అన్నపూర్ణ మన తెలంగాణ | CM KCR Said Telangana Is Becoming Rice Bowl Of India | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణ మన తెలంగాణ

Published Wed, Apr 29 2020 2:46 AM | Last Updated on Wed, Apr 29 2020 8:55 AM

CM KCR Said Telangana Is Becoming Rice Bowl Of India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సాగునీటి వసతి పెరుగుతున్నందున రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతోందని, రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ మారుతోందని సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. పంటల విస్తీర్ణం, దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు, 2,500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను ఆదేశిం చారు. యాసంగి పంటల కొనుగోలు, వానాకాలం సాగు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో రైతులు తీవ్ర వ్యథకు గురయ్యారని, తెలంగాణ వచ్చిన తర్వాత రైతు సంక్షేమం– వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలు తీసుకోవడంతో రైతుల పరిస్థితి కొంత మెరుగైందని, ఈ విషయంలో మరింత కృషి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే...

ఏటా 3 కోట్ల ఎకరాల్లో సాగు..
‘ప్రాజెక్టుల నిర్మాణంతో గోదావరి, కృష్ణా నదుల్లో భవిష్యత్తులో 1300 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం కలుగుతుంది. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాతో సాగునీటి లభ్యత పెరిగింది. ప్రాజెక్టులు, చెరువులు, బోర్ల ద్వారా కోటీ 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు, 10 లక్షల ఎకరాల్లో 3 పంటలు పండే చాన్స్‌ ఉంది. ఏడాదికి తెలంగాణలో 3 కోట్ల ఎకరాల్లో పంట పండుతుంది. ఇందులో కోటికి పైగా ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశం ఉంది. అప్పుడు తెలంగాణ రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మారుతుంది. ఇప్పుడు పండుతున్న పంటకు రెట్టింపుకన్నా ఎక్కువ దిగుబడులు వస్తాయి. ఈ దిగుబడులకు మద్దతు ధర వచ్చే వ్యూహాన్ని ఖరారు చేయడం మన కర్తవ్యం. వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ, రైతుబంధు సమితి ఈ దిశగా అడుగులు వేయాలి.

పౌర సరఫరాల సంస్థ ద్వారా ఫుడ్‌ ప్రాసెసింగ్‌
రైతులకు మద్దతు ధర ఇవ్వడంతోపాటు ప్రజలకు బియ్యం, పప్పుల వంటి ఆహార దినుసులను తక్కువ ధరల్లో అందించే విధంగా పౌర సరఫరాల సంస్థ తన కార్యకలాపాలను విస్తరించుకోవాలి. ధాన్యం, కందులు, శెనగలు, పెసర్లు వంటివి కొనుగోలు చేసి, వాటిని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా బియ్యం, పప్పులు తదితర వినిమయ సరుకులుగా మార్చి ప్రజలకు అందించాలి. దీనివల్ల అటు రైతులకు మేలు కలుగుతుంది. ఇటు ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహార దినుసులు లభిస్తాయి. ఈ దిశగా సంస్థ కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి. చదవండి: గుడుంబా గుప్పు.. పల్లెకు ముప్పు 
 
వ్యవసాయ శాఖ చెప్పిన పంటే పండించాలి
రైతులంతా ఒకే పంట వేసే విధానం పోవాలి. ప్రజలకు అవసరమైన, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను వ్యవసాయ శాఖ గుర్తించాలి. రైతులు అవే వేయాలి. ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేయడానికి అనువైనదో వ్యవసాయ శాఖ మార్గదర్శకం చేయాలి. ఎవరు ఏ పంట వేస్తున్నారో కచ్చితంగా రికార్డు చేయాలి. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. నియంత్రిత పద్ధతిలో పంటలు వేయాలి. నియంత్రిత పద్ధతిలోనే కొనుగోళ్లు జరగాలి. ఇందుకు అవసరమైతే ప్రస్తుత చట్టంలో మార్పులు తేవడానికి కూడా సిద్ధం. 

మే నెలలోనే ఎరువులు కొనుక్కోవాలి
సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ ఎరువులు, విత్తనాల అవసరం గతంలో కన్నా పెరగనుంది. ఈ వర్షాకాలంలో 22.30 లక్షల టన్నుల ఎరువులు అవసరం. జూన్‌లో వాడడానికి అవసరమైన ఎరువులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. రెతులు వాటిని మే మాసంలోనే కొనుగోలు చేయాలి. రైతులంతా ఒకేసారి ఎరువుల దుకాణాల మీద పడకుండా ఏఈవోలు వారిని సమన్వయపరచాలి. విత్తనోత్పత్తి చేసే రైతులు నేరుగా కంపెనీలతో ఒప్పందం చేసుకుని సాగు చేయాలి. నకిలీ ఎరువులు, పురుగుమందులు, కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే కఠినాతి కఠినంగా శిక్షిస్తాం. 

అదనంగా గోదాముల నిర్మాణం...
గత ఐదేళ్లలో చేసిన కృషి వల్ల 22.5 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గోదాము ఉండాలి. ప్రభుత్వ స్థలాల లభ్యతను బట్టి మండల కేంద్రాల్లో కూడా నిర్మించాలి. ఏడెనిమిది నెలల్లోనే వీటి నిర్మాణం పూర్తి కావాలి. 5వేల ఎకరాలకు ఒకటి చొప్పున వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశాం. ప్రతీ క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని కూడా నియమించాం. క్లస్టర్లవారీగా రైతులు ఎప్పటికప్పుడు కలుసుకుని చర్చించుకోవడానికి వీలుగా వెంటనే క్లస్టర్‌కు ఒకటి చొప్పున 2,500 రైతువేదికలు నిర్మించాలి’అని సీఎం ఆదేశించారు.  చదవండి: ఆన్‌లైన్‌ విద్య.. ఆబ్జెక్టివ్‌ పరీక్షలు!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement