ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్‌ | KCR Sets Deadline For Palamuru Ranga Reddy Scheme | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది చివరిలోగా... పాలమూరు

Published Sun, Jan 24 2021 1:58 AM | Last Updated on Sun, Jan 24 2021 5:23 AM

KCR Sets Deadline For Palamuru Ranga Reddy Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వలసల జిల్లా ఉమ్మడి మహ బూబ్‌నగర్‌కు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తి పోతల ప్రాజెక్టును ఈ ఏడాది చివరి కల్లా వంద శాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవర కొండ ప్రాంతాలకు సాగునీరు అం దించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి, ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని కోరారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధుల వరద ఆగవద్దని, ఈ ఏడాది బడ్జెట్లో కూడా వీటికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనుల బిల్లులు చెల్లించడానికి తక్షణం రూ.2 వేల కోట్లు విడుదల చేయా లని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావును ఆదేశించారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లోని మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని నిర్ణయించినట్లు కేసీఆర్‌ ప్రకటించారు. వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రాజెక్టుల నిర్వహణలో ఉపయోగించుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. 

‘పాలమూరు’తో సస్యశ్యామలం..
పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మొత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా సస్యశ్యామలం అవుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన... నార్లాపూర్‌ రిజర్వాయర్, పంపుహౌజ్, నార్లాపూర్‌ – ఏదుల కాలువ, ఏదుల పంపుహౌజ్, ఏదుల–వట్టెం కాలువ, వట్టెం రిజర్వాయర్, వట్టెం–కర్వెన కాలువ, కర్వెన రిజర్వాయర్, కర్వెన– ఉద్దండాపూర్‌ కాలువ, టన్నెల్‌ పనులను ఆయన సమీక్షించారు. ఉద్దండాపూర్‌ నుంచి ఎగువ ప్రాంతాలకు నీరందించే మార్గానికి సంబంధించి తుది డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు, జూరాలతో కలిపి 11.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం వెల్లడించారు.

డిండి ప్రాజెక్టు పరిధిలోని కాలువలు, రిజర్వాయర్ల పనులను సీఎం సమీక్షించారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పూర్తికి తక్షణం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని నాగర్‌కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సీఎం కోరారు. చట్టప్రకారం ఇవ్వాల్సిన పరిహారం రైతులకు అందించి, వెంటనే భూ సేకరణను పూర్తి చేసి, భూమిని నీటి పారుదల శాఖకు అప్పగించాలని సూచించారు. బీహెచ్‌ఈఎల్‌ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ను సీఎం కోరారు. మిషన్‌ భగీరథకు నీరివ్వడానికి వీలుగా అన్ని రిజర్వాయర్లలో మినిమమ్‌ డ్యామ్‌ డ్రాయింగ్‌ లెవల్‌ను మెయింటేన్‌ చేయాలని ఆదేశించారు. ప్రతీ ఏడాది ముందుగా అన్ని చెరువులను నింపాలన్నారు. 

పనులు ఆగొద్దనే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆర్థికాధికారాలు...
‘కోటి 25 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నది. ఈ శాఖ ప్రాధాన్యం, పరిధి ఎంతో పెరిగింది. సమర్థవంతంగా నిర్వహించడానికి నీటి పారుదల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆయా ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, తూములు, చెక్‌ డ్యాములు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా ఒకే సీఈ పరిధిలోకి తేవడం జరిగింది. డీఈఈ స్థాయి నుంచి ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ స్థాయి వరకు ప్రతీ అధికారికి నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసింది. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్‌ దాకా రావాల్సిన అవసరం లేకుండా, స్థానిక అధికారులే నిధులు మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం.

ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌)కు ఒక్కొక్క పనికి రూ.కోటికి మించకుండా ఏడాదికి రూ.25 కోట్ల వరకు, చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ)కు ఒక్కొక్క పనికి రూ.50 లక్షలకు మించకుండా ఏడాదికి రూ.5 కోట్ల వరకు, పర్యవేక్షక ఇంజనీర్‌ (ఎస్‌ఈ)కు ఒక్కొక్క పనికి రూ.25 లక్షలకు మించకుండా ఏడాదికి రూ.2 కోట్ల వరకు, కార్యనిర్వాహక ఇంజనీర్‌ (ఈఈ)కు ఒక్కొక్క పనికి రూ.5 లక్షలు మించకుండా ఏడాదికి రూ.25 లక్షల వరకు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్‌(డీఈఈ)కు ఒక్కొక్క పనికి రూ.2 లక్షలు మించకుండా ఏడాదికి రూ.5 లక్షల వరకు తమ స్థాయిలోనే మంజూరు చేసే ఆర్థిక అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్నచిన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలి’అని సీఎం కేసీఆర్‌ కోరారు. ‘నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. ఈ విభజన, ఆయా అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేయడానికి అనువుగా ఉందో? లేదో? ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. అవసరమైన పక్షంలో మార్పులు చేయాలి’అని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement