తిరుమలకు కూ.. చుక్‌చుక్! | Monorail planning for Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలకు కూ.. చుక్‌చుక్!

Published Wed, Sep 24 2014 2:37 AM | Last Updated on Tue, Aug 28 2018 5:59 PM

తిరుమలకు కూ.. చుక్‌చుక్! - Sakshi

తిరుమలకు కూ.. చుక్‌చుక్!

తిరుపతి నుంచి తిరుమలకు సురక్షితంగా భక్తులను చేర్చడానికి మోనో రైలును ఏర్పాటుచేయాలని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ప్రతిపాదించింది. రూ.3,510 కోట్లతో మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు డీపీఆర్ (సమగ్ర ప్రణాళిక నివేదిక)ను రూపొందించింది. ప్రాజెక్టును చేపట్టేందుకు ఆర్థిక సహాయం చేయాలని తుడా అధికారులు కేంద్రానికి నివేదిక పంపారు.
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి విరాజిల్లుతోంది. తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాల ద్వారా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రతి రోజూ ఆర్టీసీ బస్సులు మొదలు ద్విచక్ర వాహనాల వరకూ మొత్తం పదివేల వాహనాల్లో 65 వేల మంది భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. వాహనాలు అధికమవుతుండడం వల్ల తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య తీవ్రమై ప్రమాదాలకు దారి తీస్తోంది.
 
భారీ వర్షాలు కురిసినపుడు కొండచరియలు విరిగి పడడం వల్ల తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. భక్తులను సులభంగా ఏడుకొండల స్వామి వద్దకు చేర్చడానికి తుడా అనేక మార్గాలను అన్వేషించింది. అందులో రోప్ వే ఒకటి. రోపే వే పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో.. మోనో రైలుపై తుడా అధికారులు కసరత్తు చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు 27 కిమీల దూరం ఉంటుంది. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు మార్గాన్ని ఏర్పాటుచేయడానికి నిపుణులతో కలిసి తుడా అధికారులు సర్వే చేశారు. తిరుమల ఘాట్ రోడ్డు వెంబడే  రైలు మార్గాన్ని నిర్మించడానికి అనుకూలమైన వాతావరణం ఉందని తేల్చారు. ఇప్పటికే రోడ్డు మార్గం ఉండటంతో ఆ పక్కనే మోనో రైలు మార్గాన్ని నిర్మించడానికి అటవీశాఖ అనుమతులు కూడా సులభంగా వస్తాయని అంచనా వేశారు.
 
ఈ క్రమంలోనే మోనో రైలు ప్రాజెక్టును చేపట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించడానికి పూర్తి స్థాయిలో సర్వే చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు రైలు మార్గం నిర్మించడానికి.. తొలి దశలో ఆరు మోనో రైలు ఇంజిన్లు, వంద బోగీలను కొనుగోలు చేయడానికి రూ.3,510 కోట్లు అవసరం అవుతాయని తేల్చారు. ప్రస్తుతం తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ సముదాయంలో ఉన్న తిరుమల బస్‌స్టేషన్‌ను మోనో రైల్వే స్టేషన్‌గా మార్చాలని ప్రతిపాదించారు. కపిలతీర్థం వద్ద ఓ రైల్వే స్టేషన్.. అలిపిరి వద్ద మరో రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదించారు. మోనో రైలు ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు తుడా అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ యాజమాన్యం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేయాలని నివేదిక పంపారు. మోనో రైలు ప్రాజెక్టు భారీ వ్యయంతో కూడినది కావడంతో కేంద్రంపైనే తుడా అధికారులు ఆశలు పెంచుకున్నారు.
 
ఈనెల 15న తిరుపతి ఎంపీ వి.వరప్రసాదరావు తుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు మోనో రైల్వే ప్రాజెక్టు విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నిధులు వచ్చేలా చూడాలని కోరారు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ.. ఆ ప్రాజెక్టు నివేదికను తనకు ఇవ్వడంతోపాటు కేంద్రానికి, టీటీడీ బోర్డుకు పంపాలని ఆదేశించారు. తుడా అధికారులు ఈనెల 16న ఎంపీ వరప్రసాదరావుకు మోనో రైల్వే ప్రాజెక్టు నివేదికను అందించారు. అదే రోజున కేంద్ర ప్రభుత్వానికి, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌కు నివేదిక పంపారు. మోనో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్రం భరిస్తే.. తక్కిన 50 శాతం టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం, తుడా భరించేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు స్పష్టీకరిస్తున్నారు. ఏదిఏమైనా మోనో రైల్వే ప్రాజెక్టు సాకారమైతే తిరుమలకు భక్తుల రవాణా కష్టాలు తీరినట్లే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement