేవస్థానానికి ఖర్చు అయ్యేది. టీడీపీ పాలనలో లోకేష్ సిఫారసుతో పద్మావతి సంస్థకు నెలకు రూ. 33 లక్షల చొప్పున కాంట్రాక్టుపై ఇచ్చారు. దీంతో దుర్గగుడి దేవస్థానంపై ఏడాదికి అదనంగా రూ.96 లక్షల వరకు భారం పడింది. గత నాలుగేళ్లుగా ఈ కాంట్రాక్టు కొనసాగింది. అయితే పారిశుధ్య పనులను నిర్ణీత ప్రమాణాల మేరకు నిర్వహించడంలో కాంట్రాక్టు సంస్థ విఫలమైంది. మరోవైపు పద్మావతి సంస్థలో పనిచేసే సిబ్బందికి సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదు. ‘పద్మావతి’ పైరవీలు మరో మూడేళ్లు తమనే కొనసాగించాలని పద్మావతి సంస్థ ప్రతినిధులు దేవదాయశాఖ ఉన్నతాధికారుల వద్ద పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా టెండర్ ఖరారు చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దుర్గగుడి టెండర్ ఖరారు అయితే మిగిలిన దేవాలయాల్లో కూడా పొడిగించుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సంస్థను పక్కన పెట్టి ఈ టెండర్లు ద్వారా తక్కువ రేటుకు పారిశుధ్య పనులు నిర్వహించే సంస్థకు పనులు అప్పగించాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు. -
దుర్గగుడి ఉద్యోగులపై కేసు నమోదు
సాక్షి, విజయవాడ : వరుస వివాదాలతో వార్తలోకెక్కిన దుర్గగుడిలో తాజాగా మరో వివాదం చేలరేగింది. దసరా ఉత్సావాల్లో అక్రమాలకు పాల్పడినట్లు.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అచ్చుత రామయ్య తనను బెదిరించినట్లు దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నలుగురు దుర్గగుడి ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోద చేసినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడి ఏఈవో అచ్చుత రామయ్య, సూపరిండెంట్ గోపిచంద్, రికార్డ్ అసిస్టెంట్ సునీత, కాంట్రాక్ట్ ఉద్యోగి సైదాలపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. వీరి మీద సెక్షన్ 420, 409, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. -
దుర్గగుడిలో అవినీతి ఏఈవో సస్పెన్షన్
-
భక్తుల డబ్బునే ఖర్చు పెడతాం
సాక్షి, అమరావతి బ్యూరో/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా శరన్నవరాత్రులను ప్రభుత్వ పండుగగా ప్రకటించినా ప్రత్యేకంగా నిధులంటూ ఇవ్వమని, భక్తులు ఇచ్చే డబ్బునే దేవస్థానం ఖర్చుపెడుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడ కనకదుర్గమ్మకు ప్రభుత్వం తరఫున కుటుంబ సభ్యులతో కలసి పట్టువస్త్రాలను సమర్పించారు. దసరా ఉత్సవాలను ప్రభుత్వ పండగగా ప్రకటించినా నిధులెందుకు ఇవ్వలేదని విలేకరులు సీఎంను ప్రశ్నించారు. టీటీడీ తరపున అనేక ఉత్సవాలను నిర్వహిస్తున్నామని,ఇప్పుడు దాని ఆదాయం బాగా పెరిగిందని అలాగే ఇక్కడ కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. గతేడాది మొదటి ఐదు రోజుల్లో 2.97 లక్షల మంది రాగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 5.27 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పంటలు పండాలని కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి దయ వల్ల పోలవరం పూర్తి కాగలదని విశ్వసించారు. వచ్చే మార్చికి దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. సీఎం వెంట ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, కలెక్టర్ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. అప్పాల ప్రసాదం బాగుంది సరస్వతిదేవి అలంకారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. దసరా ఉత్సవాల నుంచి భక్తులకు పంపిణీ చేస్తున్న అప్పాల ప్రసాదాన్ని స్వీకరించి బాగుందని ప్రశంసించారు. దసరా ఉత్సవాలలో ప్రతి భక్తుడికి అప్పాలను అందచేస్తారని, ఉత్సవాల అనంతరం కూడా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని ఈఓ తెలిపారు. కుటుంబ సమేతంగా దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు -
దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు!
సాక్షి, విజయవాడ/తాడేపల్లిగూడెం: బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కీలక వ్యక్తికి మేలు జరిగేందుకు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు గత నెల 26న దుర్గగుడిలో ఆ పూజలు చేశారని ఇంద్రకీలాద్రిపై ప్రచారం జరుగుతోంది. అర్ధరాత్రి అమ్మవారిని మహిషాసురమర్దనిగా అలంకరించి మరీ పూజలు నిర్వహించారని సమాచారం. నిబంధనల ప్రకారం గర్భగుడి లోకి దేవస్థానం అర్చకులు తప్ప బయట వ్యక్తులు ప్రవేశించడానికి వీలులేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా పూజ లు జరిగిన రోజు రాత్రి 11 గంటలకు ఆల యానికి సంబంధం లేని వ్యక్తి ఎర్రని దుస్తులు ధరించి అంతరాలయంలో తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయట పడటం సంచలనం సృష్టిస్తోంది. అరగంట సేపు పూజలు.. దేవస్థానంలో రాత్రి 9.30 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతి స్తారు. ఆ తరువాత ఆలయాన్ని శుభ్రం చేసి 10 గంటలకు మూసి వేస్తారు. తిరిగి తెల్లవారుజామున 2.45 గంటలకు అమ్మవారికి అర్చన చేసిన తరువాత 4 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి ఆలయాన్ని మూసివేసేవరకు ఆలయ ఇన్స్పెక్టర్, సూపరింటెం డెంట్, ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అయితే తాంత్రిక పూజలు జరిగిన రోజు రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దేవస్థానం ప్రధాన అర్చకుడు బదరీనాథ్ బాబు అమ్మవారిని మహిషాసురమర్దనిగా అలంకరించగా, బయట నుంచి వచ్చిన ఓ అర్చకుడు సుమారు అరగంట సేపు తాంత్రిక పూజలు నిర్వహించాడని తెలుస్తోంది. ఈ పూజలు అనంతరం తిరిగి అమ్మవారిని సాధారణ అలంకారంలోకి మార్చి 11.30 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. అదే రోజు మహిషాసురమర్దని దేవికి నివేదన పెట్టేందుకు ప్రత్యేకంగా కదంబం తయారు చేయించారని సమాచారం. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే! రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తికి మేలు జరిగేలా పూజలు చేయాలంటూ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆదేశం మేరకే బయట అర్చకుడితో తాంత్రిక పూజలు చేయించారని ఇంద్రకీలాద్రిపై ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకపోతే బయటి అర్చకుడు అర్ధరాత్రి వేళ అమ్మవారి గర్భగుడిలోకి వెళ్తుంటే అక్కడి ఎస్పీఎఫ్ సిబ్బంది, ఆలయ అధికారులు చూస్తూ ఊరుకుంటారా? అని ఇంద్రకీలాద్రి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే తాంత్రిక పూజల విషయంపై గతనెల 30న జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు చర్చించినా.. తరువాత అంతా మౌనందాల్చారని తెలిసింది. శుభ్రం చేసేందుకే..: ఈవో డిసెంబర్ 26వ తేదీ రాత్రి 10 గంటలకు దర్శనాలు పూర్తయిన తరువాత ఆలయాన్ని శుద్ధి చేసేందుకే 11.30 గంటల వరకు తెరిచి ఉంచామని, తాంత్రిక పూజలు ఏమీ జరగ లేదని ఈఓ సూర్యకుమారి మంగళవారం చెప్పారు. అయితే పూజల సమాచారం తెలిసిన వెంటనే బదరీనా«థ్ బాబును ప్రధాన ఆలయం నుంచి తప్పించి, కొండదిగువున ఉన్న కామధేను అమ్మవారి ఆలయానికి మార్చా మని తెలిపారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిని కూడా విచారిస్తున్నామని తెలిపారు. కాగా, పార్థసారథిని మంగళవారం విజయవాడ వన్‌టౌన్ సీఐ కాశీవిశ్వనాథ్ విచారించారు. దర్యాప్తు అనంతరం చర్యలు: మంత్రి మాణిక్యాలరావు విజయవాడ కనకదుర్గ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు! -
మూడు నెలల్లోగా అనర్హత వేటు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయింపులపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచి పదవీకాలం మధ్యలోనే మరో పార్టీలోకి ఫిరాయించే వారిపై ఫిర్యాదు అందిన 3 నెలల్లోగా అనర్హత వేటు వేయాలని స్పష్టం చేశారు. చట్టసభలకు చైర్మన్‌గా, స్పీకర్‌గా వ్యవహరించే వారు ఫిరాయింపుల వ్యవహారంపై అందే ఫిర్యాదులను 3 నెలలకు మించి పెండింగ్‌లో ఉంచుకోకూడదని చట్టమే చెబుతోందని గుర్తుచేశారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఫిర్యాదు అందిన వెంటనే అనర్హత వేటు వేయడం ద్వారా తాను ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఆదివారం కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్టు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టం ప్రకారమే పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నానని పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలువురు ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారు. వారిపై ఫిర్యాదులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నందున రెండు రాష్ట్రాల స్పీకర్లకు మీరేమైనా సూచనలు చేస్తారా’ అని విలేకరులు అడగ్గా... రాజ్యసభ చైర్మన్ హోదాలో చట్టంలో పేర్కొన్న మేరకు తాను నిబంధనల ప్రకారం నడుచుకున్నానని, లోక్‌సభ స్పీకర్, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు వారి విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇంతకుమించి దీనిపై తానేమీ మాట్లాడనని చెప్పారు. తెలుగు ప్రజలకు సేవ చేస్తా.. ఇప్పటిదాకా ప్రధానమంత్రి పదవి తప్ప ఎన్నో పదవులు చేపట్టానని, ప్రధానమంత్రి కావాలన్న కోరిక లేదని వెంకయ్య స్పష్టం చేశారు. ఆ అర్హత తనకు లేదనే విషయం తెలుసన్నారు. ఉప రాష్ట్రపతి హోదాకు ఉండే ప్రొటోకాల్ నియమ నిబంధనలు ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పారు. నూతన ఏడాది, సంక్రాంతి వేడుకల సందర్భంగా ప్రజలకు వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజే శారు. పాలకులు, రాజకీయ పార్టీల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, వారిలో ప్రశ్నించే తత్వం పెరిగిందని చెప్పారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉప రాష్ట్రపతిగా తనకున్న పరిమితుల మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవ చేస్తానని వెల్ల డించారు. పోలవరం ప్రాజెక్టు, గృహ నిర్మా ణం వంటి అంశాలపై సంబంధిత మంత్రులతో మాట్లాడానన్నారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు కులం, మతం, డబ్బు అనే మూడు ‘సీ’లు ప్రాధాన్యతా అంశాలుగా మారిపోయాయని విచారం వ్యక్తం చేశారు. కానీ, కెపాసిటీ, క్యారెక్టర్, క్యాలిబర్, కాండక్ట్ అనే నాలుగు ‘సీ’లకు ప్రాధాన్యం పెరగాలని ఆకాంక్షించారు. ఇలా అయితే ఎలాగమ్మా! దుర్గగుడి ఈవోతో వెంకయ్య నాయుడు సాక్షి, విజయవాడ: ‘‘దుర్గగుడిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అయితే ఎలాగమ్మా’’ అంటూ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎ.సూర్య కుమారిని ఉద్దేశించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఆయనను ఆదివారం స్వర్ణభారత్ ట్రస్టులో దుర్గగుడి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి, పాలకమండలి సభ్యులు కలిశారు. వారితోపాటు ఏపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ‘‘దుర్గగుడిలో ఒక దివ్యాంగుడిని తోసివేశారని పేపర్లో చూశాను. ప్రసాదాలు సరిగా ఉండటం లేదని, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటివి జరగకుండా చూడాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. అంతా సరిచేస్తామంటూ ఈవో, పాలకమండలి సభ్యులు హామీ ఇచ్చారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఢిల్లీలో దుర్గమ్మ నమూనా దేవాలయం నిర్మించాలని భావిస్తున్నామని, స్థలం ఇప్పించాలని కోరారు. వెంకయ్య నాయుడు స్పందిస్తూ... ఢిల్లీలో స్థలం కొరత ఉందని, అవకాశాన్ని బట్టి పరిశీలిస్తామని చెప్పారు. -
దుర్గగుడి ఖాతాలో సర్కారు ఉగాది ఖర్చు!
25 లక్షలు ఇవ్వాలంటూ ఆదేశాలు ఆలయంలో ఉగాది ఉత్సవాలకు కోత తూతూ మంత్రంగా అమ్మవారి చైత్ర మాసోత్సవాలు? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు సాక్షి, విజయవాడ: ఉగాది వేడుకలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసిన తుళ్లూరులో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా రాజధానికి భూములిచ్చిన రైతులకు సత్కారాలు చేయడంతోపాటు వేదపండితులతో పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సీఎం చంద్రబాబుతోపాటు ఆయన మందీమార్బలమంతా తరలిరానుంది. దీనికయ్యే ఖర్చు రూ.25 లక్షలను ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఈ ఖర్చు భారమంతటినీ విజయవాడ కనక దుర్గమ్మపైన పెట్టారు. ఈ మేరకు తుళ్లూరులో అయిన ఖర్చులన్నింటినీ దేవస్థానం నుంచి విడుదల చేయాలని ఆలయ అధికారులకు ఆదేశాలందినట్లు సమాచారం. దేవస్థానంలో ఉగాది ఉత్సవాలకు కోత.. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఉగాది పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరం తొలిరోజు కావడంతో దేవస్థానానికి భక్తులు కూడా పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఉగాది పండుగరోజు నుంచే 18 రోజులపాటు దేవస్థానంలో అమ్మవారి చైత్ర మాసోత్సవాలు(వసంత నవరాత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాలు) నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ ఏడాది ఉగాది వేడుకలకు, చైత్ర మాసోత్సవాలకు సుమారు రూ.6 లక్షలు ఖర్చవుతాయని దేవస్థానం అధికారులు అంచనాలు తయారు చేశారు. అయితే తుళ్లూరులో ప్రభుత్వం నిర్వహించే ఉగాది వేడుకల ఖర్చు భారం దేవస్థానంపై పడటంతో దుర్గగుడిలో జరిపే ఉగాది వేడుకలు, చైత్ర మాసోత్సవాల ఖర్చును తగ్గించాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో అంచనాలు వేసిన రూ.6 లక్షల్లో సగానికి కోత పెట్టి రూ.3 లక్షలు ఖర్చు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అమ్మవారి సొమ్ముతో ప్రభుత్వం సోకులా? భక్తులు అమ్మవారిపై నమ్మకంతో కానుకలు, మొక్కుబడులు సమర్పిస్తారు. ఈ నిధుల్ని దేవస్థానం అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు మాత్రమే ఖర్చు చేయాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వం నిర్వహించే ఉగాది ఉత్సవాలకు దేవస్థానం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారికి చేసే ఉత్సవాల్లో కోతలు విధించి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. -
దసరా @రూ.4 కోట్లు
సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాలకు రూ.4 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, దుర్గగుడి ఈవో వి.త్రినాథరావు తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో వారు సమీక్ష సమావేశం రూ.4 కోట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ గత ఏడాది ఉత్సవాలకు సుమారు రూ.4 కోట్లు ఖర్చయ్యాయని, ఈ ఏడాది కూడా అంతే ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. స్నానఘాట్లను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 25 నుంచి జరిగే ఉత్సవాల కోసం ప్రత్యేక కేశఖండన శాలలు, వస్త్రాలు మార్చుకునేందుకు గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని ఆమె వివరించారు. అమ్మవారికి ఉచితంగా తలనీలాలు సమర్పించే అవకాశం కల్పిస్తున్నామన్నారు. భక్తులు ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దని, దేవస్థాన సమాచార కేంద్రాల ద్వారా మాత్రమే వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈవో త్రినాథరావు మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తులకు సహాయం చేసేందుకు 900 మంది వలంటీర్లు అందుబాటులో ఉంటారన్నారు. 11 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందజేస్తామని, సుమారు 90వేల మంది భక్తులకు కావాల్సిన ప్రసాదాలను సిద్ధం చేస్తామని వివరించారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఇతర దేవాలయాల సిబ్బందితో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, కార్పొరేషన్, వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది సహాయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా సేవలు వినియోగించుకుంటామన్నారు. అదనపు డీసీపీ టీవీ నాగరాజు మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా 4,500 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, హోంగార్డులు, ఎస్సీసీ క్యాడెట్లను నియమిస్తామన్నారు. వివిధ పాంత్రాల నుంచి వచ్చే వాహనాలకు తాత్కాలిక పార్కింగ్లు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఏసీపీ ఎస్.రాఘవరావు, సబ్ కలెక్టర్ ఏవో జయశ్రీ, దేవస్థానం ఈఈ రమాదేవి, ఏఈవో అచ్యుతరామయ్య, తహశీల్దార్ ఆర్.శివరావు తదితరులు పాల్గొన్నారు.