దేశీయ భాషలకు పునరుజ్జీవం కల్పించాలి  | Resurrection to the National Languages | Sakshi
Sakshi News home page

దేశీయ భాషలకు పునరుజ్జీవం కల్పించాలి 

Published Sun, May 27 2018 1:27 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Resurrection to the National Languages - Sakshi

పరిషత్‌ ఉత్సవాల్లో సంతకం చేస్తున్న వెంకయ్య. చిత్రంలో రమణాచారి, మహమూద్‌ అలీ, ఎల్లూరి

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ సారస్వత పరిషత్‌కు పెద్ద చరిత్ర ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఏర్పడి 75 ఏళ్లు అయిన సందర్భంగా శనివారం ఇక్కడ పంచ సప్తతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ భాషలను ప్రభుత్వాలు పునరుజ్జీవింప చేయాలని సూచించారు. తెలుగు సాహిత్య పరిరక్షణకు పలువురు మహానుభావులు కంకణం కట్టుకున్నారని, ఆనాడు ఎన్నో అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా సారస్వత్‌ పరిషత్‌ ఏర్పాటుకు కృషి చేశారని కొనియాడారు.

తెలుగు భాష పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఆధునికత పేరుతో ఆంగ్ల భాషపై వ్యామోహం పెరిగిందని, ఇంగ్లిష్‌ వస్తేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనే భావన ప్రజల్లో ఉందని. ఇది సరికాదన్నారు. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్నిరకాల పరీక్షలను ఆయా ప్రాంతాల భాషల్లో నిర్వహించటం మూలంగా మాతృభాష పరివ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని, అప్పుడే ఆయా దేశీయ భాషల ఉనికి కాపాడబడుతుందని అన్నారు. మాతృభాష నేర్చుకొన్నా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కల్పించాలని, అప్పుడే భాషాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు సారస్వత పరిషత్‌ గణనీయమైన పాత్ర పోషించిందన్నారు. పరిషత్‌ 75 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సారస్వత పరిషత్తు భవనం మరింత విశాలంగా చేసేందుకు ‘నిర్మించు – నిర్వహించు’అనే ప్రాతిపదికన ప్రయివేట్‌ సంస్థల ద్వారా అభివృద్ధి చేయాలన్నారు.

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రితో మాట్లాడి దీనికి సహాయం అందేలా చూస్తానన్నారు. తన వంతుగా రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ రూ.2 లక్షల విరాళం ఇచ్చారు. పరిషత్‌లో ఓ పెద్ద హాల్‌ నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి కోరారు.  కార్యక్రమంలో పరిషత్‌ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ ముదిగంటి సుజాతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement