Historic monuments
-
‘ఉస్మానియా’ను ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రికి మరమ్మతులు చేస్తారా? లేక నూతన భవనాలను నిర్మిస్తారా? ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దాదాపు ఆరేళ్లు గడిచినా ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను 4 వారాల్లో సమర్పించాలని, ఉస్మానియా ఆసుపత్రి స్థలంతో పాటు భవనాలకు సంబంధించిన సైట్ ప్లాన్, గూగుల్ మ్యాప్ తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. చారిత్రక కట్టడమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చకుండా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఉస్మానియా ఆసుపత్రి భవనానికి మరమ్మతులు చేయాలా లేదా భవనాలు కూల్చేసి కొత్త భవనాలు నిర్మించాలా అన్న దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ పిల్ 2015లో దాఖలైందని, ఆరేళ్లయినా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. గత విచారణ సందర్భంగా సైట్‌మ్యాప్, గూగుల్ మ్యాప్‌లను సమర్పించాలని ఆదేశించినా ఎందుకు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. చారిత్రక భవనాలను హెరిటేజ్ భవనాల జాబితా నుంచి తొలగించి వాటిని కూల్చేసేందుకు ప్రభుత్వం జీవో–183 జారీ చేసిందని, ఈ జీవో చట్ట విరుద్ధమని ఇటీవల ఎర్రమంజిల్ భవనాల పరిరక్షణలో భాగంగా ఇచ్చిన తీర్పులో హైకోర్టు స్పష్టం చేసిందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. హెరిటేజ్ భవనాలను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. -
సుందర సోమనాథుడు
పాఠక పర్యటన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది అయిన సోమనాథ్ దేవాలయం సందర్శించే భాగ్యం కలగడం మా అదృష్టం. ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో ఆ దేవాలయాన్ని, ఆ దైవ సన్నిధిని స్మరించుకోవడం మరింత భాగ్యం. నేటికీ రెండు నెలల క్రితం అహ్మదాబాద్‌లో బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి మా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాజ్‌కోటి ఎక్స్‌ప్రెస్‌లో అహ్మదాబాద్ చేరుకున్నాం. బంధువుల ఇంట సందడి పూర్తవగానే చుట్టుపక్కల ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు చూడాలని బయల్దేరాం. అందులో ముందుగా గాంధీనగర్‌ను, ఆ తర్వాత గుజరాతీల ఇష్టదేవత భద్రకాళీ, జగన్నాథ మందిరాల దర్శించుకున్నాం. ఆ తర్వాత .. అహ్మదాబాద్ నుండి సోమనాథ్ దేవాలయం ఎంత దూరంలో ఉందో వాకబు చేశాం. అహ్మదాబాద్ నుండి 400 కి.మీ దూరం ఉన్న సోమనాథ్‌కు బస్‌ల ద్వారా చేరుకోవచ్చు. మేం లగ్జరీ బస్‌లో ముందుగా టికెట్ బుక్ చేసుకొని బయల్దేరాం. రాత్రంతా ప్రయాణించి, ఉదయం 8 గం.లకు సోమనాథ్ చేరుకున్నాం. అక్కడ గైడ్‌ను మాట్లాడుకొని, దేవాలయ సందర్శనకు బయల్దేరాం. ప్రాచీన వైభవం... సోమనాథ్ దేవాలయం అతి ప్రాచీన కట్టడం. ఈ దేవాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆలయం నిర్మాణం, నాటి ప్రాచీన శిల్ప కళా వైభవం అడుగడుగునా అబ్బురపరిచింది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలంలో యాదవుల రాజు వల్లభ ఈ ఆలయాన్ని నిర్మించాడని, ఆ తర్వాత కాలంలో ఎన్నో దాడులకు ఈ కట్టడం లోనైందని తెలిసింది. చాళుక్యుల నిర్మాణ కౌశలం అడుగడుగునా కనిపిస్తుంది. 1947లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని గైడ్ ద్వారా తెలుసుకున్నాం. ఎర్రటి రాయితో చేసిన ఈ ఆలయ నిర్మాణం గుజరాత్ ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆలయ సమీపంలోని కోనేరు విశాలమైనది. ఆ నీటిలో స్నానాలు ముగించుకొని శివలింగ దర్శనం చేసుకున్నాం. సోమనాథ్ దేవాలయంతో పాటు అక్షరథామ్, సబర్మతీ ఆశ్రమం, మౌంట్ అబూ ప్రదేశాలనూ చూసి వచ్చాం. ఈ పర్యటన ఎప్పటికీ మరచిపోలేనిదిగా మా మదిలో నిలిచిపోయింది. -కె.సునీత కృష్ణమూర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్ -
గుట్టుగా బలవుతున్నారు
తరుచూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగే కౌలాస్ ఖిల్లా చారిత్రాత్మక ప్రదేశాల్లో గుప్త నిధులు ఉన్నాయనే నమ్మకంతో గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జగుతున్నాయి. కౌలాస్ ఖిల్లా, జుక్కల్ బురుజుల్లో తవ్వకాల మూలంగా ఏర్పడిన బిలలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గుప్త నిధులపై ఆశతో కొందరు తవ్వకాలకు ఖర్చుచేస్తూ ఆస్తులు కరిగించేసుకుంటున్నారు.గుప్త నిధుల వేటలో మరికొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నిధుల కోసం.. * బాన్సువాడ ప్రాంతంలో తవ్వకాలు * అమావాస్య, పౌర్ణమి రోజుల్లో జోరు * ప్రాణాలు పణంగా పెడుతున్న అమాయకులు * శాంతాపూర్ గండిలో ఇదే రీతిలో ఒకరి మరణం * కౌలాస్ ఖిల్లాలో నిధులున్నాయని నమ్మకం బాన్సువాడ : చారిత్రక కట్టడాలు గల బాన్సువాడ ప్రాంతంలో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి తవ్వకాలు జరుపుతున్న ముఠాలు, అమాయకుల ప్రాణాలకు హాని కూడ కలిగిస్తున్నారు. కౌలాస్ రాజులు పాలించిన ఈ ప్రాంతంలోని కౌలాస్ ఖిల్లా, జుక్కల్ బురుజు, బి చ్కుంద, పుల్కల్, శాంతాపూర్ గండి, వాజిద్నగర్, పి ట్లం, బీర్కూర్, సోమేశ్వర్ ప్రాంతాల్లో తరచుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజుల కాలంలో ఆయా ప్రాంతాల్లో బంగారు నగలు, నాణేలు భూమిలో పాతిపెట్టారనే ప్రచారం ఉంది. దీంతో తవ్వకాలకు పాల్పడుతూ కొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం ప్రతి అమావాస్య, పౌర్ణమి నాడు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూనే ఉంటారు. ఇందుకు నిదర్శనంగా రెండు నెలల క్రితం బిచ్కుంద మండలం శాంతాపూర్ గండిలో గుప్త నిధుల కోసం తవ్వుతూ ఒకరు మరణించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ ఏకంగా 25 మంది ముఠాగా ఏర్పడి తవ్వకాలు జరపడం గమనార్హం. పాత బాన్సువాడలోనూ గుప్త నిధుల కోసం వారం రోజుల క్రితం తవ్వకాలు జరిపారు. అలాగే మూడేళ్ల క్రితం బీర్కూర్‌లోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం ఓ వ్యక్తి మేక పిల్లను బలి ఇచ్చేందుకు పూనుకోగా, గ్రామస్తులు విషయాన్ని తెలుసుకుని పోలీసులకు పట్టించారు. రాజుల కాలంలో దాచి ఉంచిన నిధులు ఇక్కడ తవ్వకాల్లో లభిస్తున్నాయనే ప్రచా రం దశాబ్దాలుగా ఉంది. ఎనిమిదేళ్ల క్రితం బీర్కూర్‌లోని ఒక పాత థియేటర్లో గుప్త నిధులు లభించగా, రెవెన్యూ అధికారులు, పోలీసులు విచారణ జరిపి కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కౌలాస్ ఖిల్లాలో అప్పటి రాజులు భారీగా నిధులను దాచి ఉంచారనే ప్రచారం జరుగుతుండడంతో కొన్నేళ్లుగా గుర్తు తెలి యని వ్యక్తులు అప్పుడప్పుడు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. బిచ్కుంద మండలం తక్కడపల్లి వద్ద చారిత్రాత్మక మందిరాన్ని గుప్త నిధుల కోసం కూల్చివేశారు. మరో ఘటనలో ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే మూడేళ్ల క్రితం కౌలాస్ ఖిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా, గ్రామస్తులు అడ్డుకొన్న ఘటన తెలిసిందే. గుప్త నిధుల కోసం రాత్రి వేళల్లో కొందరు బృందాలుగా ఏర్పడి తవ్వకాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. బీర్కూర్ మండలంలోని సంగెం, బొమ్మన్‌దేవ్‌పల్లి, దుర్కి తదితర గ్రామాల్లో ఆమావాస్య, పౌర్ణమి రోజులతో పాటు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో గుప్త నిధుల కోసం జోరుగా తవ్వకాలు సాగిస్తున్నారు. మూడేళ్ల క్రితం సంగెం గ్రామంలో కొందరు గుప్తనిధి కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలుసుకున్న గ్రామస్తులు వారిని పట్టుకుని భారీగా జరిమానా విధించారు. గుప్త నిధుల కోసం లక్షలాధి రూపాయలు వెచ్చిస్తూ ఇల్లును గుల్ల చేసుకుంటున్నవారు సైతం ఉన్నారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ నిధుల వేట ముమ్మరంగా సాగుతోంది. మంత్రగాళ్లుగా చెప్పుకునే వారిని మూఢ విశ్వాసంతో ఇతర ప్రాంతాల నుంచి పిలిపించి పూజలు చేయిస్తూ నిధుల కోసం తవ్వకాలు జరిపిస్తున్నారు. ఈ తంతు వ్యవహారాలు తరుచూగా జరుగుతున్నాయి.పోలీసుల నిఘా కూడా తక్కువగా ఉండటంతో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులు స్పందించి ఈ నిధుల వేటకు అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
చూసొద్దాం!అలనాటి వైభవం...
సెలవు రోజు వస్తే ఇంటిల్లిపాది దగ్గరలోని ఆహ్లాదకర ప్రాంతాలకు వెళ్లి రావడానికి ఆసక్తి చూపుతారు. మరికాస్త ఆసక్తి, తీరిక ఉంటే రాష్ట్ర పరిధిలోని చారిత్రక కట్టడాలను, ప్రదేశాలను చూసి వస్తుంటారు. కాని అరుదుగా కొంతమంది మాత్రం యునెస్కో జాబితాలో ఉన్న ప్రాచీన కట్టడాలను చూసి రావడానికి, ఆ విశేషాలను గ్రంథస్థం చేయడానికి పూనుకుంటారు. ఆ విధంగా వారు చారిత్రక విషయాలను తెలుసుకోవడం, అధ్యయనం చేయడం భావి తరాలకు వారసత్వ సంపద విశేషాలు తెలియజేయడం కోసమేనని భావిస్తారు. దానితోబాటు యునెస్కో ట్రావెలర్స్‌గా గుర్తింపు పొందాలని తపన పడుతుంటారు. మీరూ ఆ గ్రూప్‌లో ఉండాలనుకుంటే.. ఈ సమాచారం మీ కోసమే! ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థగా పేరున్న ‘యునెస్కో’ కార్యాలయం ప్రపంచంలోని అన్ని ప్రాచీన కట్టడాల, జాతీయ ఉద్యానాల, జీవజాలాల పరిరక్షణకు సహకారం అందిస్తోంది. అందులో భాగంగానే ప్రపంచంలోని వేలాది ప్రాచీన కట్టడాలు, జాతీయ ఉద్యానాలు ఈ సమితి జాబితాలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికే మన దేశంలోని 25 ప్రాచీన కట్టడాలు, ఏడు జాతీయ ఉద్యానాలు వారసత్వ సంపదలో చోటు చేసుకోగా... ఇంకా వందకు పైగా కట్టడాలు, ఉద్యానాలు పరిశీలనలో ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళలు ఇప్పటికే వారసత్వ సంపదలో చేరిన ఘనతను పొందాయి. కానీ తెలుగు రాష్ట్రాలకు ఇంకా ఆ ఘనత లభించలేదు. అయితే ఇటీవల.. అద్భుత శిల్పకళా సంపద, అబ్బురపరిచే అతి పురాతన నిర్మాణ పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా ఉన్న వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ సంపద హోదాను కేటాయించే ‘యునెస్కో’ తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయని, ఈ సంవత్సరం చివరిలో పారిస్ నుంచి యునెస్కో ప్రతినిధులు వచ్చి ఈ ప్రాచీన కట్టడాలను పరిశీలిస్తారనే వార్తలు ఇటీవల వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటైనా యునెస్కో గుర్తింపు పొందితే తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఘనత సాధించిన తొలి కట్టడంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఆ విధంగా ప్రాచీన వారసత్వ కట్టడాల సందర్శనను మొదలుపెడితే ముందుగా వరంగల్ చేరుకోవచ్చు. అటునుంచి దేశ రాజధాని ఢిల్లీకి చేరి, వివిధ రాష్ట్రాలలో యునెస్కో జాబితాలో ఉన్న కట్టడాలను సందర్శించి, వాటి విశేషాల సమాహారాన్ని తెలుసుకోవచ్చు. ముందుగా యునెస్కో జాబితా ఖాతా తెరిచిన మన దేశ ప్రాచీన వారసత్వ సంపదలో.. ఆగ్రా కోట, తాజ్‌మహల్, మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా గుహలు చేరాయి. 1983లో యునెస్కో జాబితాలో ఇవి చేరడంతో మన దేశ ప్రాచీన వారసత్వ సంపద విదేశీ ప్రయాణికులలో ఆసక్తిని కలిగించింది. ఆ విధంగా విదేశీ ప్రయాణికుల రాక మన వద్ద పెరుగుతూ వచ్చింది. వీటికి దగ్గరలోనే ఉన్న కుతుబ్ మినార్, హుమాయూన్ టూంబ్ మరో పదేళ్లకు అంటే 1983లో యునెస్కో జాబితాలో చేరాయి. ఢిల్లీ వెళితే వీటితో పాటు జహంగీర్ ప్యాలెస్, మరో రెండు సుందరమైన మసీదులను చూసి రావచ్చు. ఆ తర్వాత సంవత్సరం 1984లో తమిళనాడులోని మహాబలిపురం, ఒరిస్సాలోని కోణార్క్ సూర్యదేవాలయాల ఖ్యాతి యునెస్కోలో చేరింది. 1985లో అస్సాంలోని కజిరంగ, మానస్, రాజస్థాన్‌లోని కొలాడియో జాతీయ ఉద్యానాలు చోటు చేసుకోగా..1986లో గోవాలోని చర్చ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ, కర్ణాటకలోని హంపీ దేవాలయాలు, మధ్యప్రదేశ్‌లోని ఖజురహో శిల్పసముదాయాలు.. చోటు చేసుకున్నాయి. 1987లో తమిళనాడులోని అతిగొప్పవైన చోళ దేవాలయాలు, కర్ణాటకలోని పట్టాడకల్ ప్రాచీన కట్టడాలు, మహరాష్ట్రలోని ఎలిఫెంటా గుహలు, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ జాతీయ ఉద్యానం, 1988లో ఉత్తరాఖండ్‌లోని నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉద్యానం చోటు చేసుకున్నాయి. 1999లో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేగా పేరుపొందిన మౌంటెయిన్ రైల్వైస్, తర్వాత మరో మూడేళ్లకు బీహార్ రాష్ట్రంలోని మహాబోధి దేవాలయం, 2003లో మధ్యప్రదేశ్‌లోని రాక్షెల్టర్స్ భింబెట్కా, 2004లో గుజరాత్‌లోని పావగడ్ ఆర్కియలాజికల్ పార్క్, ముంబయ్‌లోని ఛత్రపతి శివాజి టెర్మినస్‌గా పేరున్న విక్టోరియా టెర్మినస్ చోటు చేసుకోగా 2007లో ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ కాంప్లెక్స్ యునెస్కో జాబితాలో చేరింది. 2010లో జైపూర్‌లోని జంతర్‌మంతర్, 2012లో వెస్ట్రన్ ఘాట్స్, 2013లో రాజస్థాన్‌లోని హిల్ ఫోర్ట్స్ చోటు చేసుకోగా ఈ ఏడాది ప్రకృతి ప్రసాదితమైన గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్‌కి ఆ గౌరవం దక్కింది. యునెస్కో జాబితాలో తమ ప్రాంతపు ప్రాచీన కట్టడాలు చేరడం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రతి దేశం భావిస్తుంటుంది. మనకు ఆకాశమంత కీర్తిప్రతిష్టలను తెచ్చిపెట్టే ఈ అద్భుత వారసత్వ సంపద సందర్శన మదిలో ఎప్పటికీ నిలిచిపోయే విజ్ఞాన ఖనిగా భాసిల్లుతూనే ఉంటుంది. యునెస్కో జాబితాలో చోటు పొందిన ప్రాచీన కట్టడాలు, జాతీయ ఉద్యానవనాల జాబితాను సంవత్సరాల వారీగా విభజించుకుంటే రవాణా మార్గాలను వెతుక్కోవడం సులువు అవుతుంది. మన దేశంలో ప్రఖ్యాత ప్రాచీన కట్టడాలను చేరుకోవడానికి ఆయా రాష్ట్రాల రాజధానుల నుంచి బస్సు సదుపాయాలు ఉన్నాయి. ప్రసిద్ధ కట్టడాల గురించి పర్యాటకుల కోసం ట్రావెల్ గైడ్ బుక్స్, ఆడియో రికార్డ్స్ లభిస్తున్నాయి వాటి ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా వీటి సమాచారం తెలుసుకోవాలనుకునేవారు ‘గో యునెస్కో’ వెబ్‌సైట్‌కు లాగిన్ అయితే ప్రపంచంలోని వారసత్వ కట్టడాలు, ప్రదేశాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడే యునెస్కో ట్రావెలర్ గ్రూప్స్‌ను కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. -
సీఎస్టీకి ‘హెరిటేజ్’ హంగులు
సాక్షి, ముంబై: చారిత్రాత్మక కట్టడాల (హెరిటేజ్) జాబితాలోకి వస్తున్న ప్రముఖ ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), చర్చిగేట్ స్టేషన్లతోపాటు మరో కీలకమైన స్టేషన్ రూపురేఖలను నగర పాలక సంస్థ (బీఎంసీ) మార్చివేయనుంది. ఈ మేరకు ఒక్కో కట్టడం కోసం బీఎంసీ రూ.200 కోట్ల చొప్పన ఖర్చు చేయనుంది. ‘హెరిటేజ్ హోదాలోకి వస్తున్న సీఎస్టీ, చర్చిగేట్ స్టేషన్ల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఈ రెండు స్టేషన్ల వద్ద ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు నిర్మించిన భూగర్భ మార్గం (సబ్ వే) లో విద్యుద్దీపాలు సరిగా వెలగడం లేదు. వీటి పరిస్థితి కూడా అధ్వానంగా తయారైంది. వీటన్నింటికి మరమ్మతులు చేపట్టాల’ని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.వి.ఆర్.శ్రీనివాస్ చెప్పారు. కుర్లా స్టేషన్ రూపురేఖలు మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. అధ్యయనం పనులు చేపట్టి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కోరడం లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. పనులు ప్రారంభించే ముందు ప్రత్యేకంగా ఒక సలహాదారుల కమిటీ నియమిస్తామని పేర్కొన్నారు. నగరంలో అతి పురాతన, నిత్యం రద్దీగా ఉండే స్టేషన్లలో సీఎస్టీ, చర్చిగేట్ స్టేషన్లు మొదటి క్రమంలో ఉన్నాయి. ఆ తర్వాత దాదర్, పరేల్, కుర్లా, బాంద్రా, అంధేరి, ఎల్ఫిన్స్టన్ రోడ్ తదితర స్టేషన్లు వస్తాయి. కాని ఈ స్టేషన్లకు హెరిటేజ్ హోదా లేకపోవడంతో రూపురేఖలు మార్చడానికి బీఎంసీ అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది.