అన్నదాతలు ఆర్థికంగా ఎదిగితేనే పండుగ | Venkiah Naidu Comments on Agriculture and Farmers | Sakshi
Sakshi News home page

అన్నదాతలు ఆర్థికంగా ఎదిగితేనే పండుగ

Published Mon, Jan 14 2019 3:14 AM | Last Updated on Mon, Jan 14 2019 3:14 AM

Venkiah Naidu Comments on Agriculture and Farmers - Sakshi

గోమాతకు నమస్కరిస్తున్న వెంకయ్యనాయుడు. చిత్రంలో కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, హైకోర్టు సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అన్నదాతలు ఆర్థికంగా నిలదొక్కుకున్నపుడే దేశానికి అసలైన పండుగ అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక, గుణాత్మక మార్పులు రావాలని భావించారు. దీనిపై తాను నీతిఅయోగ్‌తో సంప్రదింపులు జరుపు తున్నట్లు తెలిపారు. ప్రస్తుత, గత ప్రభుత్వాలు రైతుల కోసం ఎంతోకొంత మేలు చేశాయని, మరింత సేవ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.  దేశంలో ప్రతి పండుగకు ఓ సందేశం ఉందని, అలా సంక్రాంతి.. రైతుల పండగ అని, వారు సంతో షంగా ఉంటేనే దేశం బాగుంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో ఉన్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ రెండో వార్షికోత్సవం ఆదివారం జరిగింది. సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, రాష్ట్ర హైకోర్టు ప్రధానమూర్తి టీబీ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి జ్యోతి వెలిగించిన అనంతరం ప్రసంగించారు.

సమాజ సేవే లక్ష్యంగా ఏర్పాటు చేసిన స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ద్వారా యువతకు వందశాతం ఉద్యోగావకాశాలు లభించడం సంతోషానిస్తోందన్నారు. మరికొందరు స్వయం ఉపాధి కల్పించుకోవడం శుభపరిణామమని అన్నారు. భాష, సంస్కృతి పరిరక్షణకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. స్వర్ణభారత్‌ ట్రస్టీ దీపా వెంకట్‌ రాజకీయాల్లోకి రావాలని అందరూ ఒత్తిడి తెస్తున్నా సున్నితంగా ఆమె తిరస్కరిస్తూ సమాజసేవకు ప్రాధాన్యమి స్తున్నారని తెలిపారు. ‘లాభం వచ్చే వారసత్వం కోసం ఎవరైనా ముందుకొస్తారు. కాని సమాజం కోసం పనిచేసే సంస్థకు మా బిడ్డలు దీపా, హర్షవర్ధన్‌ సమయం కేటాయిం చడం హర్షణీయం. ఈ వారసత్వాన్ని నేను ప్రోత్సహిస్తాను. నేను రాజకీయాల్లోకి వచ్చా కాబట్టి.. నా సంతానమూ అందులో ఉండా లనుకోవడం లేదు. రాజకీయ నేతల కొడు కులు, కుమార్తెలు రాజకీయాల్లోకి రావొద్దని కాదు. వారి శక్తి, సామర్థ్యాన్ని బట్టి రాజకీయా లను ఎంచుకోవాలి. ఫలాన నేత కొడుకు అని చెప్పుకునే వారసత్వం మంచిదికాదు’ అని వెంకయ్య అన్నారు. ఈర‡్ష్య, అసూయ, ద్వేషం వంటి చెడు లక్షణాలు విద్యావంతుల్లోనే ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పండుగ సందర్భంగా గంగిరెద్దులు కనిపించడం లేదని, రాజకీయాల్లో మాత్రం వాటిని చూస్తున్నామని చమత్కరించారు. 

గ్రామీణాభివృద్ధికి ట్రస్ట్‌ ఓ మోడల్‌
అశోకుని కాలంలో దేశాన్ని స్వర్ణభారతం అని పిలిచే వారని, మళ్లీ ఇప్పుడు దేశంలో సామాజిక మార్పు కోసం ‘స్వర్ణభారత్‌ ట్రస్ట్‌’ కృషి చేస్తోందని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు.పేదలు, రైతులు, మహిళల అభివృద్ధి పట్ల వెంకయ్య నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తారని, అందుకే  ట్రస్ట్‌ అంతర్జాతీయ ప్రమాణాలతో సాగుతోం దన్నారు. గ్రామీణాభివృద్ధికి ఓ మోడల్‌గా నిలిచిందని, సేవతోపాటు సంస్కృతీ పరిరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఉన్నతమై నవన్నారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆలోచన చాలా గొప్పదని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్‌ అన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంటి మహోన్నతుల స్ఫూర్తితో గ్రామీణ యువత,మహిళలు, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా  పనిచేస్తోందని చెప్పారు. గ్రామీణ భారతం నైపుణ్య భారత్‌గా మారాలని ఆకాంక్షించారు. 

సంస్కృతుల సమ్మోహనం
సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించారు. తప్పెట గుళ్లు, ఒగ్గుడోలు, హరిదాసులు, గంగిరెద్దులు, పిట్టలదొర వంటి జానపద కళారూపాలను ప్రదర్శించారు. అలాగే జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ప్రదర్శన జరిపారు. వివిధ జాతులకు చెందిన ఆవులను ప్రదర్శనలో ఉంచారు. బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. సినీగాయని సునీత, శ్రీకృష్ణ బృంద సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలలిచింది. పేరిణి నృత్యం అందరిలో భక్తిభావనను పొంగించింది. యువకుడు విష్ణుభట్ల కార్తీక్‌ పాడిన తెలుగు పద్యాలు ఆహూతుల్ని కట్టిపడేశాయి. ఉపరాష్ట్రపతి అతనిని ప్రత్యేకంగా అభినందించడం విశేషం. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు ప్రదానం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement