ఒంగోలు: సంక్షేమం, అభివృద్ధి కేంద్రప్రభుత్వానికి రెండు కళ్లు అని, ప్రతి పేదవానికి ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం కల్పించడమే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక బచ్చల బాలయ్య కల్యాణమండపంలో హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటుచేసిన సబ్‌కా సాత్– సబ్‌కా వికాస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1.20 కోట్ల మంది ధనవంతులు గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారన్నారు.
దాని ద్వారా లభించిన ఆదాయంతో ఇప్పటివరకు 2కోట్లమందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. రాబోయే రెండేళ్లలో మరో మూడు కోట్ల కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజాపంపిణీ, గ్యాస్ సబ్సిడీకి ఆధార్ అనుసంధానం ద్వారా రూ. 49500 కోట్ల నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడామన్నారు. దళారులకు అడ్డుకట్టవేసి ప్రజలకు నేరుగా లబ్ధిని చేకూర్చేందుకే జామ్(జన్‌ధన్, ఆధార్, మొబైల్) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నోట్ల రద్దు చేపడితే ఎక్కడెక్కడోదాచిన రూ. 15వేల కోట్లు బ్యాంకులకు చేరిందని తెలిపారు. సమాచార మార్పిడి ద్వారా త్వరలోనే నల్లధనం బయటకు వస్తుందన్నారు.
30 రోజుల్లో పరిష్కారం
ఎవరైనా నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీలలో ఒక పనికోసం దరఖాస్తు చేసుకుంటే దానికి 30రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారా రిప్లయ్ ఇవ్వాల్సి ఉంటుందని, లేని పక్షంలో దరఖాస్తును సంబంధిత శాఖ ఆమోదించినట్లుగా పరిగణిస్తామని చెప్పారు. బియ్యం, గృహాలు, గ్యాస్ సబ్సిడీ, ఉపాధి హామీ పథకం, ఇంద్ర ధనుస్సు మిషన్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలేనన్నారు. డిసెంబర్ ఆఖరునాటికి అన్ని గ్రామాలకు విద్యుత్ ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
ఉపాధి పేరుతో విదేశాలకు వెళ్లిన 20 వేల మందిని ఇండియాకు తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. మాదిగలు కోరుకుంటున్న రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కూడా కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీనిపై మిగితా రాష్ట్రాలతో కూడా చర్చిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ 75 మంది కేంద్రమంత్రులు సబ్‌కాస్ సాత్– సబ్‌కా వికాస్, మోడీఫెస్ట్ పేరుతో దేశంలోని 900 కేంద్రాల్లో ఈ కార్యక్రమాలకు హాజరవుతారని, లబ్ధిదారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోనికి తీసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్సీలు కరణం బలరామకృష్ణ మూర్తి, మాగూంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు ఒంగోలు దామచర్ల జనార్దన్, కందుకూరు పోతుల రామారావు, డోలా బాలవీరాంజనేయ స్వామి, డీజీపీ ఎన్. సాంబశివరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, ఎస్పీ త్రివిక్రమవర్మ, ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. యాస్మిన్, కరణం వెంకటేశ్, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, డైరెక్టర్ భాస్కరరావు,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, నాయకులు, రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు, నగరపాలక కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, హెచ్‌పీసీఎల్ జనరల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్, జిల్లా అధ్యక్షుడు పులి వెంకట కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి.మీనాకుమారి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య , రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు గోలి నాగేశ్వరరావు, బీజేపీ నగర అధ్యక్షుడు మల్లిశెట్టి శ్రీనివాసరావు, లీగల్‌సెల్ జాతీయ నాయకులు పేర్ల సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.
దళారులకు అడ్డుకట్ట వేసేందుకే ‘జామ్’
Published Fri, Jun 2 2017 1:08 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement
Advertisement