చీలికలు వద్దు
► అన్నాడీఎంకే ప్రభుత్వం పూర్తికాలం కొనసాగాలి
► కలిసి పనిచేద్దాం
► అన్నాడీఎంకేకు కేంద్ర మంత్రి వెంకయ్య హితవు
అన్నాడీఎంకే ప్రభుత్వం పూర్తికాలం పనిచేయాలనేదే తమ అభిమతం, పార్టీలో చీలికలు పనికిరావని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆ పార్టీ నేతలకు హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వ ప్రగతి ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రప్రభుత్వ మూడేళ్ల విజయాల చిత్ర ప్రదర్శనను చెన్నై వేలచ్చేరి రైల్వేస్టేషన్‌లో శనివారం వెంకయ్య ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జయలలిత ప్రజాసంక్షేమం కోసం ఎంతో పరితపించేవారని తెలిపారు. అనేక సందర్భాల్లో ఆమెను కలిశానని, ఆదివారం, సెలవు దినాల్లో సైతం సచివాలయానికి వచ్చి పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు వెళ్లి సేవ చేస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్న బీజేపీ ప్రభుత్వ ధ్యేయాన్ని అనుసరించే చెన్నై సచివాలయంలో ఇటీవల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించానని తెలిపారు. రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రం ఇలానే సహకరిస్తుందని అన్నారు. నల్లధనం, అవినీతి నిర్మూలన కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలతో కలిసి పోరాడుతున్నామని తెలి పారు. మూడేళ్ల మోదీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని అన్నారు.
ఈ మూడేళ్లలో మచ్చలేని పాలనను ఆయన అందించిన ఫలితంగా దేశంలో వెంటనే ఎన్నికలు వచ్చినా నరేంద్రమోదీనే ప్రధాని అవుతారని ఆయన జోస్యం చెప్పారు. యూపీఏ ప్రభుత్వంలా తమది అవినీతి, కుంభకోణాల పాలన కాదని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం వివిధ పథకాల కోసం కేటాయించే ధనం ప్రజలకు నేరుగా చేరడం ద్వారా వారు లబ్ధి పొందాలన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం నూరుశాతం ఫలితాలను సాధిస్తుండగా, కాం గ్రెస్ హయాంలో 15 శాతం మాత్రమే ప్రజలకు అందేదని విమర్శించారు.
ప్రధానిగా మరో పదేళ్లు మోదీనే కొనసాగాలని ప్రజలు ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. మూడేళ్లకు ముందు భూమి, గాలిని సైతం వదిలిపెట్టకండా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అన్ని దేశాలూ భారత్ ప్రగతిని ఆసక్తిగా చూస్తున్నాయని, దేశ ఆర్థిక ప్రగతి నేడు 7 శాతంగా ఉండగా, ఇతర దేశాలు 5 లేదా 6 శాతంలో ఉన్నాయని చెప్పారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీనే అధికారంలోకి వస్తుంది, మరో పదేళ్లపాటు మోదీనే అధికారంలో ఉంటారని జోస్యం చెప్పారు. బీజేపీ ప్రభుత్వ మూడేళ్ల విజయాలను ఈ ప్రధర్శనశాలలో అన్ని భాషల్లోనూ తెలుసుకునే వీలుందని చెప్పారు. ప్రజల సందర్శనార్థం ఏడురోజులపాటు ఈ ప్రదర్శనశాల ఉంటుందని అన్నారు.