సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయింపులపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచి పదవీకాలం మధ్యలోనే మరో పార్టీలోకి ఫిరాయించే వారిపై ఫిర్యాదు అందిన 3 నెలల్లోగా అనర్హత వేటు వేయాలని స్పష్టం చేశారు. చట్టసభలకు చైర్మన్‌గా, స్పీకర్‌గా వ్యవహరించే వారు ఫిరాయింపుల వ్యవహారంపై అందే ఫిర్యాదులను 3 నెలలకు మించి పెండింగ్‌లో ఉంచుకోకూడదని చట్టమే చెబుతోందని గుర్తుచేశారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఫిర్యాదు అందిన వెంటనే అనర్హత వేటు వేయడం ద్వారా తాను ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఆదివారం కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్టు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చట్టం ప్రకారమే పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నానని పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలువురు ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారు. వారిపై ఫిర్యాదులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నందున రెండు రాష్ట్రాల స్పీకర్లకు మీరేమైనా సూచనలు చేస్తారా’ అని విలేకరులు అడగ్గా... రాజ్యసభ చైర్మన్ హోదాలో చట్టంలో పేర్కొన్న మేరకు తాను నిబంధనల ప్రకారం నడుచుకున్నానని, లోక్‌సభ స్పీకర్, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు వారి విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇంతకుమించి దీనిపై తానేమీ మాట్లాడనని చెప్పారు.
తెలుగు ప్రజలకు సేవ చేస్తా..
ఇప్పటిదాకా ప్రధానమంత్రి పదవి తప్ప ఎన్నో పదవులు చేపట్టానని, ప్రధానమంత్రి కావాలన్న కోరిక లేదని వెంకయ్య స్పష్టం చేశారు. ఆ అర్హత తనకు లేదనే విషయం తెలుసన్నారు. ఉప రాష్ట్రపతి హోదాకు ఉండే ప్రొటోకాల్ నియమ నిబంధనలు ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పారు. నూతన ఏడాది, సంక్రాంతి వేడుకల సందర్భంగా ప్రజలకు వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజే శారు. పాలకులు, రాజకీయ పార్టీల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, వారిలో ప్రశ్నించే తత్వం పెరిగిందని చెప్పారు.
భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉప రాష్ట్రపతిగా తనకున్న పరిమితుల మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవ చేస్తానని వెల్ల డించారు. పోలవరం ప్రాజెక్టు, గృహ నిర్మా ణం వంటి అంశాలపై సంబంధిత మంత్రులతో మాట్లాడానన్నారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు కులం, మతం, డబ్బు అనే మూడు ‘సీ’లు ప్రాధాన్యతా అంశాలుగా మారిపోయాయని విచారం వ్యక్తం చేశారు. కానీ, కెపాసిటీ, క్యారెక్టర్, క్యాలిబర్, కాండక్ట్ అనే నాలుగు ‘సీ’లకు ప్రాధాన్యం పెరగాలని ఆకాంక్షించారు.
ఇలా అయితే ఎలాగమ్మా!
దుర్గగుడి ఈవోతో వెంకయ్య నాయుడు
సాక్షి, విజయవాడ: ‘‘దుర్గగుడిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అయితే ఎలాగమ్మా’’ అంటూ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎ.సూర్య కుమారిని ఉద్దేశించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఆయనను ఆదివారం స్వర్ణభారత్ ట్రస్టులో దుర్గగుడి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి, పాలకమండలి సభ్యులు కలిశారు. వారితోపాటు ఏపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ‘‘దుర్గగుడిలో ఒక దివ్యాంగుడిని తోసివేశారని పేపర్లో చూశాను. ప్రసాదాలు సరిగా ఉండటం లేదని, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటివి జరగకుండా చూడాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. అంతా సరిచేస్తామంటూ ఈవో, పాలకమండలి సభ్యులు హామీ ఇచ్చారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఢిల్లీలో దుర్గమ్మ నమూనా దేవాలయం నిర్మించాలని భావిస్తున్నామని, స్థలం ఇప్పించాలని కోరారు. వెంకయ్య నాయుడు స్పందిస్తూ... ఢిల్లీలో స్థలం కొరత ఉందని, అవకాశాన్ని బట్టి పరిశీలిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment