ఎమ్మెల్యే శ్రీరాం రాజ్‌గోపాల్‌ను సన్మానిస్తున్న గవర్నర్ రోశయ్య
తమిళనాడు గవర్నర్ రోశయ్య
గుంటూరు: ఆర్యవైశ్యులు రాజకీయంగా మరింత ఎదగాల్సిన అవసరం ఉందనీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎమ్మెల్యే, మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులకు అభినందన కార్యక్రమం మంగళవారం జరిగింది. మహాసభ అధ్యక్షుడు కాళ్లకూరి శ్రీరామనాగేశ్వరరావు(నాగబాబు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రోశయ్య మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు 14 మంది ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులు ఉన్నారని, నేడు వారి సంఖ్య ముగ్గురికి పడిపోవటం బాధాకరమన్నారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధులకు రోశయ్య శాలువాకప్పి సత్కరించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవటం సాధారణమైన విషయం కాదని సేవచేస్తూ నలుగురి నోట్లో నాలుకలాగా మెలిగితే ఏ పార్టీ అయినా పిలిచి సీటు ఇస్తుందని చెప్పారు. మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు అంబికా కృష్ణ, వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి శిద్దా రాఘవరావు సతీమణి లక్ష్మీపద్మావతి, పలు జిల్లాలకు చెందిన ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు, మహిళా విభాగం, వాసవి సేవాదళ్ నాయకులు పాల్గొన్నారు.