త్వరలో మోనో రైలు
►అసెంబ్లీలో మంత్రి వెల్లడి
►కొత్తగా ఐదు వృత్తి శిక్షణ కేంద్రాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు మోనోరైలు సేవలను సైతం ప్రవేశపెడుతున్నట్లు మంత్రి రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. మోనో రైలు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జయలలిత త్వరలో శంకుస్థాపన చేయనున్నారని బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు.నగరంలో ఇప్పటికే జరుగుతున్న మెట్రోరైలు పనులు పూర్తిదశకు వచ్చాయి. ఈ ఏడాది చివరిలో తొలిదశ, వచ్చే ఏడాది పూర్తిగా సేవలు అందుబాటులోకి రావచ్చని అంచనా. మరోవైపు మోనో రైలును కూడా చెన్నై నగర ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్లు ఆయన తెలిపారు.
డీఎండీకే సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ, మోనో రైలుపై ప్రభుత్వం గతంలో ఒక ప్రకటన చేసింది, ఆ విషయం గుర్తుందా అంటూ ప్రశ్నించారు. ఇందుకు మంత్రి బదులిస్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో సీఎంకు సాటిలేరని అన్నారు. మోనో రైలు పథకం అమలుకు ప్రాథమిక పరిశీలనలు సాగుతున్నాయని, నిర్మాణ పనుల ఒప్పందాలు తుదిదశకు చేరకున్నాయని తెలిపారు. ఇవి పూర్తికాగానే 43.48 కిలోమీటర్ల దూరం ప్రయాణ సేవలు అందించేలా ఈ పథకానికి త్వరలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని చెప్పారు.
పథకం 1 కింద పూందమల్లి-కత్తిపార, పోరూరు- వడపళని మార్గాల్లో 20.68 కిలోమీటర్లు, పథకం 2 కింద వండలూరు- వేలాచ్చేరికి 22.20 కిలోమీటర్లు మధ్యన మార్గం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఐదు వృత్తి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జయ తెలిపారు. మానవ వనరులను మరింతగా వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి పథంలో నడుస్తున్నామని చెప్పారు. అలాగే నిరుద్యోగ నిర్మూలనపై మరింత దృష్టి సారిస్తూ రూ.8.25 కోట్లతో కాంచీపురం, విళుపురం, తిరువారూరు, తిరువళ్లూరు, ధర్మపురిలలో ఉపాధి కల్పనా కార్యాలయాలను నిర్మించనున్నట్లు జయ ప్రకటించారు. 15 వేల ఉపాధ్యాయ ఖాళ్లీను మూడువారాల్లోగా భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖా మంత్రి వీరమణి ప్రకటించారు. శివంగై జిల్లాకు కొత్త సిప్‌కాట్‌ను మంజూరు చేసినట్లు మంత్రి తంగమణి తెలిపారు.