రైతుకు బాసటగా మార్కెటింగ్‌.. మరింత బలోపేతం | CM KCR Review On Agriculture, Marketing Department | Sakshi
Sakshi News home page

రైతుకు బాసటగా మార్కెటింగ్‌.. మరింత బలోపేతం

Published Mon, Jan 25 2021 2:50 AM | Last Updated on Mon, Jan 25 2021 4:56 AM

CM KCR Review On Agriculture, Marketing Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతన్న ఆగం కాకూడదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అభిలషించారు. తాజా పరిస్థితుల్లో రైతులకు బాసటగా నిలిచేందుకు రాష్ట్రంలో మార్కెటింగ్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ వ్యవస్థ ఎలా పరిణామం చెందినప్పటికీ, తెలంగాణలో మాత్రం సజీవంగా ఉంచడమే కాకుండా... మరింత బలోపేతం చేస్తామన్నారు. పది రోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేశారనే విషయంలో సరైన లెక్కలు తీయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక. తెలంగాణలో వాటిని కొనసాగిస్తామన్నారు. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానం తీసుకురావాలన్నారు.

ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్‌కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలన్నారు. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో రైతులకు సూచనలు చేయాల న్నారు. ఇందుకోసం మార్కెటింగ్‌ శాఖలో రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కొత్త చట్టాల అమలు వల్ల మార్కెట్‌ సెస్‌ రాకున్నా ప్రభుత్వమే నిధులను సమకూర్చి మార్కెటింగ్‌ శాఖను బలోపేతం చేస్తుందన్నారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జిల్లా వ్యవసాయాధికారులు, మార్కెటింగ్‌ శాఖాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. వ్యవసాయాభి వృద్ధి– రైతు సంక్షేమం విషయంలో ఈ రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను ముఖ్య మంత్రి విడమర్చి చెప్పారు.

దాదాపు 8 గంటల పాటు జరిగిన సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తున్నది, అక్కడి వ్యాపారులకు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉన్నదన్న వివరాలు సేకరించాలన్నారు. వరిలో ఆధునిక సాగు పద్ధతులు వచ్చాయి. వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేయడం వల్ల ఎకరానికి 10 వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. పత్తిలో సింగిల్‌ పిక్‌ పద్ధతి వచ్చింది. ఇంకా అనేక పంటల్లో కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు వచ్చాయి. వాటిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. చదవండి: (తక్షణమే పీఆర్సీ చర్చల.. సీఎం కేసీఆర్‌ ఆదేశం)

‘పొలం– హలం’శాఖగా మారాలి
‘తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగింది. వ్యవసాయ శాఖ కాగితం – కలం శాఖగా కాకుండా పొలం – హలం శాఖగా మారాలి. ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలి. వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. రైతులు పండించిన పంటలను మార్కెట్‌లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంభించే బాధ్యత మార్కెటింగ్‌ శాఖపై ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెనువెంటనే వాడుకలోకి తేవాలి. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఏఈఓ, రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలోనే భాగంగా ఉండాలి. ఇందుకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాల’ని ముఖ్యమంత్రి ఆదేశించారు.  చదవండి: (యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్‌ కలల ప్రాజెక్టు)

దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ
‘అమెరికా, చైనా, రష్యా, జపాన్, ఇజ్రాయిల్‌ లాంటి దేశాల్లో ఇలా జరిగింది... అలా జరిగింది అంటూ చెప్పుకునే విజయగాథలను ఇంతవరకు విన్నాం. కానీ ఇప్పుడా అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రమే గతంలో కనీవినీ ఎరుగని ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వంద శాతం నల్లాల ద్వారా నీరందించి నెంబర్‌ వన్‌గా నిలవడం మిషన్‌ భగీరథ వల్ల సాధ్యమైంది. దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న కరెంటు సమస్యను పరిష్కరించుకున్నాం.

దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ ను సరఫరా చేసుకోగలుగుతున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామసీమల రూపురేఖలే మారిపోయాయి. అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు వచ్చాయి. డంప్‌ యార్డులు, శ్మశానవాటికలు, రైతు వేదికలు, కల్లాలు వచ్చాయి. అదే తరహాలో వ్యవసాయరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి’అని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

పంటల మార్పిడి విధానం రావాలి
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారు. కానీ నేడు 1 కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల 1 కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతాం. బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు పైగా నీరు అందుతోంది. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ ఎంతో బలోపేతం కావాలి. వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి. రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి.

పంట మార్పిడి విధానం రావాలి. దీనివల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది. సాగులో ఆధునిక పద్ధతులు రావాలి. ఈ అంశాలపై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 2,600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తేవాలి. రైతులతో సమావేశాలు నిర్వహించాలి. పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్‌ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించాలి. ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలు నమోదు చేయాలి. పది రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్న పంటల విషయంలో స్పష్టత రావాల’ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు....
– యాంత్రీకరణ పెంచడం కోసం ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది.
– మండల వ్యవసాయాధికారులను ఆగ్రోనమిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. 
– ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి వ్యవసాయాధికారులు ఇజ్రాయిల్‌లో పర్యటించాలి. 
– పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పప్పులు, నూనె గింజలు పండించే ప్రాంతాల్లో దాల్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది. 
– ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం స్ట్రాటజిక్‌ పాయింట్లను గుర్తించాలి. 
– వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. 
– మార్కెట్లలో ట్రేడ్‌ లైసెన్స్‌ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement