సందేహాలకు సమాధానమిస్తాం: కేసీఆర్‌ | CM KCR Revealed In Review With Engineers | Sakshi
Sakshi News home page

సందేహాలకు సమాధానమిస్తాం: కేసీఆర్‌

Published Thu, Aug 20 2020 1:36 AM | Last Updated on Thu, Aug 20 2020 9:23 AM

CM KCR Revealed In Review With Engineers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ లేవనెత్తిన సందేహాలన్నింటినీ అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో నివృత్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను సైతం సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. ఈ నెల 25న అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రి.. భేటీ విషయంలో సంసిద్ధతను వ్యక్తం చేస్తూ లేఖ రాయాలని నిర్ణయించారు. ఎజెండాలో చేర్చాల్సిన అంశాలను సైతం ఆ లేఖలో పేర్కొంటామని తెలిపారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

అభ్యంతరాలను తిప్పికొడదాం..
తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్రం, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సందేహాలను కౌన్సిల్‌ భేటీలో నివృత్తి చేయాలని, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వాస్తవానికి తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఏపీలోని ప్రాజెక్టులనే రాష్ట్ర అవసరాలను తీర్చేలా రీడిజైన్‌ చేశామని తెలిపారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా కౌన్సిల్‌ సమావేశంలో చెప్పాలని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి.. ఎన్ని నిధులు కేటాయించారు.. తెలంగాణ వచ్చే నాటికి ఎంత ఖర్చు చేశారు.. ఎంతభూమి సేకరించారు.. ఎన్ని టీఎంసీలు కేటాయించారన్న వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ వ్యవహరించిందన్న విషయాన్ని ఆధార సహితంగా వివరించాలని సూచించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో పాటు ఏపీ కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. (పరీక్షలపై పునరాలోచన ఉత్తమం)

నీటి కేటాయింపులు లేకున్నా, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్‌ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఏపీ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంలో కూడా సమావేశంలో నిలదీయాలని స్పష్టం చేశారు. వీటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్రం కానీ, ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నీ అర్ధంపర్థం లేనివే అని పేర్కొన్నారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేశామని, ఈ అపెక్స్‌ కౌన్సిల్‌లో అయినా ఆ అంశాలను చేర్చి న్యాయం చేయాలని కోరతామని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, జలవనరుల శాఖ సలహాదారు ఎస్‌కే జోషి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌ సీ నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement