Mono rail project
-
ఆశలన్నీ ‘వెంకయ్య’ పైనే..!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల పేరొందింది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుమలకు వచ్చి.. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా రెట్టింపవుతున్న నేపథ్యంలో.. రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పూనుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలపై అర్బన్ మాస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ(యూఎంటీసీ) అనే ప్రైవేటు సంస్థతో సర్వే చేయించింది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు 27 కిమీల దూరం ఉంటుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డుకు సమాంతరంగా మోనో రైలు మార్గాన్ని నిర్మించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు యూఎంటీసీ తేల్చింది. తిరుపతి బస్‌స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి మీదుగా తిరుమలకు 27 కిమీల మేర మోనో రైలు మార్గాన్ని నిర్మించాలని సూచించింది. మోనో రైలు మార్గం.. ఆరు మోనో రైలు ఇంజిన్లు, వంద బోగీలను కొనుగోలు చేయడానికి రూ.3,510 కోట్ల మేర అవసరం అవుతాయని ఆ సంస్థ తుడాకు నివేదిక ఇచ్చింది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ పక్కనే ఓ రైల్వే స్టేషన్, కపిలతీర్థం, అలిపిరి వద్ద రైల్వే స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదించింది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుమలకు వెళుతున్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని తేల్చింది. ఒక్కో సారి గరిష్ఠంగా 500 మంది భక్తులను మోనో రైలు ద్వారా తిరుపతి నుంచి తిరుమలకు చేర్చవచ్చు. చిన్నపాటి వర్షం కురిసినా ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడి.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టు ఆవశ్యకతను తుడా గుర్తించింది. ఇదే అంశంపై తిరుపతి ఎంపీ వరప్రసాద్ సెప్టెంబర్ 15న తుడా అధికారులతో సమీక్షించారు. మోనో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను తుడా అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఆమోదానికి పంపారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసిన నేపథ్యంలో.. మోనో రైలు ప్రాజెక్టును ఆ ప్రణాళికలోనే చేర్చాలని ప్రతిపాదించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో పూనమలై-గిండీ-పోరూర్-వడపళణి మధ్య 20.68 కిమీల మేర రూ.3,267 కోట్ల అంచనా వ్యయంతో మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు నవంబర్ 30న కేంద్ర పట్టణాభివృద్ధికి శాఖ ఆమోదం తెలిపింది. కానీ.. ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని తమిళనాడు ప్రభుత్వమే భరించాలని స్పష్టీకరించింది. తుడా వద్ద ఆ మేరకు నిధులు అందుబాటులో లేని నేపథ్యంలో.. తిరుమల మోనో రైలు ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని సూచించింది. స్మార్ట్ సిటీలను పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం)లో చేపడుతోన్న నేపథ్యంలో మోనో రైలు ప్రాజెక్టునూ అదే పద్ధతిలో చేపట్టేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? ప్రభుత్వ నిధులతోనే చేపడుతుందా? ఆ ప్రాజెక్టును తిరస్కరిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్రం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తిరుమల మోనో రైలు ప్రాజెక్టుపై కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆమోదముద్ర వేసి.. నిధులు కేటాయిస్తుందా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
త్వరలో మోనో రైలు
►అసెంబ్లీలో మంత్రి వెల్లడి ►కొత్తగా ఐదు వృత్తి శిక్షణ కేంద్రాలు చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు మోనోరైలు సేవలను సైతం ప్రవేశపెడుతున్నట్లు మంత్రి రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. మోనో రైలు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జయలలిత త్వరలో శంకుస్థాపన చేయనున్నారని బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు.నగరంలో ఇప్పటికే జరుగుతున్న మెట్రోరైలు పనులు పూర్తిదశకు వచ్చాయి. ఈ ఏడాది చివరిలో తొలిదశ, వచ్చే ఏడాది పూర్తిగా సేవలు అందుబాటులోకి రావచ్చని అంచనా. మరోవైపు మోనో రైలును కూడా చెన్నై నగర ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్లు ఆయన తెలిపారు. డీఎండీకే సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ, మోనో రైలుపై ప్రభుత్వం గతంలో ఒక ప్రకటన చేసింది, ఆ విషయం గుర్తుందా అంటూ ప్రశ్నించారు. ఇందుకు మంత్రి బదులిస్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో సీఎంకు సాటిలేరని అన్నారు. మోనో రైలు పథకం అమలుకు ప్రాథమిక పరిశీలనలు సాగుతున్నాయని, నిర్మాణ పనుల ఒప్పందాలు తుదిదశకు చేరకున్నాయని తెలిపారు. ఇవి పూర్తికాగానే 43.48 కిలోమీటర్ల దూరం ప్రయాణ సేవలు అందించేలా ఈ పథకానికి త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని చెప్పారు. పథకం 1 కింద పూందమల్లి-కత్తిపార, పోరూరు- వడపళని మార్గాల్లో 20.68 కిలోమీటర్లు, పథకం 2 కింద వండలూరు- వేలాచ్చేరికి 22.20 కిలోమీటర్లు మధ్యన మార్గం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఐదు వృత్తి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జయ తెలిపారు. మానవ వనరులను మరింతగా వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి పథంలో నడుస్తున్నామని చెప్పారు. అలాగే నిరుద్యోగ నిర్మూలనపై మరింత దృష్టి సారిస్తూ రూ.8.25 కోట్లతో కాంచీపురం, విళుపురం, తిరువారూరు, తిరువళ్లూరు, ధర్మపురిలలో ఉపాధి కల్పనా కార్యాలయాలను నిర్మించనున్నట్లు జయ ప్రకటించారు. 15 వేల ఉపాధ్యాయ ఖాళ్లీను మూడువారాల్లోగా భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖా మంత్రి వీరమణి ప్రకటించారు. శివంగై జిల్లాకు కొత్త సిప్కాట్ను మంజూరు చేసినట్లు మంత్రి తంగమణి తెలిపారు.