సాక్షి, ముంబై: చారిత్రాత్మక కట్టడాల (హెరిటేజ్) జాబితాలోకి వస్తున్న ప్రముఖ ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), చర్చిగేట్ స్టేషన్లతోపాటు మరో కీలకమైన స్టేషన్ రూపురేఖలను నగర పాలక సంస్థ (బీఎంసీ) మార్చివేయనుంది. ఈ మేరకు ఒక్కో కట్టడం కోసం బీఎంసీ రూ.200 కోట్ల చొప్పన ఖర్చు చేయనుంది. ‘హెరిటేజ్ హోదాలోకి వస్తున్న సీఎస్టీ, చర్చిగేట్ స్టేషన్ల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఈ రెండు స్టేషన్ల వద్ద ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు నిర్మించిన భూగర్భ మార్గం (సబ్ వే) లో విద్యుద్దీపాలు సరిగా వెలగడం లేదు. వీటి పరిస్థితి కూడా అధ్వానంగా తయారైంది. వీటన్నింటికి మరమ్మతులు చేపట్టాల’ని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.వి.ఆర్.శ్రీనివాస్ చెప్పారు.
కుర్లా స్టేషన్ రూపురేఖలు మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. అధ్యయనం పనులు చేపట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కోరడం లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. పనులు ప్రారంభించే ముందు ప్రత్యేకంగా ఒక సలహాదారుల కమిటీ నియమిస్తామని పేర్కొన్నారు. నగరంలో అతి పురాతన, నిత్యం రద్దీగా ఉండే స్టేషన్లలో సీఎస్టీ, చర్చిగేట్ స్టేషన్లు మొదటి క్రమంలో ఉన్నాయి. ఆ తర్వాత దాదర్, పరేల్, కుర్లా, బాంద్రా, అంధేరి, ఎల్ఫిన్‌స్టన్ రోడ్ తదితర స్టేషన్లు వస్తాయి. కాని ఈ స్టేషన్లకు హెరిటేజ్ హోదా లేకపోవడంతో రూపురేఖలు మార్చడానికి బీఎంసీ అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది.
సీఎస్టీకి ‘హెరిటేజ్’ హంగులు
Published Wed, Jan 1 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement