ఆశలన్నీ ‘వెంకయ్య’ పైనే..! | Tuda plans monorail from Tirupati to Tirumala | Sakshi
Sakshi News home page

ఆశలన్నీ ‘వెంకయ్య’ పైనే..!

Published Fri, Dec 26 2014 2:35 AM | Last Updated on Tue, Aug 28 2018 5:59 PM

ఆశలన్నీ ‘వెంకయ్య’ పైనే..! - Sakshi

ఆశలన్నీ ‘వెంకయ్య’ పైనే..!

సాక్షి ప్రతినిధి, తిరుపతి :   ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల పేరొందింది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుమలకు వచ్చి.. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా రెట్టింపవుతున్న నేపథ్యంలో.. రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పూనుకుంది.

తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలపై అర్బన్ మాస్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ(యూఎంటీసీ) అనే ప్రైవేటు సంస్థతో సర్వే చేయించింది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు 27 కిమీల దూరం ఉంటుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డుకు సమాంతరంగా మోనో రైలు మార్గాన్ని నిర్మించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు యూఎంటీసీ తేల్చింది. తిరుపతి బస్‌స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి మీదుగా తిరుమలకు 27 కిమీల మేర మోనో రైలు మార్గాన్ని నిర్మించాలని సూచించింది.

మోనో రైలు మార్గం.. ఆరు మోనో రైలు ఇంజిన్లు, వంద బోగీలను కొనుగోలు చేయడానికి రూ.3,510 కోట్ల మేర అవసరం అవుతాయని ఆ సంస్థ తుడాకు నివేదిక ఇచ్చింది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ పక్కనే ఓ రైల్వే స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి వద్ద రైల్వే స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించింది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుమలకు వెళుతున్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని తేల్చింది.

ఒక్కో సారి గరిష్ఠంగా 500 మంది భక్తులను మోనో రైలు ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు చేర్చవచ్చు. చిన్నపాటి వర్షం కురిసినా ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడి.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ఆవశ్యకతను తుడా గుర్తించింది. ఇదే అంశంపై తిరుపతి ఎంపీ వరప్రసాద్ సెప్టెంబర్ 15న తుడా అధికారులతో సమీక్షించారు. మోనో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తుడా అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఆమోదానికి పంపారు.

తిరుపతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసిన నేపథ్యంలో.. మోనో రైలు ప్రాజెక్టును ఆ ప్రణాళికలోనే చేర్చాలని ప్రతిపాదించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పూనమలై-గిండీ-పోరూర్-వడపళణి మధ్య 20.68 కిమీల మేర రూ.3,267 కోట్ల అంచనా వ్యయంతో మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు నవంబర్ 30న కేంద్ర పట్టణాభివృద్ధికి శాఖ ఆమోదం తెలిపింది. కానీ.. ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని తమిళనాడు ప్రభుత్వమే భరించాలని స్పష్టీకరించింది. తుడా వద్ద ఆ మేరకు నిధులు అందుబాటులో లేని నేపథ్యంలో.. తిరుమల మోనో రైలు ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని సూచించింది.

స్మార్ట్ సిటీలను పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం)లో చేపడుతోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టునూ అదే పద్ధతిలో చేపట్టేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? ప్రభుత్వ నిధులతోనే చేపడుతుందా? ఆ ప్రాజెక్టును తిరస్కరిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్రం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తిరుమల మోనో రైలు ప్రాజెక్టుపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆమోదముద్ర వేసి.. నిధులు కేటాయిస్తుందా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement