ఉపరాష్ట్రపతిగా ప్రమాణం
స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి ఉపరాష్ట్రపతిగా వెంకయ్య రికార్డు
న్యూఢిల్లీ: 15వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు (68) శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్.. వెంకయ్యతో ప్రమాణం చేయించారు. సాంప్రదాయ పంచె, తెల్ల చొక్కా వేసుకుని వెంకయ్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, విపక్ష నేతలు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఎన్డీయే ముఖ్యమంత్రులు (నితీశ్ కుమార్ సహా), ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వెంకయ్య కుటుంబసభ్యులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం అనంతరం అడ్వాణీకి వెంకయ్య పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆహ్వానం అందలేదని సమాచారం. కాగా, ప్రథమ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, తాజా మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ వరుసగా రెండుసార్లు ఈ పదవిలో ఉన్నందున వెంకయ్య రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి బాధ్యతలు స్వీకరించిన 13వ వ్యక్తిగా నిలిచారు. స్వతంత్ర భారతంలో పుట్టిన తొలి ఉపరాష్ట్రపతి కూడా వెంకయ్యే.