Chhatrapati Shivaji Terminus
-
మహోజ్వల భారతి.. విక్టోరియా టెర్మినస్
భారతదేశంలోని రద్దీగల రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. దీనిని ఇప్పుడు ఛత్రపతి శివాజీ టెర్మినస్ అంటున్నారు. వాడుకలో ‘సి.ఎస్.టీ’ లేదా ‘బాంబే వీ.టీ’. ప్రధానంగా సెంట్రల్ రైల్వేకు సేవలు అందిస్తోంది. ‘ముంబై సబర్బన్ రైల్వే’ కేంద్రంగా కూడా వినియోగంలో ఉంది. 1878లో కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్ ‘ఫ్రెడరిక్ విలియం స్టీవ్స్ ఈ స్టేషన్ డిజైన్‌ను రూపొందించి, 16.14 లక్షల రూపాయల వ్యయంతో 1888 కల్లా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఏడాది ముందే 1887 జూన్ 20 న టెర్మినస్ ప్రారంభం అయింది. విక్టోరియా రాణి గౌరవార్థం ‘విక్టోరియా టెర్మినస్‘ అని పేరు పెట్టారు. 1996లో శివసేన డిమాండ్ మేరకు ప్రభుత్వం ‘ఛత్రపతి శివాజీ టెర్మినస్’గా పేరు మార్చింది. 2004 జూలై 2 న యునెస్కో ఈ స్టేషన్‌ను ప్రపంచ వారసత్వ నిర్మాణాల జాబితాలో చేర్చింది. ఈ నిర్మాణం ‘విక్టోరియన్ గోథిక్’ లేదా ‘వెనీషియన్ గోథిక్’ శైలిలో ఉంటుంది. ప్రపంచంలోని 19 వ శతాబ్దపు నిర్మాణాలకు విక్టోరియా టెర్మినస్‌ను ఆదర్శంగా చూపుతుంటారు. (ఫొటో : 1910 లో విక్టోరియా టెర్మినస్) -
విద్యుత్ మెరుపుల్లో మెరుస్తున్న ముంబై
-
‘సీఎస్టీ-పన్వేల్’ ఫాస్ట్ కారిడార్‌కు ప్రయత్నాలు
- ప్రాజెక్టుపై ప్రభుత్వం, రైల్వే పరిపాలన విభాగం చర్చలు - రూ. 11 వేల కోట్ల వ్యయం అంచనా - పది స్టేషన్ల నిర్మాణం..ఐదేళ్లలో కారిడార్ పూర్తి సాక్షి, ముంబై: కొద్ది సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ‘ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)-పన్వేల్ ఫాస్ట్ కారిడార్’ ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు అమలుపై రైల్వే పరిపాలన విభాగం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు వేగవంతమయ్యాయి. ప్రాజక్టుకు రూ. 11 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాజెక్టు పూర్తయేనాటికి వ్యయం రూ.13-14 వేల కోట్లకు చేరుతుందని నిపుణులు అంటున్నారు. ప్రాజెక్టులో పెట్టుబడులపై రెండు విభాగాలు చర్చించినట్లు సమాచారం. సీఎస్టీ-పన్వేల్ మధ్య లోకల్ రైలులో ప్రయాణానికి ప్రస్తుతం 80 నిమిషాల సమయం పడుతోంది. కాగా, ఫాస్ట్ కారిడార్ వినియోగంలోకి వస్తే 45 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. మొత్తం పది స్టేషన్లు ఉండే ఈ ప్రాజెక్టు పనులను ఐదేళ్లలో పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. గంటకు 110 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లను ప్రతి ఐదు నిమిషాలకు ఒకటి నడపనున్నారు. ప్రతి బోగీలో 350 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ప్రాజెక్టు ప్రత్యక్షంగా వినియోగంలోకి వస్తే రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు సాగించే వారి సంఖ్య 20 శాతానికి పైగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీ తగ్గించడానికే.. కాగా, సీఎస్టీ-పన్వేల్ హార్బర్ మార్గంలో అప్,డౌన్ రైలు మార్గాలు ఉన్నందున ఫాస్ట్ రైళ్లు నడిపే అవకాశం లేదు. ప్రస్తుతం సెంట్రల్ మార్గంలో సీఎస్టీ నుంచి కల్యాణ్ వరకు పశ్చిమ రైల్వే మార్గంలో చర్చిగేట్ నుంచి విరార్ వరకు నాలుగు రైల్వే లేన్లు ఉన్నాయి. వీటిలో రెండు స్లో, రెండు ఫాస్ట్ మార్గాలున్నాయి. హార్బర్ మార్గంలో రెండు రైల్వే లేన్లు మాత్రమే ఉండటంతో ఫాస్ట్ లోకల్ రైళ్లు నడపడం సాధ్యమవడంలేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ రైళ్లు నడిపితే ప్రయాణికులకు రద్దీ తగ్గుతుందని రైల్వే భావించింది. దీంతో ఫాస్ట్ కారిడార్ ప్రాజెక్టు తెరమీదకు తెచ్చింది. కాగా ప్రాజెక్టుకు రైల్వే బోర్డు నుంచి అధికారికంగా అనుమతి లభించలేదు. -
రెడ్ సిగ్నల్!
సాక్షి, ముంబై: వడాల-సాత్‌రాస్తా మార్గంలో నిర్మించే మోనో రైలు మార్గానికి సెంట్రల్ రైల్వే రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోనున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్న మోనో రైలు ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయడం అనివార్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మోనో కారిడార్ నిర్మాణాన్ని ఆపాలని రైల్వే శాఖ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే)ని ఆదేశించింది. మోనో రైలు మార్గానికి కొత్త డిజైన్ రూపొందించాలని సూచించింది. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. సెంట్రల్ రైల్వే మార్గంలో ప్రస్తుతం నాలుగు లేన్లు ఉన్నాయి. భవి ష్యత్‌లో లోకల్‌తోపాటు దూరప్రాంతాల రైళ్ల సంఖ్య ను పెంచాలనే ఉద్దేశంతో ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి ఠాణేవరకు ఐదు, ఆరు లేన్లు వేయాలని అధికారులు సంకల్పించారు. ఈ మేరకు రూపొందించిన ప్రణాళిక ప్రకారం కుర్లా నుంచి ఠాణే వరకు ఐదు, ఆరు లేన్ల పనులు పూర్తయ్యా యి. ఇక కుర్లా నుంచి సీఎస్టీ వరకు పనులు చేపట్టాల్సి ఉంది. అందుకు కొన్ని అడ్డంకులు రావడంతో ఈ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. అదే సమయంలో వడాల నుంచి సాత్‌రాస్తా వరకు మోనో రైలు ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే మోనో రైలు మార్గం కరీరోడ్డు రైల్వే వంతెన పక్క నుంచి వెళుతుంది. ఎమ్మెమ్మార్డీయే, సెంట్రల్ రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో పాత డిజైన్ ప్రకారం పనులు సాగుతున్నా యి. నాలుగో రైల్వే లేన్ పక్కన మోనోరైలు పిల్లర్లు వేస్తున్నారు. దీంతో తేరుకున్న సెంట్రల్ రైల్వే భవి ష్యత్‌లో కుర్లా నుంచి సీఎస్టీ వరకు ఐదు, ఆరో లేన్లు వేస్తే అప్పడు ఈ పిల్లర్లను తొలగించడం సాధ్యం కాదని భావించింది. అందుకే ప్రాజెక్టును నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. మళ్లీ కొత్తగా డిజైన్ చేసి పిల్లర్లువేసే పనులు ప్రారంభించాలని ఎమ్మెమ్మార్డీయేకు సూచించింది. గతంలో కూడా ఇదేవిధంగా వడాలా స్టేషన్ వద్ద హార్బర్ రైలు మార్గం పై మోనోరైలు మార్గం నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు అది పరిష్కారం కావడంతో ఎమ్మెమ్మార్డీయే ఊపిరి పీల్చుకుంది. ఈసారి కరీరోడ్ స్టేషన్ సమీపంలో మోనోరైలు మార్గం డిజైన్‌లో మార్పులు చేయాల్సి వస్తోంది. దీనికి కొత్త డిజైన్ తయారు చేసుకోవాలని ఎమ్మెమ్మార్డీయేను సెంట్రల్రైల్వే ఆదేశించింది. రేసుకోర్స్ ప్రాంతంలో హెలిపోర్టు ముంబై: భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) మహాలక్ష్మి రేస్‌కోర్సు వద్ద పూర్తిస్థాయి హెలి పోర్టు నిర్మించడానికి అంగీకరించింది. పగలు, రాత్రి హెలికాప్టర్ సేవలు అందించేందుకు ఈ ప్రాంత వాతావరణం అనుకూలిస్తుందని నిర్ధారించింది. ప్రస్తుతం ముంబైలో నిత్యం పదిహెలికాప్టర్లు పగటి పూట మాత్రమే సేవలు అందిస్తున్నాయి. దీని నిర్మాణం పూర్తయితే రోడ్డు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలి గించకుండా వీఐపీలను హెలికాప్టర్లలో తరలించే వీలుంటుంది. దీనికితోడు ఎయిర్ అంబులెన్సుల సేవలకూ ఊతమిచ్చినట్టు అవుతుందని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. అందుకే ఇక్కడ హెలి పోర్టు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా మహారాష్ట్ర విమానాశ్రయాల సంస్థ (ఎంఏడీసీ) కేంద్ర వైమానిక సంస్థను కోరింది. దీని డెవలపర్ నియమాకంతోపాటు ఇతర అనుమతులు త్వరలోనే మం జూరైతే హెలిపోర్టు నిర్మాణ పనులు ఏడాదిలోపే ప్రారంభమవుతాయని ఎంఏడీసీ తెలిపింది. దక్షిణ ముంబైలో అత్యధికంగా నివసించే మంత్రులు, ఉన్నతాధికారులు, వాణిజ్యవేత్తలు త్వరగా గమ్యస్థానం చేరుకోవాలంటే పగలు, రాత్రి సేవలు అందించే పూర్తిస్థాయి హెలిపోర్టు సేవలు అత్యవసరమని ఈ సంస్థ అధికారి ఒకరు అన్నారు. దీని నిర్మాణానికి రూ.55 కోట్ల వరకు అవసరమని చెప్పారు. -
కాదేదీ చోరీకి అనర్హం
విశ్రాంతి గదిలో సామగ్రితో ఉడాయిస్తున్న ప్రయాణికులు - మహిళా ప్రయాణికులు విశ్రమిస్తున్న చోటే చోరీలు అధికం - పాలుపోని అధికారులు - ఇతరుల తప్పులకు తాము బలవుతున్నామంటూ ఆవేదన సాక్షి, ముంబై: పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)లోని విశ్రాంతి గదిలోనూ దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయి. ఇందులో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచిన సామగ్రి తరచూ చోరీకి గురవుతున్నాయి. దీనిని గత ఏడాది ఏప్రిల్‌లో అప్పటి రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ ప్రారంభించారు. ఇక్కడ ప్రయాణికుల కోసం తువ్వాళ్లు, సబ్బులను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఇవి కూడా చోరీకి గురవుతున్నాయి. ఇందులో 12 గంటల పాటు ఉన్న వారి వద్ద నుంచి రూ.150, 24 గంటల పాటు ఉన్నవారి వద్ద నుంచి రూ.250 వసూలు చేస్తారు. ఇక్కడ 78 పడకలను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచారు. ఇందులో 58 పడకలు పురుషుల కోసం, మిగతావాటిని మహిళల కోసం ఉంచారు. అయితే గత కొన్ని రోజులుగా ఇందులోని బల్బులు, ఇతర చిన్న చిన్న పరికరాలు చోరీకి గురవుతున్నాయి. విచిత్రమేమిటంటే మహిళల విశ్రాంతి గదిలోనే ఎక్కువ చోరీలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. చోరీల విషయమై భద్రతా సిబ్బంది అనేక పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. ప్రయాణికులు గది విడిచి వెళుతున్న సమయంలో దుప్పట్లు కూడా తీసుకెళ్తున్నట్లు గమనించిన సిబ్బంది తమ దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ గదిని ప్రారంభించిన నాటినుంచి ఇప్పటివరకు సామగ్రి చోరీకి గురవుతూనే ఉందని వారు పేర్కొన్నారు. ఇందులోకి వచ్చే ప్రతి ప్రయాణికుడి సామగ్రిని తనిఖీ చేయాలంటూ ఇటీవల సంబంధిత అధికారులు సిబ్బందికి సూచించారు. అయితే రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారని, అందువల్ల తనిఖీ సాధ్యం కావడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 20 దుప్పట్లు చోరీకి గురైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక అధికారులు చవకైన సామగ్రిని ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరో చోరీలకు పాల్పడుతున్నారని, అయితే అందుకు తాము బాధ్యత వహించాల్సి వస్తోందంటూ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
లోకల్ సేవలో ‘సీసీవో-ఏటీవీఎం’లు
సాక్షి, ముంబై: లోకల్ రైలు టికెట్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూల నుంచి ప్రయాణికులకు త్వరలో ఉపశమనం లభించనుంది. అందుకు సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగం ‘క్యాష్ అండ్ కాయిన్ అపరేటెడ్- ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్’ (సీసీవో-ఏటీవీఎం)కొత్త యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యంత్రాన్ని ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) స్టేషన్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేశారు. ప్రయాణికుల నుంచి విశేష స్పందన రావడంతో లోకల్ రైల్వేస్టేషన్ల పరిధిలో ఇలాంటి 117 యంత్రాలను ఏర్పాటు చేయాలని సెంట్రల్ రైల్వే సంకల్పించింది. ఈ యంత్రంలో టికెటుకు సరిపడ నోట్లు, చిల్లర నాణేలు వేస్తే చాలు టికెటు జారీ అవుతుంది. అదేవిధంగా ఈ యంత్రం స్మార్ట్ కార్డు ద్వారా టికెట్ కొనుగోలు చేయడం, ఇదే స్మార్ట్ కార్డులో డబ్బులు బ్యాలెన్స్ చేసుకోవడం లాంటి పనులు కూడా చేస్తుంది. టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూలను తగ్గించేందుకు రైల్వే అనేక ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం అన్ని లోకల్ రైల్వే స్టేషన్లలో కూపన్ వెలిడేటింగ్ మెషిన్ (సీవీఎం), ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ (ఏటీవీఎం) యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో సీవీఎం యంత్రాలను తొలగించాలనే ప్రయత్నంలో ఉంది. దీని స్థానంలో ఆధునిక కొత్త యంత్రాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. యంత్రంపై సూచించిన ప్రకారం ఆపరేట్ చేయాలి. తర్వాత టికెటుకు సరిపడా డబ్బులు అందులో వేస్తే చాలు టికెటు బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల చిల్లర నాణేల విషయంపై టికెట్ కౌంటర్ల వద్ద క్లర్క్‌లతో జరిగే గొడవలు తగ్గిపోతాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చే ఈ యంత్రాలు సీఎస్టీతోపాటు ముందుగా దాదర్, కల్యాణ్, లోక్మాన్య తిలక్ (కుర్లా) టర్మినస్, ఠాణే ఆ తర్వాత భాయ్కళ, కుర్లా, ఘాట్కోపర్, డోంబివలి, ములుండ్, వడాల రోడ్, వాషి, మాన్‌ఖుర్ద్, పన్వేల్, బేలాపూర్ తదితర స్టేషన్లలో అమర్చనున్నారు. సీఎస్టీలో ఏర్పాటు చేసిన యంత్రం ఎలా వినియోగించాలో అందరికీ తెలియదు. దీంతో అక్కడ ఒక సిబ్బందిని నియమించినట్లు సెంట్రల్ రైల్వే పీఆర్వో అతుల్ రాణే చెప్పారు. -
విడిపోయిన లోకల్రైలు బోగీలు
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి కల్యాణ్ బయలుదేరిన లోకల్ రైలు మధ్య కప్లింగ్ ఊడి బోగీలు విడిపోయాయి. అయితే మోటార్‌మెన్ (డ్రైవర్) అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం దీవా-కోపర్ స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. దీనివల్ల దాదాపు గంటకుపైగా లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సాయంత్రం విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అనేకమంది రైలు దిగి కాలినడకన వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో దీవా స్టేషన్ నుంచి లోకల్ రైలు కల్యాణ్ దిశగా బయలుదేరింది. కొంత దూరం వెళ్లగానే ఏడో బోగీ, ఎనిమిదో బోగీ మధ్యనున్న కప్లింగ్ ఊడింది. అప్పటికీ రైలు వేగం పుంజుకోలేదు. ఏడు బోగీలతో రైలు ముందుకు వెళ్లిపోయింది. వెనకా ఉన్న ఐదు బోగీలు కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి. చీకటి కారణంగా రైలులో ఉన్న ప్రయాణికులకు అసలేం జరిగిందో తెలియలేదు. బయటకు తొంగి చూడగా కప్లింగ్ ఊడిపోవడంతో ఏడు బోగీలతో రైలు ముందుకు వెళ్లినట్లు గుర్తించారు. ఐదు బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు కిందికి దిగేశారు. ఈ విషయాన్ని గుర్తించిన మోటార్‌మెన్ వెంటనే రైలును ఆపాడు. తర్వాత విడిపోయిన ఐదు బోగీలను కారుషెడ్డుకు తరలించారు. అప్పటికే వెనకాల వచ్చిన రైళ్లన్నీ ట్రాక్‌పై నిలిచిపోయాయి. కొన్ని లోకల్ రైళ్లను వీలున్న చోట దారి మళ్లించి ఫాస్ట్ ట్రాక్ మీదుగా నడిపారు. రైళ్లను పునరుద్ధరించడానికి అధికారులు కష్టపడ్డారు. రాత్రి 10 గంటల తర్వాత రైళ్లన్నీ షెడ్యూల్ ప్రకారం నడిచాయి. -
అరకొర సంఖ్యలో అంబులెన్సులు..!
సాక్షి, ముంబై: లోకల్ రైల్వే పరిధిలోని స్టేషన్లకు ప్రభుత్వం పంపిణీ చేస్తానన్న అంబులెన్సుల సంఖ్యపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోకల్ పరిధిలో 120 స్టేషన్లుండగా కేవలం 46 అంబులెన్సులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఇవి ఏ మాత్రం చాలవని అధికారులు చెబుతున్నారు. రైలు ప్రమాదాల్లో గాయపడిన ప్రయాణికులను సత్వరం ఆస్పత్రికి తరలించేందుకు అవసరమైన అంబులెన్స్‌లు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్’ (ఈఎంఎస్) పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 937 అంబులెన్స్‌లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, బాంబే విక్టోరియా గాంధీ సంయుక్తంగా అంబులెన్స్ సేవలు అందించనున్నాయి. ఇందులో సెంట్రల్ రైల్వేలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి ములుండ్ వరకు 18, పశ్చిమ ైరె ల్వేలోని చర్చిగేట్ నుంచి విరార్ వరకు 28 అంబులెన్స్‌లు అందుబాటులోకి వస్తాయి. కాని ఠాణే నుంచి కల్యాణ్, కర్జత్, కసార, ఖోపోలి, అదేవిధంగా హార్బర్ మార్గంలో సీఎస్టీ నుంచి పన్వేల్, ట్రాన్స్ హార్బర్ మార్గంలో ఠాణే నుంచి పన్వేల్ వరకు ఒక్క అంబులెన్స్ కూడా ప్రకటించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతాల్లో రైలు ప్రమాదాలకు గురైన వారిని ఆస్పత్రికి తరలించే విషయం ప్రశ్నార్థకంగా మారింది. రోజూ ఏదో ఒక స్టేషన్లో పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురికావడం, నడుస్తున్న రైలు నుంచి కింద పడి, ఓవర్ హెడ్ వైరుకు అంటుకోవడం లేదా ప్లాట్ఫారం-రైలు మధ్యలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడుతున్న సంఘటనలు ఇక్కడ జరుగుతుంటాయి. రోజూ సరాసరి ఐదుగురు చనిపోవడం, పదుల సంఖ్యలో గాయపడడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రమాదానికి గురైన వారిని సత్వరం ఆస్పత్రికి తీసుకెళ్తే మృతుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అందుకు స్టేషన్ బయట అంబులెన్స్ అందుబాటులో ఉండాలి. కాని నగరం, శివారు ప్రాంతాల్లోని రెండు, మూడు ప్రధాన స్టేషన్లు మినహా మరే ఇతర స్టేషన్లలో అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రైల్వే పోలీసులు గత్యంతరం లేక ఆటో, ట్యాక్సీ లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే ప్రైవేటు వాహనాలను మాట్లాడి తీసుకొచ్చే వరకూ ఏ మాత్రం జాప్యం జరిగిన విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ స్టేషన్ బయట అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సంకల్పించింది. కాని లోకల్ రైల్వే పరిధిలో సుమారు 120 స్టేషన్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 46 అంబులెన్స్‌లు మాత్రమే అందజేసేందుకు సిద్ధంగా ఉంది. కాని ఇవి ఏ మూలకు సరిపోతాయని రైల్వే అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
లింక్ ఎఫ్వోబీ పనులు ముమ్మరం
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) లో చేపడుతున్న భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్వోబీ) మార్చి ఆఖరు వరకు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అన్ని ప్లాట్‌ఫాంలతో కలుపుతుండటం వల్ల లోకల్ రైలు దిగిన ప్రయాణికులు మెయిల్, ఎక్స్‌ప్రెస్ ైరె ళ్లు బయలుదేరే అన్ని ప్లాట్పారాలపైకి సులభంగా చేరుకోవచ్చు. ఇది వినియోగంలోకి వస్తే సీఎస్టీలోనే అత్యంత పొడవైన ఎఫ్వోబీగా గుర్తింపు లభించనుంది. సీఎస్టీలో మొత్తం 18 ప్లాట్‌ఫారాలున్నాయి. ఇందులో ఒకటి నుంచి ఎనిమిది వరకు లోకల్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. తొమ్మిది నుంచి 18 వరకు దూరప్రాంతాల రైళ్లు బయలుదేరుతాయి. ఇందులో 14 నుంచి 18 వరకు ప్లాట్‌ఫారాలు సెయింట్ జార్జ్ ఆస్పత్రి దిశలో ఉన్నాయి. లోకల్ రైళ్ల ప్లాట్‌ఫారాలకు, దూరప్రాంతాల రైళ్లు వెళ్లే ప్లాటుఫారాలకు కనెక్టింగ్ ఎఫ్వోబీ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టేషన్లో రోజూ కొన్ని లక్షలమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉంటారు. వీరందరూ దూరప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చి మళ్లీ ముంబైలో ఉండే తమ కార్యా లయాలకు వెళ్లడానికి లోకల్ రైళ్లు ఎక్కుతుంటారు. ఈ క్రమంలో వారు సమయంతోపాటు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కాగా, ప్రస్తుతం ఉన్న ప్లాట్ ఫాంల వల్ల రైలు మారి రైలు ఎక్కడానికే వారు ఎక్కువ సమయం కేటాయిం చాల్సి వస్తోంది. అలాగే దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మామూలు ప్రయాణికులు సైతం చిన్నపిల్లలు, లగేజీతో లోకల్ రైలు దిగిన ప్రయాణికులు ప్లాట్ఫారం ఆ చివర నుంచి ఈ చివరివరకు నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. మళ్లీ దూర ప్రాంతాల రైళ్లు బయలుదేరే ప్లాట్‌ఫారాలకు చేరుకోవాలంటే మళ్లీ ఈ మూల నుంచి ఆ చివరకు అంటే దాదాపు కి.మీ. మేర నడవాల్సి ఉంటుంది. అదే ఒకటో నంబర్ మొదలుకుని చివరనున్న 18వ నంబర్ ప్లాట్ఫారం వరకు కలిపే భారీ ఎఫ్వోబీ నిర్మిస్తే లోకల్ రైలు దిగిన ప్రయాణికులు అటు నుంచి అటే తామెక్కాల్సిన రైలు ఉన్న ప్లాట్‌ఫాంపైకి నేరుగా చేరుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికుల విలువైన సమయంతోపాటు వ్యయప్రయాసాలు కూడా ఎంతో తగ్గుతాయి. ఈ ఎఫ్వోబీ ఐదు మీటర్ల వెడల్పు, 270 మీటర్లు ఎత్తులో ఉంటుంది. దీని నిర్మాణానికి రైల్వే పరిపాలన విభాగం రూ.ఏడు కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయని సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు శుక్రవారం సెంట్రల్ రైల్వే చీఫ్ ప్రజా సంబంధాల అధికారి అతుల్ రాణే చెప్పారు. -
మొబైల్‌తో ‘లోకల్’ టికెట్
సాక్షి, ముంబై: లోకల్ రైళ్ల టికెట్లను మొబైల్ ఫోన్లో కొనుగోలు చేసేందుకు మార్గం సుగమమైంది. మే లేదా జూన్ నుంచి దీన్ని అమలుచేసే అవకాశాలున్నాయని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే మార్గాల ద్వారా ప్రతిరోజూ దాదాపు 75 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఏ స్టేషన్లో చూసినా టికెట్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూలు ఉంటాయి. అయితే వీటివల్ల ప్రయాణికుల విలువైన సమయం వృథా అవుతోందని భావించిన రైల్వే అధికారులు కూపన్ వేలిడేటింగ్ మెషీన్ (సీవీఎం), ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ (ఏటీవీఎం)లు అందుబాటులో ఉంచారు. కాని అనేక సందర్భాలలో అవి పనిచేయడంలేదు. దీంతో రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. నేటి ఆధునిక కాలంలో సాధారణంగా మొబైల్ ఫోన్లు అందరి వద్దా ఉంటున్నాయి. త్వరలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దారిలో వెళుతుండగానే తమవద్ద ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా లోకల్ రైలు టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రయాణికులకు సేవలందించే విషయంపై చర్చ జరిగింది. అందులో మొబైల్ ఫోన్లో టికెట్ల సేవలు ప్రారంభించాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఇరు రైల్వేల జనరల్ మేనేజర్లు హేమంత్ కుమార్, సునీల్‌కుమార్ సూద్, రీజినల్ రైల్వే జనరల్ మేనేజర్లు ముఖేష్ నిగం, శైలేంద్రకుమార్, ప్రజా సంబంధాల అధికారి శరత్ చంద్రాయన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్టీటీ.. లోపాల పుట్ట!
సాక్షి, ముంబై: ముంబైలో దారుణ హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య ముంబైలో రైలు దిగిన అనంతరం ఎటువైపు నుంచి వెళ్లిందనేది పోలీసులకు ఇంతవరకు తెలియరాలేదు. ఎంతో కీలకంగా భావించే సీసీటీవీ కెమెరాల్లో అనూహ్యకు సంబంధించిన ఎలాంటి ఫుటేజ్‌లు లభించలేకపోవడం గమనార్హం. అత్యాధునిక సాంకేతిక పరి/ా్ఞనం వినియోగిస్తున్నామని పేర్కొనే పోలీసులకు ఇంత వరకు ఒక్క ఆధారం కూడా సేకరించకపోవడంపై అనూహ్య బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగరంతోపాటు దేశంలోని ప్రముఖ రైల్వేస్టేషన్లలో ఒక్కటైన ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ), దాదర్ టర్మినస్లపై కొంత భారాన్ని తగ్గించేందుకు లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీ టీ)ను నిర్మించారు. అనంతరం దీన్ని అత్యాధునిక పరి/ా్ఞనంతో ఆధునికీకరించారు. అయినప్పటికీ రైలు దిగిన అనూహ్య గురించి సీసీటీవీలో ఎలాంటి సమాచారం లభించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్లా టర్మినస్‌లో భద్రతా ఏర్పాట్లపై ‘సాక్షి’ దృష్టి పెట్టగా పలు లోపాలు బయటపడ్డాయి. ఇక్కడ మెటల్ డిటెక్టర్లున్నప్పటికీ ప్రయాణికులు నేరుగా వెళ్లడం విశేషం. మరోవైపు ఫ్లాట్ ఫారం ముందు నుంచి వెళితే అక్కడ పోలీసుల జాడ లేదు. ఈ టర్మినస్‌లో మొత్తం అయిదు ఫ్లాట్ ఫారాలున్నాయి. ఒకటో ఫ్లాట్‌ఫారం విడిగా ఉండగా రెండు, మూడు ఫ్లాట్‌ఫారాలు, నాలుగు, అయిదు ఫ్లాట్ ఫారాలు కలిసి ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఫారాలన్నింటిపై నుంచి బయటికి వెళ్లేందుకు ఒకే ఒక్క పాదచారుల వంతెన ఉండగా ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారంపై ప్రధాన ద్వారం ఉంది. అయితే ముందువైపు నుంచి మాత్రం నేరుగా వెళ్లేందుకు ఆస్కారం ఉంది. ఇక అనూహ్య రైలు దిగిన మూడవ నెంబరు ఫ్లాట్ ఫారాాన్ని పరిశీలించినట్టయితే నాలుగు సీసీ టీవీలున్నాయి. ఫ్లాట్‌ఫారం మధ్యలో ఉన్న పాదచారుల వంతెన వరకు నాలుగు సీసీటీవీలు సుమారు 40 నుంచి 50 అడుగుల దూరంలో అమర్చి ఉన్నాయి. అయితే ఇవన్నీ డౌన్ వైపు చిత్రీకరించేవిధంగా ఉన్నాయి. దీంతో వీటిలో అనూహ్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసు ఇన్స్పెక్టర్ శింతే తెలిపారు. దీంతో రెండో నంబర్ ఫ్లాట్‌ఫారంలోని సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు. దీనిపై కూడా కేవలం ఆరు సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిలో మొదటి మూడు ఫ్లాట్ ఫారం మూడుపై ఉన్నట్టుగానే దిగువ వైపు చిత్రీకరించే విధంగా ఉండగా, తర్వాత కెమెరా ఎగువ వైపు, మరొకటి దిగువ దిశగా ఉన్నాయి. అయితే ఇవన్ని కూడా పాదచారుల వంతెన తర్వాత మరో రెండు మూడు బోగీలు కనిపించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. కాని ఇంజిన్‌వైపు నుంచి వెళితే మాత్రం ఎవరూ కన్పించే అవకాశంలేదు. దీంతో అనూహ్య అటునుంచి వెళ్లిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ముందువైపు ఎగ్జిట్, ఎంట్రెన్స్‌లో కూడా సీసీ టీవీలున్నట్టయితే అనూహ్య కన్పించి ఉండడంతోపాటు ఆమెను కాపాడుకునేందుకు కూడా ఆస్కారం ఉండేదని భావిస్తున్నారు. అయితే ఊరినుంచి వెళ్లిన ప్రతిసారీ అటోలోనే ఇంటికి వెళ్లే అనూహ్య ఈసారి కూడా ఎటువైపు నుంచి అటోలో వెళ్లిందనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇప్పటి వరకు పలువురిని విచారించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుపుతున్నారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని వైపుల సీసీటీవీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. -
సీఎస్టీకి ‘హెరిటేజ్’ హంగులు
సాక్షి, ముంబై: చారిత్రాత్మక కట్టడాల (హెరిటేజ్) జాబితాలోకి వస్తున్న ప్రముఖ ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), చర్చిగేట్ స్టేషన్లతోపాటు మరో కీలకమైన స్టేషన్ రూపురేఖలను నగర పాలక సంస్థ (బీఎంసీ) మార్చివేయనుంది. ఈ మేరకు ఒక్కో కట్టడం కోసం బీఎంసీ రూ.200 కోట్ల చొప్పన ఖర్చు చేయనుంది. ‘హెరిటేజ్ హోదాలోకి వస్తున్న సీఎస్టీ, చర్చిగేట్ స్టేషన్ల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఈ రెండు స్టేషన్ల వద్ద ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు నిర్మించిన భూగర్భ మార్గం (సబ్ వే) లో విద్యుద్దీపాలు సరిగా వెలగడం లేదు. వీటి పరిస్థితి కూడా అధ్వానంగా తయారైంది. వీటన్నింటికి మరమ్మతులు చేపట్టాల’ని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.వి.ఆర్.శ్రీనివాస్ చెప్పారు. కుర్లా స్టేషన్ రూపురేఖలు మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. అధ్యయనం పనులు చేపట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కోరడం లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. పనులు ప్రారంభించే ముందు ప్రత్యేకంగా ఒక సలహాదారుల కమిటీ నియమిస్తామని పేర్కొన్నారు. నగరంలో అతి పురాతన, నిత్యం రద్దీగా ఉండే స్టేషన్లలో సీఎస్టీ, చర్చిగేట్ స్టేషన్లు మొదటి క్రమంలో ఉన్నాయి. ఆ తర్వాత దాదర్, పరేల్, కుర్లా, బాంద్రా, అంధేరి, ఎల్ఫిన్స్టన్ రోడ్ తదితర స్టేషన్లు వస్తాయి. కాని ఈ స్టేషన్లకు హెరిటేజ్ హోదా లేకపోవడంతో రూపురేఖలు మార్చడానికి బీఎంసీ అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. -
సీఎస్టీకి కొత్త సొబగులు
సాక్షి ముంబై: ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్‌ను మరింత కాంతివంతంగా తీర్చిదిద్దనున్నారు. ‘ప్రపంచ వారసత్వ కట్టడం’ (వరల్డ్ హెరిటేజ్ హౌస్) హోదా లభించిన ఈ స్టేషన్‌ను ప్రత్యేక విద్యుత్‌కాంతులతో మరింత ఆకర్షణీయంగా మార్చాలని సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఈ పనుల కోసం రూ.నాలుగు కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు. మరింత ప్రకాశించే ఎల్ఈడీ విద్యుత్ దీపాలు స్టేషన్లో అమర్చుతామని సెంట్రల్ రైల్వే పీఆర్వో ఏ.కే.సింగ్ తెలిపారు. సీఎస్టీ నిర్మాణ పనులను 1878లో ప్రారంభించి పదేళ్ల తర్వాత పనులను పూర్తి చేశారు. సీఎస్టీ ఏర్పడి ప్రస్తుతం 125 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. నగరంలో మొట్టమొదటి రైలు కదిలింది ఈ స్టేషన్లోనే. కాలక్రమేణా ఈ స్టేషన్‌ను మరింత అభివృద్ధిపర్చారు. దీంతో ఈ నిర్మాణం అనేక మంది దృష్టిలోకి రావడం మొదలయింది. 2004 జూలై రెండున ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్’ దీనిని ప్రపంచ వారసత్వ కట్టడాల (వరల్డ్ హెరిటేజ్ హౌస్) జాబితాలో చేర్చింది. ఈ సీఎస్టీ నిర్మాణ విశిష్టతను సందర్శించడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దీంతో సీఎస్టీ పర్యాటక ప్రాంతంగా మారింది. అయితే పురాతన ప్రదేశమైన సీఎస్టీని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని రైల్వే శాఖ యోచించింది. ఈ మేరకు సీఎస్టీని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించాలని నిర్ణయించింది. స్టేషన్ లోపలా, బయటా వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్టేషన్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ పనుల కోసం రూ.4,37,51,723 ఖర్చు చేయనుంది. డిసెంబర్ 10 వరకు టెండర్లు ఆహ్వానిస్తామని సింగ్ వివరించారు. ప్రస్తుతం ఉన్న కొన్ని విద్యుత్ దీపాలను తర్వాత తీసివేస్తారని, వాటి స్థానంలో కొత్త దీపాలను అమర్చుతారని ఆయన తెలిపారు.