సాక్షి, హైదరాబాద్: అడవుల లోపల పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా సమీపంలోని ప్రభుత్వ భూములను కేటాయించాలని.. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే అడవుల అంచున భూమిని ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీనితోపాటు వారికి నీరు, విద్యుత్, నివాస సదుపాయాలు కూడా కల్పించాలని.. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యపై శనివారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు.
పోడు సాగుచేస్తున్న గిరిజనులు, గిరిజనేతరుల నుంచి దరఖాస్తుల స్వీకరణను వచ్చే నెల 8న ప్రారంభించాలని.. డిసెంబర్ 8 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వచ్చేనెల 8లోగా అన్నిస్థాయిల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్)–2006 ప్రకారం గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని.. రెండు, మూడు గ్రామాలకో నోడల్ అధికారిని నియమించాలని, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.
అడవులకు శాశ్వత సరిహద్దులు
అటవీ భూములకు శాశ్వత సరిహద్దులను నిర్ణయించి, ప్రొటెక్షన్ ట్రెంచ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ట్రెంచ్‌లపై గచ్చకాయ ప్లాంటేషన్ చేపట్టాలని.. ట్రెంచ్ ఏర్పాటుకు అటవీ, ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. పోడు భూముల ఆక్రమణల్లో 87శాతందాకా భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ తదితర 12 జిల్లాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.
పీడీ చట్టం ప్రయోగించండి
గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని, బయటి నుంచి వచ్చేవారే అడవిని నాశనం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోండు, కోలం, కోయ వంటి గిరిజన తెగల ప్రజలు అడవికి నష్టం చేయరన్నారు. అడవిపైనే ఆధారపడి బతికే వీరికి మేలు చేయాలని, బయటి శక్తులు అడవులను ధ్వంసం చేయకుండా కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాల కలెక్టర్లు అటవీ భూముల రక్షణలో కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అడవుల రక్షణ చర్యల్లో సంబంధిత శాఖల అధికారులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు.
జిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలు
పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై అన్నిజిల్లాల్లో అఖిలపక్ష సమావేశాలను నిర్వహించాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇప్పటివరకు పోడు సాగు చేస్తున్న గిరిజనులు, ఇతరులకు ఆర్వోఎఫ్‌ఆర్ హక్కులు కల్పించడంతోపాటు.. ఇక ముందు అంగుళం కూడా అటవీ భూమి ఆక్రమణకు గురికావొద్దన్న అంశంలో అఖిలపక్ష నాయకుల నుండి ఏకాభిప్రాయం తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు.
గంజాయి సాగు చేస్తే జైలుకే..
గంజాయి సాగుచేస్తే రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ సౌకర్యం నిలిపివేయడంతోపాటు అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్వోఎఫ్‌ఆర్ భూముల్లో గంజాయి సాగుచేస్తే ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాల రద్దుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తిగా అరికట్టి తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పదెకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానం..
సామాజిక వనాల పెంపకంలో భాగంగా ఎన్ని కోట్ల మొక్కలు నాటినా అడవితో సమానం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. కేవలం పదెకరాల అడవి కొన్ని లక్షల మొక్కలతో సమానమన్నారు. గజ్వేల్ తరహాలో అన్ని జిల్లాల్లో అడవుల పునరుజ్జీవానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అడవులు లేని జిల్లాల్లో ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో చెట్లను పెంచాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment