mono rail
-
ఆదాయం రూ.5 కోట్లు.. వ్యయం రూ.10 కోట్లు
- ఇదీ మోనో రైలు పరిస్థితి - రైలు నడపటం వల్ల వచ్చే ఆదాయం కంటే భద్రత కోసమే అధికంగా ఖర్చు - భద్రతా బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెమ్మార్డీఏ అధికారులు సాక్షి, ముంబై: అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు.. మోనో రైలు వల్ల వచ్చే ఆదాయం కంటే అందులో ఏర్పాటు చేసిన భద్రత కోసమే ఎక్కువ వెచ్చించాల్సి వస్తోందని ముంబై మహానగర ప్రాంతీయ అభిృద్ధి సంస్థ (c) ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ముంబైలో 2014 ఫిబ్రవరి 2న మోనో రైలు ప్రారంభమైంది. అయితే ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం కంటే ఏర్పాటు చేసిన భద్రత ఎమ్మెమ్మార్డీయేకు తలకు మించిన భారంగా పరిణమించింది. మొదటి దశ మోనో రైలు వడాల-చెంబూర్ మధ్య పరుగులు తీస్తోంది. రెండో దశలో భాగంగా వడాల-జేకబ్ సర్కిల్ (సాత్ రాస్తా) వరకు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వడాల-చెంబూర్ మధ్య ప్రయాణ దూరం చాలా తక్కువగా ఉండటం, స్టేషన్ బయట రవాణా సౌకర్యాలు ఇంకా మెరుగు పడకపోవడంతో ప్రయాణికులు మోనో రైలులో ప్రయాణించేందుకు ముఖం చాటేస్తున్నారు. 2014 ఫిబ్రవరి నుంచి 2015 ఏప్రిల్ నాటికి 14 నెలల్లో మోనో రైలులో సుమారు 60 లక్షల మంది ప్రయాణించారు. ఎమ్మెమ్మార్డీయేకు దాదాపు రూ.ఐదు కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే అంతే కాలంలో భద్రత కోసం దాదాపు రూ.10 కోట్లకుపైనే ఖర్చు చేసింది. ఆదాయం, ఖర్చులు బేరీజు వేస్తే 50 శాతం నష్టం వచ్చినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రెండోదశ పనులు 81 శాతం పూర్తి కావచ్చాయి. మిగతా పనులు 2015 డిసెంబరు లోపు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. రెండు దశల పనులకు మొత్తంగా రూ.2,716 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇందులో రూ.2,290 కోట్లను పనులు చేపడుతున్న మలేషియాకు చెందిన స్కోమి ఇంజినీరింగ్, ఎల్ అండ్ టీ కంపెనీలకు చెల్లించారు. మోనో రైలు ప్రతి ట్రిప్పుకు రూ.3,130 ఖర్చవుతుంది. రోజుకు దాదాపు 131 ట్రిప్పులు తిరుగుతాయి. ఒక్కో రైలులో ప్రతిరోజు దాదాపు 14 వేలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నట్లు జారీ టికెట్లను బట్టి తెలుస్తోంది. వడాల-సాత్‌రాస్తా పనులు పూర్తయితే రైలు ప్రయాణ దూరం పెరగటంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. నష్టాల నుంచి కొంతమేర గట్టేందుకు భద్రతా పన్ను మాఫీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే భద్రత బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు అధికారులు చెప్పారు. -
మోనో రైలుతో రూ.18 కోట్ల నష్టం
త్వరలోనే మంచిరోజులు వస్తాయన్న ఎమ్మెమ్మార్డీయే అధికారి సాక్షి, ముంబై: దేశంలోనే మొట్ట మొదటిసారిగా ముంబైలో ప్రారంభించిన మోనో రైలువల్ల మహానగర ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)కు సంవత్సర కాలంలో ఏకంగా రూ.18 కోట్ల మేర నష్టం వాటిల్లింది. చెంబూర్-వడాల మధ్య 8.9 కి.మీ. దూరం ఉన్నమార్గంపై ఉదయం ఆరు నుంచి రాత్రి 10 గంటల వరకు మోనో రైళ్లు సేవలు అందిస్తున్నాయి. రోజుకు అవి తిరిగే 64 ట్రిప్పుల్లో 36,352 మంది ప్రయాణికులను అవి చేరవేయగలవు. కానీ వాటిలో ప్రతిరోజు సగటున 10-13 వేల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మోనోరైలుకు ప్రయాణికుల ఆదరణ తగ్గడానికి ఎమ్మెమ్మార్డీయే డిప్యూటీ డెరైక్టర్ దిలీప్ కవట్కర్ పలు కారణాలను వివరించారు. మోనోరైలు ప్రయాణించే మార్గం చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకా అభివృద్ధి కావాల్సి ఉందన్నారు. ఈ మార్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇతర వాణిజ్య, వ్యాపార భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని చెప్పారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పైన మోనో రైలు దిగిన ప్రయాణికులు అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు అవసరమైన బస్సు, ట్యాక్సీ, ఆటోలు తగినంత సంఖ్యలో అందుబాటులో లేవన్నారు. దీంతో చాలా మంది మోనో రైలుకు బదులుగా ఆటో, ట్యాక్సీ, బెస్ట్ బస్సులనే ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం (చెంబూర్-వడాల) మోనో రైలు చాలా తక్కువ దూరం ప్రయాణిస్తోంది. వడాల నుంచి సాత్‌రాస్తా మార్గం పనులు పూర్తయితే ఏకంగా ఈ మార్గం 20 కి.మీ. దూరం పెరుగుతుంది. అప్పుడు ప్రయాణికుల నుంచి స్పందన వస్తుందని దిలీప్ కవట్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతవరకు ఈ నష్టాలు తప్పవని అన్నారు. మోనో రైలుకు ప్రస్తుతం లోకల్ రైళ్ల కనెక్టివిటీ లేకపోవడం కూడా తమ నష్టాలకు కారణమని కవట్కర్ అన్నారు. ఈ సంవత్సరం చెంబూర్-వడాల- సాత్‌రాస్తా మార్గం పనులు పూర్తయితే, వడాల స్టేషన్లో హార్బర్, కరీరోడ్ స్టేషన్లో సెంట్రల్ రైలు మార్గాలు కనెక్టివిటీ అవుతాయి. అప్పుడు మోనోకు మంచి రోజులు వస్తాయని దిలీప్ కవట్కర్ అన్నారు. -
నష్టాల్లో మెట్రో రైలు!
సాక్షి, ముంబై: దేశ ఆర్ధిక నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో రైల్వేకు మొదటి మూడు నెలల్లో రూ.57 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆడిట్లో వెల్లడైంది. ప్రస్తుతం వడాల-చెంబూర్ మధ్య నడుస్తున్న మోనో రైలు కూడా నష్టాల బాటలో నడుస్తోంది. దీని జాబితాలో మెట్రో కూడా చేరిపోయింది. ఘాట్కోపర్-అంధేరి- వర్సోవా మెట్రో సేవలు జూన్ ఎనిమిదో తేదీ నుంచి ముంబైకర్లకు అందుబాటులోకి వచ్చాయి. అందుకు ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) రూ.4,500 కోట్లు ఖర్చు చేసింది. కాని అత్యంత ఖరీదైన సేవలు అతి తక్కువ చార్జీలతో అందించడం గిట్టుబాటు కావడం లేదు. అదేవిధంగా మెట్రో రైళ్లకు, ప్రయాణికులకు కల్పిస్తున్న భద్రత, స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమరాలు, పెద్ద సంఖ్యలో నియమించిన సిబ్బంది, మెట్రో రైళ్ల నిర్వహణ, బ్యాగ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఇస్తున్న రాయితీ తదితర కారణాలవల్ల మెట్రోకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్లో స్పష్టమైంది. ప్రారంభంలో కేవలం రూ.10 ల చార్జీతో ఎక్కడికైనా ప్రయాణించేందుకు అనుమతి కల్పించింది. దీంతో ముంబైకర్లు పూర్తి ఆనందాన్ని ఆస్వాదించారు. మొదటి రెండు, మూడు నెలలు ప్రతీరోజు 2.40 లక్షల మంది ప్రయాణించారు. ఆ తర్వాత ఈ సంఖ్య మూడు లక్షలకు చేరింది. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో రెట్టింపు అయింది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ కార్డులు, సీజన్ పాస్‌లు జారీచేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో వైఫై సేవలు కూడా ప్రారంభించింది. కాని టికెటు చార్జీలు మాత్రం సేవలకు తగ్గట్టుగా పెంచలేదు. కనీస చార్జీ రూ.10 ఉండగా ఆ తర్వాత దూరాన్ని బట్టి రూ.20, రూ.30 నిర్ణయించింది. కాని అనేక మంది ఉద్యోగులు స్మార్ట్ కార్డు, సీజన్ పాస్‌లు వినియోగిస్తున్నారు. దీంతో ఆదాయం మరింత పెరిగింది. కాని ప్రారంభంలో ఈ సౌకర్యాలు అందుబాటులో లేకున్నప్పటికీ సరదా కోసం ప్రయాణంచే వారి సంఖ్య ఎక్కువ ఉండేది. దీంతో వివిధ నిర్వహణ భారాలు, సిబ్బంది ఖర్చుల భారం ఎమ్మెమ్మార్డీయేపై విపరీతంగా పడింది. ప్రారంభంలో మోనోతో పోలిస్తే మెట్రో లాభాల బాటలో నడుస్తోందని ఎమ్మెమ్మార్డీయే ప్రకటించింది. కాని ఇదికూడా నష్టాల బాటలో నడుస్తున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్లో స్పష్టమైంది. -
తిరుమలకు కూ.. చుక్‌చుక్!
తిరుపతి నుంచి తిరుమలకు సురక్షితంగా భక్తులను చేర్చడానికి మోనో రైలును ఏర్పాటుచేయాలని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ప్రతిపాదించింది. రూ.3,510 కోట్లతో మోనో రైలు ప్రాజెక్టును చేపట్టేందుకు డీపీఆర్ (సమగ్ర ప్రణాళిక నివేదిక)ను రూపొందించింది. ప్రాజెక్టును చేపట్టేందుకు ఆర్థిక సహాయం చేయాలని తుడా అధికారులు కేంద్రానికి నివేదిక పంపారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: అత్యంత ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి విరాజిల్లుతోంది. తిరుమల ఏడుకొండల స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాల ద్వారా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రతి రోజూ ఆర్టీసీ బస్సులు మొదలు ద్విచక్ర వాహనాల వరకూ మొత్తం పదివేల వాహనాల్లో 65 వేల మంది భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. వాహనాలు అధికమవుతుండడం వల్ల తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య తీవ్రమై ప్రమాదాలకు దారి తీస్తోంది. భారీ వర్షాలు కురిసినపుడు కొండచరియలు విరిగి పడడం వల్ల తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. భక్తులను సులభంగా ఏడుకొండల స్వామి వద్దకు చేర్చడానికి తుడా అనేక మార్గాలను అన్వేషించింది. అందులో రోప్ వే ఒకటి. రోపే వే పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో.. మోనో రైలుపై తుడా అధికారులు కసరత్తు చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు 27 కిమీల దూరం ఉంటుంది. తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు మార్గాన్ని ఏర్పాటుచేయడానికి నిపుణులతో కలిసి తుడా అధికారులు సర్వే చేశారు. తిరుమల ఘాట్ రోడ్డు వెంబడే రైలు మార్గాన్ని నిర్మించడానికి అనుకూలమైన వాతావరణం ఉందని తేల్చారు. ఇప్పటికే రోడ్డు మార్గం ఉండటంతో ఆ పక్కనే మోనో రైలు మార్గాన్ని నిర్మించడానికి అటవీశాఖ అనుమతులు కూడా సులభంగా వస్తాయని అంచనా వేశారు. ఈ క్రమంలోనే మోనో రైలు ప్రాజెక్టును చేపట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించడానికి పూర్తి స్థాయిలో సర్వే చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి తిరుమలకు రైలు మార్గం నిర్మించడానికి.. తొలి దశలో ఆరు మోనో రైలు ఇంజిన్లు, వంద బోగీలను కొనుగోలు చేయడానికి రూ.3,510 కోట్లు అవసరం అవుతాయని తేల్చారు. ప్రస్తుతం తిరుపతి ఆర్టీసీ బస్‌స్టేషన్ సముదాయంలో ఉన్న తిరుమల బస్‌స్టేషన్‌ను మోనో రైల్వే స్టేషన్‌గా మార్చాలని ప్రతిపాదించారు. కపిలతీర్థం వద్ద ఓ రైల్వే స్టేషన్.. అలిపిరి వద్ద మరో రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదించారు. మోనో రైలు ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు తుడా అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ యాజమాన్యం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేయాలని నివేదిక పంపారు. మోనో రైలు ప్రాజెక్టు భారీ వ్యయంతో కూడినది కావడంతో కేంద్రంపైనే తుడా అధికారులు ఆశలు పెంచుకున్నారు. ఈనెల 15న తిరుపతి ఎంపీ వి.వరప్రసాదరావు తుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు మోనో రైల్వే ప్రాజెక్టు విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నిధులు వచ్చేలా చూడాలని కోరారు. ఇందుకు ఎంపీ స్పందిస్తూ.. ఆ ప్రాజెక్టు నివేదికను తనకు ఇవ్వడంతోపాటు కేంద్రానికి, టీటీడీ బోర్డుకు పంపాలని ఆదేశించారు. తుడా అధికారులు ఈనెల 16న ఎంపీ వరప్రసాదరావుకు మోనో రైల్వే ప్రాజెక్టు నివేదికను అందించారు. అదే రోజున కేంద్ర ప్రభుత్వానికి, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్‌కు నివేదిక పంపారు. మోనో రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం కేంద్రం భరిస్తే.. తక్కిన 50 శాతం టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం, తుడా భరించేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు స్పష్టీకరిస్తున్నారు. ఏదిఏమైనా మోనో రైల్వే ప్రాజెక్టు సాకారమైతే తిరుమలకు భక్తుల రవాణా కష్టాలు తీరినట్లే..! -
బవానా-గుర్గావ్ మధ్య మోనోరైల్
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని బవానా నుంచి గుర్గావ వరకు మోనో రైలు సేవలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. యాభై కిలోమీటర్ల మోనోమార్గం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపేందుకు సహాయసహకారాలు అందించాల్సిందిగా జపాన్ను కోరింది. ఈ విషయమై జపాన్ భూ, మౌలికవసతులు, రవాణామంత్రి అకిహిరో ఓహ్తాతో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ఓహ్తా నేతృత్వంలోని 20 మంది సభ్యుల జపాన్ బృందం దేశంలో పర్యటిస్తోంది. దేశంలోని నగర ప్రణాళికలు, విధానాల రూపకల్పన, విదేశీ ప్రాజెక్టులు, వాటి ప్రణాళికల, రోడ్లు, రైల్వేల పనితీరుపై ఈ బృందం అధ్యయనం జరుపుతుంది. ప్రత్యేకించి దేశంలో బహుళ ప్రయోజనాల రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టే విషయమై అధ్యయనం చేయనుంది. మెట్రో, మోనో, లైట్‌రైల్ రవాణా సేవలను దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అందించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందనే విషయమై జపాన్ బృందం పరిశీలిస్తుంది. పట్టణాభివృద్ధిపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు జపాన్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఓహ్తా నేతృత్వంలోని బృందం ఇక్కడ పర్యటిస్తోంది. దీంతో ఈ బృందంతో సమావేశమైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ-గుర్గావ్ మధ్య రవాణా వ్యవస్థను మరింత సరళతరం చేసే అవకాశాలపై చర్చించారు. మోనోరైలు ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నందున ఈ విషయాన్ని జపాన్ బృందం దృష్టికి తీసుకొచ్చారు. అయితే బవానా నుంచి గుర్గావ్ వరకు 50 కిలోమీటర్ల దూరముంటుంది. ఇంతటి సుదీర్ఘమైన మార్గంలో మోనోరైలు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా? లేదా? అనే విషయమై అధ్యయనం జరపాల్సిందిగా వెంకయ్య కోరారు. అందుకు జపాన్ బృందం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. అధ్యయనం పూర్తయితే ప్రతిపాదనలు సిద్ధం చేసి, అన్నిరకాల అనుమతులు పొంది, చకచకా పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఉత్తర ఢిల్లీ నుంచి గుర్గావ్ మధ్య రాకపోకలు సాగించేవారి ప్రయాణం సుఖవంతమవడమే కాకుండా సమయం కూడా కలిసొస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య బస్సు సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
మో‘నో’ ఆదరణ..
సాక్షి, ముంబై: దేశంలోనే మొట్టమొదటగా ముంబైలో ఏర్పాటు చేసిన మోనో రైలుకు స్థానికుల నుంచి ఆదరణ అంతగా లభించడంలేదు.నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలు ఆదాయం గణనీయంగా పడిపోవడం ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)ను కలవరానికి గురిచేస్తోంది. ప్రారంభంలో భారీగా ఆదాయం వస్తుందని భావించిన ఈ సంస్థకు వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మోనో రైలును మొట్టమొదటిసారిగా భారతదేశంలో ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రవేశపెట్టడంతో భారీగా ఆదాయం వస్తుందని ఎమ్మెమ్మార్డీయే భావించింది. కాని ముంబైకర్లకు నుంచి అనుకున్నంత మేర ఆదరణ లభించకపోవడంతో ఆదాయానికి గండిపడుతోంది. చెంబూర్-వడాల మధ్య ఫిబ్రవరిలో మోనోరైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఐదు నెలల కాలంలో 20.24 లక్షల ప్రయాణికులను చేరవేయగా కేవలం రూ.1.49 కోట్లు మాత్రమే ఆదాయం రాబట్టుకోగలిగింది. అదే జూన్ మొదటి వారంలో ప్రారంభించిన మెట్రో రైలుతో పోలిస్తే మోనోకు అనుకున్న మేర ఆదాయం రావడం లేదు. చెంబూర్-వడాల మధ్య చాలా దూరం చాలా తక్కువ. అదే విధంగా చెంబూర్‌లో లేదా వడాలలో లోకల్ రైల్వే స్టేషన్లకు మోనో స్టేషన్ చాలా దూరంలో ఉంది. దీంతో అక్కడకు వెళ్లాలంటే ట్యాక్సీ లేదా ఆటోను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో జేబుకు చిల్లు పడుతోంది. ఈ తతంగం కంటే బెస్ట్ బస్సుల్లో లేదా లోకల్ రైళ్లలో వె ళ్లడమే ఉత్తమమని ముంబైకర్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, మెట్రో రైలు సేవలు జూన్ ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో ప్రతి రోజూ 2.70 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. కాలక్రమేణా ఈ సంఖ్య రోజుకు మూడు లక్షలు, ప్రస్తుతం ఐదు లక్షలకు చేరుకుంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్‌ల మధ్య నడుస్తున్న మెట్రో రైల్వే స్టేషన్లు ఇటు పశ్చిమ, అటు సెంట్రల్ రైల్వే మార్గాలకు కూత వేటు దూరంలో ఉన్నాయి. దీంతో ఇరు మార్గాలలో లోకల్ రైలు దిగిన ప్రయాణికులు ఆటో, ట్యాక్సీల అవసరం లేకుండానే మెట్రో స్టేషన్‌కు చేరుకుంటున్నారు. కాని మోనో రైలు స్టేషన్లు అటు చెంబూర్‌కు, ఇటు వడాలకు దూరంగా ఉన్నాయి. దీని ప్రభావం ఆదాయంపై పడుతోంది. మోనో రెండో దశ పనులు వడాల-సాత్‌రాస్తా మధ్య పూర్తయితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావిస్తున్నారు. -
‘మోనో’కు.. ఆటో స్టాండు
సాక్షి, ముంబై : మోనో రైలులో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. మోనో స్టేషన్ల నుంచి గమ్య స్థానాలకు చేరుకోవడానికి కనెక్టివిటీ తక్కువగా ఉండడంతో ప్రయాణికులు తక్కువ సంఖ్యలో మోనో రైలును ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్యను పెంచడానికి అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా మోనో రైలు స్టేషన్లలో ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయడానికి అధికారులు నడుంబిగిస్తున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎంఎంఆర్టీఏ) తూర్పు శివారు ప్రాంతాల్లో 14 ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయడానికి ఆమోదించింది. చెంబూర్ నుంచి మైసూర్ కాలనీ వరకు ప్రతి స్టేషన్లో కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆటో స్టాండ్లను ఏర్పాటుకు రవాణా అధికారులు ఆమోదం తెలిపారు. ప్రయాణికులు ఏ స్టేషన్లలో ఎక్కువగా సేవలను పొందుతారో అక్కడే, ముఖ్యంగా చెంబూర్, ట్రాంబేలలో ఎక్కువగా ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అవసరమైన చోటే.. తూర్పు శివారు ప్రాంతాల్లో అవసరమైన స్టేషన్లలో ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయడానికి సరైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెమ్మార్టీఏ అధికారులు... ప్రాంతీయ రవాణా (ఆర్టీవో) అధికారులను కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నగర వాసుల కోసం వెబ్సైట్లో పొందు పర్చాలని ఆర్టీవోను కోరారు. కొత్త ఆటో స్టాండ్లను ఏఏ చోట ఏర్పాటు చేయాలో అన్న అంశంపై బెస్ట్, ట్రాఫిక్ పోలీసులు ఓ అధ్యయనాన్ని కూడా నిర్వహించారు. స్థలాన్ని పరిశీలించే సమయంలో మోనో రైలు స్టేషన్, ఆటో స్టాండ్ల దూరాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. ప్రజల డిమాండ్ మేరకే.. చాలా మంది ప్రయాణికులు, మోనో, మెట్రో రైలు స్టేషన్లలో ఆటో, ట్యాక్సీ స్టాండ్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారని అధికారి ఒకరు తెలిపారు. తాము సంయుక్తంగా మిగితా అధికారులతో ఓ సర్వే చేపట్టామని తర్వాత దీనిని ప్రతిపాదించామని ఎమ్మెమ్మార్టీఏ అధికారి, అదేవిధంగా వడాలా ఆర్టీవో అధికారి బీఐ అజ్య్ ్రతెలిపారు. -
అదనపు ఆదాయంపై ‘మోనో’ దృష్టి
సాక్షి, ముంబై: ‘మోనో’ దృష్టి ప్రకటనలపై పడింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలుకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు ముంబై ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) యోచిస్తోంది. ఇందులో భాగంగా టెండర్లను పిలి చేందుకు యత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రయాణికులు లేక సంస్థకు ఆదాయానికి గండిపడుతోంది. ఫలితంగా మోనోకు ప్రతీరోజు దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.రెండు లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. మరోపక్క ప్రకటనల ద్వారా రావాల్సిన అదనపు ఆదాయం కూడా రాకపోవడంతో ఆందోళనలో పడిపోయింది. ప్రస్తుతం మోనో రైలు చెంబూర్-వడాలా మధ్య 8.8 కి.మీ. నడుస్తోంది. ఆరు స్టేషన్లు ఉండగా 355 స్థంబాలున్నాయి. ఈ స్థంబాలు రాజకీయ పార్టీలు, విద్యా సంస్థల ప్రకటనలతో నిండిపోయి ఉన్నాయి. వాటిపై ఉన్న అక్రమ బ్యానర్లను తొలగించాలని ఇప్పటికే ముంబై హై కోర్టు ఆదేశించింది. కాని వాటిపై చర్యలు తీసుకునేందుకు తగినంత సిబ్బంది తమవద్ద లేరని ఎమ్మెమ్మార్డీయే అధికారులు చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా, ఆయా స్థంభాలపై బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసేందుకు అధికారికంగా అనుమతినిస్తామని ఎమ్మెమ్మార్డీయే ప్రకటించింది. అందుకు టెండర్లను ఆహ్వానించి అర్హతగల ఏజన్సీకి బాధ్యతలు అప్పగించాలని ఆరు నెలల కిందటే నిర్ణయం తీసుకుంది. కాని అప్పటికి మోనో రైలు ప్రారంభం కాకపోవడంతో టెండరు వేసేందుకు ఏ ఏజన్సీ కూడా ముందుకు రాలేదు. కాని ప్రస్తుతం మోనో రైలు నడుస్తోంది. దీంతో టెండర్లు వేసేందుకు ఏజన్సీలు ముందుకు వస్తాయని ఎమ్మెమ్మార్డీయే ప్రాజెక్టు డెరైక్టరు దిలీప్ కవట్కర్ అభిప్రాయపడ్డారు. ఆసక్తిగల సంస్థల నుంచి ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించేందుకు జూలై 22 వరకు గడువు ఇచ్చింది. కాని స్థంబాలపై ప్రకటనలు ఏర్పాటు చేయడంవల్ల మోనోకు పెద్దగా ఆదాయం రాదని, వాటివల్ల ఒరిగేదేమీ ఉండదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
నష్టాల ఊబిలో మోనోరైలు
సాక్షి, ముంబై: ఇటీవల ప్రారంభమైన మోనోరైలుకు ఇంకా మంచి రోజులు రాలేదు. నిత్యం దీనికి దాదాపు రూ.రెండు లక్షల వరకు నష్టం వస్తోంది. దేశంలోనే మొదటిసారిగా ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మోనోరైలు ప్రాజెక్టుకు ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తుందని ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) భావించింది. ప్రజలకు, ముఖ్యంగా ఉద్యోగులకు సౌకర్యవంతంగా లేకపోవడంతో ఎక్కువ మంది దీని సేవలను వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే మోనో నష్టాలు బాట పట్టిందని చెబుతున్నారు. గత ఆదివారం నుంచి మెట్రో సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం, సాయంత్రం ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోంది. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఉద్యోగుల్లో అత్యధికులు ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రోరైలును ఆశ్రయిస్తున్నారు. ఇది అందుబాటులోకి రావడంవల్ల ట్యాక్సీ, ఆటోచార్జీలు, సమయం ఆదా అవుతున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళ ల్లో మెట్రోరైళ్లన్నీ ఉద్యోగులతో కిటకిటలాడుతున్నాయి. చెంబూర్-వడాలా వరకు నిర్మించిన మోనో రైలు మార్గంలో కార్పొరేట్ కార్యాలయాలు అంతగా లేవు. దీంతో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పరుగులు తీస్తున్న మోనో రైలు రోజుకు రూ.రెండు లక్షల మేర నష్టాన్ని చవిచూస్తోంది. దీని నిర్వహణ బాధ్యతలు సేకరించిన స్కోమీ ఇంజినీరింగ్ సంస్థ రైలు ట్రిప్పుల సంఖ్యను తగ్గించింది. ప్రతీ 15 నిమిషాలకు ఒక రైలును నడుపుతోంది. గడియారంలోని ముల్లులాగా పరుగులు తీసే ముంబైకర్లకు మోనో రైలు సేవలు అంతగా ఉపయోగపడడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రైల్లో రోజుకు 20 వేల మంది ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సరదా కోసమే ఈ రైల్లో ప్రయాణిస్తున్నారు. మెట్రోరైలు ప్రారంభించిన మరుసటి రోజు నుంచి దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వడాలా-సాత్‌రాస్తా రెండో దశ పనులు వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ మార్గం పూర్తయితే మోనో మరిన్ని ప్రాంతాలకు విస్తరించి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే డెరైక్టర్ దిలీప్ కవట్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
రెడ్ సిగ్నల్!
సాక్షి, ముంబై: వడాల-సాత్‌రాస్తా మార్గంలో నిర్మించే మోనో రైలు మార్గానికి సెంట్రల్ రైల్వే రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోనున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్న మోనో రైలు ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయడం అనివార్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మోనో కారిడార్ నిర్మాణాన్ని ఆపాలని రైల్వే శాఖ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే)ని ఆదేశించింది. మోనో రైలు మార్గానికి కొత్త డిజైన్ రూపొందించాలని సూచించింది. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. సెంట్రల్ రైల్వే మార్గంలో ప్రస్తుతం నాలుగు లేన్లు ఉన్నాయి. భవి ష్యత్‌లో లోకల్‌తోపాటు దూరప్రాంతాల రైళ్ల సంఖ్య ను పెంచాలనే ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి ఠాణేవరకు ఐదు, ఆరు లేన్లు వేయాలని అధికారులు సంకల్పించారు. ఈ మేరకు రూపొందించిన ప్రణాళిక ప్రకారం కుర్లా నుంచి ఠాణే వరకు ఐదు, ఆరు లేన్ల పనులు పూర్తయ్యా యి. ఇక కుర్లా నుంచి సీఎస్టీ వరకు పనులు చేపట్టాల్సి ఉంది. అందుకు కొన్ని అడ్డంకులు రావడంతో ఈ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. అదే సమయంలో వడాల నుంచి సాత్‌రాస్తా వరకు మోనో రైలు ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే మోనో రైలు మార్గం కరీరోడ్డు రైల్వే వంతెన పక్క నుంచి వెళుతుంది. ఎమ్మెమ్మార్డీయే, సెంట్రల్ రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో పాత డిజైన్ ప్రకారం పనులు సాగుతున్నా యి. నాలుగో రైల్వే లేన్ పక్కన మోనోరైలు పిల్లర్లు వేస్తున్నారు. దీంతో తేరుకున్న సెంట్రల్ రైల్వే భవి ష్యత్‌లో కుర్లా నుంచి సీఎస్టీ వరకు ఐదు, ఆరో లేన్లు వేస్తే అప్పడు ఈ పిల్లర్లను తొలగించడం సాధ్యం కాదని భావించింది. అందుకే ప్రాజెక్టును నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. మళ్లీ కొత్తగా డిజైన్ చేసి పిల్లర్లువేసే పనులు ప్రారంభించాలని ఎమ్మెమ్మార్డీయేకు సూచించింది. గతంలో కూడా ఇదేవిధంగా వడాలా స్టేషన్ వద్ద హార్బర్ రైలు మార్గం పై మోనోరైలు మార్గం నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు అది పరిష్కారం కావడంతో ఎమ్మెమ్మార్డీయే ఊపిరి పీల్చుకుంది. ఈసారి కరీరోడ్ స్టేషన్ సమీపంలో మోనోరైలు మార్గం డిజైన్‌లో మార్పులు చేయాల్సి వస్తోంది. దీనికి కొత్త డిజైన్ తయారు చేసుకోవాలని ఎమ్మెమ్మార్డీయేను సెంట్రల్రైల్వే ఆదేశించింది. రేసుకోర్స్ ప్రాంతంలో హెలిపోర్టు ముంబై: భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) మహాలక్ష్మి రేస్‌కోర్సు వద్ద పూర్తిస్థాయి హెలి పోర్టు నిర్మించడానికి అంగీకరించింది. పగలు, రాత్రి హెలికాప్టర్ సేవలు అందించేందుకు ఈ ప్రాంత వాతావరణం అనుకూలిస్తుందని నిర్ధారించింది. ప్రస్తుతం ముంబైలో నిత్యం పదిహెలికాప్టర్లు పగటి పూట మాత్రమే సేవలు అందిస్తున్నాయి. దీని నిర్మాణం పూర్తయితే రోడ్డు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలి గించకుండా వీఐపీలను హెలికాప్టర్లలో తరలించే వీలుంటుంది. దీనికితోడు ఎయిర్ అంబులెన్సుల సేవలకూ ఊతమిచ్చినట్టు అవుతుందని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. అందుకే ఇక్కడ హెలి పోర్టు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా మహారాష్ట్ర విమానాశ్రయాల సంస్థ (ఎంఏడీసీ) కేంద్ర వైమానిక సంస్థను కోరింది. దీని డెవలపర్ నియమాకంతోపాటు ఇతర అనుమతులు త్వరలోనే మం జూరైతే హెలిపోర్టు నిర్మాణ పనులు ఏడాదిలోపే ప్రారంభమవుతాయని ఎంఏడీసీ తెలిపింది. దక్షిణ ముంబైలో అత్యధికంగా నివసించే మంత్రులు, ఉన్నతాధికారులు, వాణిజ్యవేత్తలు త్వరగా గమ్యస్థానం చేరుకోవాలంటే పగలు, రాత్రి సేవలు అందించే పూర్తిస్థాయి హెలిపోర్టు సేవలు అత్యవసరమని ఈ సంస్థ అధికారి ఒకరు అన్నారు. దీని నిర్మాణానికి రూ.55 కోట్ల వరకు అవసరమని చెప్పారు. -
‘రవాణా’లో ముంబై ముందడుగు
సాక్షి, ముంబై: ముంబై అనగానే... లోకల్ రైళ్లు మన కళ్ల ముందు కదలాడతాయి. అవును... క్షణం తీరిక లేకుండా ఉండే నగర అభివృద్ధిలో లోకల్ రైళ్లు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బెస్టు బస్సులు, ట్యాక్సీలు, ఆటోలతోపాటు లోకల్ రైళ్లు ముంబై నగరం అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాయి. వీటికి తోడుగా ఇటీవలే మోనో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఏ నగరాభివృద్ధిలోనైనా రవాణా వ్యవస్థ కీలకం. మరి అది దేశ ఆర్ధిక రాజధాని అయితే... అందుకే ఇప్పుడు ముంబై రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. త్వరలోనే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు నగరం చుట్టూ ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకుంటూ జల రవాణా ప్రారంభించాలనే డిమాండ్ కూడా పెద్దఎత్తున ఉంది. భవిష్యత్తులో జల రవాణా వ్యవస్థ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ముంబై నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందడం ఖాయం. లైఫ్లైన్లు... ముంబైలో ఇప్పటివరకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు బెస్టు బస్సులతో పాటు ప్రధానంగా సబర్బన్ లోకల్ రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే ఈ సేవలు ‘ముంబై లైఫ్‌లైన్’లుగా గుర్తింపు పొందాయి. ఉరుకులు, పరుగులతో నగర జీవితం నిత్యం బిజీ. తీరిక లేని ప్రజల జీవన విధానానికి తగ్గట్టుగా నగరంలో రవాణా వ్యవస్థను రూపొందించారు. మూడు నుంచి ఐదు నిమిషాల తేడాతో నడిచే బెస్టు బస్సులు, లోకల్ రైళ్లలో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రతి రోజూ సుమారు 65 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. నగరంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్లున్నాయి. దీంతో ఇక్కడ సెంట్రల్ రైల్వే పరిధిలో మెయిన్ (ప్రధాన), హార్బర్, వెస్టర్న్‌రైల్వే పరిధిలో వెస్టర్న్ సబర్బన్ లోకల్ ఇలా మూడు మార్గాల్లో లోకల్ రైళ్లను నడుపుతున్నారు. కాగా ముంబై నగరానికి అంతర్జాతీయ హోదాను దక్కేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. భారీ వ్యయంతో కూడుకున్న మోనో, మెట్రోలాంటి ఆధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. మోనో రైలు సేవలు... దేశంలోనే మొట్టమొదటి రైలు ముంబై- ఠాణేల మధ్య ప్రారంభమైన విషయం విదితమే. ఇక్కడ లోకల్ రైళ్లు కూడా చాలా సంవత్సరాల కిందటే ప్రారంభమయ్యాయి. తాజాగా దేశంలోని మొట్టమొదటి మోనో రైలు సేవలు కూడా ఇక్కడే ప్రారంభం కావడం విశేషం. ఇవి మొదటి విడతలో చెంబూర్-వడాలా వరకు ప్రారంభమయ్యాయి. పూర్తిగా ఏసీ కోచ్‌లతో భూమికి సుమారు 20 అడుగుల ఎత్తుపై నుంచి ఎలాంటి శబ్దంలేకుండా వెళ్లే ఈ మోనో సేవలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే రోజువారీ ప్రయాణికుల సంఖ్య మాత్రం ఆశించినంతగాలేదని తెలుస్తోంది. రెండో విడతలో వడాలా-సాత్ రాస్తా వరకు మోనో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. మెట్రో రైలు సేవలు... రాష్ట్రంలో మొదటిసారిగా అందుబాటులోకి రానున్న మెట్రో రైలు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీనిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ 11.4 కి.మీ.పొడవైన మెట్రో మార్గం పనులు పూర్తి అయ్యాయి. ఈ ‘ముంబై మెట్రో-1 కు అన్ని అనుమతులు లభించాయి. ఈ రైళ్లు ప్రారంభంలో గంటకు 50 కి.మీ. వేగంతో నగరంలో పరుగులు పెడతాయని మెట్రో-1 అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొత్తం పిల్లర్ల మీదుగా సాగుతుంది. దీంతో రైళ్లకు ఎలాంటి అడ్డంకులు, ట్రాక్‌కు ఇరువైపుల మురికివాడలు, లెవెల్ క్రాసింగ్‌లు ఉండవు. అలాగే మెట్రో రైల్వే ట్రాక్‌లు ప్రత్యేక లోహంతో తయారుచేసినవి కావడంతో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమే లేదు. భవిష్యత్తులో గంటకు 80 కి .మీ. వేగంతో రైళ్లను నడపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్డీఎస్ఓ స్పష్టం చేసింది. కాగా కొన్ని ప్రమాదకర మలుపులవద్ద వేగాన్ని కొంత నియంత్రించాల్సి ఉంటుంది. మిగతా చోట్ల నిర్దేశించిన వేగంతోనే రైళ్లను నడిపేందుకు అనుమతివ్వనున్నట్లు ఆర్డీఎస్ఓ అధికారులు పేర్కొన్నారు. జల రవాణా... నగరం చుట్టూ ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకొంటూ జల రవాణా ప్రారంభించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల అతి తక్కువ సమయంలో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడంతోపాటు ట్రాఫిక్ జాం, కాలుష్య సమస్యలు కూడా ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు. అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే దీనిపై దృష్టి సారిస్తున్నారు అధికారులు. ముంబై-నవీముంబైల మధ్య రోడ్లపై, లోకల్ రైళ్లపై భారం విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారాన్ని తగ్గించేందుకు రహదారులను పెంచడం, వెడల్పు చేయడం, లోకల్ రైళ్ల సంఖ్య పెంచేందుకు వీలు లేకుండాపోవడంతో ప్రత్యామ్నాయంగా సముద్ర మార్గాన్ని ఎంచుకోక తప్పడం లేదు. ఇందులో భాగంగా నవీముంబైలోని నేరుల్ నుంచి ముంబైలోని భావుచా ధక్కా వరకు లేదా మాండ్వా నుంచి భావుచా ధక్కా వరకు జల మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుతం ముంబై నుంచి నవీముంబై వరకు రోడ్డు మార్గం మీదుగా చేరుకోవాలంటే కనీసం గంటన్నరకు పైగా సమయం పడుతుంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే కేవలం 20 నిమిషాల్లో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించవచ్చు. లోకల్ రైళ్లే మేలు... మరోవైపు మోనో, మెట్రో రైల్వే సేవలకంటే లోకల్ రైళ్లు సౌకర్యవంతంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లోకల్ రైళ్లతో పోలిస్తే మోనో, మెట్రో రైళ్లలో ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం చాలా తక్కువ. లోకల్ రైళ్లలో రద్దీ సమయంలో గంటకు 3.60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. అయితే మెట్రో రైలులో గంటకు 60 వేల మంది, మోనో రైలులో గంటకు కేవలం 6,295 మంది మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఎలివేటెడ్ మార్గం చర్చిగేట్ నుంచి విరార్, ముంబై నుంచి ఠాణేల వరకు ప్రస్తుతం నేలపై ఉన్న రైల్వే ట్రాక్‌ల వెంబడి పైనుంచి (ఎలివేటెడ్) వెళ్లే మార్గం నిర్మించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. దీంతో లోకల్ రైళ్ల మాదిరిగా గంటకు దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభించనుంది. మరోవైపు ట్రాఫిక్ సమస్య కూడా చాలావరకు తగ్గేందుకు ఆస్కారం ఉంది. దీనికోసం ప్రయత్నాలు జరిగినప్పటికీ ఎలివేటెడ్ రైల్వే మార్గాన్ని పక్కనబెట్టి మోనో, మెట్రో లాంటి ఖరీదైన ప్రాజెక్టులు ప్రారంభించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
‘మోనో’ యానం..మన్మోహనం..
సాక్షి, ముంబై: నగరంలో మోనో రైలు ప్రయాణం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు మొదలు కావడంతో ఈ రైలు ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ముంబైలో మోనోరైలు సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నగరవాసులు దీనిలో ప్రయాణించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాలనుంచి ముంబై వచ్చిన పర్యాటకులు సైతం మోనో రైలు ఎక్కనిదే నగరాన్ని విడిచి పోవడంలేదంటే అతిశయోక్తి కాదు. మొదటి దశ సేవల్లో భాగంగా వడాలా-చెంబూర్‌ల మధ్య ప్రారంభమైన ఈ మోనో రైలుకు మొదట ప్రయాణికుల నుంచి స్పందన తక్కువగా కనిపించింది. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరిగి ఈ రైలు ప్రయాణంపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ రైలు పైనుంచి వెళ్లే సమయంలో కిందినించి దాన్ని చూసేందుకు వాహనాలను నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్‌కు కొంత సేపు అంతరాయం ఏర్పడుతోంది. అలాగే చాలామంది దీన్ని ఫొటోలు, వీడియోలు తీస్తూ ప్రజలు తమ అనుభూతులను భద్రపరుచుకుంటున్నారు. పిల్లల సందడి... వేసవి సెలవుల్లో ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ పిల్లలను మోనోరైలు ప్రయాణానికి తీసుకువస్తున్నారు. ముఖ్యంగా సెలవుదినాలు, ఆదివారం మోనో రైలులో ప్రయాణికుల సంఖ్య భారీఎత్తున కన్పిస్తోంది. మోనో రైలు ప్రారంభమయ్యే వడాలా, చెంబూర్ స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ప్రజలు టికెట్ కౌంటర్ వద్ద క్యూ కట్టాల్సి వస్తోంది. రైల్లోనూ పిల్లలు అటుఇటు తిరుగుతూ సందడి చేస్తున్నారు. కిటికీల నుంచి బైటకు చూస్తూ ఫొటోలు తీసుకొంటూ, బైట రోడ్డుమీద వచ్చే పోయేవారికి టాటాలు చెబుతూ సందడి చేస్తున్నారు. రిటర్న్ టికెట్లు ఇవ్వాలి.... మోనో రైలులో రిటర్న్ టికెట్లు లేకపోవడంపై పర్యాటకులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమేతంగా పిల్లలతో మోనోరైలులో తిరిగేందుకు వచ్చిన వారందరూ చెంబూర్ నుంచి వడాలా వెళ్లిన తర్వాత మళ్లీ వడాలా నుంచి చెంబూర్ కోసం టికెట్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదే చెంబూర్లోనే రిటర్న్ టిక్కెట్లు ఇచ్చినట్టయితే సౌకర్యవంతంగా ఉంటుందని వాపోతున్నారు. ముఖ్యంగా వడాలా-చెంబూర్‌ల మధ్య సుమారు 30 నిమిషాల ప్రయాణం కోసం టికెట్లు తీసుకునేందుకు సుమారు గంటపాటు క్యూలో నిలుచోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధర తక్కువే... మోనోరైలులో ప్రయాణం చౌకగానే ఉందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పూర్తి ఏసీ ఉన్న మోనో రైలులో వడాలా నుంచి చెంబూర్ వరకు కేవలం రూ. 11లు చార్జీ వసూలు చేస్తున్నారు. -
మోనో రైలుపై తగ్గిన మోజు
సాక్షి, ముంబై: నగరవాసులకు మోనో రైలుపై మోజు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఎంతో ఆదరణ చూపించిన ముంబై జనం ఇప్పుడు ముఖం చాటేశారు. ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుండటంతో ఈ విషయం బయటపడింది. భార తదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన మోనోరైలు సేవలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో ప్రతిరోజు సరాసరి 18 వేల నుంచి 20 వేల వరకు ప్రయాణించేవారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు భావించాయి. కాని తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు సరాసరి 13 వేల నుంచి 15 వేల వరకు ప్రయాణిస్తున్నారు. మోనో రైళ్లు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే తిరిగేవి. గత మంగళవారం నుంచి ఈ సేవలను రాత్రి ఎనిమిది గంటల వరకు విస్తరించారు. రైళ్ల సమయాన్ని పెంచితే ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు భావించారు. కానీ వారి అంచనాలన్నీ తారుమారయ్యాయి. అంతేగాక ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల్లో అత్యధిక శాతం కేవలం రైలు ప్రయాణాన్ని ఆస్వాదించడానికే అందులో వెళుతున్నారు. కాగా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి వేసవి సెలవులే కారణమని, ప్రజలు స్వగ్రామాలకు తరలిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఎమ్మెమ్మార్డీయే అధికారులు సమర్థించుకుంటున్నారు. -
రంగ్ రబ్బా రబ్బా..
సాక్షి, ముంబై: నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి హోలీ హడావుడి ప్రారంభమైంది. నగరంలోని అనేక సొసైటీలు, టవర్లు, చాల్స్, భవనాల ఆవరణలో వివిధ రంగులతో ముగ్గులు వేశారు. ముగ్గుమధ్యలో కట్టెలు, గడ్డి, పిడకలతో కాముడిని పేర్చి దహనానికి సిద్ధంగా ఉంచారు. రాత్రి 9.30 గంటల తర్వాత అందరు గుమిగూడి మంత్రాలు చదువుతూ హోలీకి నిప్పంటించి దహనం చేశారు. ఒకవైపు డీజే లౌడ్‌స్పీకర్ల హోరు, మరోవైపు యువకులు రంగులు చల్లుకుంటూ బెంజో, నాసిక్ బాజా లాంటి వాయిద్యాల మధ్య నృత్యం చేస్తూ రాత్రిళ్లు హోరెత్తించారు. నియమాల ప్రకారం రాత్రి పది గంటల తర్వాత ఎలాంటి వాయిద్యాలు వినియోగించరాదు. అయితే అర్థరాత్రి వరకు ఈ తతంగ ం కొనసాగినా, గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. సోమవారం ఉదయం నుంచి పిల్లలు, పెద్దలు వయోభేదం లేకుండా సొసైటీ, చాల్స్ అవరణలోకి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్ధికంగా ఉన్న సొసైటీలు, టవర్ యాజమాన్యాలు విందు పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి. రంగులు చల్లుకునే కార్యక్రమం అనంతరం కలిసి కట్టుగా విందులో పాల్గొన్నాయి. హోలీ ఆడిన నటులు... సినీ పరిశ్రమకు చెందిన అనేక కొత్త, పాత తరం నటీనటులు హోలీ సంబరాలు జరుపుకున్నారు. మలబార్ హిల్స్, నెపెన్సీ రోడ్, బాంద్రాలోని పాలీ హిల్స్, ఖార్, శాంతాక్రజ్, చార్ బంగ్లా, సాత్ బంగ్లా తదితర ధనవంతులు, సినీ తారలు నివాసముండే ప్రాంతాలన్నీ సోమవారం ఉదయం నుంచి బిజీగా కనిపించాయి. వారివారి సొంత బంగ్లాలో హోలీ సంబరాలు చేసుకున్నారు. ‘మోనో’ సేవల నిలిపివేత హోలీ పండుగ నేపథ్యంలో మోనో రైలు బోగీలపై రంగులుపడకుండా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రైలు సేవలను సోమవారం పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఈ రైలు సేవలను ఆస్వాదించేందుకు ఆయా స్టేషన్లకు చేరుకున్న నగరవాసులకు నిరాశే మిగిలింది. హోలీ పండుగ నేపథ్యంలో దాదాపు అన్ని రంగాల ఉద్యోగులకూ సెలవు ఉంటుంది. రంగుల్లో మునిగితేలిన ముంబైకర్లు మోనో రైలులో ప్రయాణించేందుకు వస్తారు. ఈ నేపథ్యంలో ఆకతాయిలు ప్లాట్‌ఫారంతోపాటు రైలు లోపల రంగులు చల్లుకునే అవకాశముంది. దీంతో బోగీలన్నీ అపరిశుభ్రంగా మారతాయి. ఇటువంటి ఇబ్బందులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను నిలిపివేయడమే ఉత్తమమని భావించినట్లు ఎమ్మెమ్మార్డీయే డెరైక్టర్ దిలీప్ కవట్కర్ చెప్పారు. రైల్వే ట్రాక్‌ల వెంట పహారా... రైల్వే ప్రయాణికులపై పోలీసులు ఈసారి చాలా శ్రద్ధ తీసుకున్నారు. సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే ట్రాక్స్ వెంబడి ఉన్న మురికివాడల్లో నివాసముంటున్న పోకిరి, ఆకతాయిలు నీటితో నింపిన బెలూన్లు విసురుతున్నారని ఏటా అనేక ఫిర్యాదులు రైల్వే పోలీసులకు వస్తున్నాయి. నడిచే రైలుపై బెలూన్లు విసరడంవల్ల డోరు దగ్గర నిలబడిన ప్రయాణికులకు గట్టిగా దెబ్బ తగులుతుంది. కొన్ని సందర్భాలలో అదుపుతప్పి కిందపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది ఏటా జరుగుతున్నదే. తాజాగా మూడు రోజుల క్రితం భయందర్-మీరారోడ్ స్టేషన్ల మధ్య నీటి బెలూన్ విసరడంతో వైశాలి దమానియా అనే మహిళా ఉద్యోగి కంటికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో బెలూన్లు విసిరే ఆకతాయిల ఆట కట్టించేందుకు మురికివాడల వెంబడి ఉన్న ట్రాక్‌పై అక్కడక్కడ రైల్వే పోలీసులను మోహరించారు. నగరంలోని అన్ని జంక్షన్ల వద్ద పోలీసులు పహారా కాశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు వ్యాన్లలో గస్తీ నిర్వహించారు. హోలీ పండగ కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. దీంతో నగరంలో తిరిగే బెస్ట్ బస్సులు, లోకల్ రైళ్లన్నీ దాదాపు ఖాళీగానే కనిపించాయి. -
మోనో రైలుకు భారీ స్పందన
సాక్షి, ముంబై: కొత్త ఒక వింత.. అనే నానుడిని ముంబైకర్లు నిజం చేస్తున్నారు. ఏ నిమిషాన మోనో రైలు ప్రారంభమైందో.. అప్పటినుంచి దానిలో ప్రయాణించడానికే ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారకముందే మోనో రైల్వే స్టేషన్ చేరుకుంటున్నారు. మధ్యాహ్నం సేవలు నిలిపివేసిన తర్వాత కూడా అక్కడి నుంచి జనం కదలడం లేదు. స్థానికుల నుంచి ఈ స్పందన చూసి అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే టికెట్ ధర కేవలం ఐదురూపాయలు మాత్రమే ఉండడంతో వారు కేవలం జాయ్ రైడ్ కోసమే మోనో రైలులో ప్రయాణిస్తున్నారా..? అనే అనుమానాలు వస్తున్నాయి. నియమ, నిబంధనల ప్రకారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు మాత్రమే మోనో రైలు నడపాలి. కానీ సోమవారం విపరీతమైన రద్దీ కావడంతో సాయంత్రం 4.30 గంటల వరకు నడపాల్సి వచ్చింది. ఇందులో మొత్తం 64 ట్రిప్పులు నడవగా సుమారు 19,600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు జారీ అయిన టికెట్లను బట్టి తెలుస్తోందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) డెరైక్టర్ దిలీప్ కవట్కర్ చెప్పారు. వీరివల్ల ఎమ్మెమ్మార్డీయేకు రూ.రెండు లక్షల ఆదాయం వచ్చిందని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా సుమారు తొమ్మిది కి.మీ. పొడవున్న చెంబూర్-వడాల మధ్య ఏడు ప్రముఖ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ ఉదయం నుంచి క్యూలు కట్టారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా భద్రత దళాలను మోహరించాల్సి వచ్చింది. కాని ఈ మార్గంలోని ఏ స్టేషన్లోనూ ప్రయాణికులకు తాగునీరు, టాయిలెట్లు, టీ, అల్పాహార స్టాళ్లు లాంటి కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బం దులు పడుతున్నారు. టాయిలెట్లు లేకపోవడంతో ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే అక్కడ ఏర్పాటుచేసిన టికెట్ వెండింగ్ మెషిన్ (టీవీఎం)లు పాత రూపాయి నాణాలను స్వీకరించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు కొన్ని స్టేషన్లలో రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయట పడేందుకు డోర్లు తెరుచుకోవడం లేదు. దీంతో ఒక్కసారిగా తోపులాటలు జరుగుతున్నాయి. కొద్ది రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటాయని, అయిదే ఏ ఉద్దేశంతో మోనో రైలు సేవలు ప్రారంభించామో ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొంత సమయం పడుతుందని దిలీప్ కవట్కర్ వివరించారు. -
మోనో రైలుకు సర్కారు యోచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మెట్రో రైలుకు ఫీడర్ లైన్‌గా వ్యవహరించే మోనో రైలును ప్రారంభించడానికి ప్రభుత్వం యోచిస్తోందని హోం మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మెట్రో రైలు పనులు పూర్తయిన వెంటనే మోనో రైలును అనుసంధానం చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. శాసన సభ సమావేశాలు పూర్తయ్యాక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై చర్చిస్తారని చెప్పారు. నగరంలో మంగళవారం 25వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రయాణికులకు అనుకూలంగా ఉండడానికే మోనో రైలు గురించి ఆలోచిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి అనేక కంపెనీలు ముందుకొచ్చాయని, దీనిపై సాధక బాధలను చర్చించిన తర్వాత నిపుణుల అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాగా హోటళ్లు, పబ్‌ల వేళలను పొడిగించే విషయమై పోలీసు శాఖ అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. -
మోనో రైలుకు సర్కారు యోచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మెట్రో రైలుకు ఫీడర్ లైన్‌గా వ్యవహరించే మోనో రైలును ప్రారంభించడానికి ప్రభుత్వం యోచిస్తోందని హోం మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మెట్రో రైలు పనులు పూర్తయిన వెంటనే మోనో రైలును అనుసంధానం చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. శాసన సభ సమావేశాలు పూర్తయ్యాక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై చర్చిస్తారని చెప్పారు. నగరంలో మంగళవారం 25వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రయాణికులకు అనుకూలంగా ఉండడానికే మోనో రైలు గురించి ఆలోచిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి అనేక కంపెనీలు ముందుకొచ్చాయని, దీనిపై సాధక బాధలను చర్చించిన తర్వాత నిపుణుల అభిప్రాయాలను స్వీకరించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కాగా హోటళ్లు, పబ్‌ల వేళలను పొడిగించే విషయమై పోలీసు శాఖ అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. -
రాష్ర్ట ప్రజలకు సీఎం వరాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి : ముఖ్యమంత్రి జయలలిత మూడురోజుల పాటూ చెన్నైలో నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సమావేశం శుక్రవారం రాత్రితో ముగిసిపోయింది. ముగింపు రోజు 312 వరాలను ఆమె ప్రకటించారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న తన ప్రభుత్వం అభివృద్ధికి సైతం అంతే ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. చెన్నైలో నిర్మాణంలో ఉన్న మెట్రోరైలుకు దీటుగా కోయంబత్తూరులో మోనో రైలు పథకానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. పొట్టకూటి కోసం సముద్రంలో చేపలవేట సాగించే మత్స్యకారుల సౌకర్యార్థం రామేశ్వరంలో ఫిషింగ్ హార్బర్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. తిరుచ్చిరాపల్లిలో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం, కన్యాకుమారిలో సముద్రపు అటుపోట్లను తట్టుకునేలో భారీ ప్రహరీగోడను నిర్మించనున్నట్లు తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం చెంగల్పట్టు మండలాన్ని రెండుగా విభజిస్తున్నామని తెలిపారు. తిరునెల్వేలిలో అనేక రహదారులను అనుసంధానం చేస్తూ బైపాస్‌రోడ్డు ను మంజూరుచేశామని చెప్పారు. మధురై, కన్యాకుమారి జిల్లాల్లో పాత ఫ్లైఓవర్ల స్థానంలో కొత్తవి నిర్మించనున్నట్లు చెప్పారు. తిరువణ్ణామలై వైపు వెళ్లే తొమ్మిది రహదారుల్లో కారుపార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పెరంబలూరుకు సాంస్కృతిక కళల కళాశాలను మంజూరు చేసినట్లు ప్రకటించారు. శివంగంగై, మధురైలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమ్మ క్యాంటీన్లతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చెన్నై సహాయ పోలీస్ కమిషనర్‌కు మెజిస్టీరియల్ అధికారాలను తొలిసారిగా కట్టబెట్టినట్లు తెలిపారు. సీఆర్పీసీ 107,108,110 సెక్షన్ల కేసులను ఆయన పరిగణనలోకి వస్తాయని ఆమె అన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను జ్ఞాపికలతో ఆమె సత్కరించారు. -
వడాలా - చెంబూరు మార్గంలో ‘మోనో’రైలు మొదటి సేవలు
సాక్షి, ముంబై: నవంబర్ చివరిలో వడాలా-చెంబూరు మధ్య 8.8 కి.మీ. మేర దూరంలో ప్రారంభమయ్యే మోనోరైలు ప్రారంభ దశలో కేవలం ఐదు గంటలు మాత్రమే నడుపనున్నారు. ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒక రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. వీటి పూర్తి స్థాయి కార్యకలాపాలకు మరికొంత సమయం పట్టనుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అయితే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ), ప్రాజెక్ట ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మోనోరైలు ప్రాజెక్టు మొత్తం పూర్తి అయిన వెంటనే వీటి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో మోనోరైలు ఐదు గంటలు మాత్రమే నడపాలని నిర్ణయించామన్నారు. తర్వాత ఈ మార్గంలో పనులు సంపూర్ణంగా పూర్తి అయిన తర్వాత రెండు నెలల్లోనే ఈ రైలు సేవలు 10 గంటల వరకు పొడిగిస్తామని అధికారి తెలిపారు. అయితే చివరగా షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉందన్నారు. 20 కి.మీ. మోనోరైల్ కారిడార్ ఎస్జీఎం చౌక్ నుంచి చెంబూర్ వరకు వయా వడాలా మీదుగా నడిచే విధంగా ప్రణాళికను తయారుచేసిన విషయం తెలిసిందే. అయితే 11.2 కి.మీ దూరమైన ఎస్జీఎం చౌక్-వడాల మార్గంపై పెండింగ్ పనులు పూర్తి కావడానికి మరి కొన్ని నెలలు పడుతుందని, దీంతో ప్రయాణికులు ఈ మార్గంపై రైలు సేవల కోసం మరి కొన్ని నెలలు వేచి చూడక తప్పదని అధికారి తెలిపారు. కాగా ఈ రైలు సేవలను ప్రారంభ దశలో నాలుగు నిమిషాలకు ఒకసారి ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకు గతంలో నిర్ణయించినప్పటికీ ఇప్పుడు తొమ్మిది నిమిషాలకు ఒక రైలును అందుబాటులో ఉంచనున్నట్లు వారు వెల్లడించారు. అయితే కాంట్రాక్ట ఒప్పందం ప్రకారం.. తొమ్మిది నిమిషాలకు ఒక రైలు నడిపే విధంగా ఉందని అడిషినల్ మెట్రోపాలిటన్ కమిషనర్ అశ్విని భిడే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రజా స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత షెడ్యూల్‌ను ఖరారు చేయాలని మరో అధికారి అభిప్రాయపడ్డారు. అయితే ఇది కొత్త విధానం కావడంతో ప్రారంభంలో ఈ రైలు సేవలను ఎంత మంది ప్రయాణికులు వినియోగించుకుంటారనేది ముందుగానే అంచనా వేయలేమన్నారు. ఇదిలా ఉండగా ఈ రైలు మార్గంలో ఇతర మార్గాలతో పోల్చితే వడాలా-చెంబూర్ మార్గం చాలా ప్రఖ్యాతి గాంచిందన్నారు. దీంతో ఈ మార్గంలోనే నవంబర్ ఆఖరు వరకు రైలు ప్రారంభించాలని నిర్ణయించామని అధికారి వెల్లడించారు. -
వచ్చే నెల నుంచి మోనో పరుగులు
సాక్షి, ముంబై: మోనోరైలు కోసం సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ముంబైకర్లకు త్వరలోనే వీటి సేవలు అందనున్నాయి. మోనోరైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. దీపావళి సెలవుల తరువాత, అంటే నవంబరు ఆఖరు వారానికల్లా మోనో రైలు సేవలను ప్రత్యక్షంగా వినియోగంలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి ధ్రువపత్రం పొందేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేశారు. రైలు నడిపే సిబ్బందికి, సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలించే టెక్నిషియన్లకు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చే పనులు దాదాపు పూర్తికావచ్చాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నవంబరు ఆఖరువారంలో ముంబైకర్లు మోనోరైలులో ప్రయాణించే అవకాశం ఉండవచ్చని ఈ ప్రాజెక్టు అధికారి ఒకరు తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి మోనోరైలు ప్రాజెక్టును ముంబైలో చేపడుతున్న విషయం తెలిసిందే. వీటి నిర్మాణ పనులను పూర్తి చేయడానికి గత ఐదేళ్ల నుంచి అధికారులు విధించుకున్న గడువులన్నీ మీరిపోయినా మోనోరైలు మాత్రం పట్టాలెక్కకపోవడం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును గమనిస్తే నవంబరులోనే రైలుకు పచ్చజెండా ఊపే అవకాశాలు బాగానే ఉన్నాయని చెబుతున్నారు. వడాల-చెంబూర్ మొదటి విడత మోనో రైలు మార్గం 8.80 కి లోమీటర్లు ఉంది. ఇందులో మొత్తం ఏడు స్టేషన్లు ఉన్నాయి. ఆటోమేటిక్‌గా పనిచేసే ఈ రైళ్లకు గత ఫిబ్రవరి నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎదురవుతున్న సాంకే తిక లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తున్నారు. స్టేషన్లో సిగ్నల్ పనితీరు, ఇతర సాంకేతిక పరికరాలకు నిర్వహించే పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. జపాన్ తరువాత భారతదేశంలో మాత్రమే ఇలాంటి రైళ్లు క నిపించనున్నాయి. దీంతో మనదేశంలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్న ఈ ప్రాజెక్టును అధికారులు ఒక సవాలుగా తీసుకుంటున్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికీ తావీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రైళ్లు ప్రారంభమైన తరువాత లోపాలు, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రతీ చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మోనోరైలు ప్రత్యేకతలు... ఈ ప్రాజెక్టు మొదటి విడతలో ఏడు స్టేషన్లు ఉండగా, తదనంతరం 12 స్టేషన్లను నిర్మిస్తారు. ప్రాజెక్టు వ్యయం రూ.మూడువేల కోట్లు నాలుగు బోగీల్లో 600 మంది ప్రయాణికులను తీసుకెళ్తుంది. గంటకు 35-80 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు నడుస్తాయి. గంటకు 18-20 వేల మంది వరకు ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం ఈ రైళ్లకు ఉంది. ఒక్క స్టేషన్‌కు కనీసం రూ.8-10 వరకు చార్జీ వసూలు చేస్తారు. ఆటోమాటిక్ డోర్లు, పూర్తి ఏసీ బోగీలుంటాయి. గులాబీ, నీలం, ఆకుపచ్చ రంగుల్లోని మూడు రైళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి. అటకెక్కిన చర్చిగేట్ రైల్వే ప్రాజెక్టు సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో ఓవల్ మైదాన్ (చర్చిగేట్)-విరార్ ఎలివేటెడ్ రైల్వే ప్రాజెక్టు ముందుకుసాగడం లేదు. తాము విధించిన మూడు షరతులకు హామీ ఇవ్వాలన్న రైల్వే ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో స్తంభన నెలకొంది. రూ.30 వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు 2020 వరకు పూర్తిచేయాలని రైల్వే లక్ష్యం నిర్దేశించుకుంది. మెట్రో,మోనోరైలు ప్రాజెక్టులాగా భవిష్యత్తులో తమకు వేరేసంస్థ పోటీకి రాకుండా నిరోధిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకుంటే ఎలివేటెడ్ మార్గానికి తాము వెచ్చించే మొత్తం వృథా అవుతుందని పేర్కొంది. ముంబైలో ప్రస్తుతం మెట్రో, మోనో రైలు ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. వీటి ప్రభావం ఓవల్‌మైదాన్-విరార్ ఎలివేటెడ్ రైల్వే మార్గంపై తప్పకుండా ఉంటుంది. వీటి కారణంగా భవిష్యత్తులో ఎలివేటెడ్ రైల్వే ప్రాజెక్టు ఆదాయానికి గండిపడే అవకాశాలు లేకపోలేదు. రైల్వే విధించిన షరుతులు ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు రైల్వే ఏవైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటే ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలి. అలాగే పనులు జరుగుతుండగా ఏదైన నష్టం జరిగినా భరించాలి. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ రైల్వే ప్రాజెక్టు ప్రారంభమయ్యాక పోటీగా మెట్రో, మోనో వంటి ప్రాజెక్టులు పోటీగా తీసుకురాకూడదు. ప్రాజెక్టు పనులు పూర్తయిన తరువాత అనుసరించాల్సిన పన్నుల వసూలు విధానాన్ని ముందుగానే వెల్లడించాలి. -
నిఘా పెంచాం
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో మత ఘర్షణలు జరగడానికి అవకాశం ఉందని కేంద్ర గూఢచార సంస్థలు అప్రమత్తం చేయడంతో సర్వత్రా నిఘా పెంచామని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ తెలిపారు. విధాన సౌధలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో మత ఘర్షణలు చెలరేగిన నేపథ్యంతో పాటు రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో కొంత మంది విద్రోహులు సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలను రెచ్చ గొడుతున్నారనే సమాచారం ఉందన్నారు. మత ఘర్షణలకు ఆస్కారమున్న సున్నిత ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని ఆయన తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య వల్ల కాలుష్యం పెరిగి పోతోందని మంత్రి తెలిపారు. దీనిని నివారించడానికి ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతం చేయదలిచామన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చైనా పర్యటన నుంచి వచ్చిన వెంటనే ‘మోనో రైలు’ పనులకు శ్రీకారం చుడతామన్నారు. మెట్రో రైలుకు ఫీడర్ ఛానల్‌గా మోనో రైలు పని చేస్తుందని చెప్పారు. దీని వల్ల నగర పౌరుల సొంత వాహనాల వినియోగం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వివిధ ప్రభుత్వ శాఖలు కొన్ని ప్రతిపాదనలు రూపొందించాయన్నారు. వీటి అమలు, ఫలితాల కోసం 45 రోజుల సమయాన్ని విధించుకున్నామని తెలిపారు. అనంతరం మరో సారి సమీక్షించి లోపాలుంటే సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు. -
‘మోనో’కు మరిన్ని పరీక్షలు!
సాక్షి, ముంబై: మోనో రైలు మార్గం ప్రారంభమైతే ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదట మోనోరైలులో కొన్ని రోజుల పాటు రైల్వే సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. వారు మామూలు ప్రయాణికుల మాదిరి స్టేషన్‌కు వస్తారు... భద్రతాపరమైన తనిఖీలు పూర్తిచేసుకుని ముందుకు వెళతారు... టికెట్లు తీసుకొని ప్లాట్‌ఫారంపైకి వెళతారు... రైలు రాగానే ఎక్కి తమకు ఇష్టమున్నచోట దిగుతారు... అక్కడ అందుబాటులో ఉన్న ఎస్కలేటర్‌ను వినియోగించి స్టేషన్ నుంచి బయటపడతారు. చెంబూర్-వడాల (9.8 కి.మీ.) మోనోరైలు మార్గంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ దృశ్యం దర్శనమివ్వనుంది. మోనోైరె ళ్లు ప్రారంభమైన తర్వాత నిజంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడతారు.. వాటిని వీరు స్వయంగా ప్రయాణించి అనుభవించి చూస్తారు. అనంతరం పరిష్కరించేందుకు కృషి చేస్తారు. అంతా సవ్యంగా జరిగితే అప్పడు ముంబైకర్ల కోసం ప్రారంభిస్తారు. ప్రస్తుతం మోనోరైళ్లకు అనేక రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. భద్రతాపరమైన (సేఫ్టీ సర్టిఫికెట్) పత్రం లభించేంతవరకు ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలులేదు. దీంతో మోనోరైళ్లలో అమర్చిన వివిధ విద్యుత్ పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి..? ఆటోమేటిక్ డోర్ల పనితీరు, అత్యవసర సమయంలో ప్రయాణికులను సురక్షితంగా బయటకు ఎలా పంపించాలి..? తదితరాలపై సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ‘కమర్షియల్ ఆఫ్ ట్రయల్’ జరగనుంది. మోనోకు చెందిన ఎనిమిది స్టేషన్ల మీదుగా సంబంధిత రైల్వే సిబ్బంది, అధికారులు ఒక సాధారణ ప్రయాణికులుగా రాకపోకలు సాగించనున్నారు. ప్రయాణికుల దృష్ట్యా ఈ సదుపాయాలు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఈ అధికారులు పరిశీలిస్తారని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ప్రతినిధి దిలీప్ కవట్కర్ చెప్పారు. ‘మోనోరైళ్లు ప్రారంభమైన తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కుతారు.. దిగిపోతారు.. కాని హడావుడిలో సదుపాయాలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అంతగా ఎవరూ పట్టించుకోరు. దీంతో ప్రారంభానికి ముందే రైల్వే అధికారులు, సిబ్బంది స్వయంగా సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించి ఆ తర్వాత ముహూర్తం ఖరారుచేసి ప్రజలకు అనుమతి కల్పిస్తార’ని కవట్కర్ అభిప్రాయపడ్డారు.