సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాలకు రూ.4 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, దుర్గగుడి ఈవో వి.త్రినాథరావు తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో వారు సమీక్ష సమావేశం రూ.4 కోట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ గత ఏడాది ఉత్సవాలకు సుమారు రూ.4 కోట్లు ఖర్చయ్యాయని, ఈ ఏడాది కూడా అంతే ఖర్చు చేస్తున్నామన్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. స్నానఘాట్లను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 25 నుంచి జరిగే ఉత్సవాల కోసం ప్రత్యేక కేశఖండన శాలలు, వస్త్రాలు మార్చుకునేందుకు గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని ఆమె వివరించారు. అమ్మవారికి ఉచితంగా తలనీలాలు సమర్పించే అవకాశం కల్పిస్తున్నామన్నారు. భక్తులు ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దని, దేవస్థాన సమాచార కేంద్రాల ద్వారా మాత్రమే వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
ఈవో త్రినాథరావు మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తులకు సహాయం చేసేందుకు 900 మంది వలంటీర్లు అందుబాటులో ఉంటారన్నారు. 11 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు అందజేస్తామని, సుమారు 90వేల మంది భక్తులకు కావాల్సిన ప్రసాదాలను సిద్ధం చేస్తామని వివరించారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఇతర దేవాలయాల సిబ్బందితో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, కార్పొరేషన్, వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది సహాయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా సేవలు వినియోగించుకుంటామన్నారు.
అదనపు డీసీపీ టీవీ నాగరాజు మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా 4,500 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, హోంగార్డులు, ఎస్‌సీసీ క్యాడెట్లను నియమిస్తామన్నారు. వివిధ పాంత్రాల నుంచి వచ్చే వాహనాలకు తాత్కాలిక పార్కింగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఏసీపీ ఎస్.రాఘవరావు, సబ్ కలెక్టర్ ఏవో జయశ్రీ, దేవస్థానం ఈఈ రమాదేవి, ఏఈవో అచ్యుతరామయ్య, తహశీల్దార్ ఆర్.శివరావు తదితరులు పాల్గొన్నారు.
దసరా @రూ.4 కోట్లు
Published Wed, Sep 10 2014 2:45 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM
Advertisement
Advertisement