సాక్షి, ముంబై: వడాల-సాత్‌రాస్తా మార్గంలో నిర్మించే మోనో రైలు మార్గానికి సెంట్రల్ రైల్వే రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోనున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్న మోనో రైలు ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయడం అనివార్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మోనో కారిడార్ నిర్మాణాన్ని ఆపాలని రైల్వే శాఖ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే)ని ఆదేశించింది. మోనో రైలు మార్గానికి కొత్త డిజైన్ రూపొందించాలని సూచించింది.
దీంతో ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. సెంట్రల్ రైల్వే మార్గంలో ప్రస్తుతం నాలుగు లేన్లు ఉన్నాయి. భవి ష్యత్‌లో లోకల్‌తోపాటు దూరప్రాంతాల రైళ్ల సంఖ్య ను పెంచాలనే ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి ఠాణేవరకు ఐదు, ఆరు లేన్లు వేయాలని అధికారులు సంకల్పించారు. ఈ మేరకు రూపొందించిన ప్రణాళిక ప్రకారం కుర్లా నుంచి ఠాణే వరకు ఐదు, ఆరు లేన్ల పనులు పూర్తయ్యా యి. ఇక కుర్లా నుంచి సీఎస్టీ వరకు పనులు చేపట్టాల్సి ఉంది. అందుకు కొన్ని అడ్డంకులు రావడంతో ఈ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. అదే సమయంలో వడాల నుంచి సాత్‌రాస్తా వరకు మోనో రైలు ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే మోనో రైలు మార్గం కరీరోడ్డు రైల్వే వంతెన పక్క నుంచి వెళుతుంది.
ఎమ్మెమ్మార్డీయే, సెంట్రల్ రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో పాత డిజైన్ ప్రకారం పనులు సాగుతున్నా యి. నాలుగో రైల్వే లేన్ పక్కన మోనోరైలు పిల్లర్లు వేస్తున్నారు. దీంతో తేరుకున్న సెంట్రల్ రైల్వే భవి ష్యత్‌లో కుర్లా నుంచి సీఎస్టీ వరకు ఐదు, ఆరో లేన్లు వేస్తే అప్పడు ఈ పిల్లర్లను తొలగించడం సాధ్యం కాదని భావించింది. అందుకే ప్రాజెక్టును నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. మళ్లీ కొత్తగా డిజైన్ చేసి పిల్లర్లువేసే పనులు ప్రారంభించాలని ఎమ్మెమ్మార్డీయేకు సూచించింది. గతంలో కూడా ఇదేవిధంగా వడాలా స్టేషన్ వద్ద హార్బర్ రైలు మార్గం పై మోనోరైలు మార్గం నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు అది పరిష్కారం కావడంతో ఎమ్మెమ్మార్డీయే ఊపిరి పీల్చుకుంది. ఈసారి కరీరోడ్ స్టేషన్ సమీపంలో మోనోరైలు మార్గం డిజైన్‌లో మార్పులు చేయాల్సి వస్తోంది. దీనికి కొత్త డిజైన్ తయారు చేసుకోవాలని ఎమ్మెమ్మార్డీయేను సెంట్రల్‌రైల్వే ఆదేశించింది.
రేసుకోర్స్ ప్రాంతంలో హెలిపోర్టు
ముంబై: భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) మహాలక్ష్మి రేస్‌కోర్సు వద్ద పూర్తిస్థాయి హెలి పోర్టు నిర్మించడానికి అంగీకరించింది. పగలు, రాత్రి హెలికాప్టర్ సేవలు అందించేందుకు ఈ ప్రాంత వాతావరణం అనుకూలిస్తుందని నిర్ధారించింది. ప్రస్తుతం ముంబైలో నిత్యం పదిహెలికాప్టర్లు పగటి పూట మాత్రమే సేవలు అందిస్తున్నాయి. దీని నిర్మాణం పూర్తయితే రోడ్డు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలి గించకుండా వీఐపీలను హెలికాప్టర్లలో తరలించే వీలుంటుంది. దీనికితోడు ఎయిర్ అంబులెన్సుల సేవలకూ ఊతమిచ్చినట్టు అవుతుందని వైమానికరంగ నిపుణులు అంటున్నారు.
అందుకే ఇక్కడ హెలి పోర్టు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా మహారాష్ట్ర విమానాశ్రయాల సంస్థ (ఎంఏడీసీ) కేంద్ర వైమానిక సంస్థను కోరింది. దీని డెవలపర్ నియమాకంతోపాటు ఇతర అనుమతులు త్వరలోనే మం జూరైతే హెలిపోర్టు నిర్మాణ పనులు ఏడాదిలోపే ప్రారంభమవుతాయని ఎంఏడీసీ తెలిపింది. దక్షిణ ముంబైలో అత్యధికంగా నివసించే మంత్రులు, ఉన్నతాధికారులు, వాణిజ్యవేత్తలు త్వరగా గమ్యస్థానం చేరుకోవాలంటే పగలు, రాత్రి సేవలు అందించే పూర్తిస్థాయి హెలిపోర్టు సేవలు అత్యవసరమని ఈ సంస్థ అధికారి ఒకరు అన్నారు. దీని నిర్మాణానికి రూ.55 కోట్ల వరకు అవసరమని చెప్పారు.
రెడ్ సిగ్నల్!
Published Sun, May 25 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement
Advertisement