రాష్ర్ట ప్రజలకు సీఎం వరాలు
Published Sun, Dec 15 2013 2:13 AM | Last Updated on Thu, May 24 2018 12:05 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి : ముఖ్యమంత్రి జయలలిత మూడురోజుల పాటూ చెన్నైలో నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సమావేశం శుక్రవారం రాత్రితో ముగిసిపోయింది. ముగింపు రోజు 312 వరాలను ఆమె ప్రకటించారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న తన ప్రభుత్వం అభివృద్ధికి సైతం అంతే ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. చెన్నైలో నిర్మాణంలో ఉన్న మెట్రోరైలుకు దీటుగా కోయంబత్తూరులో మోనో రైలు పథకానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. పొట్టకూటి కోసం సముద్రంలో చేపలవేట సాగించే మత్స్యకారుల సౌకర్యార్థం రామేశ్వరంలో ఫిషింగ్ హార్బర్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. తిరుచ్చిరాపల్లిలో నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం, కన్యాకుమారిలో సముద్రపు అటుపోట్లను తట్టుకునేలో భారీ ప్రహరీగోడను నిర్మించనున్నట్లు తెలిపారు.
పరిపాలనా సౌలభ్యం కోసం చెంగల్పట్టు మండలాన్ని రెండుగా విభజిస్తున్నామని తెలిపారు. తిరునెల్వేలిలో అనేక రహదారులను అనుసంధానం చేస్తూ బైపాస్‌రోడ్డు ను మంజూరుచేశామని చెప్పారు. మధురై, కన్యాకుమారి జిల్లాల్లో పాత ఫ్లైఓవర్ల స్థానంలో కొత్తవి నిర్మించనున్నట్లు చెప్పారు. తిరువణ్ణామలై వైపు వెళ్లే తొమ్మిది రహదారుల్లో కారుపార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పెరంబలూరుకు సాంస్కృతిక కళల కళాశాలను మంజూరు చేసినట్లు ప్రకటించారు. శివంగంగై, మధురైలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమ్మ క్యాంటీన్లతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చెన్నై సహాయ పోలీస్ కమిషనర్‌కు మెజిస్టీరియల్ అధికారాలను తొలిసారిగా కట్టబెట్టినట్లు తెలిపారు. సీఆర్‌పీసీ 107,108,110 సెక్షన్ల కేసులను ఆయన పరిగణనలోకి వస్తాయని ఆమె అన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను జ్ఞాపికలతో ఆమె సత్కరించారు.
Advertisement