Venkiah Naidu
-
విప్‌లతో సభకు నిండుదనం
న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాల్లో చివరి రోజున సాధారణంగా సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉంటున్నందున రాజకీయ పార్టీలు విప్‌లు జారీ చేయడం మంచిదేనని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా రాజకీయ పక్షాలు ఇలాగే విప్‌లు జారీ చేస్తే సభ సభ్యులతో కళకళలాడుతుందన్నారు. అధికార బీజేపీ సహా, ఇతర పార్టీలు తమ సభ్యులకు మంగళవారం విప్‌లు జారీ చేయడంపై సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై చర్చ జరిగే సమయంలో సభలో సభ్యులు తక్కువగా ఉంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ఎంతో కీలకమైన బడ్జెట్‌పై పార్లమెంట్ సభ్యులకు ఆసక్తి లేదని భావించే ప్రమాదముందన్నారు. ఆఖరి రోజున రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ జరిగింది. జనవరి 31వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారంతో మొదటి విడత ముగిశాయి. తిరిగి మార్చి 2వ తేదీన మొదలై ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. మంగళవారం సమావేశానికి సభ్యులంతా హాజరుకావాలంటూ అధికార బీజేపీ విప్ జారీ చేయడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. -
మహిళావిద్యను ప్రోత్సహించాలి
హైదరాబాద్: మహిళా విద్యను సమాజంలోని అన్ని సంస్థలు ప్రోత్సహించాలని, తద్వారా వారికి మరింత గౌరవం దక్కుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వేదకాలం నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదన్నారు. తార్నాకలో శనివారం జరిగిన సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ మహావిద్యాలయ కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు ఆయన పలువురు విద్యార్థినులకు బంగారు పతకాలు అందజేశారు. మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని, 71 ఏళ్ల భారతావనిలో నేటికి 20% నిరక్షరాస్యత ఉందని, అందులో మహిళల శాతం ఎక్కువగా ఉండటమే బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మహిళల పట్ల వివక్ష, వేధింపులు జరగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నేడు అన్ని రంగాల్లో మహిళలే ముందున్నట్లు ఆయన చెప్పారు. మహిళా విద్యకు సరోజినీదేవి విద్యా సంస్థలు, ఎగ్జిబిషన్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వెంకయ్యనాయుడు కొనియాడారు. నేడు భారతీయులే సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. పాశ్చాత్య దేశాల సంస్కృతిని అనుసరిస్తే ఆరోగ్యానికి, మన సంస్కృతికి హానీ చేయడమే అవుతుందని హితవు పలికారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ రానున్న కాలంలో బలోపేతం అవుతుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు దేశంలో అత్యంత చౌకధరల్లో నాణ్యమైన ఔషధాలు లభిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా మారిందని, పలు అరుదైన వ్యాధు లు, రోగాల నివారణకు అవసరమైన మందుల కోసం విద్యార్థులు పరి శోధనలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వీరేందర్, కళాశాల కార్యదర్శి సుకేష్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. -
కాళ్లు మొక్కిన వారే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్టీఆర్ కాళ్లు మొక్కినవారే ఆయనకు వెన్నుపోటు పొడిచారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు వారి పేర్లు చెప్పడం సరైంది కాదన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ జూబ్లీ వేడుకలు, అసోసియేషన్‌లో గోదావరి ఆడిటోరియం ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. ఈ రోజుల్లో నిస్వార్థంగా సేవచేయడం కష్టమైన పనిగా మారిందని ఉపరాష్ట్రపతి అన్నారు. వ్యవస్థలను ధిక్కరించడం, చట్టాలను అతిక్రమించడం, చట్టంలోని లొసుగులు తెలుసుకొని సంస్థలను దుర్వినియోగం చేయడం కొన్నేళ్లుగా అందరికీ అలవాటుగా మారిందన్నారు. అయితే ప్రస్తుతం వీటిని సరిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు దేశంలో ఎదురవుతున్న సమస్యలు అందరికీ తెలిసినవేనని వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఎవరి కాళ్లు మొక్కకుండా తన కష్టంతో ఈ రోజు ఈ స్థాయికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివంగత నందమూరి తారకరామారావుతో జరిగిన ఒక ఘటనను వెంకయ్య గుర్తు చేసుకున్నారు. ఒక రోజు కొంతమంది వరుసగా ఎన్టీఆర్ కాళ్లు మొక్కడం చూసి ఇదేంటని ఆయన్ను ప్రశ్నించగా.. అది వాళ్ల ప్రేమ అని సమాధానమిచ్చారన్నారు. అది ప్రేమా? మరేదైనా? అన్నది ఆరునెలల్లో తెలుస్తుందని తాను అప్పుడు బదులిచ్చినట్టు వెంకయ్య చెప్పారు. సరిగ్గా ఆరు నెలల్లోనే ఎన్టీఆర్‌కు ఎవరైతే కాళ్లు మొక్కారో వారందరూ ఆయనకు వెన్నుపోటు పొడిచారని వెంకయ్య వివరించారు. ఆంధ్ర అసోసియేషన్ పనితీరు అభినందనీయం.. ఢిల్లీలో మన సంస్కృతిని స్థానికంగా స్థిరపడిన తెలుగువారికి చేరువచేస్తూ, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్న ఆంధ్ర అసోసియేషన్ పనితీరు అభినందనీయమని వెంకయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, అసోసియేషన్ అధ్యక్షుడు మణినాయుడు, ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతలు ఆర్థికంగా ఎదిగితేనే పండుగ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అన్నదాతలు ఆర్థికంగా నిలదొక్కుకున్నపుడే దేశానికి అసలైన పండుగ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక, గుణాత్మక మార్పులు రావాలని భావించారు. దీనిపై తాను నీతిఅయోగ్‌తో సంప్రదింపులు జరుపు తున్నట్లు తెలిపారు. ప్రస్తుత, గత ప్రభుత్వాలు రైతుల కోసం ఎంతోకొంత మేలు చేశాయని, మరింత సేవ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. దేశంలో ప్రతి పండుగకు ఓ సందేశం ఉందని, అలా సంక్రాంతి.. రైతుల పండగ అని, వారు సంతో షంగా ఉంటేనే దేశం బాగుంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ రెండో వార్షికోత్సవం ఆదివారం జరిగింది. సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాష్ట్ర హైకోర్టు ప్రధానమూర్తి టీబీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి జ్యోతి వెలిగించిన అనంతరం ప్రసంగించారు. సమాజ సేవే లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా యువతకు వందశాతం ఉద్యోగావకాశాలు లభించడం సంతోషానిస్తోందన్నారు. మరికొందరు స్వయం ఉపాధి కల్పించుకోవడం శుభపరిణామమని అన్నారు. భాష, సంస్కృతి పరిరక్షణకు తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. స్వర్ణభారత్ ట్రస్టీ దీపా వెంకట్ రాజకీయాల్లోకి రావాలని అందరూ ఒత్తిడి తెస్తున్నా సున్నితంగా ఆమె తిరస్కరిస్తూ సమాజసేవకు ప్రాధాన్యమి స్తున్నారని తెలిపారు. ‘లాభం వచ్చే వారసత్వం కోసం ఎవరైనా ముందుకొస్తారు. కాని సమాజం కోసం పనిచేసే సంస్థకు మా బిడ్డలు దీపా, హర్షవర్ధన్ సమయం కేటాయిం చడం హర్షణీయం. ఈ వారసత్వాన్ని నేను ప్రోత్సహిస్తాను. నేను రాజకీయాల్లోకి వచ్చా కాబట్టి.. నా సంతానమూ అందులో ఉండా లనుకోవడం లేదు. రాజకీయ నేతల కొడు కులు, కుమార్తెలు రాజకీయాల్లోకి రావొద్దని కాదు. వారి శక్తి, సామర్థ్యాన్ని బట్టి రాజకీయా లను ఎంచుకోవాలి. ఫలాన నేత కొడుకు అని చెప్పుకునే వారసత్వం మంచిదికాదు’ అని వెంకయ్య అన్నారు. ఈర‡్ష్య, అసూయ, ద్వేషం వంటి చెడు లక్షణాలు విద్యావంతుల్లోనే ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పండుగ సందర్భంగా గంగిరెద్దులు కనిపించడం లేదని, రాజకీయాల్లో మాత్రం వాటిని చూస్తున్నామని చమత్కరించారు. గ్రామీణాభివృద్ధికి ట్రస్ట్ ఓ మోడల్ అశోకుని కాలంలో దేశాన్ని స్వర్ణభారతం అని పిలిచే వారని, మళ్లీ ఇప్పుడు దేశంలో సామాజిక మార్పు కోసం ‘స్వర్ణభారత్ ట్రస్ట్’ కృషి చేస్తోందని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.పేదలు, రైతులు, మహిళల అభివృద్ధి పట్ల వెంకయ్య నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తారని, అందుకే ట్రస్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో సాగుతోం దన్నారు. గ్రామీణాభివృద్ధికి ఓ మోడల్‌గా నిలిచిందని, సేవతోపాటు సంస్కృతీ పరిరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఉన్నతమై నవన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆలోచన చాలా గొప్పదని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్ అన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహోన్నతుల స్ఫూర్తితో గ్రామీణ యువత,మహిళలు, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. గ్రామీణ భారతం నైపుణ్య భారత్‌గా మారాలని ఆకాంక్షించారు. సంస్కృతుల సమ్మోహనం సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించారు. తప్పెట గుళ్లు, ఒగ్గుడోలు, హరిదాసులు, గంగిరెద్దులు, పిట్టలదొర వంటి జానపద కళారూపాలను ప్రదర్శించారు. అలాగే జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ప్రదర్శన జరిపారు. వివిధ జాతులకు చెందిన ఆవులను ప్రదర్శనలో ఉంచారు. బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. సినీగాయని సునీత, శ్రీకృష్ణ బృంద సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలలిచింది. పేరిణి నృత్యం అందరిలో భక్తిభావనను పొంగించింది. యువకుడు విష్ణుభట్ల కార్తీక్ పాడిన తెలుగు పద్యాలు ఆహూతుల్ని కట్టిపడేశాయి. ఉపరాష్ట్రపతి అతనిని ప్రత్యేకంగా అభినందించడం విశేషం. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. -
పల్సస్ ఎండీ శ్రీనుబాబుకు అవార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య, ఆరోగ్య, సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలకు గాను పల్సస్ సీఈఓ, ఎండీ డాక్టర్ గేదెల శ్రీనుబాబుకు చాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు దక్కింది. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడి చేతుల మీదుగా శ్రీనుబాబు ఈ అవార్డును అందుకున్నారు. పల్సస్ సంస్థ... ఒమిక్స్ ఇంటర్నేషనల్ ద్వారా హెల్త్ కేర్ రంగానికి సంబంధించి ఓపెన్ యాక్సెస్ జర్నల్స్‌ను ప్రచురిస్తోంది. విదేశాలతో పాటు హైదరాబాద్, చెన్నై, గుర్గావ్, విశాఖపట్నం ప్రాంతాల్లో సంస్థకు కార్యాలయాలున్నాయి. -
పుస్తక పఠనంతోనే చైతన్యం
సాక్షి, హైదరాబాద్: పుస్తకాలు భాషా, సంస్కృతులకు దర్పణాలని, విజ్ఞాన సముపార్జనలో, సమాజాభివృద్ధిలో కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పుస్తక పఠనం పెరిగి, సమాజంలో చైతన్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. 32వ హైదరాబాద్ జాతీయ పుస్తకమహోత్సవ వేడుకలు శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, తెలంగాణ మీడియా కమిషన్ చైర్మన్ అల్లం నారాయణ, హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగించారు. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమం అప్పట్లో ప్రజలను చైతన్యవంతులను చేసిందని, మరోసారి ఆ ఉద్యమం రూపుదాల్చా లని అన్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛాలయం (శౌచాలయం), ప్రతి పల్లెకూ గ్రంథాలయం నినాదంతోపాటుగా స్వచ్ఛత మరియు పుస్తకాలు చదివే సంస్కృతి విస్తరించాలని సూచించారు. తెలుగు భాషాభిమాని, రచయిత అయిన సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో గ్రంథాలయాల ప్రాధాన్యత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ‘‘అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక’’అన్న కాళోజీ మాటల్ని గుర్తు చేశారు. పుస్తకాలే అండగా నిలిచాయి.... దేశాభివృద్ధి, విజ్ఞాన శాస్త్ర పురోగతి, యుద్ధాలు, శాంతి సుస్థిరతల స్థాపన వంటి అనేక సందర్భా ల్లో సమస్త మానవాళికి పుస్తకాలే అండగా నిలిచాయన్నారు. ఇలాంటి వేడుకల్లోనే కొత్త పుస్తకాల గురించి, కొత్త రచయితల గురించి తెలుసుకోవచ్చునన్నారు. ఆన్లైన్ డిజిటల్ వేదికలు వచ్చినప్పటికీ అచ్చులో అక్షరం విలువ, పరిమళం ఎప్పటికీ వాడిపోవని చెప్పారు. నేషనల్ బుక్ ట్రస్ట్ 1966లో ముంబైలో తొలిసారి పుస్తక ప్రదర్శన నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ బుక్ ఫెయిర్ దేశంలో రెండో స్థానం లో ఉందని, మొదటి స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ మొదటిస్థానానికి చేరేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. తెలుగు భాష సాంస్కృతిక, సారస్వత పునరుజ్జీవనానికి, తెలంగాణ వికాసానికి గ్రంథాలయ ఉద్యమం చేసిన కృషిని గుర్తు చేశారు. విద్యార్థులకు మహనీయు ల జీవితాలు, చరిత్రను, సంస్కృతిని, విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను పరిచయం చేయాలని దిశానిర్దేశం చేశారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయడం ద్వారా విజ్ఞానం, మెరుగైన జీవితం తద్వారా మెరుగైన సమాజం సాకారమవుతాయన్నారు. ప్రధాని మోదీ సూచించిన విధంగా వివిధ కార్యక్రమాల్లో మంచి పుస్తకాలను బహుమతులుగా అందజేయాలని సూచించారు. ప్రజల్లో పఠనాసక్తిని పెంచేందుకు పత్రికలు, మీడియా చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
ప్రజారోగ్యం సవాళ్లను అధిగమించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యం విషయంలో దేశం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లను అధిగమించాలంటే వ్యవసాయ, పోషకాహార శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. దేశం ఆర్థికంగా ఎదుగుతోన్న ఈ తరుణంలోనూ కొంతమంది పోషకాహార లోపాలు, సూక్ష్మ పోషకాల లేమి, ఊబకాయం వంటి అధిక పోషణ సమస్యలు కలిగి ఉండటం బాధాకరమన్నారు. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఎన్ఐఎన్ విశేష సేవలు అందించిందన్నారు. జనాభా పెరుగుదల, మారుతు న్న జీవనశైలుల నేపథ్యంలో అందరికీ పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు వరి సాగు స్థానంలో ఇతర పోషకాలు అందించే పంటలపై పరిశోధనలు ఎక్కువ చేయాలన్నారు. జీవనశైలి మార్పుల వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఉచిత రుణమాఫీపై అభ్యతరం.. రైతులను ఆదుకునే పేరుతో కొన్ని ప్రభుత్వాలు ఉచిత రుణమాఫీలు ప్రకటిస్తుండటంపై ఉపరాష్ట్రపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉచిత పథకాలు రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించినా శాశ్వత పరిష్కారం మాత్రం కాదని తెలిపారు. సుస్థిర అభివృద్ధి కోసం దీర్ఘకాల పరిష్కారాలు అవసరమని, మరీ ముఖ్యంగా ఆహార రంగంలో ఈ అవసరం ఎక్కువగా ఉందన్నారు. ఆరోగ్యకరమైన భోజనంలో ఎలాంటి ఆహారం ఉండాలన్న అంశంపై ఎన్ఐఎన్ సిద్ధం చేసిన సమాచారాన్ని ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. కార్యక్రమంలో భారత వైద్య పరిశోధన సమాఖ్య డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ, ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత పాల్గొన్నారు. -
తెలంగాణకు ‘అత్యంత మెరుగైన రాష్ట్రం’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుల్లో తెలంగాణకు ‘అత్యంత మెరుగైన పెద్ద రాష్ట్రం’ అవార్డు దక్కింది. గురువారం ఇక్కడ జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సీఎం కేసీఆర్ తరఫున తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రానికి అవార్డు రావడం సంతోషకరమని, గతేడాది రాష్ట్రంలోని పాలనను పరిగణనలోకి తీసుకుని అవార్డు ఇచ్చారన్నారు. -
పరిశోధనలకు పదును పెట్టండి
కాజీపేట అర్బన్: దేశాభివృద్ధికి, మానవాళి మనుగడకు తోడ్పడేందుకు నూతన ఆవిష్కరణలను అందిస్తూ ఇన్నోవేషన్ హబ్‌గా నిట్ వరంగల్ మారాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విద్యార్థులు ఆవిష్కరణలకు, పరిశోధనలకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు. కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెం టర్ ఆడిటోరియంలో సోమవారం నిట్ వ జ్రోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వజ్రోత్సవాల శిలాఫలకాన్ని, రూ.25 కోట్లతో పూర్వ విద్యార్థులు నిర్మించనున్న అల్యూ మ్ని కన్వెన్షన్ సెంటర్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆలోచనల ప్రతిరూపమే నిట్ అని, ప్రస్తుతం నిట్ వజ్రోత్సవాలను జరుపుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణలో తనకు నచ్చిన ఏకైక జిల్లా వరంగల్ జిల్లా అని.. నాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్ సిటీ వరంగల్‌ను, ఏపీలో అమరావతిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రకృతి సంపదను, కాకతీయుల వారసత్వాన్ని కాపాడుకుంటూ చరిత్రాత్మక చరిత్రగల ఓరుగుల్లును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని సూచించారు. అత్యాధునిక ల్యాబ్‌లతో, నిష్ణాతులైన అధ్యాపకులతో సాంకేతిక విద్యకు కేం ద్రంగా నిలుస్తూ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక కళా శాలగా నిట్ వరంగల్ పేరుగాంచిందని ఆయన కొనియాడారు. పూర్వ విద్యార్థులు రూ.25 కోట్ల తో అల్యూమ్ని కన్వెన్షన్ సెంటర్‌ను అందించడం అభినందనీయమన్నారు. యువతకు ఉపాధినందించేందుకు స్కిల్ ఇండియా ఇంటికో ఉద్యోగమిస్తామనడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని.. కొందరు హామీలు ఇచ్చినా అమలుకు నోచుకోవని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇందు కోసం ప్రధాని మోదీ యువతకు ఉపాధినందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించి నిరుద్యోగులుగా మిగిలిపోకుండా స్వయం ఉపాధితో రాణించేందుకు స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా లు తోడ్పడుతున్నాయని ఆయన వివరించారు. యువత ఎల్పీజీకి సిద్ధంగా ఉండాలి నేటి ఆధునిక యుగంలో గ్రామాలను వీడి ప్రజ లు ఉపాధి కోసం నగర బాట పడుతున్నా రని వెంకయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధికి పోటీ పెరుగుతోందన్నారు. 2025లో ఎల్పీజీ (లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) యు వత ఉపాధికి పోటీగా మారనుందన్నారు. ఎల్పీజీకి దీటుగా నిలిచేందుకు నూతన ఆవిష్కరణ లు, పరిశోధనలతో ముందుకు సాగాలన్నారు. చరిత్రాత్మక సందేశాన్ని అందించే బతుకమ్మ మానవ జీవితం ప్రకృతి ఒడిలో మమేకమైన చరిత్రాత్మక సందేశాన్ని బతుకమ్మ పండుగ అందిస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రకృతిలో పువ్వులను ఒక రూపంగా మార్చి పూజించడం భారతీయ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అన్నారు. తెలంగాణ పండుగలు జాతీయ సమైక్యతను తెలియపరుస్తుంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నిట్ రిజిస్ట్రార్ గోవర్దన్ అధ్యక్షత వహించారు. -
సాగు ఖర్చు తగ్గితేనే రైతుకు రాబడి
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే రైతులు ఎక్కువ పండించడం కాదని, సాగు ఖర్చులు తగ్గించుకునే పద్ధతులు అనుసరించాలని, అప్పుడు లాభాలు వస్తాయని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రైతులు ఆ దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. రైతు నేస్తం పురస్కారాల సందర్భంగా ఆదివారం స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, రైతునేస్తం ఎడిటర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పీహెచ్‌డీలు, ఇతర ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు వ్యవసాయంవైపు రావాలని కోరారు. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రణాళికలు రచించారని చెప్పారు.వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా అనేక ముఖ్యమైన శాఖలు ఇచ్చేందుకు ఆయన తన అభిప్రాయం కోరారని, తాను పెద్దగా స్పందించక పోవడంతో అద్వానీకి ఆ విషయం చెప్పారనీ, అప్పుడు అద్వానీ తనను అడిగితే వ్యవసాయమంటేనే ఇష్టమన్నానని, అది వేరే వారికి ఇవ్వడంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చారని తెలిపారు. వ్యవసాయ పరిశోధన ఫలితాలు నేరుగా ప్రజలకు చేరాలని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై దృష్టిసారించాలి... విద్య, వైద్యం, వ్యవసాయరంగాలపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రోగం వచ్చాక చికిత్స చేసే కంటే రోగం రాకుండా ఏంచేయాలో వైద్యులు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రస్తుతం గాలి, నీరు, ఆకాశం, ఆలోచనలు కలుషితం అయ్యాయన్నారు. ప్రస్తుత జీవనశైలితో కష్టం, శ్రమ తగ్గిందన్నారు. జబ్బు వస్తే వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందన్నారు. అందుకే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిందన్నారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లు మంచిది కాదన్నారు. నాటుకోడి పులుసు, నెల్లూరు చేపల పులుసు, హైదరాబాద్ ధమ్ బిర్యానీ, గుంటూరు గోంగూర పచ్చడి ఇలా సంప్రదాయ వంటకాలే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. కనీస మద్దతు ధర పెంచడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. రైతు నేస్తం పురస్కారాలు... రైతు నేస్తం పత్రిక ఆధ్వర్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ ఐ.వి.సుబ్బారావు పేరిట పురస్కారాలను పలువురు ప్రముఖులకు అందజేశారు. జర్నలిజంలో వ్యవసాయ రంగంలో చేస్తున్న కృషికిగాను ‘సాక్షి‘ఎడిటర్ వి.మురళికి ప్రకటించారు. అలాగే రైతునేస్తం జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావుకు ఉప రాష్ట్రపతి అందజేశారు. కృషిరత్న అవార్డును డాక్టర్ ఖాదర్‌వలికి అందజేశారు. అలాగే రైతుల విభాగంలో వి.రజిత, నామన రోశయ్య, బోగోలు రాజేశ్, కొప్పుల శ్రీలక్ష్మి, క్రాంతి కిరణ్, గూడూరు వెంకట శివరామప్రసాద్, హరిబాబు, విశ్వేశ్వర్‌రెడ్డి, అయ్యప్పనాయుడు, యల్లా బాలస్వామి, నల్లపాటి రామకృష్ణ, కర్రమురళీధర్, హనుమంతరావునాయుడు, డి.నరేష్, రమణారెడ్డి అందుకున్నారు. శాస్త్రవేత్తల విభాగంలో శ్యాంసుందర్‌రెడ్డి, సి.మధుమతి, ఎ.నారాయణరావు, కృష్ణారావు, శరత్చంద్ర, హరిబాబు, త్రివేణి, కోటిలింగారెడ్డి, ఈడ్పుగంటి శ్రీలత అందుకున్నారు. విస్తరణ విభాగంలో ధనలక్ష్మి, రవీంద్రబాబు, శివరాం, రాజాకృష్ణారెడ్డి, పెంటయ్య, ఆంజనేయులు, ములగేటి శివరాం, రవిచంద్రకుమార్, చంద్రశేఖర్‌రావు, కొండల్‌రెడ్డి, రేగూరి సింధూజ అందుకున్నారు. జర్నలిజం విభాగంలో సుమనస్పతరెడ్డి, సునీల్‌కుమార్, వీరరాఘవరెడ్డి, శరత్‌బాబు, అహోబలరావు, సుధాకర్‌రెడ్డి, రమేశ్ అందుకున్నారు. -
జయ కేసులో వెంకయ్యకు సమన్లు?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై విచారణలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావులకు సమన్లు జారీ చేసేందుకు విచారణ కమిషన్ సిద్ధమవుతోంది. 2016 సెప్టెంబరు 22వ తేదీన అనారోగ్య కారణాలతో జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరడం, అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూయడం తెలిసిందే. నాడు జయను పరామర్శించేందుకు అపోలో ఆస్పత్రికి వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ విద్యాసాగర్‌లను విచారించాలని కమిషన్ భావిస్తోంది. తన తరఫు లాయర్‌ను అనుమతించాలని జయ మేనకోడలు దీప చేసిన విజ్ఞప్తిని కమిషన్ తోసిపుచ్చింది. దీంతో ఆమె బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఫిరాయింపుల్ని త్వరగా తేల్చాలి
న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రతిష్టను పునరుద్ధరించడమే తన తక్షణ ప్రాధాన్యతని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. సభలో అనుచితంగా ప్రవర్తించే సభ్యుల్ని నియంత్రించేందుకు రాజ్యసభ నియమావళిలో మార్పులు అవసరమని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కఠిన నిబంధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. చట్టసభ సభ్యుడు పార్టీ మారినప్పుడు అందే ఫిర్యాదులపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవడం, ఎన్నికల సంబంధిత పిటిషన్ల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వంటి సంస్కరణలు చేపట్టాలన్నారు. పార్టీల్ని వదిలిపెట్టే చట్ట సభ్యులు వారి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. ‘అది కనీస నైతిక బాధ్యత. దీనిని రాజ్యాంగ బాధ్యతగా మార్చాలని కోరుతున్నా’ అని అన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ.. పార్టీ ఫిరాయింపుల కేసుల్లో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యంపై∙ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతి పార్టీ స్వలాభం చూస్తోంది. అన్ని పిటిషన్లను 3 నెలల్లోపు పరిష్కరించాలి. చట్ట సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల్ని సవరించాలి. మీరు ప్రిసైడింగ్ అధికారి స్థానంలో ఉండి ఫిర్యాదులపై జాప్యం చేస్తే మీరు చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం’ అన్నారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే పార్లమెంట్ నియమావళిని మార్చేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజ్యసభ నియమావళి సమీక్ష కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించిందని, అక్టోబరు చివరినాటికి తుది నివేదిక అందచేస్తుందని అన్నారు. రిజర్వేషన్ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని.. రిజర్వేషన్లకు అర్హులైన వారిలో కొందరికే కోటా ఫలాలు అందుతున్నాయని, దీంతో కొన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని చెప్పారు. -
పార్టీ మారితే మంత్రి పదవులా?
సాక్షి, న్యూఢిల్లీ: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ నేతలపై కాకుండా రాజకీయ పార్టీలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఇంకో పార్టీలో మంత్రులను చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. చట్టసభల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకం పునరుద్ధరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో సమగ్రమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఏడాది కాలంలో తన అనుభవాలు, చేపట్టిన కార్యక్రమాలతో ‘మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్’ పేరుతో రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసమే తన ఏడాది ప్రయాణానికి పుస్తక రూపం కల్పించినట్లు వెంకయ్య తెలిపారు. ‘ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరేవారు ముందుగా రాజీనామా చేసి పార్టీ వీడాలి. లేదంటే అలాంటి వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలి. నేను దీన్నే అనుసరించి ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నా. ఒక పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా గెలుపొంది ఇంకో పార్టీలో మంత్రులవ్వడం ఏంటి? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చట్టసభలపై ప్రజల్లో నమ్మకం కలిగేలా రాజకీయ పార్టీలు సమగ్ర నియమావళిని రూపొందించుకోవాలి’ అని వెంకయ్య పిలుపునిచ్చారు. వివక్షరహిత భారతమే లక్ష్యంగా.. లింగ, కుల, మత వివక్షను ఏ జాతీయవాదీ ఉపేక్షించబోరని, ప్రతి ఒక్కరూ ఇదే విధానాన్ని అవలంబించాలని వెంకయ్య సూచించారు. ‘మరింత సమగ్రమైన సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కాలి. మరీ ముఖ్యంగా ఇంతవరకు ప్రాతినిధ్యానికి దూరంగా ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. రాజకీయాలను ప్రక్షాళన చేసుకుని.. వ్యవసాయ రంగం, యువ భారతం ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంటరీ, పాలనా వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో భారత్‌మాతాకీ జై అంటే జాతీయవాదమే. ఇది కుల, మతాలకు అతీతంగా 130 కోట్ల మందికి జై కొట్టినట్లే’ అని వెంకయ్య పేర్కొన్నారు. భారత ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను చూసి సంబరాలు చేసుకోవాల్సిన సమయమిది. అయితే పార్లమెంటు నడుస్తున్న విధానంతోనే కాస్త అసంతృప్తి ఉంది’ అని వెంకయ్య చెప్పారు. రాష్ట్రాల్లో ఎగువసభల ఆవశ్యకతపై.. రాష్ట్రాల్లో ఎగువసభల ఆవశ్యకతపై ఓ జాతీయ విధానం అవసరం ఉందని వెంకయ్య పేర్కొన్నారు. సభ లోపల, బయట సభ్యుల ప్రవర్తనా నియమావళిపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని సూచించారు. కులం, మతం ఆధారంగా ఎవరిపైనైనా వివక్ష చూపడాన్ని ఏ జాతీయవాదీ సహించబోరన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ నిరంకుశత్వమా?: మోదీ న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం పెరిగిపోతోందంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణతో ఉండమంటే నిరంకుశుడనే ముద్రవేస్తున్నారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. ‘వెంకయ్యనాయుడు క్రమశిక్షణతో నడుచుకునే వ్యక్తి. కానీ క్రమశిక్షణను అప్రజాస్వామికం అని విమర్శించేలా డిక్షనరీలో అర్థాలు వెతుకుతున్నారు. ఓ వ్యక్తి క్రమశిక్షణగా ఉండాలని పిలుపునిస్తే.. ఆయన్ను నిరంకుశుడిగా ముద్రవేస్తున్నారు. కానీ వెంకయ్యనాయుడు మాత్రం ఆయన చెప్పే క్రమశిక్షణను ఆచరించి చూపిస్తారు’ అని ప్రధాని పేర్కొన్నారు. వెంకయ్య బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలసి ఒక కార్యకర్తగా పనిచేశానని, లక్ష్య సాధనలతో స్పష్టమైన ప్రణాళికలతో పనిచేస్తారని ప్రశంసించారు. ‘వెంకయ్య నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆయన వాచీ పెట్టుకోరు. జేబులో పెన్ను, డబ్బులు పెట్టుకోరు. కానీ సరైన సమయానికి కార్యక్రమాలకు హాజరవుతారు. ఆయన స్వభావంలోనే క్రమశిక్షణ ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘వెంకయ్యకు కీలకమైన శాఖను అప్పజెప్పేందుకు నాటి ప్రధాని వాజ్‌పేయి సిద్ధమైతే.. గ్రామీణాభివృద్ధి శాఖను వెంకయ్య ఎంచుకున్నారు. అదే ప్రజలపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం’ అని గుర్తుచేశారు. ‘సభ సజావుగా జరుగుతున్నప్పుడు స్పీకర్ స్థానంలో ఎవరున్నారనే దానిపై పెద్దగా దృష్టిపెట్టం. కానీ వారు ఆ స్థానంలో ఉన్నందుకే సభ ప్రశాంతంగా సాగుతుందనే విషయాన్ని మరవొద్దు’ అని మోదీ అన్నారు. -
ప్రకృతి సమతుల్యత లేకే విపత్తులు
సాక్షి, అమరావతి : ప్రకృతి, సంస్కృతులను పరిరక్షించుకోవడం ద్వారానే మంచి భవిష్యత్తు ఉంటుందని, సమతుల్యత దెబ్బతింటున్నందునే అనేక ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. పర్యావరణ హితంగా భవనాల రూపకల్పన బాధ్యత యువ ఆర్కిటెక్ట్‌లపై ఉందని, స్మార్ట్ ఇండియాలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏవీ) 3వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంవల్ల ఇటీవల కేరళ, అంతకు ముందు చెన్నై, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఏర్పడిన విపత్తులను ఉదాహరించారు. యువ ఆర్కిటెక్టులకు రానున్న కాలంలో అనేక అవకాశాలున్నాయన్నారు. నేటి భవనాల నిర్మాణాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టడంలేదని, భవన ప్లాను రూపకల్పన సమయంలోనే వీటన్నిటినీ తప్పనిసరిచేయాలని ఆయన సూచించారు. పచ్చదనం, పరిశుభ్రత కలిగిన నగర నిర్మాణాలను చేపట్టాల్సిన, అందుకు అనుగుణమైన ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత యువ ఆర్కిటెక్టులపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో యువ ఆర్కిటెక్టులపై మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో విజన్ ఉన్న నేతలని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అభివృద్ధితో దేశం ముందుకు వెళ్తోందని, ఈ తరుణంలో యువతకు రానున్న కాలంలో అనేక అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఐఐటీ, ఎయిమ్స్, ఎన్ఐటీ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలు నెలకొంటున్నాయని, ఎస్‌పీఏవీకి అత్యద్భుతమైన భవనం సమకూరడం ఎంతో ఆనందదాయకమన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో.. వేదాల కాలం నుంచే భవన నిర్మాణాలపై అనేక అంశాలు పొందుపరిచి ఉన్నాయని వివరించారు. నేటి భవనాలలో అనేక లోపాలుంటున్నాయని, రానున్న కాలంలో అన్ని మౌలిక వసతులతో పర్యావరణానికి హాని కలగని రీతిలో భవనాలుండేలా ఆర్కిటెక్టు విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎస్పీఏవీ చైర్మన్ బృందా సోమయా, డైరక్టర్ మీనాక్షి జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించిన 10 మందికి ఉత్తమ పరిశోధనలు చేసిన 12 మందికి అవార్డులు అందించారు. 2017, 2018లలో విద్యాభ్యాసం పూర్తిచేసిన 280 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అంతకుముందు.. విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థ నూతన భవనాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు ప్రారంభించారు. -
ఒక్క సిక్కింకే వెళ్లలేదు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి నేడు ఏడాది పూర్తిచేసుకుంటున్న వెంకయ్యనాయుడు అరుదైన ఘనత సాధించారు. ఆయనకు ముందు పదేళ్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ తన పదవీకాలంలో 26 రాష్ట్రాల్లో పర్యటించారు. కానీ వెంకయ్య ఏడాది కాలంలో ఒక్క సిక్కిం మినహా మిగిలిన 28 రాష్ట్రాల్లో పర్యటించారు. సిక్కిం పర్యటనకూ బయల్దేరిన వెంకయ్య ప్రతికూల వాతావరణం వల్ల అర్ధంతరంగా వెనుదిరిగారు. వెంకయ్య సిక్కిం మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించగా, అన్సారీ మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, అస్సాంలోనే పర్యటించారు. -
సమాజ అవసరాలు తీర్చే పరిశోధనలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: సుస్థిరాభివృద్ధికి అత్యంత కీలకమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వాలతోపాటు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సమాజ అవసరాలను తీర్చే వినూత్న పరిశోధనలకు పెద్దపీట వేయాలని శాస్త్రవేత్తలను కోరారు. సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) ప్లాటినమ్ జూబ్లీ వేడుకల ప్రారంభం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న పరిశోధన సంస్థలు యువ శాస్త్రవేత్తల ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు అనువైన వాతావరణం కల్పించాలని కోరారు. భూతాపోన్నతి, వాతావరణ మార్పుల నేపథ్యంలో భవిష్యత్తులో స్వచ్ఛమైన నీరు, తగిన ఆహారం లభించడం కూడా పెను సవాళ్లుగా మారనున్నాయని, శాస్త్రవేత్తలు వీటిని అధిగమించడంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. దశాబ్దాల క్రితం హరిత విప్లవం దేశ ఆహార అవసరాలను తీరిస్తే, నేడు మేధో విప్లవం సాయంతో వ్యవసాయం, రైతుల సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు. దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార పదార్థాల ఉత్పత్తి అవసరమని, దానికి అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలే కాదు, సామాన్యుడు కూడా మన దేశానికి ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారని, వారి భద్రతకు చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు. ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ మన దేశానికి చాలా అవసరమని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన అందరికీ ఆరోగ్యం, విద్య అందాలన్నా, లింగవివక్ష అంతం కావాలన్నా మన ఆలోచన విధానం మారాలని వెల్లడించారు. ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న పరిశోధన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,227 వరకూ ఉంటే అందులో సీఎస్ఐఆర్ తొమ్మిదో స్థానంలో ఉండటం దేశానికే గర్వకారణమని కొనియాడారు. ఒక్కతాటిపైకి తెచ్చాం: హర్షవర్ధన్ నాలుగేళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చిన తరువాత సీఎస్‌ఐఆర్‌తోపాటు దేశంలోని అన్ని పరిశోధన సంస్థలను ఒక్కతాటిపైకి తీసుకురాగలిగామని, ఫలితంగా దేశంలో పరిశోధనల తీరుతెన్నులు మారిపోయాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. సీఎస్ఐఆర్లోని మొత్తం 37 సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన డెహ్రాడూన్ డిక్లరేషన్ ద్వారా దేశంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు చేపట్టడం సాధ్యమైందని, ఐఐసీటీ వైద్యం, ఇంధన రంగాల్లో ఇలాంటి ప్రాజెక్టులు నిర్వహిస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ మాట్లాడుతూ వ్యవసాయానికి కీలకమైన కీటకనాశినులను దేశీయంగా తయారు చేయడం మొదలుకొని ప్రాణాధార మందులను జెనరిక్ రూపంలో చౌకగా అందించడం వరకూ ఐఐసీటీ చేసిన సేవ ఎంతో ముఖ్యమైందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, సీనియర్ శాస్త్రవేత్తలు ఎన్.వి.సత్యనారాయణ, శైలజ దోనంపూడి, ఐఐసీటీ మాజీ డైరెక్టర్లు, దేశవ్యాప్త సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. -
అన్నం పెట్టే చేతికి ఊతమివ్వండి
సాక్షి, అమరావతి/ఆత్కూరు (గన్నవరం): అన్నం పెట్టే చేతులకు ఊతమివ్వాలే తప్ప రాజకీయాలు తగదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా వ్యవసాయం గురించి ఆలోచించాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగ నిపుణుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన ’ఆరుగాలం’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం విజయవాడలో జరిగింది. డాక్టర్ చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ రైతుకు శాశ్వత న్యాయం జరగాలంటే మౌలిక వసతులు కల్పించాలే తప్ప రుణమాఫీ వంటి ఉపశమన చర్యలు పరిష్కారమార్గం కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విస్మరణకు గురైన రంగం వ్యవసాయమేనని, దాన్ని ప్రస్తుతం సవరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రైతు దృక్పథంలోనూ మార్పు రావాలని, అదనపు విలువ జోడింపు, ఆహార శుద్ధి, పంటల మార్పిడి, ఈ–నామ్ వంటి వాటిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. నూటికి 40 శాతం మందికే వ్యవస్థాగత రుణ సౌకర్యం లభిస్తోందని, మిగతా 60 శాతం మంది ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారని, పంటల బీమా రంగంలోనూ మార్పులు రావాల్సి ఉందన్నారు. సాగుతో పాటు పాడి, కోళ్ల పెంపకం వంటి అనుబంధ రంగాలపైనా దృష్టి పెడితే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పుస్తక రచయిత యలమంచిలి శివాజీని ఘనంగా సత్కరించారు. పుస్తకం ప్రచురించిన రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు రైతులకు చేస్తున్న సేవను కొనియాడారు. అనంతరం నిర్వాహకులు ఉపరాష్ట్రపతిని ఘనంగా సన్మానించారు. మంత్రి కొల్లు రవీంద్ర, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు హాజరయ్యారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో పుస్తకావిష్కరణ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో పోలూరు హనుమజ్జానకీరామశాస్త్రి రచించిన జీవితం–సాహిత్యం సంకలన పుస్తకాన్ని ఆదివారం ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ పాశ్చాత్య పోకడల వలన కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయన్నారు. యువత వీటి బారిన పడకుండా మన జీవన విధానాన్ని కొనసాగించాలన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌లో స్కిల్‌డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో ప్రాథమిక శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కేఎల్ వర్సిటీని అభినందించారు. -
ఏకాభిప్రాయానికి రావాలి
న్యూఢిల్లీ: రాజ్యసభకు తదుపరి డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఏకాభిప్రాయానికి రావాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు అధికార, ప్రతిపక్ష పార్టీలను ఆదివారం కోరారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఆదివారం పదవీ విరమణ పొందిన పీజే కురియన్‌కు వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య ఈ విజ్ఞప్తి చేశారు. వీడ్కోలు కార్యక్రమానికి పార్టీలకతీతంగా పలువురు నేతలు హాజరయ్యారు. వెంకయ్య మాట్లాడుతూ ‘తదుపరి డిప్యూటీ చైర్మన్‌గా ఎవరు ఉండాలనేదానిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయని నేను ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. కురియన్ తనకు మంచి సహోద్యోగిగా ఉన్నారనీ, ఎంతో ఉత్సాహంతో సభను నడిపేవారని వెంకయ్య కొనియాడారు. అనంతరం కురియన్ మాట్లాడుతూ పెద్ద ఆటంకాలు లేకుండా సభ సజావుగా సాగేలా చూడాలని సభ్యులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే ఇరుపక్షాలు కలసి కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప అస్తమానం సభా కార్యకలాపాలకు అడ్డుతగలకూడదని హితవు చెప్పారు. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, విజయ్ గోయెల్, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, సీపీఐ నేత డి.రాజా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ఎంపీ ల్యాడ్స్ కమిటీలో సంతోష్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్) పథకం అమలును పర్యవేక్షించే రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ కమిటీలో టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు చోటు దక్కింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఎంపీ ల్యాడ్స్ కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 12 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీలో ఏపీ నుంచి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా ఉన్నారు. ఎంపీ ల్యాడ్ పథకం కింద అభివృద్ధి పనులు వేగంగా సాగేం దుకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది. -
దేశీయ భాషలకు పునరుజ్జీవం కల్పించాలి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సారస్వత పరిషత్‌కు పెద్ద చరిత్ర ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఏర్పడి 75 ఏళ్లు అయిన సందర్భంగా శనివారం ఇక్కడ పంచ సప్తతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ భాషలను ప్రభుత్వాలు పునరుజ్జీవింప చేయాలని సూచించారు. తెలుగు సాహిత్య పరిరక్షణకు పలువురు మహానుభావులు కంకణం కట్టుకున్నారని, ఆనాడు ఎన్నో అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా సారస్వత్ పరిషత్ ఏర్పాటుకు కృషి చేశారని కొనియాడారు. తెలుగు భాష పరిరక్షణకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఆధునికత పేరుతో ఆంగ్ల భాషపై వ్యామోహం పెరిగిందని, ఇంగ్లిష్ వస్తేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనే భావన ప్రజల్లో ఉందని. ఇది సరికాదన్నారు. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్నిరకాల పరీక్షలను ఆయా ప్రాంతాల భాషల్లో నిర్వహించటం మూలంగా మాతృభాష పరివ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని, అప్పుడే ఆయా దేశీయ భాషల ఉనికి కాపాడబడుతుందని అన్నారు. మాతృభాష నేర్చుకొన్నా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కల్పించాలని, అప్పుడే భాషాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు సారస్వత పరిషత్ గణనీయమైన పాత్ర పోషించిందన్నారు. పరిషత్ 75 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సారస్వత పరిషత్తు భవనం మరింత విశాలంగా చేసేందుకు ‘నిర్మించు – నిర్వహించు’అనే ప్రాతిపదికన ప్రయివేట్ సంస్థల ద్వారా అభివృద్ధి చేయాలన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రితో మాట్లాడి దీనికి సహాయం అందేలా చూస్తానన్నారు. తన వంతుగా రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ రూ.2 లక్షల విరాళం ఇచ్చారు. పరిషత్‌లో ఓ పెద్ద హాల్ నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి కోరారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే మహిళా సాధికారత
హైదరాబాద్: విద్యతోనే మహిళాసాధికారత సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఇక్కడ చందానగర్‌లో జరిగిన మహిళా దక్షత సమితి రజతోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పేద, అట్టడుగు వర్గాలవారికి సమితి విద్యనందించడం అభినందనీయమని అన్నారు. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, మతాలు, భాషలకు నిలయమైన మనదేశం భిన్నత్వంలో ఏకత్వంగా నిలుస్తోందన్నారు. వేద, పురాణ కాలాల్లో కూడా మహిళలకు సముచిత గౌరవం దక్కిందని, పార్వతి లేకపోతే శివుడు కూడా అశక్తుడేనని శంకరాచార్యులు అన్నారని గుర్తుచేశారు. రజియా సుల్తానా, రాణి దుర్గావతి, రాజమాత జిజియా బాయి, కవయిత్రి మొల్ల, రాణీ రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి తదితర మహిళామణుల గొప్పతనం గురించి ఆయన వివరించారు. దేశంలోని ప్రముఖ నదుల పేర్లు గంగా, యమున అని ఉన్నాయన్నారు. పీవీ సింధు వంటి వారు సకల రంగాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలతో దేశ గౌరవం మంటగలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కోసం చట్టాలు చేస్తే సరిపోదని, ప్రజల ఆలోచనల్లో మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. మహిళలకు అవకాశం, ప్రోత్సాహమిస్తే సమర్థవంతంగా రాణిస్తారన్నారు. పార్లమెంటులో మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం దేశంలో 50 శాతమున్న మహిళలకు పార్లమెంట్లో 11.7 శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందని, స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా మహిళల అక్షరాస్యతాశాతం తక్కువగానే ఉందని వెంకయ్య విచారం వ్యక్తం చేశారు. సమానపనికి సమాన వేతనం ఉండాలని, ఇళ్లల్లో మాతృభాషలోనే మాట్లాడాలన్నారు. గోవా గవర్నర్ మృదులా సిన్హా మాట్లాడుతూ పేదరికంలో ఉన్న మహిళలకు విద్యనందించడంలో సమితి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపొద్దని కోరారు. మహిళలపై అత్యాచారాలు జరగకుండా రక్షణ కల్పించాలన్నారు. సమితి ప్రెసిడెంట్ సరోజ్ బజాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సమితి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అరుణ మాలిని తదితరులు పాల్గొన్నారు. -
సంస్కరణలతో పన్నులు తగ్గుతాయి
విశాఖపట్టణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణల వల్ల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు కనిపించినా దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలు చేకూరతాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. సంస్కరణల వల్ల దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగితే పన్ను రేట్లు దిగొస్తాయన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ భాగస్వామ్య సదస్సును శనివారం విశాఖలో ఉప రాష్ట్రపతి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో పన్ను చెల్లించే వారి సంఖ్య 6.74 కోట్ల నుంచి 8.28 కోట్లకు పెరిగిందని, ఇది మరింత పెరిగితే పన్ను రేట్లు కూడా దిగొస్తాయని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.సంస్కరణలు, సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన వృద్ధి రేటుతో దూసుకుపోతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారని ఉప రాష్ట్రపతి తెలిపారు. వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 2.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం ద్వారా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించనుందన్నారు. ఏపీ అన్నిట్లో ఎదగాలి: కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. ఏపీ పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఉద్యోగ కల్పనలోనూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. తూర్పు తీరంలో అతి పెద్ద ఆటో కాంపొనెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోందని, దీన్ని ఏపీలో నెలకొల్పాలన్న వినతిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
బి.నాగిరెడ్డి పోస్టల్ స్టాంప్ విడుదల
సాక్షి, చెన్నై : ప్రేక్షకులకు పలు చిరస్మరణీయ చిత్రాలను అందించిన అలనాటి ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి స్మారక పోస్టల్ స్టాంపును ముఖ్య అతిధిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో దగవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, రాష్ట్ర మంత్రి అన్భళగన్ ఆస్పత్రి నిర్వాహకులు, నాగిరెడ్డి వారసులు పాల్గొన్నారు. ఎన్నో చిత్రాల నిర్మాతగా, విజయా స్టుడియోస్ అధినేతగా, ఆస్పత్రుల వ్యవస్థపకులుగా, చందమామ పత్రిక పబ్లిషర్‌గా నాగిరెడ్డి సేవలు అమోఘమని ముఖ్య అతిధులు శ్లాఘించారు. సినీ రంగాని, వైద్య రంగానికి నాగిరెడ్డి చేసిన సేవలని గుర్తుతెచ్చుకునే విధంగా పోస్టల్ స్టాంప్‌తో , పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషం కలిగించిందని వెంకయ్య నాయుడు అన్నారు. సమాజానికి సేవలు చేసిన నాగిరెడ్డి పేరిట స్టాంప్ విడుదల చేసేందుకుకు ముందుకు వచ్చిన తపాలా శాఖకు అభినందనలు తెలిపారు. నాగిరెడ్డి గొప్ప మానవతావాది అని, గొప్పవారి జ్ఞాపకాలను రేపటి తరాలకు అందించటం హర్షించదగ్గ పరిణామం అన్నారు. విజయా సంస్థ చిత్రాలతో పాటు చందమామ, బాలమిత్ర వంటి కథలు నాగిరెడ్డిని ఇప్పటికీ గుర్తుకు తెస్తాయని వెంకయ్య అన్నారు. -
నరిశెట్టి రాజుకు ‘ఎన్ఆర్ చందూర్’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో ఉన్నతస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగుతేజం, ప్రముఖ జర్నలిస్టు, అమెరికాకు చెందిన గిజ్మోడో మీడియా గ్రూప్ సీఈవో నరిశెట్టి రాజు ఈ ఏడాదికిగానూ ఎన్ఆర్ చందూర్ జగతి పురస్కారాన్ని అందుకున్నారు. బుధవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడి చేతుల మీదుగా నరిశెట్టి రాజు పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు ఎన్ఆర్ చందూర్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు, అమరజీవి శ్రీపొట్టిశ్రీరాములు స్మారక సమితి ఏటా ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. తెనాలి పాత తాలూకాలోని చేబ్రోలుకు చెందిన నరిశెట్టి రాజు జర్నలిజంలో చేరిన కొత్తలో తెలుగు, ఆంగ్ల పత్రికల్లో పని చేశారు. అనంతరం అమెరికాలోని డేటన్ డైలీ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్‌ల్లో రిపోర్టర్ స్థాయి నుంచి మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి ఎదిగారు. అనంతరం స్వదేశానికి వచ్చి మింట్ పత్రికను స్థాపించిన రాజు ప్రస్తుతం గిజ్మోడో మీడియా గ్రూప్‌కు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతోపాటు వికీమీడియా ఫౌండేషన్ బోర్డులో ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సత్యానికి దగ్గరగా సంచలనాలకు దూరంగా విలువలతో కూడిన జర్నలిజం సమాజాభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. జర్నలిజంలో నరిశెట్టి రాజు రారాజుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు. ఫోర్త్ ఎస్టేట్‌గా పరిగణించే మీడియా విలువలు పాటించే విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోని ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సూచించారు. ‘జగతి’ మాసపత్రికను స్థాపించి 55 ఏళ్లపాటు ఎన్ని సవాళ్లు ఎదురైనా మొక్కవోని దీక్షతో నడిపి జర్నలిజానికి వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్ఆర్ చందూర్ అని నరిశెట్టి రాజు పేర్కొన్నారు. ఆయన జ్ఞాపకార్థం ప్రదానం చేసిన ఈ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ మారేటప్పుడు పదవులు త్యజించాలి
-
పార్టీ మారేటప్పుడు పదవులు త్యజించాలి
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు పదవులు త్యజించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, పార్టీలు మారటం మంచిది కాదని సూచించారు. ప్రస్తుతం ఉన్న పార్టీ మారాలనుకున్నప్పుడు, ఆ పార్టీ ద్వారా వచ్చిన, పొందిన పదవిని వదులుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం రాగ సప్తస్వరం ఆధ్వర్యంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు వెంకయ్యనాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడు, భాషా కోవిదుడు, అజాత శత్రువు రోశయ్యకు సన్మానం చేయడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులందరూ ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. జవాబుదారీతనం, పారదర్శకత, క్రమశిక్షణ వంటి లక్షణాలు అలవర్చుకొని తద్వారా దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని కోరారు. నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ, చట్టసభలు జరిగే తీరు చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. పదవులన్నీ యాదృచ్ఛికమే: రోశయ్య రోశయ్య మాట్లాడుతూ శాసనమండలి, పార్లమెంట్, శాసనసభల్లో వివిధ హోదాల్లో దాదాపు 35 ఏళ్లు పని చేశానని చెప్పారు. ఏ హోదాలో పని చేసినా అప్పగించిన బాధ్యతలకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేయాలన్న ధ్యేయంతోనే పనిచేశానని తెలిపారు. పదవులన్నీ యాదృచ్ఛికంగా వచ్చినవే తప్ప వెంపర్లాడి తెచ్చుకున్నవి కావని స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడు, టి. సుబ్బరామిరెడ్డి తదితర పెద్దల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరగడం జీవితంలో మర్చిపోలేని సంఘటనగా ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
మూడు నెలల్లోగా అనర్హత వేటు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయింపులపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచి పదవీకాలం మధ్యలోనే మరో పార్టీలోకి ఫిరాయించే వారిపై ఫిర్యాదు అందిన 3 నెలల్లోగా అనర్హత వేటు వేయాలని స్పష్టం చేశారు. చట్టసభలకు చైర్మన్‌గా, స్పీకర్‌గా వ్యవహరించే వారు ఫిరాయింపుల వ్యవహారంపై అందే ఫిర్యాదులను 3 నెలలకు మించి పెండింగ్‌లో ఉంచుకోకూడదని చట్టమే చెబుతోందని గుర్తుచేశారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఫిర్యాదు అందిన వెంటనే అనర్హత వేటు వేయడం ద్వారా తాను ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఆదివారం కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్టు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టం ప్రకారమే పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నానని పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలువురు ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారు. వారిపై ఫిర్యాదులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నందున రెండు రాష్ట్రాల స్పీకర్లకు మీరేమైనా సూచనలు చేస్తారా’ అని విలేకరులు అడగ్గా... రాజ్యసభ చైర్మన్ హోదాలో చట్టంలో పేర్కొన్న మేరకు తాను నిబంధనల ప్రకారం నడుచుకున్నానని, లోక్‌సభ స్పీకర్, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు వారి విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇంతకుమించి దీనిపై తానేమీ మాట్లాడనని చెప్పారు. తెలుగు ప్రజలకు సేవ చేస్తా.. ఇప్పటిదాకా ప్రధానమంత్రి పదవి తప్ప ఎన్నో పదవులు చేపట్టానని, ప్రధానమంత్రి కావాలన్న కోరిక లేదని వెంకయ్య స్పష్టం చేశారు. ఆ అర్హత తనకు లేదనే విషయం తెలుసన్నారు. ఉప రాష్ట్రపతి హోదాకు ఉండే ప్రొటోకాల్ నియమ నిబంధనలు ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పారు. నూతన ఏడాది, సంక్రాంతి వేడుకల సందర్భంగా ప్రజలకు వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజే శారు. పాలకులు, రాజకీయ పార్టీల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, వారిలో ప్రశ్నించే తత్వం పెరిగిందని చెప్పారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఉప రాష్ట్రపతిగా తనకున్న పరిమితుల మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సేవ చేస్తానని వెల్ల డించారు. పోలవరం ప్రాజెక్టు, గృహ నిర్మా ణం వంటి అంశాలపై సంబంధిత మంత్రులతో మాట్లాడానన్నారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు కులం, మతం, డబ్బు అనే మూడు ‘సీ’లు ప్రాధాన్యతా అంశాలుగా మారిపోయాయని విచారం వ్యక్తం చేశారు. కానీ, కెపాసిటీ, క్యారెక్టర్, క్యాలిబర్, కాండక్ట్ అనే నాలుగు ‘సీ’లకు ప్రాధాన్యం పెరగాలని ఆకాంక్షించారు. ఇలా అయితే ఎలాగమ్మా! దుర్గగుడి ఈవోతో వెంకయ్య నాయుడు సాక్షి, విజయవాడ: ‘‘దుర్గగుడిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అయితే ఎలాగమ్మా’’ అంటూ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎ.సూర్య కుమారిని ఉద్దేశించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఆయనను ఆదివారం స్వర్ణభారత్ ట్రస్టులో దుర్గగుడి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, ఈవో సూర్యకుమారి, పాలకమండలి సభ్యులు కలిశారు. వారితోపాటు ఏపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ‘‘దుర్గగుడిలో ఒక దివ్యాంగుడిని తోసివేశారని పేపర్లో చూశాను. ప్రసాదాలు సరిగా ఉండటం లేదని, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటివి జరగకుండా చూడాలి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. అంతా సరిచేస్తామంటూ ఈవో, పాలకమండలి సభ్యులు హామీ ఇచ్చారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఢిల్లీలో దుర్గమ్మ నమూనా దేవాలయం నిర్మించాలని భావిస్తున్నామని, స్థలం ఇప్పించాలని కోరారు. వెంకయ్య నాయుడు స్పందిస్తూ... ఢిల్లీలో స్థలం కొరత ఉందని, అవకాశాన్ని బట్టి పరిశీలిస్తామని చెప్పారు. -
విశ్వవిద్యాలయాలు సెంటరాఫ్ ఎక్స్‌లెన్స్‌లు కావాలి
సాక్షి, విశాఖపట్నం : విశ్వవిద్యాలయాలు సెంటరాఫ్ ఎక్స్‌లెన్స్ (సమర్థతకు కేంద్ర బిందువులు) కావాలని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిలషించారు. యూనివర్సిటీల్లో పాఠాలే కాదు.. శాస్త్రీయ పరిశోధనలకు మరింత ప్రాధాన్యత పెరగాలని, విద్యా ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలని కోరారు. కొత్తగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూనే కొత్త కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం సాయంత్రం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేలాదిగా వచ్చిన పూర్వ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని, కలలుకంటూ వాటి సాకారానికి కష్టపడాలని సూచించారు. అధ్యాపకులు కూడా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గురువుకు గూగుల్ ప్రత్యామ్నాయం కాదన్న విషయాన్ని గుర్తించాలని వెంకయ్యనాయుడు అన్నారు. -
న్యాయవ్యవస్థపై ప్రజలకు అచంచల విశ్వాసం
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థపై ఈ దేశ ప్రజలకున్న అచంచలమైన విశ్వాసాన్ని వమ్ము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. న్యాయమూర్తులు తెల్ల చొక్కాలాంటి వారని, ఆ చొక్కాపై చిన్న మరక పడినా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుంటారన్నారు. మరకలు అంటించే వ్యక్తులు కూడా ఉంటారని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. హైకోర్టు ప్రాంగణంలో సోమవారం హైకోర్టు న్యాయవాదులు వెంకయ్యనాయుడిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమ్మ ఓకే. ఇందిర నో.. ‘నేను కూడా న్యాయవాదినే. నా తల్లి కోరిక మేరకు న్యాయవాదినయ్యాను. అయితే ఇందిరా గాంధీ వల్ల న్యాయవాద వృత్తికి దూరమయ్యాను. ఇందుకు ఇందిరకు ధన్యవాదాలు చెప్పుకోవాలి (వ్యంగ్యంగా). ఎమర్జెన్సీ సమయంలో నన్ను జైలులో పెట్టకుండా ఉంటే బహుశా నేను న్యాయవాద వృత్తిలో కొనసాగి ఉండే వాడిని. అయితే అప్పటి ప్రభుత్వం జైల్లో వేయడం వల్ల నా దృక్పథంలో మార్పు వచ్చింది. ఆంధ్రా వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ్‌ను ఆహ్వానించాను. అది నేరమంటూ నన్ను జైల్లో వేశారు. అది నన్ను రాజకీయాల దిశగా నడిపించింది. జస్టిస్ పీఏ చౌదరి వంటి న్యాయ ఉద్దండుడితో అత్యంత సన్నిహితంగా తిరిగాను. న్యాయవాదిగా నేను నా నిర్బంధానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించుకున్నా. జడ్జీలు నన్ను ఎందుకు వదిలేయకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ప్రశ్నించారు. వదిలేయడానికి ఇబ్బంది లేదని, వదిలేస్తే వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వెళతారని ఆ పీపీ చెప్పారు. చివరకు అదే నిజమైంది’అని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ, కార్యదర్శులు పాశం సుజాత, బాచిన హనుమంతరావు, ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ పీపీ సి.ప్రతాప్‌రెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఉద్వేగానికి గురైన వెంకయ్య... అంతకు ముందు వెంకయ్యనాయుడు తన తల్లి గురించి మాట్లాడుతూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. ‘మా అమ్మ నేను పుట్టక ముందే నన్ను లాయర్ని చేయాలనుకుంది. అయితే దురదృష్టవశాత్తూ నేను పుట్టిన ఏడాదికే ఆమెను కోల్పోయాను. వెనక నుంచి ఆమెను గేదె పొడవడంతో చనిపోయారు. ఈ విషయం తలచుకున్నప్పుడల్లా నేను తీవ్ర భావోద్వేగానికి లోనవుతుంటాను’అని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ధనంజయ న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి చొరవ తీసుకోవాలని వెంకయ్యనాయుడిని కోరారు. -
సాగును బాగు చేద్దాం
సాక్షి, విశాఖపట్నం: సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిచ్చి ఆదుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చకుంటే రైతులు సాగును విడిచిపెట్టి మరో వృత్తిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు నిల్వ చేసుకోవడానికి, మార్కెట్‌కు తరలించుకోవడానికి రైతులకు కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. విశాఖలో మూడు రోజులపాటు జరిగే అగ్రి హ్యాకథాన్ (ఏపీ అగ్రిటెక్–2017)ను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఇప్పటికీ 60 శాతానికి పైగా గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ఆహార భద్రతకు వ్యవసాయం అవసరమని చెప్పారు. దేశంలో తొలిసారిగా విశాఖలో అగ్రి హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయరంగ పరిస్థితిని వివరించారు. -
నగరాల్లో సైకిళ్లకూ మార్గాలుండాలి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా నగరీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో నగరాల్లో రవాణా వ్యసవ్థలను సుస్థిర పద్ధతిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ జామ్‌ల నివారణకు ప్రజారవాణా వ్యవస్థలను పటిష్టం చేయడంతోపాటు పాదచారులు, సైక్లిస్టులకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. శనివారం హైదరాబాద్‌లో అర్బన్ మొబిలిటీ ఇండియా సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్య కీలకోపన్యాసం చేశారు. రవాణా సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే నగరాల్లో మళ్లీ సైకిళ్లను అందుబాటులోకి తేవాలన్నారు. స్మార్ట్ సిటీస్ ద్వారా ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వెంకయ్య...కాలుష్యకారక వాహనాల నియంత్రణ, ఎలక్ట్రిక్ బస్సుల వాడకం, పార్కింగ్ లేకుంటే కొత్త కార్ల కొనుగోళ్లకు నిరాకరించడం వంటి చర్యల ద్వారా నగరాల్లో రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చన్నారు. ప్రయాణాల్లోనే గంటల సమయం వృథా దశాబ్దాలుగా అనేక దేశాల్లో నగరాలు వేగంగా విస్తరించాయని, ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వాహనాల వాడకమూ పెరిగి ఆర్థిక, సామాజిక, పర్యావరణ సమస్యలకు దారితీసిందని వెంకయ్యనాయుడు చెప్పారు. వాతావరణ మార్పులకు కారణమవుతున్న విషవాయు ఉద్గారాల్లో నాలుగో వంతు నగర ప్రాంత రవాణా వ్యవస్థల ద్వారానే వస్తుండటం గమనార్హమన్నారు. వాయు, శబ్ద కాలుష్యాల ప్రభావం ప్రజారోగ్యంపైనా పడుతోందని... నగరాల్లో ప్రయాణాల్లోనే గంటల సమయం గడచిపోతుండటం వ్యక్తుల ఉత్పాదకత, వ్యాపారాలనూ దెబ్బతీస్తోం దన్నారు. దేశంలో బస్సులు, మెట్రోల వంటి ప్రజారావాణ వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోందని, 2011 నాటికి ప్రజారవాణాలో వాటి భాగస్వామ్యం 30 శాతం వరకు ఉండగా 2021 నాటికి అది 22 శాతానికి తగ్గిపోనుందన్నారు. సమర్థ రవాణా వ్యవస్థల లేమి ప్రభుత్వేతర రవాణా ఏర్పాట్లకు కారణమవుతోందన్నారు. ఈ సమస్యల న్నింటినీ పరిష్కరించేందుకు పెరుగుతున్న జనాభా, అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ రవాణా వ్యవస్థలకు రూపకల్పన చేయాలన్నారు. వాయు, శబ్ధ కాలుష్యాలను తగ్గించేందుకు భారీగా ప్రజారవాణ వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన అవసరముం దని వెంకయ్య సూచించారు. ప్రభుత్వాలు వినూత్న పద్ధతుల్లో ఆలోచించాలి భారీ పెట్టుబడులతో కూడుకున్న మెట్రో రైలు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వాలు వినూత్న పద్ధతుల్లో ఆలోచించాలని, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాలకు అవకాశం కల్పించాలని వెంకయ్య సూచించారు. ఇదే పద్ధతిలో సిద్ధమవుతున్న హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య వ్యవస్థ అని గుర్తుచేశారు. అంతకుముందు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రి హర్దేవ్సింగ్ పూరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో దాదాపు 380 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాలు పూర్తవగా మరో 500 కిలోమీటర్లు నిర్మాణంలో ఉందన్నారు. దేశంలో 90 శాతం మంది బస్సులు, రైళ్ల వంటి ప్రజారవాణా వ్యవస్థలపై ఆధారపడుతుంటే మిగిలిన 10 శాతం మంది ప్రైవేటు వాహనాలతో రోడ్లను ఆక్రమిస్తున్నారన్నారు. సంపన్న వర్గాలు కూడా తమ ప్రైవేట్ వాహనాల స్థానంలో బస్సులను వాడటం మొదలుపెడితే రవాణా సమస్యలు గణనీయంగా తగ్గుతాయని సూచించారు. సదస్సులో ఫ్రాన్స్ సంస్థ కొడాటూ అధ్యక్షుడు డొమినిక్ బ్రూసౌ, ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. -
విభజన హామీల అమలును సమీక్షించండి
-
అవి అభివృద్ధి ప్రతిబంధకాలు: వెంకయ్య
న్యూఢిల్లీ: జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) వంటి ట్రిబ్యునల్స్ జారీచేస్తున్న మధ్యంతర ఉత్తర్వులు తరచుగా అభివృద్ధి ప్రతిబంధకాలుగా పరిణమిస్తున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పర్యావరణంపై ఎన్జీటీ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ,.. ‘ట్రిబ్యునల్స్ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. ట్రిబ్యునల్స్‌తో పాటు ఇతర నియంత్రణ సంస్థలు పనిని మరింత సులభతరం చేసేలా వ్యవహరించాలి. అంతేగాని అభివృద్ధి ప్రతిబంధకాలుగా ఉండకూడదు’ అని సూచించారు. వివాదం పరిష్కారమైతే మంచిదే గానీ..వివాదాన్ని వాయిదావేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని వెంకయ్య పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ సరి–బేసి వాహన విధానాన్ని ఆయన తప్పుబట్టారు. -
విభజన హామీల అమలును సమీక్షించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇచ్చిన హామీల అమలులో పురోగతిపై సమీక్ష జరపాలని సీఎం ఎన్.చంద్రబాబు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికమం త్రి అరుణ్ జైట్లీలతో విడివిడిగా సమావేశమ య్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు. ‘‘రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదు. విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు జరిగిందో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. విభజన తరువాత చేపట్టిన పనులు పూర్తి చేయాల్సిన అవసరముంది. కేంద్రమంత్రుల పోర్ట్‌ఫోలియోలు మారినప్పుడు, అధికారులు మారినప్పుడు ఇబ్బందులొస్తున్నాయి. ఆర్థికశాఖ కార్యదర్శి మారారు. ఆయనతో మాట్లాడాం. జల వనరులశాఖ మంత్రి మారారు. ఆయనతోనూ మాట్లాడాం. ప్రస్తుతం ఆర్థికమంత్రి, హోంమం త్రిని కలసి విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరా. ప్రత్యేక ప్యాకేజీగానీ, విభజన హామీలుగానీ అమలు కాలేదు. వీటిని అమలు చేయాలని ఆర్థికమంత్రిని కోరా. విభజన చట్టం తెచ్చిందే హోంశాఖ కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య ఏం జరిగింది? కేంద్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చిందో సమీక్ష చేసి న్యాయం చేయాలని హోంమంత్రిని కోరా. చేస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్నీ గుర్తుచేశా ను. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడాను. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ఆయన చెప్పారు...’’ అని సీఎం తెలిపారు. పోలవరం పనులు వేగంగా జరగాలి ‘పోలవరం ప్రాజెక్టును వేగంగా అమలు చేయాల్సి న అవసరముంది. మొన్న ఏపీ కేబినెట్లోనూ దీనిపై సమగ్రంగా చర్చించాం. ఈ ప్రాజెక్టులో 60 సి నిబంధన కూడా ఉపయోగించుకోవాల్సి ఉందని నిర్ణయించాం. ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తిచేసుకునే బాధ్యత ప్రభుత్వంపై, ప్రజలపై ఉంది’’ అని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. చిన్నరాష్ట్రాల్లో రాజకీయ సుస్థిరతకోసం సీట్లపెంపు ఆవశ్యకతను వివరించానన్నారు. ఉప రాష్ట్రపతితో భేటీ.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో సీఎం శుక్రవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇకనుంచి ఫుడ్ ప్రాసెసింగ్‌పై దృష్టి: సీఎం ఇకపై తాను ఫుడ్ ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శుక్ర వారం ఆరంభమైన వరల్డ్ ఫుడ్ ఇండి యా–2017 సదస్సులో ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఫుడ్ ప్రాసె సింగ్ రంగంలో ఏపీలో ఉన్న అవకాశాల్ని వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించేందు కోసం విడిగా సెషన్ ఏర్పాటు చేశారు. వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. -
వసుధైక కుటుంబం ఇస్రో
శ్రీహరికోట(సూళ్లూరుపేట): దేశంలోని సగటు మానవుడికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ఫలితాలను అందుబాటులోకి తీసుకొస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వసుధైక కుటుంబం లాంటిదని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రపంచ అంతరిక్ష వారో త్సవాలను సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని కురూప్ ఆడిటోరియంలో బుధవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వారోత్సవాలు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ అంతరిక్ష పితామహులు విక్రమ్‌సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రొఫెసర్ సతీశ్ ధావన్ లాంటివారు నాటిన అంతరిక్ష ప్రయోగాల బీజాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగాయన్నారు. మన ఉపగ్రహాల్ని విదేశీ స్పేస్ సెంటర్ల నుంచి ప్రయోగించే స్థాయినుంచి పీఎస్ఎల్వీ రాకెట్లద్వారా 25 దేశాలకు చెందిన 209 విదేశీ ఉపగ్రహాల్ని పంపించే స్థాయికి చేరడంతో ప్రపంచదేశాలు భారత్‌వైపు చూస్తున్నాయని చెప్పారు. 1972లో విద్యార్థిగా ఎక్స్‌కర్షన్‌కు వచ్చి శ్రీహరి కోట రాకెట్ కేంద్రాన్ని సందర్శించిన తాను ఇప్పుడు ఉప రాష్ట్రపతి హోదాలో ఇక్కడకు రావడం ఆనందంగా ఉందన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ శ్రీహరికోట నుంచి ప్రయోగించే ఉప గ్రహాలవల్ల సామాన్యులకు సైతం ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో కొచ్చిందన్నారు. సభకు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఉప రాష్ట్రపతిని ఇస్రో చైర్మన్ శాలువాతో సత్కరించి జీఎస్ఎల్వీ రాకెట్ నమూనాతో కూడిన జ్ఞాపికను అందజేశారు. గవర్నర్ నరసింహన్‌కు షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ రాకెట్ నమూనా జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డి, ఏపీ వ్యవసాయ మంత్రి చంద్రమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
రుణ మాఫీ శాశ్వత పరిష్కారం కాదు
సాక్షి, అమరావతి: వ్యవసాయ సంక్షోభానికి రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. కష్టాల్లో చిక్కుకున్న రైతులకు అప్పుల మాఫీ తాత్కాలిక ఉపశమనం మాత్రమేన న్నారు. నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. వ్యవసాయ విధానంలోనే మౌలిక మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ సమీపంలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగిన రైతు నేస్తం పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించా రు. వ్యవసా య రంగంలో ప్రగతి ఉన్నప్పటికీ.. వస్తున్న ఫలితాలు రైతుకు అనుకూలంగా లేవని చెప్పారు. తాను పండించే పంటకు తానే ధర నిర్ణయించుకునే స్థాయికి రైతు ఎదగాల్సి ఉందని, అందుకు ప్రభుత్వ విధానాలు దోహదపడాలని సూచించారు. మీడియా కూడా వ్యవ సాయ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతు తలెత్తుకొని బతకాలి: పోచారం రైతు తలెత్తుకుని బతికే రోజు రావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు పథకాలు రూపొందించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రకృతి సేద్య ప్రముఖుడు పాలేకర్ విధానాలతో ఆరేళ్లుగా ప్రకృతి సాగుతో పలు రకాల కూరలు, పండ్లు పండిస్తు న్న కుంచనపల్లి రైతు ఆరుమళ్ల సాంబిరెడ్డి వ్యవసాయ క్షేత్రంపై పోచారం మక్కువ చూపారు. సాక్షి సాగుబడి పేజీలో ఇటీవల ఆయనపై రాసిన ప్రత్యేక కథనాన్ని చదివిన పోచారం.. నేరుగా సాంబిరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. విజయవాడకు వస్తూనే సమీపంలోని కుంచనపల్లికి వెళ్లి సాంబిరెడ్డి పొలాన్నీ, సాగుబడి తీరును చూసివచ్చినట్టు తెలిపారు. సభలో తెలంగాణ ప్రభుత్వం, రైతునేస్తం మధ్య విత్తన ధృవీకరణ సంస్థకు సంబంధించి అవగాహనా ఒప్పందం కుదిరింది. నీలివిప్లవం, రైతు నేస్తం పురస్కారాల ప్రత్యేక సంచిక, సేంద్రియ మొబైల్ యాప్‌ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, వ్యవ సాయ మంత్రి సోమిరెడ్డి, వ్యవసాయ పరిశోధన, నిర్వహణ జాతీయ మండలి (నారమ్) డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధికి అవార్డు అగ్రి జర్నలిజంలో సాక్షి తెలంగాణ బ్యూరో ప్రతినిధి బొల్లోజు రవి అవార్డు అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పోచా రం, సోమిరెడ్డి తదితరులు ఆయనకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. తెలంగాణ రైతుల పక్షాన ఆయన రాసిన పలు విశ్లేషణాత్మక కథనాలకు ఈ అవార్డును బహూకరించినట్టు నిర్వా హకులు ప్రకటించారు. జర్నలిజంలో అవార్డులు స్వీకరించిన వారిలో రూరల్ మీడియా ఎడిటర్ శ్యాంమోహన్, ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేస్తున్న రంగారెడ్డి జిల్లా రైతు మనోహరాచారి, ఎ.పద్మావతి (టీవీ–1), బస్వోజు మల్లిక్, భాగవతుల బుజ్జిబాబు (ఈటీవీ), జి.నాగేశ్వరరెడ్డి (ఆకాశవాణి), ఈవూరి రాజారత్నం (టీవీ–5) ఉన్నారు. వనజీవి రామయ్యగా ఖ్యాతి గాంచిన దరిపల్లి రామయ్యకు ప్రకృతి రత్న, వ్యవ సాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణకు కృషిరత్న అవార్డును అందజేశారు. -
ఏకాభిప్రాయంతోనే బీసీ రిజర్వేషన్లు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాక్షి, హైదరాబాద్: అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధుల బృందం వెంకయ్యనాయుడును కలసి బీసీల సమస్యలపై వినతిపత్రం సమర్పించింది. ఈసందర్భంగా చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బీసీలకు కూడా అట్రాసిటీ యాక్టును తీసుకురావాలని, ఉద్యోగాల భర్తీలో క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కోరారు. ఈ డిమాండ్లపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ...జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వాలని నిర్ణయించిందని ఈమేరకు పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్నారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల నుంచి ఏకాభిప్రాయం కోసం త్వరలో కార్యాచరణ సిద్ధం చేస్తామని ఉపరాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. -
వారసత్వ రాజకీయాలు సరికాదు
ఒకేసారి ఎన్నికలు అవసరం: ఉపరాష్ట్రపతి వెంకయ్య న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలు ఆమోదనీయం కావని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారత్‌లో వారసత్వ పాలన సాధ్యమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య పరోక్షంగా స్పందించారు. ‘వారసత్వంపై చర్చ జరుగుతోంది. వారసత్వం, ప్రజాస్వామ్యం కలిసి ముందుకెళ్లలేవు. అది మన వ్యవస్థను బలహీనపరుస్తుంది. అందుకే ప్రజాస్వామ్యంలో వారసత్వం ఆమోదనీయం కాదు’ అని ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య పేర్కొన్నారు. అయితే, తన వ్యాఖ్యలు ఏ పార్టీకీ ఉద్దేశించినవి కావన్నారు. -
ఉపరాష్ట్రపతిగా ప్రమాణం
స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి ఉపరాష్ట్రపతిగా వెంకయ్య రికార్డు న్యూఢిల్లీ: 15వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు (68) శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.. వెంకయ్యతో ప్రమాణం చేయించారు. సాంప్రదాయ పంచె, తెల్ల చొక్కా వేసుకుని వెంకయ్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, విపక్ష నేతలు, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఎన్డీయే ముఖ్యమంత్రులు (నితీశ్ కుమార్ సహా), ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వెంకయ్య కుటుంబసభ్యులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం అడ్వాణీకి వెంకయ్య పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆహ్వానం అందలేదని సమాచారం. కాగా, ప్రథమ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, తాజా మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ వరుసగా రెండుసార్లు ఈ పదవిలో ఉన్నందున వెంకయ్య రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి బాధ్యతలు స్వీకరించిన 13వ వ్యక్తిగా నిలిచారు. స్వతంత్ర భారతంలో పుట్టిన తొలి ఉపరాష్ట్రపతి కూడా వెంకయ్యే. -
ఎంపీలు శత్రువులు కారు
రాజకీయ, సిద్ధాంతపరమైన విభేదాలుంటాయంతే ► ఆందోళనల మధ్య బిల్లుల ఆమోదానికి వ్యతిరేకం ► నేనూ విమర్శలు చేశాను కానీ హద్దులు దాటలేదు ► రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణలో వెంకయ్య వ్యాఖ్య ► పేదలకు రాజ్యాంగ పదవులు ప్రజాస్వామ్య గొప్పదనమన్న మోదీ న్యూఢిల్లీ: ప్రజాసమస్యలపై నాణ్యమైన చర్చ జరిగే హుందాతనం కలిగిన సభ రాజ్యసభ అని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. చట్టసభల్లో జరగాల్సినవి నిర్మాణాత్మక చర్చలే కానీ ఆందోళనలు, నిరసనలు కాదని ఆయన తెలిపారు. శుక్రవారం రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పేదలు, సామాన్యులకు రాజ్యాంగ ఉన్నత పదవులు అందటమే భారత ప్రజాస్వామ్య గొప్పదనమని అన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వెంకయ్య తన పదవికి న్యాయం చేస్తారని అభిలషించారు. అంతకుముందు, వెంకయ్య మాట్లాడుతూ.. రాజ్యసభలో అంశాలపై విస్తృత చర్చ జరగాలని.. ఆందోళనలు, నిరసనలు కాదని వ్యాఖ్యానించారు. ‘సభలో అంశాలపై చర్చ జరగాలి. పదేపదే సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగించటాన్ని మానుకోవాలి. ఆందోళనలు, నిరసనల మధ్య బిల్లులు ఆమోదం పొందటాన్ని నేనెంతమాత్రం అంగీకరించను’ అని వెంకయ్య స్పష్టం చేశారు. సభలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు రాజకీయ, సిద్ధాంతపరమైన విభేదాలున్న వారే కానీ.. శత్రువులు కాదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని కోరారు. ఓ రైతు బిడ్డగా సభను నడిపించే అవకాశం రావటం గొప్ప అదృష్టమని వెంకయ్య తెలిపారు. ‘ఏదేమైనా.. దేశ సంస్కృతి (కల్చర్) వ్యవసాయమే (అగ్రికల్చర్) కదా’ అని తనదైన స్టైల్లో ఆయన తెలిపారు. ‘చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా. మా అమ్మ ముఖం కూడా నాకు గుర్తులేదని’ వెంకయ్య ఉద్వేగంగా పేర్కొన్నారు. ‘నేను ఇప్పుడు అందరివాడిని. పార్టీ రాజకీయాలకు అతీతమైన వాడిని. రాజ్యసభలో కీలకాంశాలపై అన్ని పార్టీల సభ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉండాలి. అందరూ నియమ, నిబంధనలు పాటిస్తే అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది. సమయపాలన చాలా ముఖ్యం’ అని వెంకయ్య తెలిపారు. ‘రాజ్యసభలో వివిధ అంశాలపై నాణ్యమైన చర్చ జరిగే హుందాతనం కలిగిన సభ’ అని వెంకయ్య పేర్కొన్నారు. తాను విపక్షంలో ఉన్నప్పుడు చాలా విషయాలను లేవనెత్తినట్లు చెప్పిన వెంకయ్య.. ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ ఎప్పుడూ హద్దులు దాటలేదన్నారు. అంతకుముందు రాజ్యసభ అధ్యక్షుడు జైట్లీ మాట్లాడుతూ.. రాజకీయ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎదిగిన క్రమాన్ని గుర్తుచేశారు. 20 ఏళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా విస్తృతమైన అనుభవం ఉన్న వెంకయ్య సభను సమర్థవంతంగా నడిపిస్తారని అన్నారు. సంచలనాలొద్దు: మీడియాకు వెంకయ్య హితవు సభలో జరిగే అంశాలను సంచలనాత్మకం చేయటం మానుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియాకు హితవు పలికారు. సభలో జరిగిన నిర్మాణాత్మక చర్చలను రిపోర్టు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని వెంకయ్య గుర్తుచేశారు. ‘చాలా ఏళ్ల క్రితం ఔత్సాహిక పార్లమెంటు సభ్యుడిగా.. దేశంలో వ్యవసాయ సమస్యలపై లోతైన చర్చలో పాల్గొన్నాను. గంటసేపు మాట్లాడాను. ఆ తర్వాత చాలా మంది ఎంపీలు నా దగ్గరికొచ్చి అభినందించారు. కానీ అనూహ్యంగా మరుసటి రోజు పేపర్లలో ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించారు. ఒక పేపర్లో మాత్రం వెంకయ్యనాయుడు వ్యవసాయంపై ధాటిగా మాట్లాడారని ఒక ముక్క రాశారు’ అని వెంకయ్య తెలిపారు. స్వతంత్రానికి ధనికులూ పోరాడారు: ఆజాద్ పేద కుటుంబాల నుంచి వచ్చిన వారు రాజ్యాంగ ఉన్నతపదవులు చేపట్టడం ప్రజాస్వామ్య బలమన్న మోదీ వ్యాఖ్యలపై రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ పరోక్షంగా స్పందించారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో మోతీలాల్ నెహ్రూ వంటి ధనికులు కూడా తమ ఆస్తులను వదులుకుని, జైళ్లలో మగ్గిన విషయాన్ని మరిచిపోలేమన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్యను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభినందించారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న వెంకయ్య మళ్లీ తనలాంటి విద్యార్థులున్న క్లాస్ (రాజ్యసభ) కే తిరిగొచ్చారన్నారు. ‘మీ క్లాస్‌లో విద్యార్థులు మంచివారు. మిమ్మల్నెవరూ ఇబ్బంది పెట్టరు. మీ రక్తపోటును పెంచరని నేను భరోసా ఇస్తున్నా’ అని రౌత్ పేర్కొన్నారు. వెంకయ్యకున్న వాక్పటిమను టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు ప్రశంసించారు. రాజ్యసభలోకి వెంకయ్య హాస్యాన్ని కూడా తీసుకొస్తారని విశ్వసిస్తున్నానన్నారు. చాలా మంది సభ్యులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య గొప్పదనం: మోదీ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వెంకయ్య నాయుడు ఉన్నత రాజ్యాంగ పదవులను అధిరోహించటం భారత ప్రజాస్వామ్యం గొప్పదనమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర భారతంలో పుట్టిన తొలి ఉపరాష్ట్రపతి వెంకయ్యేనని ఆయన పేర్కొన్నారు. ఎంపీగా సుదీర్ఘ అనుభవం ఉన్న వెంకయ్యకు పార్లమెంటరీ వ్యవహారాల్లో, సభ నడపటంలో ఉండే చిక్కులు తెలుసని మోదీ అన్నారు. జయప్రకాశ్ నారాయణ్ ఇచ్చిన పిలుపుతో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న నాయుడు.. అంచెలంచెలుగా రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిని అందుకున్నారని ప్రధాని ప్రశంసించారు. ‘నేడు అన్ని రాజ్యాంగబద్ధ పదవులు రైతులు, సామాన్య ప్రజల పిల్లలే అధిరోహించారు’ అని ప్రధాని పేర్కొన్నారు. చాలా ఏళ్లు ప్రజాజీవితంలో గడిపిన తొలి ఉపరాష్ట్రపతి వెంకయ్య ఒక్కరే అయి ఉండొచ్చని మోదీ ప్రశంసించారు. సభ నిర్వహణలో విపక్షాల ప్రశంసలు కూడా వెంకయ్య అందుకుంటారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుకుటుంబం నుంచి.. భారత ఉపరాష్ట్రపతిగా శుక్రవారం ప్రమాణంచేసిన వెంకయ్యనాయుడు 1949 జూలై1న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో రైతు కుటుంబంలో జన్మించారు. నెల్లూరులోని వీఆర్ హైస్కూలులో చదువుకున్నారు. అక్కడి వీఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రవర్సిటీ లా కాలేజీలో న్యాయశాస్త్రం పట్టా పుచ్చుకున్నారు. 1974లో జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని తొలిసారిగా వెంకయ్య తన రాజకీయజీవితాన్ని మొదలుపెట్టారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి 1978, 1983లలో ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1998, 2004, 2010, 2016లలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1999లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2014 నుంచి పట్టణాభివృద్ధి, గృహ, పట్టణప్రాంత పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ శాఖల మంత్రిగా ఉంటూనే 2015లో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా 2002 నుంచి రెండేళ్లపాటు పనిచేశారు. -
అది రాజకీయ ప్రచారమే!
► మైనారిటీల అభద్రతపై వెంకయ్య నాయుడు ► భారతీయుల రక్తంలోనే లౌకికవాదముంది ► పరోక్షంగా అన్సారీకి చురకలు ► నేడు ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం న్యూఢిల్లీ: దేశంలో మైనారిటీలు అభద్రతా భావంలో ఉన్నారన్న వ్యాఖ్యలను కాబోయే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖండించారు. మైనారిటీల్లో ఇలాంటి భావమే లేదని.. రాజకీయ ప్రచారం కోసమే కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలను పరోక్షంగా తోసిపుచ్చారు. ‘భారత్‌లో మైనారిటీలు అభద్రతతో ఉన్నారని కొందరంటున్నారు. ఇది రాజకీయ ప్రచారమే. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. భారత్‌లోనే మైనారిటీలు భద్రంగా ఉన్నారు. వారి హక్కులను పొందుతున్నారు. దేశంలో అసహనం పెరుగుతోందన్నది అవాస్తవం. ఇక్కడి నాగరికత ప్రభావం కారణంగా భారత సమాజం చాలా సహనశీలమైనది’ అని వెంకయ్య గురువారం ఢిల్లీలో పేర్కొన్నారు. దేశంలో సహనం ఉన్నందునే ప్రజాస్వామ్యం విజయవంతంగా నడుస్తోందన్నారు. అయితే మతం పేరుతో ఎవరిపైన దాడి జరిగినా దాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. అన్సారీ వ్యాఖ్యలపై వీహెచ్‌పీ మండిపడింది. ముస్లింల అభద్రతపై మాట్లాడి మహ్మద్ అలీజిన్నా మార్గంలో అన్సారీ నడుస్తున్నారని వీహెచ్‌పీ జాతీయ సహకార్యదర్శి సురేంద్ర జైన్ విమర్శించారు. అన్సారీ ఉపరాష్ట్రపతి పదవికి అవమానం చేశారన్నారు. నేడు వెంకయ్య ప్రమాణ స్వీకారం ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా గురువారం పీటీఐ వార్తాసంస్థతో వెంకయ్య మాట్లాడుతూ.. చట్టాలను సమర్థవంతంగా అమలుచేయటం, రాజ్యసభను సజావుగా నడిపించటంలో ఎంపీల సహకారం తీసుకుంటానని ఆయన తెలిపారు. ‘పార్లమెంటు సజావుగా, అర్థవంతంగా నడవడంలో మనం మరింత పరిణతితో వ్యవహరించాలి. చైర్మన్ సభను నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. సభ్యుల హక్కులకు సంరక్షకుడు కూడా’ అని వెంకయ్య పేర్కొన్నారు. -
భారత ఉపరాష్ట్రపతిగా తెలుగుతేజం
-
పోస్టర్లు అతికించే స్థాయి నుంచి...
న్యూఢిల్లీ: నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం.. కమల దళంపై మొక్కవోని విశ్వాసం.. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లలో చమత్కారాలతో సాగే అనర్గళ సంభాషణ.. వెరసి 68 ఏళ్ల వెంకయ్యనాయుడు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూలై 1న జన్మించారు. తల్లిదండ్రులు రమణమ్మ, రంగయ్య నాయుడు. వెంకయ్య నెల్లూరు, విశాఖపట్నంలలో పాఠశాల, కాలేజీ విద్య పూర్తి చేశారు. బీఏ, ఎల్ఎల్బీ పట్టాలు పుచ్చుకున్న ఆయన విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆరెస్సెస్, జన సంఘ్, ఏబీవీపీల్లో పనిచేశారు. 1972 నాటి జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు.ఎమర్జెన్సీకాలంలో జైలు జీవితం అనుభవించారు. బీజేపీ కార్యకర్తగా అగ్రనేతలు వాజ్‌పేయి, అడ్వాణీల పోస్టర్లు అతికిస్తూ, ఆటోలో మైకు పట్టుకుని ప్రచారం చేశారు. తర్వాత పార్టీలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కీలక పదవులు చేపట్టి దక్షిణ భారతంలో కాషాయ దళానికి పెద్ద దిక్కయ్యారు. చట్టసభల్లో, ఉన్నత పదవుల్లో.. వెంకయ్య 1978లో ఉదయగిరి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1983లో అదే స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి రెండోసారి గెలిచారు. 1998, 2004, 2010ల్లో వరుసగా మూడుసార్లు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన 2016లో రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, మోదీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచారప్రసారాలు తదితర మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2002–2004 మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకయ్య 2004 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఒకప్పుడు అడ్వాణీ వర్గంలో ఉన్న ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీవైపు మొగ్గుచూపారు. ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడే చరిత్రాత్మక రియల్ ఎస్టేట్ బిల్లు ఆమోదం పొందింది. జీఎస్టీ బిల్లులో పురోగతి కనిపించింది. వాజ్‌పేయి హయాంలో ప్రారంభమైన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనతోపాటు ఇటీవలి స్మార్ట్ సిటీల పథకం, స్వచ్ఛ భారత్, అందరికీ ఇళ్లు తదితర పథకాలు అమల్లో వెంకయ్య కీలక పాత్ర పోషించారు. 1971లో ఉషను వివాహమాడిన వెంకయ్యకు కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీపా వెంకట్ ఉన్నారు. 516 ఓట్లు సాధించిన వెంకయ్యనాయుడు 1974 తర్వాత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన మూడో విజేతగా రికార్డులకెక్కారు. 1992లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణన్ చెల్లుబాటైన 701 ఓట్లకు గాను 700 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి కాకా జోగీందర్ సింగ్ అలియాస్ ‘ధర్తీపకడ్’కు ఒక ఓటు వచ్చింది. దేశంలో 300 ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన రికార్డు ధర్తీపకడ్ పేరుతోనే ఉండటం మరో విశేషం. -
ఉపరాష్ట్రపతిగా తెలుగుతేజం
68 శాతం ఓట్లతో వెంకయ్య ఘన విజయం ► వెంకయ్యకు 516 ఓట్లు.. జీకే గాంధీకి 244 ఓట్లు ► రాజ్యసభ ఔన్నత్యాన్ని కాపాడతా: వెంకయ్య ► తెలుగు రాష్ట్రాల నుంచి 100 శాతం పోలింగ్ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: అనుకున్నట్లుగానే ఎన్డీయే అభ్యర్థి ముప్పవరపు వెంకయ్యనాయుడు (68) భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో 516 ఓట్లతో (68 శాతం) ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థిగా బరిలో దిగిన గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు దక్కాయి. 771 ఓట్లు పోలవగా 11 ఓట్లు చెల్లనివిగా తేలాయి. ప్రజాస్వామ్య విలువలు కాపాడటంలో, రాజ్యసభ ఔన్నత్యాన్ని పెంచటంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని వెంకయ్య అన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలు వెంకయ్య ఇంటికెళ్లి అభినందించారు. ఆగస్టు 11న వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వెంకయ్యకు 516/760 మొత్తం 785 ఓట్లకుగానూ 14 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. 760 (98.1 శాతం పోలింగ్‌నమోదు)లో వెంకయ్యకు 516, జీకే గాంధీకి 244 ఓట్లు దక్కాయి. విజయానికి 381 ఓట్లు అవసరమవగా.. వెంకయ్య 516 ఓట్లు గెలుచుకున్నారని రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ షరీఫ్ వెల్లడించారు. ఫలితాలు వెల్లడయ్యాక వెంకయ్యకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. అందరికీ ధన్యవాదాలు: వెంకయ్య ఉపరాష్ట్రపతి ఎన్నికలో తన విజయానికి సహకరించిన పార్టీలకు వెంకయ్యధన్యవాదాలు తెలిపారు. శనివారం రాత్రి తన నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన మోదీ సహా వివిధ పార్టీల నేతలనుద్దేశించి మాట్లాడారు. ‘చాలా సంతోషంగా ఉంది. నా విజయానికి మద్దతు తెలిపిన ప్రధాని మోదీకి, ఇతర పార్టీ ముఖ్య నేతలకు ధన్యవాదాలు. ఉపరాష్ట్రపతి కార్యాలయం ద్వారా రాజ్యాంగ పరిరక్షణలో రాష్ట్రపతికి చేదోడువాదోడుగా ఉండటంతోపాటుగా ఎగువసభ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడతాను’ అని వెంకయ్య చెప్పారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమన్నారు. దేశ రాజకీయాల్లో వ్యవసాయానికి సరైన గొంతుక లేదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. ఓటింగ్ సరళి ఇలా.. శనివారం పార్లమెంటు హౌజ్‌లోని 63వ నెంబరు గదిలో ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, ఎంఎం జోషి, రాజ్‌నాథ్ సింగ్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్య కూడా ఓటేశాక.. క్యూలో నిలుచున్న ఎంపీలతో మాట్లాడారు. విపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ చాలాసేపు ఓటింగ్ హాల్లోనే ఉన్నారు. ఓటింగ్ హాల్ బయట కాంగ్రెస్ చీఫ్ సోనియా, ఎంపీలు ఖర్గే, ఆజాద్, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, ఎంఏ ఖాన్‌లతో కలిసి సోనియా ఫొటోలు దిగారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకే 90 శాతం పోలింగ్ పూర్తయింది. మాజీ ప్రధాని మన్మోహన్ ఒంటరిగానే వచ్చి ఓటేసి వెళ్లిపోయారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్, సహాయ మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఎస్ఎస్ అహ్లువాలియాలు.. కేంద్ర మంత్రులు, ఎన్డీయే సీనియర్ నేతలతోపాటు విపక్షంలోని సీనియర్ నేతలకు స్వాగతం పలికారు. చార్టెడ్ విమానంలో వచ్చిన దేవేందర్ గౌడ్ స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కేంద్ర మంత్రులు విజయ్ గోయల్, సన్వర్‌లాల్ జాట్ ఓటింగ్‌కు గైర్హాజరవగా.. టీడీపీ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ హైదరాబాద్ నుంచి చార్టెడ్ విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. తెలుగువాడైన వెంకయ్యను గెలిపించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క ఎంపీ కూడా ఈ ఎన్నికకు గైర్హాజరుకాకపోవటం గమనార్హం. వెంకయ్య విజయంతో దేశంలోని తొలి మూడు అత్యున్నత పదవుల్లో (రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి) బీజేపీకి చెందినవారుండటం ఇదే తొలిసారి. వెంకయ్య విజయంతో ఆయన సొంతూరు నెల్లూరు జిల్లా చవటపాలెంలో సంబరాలు అంబరాన్నంటాయి. క్రాస్ ఓటింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ పలువురు ఎంపీలు వెంకయ్యకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అంచనా ప్రకారం 495 మంది వెంకయ్యకు మద్దతు తెలుపుతారని ఆశించగా 516 ఓట్లు పోలయ్యాయి. గాంధీకి 244 ఓట్లు దక్కగా.. ఇద్దరి మధ్య ఓట్ల అంతరం 272 ఓట్లు. రాష్ట్రపతి ఎన్నికల్లో మీరాకుమార్‌కు 225 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలో మాత్రం విపక్ష అభ్యర్థికి బీజేడీ (28 మంది) జేడీయూ (12మంది) పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ లెక్కప్రకారం గాంధీకి కనీసం 40 ఓట్లు ఎక్కువ రావాలి. కానీ అప్పటితోపోలిస్తే 19 ఓట్లే ఎక్కువ రావటంతో విపక్షాల ఐక్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికతో పోలిస్తే బీజేపీకి కేవలం ఆరుగురు ఎంపీల సంఖ్య మాత్రమే తగ్గింది. కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదవటం ఇదే తొలిసారి. వెంకయ్యకు మిఠాయి తినిపించిన మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఘన విజయం సాధించిన వెంకయ్య నాయుడుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శనివారం రాత్రి ఢిల్లీలోని వెంకయ్య నివాసానికి విచ్చేశారు. వెంకయ్యకు మోదీ మిఠాయి తినిపించి కండువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్, బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితర రాజకీయ నాయకులు, వందలాది మంది అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు చెప్పారు. గవర్నర్, కేసీఆర్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. తెలుగువారైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఘన విజయం సాధించిన ఆయన ఉపరాష్ట్రపతి పదవికి మరింత వన్నె తెస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రముఖుల స్పందనలు మది నిండుగా వెంకయ్య జ్ఞాపకాలు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడుకు అభినందనలు. ఆయన పదవీకాలం ఫలవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేశానికి ఆయన అంకితభావం, నిబద్ధతతో సేవ చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయనతో కలిసి పనిచేసిన కాలంనాటి జ్ఞాపకాలతో నా మది నిండిపోయింది. వెంకయ్యతో అనుబంధాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. –ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతిగా ఎన్నికై రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించనున్న వెంకయ్యకు శుభాకాంక్షలు. ఈ పదవిలో ఆయనకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. –హమీద్ అన్సారీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి ప్రభుత్వానికి వివేకంతో కూడిన సలహాలు ఇవ్వడంలో జ్ఞానసముద్రం లాంటి పెద్దల సభను నడిపించే ఉపరాష్ట్రపతి స్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాజ్యసభను మరింత బలోపేతం చేయడంలో వెంకయ్యకు మా మద్దతు ఉంటుంది. –సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయం సాధించిన వెంకయ్యనాయుడుకు అభినందనలు. ఉపరాష్ట్రపతిగా ఆయనకు అంతా మంచే జరగాలని కాంక్షిస్తున్నా. అలాగే నాకు ఓట్లేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు. నేను ఊహించినదానికన్నా ఎక్కువ ఓట్లే వచ్చాయి. భారత్‌లో ఉండే బహుళత్వం, లౌకికత్వం, భావప్రకటనా స్వేచ్ఛలకు నాకు వచ్చిన ఓట్లే రుజువులు. –గోపాలక్రిష్ణ గాంధీ, విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుకు అభినందనలు. ఆయనకు మా పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. రాజ్యసభ అధ్యక్షుడి స్థానంలో ఒక తెలుగు వ్యక్తి ఉండటం మనందరికీ గర్వకారణం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో స్పీకర్ వంటి అత్యున్నత పదవులకు ఎన్నిక ఎప్పడూ ఏకగ్రీవం కావాలనేది మా పార్టీ అభిమతం. –వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు -
ప్రారంభమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ శనివారం ప్రారంభమైంది. పార్లమెంట్ సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితం వెలువడనుంది. కాగా ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడు, విపక్షాల అభ్యర్థి, మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు. అయితే లోక్‌సభలో మెజారిటీ ఉన్నఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ఎన్నికకవడం లాంఛనమే. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన బీజేడీ, జేడీయూ ఇప్పుడు గాంధీకి మద్దతిస్తున్నాయి. లోక్‌సభలో మొత్తం సభ్యులు 545. బీజేపీ సభ్యులు 281. బీజేపీతో కలిపి ఎన్డీఏ బలం 338. ఇక 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 58 మంది సభ్యులు.. కాంగ్రెస్‌కు 57 మంది సభ్యులు ఉన్నారు. ఈ నెల 10వ తేదీతో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం యుగియనుంది. -
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక
-
నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక
► సాయంత్రానికి ఫలితం వెల్లడి ► ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యకే విజయావకాశాలు న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమయ్యింది. శనివారం(నేడు) పార్లమెంట్ సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే విషయం శనివారం సాయంత్రానికి తేలిపోనుంది. లోక్‌సభలో మెజారిటీగల ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికకవడం లాంఛనమే. ఆయనపై విపక్షాలు మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని రంగంలోకి దించాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపిన బీజేడీ, జేడీయూ ఇప్పుడు గాంధీకి మద్దతిస్తున్నాయి. సాయంత్రానికి ఫలితం: పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితం వెల్లడిస్తారు. రహస్య ఓటింగ్ పద్ధతిలో ఈ ఎన్నిక జరుగుతున్నందున పార్టీలు విప్ జారీ చేయలేదు. రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా కొనసాగిన హమీద్ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది రాజ్యసభ ఎక్స్–అఫీషియో చైర్మన్, లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనుంది. ఉభయ సభల్లో మొత్తం సభ్యుల సంఖ్య 790. అయితే లోక్‌సభలో రెండు, రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉన్నాయి. అలాగే కోర్టు తీర్పు కారణంగా లోక్‌సభలో బీజేపీ ఎంపీ చేడీ పాశ్వన్ ఓటు హక్కును వినియోగించుకోలేరు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి ఎన్నికలో గెలుస్తారు. లోక్‌సభలో మొత్తం సభ్యులు 545. బీజేపీ సభ్యులు 281. బీజేపీతో కలిపి ఎన్డీఏ బలం 338. ఇక 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 58 మంది సభ్యులు.. కాంగ్రెస్‌కు 57 మంది సభ్యులు ఉన్నారు. కాగా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఒకే కుటుంబం(బీజేపీ) నుంచి వస్తుండటంతో 2017–2022 మధ్య ఉజ్వల భవిత దిశగా దేశం పయనిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యకు మద్దతిస్తున్న వివిధ పార్టీల ఎంపీలతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడారు. -
తెలుగు సాహిత్యంలో రారాజు సినారె
వెంకయ్య నాయుడు సాక్షి, హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత దివంగత డాక్టర్ సి. నారాయణ రెడ్డి(సినారె) రారాజు అని ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన సినారె 87వ జయంతి, చివరి కవితా సంపుటి ‘కలం అలిగింది’ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. సినారె అభినవ శ్రీనాథుడు, అభినవ సోమనాథుడు అని అభివర్ణించారు. ఎన్టీఆర్ సినిమాలు అంతటి ప్రాచుర్యం పొందటానికి కారణం సినారె అని అన్నారు. ప్రజాకవి అంటే సినారెలా ఉండాలని, ఆయన అచ్చమైన తెలంగాణ కవి అని పేర్కొన్నారు. సినారె ఏకకాలంలో అన్ని వర్గాల ప్రజలను రంజింపచేసేవారని అన్నారు. ఇద్దరు ముఖ్యమం త్రులు తెలుగు భాషను రక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. పార్లమెంట్లో సాహిత్యా నికి మాజీ ప్రధాని వాజ్‌పేయి, సినారె ప్రాముఖ్యత తెచ్చారని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాలకు సినారె చేసినంత సేవ మరెవరూ చేయలేరని చెప్పారు. 1953 నుంచి చనిపోయే వరకూ సినారె కవితలు రాస్తూ ఉండటం వల్లే సాహిత్యంలో ఆయన మకుటంలేని మహారాజు అయ్యారని కొనియాడారు. సినారె చిత్రపటాన్ని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరిం చారు. సభకు అధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే తాను సినారెకి ఏకలవ్య శిష్యుడినని అన్నారు. సినారె మనుమరాలు వరేణ్యా కవిత్వంలో ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా కలం అలిగింది పుస్తకాన్ని, వంశీ విజ్ఞానపీఠం లోగోను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ప్రముఖ గాయకురాలు శారద ఆకునూరి బృందం నిర్వహించిన మధుర భావాల సుమమాల సినీ సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కె. శివారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రాజ్యసభ సభ్యులు టి. సుబ్బరామిరెడ్డి, అమెరికాలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కళాబ్రహ్మ, వంశీ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చి తప్పించారన్నది తప్పు: వెంకయ్య
సాక్షి, అమరావతి: బీజేపీ అధిష్టానం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి, కావాలనే కేంద్ర పదవి నుంచి తప్పించిందని జరుగుతున్న ప్రచారంపై ఎం.వెంకయ్య నాయుడు స్పందించారు. విజయవాడలో శనివారం జరిగిన ఆత్మీయుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. అమిత్ షా కుట్ర పన్నారనడం సరికాదని, ఆయనెందుకు కుట్ర పన్నుతారని ప్రశ్నించారు. 2019లో నరేంద్రమోదీ ఇంకొకసారి ప్రధానిగా చూసి, రాజకీయాలనుంచి తప్పుకొని తన ఊరు వెళ్లి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వాజ్‌పేయి బహిరంగ సభ గురించి ఊరూరా తిరిగి మైక్‌లో ప్రచారం చేసిన తనకు వాజ్‌పేయి, అద్వానీలిద్దరి మధ్య కూర్చొని రాజకీయాలు చేసే అవకాశం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. అంతగా ఎదిగేందుకు అవకాశమిచ్చిన పార్టీ ఆఫీసుకు రేపటి నుంచి రాకూడదన్న భావనతోనే ఉప రాష్ట్రపతి పదవి అన్నప్పుడు ఉద్వేగానికి లోనైనట్లు తెలిపారు. ఆరోపణలకు బెదిరే ప్రసక్తే లేదు ఏపీలో పార్టీ పరిస్థితికి ముడిపెట్టి ఉప రాష్ట్రపతి గురించి మాట్లాడుతున్నారని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలు ఎదుగుతాయే తప్ప, నాయకుడిని బట్టి కాదన్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ– బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఇరుపక్షాలు లాభపడ్డాయని చెప్పారు. చంద్రబాబు అంటే తనకు అభిమానమని తెలిపారు. విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందన్న భావనతోనే ఏపీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రానికి లక్షల ఇళ్లు కేటాయించినా, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించినా... ప్రధాని, మంత్రుల సహకారం లేకుండా జరుగుతాయా? అని ప్రశ్నించారు. తాను జీవించి ఉన్నంతవరకు తన కుటుంబీకులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులకు సంబంధించిన స్వర్ణ భారత్ ట్రస్టుపై ఆరోపణలు చేసి తనను బెదిరించాలని చూస్తే బెదిరేది లేదని చెప్పారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తవగానే తిరుమల వెళ్లి దర్శనం చేసుకుంటానని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు సన్మానం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోదం ప్రక్రియలో సహకరించినందుకు రాష్ట్రంలో పలు ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా శనివారం వెంకయ్యనాయుడును ఘనంగా సన్మానించాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పత్తిపాటి పుల్లారావు అధ్యక్షత వహించారు. -
కన్నీళ్లు ఆగలేదు కన్నతల్లి లాంటి పార్టీని వీడుతుంటే...
ఆత్మీయ కన్నతల్లి లాంటి అనుబంధం లో వెంకయ్య ఉద్వేగం ♦ నాతోపాటు ప్రధాని కూడా కంటతడి పెట్టారు ♦ బీజేపీలో వాజ్‌పేయి, అడ్వాణీల తర్వాత నేనే సీనియర్ని ♦ ఎన్టీఆర్ మంత్రి పదవి ఇస్తానన్నా సిద్ధాంతాలకే కట్టుబడ్డా ♦ సమయం లభిస్తే రాజకీయ అనుభవాలపై పుస్తకం రాస్తా సాక్షి, హైదరాబాద్: ‘‘ఊహ తెలిసినప్పటి నుంచి కన్నతల్లిలా ఆదరించిన పార్టీ(బీజేపీ)కి రాజీనామా చేస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదు. నాతోపాటు ప్రధాని మోదీ కూడా కంటతడి పెట్టుకున్నారు. పార్టీని వీడాలంటే బాధపడ్డానే తప్ప పదవులను వీడేందుకు కాదు’’ అని ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసిన నేపథ్యంలో శుక్రవారం బీజేపీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ అభినం దన కార్యక్రమంలో వెంకయ్య ఉద్వేగంగా మాట్లాడారు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడం తో ఊహ తెలిసినప్పటి నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో తనకు కన్నతల్లి లాంటి అనుబంధం ఏర్పడిందని గుర్తుచేసుకున్నారు. జీవితంలో తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లి, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రజల ఆశీర్వాదం కారణమన్నారు. నిత్యం అందరినీ కలిసే అలవాటున్న తాను ఇకపై అలా కలవడం కుదరదని తెలియడం బాధిస్తోందన్నారు. బీజేపీలో చేరినప్పుడు అందులో ఎందుకు చేరుతున్నావని చాలా మంది మిత్రులు ప్రశ్నించారని.. కానీ ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పార్టీ బీజేపీ అని వెంకయ్య పేర్కొన్నారు. 2019లో మోదీ మరోసారి ప్రధాని అయ్యేంతవరకు పనిచేసి ఆ తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ కావాలను కున్నానని.. కానీ పార్టీ ఆదేశాల మేరకు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలో ఉన్నానన్నారు. పదవులపై ఆశ లేదు... పదవులపై తనకు ఏనాడూ ఆశలేదని వెంకయ్య పేర్కొన్నారు. కుటుంబానికి రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల్లేరని, ఉప రాష్ట్రపతి పదవి దాకా అవకాశం ఇచ్చిన పార్టీ తనకు తల్లితో సమానమన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశానని, అప్పుడు కూడా మంత్రి పదవికి రాజీనామా చేయించి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని, ఇప్పుడు అదే రీతిలో రాజీనామా చేసి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండాల్సి వచ్చిందని వెంకయ్య గుర్తుచేశారు. బీజేపీలోని సీనియర్లలో వాజ్‌పేయి, అడ్వాణీ తర్వాత సీనియర్ని తానేనని వెంకయ్య చెప్పారు. టీడీపీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని ఎన్టీఆర్ 1984లో పేర్కొన్నా సిద్ధాంతాల కోసం కట్టుబడి సున్నితంగా తిరస్కరించానన్నారు. కుమారుడి వ్యాపారంతో సంబంధం లేదు తన కుమారుడి వ్యాపారం గురించి తనకు పెద్దగా తెలియదని, ఆ విషయం తాను ఎప్పుడూ పట్టించుకోలేదని వెంకయ్య చెప్పారు. తన కుమారుడికి చెందిన హర్షా టయోటాపై కొందరు ఆరోపణలు చేస్తుంటే ఏం జరిగిందో తెలుసుకున్నానని, పోలీసు శాఖకు వాహనాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నేరుగా కంపెనీకే ఆర్డర్ ఇచ్చినట్లు తేలిందని వెంకయ్య వివరించారు. రాజకీయాల జోలికి రావొద్దని కుమారుడికి చెప్పానని, అలాగే వ్యాపారాల జోలికి రానని కుమారుడికి చెప్పానన్నారు. సేవే మార్గంగా నడిచే స్వర్ణభారత్ ట్రస్ట్‌పై కాంగ్రెస్ నేతల ఆరోపణలు బాధాకరమన్నారు. అవగాహన లేమితోనే వారు ఆరోపణలు చేశారన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రెండు రాష్ట్రాల మంత్రులు కేటీఆర్, తుమ్మల, కామినేని శ్రీనివాస్, సీఎల్సీ నేత కె.జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, సినీ ప్రముఖులు నాగార్జున, వెంకటేష్, కె. రాఘవేంద్రరావు, సురేష్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్నిప్రారంభించిన వెంకయ్య శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్): స్వర్ణ భారత్ ట్రస్టుపై విపక్షాల ఆరోపణలు తగవని వెంకయ్య పేర్కొన్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం దివ్యాంగుల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వర్ణ భారత్ ట్రస్టు ఓ కుటుంబానిది కాదని.. తాను ట్రస్టుకు ప్రోత్సాహం అందించే వాడిని తప్ప అందులో కనీసం సభ్యుడిని కూడా కాదన్నారు. తన కుమార్తెతోపాటు కొందరు సభ్యులుగా ఏర్పడి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కొందరు రాజకీయంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ట్రస్టుకు తానేమీ చేయలేదని అన్నారు. ఇక్కడ నిర్మించిన భవనాల పన్నును మినహాయించి సమాజ సేవకు వినియోగిం చేలా ప్రభుత్వం సహకరించిందన్నారు. సీఎంలు ఏకతాటిపైకి వస్తే విభజన హామీలకు పరిష్కారం రాజకీయాల్లో మరికొంత కాలం ఉంటే రాష్ట్రానికి కొంత న్యాయం జరిగేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారని వెంకయ్య తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి ఒక అంగీకారంతో కేంద్రం దగ్గరకు వెళ్తే విభజన హామీలన్నీ పరిష్కారమవుతాయని సూచించారు. సమయం దొరికితే తన రాజకీయ అనుభవాలతో పుస్తకం రాస్తానని వెంకయ్య వెల్లడించారు. -
కాంగ్రెస్ నేతలది సంకుచిత ధోరణి: లక్ష్మణ్
వెంకయ్యకు ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి ఉన్నత పదవుల విషయంలో కూడా కాంగ్రెస్‌పార్టీ నేతలు సంకుచిత ధోరణితో వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన వెంకయ్య నాయుడుకు గురువారం బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, పార్టీ ఇతర ముఖ్యనేతలు వెంకయ్యను విమానాశ్రయంలో కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ వివిధ హోదాల్లో పనిచేసిన వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నిక అవుతుంటే తెలుగువారిగా స్వాగతించాల్సిందిపోయి అసత్య, అసందర్భ ఆరోపణలకు దిగడం కాంగ్రెస్ నేతల కురచబుద్ధికి నిదర్శనమన్నారు. జైరాం రమేశ్ వంటి జాతీయ కాంగ్రెస్‌నేతలు కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి కుటిల బుద్ధితో ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. వెంకయ్య నాయుడులాంటి సీనియర్ నాయకుడు ఏ స్థాయిలో ఉన్నా రాష్ట్ర ప్రజలకు సేవలు అందుతాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
వెంకయ్యకు కేసీఆర్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం వెంకయ్యను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్న కేసీఆర్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవ్వడంపై అభినందనలు తెలిపి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుమారు 35 నిమిషాలపాటు ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ఎలాంటి రాజకీయాలు చర్చించుకోలేదన్నారు. ఇక తాను రాజకీయాలు మాట్లాడనని, దాని గురించి మాట్లాడేందుకు సంబంధిత వ్యక్తులున్నారన్నారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడడం మానేశానని అన్నారు. -
జైరాం రమేశ్‌వి దివాలాకోరు విమర్శలు
-
జైరాం రమేశ్‌వి దివాలాకోరు విమర్శలు
డాక్టర్ కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంక య్యనాయుడుపై కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్య లు దివాలాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వెంకయ్యపై నిరాధార ఆరో పణలు చేయడం బాధాకరమని అన్నారు. వెంకయ్య జీవితం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం పరిపాటేనని తెలి పారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకు పోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటువంటి మాటలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
అక్కడ మరో తెలుగువాడు!
డేట్లైన్ హైదరాబాద్ వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చక్కదిద్దడానికి బీజేపీలో ఏ రామ్‌మాధవ్ లాంటి వారో తెర మీదకు వస్తారు. మొత్తానికి వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీలో, తెలుగుదేశం ప్రభుత్వంతో ఆ పార్టీ సంబంధాలలో పెనుమార్పులు రావచ్చునన్నది పరిశీలకుల అంచనా. రాజకీయాలు ఎట్లా ఉన్నా ఒక తెలుగువాడు ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కాబోతున్నందుకు అభినందనలు తెలుపుదాం. ఉప రాష్ట్రపతి పదవి స్వీకరించడానికి ఎట్టకేలకు ముప్పవరపు వెంకయ్యనాయుడు అంగీకరించారు. నూతన రాష్ట్రపతిగా ఉత్తరాది వారైన రామ్‌నాథ్ కోవింద్ పేరు ఖరారు కాగానే ఉప రాష్ట్రపతి పదవి తప్పని సరిగా దక్షిణాది వారికే దక్కుతుందని అందరూ భావించారు. దక్షిణాది నుంచి రెండు మూడు పేర్లు ప్రచారంలోకి వచ్చినా, చివరికి ఆ పదవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన నాయుడు గారిని వరించింది. భారతదేశంలోని రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉప రాష్ట్రపతి. ఆ పదవిని అధిష్టించే అవకాశం కొద్దిమందికే లభిస్తుంది. సముచిత స్థానం చాలాకాలానికి, అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తరువాత ఉప రాష్ట్రపతి పదవి లభించిన మొదటి తెలుగువారు వెంకయ్యనాయుడుగారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి చెందిన తెలుగువారు. ఆయన రెండు పర్యాయాలు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించి, ఆ తరువాత రాష్ట్రపతి కూడా అయ్యారు. దేశంలోని అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన తెలుగు ప్రముఖులు మరో ఇద్దరు ఉన్నారు. వారు వరాహగిరి వెంకట గిరి (వీవీ గిరి) నీలం సంజీవరెడ్డి. కాగా మరో తెలుగు ప్రముఖుడు పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి పదవిని అలంకరించారు. మరి కొద్దిమంది దక్షిణాదివారు గతంలో ఉపరాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించినా ప్రస్తుతం తెలుగువారయిన వెంకయ్యనాయుడును ఆ పదవికి బీజేపీ నాయకత్వం ఎంపిక చేయడం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇది వెంకయ్యనాయుడికి పదోన్నతి అనుకోవాలా, క్రియాశీల రాజకీయాల నుంచి దూరం పెట్టడం కోసం ఆయనకు ఈ పదవి ఇస్తున్నారా అన్నదే ఆ చర్చ సారాంశం. ఉప రాష్ట్రపతి పదవి పట్ల తనకు ఆసక్తి లేదని వెంకయ్యనాయుడు అనేకమార్లు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో కూడా ఆయన అదే చెప్పారు. తాను ఉషాపతినే తప్ప ఉప రాష్ట్రపతిని కాబోనని చమత్కరించారు (వెంకయ్యనాయుడు గారి శ్రీమతి పేరు ఉష) కూడా. అయినా ఆయన పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదు. బీజేపీలో ఎంతో అనుభవజ్ఞుడు కూడా అయిన వెంకయ్యను ఈ పదవి వరించడం మామూలుగా చూస్తే ఆయన్ను బీజేపీ, దాని మిత్ర పక్షాలు భాగస్వాములుగా ఉన్న ఎన్డీఏ సముచిత రీతిన గౌరవించినట్టే భావించాలి. విద్యార్థి యువజన విభాగాలు మొదలుకొని పార్టీ జాతీయ అధ్యక్షుడి దాకా అనేక పదవుల్లో పార్టీకి సేవలు అందించిన వెంకయ్యనాయుడు ఆ పార్టీలోని చాలామంది కన్నా సీనియర్ నాయకుడు. ఇప్పుడు ఆయనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా రాజకీయానుభవంలో వెంకయ్యనాయుడి కన్నా చాలా జూనియర్లు. అంతెందుకు, రేపు నూతన రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టబోతున్న రామ్‌నాథ్ కోవింద్æ కూడా రాజకీయానుభవంలో, పార్లమెంటరీ వ్యవహారాల అనుభవంలో వెంకయ్యనాయుడు కన్నా జూనియర్. బీజేపీ అగ్రనాయకులు అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వాణిలతో కలసి పనిచేసిన అనుభవం ఆయనది. అద్వాణికి అత్యంత సన్నిహితుడిగా ప్రసిద్ధుడు. బీజేపీ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా కూడా ఆయనకు పేరుంది. ప్రతిభావంతుడు వెంకయ్య వెంకయ్యనాయుడు రెండు పర్యాయాలు తన సొంత జిల్లా నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఎప్పుడూ ఆయన సొంత రాష్ట్రం నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించలేదు. మూడు పర్యాయాలు కర్ణాటక రాష్ట్రం నుంచి, తాజాగా రాజస్తాన్ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడు కావడం, దీర్ఘకాలం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండటం, తమిళనాడు ఇన్చార్జ్గా సంక్లిష్ట సమయాల్లో బీజేపీ తరఫున వ్యవహారం చెయ్యడం వంటి అంశాలతో పార్టీ ఆయనను మొత్తం దక్షిణాది ప్రతినిధిగా కూడా పరిగణించడానికి అవకాశం ఇస్తున్నది. సుదీర్ఘకాలంగా ఆయన సేవలు అందిస్తున్న రాజ్యసభకు ఇప్పుడు ఆయనే ఉప రాష్ట్రపతి హోదాలో అధ్యక్షుడిగా వ్యవహరించబోవటం ఒక విశిష్ట అనుభవం. పెద్దల సభ ప్రాధాన్యం ప్రత్యేకమైనది. ఆ సభ నిర్వహించడానికి కావాల్సిన హుందాతనం, అనుభవం, చాకచక్యం, వాక్చాతుర్యం అన్నీ వెంకయ్యనాయుడులో సంపూర్ణంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఊపిరాడని స్థితిలో ఏపీ బీజేపీ ఎందుకో మరి, ఆయన గానీ, ఆయన అనుయాయులూ, మిత్రులు గానీ ఈ పదవి పట్ల అంత సుముఖంగా లేరనిపిస్తుంది. వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసే విషయంలో ఆ పార్టీ నాయకత్వం ముఖ్యంగా మోదీ, షా ద్వయం బయటికి ఏ కారణాలు చూపుతున్నా అసలు ఆలోచన ఆయనను క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉంచడానికే అన్నది స్పష్టం. దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో , మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మోదీ, అమిత్ షాలు అమలు చేయాలనుకుంటున్న రాజకీయ వ్యూహంలో భాగంగానే వెంకయ్యనాయుడును క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పించినట్టు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకత్వం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ ఒక రకమయిన ఊపిరాడని స్థితిలో ఉన్నది. ఎన్డీఏ భాగస్వామి అయిన తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలను బహిరంగంగా విమర్శించే స్థితి లేకపోవడానికి వెంకయ్యనాయుడు తెలుగుదేశం పట్ల, దాని అధినేత చంద్రబాబునాయుడు పట్ల అనుసరిస్తున్న సానుకూల వైఖరే కారణమని ఆంధ్రా బీజేపీ నాయకులు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇదే విషయం పార్టీ జాతీయ అధ్యక్షుడి దృష్టికి కూడా పలుమార్లు తీసుకువెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ స్వతంత్రంగా ఎదగకుండా చెయ్యడం ద్వారా తెలుగుదేశానికి లాభం చెయ్యాలనే ప్రయత్నం జరుగుతున్నదనీ, అందులో భాగంగానే గడువు పూర్తయి ఎంతోకాలం అయినా ఆ రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం జరగలేదన్న విమర్శ ఉంది. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం ఖరారయిందని వార్తా వెలువడగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అధ్యక్షులు కాబోతున్నారంటూ రెండు మూడు పేర్లు అప్పుడే ప్రచారంలోకి వచ్చేశాయి. మారనున్న ఏపీ రాజకీయ చిత్రం ఉప రాష్ట్రపతి ఎన్నిక అనంతరం బీజేపీ అధిష్టానం దృష్టి సారించబోయే దక్షిణాదిలో ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్‌కేనని మోదీ, షా సన్నిహితులు ఇప్పటికే చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతున్నది. ఎన్డీఏ రాజకీయాల్లో ఎంతో ముఖ్యుడని చెపుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకీ మధ్య అఘాతం ఏర్పడిందనీ, దాదాపు సంవత్సరం పైగా చంద్రబాబుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకనంత పరిస్థితి ఉందనీ చెబుతున్నారు. నిజానికి వెంకయ్యనాయుడు క్రియాశీలక రాజకీయాలకు దూరం కావడం ఆయనకంటే చంద్రబాబునాయుడుకే ఎక్కువ ఇబ్బంది కలిగించే విషయం. యునైటెడ్ ఫ్రంట్ కాలంలో కానీ, ఆ తరువాత వాజపేయి హయాంలో కానీ నడిచినట్టుగా మోదీ హయాంలో చంద్రబాబునాయుడి హవా ఢిల్లీలో నడవడం లేదు. ఎన్డీఏలో భాగంగా కేంద్ర క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులలో అశోక్ గజపతిరాజు పెద్దగా రాసుకు పూసుకు తిరిగే వ్యక్తి కాదు. ఆయనది అంతా పెద్దమనిషి తరహా. మరో కేంద్రమంత్రి సుజనా చౌదరి రాజకీయాలకు కొత్త, ఫక్తు వ్యాపారి. ఈ పరిస్థితుల్లో కేంద్రంలో కొండంత అండగా ఉన్న మిత్రుడు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయితే ఇక తమ అవసరాలకు కేంద్రం తలుపులు ఎవరు తెరవాలి అన్న, అనుసంధానం ఎవరు చెయ్యాలి అన్న ఆందోళన చంద్రబాబు నాయుడిది. వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అభ్యర్థి కావడాన్ని చంద్రబాబునాయుడు బయటికి అయితే హర్షించారు, ఆహ్వానించారు కానీ, రేపటి నుంచి కేంద్రంలో ఏం జరుగుతుందో కనీసం సమాచారం తెలిపే వాళ్లు కూడా లేకుండా పోయారన్న ఆందోళన ఆయనది. ఎన్డీఏ కన్వీనర్, భాగస్వామి పక్షపు ముఖ్యమంత్రి, అందునా తెలుగు రాష్ట్రాధినేత అయినా చంద్రబాబుకు వెంకయ్యనాయుడు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనమంటూ పిలుపు రాలేదంటేనే అర్ధం అవుతున్నది రేపటి సినిమా. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చక్కదిద్దడానికి బీజేపీలో ఏ రామ్‌మాధవ్ లాంటి వారో తెర మీదకు వస్తారు. మొత్తానికి వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ బీజేపీలో, తెలుగుదేశం ప్రభుత్వంతో ఆ పార్టీ సంబంధాలలో పెనుమార్పులు రావచ్చునన్నది పరిశీలకుల అంచనా. రాజకీయాలు ఎట్లా ఉన్నా ఒక తెలుగువాడు ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కాబోతున్నందుకు అభినందనలు తెలుపుదాం. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
ఇక అందరి వాడిని!
బీజేపీ వ్యక్తిని కాను: వెంకయ్య.. ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేస్తా ► ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు ► వెంకయ్య పేరు ప్రతిపాదకుల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ అభ్యర్థి ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం నామినేషన్ వేశారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అన్ని పార్టీలకు చేరువకావడానికి.. తాను ఇక బీజేపీకి చెందినవాణ్ని కానని, ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వెంకయ్య పార్లమెంట్ హౌస్‌లో రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ షరీఫ్‌కు ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ అగ్రనేత ఎల్.కె. అడ్వాణీ తదితరులు హాజరయ్యారు. వెంకయ్య అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ తదితరులు వెంకయ్య పేరును ప్రతిపాదించి బలపరచారు. కార్యక్రమానికి టీడీపీ, శివసేన, ఎల్జేపీలతోపాటు ఎన్డీఏయేతర అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు కూడా హాజరయ్యారు. అంతకుముందు మోదీ, అమిత్‌షా, ఎన్డీఏ మిత్రపక్షాలు, వెంకయ్యకు మద్దతిస్తున్న పార్టీల నేతలు పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో సమావేశమై పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇది నాకు గౌరవం.. నామినేషన్ అనంతరం వెంకయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్డీయే అభ్యర్థిత్వం తనకు గౌరవమని, ఎన్నికల్లో గెలిస్తే ఉప రాష్ట్రపతి పదవి గౌరవాన్ని మరింత పెంచుతానని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా, ఎన్డీఏ పార్టీలు, తనకు మద్దతిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవిపై తనకు ఆసక్తిలేదని, మంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ‘మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనుకున్నాను. అంతేగాని, కొందరు చెబుతున్నట్లు మంత్రిగా కొనసాగాలనే ఉద్దేశం నాకు లేదు’ అని అన్నారు. ‘సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, ఎం. హిదయతుల్లా, ఆర్. వెంకట్రామన్, శంకర్‌దయాళ్ శర్మ, భైరాన్‌సింగ్ షెకావత్ వంటి గొప్ప వ్యక్తులు ఉప రాష్ట్రపతి పదవి చేపట్టారు. ఈ పదవి విశిష్ట విధుల గురించి నాకు తెలుసు. నేను ఎన్నికైతే గత ఉప రాష్ట్రపతులు స్థిరపరచిన సంప్రదాయాలను, ప్రమాణాలను కాపాడతానని ప్రజలకు హామీ ఇస్తున్నాను.. ఆ పదవికి న్యాయం చేయగలను..’ అని అన్నారు. రాజ్యాంగ బాధ్యతలున్న ఉప రాష్ట్రపతి పదవికి, నాలుగు దశాబ్దాలుగా ప్రజలతో ముడివేసుకున్న తన ప్రజా జీవితానికి మధ్య ఉన్న తేడాలు తెలుసునని పేర్కొన్నారు. భారతదేశ సౌందర్యం దాని శక్తి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఉందన్న వెంకయ్య ఆ వ్యవస్థలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. ఎన్నికల్లో ఓటేసే లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరూ పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలోనే ఉన్నారు కనుక తాను ప్రచారం చేయనని చెప్పారు. బీజేపీ అమ్మలాంటిది: తన నేపథ్యాన్ని వివరిస్తూ.. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన తనకు బీజేపీ తల్లి వంటిదని, పార్టీలోనే తల్లిని చూసుకున్నానని వెంకయ్య భావోద్వేగంతో పేర్కొన్నారు. ‘సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రజల, పార్టీ అండతోనే ఈ స్థితికి చేరుకున్నాను. అయితే ఇకపై ఎంతమాత్రం బీజేపీకి చెందినవాడిని కాను.. ఏ పార్టీకి చెందినవాడిని కాను’ అని అన్నారు. 40 ఏళ్ల అనుబంధమున్న పార్టీని వీడటం చాలా బాధాకరమన్నారు. పార్టీకి, మంత్రిపదవికి రాజీనామా.. సోమవారం రాత్రి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యాక వెంకయ్య కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీకి కూడా ఆయన రాజీనామా చేసినట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి. పార్టీ నుంచి తనంతట తాను వైదొలిగానని వెంకయ్య కూడా చెప్పారు. తాను రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతానని, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తానన్నారు. ఎన్డీఏకు మెజారిటీ ఉండటంతోపాటు ఇతర పార్టీలు మద్దతిస్తుండటంతో ఆ యన సులువుగా విజయం సాధించే అవకాశముంది. విధి మరోలా తలచింది.. ‘2019 ఎన్నికల్లో మళ్లీ మోదీ విజయాన్ని చూసిన తర్వాత సంఘసేవలోకి అడుగుపెట్టాలని కోరుకున్నాను. అయితే విధి మరోలా తలచింది’ అని వెంకయ్య ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. పార్టీలో చర్చ తర్వాత తీసుకున్న తుది నిర్ణయాన్ని అంగీకరించానన్నారు. దేశానికి అందిన గొప్పనాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలని మోదీని ఉద్దేశిస్తూ అన్నారు. తర్వాత వెంకయ్య పార్లమెంట్ సెంట్రల్ హాలుకు వెళ్లి వివిధ పార్టీల ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. కొందరు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. నామినేషన్ సందర్భంగా వెంకయ్య కుటుంబ సభ్యులు కూడా పార్లమెంట్ హౌస్‌కు వచ్చారు. నామినేషన్‌కు ముందు ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, అడ్వాణీ, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తదితరులను కలుసుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. -
వెంకయ్యను ఆదరించిన ఉదయగిరి ప్రజలు
ఉదయగిరి వాసులతో విడదీయరాని అనుబంధం ఉదయగిరి: సామాన్య నిరుపేద రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి న ముప్పవరపు వెం కయ్యనాయుడును అక్కున చేర్చుకుని రాజకీయంగా ఆదరించిన ఘన చరిత్ర ఉదయగిరి నియోజ కవర్గ వాసులది. వి ద్యార్థి నాయకుడిగా నెల్లూరు వీఆర్ కళాశాలలో ఉద్యమాలు చేస్తూ 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఉదయగిరి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ధనేంకుల నరసింహం వెంకయ్యనాయుడుకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన విజయం సాధించా రు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మాదాల జానకిరాం, రెడ్డి కాంగ్రెస్ తరపున కూండ్ల చెంచురామయ్య పోటీచేసినప్పటికీ సునాయాసంగా 19,700 ఓట్లతో విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం సృష్టించగా ఉదయగిరిలో మాత్రం ఆ పార్టీ తరపున పోటీచేసిన గణపం బాలక్రిష్ణారెడ్డిపై 24,311 ఓట్ల మెజారిటీతో బీజేపీ తరపున పోటీచేసిన వెంకయ్యనాయుడు ఘనవిజయం సాధించారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా వెంకయ్య కృషి ఉదయగిరి శాసనసభ్యునిగా పనిచేసిన ఆయన నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేశారు. నియోజకవర్గంలో చెట్లకింద సాగుతున్న చదువులను పక్కా భవనాల్లోకి మార్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రూరల్ ఎలక్ట్రిక్ స్కీం కింద ఆనాడు నియోజకవర్గంలోని 104 గ్రామ పంచాయతీలకు విద్యుత్ సౌకర్యం కల్పించటమే కాకుండా ఉదయగిరిలో 33/11కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేశారు. దీంతో నియోజకవర్గంలో విద్యుత్‌పరంగా ఎంతో మేలు చేకూరింది. పరిపాలనా సౌలభ్యం కోసం మేజర్ పంచాయతీలను చిన్న పంచాయతీలుగా విడగొట్టారు. ఆనాటి కలెక్టర్ సుజాతరావు సహాయసహకారాలతో నియోజకవర్గంలో ఎన్నో పక్కాగృహాలు నిర్మించారు. రెండుసార్లు కేంద్రమంత్రిగావున్న వెంకయ్య ఉదయగిరి నియోజకవర్గానికి కొంతమేర మేలు చేకూర్చారు. 1999లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామసడక్ యోజన ద్వారా తారురోడ్లు ఏర్పాటుచేశారు. ప్రస్తుత మంత్రిగా కామధేను ప్రాజెక్టు నియోజకవర్గానికి సాధించారు. రూ.550 కోట్లతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటుకు కృషిచేస్తున్నారు. అసెంబ్లీ టైగర్‌గా గుర్తింపు 1983 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసిన వెంకయ్య విజయం కోసం ఆనాటి అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వాజ్‌పేయి ఉదయగిరి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. దీంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి గణపం బాలక్రిష్ణారెడ్డి తరపున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయినా వెంకయ్య విజయానికి నియోజకవర్గ ప్రజలు మొగ్గుచూపారు. అప్పుడు అసెంబ్లీలో వెంకయ్యనాయుడు వాగ్ధాటి, చతురత ఎంతో అద్భుతంగా ఉండేది. దీంతో ఆయనకు అసెంబ్లీ టైగర్ పేరుతో ఉదయగిరి ప్రజలు పిలుచుకునే వారు. యువతతోనూ మమేకం ఆయన ఉదయగిరి నియోజకవర్గాన్ని వదిలివెళ్లి 30 ఏళ్లు పైబడినా ఈ ప్రాంత యువతతో అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఆయనతో కలిసి పనిచేసిన ఈ ప్రాంతవాసుల పిల్లలు ఎక్కువగా ఆయన్ను కలుస్తుంటారు. వారు కలిసినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తుల క్షేమసమాచారాలు వాకబు చేస్తుండేవారు. -
జీఎస్టీ ఆలోచన యూపీఏదే
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు ప్రత్యేక సమావేశానికి దూరంగా ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. మొదట జీఎస్టీ బిల్లును ప్రతిపాదించింది యూపీఏనేనన్న అం శాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ‘వాజ్‌పేయి ప్రభు త్వం ఈ అంశంపై చర్చ మొదలుపెట్టినా తరువాతి కాలంలో యూపీఏ ఈ బిల్లును ప్రతిపాదించింది. కానీ అమలు సాధ్యం కాలేదు. ఈ విధానంలో రాష్ట్రాలు నష్టపోతే పరిహారం ఇచ్చేందుకు అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలు ఆమోదించిన తరువాత, పరిష్కార మార్గాలు చూసిన తరువాతే దీన్ని అమలు లోకి తెస్తున్నారు. జీఎస్టీ తెచ్చింది చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ. ఇది మా సృష్టి కాదు. దీన్ని ఆలస్యం చేయడం వల్ల దేశానికి నష్టమని గతంలో వీరప్ప మొయిలీనే చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా నిలిచి ప్రజల దృష్టిలో పలుచన కావద్దు, ప్రధానికి ప్రతిష్ట పెరుగుతుందనే కారణంతో కొందరు వ్యతిరేకిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు తమ అధికారాలను జీఎస్టీ కౌన్సిల్‌కు బదలా యించాయి. ఎప్పటికప్పుడు జీఎస్టీ కౌన్సిల్ శ్లాబులు మార్చేందుకు వీలుంది. దేశంలో ఒకే పన్ను విధానం ఉండడం శ్రేయస్కరం..’ అని పేర్కొన్నారు. -
మతతత్వ అభ్యర్థికి ఓట్లేస్తారా: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో రెండు భిన్న సిద్ధాంతాల మధ్య పోరు జరుగుతున్నదని, మతతత్వ పార్టీ అభ్యర్థికి ఓట్లేస్తారా అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ కాంగ్రెస్ సిద్ధాంతం భిన్నత్వంలో ఏకత్వమన్నారు. బీజేపీ దీనికి విరుద్ధంగా మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, ముస్లింల మీద దాడులు పెరిగాయన్నారు. కోవింద్ లాంటివ్యక్తి రాష్ట్రపతి అయితే దేశంలో అశాంతి పెరుగుతుందని హెచ్చరించారు. భారతదేశ భవిష్యత్తును గమనంలో ఉంచుకుని, ఓటర్లంతా ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని కోరారు. రైతులను అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తక్షణం రైతులకు క్షమాపణ చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు. -
ఏకాభిప్రాయ సాధనకు కృషి
► రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల సూచనలు గౌరవిస్తాం: వెంకయ్యనాయుడు ► నేడు సమావేశం కానున్న విపక్షాలు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం విపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈమేరకు ఏర్పాటైన కమిటీలో సభ్యుడైన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారని, ఆయన వచ్చిన తరువాత ఆర్థిక మంత్రిæ జైట్లీతో చర్చించి ముందుకు సాగుతామన్నారు. ‘మూడేళ్ల ఎన్డీఏ పాలనలో పట్టణాభివృద్ధి శాఖ పురోగతి’పై మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవానికి ఇతర పార్టీలను సంప్రదించాల్సిన బాధ్యత అధికార పార్టీ అయిన తమపై ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాల సూచనలను గౌరవిస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న అమెరికా పర్యటనకు బయల్దేరడానికి ముందే పోటీలో నిలిపే అభ్యర్థిపై స్పష్టత తీసుకురావాలని బీజేపీ యోచిస్తోంది. మరోవైపు, ఇదే విషయంపై చర్చించడానికి బుధవారం ప్రతిపక్ష పార్టీలు సమావేశమవుతున్నాయి. -
చీలికలు వద్దు
► అన్నాడీఎంకే ప్రభుత్వం పూర్తికాలం కొనసాగాలి ► కలిసి పనిచేద్దాం ► అన్నాడీఎంకేకు కేంద్ర మంత్రి వెంకయ్య హితవు అన్నాడీఎంకే ప్రభుత్వం పూర్తికాలం పనిచేయాలనేదే తమ అభిమతం, పార్టీలో చీలికలు పనికిరావని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆ పార్టీ నేతలకు హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వ ప్రగతి ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రప్రభుత్వ మూడేళ్ల విజయాల చిత్ర ప్రదర్శనను చెన్నై వేలచ్చేరి రైల్వేస్టేషన్లో శనివారం వెంకయ్య ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జయలలిత ప్రజాసంక్షేమం కోసం ఎంతో పరితపించేవారని తెలిపారు. అనేక సందర్భాల్లో ఆమెను కలిశానని, ఆదివారం, సెలవు దినాల్లో సైతం సచివాలయానికి వచ్చి పనిచేసేవారని గుర్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు వెళ్లి సేవ చేస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్న బీజేపీ ప్రభుత్వ ధ్యేయాన్ని అనుసరించే చెన్నై సచివాలయంలో ఇటీవల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించానని తెలిపారు. రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రం ఇలానే సహకరిస్తుందని అన్నారు. నల్లధనం, అవినీతి నిర్మూలన కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలతో కలిసి పోరాడుతున్నామని తెలి పారు. మూడేళ్ల మోదీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదని అన్నారు. ఈ మూడేళ్లలో మచ్చలేని పాలనను ఆయన అందించిన ఫలితంగా దేశంలో వెంటనే ఎన్నికలు వచ్చినా నరేంద్రమోదీనే ప్రధాని అవుతారని ఆయన జోస్యం చెప్పారు. యూపీఏ ప్రభుత్వంలా తమది అవినీతి, కుంభకోణాల పాలన కాదని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం వివిధ పథకాల కోసం కేటాయించే ధనం ప్రజలకు నేరుగా చేరడం ద్వారా వారు లబ్ధి పొందాలన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం నూరుశాతం ఫలితాలను సాధిస్తుండగా, కాం గ్రెస్ హయాంలో 15 శాతం మాత్రమే ప్రజలకు అందేదని విమర్శించారు. ప్రధానిగా మరో పదేళ్లు మోదీనే కొనసాగాలని ప్రజలు ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. మూడేళ్లకు ముందు భూమి, గాలిని సైతం వదిలిపెట్టకండా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. అన్ని దేశాలూ భారత్ ప్రగతిని ఆసక్తిగా చూస్తున్నాయని, దేశ ఆర్థిక ప్రగతి నేడు 7 శాతంగా ఉండగా, ఇతర దేశాలు 5 లేదా 6 శాతంలో ఉన్నాయని చెప్పారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీనే అధికారంలోకి వస్తుంది, మరో పదేళ్లపాటు మోదీనే అధికారంలో ఉంటారని జోస్యం చెప్పారు. బీజేపీ ప్రభుత్వ మూడేళ్ల విజయాలను ఈ ప్రధర్శనశాలలో అన్ని భాషల్లోనూ తెలుసుకునే వీలుందని చెప్పారు. ప్రజల సందర్శనార్థం ఏడురోజులపాటు ఈ ప్రదర్శనశాల ఉంటుందని అన్నారు. -
రాష్ట్ర సమస్యలపై ప్రత్యేక దృష్టి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప్రత్యేక ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, విద్యుత్, గృహాలు, రామగుండం ఎరువుల తయారీ పరిశ్రమ పునఃప్రారంభం, నగరాల అభివృద్ధి తదితర అంశాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గుంటూరు సభలో ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, ప్రధాని మోదీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందిస్తూ... ఇచ్చిన హామీ మేరకు ఏపీకి బీజేపీ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్.. విభజన చట్టంలో ఈ అంశాన్ని ఎందుకు చేర్చలేదని వెంకయ్య ప్రశ్నించారు. చట్టంలో పొందుపరిచిన అంశాలను పదేళ్లలో అమలు చేయాలని ఉన్నా.. బీజేపీ మాత్రం పలు హామీలను మూడేళ్లలోనే నెరవేర్చిందని, మిగిలిన వాటిని నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరిస్తామని అన్నారు. -
దళారులకు అడ్డుకట్ట వేసేందుకే ‘జామ్’
ఒంగోలు: సంక్షేమం, అభివృద్ధి కేంద్రప్రభుత్వానికి రెండు కళ్లు అని, ప్రతి పేదవానికి ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం కల్పించడమే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక బచ్చల బాలయ్య కల్యాణమండపంలో హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటుచేసిన సబ్కా సాత్– సబ్కా వికాస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1.20 కోట్ల మంది ధనవంతులు గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారన్నారు. దాని ద్వారా లభించిన ఆదాయంతో ఇప్పటివరకు 2కోట్లమందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. రాబోయే రెండేళ్లలో మరో మూడు కోట్ల కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజాపంపిణీ, గ్యాస్ సబ్సిడీకి ఆధార్ అనుసంధానం ద్వారా రూ. 49500 కోట్ల నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడామన్నారు. దళారులకు అడ్డుకట్టవేసి ప్రజలకు నేరుగా లబ్ధిని చేకూర్చేందుకే జామ్(జన్‌ధన్, ఆధార్, మొబైల్) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నోట్ల రద్దు చేపడితే ఎక్కడెక్కడోదాచిన రూ. 15వేల కోట్లు బ్యాంకులకు చేరిందని తెలిపారు. సమాచార మార్పిడి ద్వారా త్వరలోనే నల్లధనం బయటకు వస్తుందన్నారు. 30 రోజుల్లో పరిష్కారం ఎవరైనా నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీలలో ఒక పనికోసం దరఖాస్తు చేసుకుంటే దానికి 30రోజుల్లోగా ఆన్లైన్ ద్వారా రిప్లయ్ ఇవ్వాల్సి ఉంటుందని, లేని పక్షంలో దరఖాస్తును సంబంధిత శాఖ ఆమోదించినట్లుగా పరిగణిస్తామని చెప్పారు. బియ్యం, గృహాలు, గ్యాస్ సబ్సిడీ, ఉపాధి హామీ పథకం, ఇంద్ర ధనుస్సు మిషన్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలేనన్నారు. డిసెంబర్ ఆఖరునాటికి అన్ని గ్రామాలకు విద్యుత్ ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఉపాధి పేరుతో విదేశాలకు వెళ్లిన 20 వేల మందిని ఇండియాకు తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. మాదిగలు కోరుకుంటున్న రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కూడా కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీనిపై మిగితా రాష్ట్రాలతో కూడా చర్చిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ 75 మంది కేంద్రమంత్రులు సబ్‌కాస్ సాత్– సబ్కా వికాస్, మోడీఫెస్ట్ పేరుతో దేశంలోని 900 కేంద్రాల్లో ఈ కార్యక్రమాలకు హాజరవుతారని, లబ్ధిదారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోనికి తీసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్సీలు కరణం బలరామకృష్ణ మూర్తి, మాగూంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు ఒంగోలు దామచర్ల జనార్దన్, కందుకూరు పోతుల రామారావు, డోలా బాలవీరాంజనేయ స్వామి, డీజీపీ ఎన్. సాంబశివరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, ఎస్పీ త్రివిక్రమవర్మ, ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. యాస్మిన్, కరణం వెంకటేశ్, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, డైరెక్టర్ భాస్కరరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, నాయకులు, రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు, నగరపాలక కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, హెచ్‌పీసీఎల్ జనరల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్, జిల్లా అధ్యక్షుడు పులి వెంకట కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి.మీనాకుమారి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య , రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు గోలి నాగేశ్వరరావు, బీజేపీ నగర అధ్యక్షుడు మల్లిశెట్టి శ్రీనివాసరావు, లీగల్‌సెల్ జాతీయ నాయకులు పేర్ల సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు. -
పొత్తులపై 2019లోనే నిర్ణయం..
కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్య గన్నవరం: వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయం 2019లో తేల్చుకోవాల్సిన అంశమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. దానిపై ఇప్పటినుంచి అనవసరంగా చర్చించుకుని, వివాదాలు సృష్టించే పనిలో భాగస్వాములు కావద్దని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం పొత్తులపై అంతర్గతంగా చర్చించుకున్నాకే అధిష్టానం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని పేర్కొన్నారు. రాయ్‌పూర్ వెళ్లేందుకు శుక్రవారం ఉదయం కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు: తెలంగాణ పర్యటనలో అమిత్ షా ఎక్కడా కేసీఆర్, టీఆర్ఎస్ గురించి ఒక్కమాటా ప్రస్తావించలేదని వెంకయ్య అన్నారు. ఐదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.లక్ష కోట్లు ఇస్తుందని మాత్రమే చెప్పారని, ఇప్పటికే రూ.65 వేల కోట్ల సాయం వచ్చిందని స్వయంగా కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. అయినా అమిత్‌షాపై కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం బాధించిందన్నారు. -
‘ఐరాస నివాసాలకు’ భారత్ నేతృత్వం
పాలక మండలికి వెంకయ్య సారథ్యం సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సుస్థిర మానవ నివాసాల ఏర్పాటును ప్రోత్సహించే ఐక్య రాజ్యసమితి విభాగమైన యూఎన్–హాబిటాట్‌కు భారత్ రెండేళ్లపాటు నేతృత్వం వహించనుంది. కెన్యాలోని నైరోబీలో సోమవారం ప్రారంభమైన ఈ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్ష స్థానానికి భారత్ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ‘నూతన పట్టణ ఎజెండా – సమర్థవంతమైన అమలుకు అవకాశాలు’ అనే అంశంపై ఈ పాలక మండలి సమావేశం జరుగుతోంది. నైరోబీలో జరుగుతున్న ఈ సమావేశాలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్య నాయు డు నేతృత్వం వహించారు. రెండేళ్లపాటు ఈ సంస్థ చర్చలకు వెంకయ్యే నాయకత్వం వహిస్తారు. ‘సరికొత్త పట్టణ భవిష్యత్తుపై పనిచేసేందుకు దీన్ని అవకాశంగా భావిస్తున్నా’ అని వెంకయ్య ట్వీట్ చేశారు. యూఎన్–హాబిటాట్‌కు భారత్ నేతృత్వం వహించడం ఇది మూడోసారి. -
వ్యవసాయం.. పారిశ్రామికం రెండు కళ్లు
► నోట్ల రద్దుతో నల్లధనం వెలుగులోకి వచ్చింది ► భవిష్యత్‌లో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆన్లైన్లోనే ► కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పట్టణాల్లో పారిశ్రామిక రంగం దేశానికి రెండు కళ్లు లాంటివని, ఇవి సమానంగా అభివృద్ధి చెందినప్పుడే దేశ పురోగతి వేగం పుంజుకుంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పా రు. శనివారం నగరంలో జరిగిన హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్స్‌లెన్స్–2017 అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. పారిశ్రామిక, వ్యాపారవేత్తలను శత్రువులుగా భావించటం సరైందికాదని, దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు. నీతిగా, నిజాయితీగా వ్యాపారాలు చేసినపుడే దేశ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. పారిశ్రామికవేత్తలు కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేస్తూ, పన్నులను చెల్లించినప్పుడు ఎటువంటి సమస్యలూ ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని వెలుగులోకి తెచ్చిందన్నారు. ప్రధాని దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించినప్పుడు అనేకమంది విమర్శలు చేశారని, వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పుడు అందరికీ తెలిసిందన్నారు. స్వయంకృషితో ఉన్నత శిఖరాలు... మీడియా సంచలనాలకు దూరంగా, సత్యానికి దగ్గరగా ఉండాలని, కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం పారిశ్రామిక వృద్ధిలో యువతరం పాత్ర కీలకంగా మారిందని, స్వయంకృషితో పాటుపడితే ఏ స్థాయికైనా ఎదగవచ్చని ప్రధాని మోదీ రుజువు చేశారని అన్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ అనుమతులన్నీ ఆన్లైన్లోనే ప్రవేశపెట్టబోతున్నామని, తద్వారా అవినీతిని అరికట్టడంతో పాటు పారదర్శకంగా ప్రజలకు త్వరితగతిన సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు, అమర్‌రాజా గ్రూప్ అధినేత గల్లా రామచంద్రనాయుడుకు జీవిత సాఫల్య అవార్డులు అందించారు. వీటితోపాటు 13 కేటగిరీల్లో 25 అవార్డులను వివిధ రంగాల్లోని పారిశ్రామికవేత్తలకు ప్రదా నం చేశారు. కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ న్ వామన్‌రావు, బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావుతో పాటు నాగార్జున కన్స్ట్రక్షన్ వ్య వస్థాపకులు ఏవీఎస్ రాజు, పోకర్న గ్రానైట్స్ వ్యవస్థాపకుడు గౌతమ్‌చంద్ జైన్, కంట్రోల్ ఎస్ ఫౌండర్ శ్రీధర్‌రెడ్డి , కిమ్స్ హాస్పిటల్స్ డైరెక్టర్ భాస్కర్‌రావు పాల్గొన్నారు. వాణిజ్య కార్మికులది కీలక పాత్ర... కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... వాణిజ్య రంగం దేశాభివృద్ధిలో కీలకమన్నారు. ఒకప్పుడు వ్యాపారస్తులంటే దోచుకునేవారనే అపవాదు ఉండేదని, కానీ మోదీ ప్రధాని అయ్యాక దేశాభివృద్ధిలో వ్యాపారస్తులు కీలకమని భావించి, వారి కోసం మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్పారు. వ్యాపార రంగంలో కార్మికులది కీలక పాత్రని, వ్యాపారం అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యాపారులు సమాజ హితం కోసం పాటుపడాలన్నారు. -
2019 నాటికే అందరికీ ఇళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2019 నాటికే 15 రాష్ట్రాల్లో అందరికీ ఇళ్లు అందుబాటులోకి వస్తాయని, మిగిలిన రాష్ట్రాల్లో 2022 నాటికి అందుబాటు లోకి వస్తాయని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ శాఖ పురోగతిపై ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) పథకం కింద ఇప్పటివరకు 2,008 నగరాల్లో 17.73 లక్షల ఇళ్లకు అనుమతి ఇచ్చామన్నారు. ఈ పథకాన్ని మధ్య తరగతి ఆదాయం కలిగిన వారికీ వర్తింపజేస్తున్నామన్నారు. బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఈ పథకం కింద సాయాన్ని రూ.1.50 లక్షలకు పెంచే యోచనలోఉన్నామన్నారు. ఏపీలో 1,95,047 ఆఫర్డబుల్ ఇళ్లకు అనుమతి ఇచ్చామని, 54,082 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, 2,892 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. తెలంగాణలో 82,985 ఇళ్లకు అనుమతివ్వగా 20,640 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, 776 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. -
బీజేపీతో టీఆర్ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్.. వాటిని వ్యతిరేకిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పడం చూస్తుంటే బీజేపీ–టీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టనిపిస్తోందని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకో వాలని డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు వీటిని మతపరమైన రిజర్వేషన్లు అనడం సరికాదన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా కాకుండా కేంద్రమంత్రిగా మాట్లాడితే మంచిదన్నారు. తెలంగాణ.. పాకిస్తాన్ అవుతుందంటూ వెంకయ్య మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల్లో మంత్రి కేటీఆర్ ఓ బచ్చా అని, కాంగ్రెస్‌ను విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మడమేనని అన్నారు. -
ఆదాయపు పన్ను రాయితీ కల్పించండి
అరుణ్ జైట్లీకి రాజధాని రైతుల వినతి సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు అప్పగించిన తమకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని రైతులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నేతృత్వంలో మాదాల రాజేంద్ర, మాదాల శ్రీనివాస్, కల్లం పానకాలరెడ్డి తదితరులు ఇదే వినతిపత్రాన్ని సీఎం చంద్రబాబు , కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు అందజేశారు. తాము రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూముల వల్ల వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్ కింద పరిగణించవద్దని కోరారు. ఆదాయపు పన్నులో దీనికి సంబంధించి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా జైట్లీకి విజయవాడలోని ఓ హోటల్లో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఇచ్చారు. ఈ విందులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్య మంత్రి కార్యక్రమం రద్దు
నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం వెంకటాచలం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా.. ఆలస్యం అవ్వడంతో.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. వెంకటాచలంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లి హ్యాండీక్యాప్డ్ కోసం ఏర్పాటు చేసిన నూతన భవన శంకుస్థాపన ముఖ్యమంత్రి చేయాల్సి ఉండగా.. ఆయన లేకపోవడంతో.. కేంద్ర మంత్రే ప్రారంభించారు. అనంతరం ఆయన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్స్ శిక్షణ సంస్థకు శంకుస్థాపన చేశారు. -
'విభజన చట్టంలోని ప్రతి హామీ అమలుకు ప్రయత్నిస్తాం'
గుంటూరు: విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరు నగరంలో రమేష్ కార్డియాలజి ఆసుపత్రిని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఏపీ రాజధాని ప్రాంతమైన తుళ్లురుతోపాటు చుట్టుపక్క నగరాలను అభివృద్ధి చేస్తేనే అంతర్జాతీయ రాజధాని ఏర్పాటవుతుందని అన్నారు. విజయవాడ, గుంటూరు నగరాలలో డ్రైనేజీ, తాగునీటి కోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు మరన్ని రావాలని... అవి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని ప్రభుత్వమే చేయాలన్న ఆలోచన నుంచి జనం బయటకు రావాలని వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా ప్రజలకు సూచించారు. -
ఆశలన్నీ ‘వెంకయ్య’ పైనే..!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల పేరొందింది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుమలకు వచ్చి.. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా రెట్టింపవుతున్న నేపథ్యంలో.. రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పూనుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలపై అర్బన్ మాస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ(యూఎంటీసీ) అనే ప్రైవేటు సంస్థతో సర్వే చేయించింది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు 27 కిమీల దూరం ఉంటుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డుకు సమాంతరంగా మోనో రైలు మార్గాన్ని నిర్మించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు యూఎంటీసీ తేల్చింది. తిరుపతి బస్‌స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి మీదుగా తిరుమలకు 27 కిమీల మేర మోనో రైలు మార్గాన్ని నిర్మించాలని సూచించింది. మోనో రైలు మార్గం.. ఆరు మోనో రైలు ఇంజిన్లు, వంద బోగీలను కొనుగోలు చేయడానికి రూ.3,510 కోట్ల మేర అవసరం అవుతాయని ఆ సంస్థ తుడాకు నివేదిక ఇచ్చింది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ పక్కనే ఓ రైల్వే స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి వద్ద రైల్వే స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించింది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుమలకు వెళుతున్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని తేల్చింది. ఒక్కో సారి గరిష్ఠంగా 500 మంది భక్తులను మోనో రైలు ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు చేర్చవచ్చు. చిన్నపాటి వర్షం కురిసినా ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడి.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ఆవశ్యకతను తుడా గుర్తించింది. ఇదే అంశంపై తిరుపతి ఎంపీ వరప్రసాద్ సెప్టెంబర్ 15న తుడా అధికారులతో సమీక్షించారు. మోనో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తుడా అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఆమోదానికి పంపారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసిన నేపథ్యంలో.. మోనో రైలు ప్రాజెక్టును ఆ ప్రణాళికలోనే చేర్చాలని ప్రతిపాదించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పూనమలై-గిండీ-పోరూర్-వడపళణి మధ్య 20.68 కిమీల మేర రూ.3,267 కోట్ల అంచనా వ్యయంతో మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు నవంబర్ 30న కేంద్ర పట్టణాభివృద్ధికి శాఖ ఆమోదం తెలిపింది. కానీ.. ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని తమిళనాడు ప్రభుత్వమే భరించాలని స్పష్టీకరించింది. తుడా వద్ద ఆ మేరకు నిధులు అందుబాటులో లేని నేపథ్యంలో.. తిరుమల మోనో రైలు ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని సూచించింది. స్మార్ట్ సిటీలను పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం)లో చేపడుతోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టునూ అదే పద్ధతిలో చేపట్టేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? ప్రభుత్వ నిధులతోనే చేపడుతుందా? ఆ ప్రాజెక్టును తిరస్కరిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్రం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తిరుమల మోనో రైలు ప్రాజెక్టుపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆమోదముద్ర వేసి.. నిధులు కేటాయిస్తుందా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
హెలికాప్టర్ ను తగులబెట్టిన కేసులో మావోయిస్టు అరెస్ట్
గయా(బీహార్): బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హెలికాప్టర్ ను తగులబెట్టిన కేసుతో సంబంధమున్న పరాస్ యాదవ్ అనే మావోయిస్టును బీహార్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గయా జిల్లాలోని నవాదిహ్ గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సబ్ డివిజనల్ పోలీసు అధికారి తెలిపారు. 2005లో ఎన్నికల ప్రచారం సందర్భంగా అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గయా జిల్లాలోని పరారియా గ్రామంలో మిడిల్ స్కూల్ పాఠశాల ప్రాంగణంలో అత్యవసరంగా దిగింది. తర్వాత ఆయన రోడ్డు మార్గం ద్వారా గమ్యానికి చేరుకున్నారు. ఈ హెలికాప్టర్ ను మావోయిస్టులు తగులబెట్టారు.