రోశయ్యను సన్మానిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. చిత్రంలో ఎంపీ సుబ్బరామిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు పదవులు త్యజించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, పార్టీలు మారటం మంచిది కాదని సూచించారు. ప్రస్తుతం ఉన్న పార్టీ మారాలనుకున్నప్పుడు, ఆ పార్టీ ద్వారా వచ్చిన, పొందిన పదవిని వదులుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం రాగ సప్తస్వరం ఆధ్వర్యంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు వెంకయ్యనాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడు, భాషా కోవిదుడు, అజాత శత్రువు రోశయ్యకు సన్మానం చేయడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులందరూ ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. జవాబుదారీతనం, పారదర్శకత, క్రమశిక్షణ వంటి లక్షణాలు అలవర్చుకొని తద్వారా దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని కోరారు. నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ, చట్టసభలు జరిగే తీరు చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు.
పదవులన్నీ యాదృచ్ఛికమే: రోశయ్య
రోశయ్య మాట్లాడుతూ శాసనమండలి, పార్లమెంట్, శాసనసభల్లో వివిధ హోదాల్లో దాదాపు 35 ఏళ్లు పని చేశానని చెప్పారు. ఏ హోదాలో పని చేసినా అప్పగించిన బాధ్యతలకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేయాలన్న ధ్యేయంతోనే పనిచేశానని తెలిపారు. పదవులన్నీ యాదృచ్ఛికంగా వచ్చినవే తప్ప వెంపర్లాడి తెచ్చుకున్నవి కావని స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడు, టి. సుబ్బరామిరెడ్డి తదితర పెద్దల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరగడం జీవితంలో మర్చిపోలేని సంఘటనగా ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment