ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చి తప్పించారన్నది తప్పు: వెంకయ్య
సాక్షి, అమరావతి: బీజేపీ అధిష్టానం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి, కావాలనే కేంద్ర పదవి నుంచి తప్పించిందని జరుగుతున్న ప్రచారంపై ఎం.వెంకయ్య నాయుడు స్పందించారు. విజయవాడలో శనివారం జరిగిన ఆత్మీయుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. అమిత్ షా కుట్ర పన్నారనడం సరికాదని, ఆయనెందుకు కుట్ర పన్నుతారని ప్రశ్నించారు. 2019లో నరేంద్రమోదీ ఇంకొకసారి ప్రధానిగా చూసి, రాజకీయాలనుంచి తప్పుకొని తన ఊరు వెళ్లి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
వాజ్‌పేయి బహిరంగ సభ గురించి ఊరూరా తిరిగి మైక్‌లో ప్రచారం చేసిన తనకు వాజ్‌పేయి, అద్వానీలిద్దరి మధ్య కూర్చొని రాజకీయాలు చేసే అవకాశం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. అంతగా ఎదిగేందుకు అవకాశమిచ్చిన పార్టీ ఆఫీసుకు రేపటి నుంచి రాకూడదన్న భావనతోనే ఉప రాష్ట్రపతి పదవి అన్నప్పుడు ఉద్వేగానికి లోనైనట్లు తెలిపారు.
ఆరోపణలకు బెదిరే ప్రసక్తే లేదు
ఏపీలో పార్టీ పరిస్థితికి ముడిపెట్టి ఉప రాష్ట్రపతి గురించి మాట్లాడుతున్నారని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలు ఎదుగుతాయే తప్ప, నాయకుడిని బట్టి కాదన్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ– బీజేపీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఇరుపక్షాలు లాభపడ్డాయని చెప్పారు. చంద్రబాబు అంటే తనకు అభిమానమని తెలిపారు. విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందన్న భావనతోనే ఏపీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రానికి లక్షల ఇళ్లు కేటాయించినా, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టించినా... ప్రధాని, మంత్రుల సహకారం లేకుండా జరుగుతాయా? అని ప్రశ్నించారు. తాను జీవించి ఉన్నంతవరకు తన కుటుంబీకులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులకు సంబంధించిన స్వర్ణ భారత్ ట్రస్టుపై ఆరోపణలు చేసి తనను బెదిరించాలని చూస్తే బెదిరేది లేదని చెప్పారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తవగానే తిరుమల వెళ్లి దర్శనం చేసుకుంటానని తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాలు సన్మానం
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోదం ప్రక్రియలో సహకరించినందుకు రాష్ట్రంలో పలు ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా శనివారం వెంకయ్యనాయుడును ఘనంగా సన్మానించాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పత్తిపాటి పుల్లారావు అధ్యక్షత వహించారు.