గుట్టుగా బలవుతున్నారు | Excavations in the banswada area | Sakshi
Sakshi News home page

గుట్టుగా బలవుతున్నారు

Published Mon, Oct 27 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

గుట్టుగా బలవుతున్నారు

గుట్టుగా బలవుతున్నారు

తరుచూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగే కౌలాస్ ఖిల్లా
చారిత్రాత్మక ప్రదేశాల్లో గుప్త నిధులు ఉన్నాయనే నమ్మకంతో గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జగుతున్నాయి. కౌలాస్ ఖిల్లా, జుక్కల్ బురుజుల్లో తవ్వకాల మూలంగా ఏర్పడిన బిలలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గుప్త నిధులపై ఆశతో కొందరు తవ్వకాలకు ఖర్చుచేస్తూ ఆస్తులు కరిగించేసుకుంటున్నారు.గుప్త నిధుల వేటలో మరికొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
 
నిధుల కోసం..
* బాన్సువాడ ప్రాంతంలో తవ్వకాలు
* అమావాస్య, పౌర్ణమి రోజుల్లో జోరు
* ప్రాణాలు పణంగా పెడుతున్న అమాయకులు
* శాంతాపూర్ గండిలో ఇదే రీతిలో ఒకరి మరణం
* కౌలాస్ ఖిల్లాలో నిధులున్నాయని నమ్మకం
బాన్సువాడ : చారిత్రక కట్టడాలు గల బాన్సువాడ ప్రాంతంలో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి తవ్వకాలు జరుపుతున్న ముఠాలు, అమాయకుల ప్రాణాలకు హాని కూడ కలిగిస్తున్నారు. కౌలాస్ రాజులు పాలించిన ఈ ప్రాంతంలోని కౌలాస్ ఖిల్లా, జుక్కల్ బురుజు, బి చ్కుంద, పుల్కల్, శాంతాపూర్ గండి, వాజిద్‌నగర్, పి ట్లం, బీర్కూర్, సోమేశ్వర్ ప్రాంతాల్లో తరచుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

రాజుల కాలంలో ఆయా ప్రాంతాల్లో బంగారు నగలు, నాణేలు భూమిలో పాతిపెట్టారనే ప్రచారం ఉంది. దీంతో తవ్వకాలకు పాల్పడుతూ కొందరు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం ప్రతి అమావాస్య, పౌర్ణమి నాడు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతూనే ఉంటారు. ఇందుకు నిదర్శనంగా రెండు నెలల క్రితం బిచ్కుంద మండలం శాంతాపూర్ గండిలో గుప్త నిధుల కోసం తవ్వుతూ ఒకరు మరణించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ ఏకంగా 25 మంది ముఠాగా ఏర్పడి తవ్వకాలు జరపడం గమనార్హం.

పాత బాన్సువాడలోనూ గుప్త నిధుల కోసం వారం రోజుల క్రితం తవ్వకాలు జరిపారు. అలాగే మూడేళ్ల క్రితం బీర్కూర్‌లోని ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం ఓ వ్యక్తి మేక పిల్లను బలి ఇచ్చేందుకు పూనుకోగా, గ్రామస్తులు విషయాన్ని తెలుసుకుని పోలీసులకు పట్టించారు. రాజుల కాలంలో దాచి ఉంచిన నిధులు ఇక్కడ తవ్వకాల్లో లభిస్తున్నాయనే ప్రచా రం దశాబ్దాలుగా ఉంది. ఎనిమిదేళ్ల క్రితం బీర్కూర్‌లోని ఒక పాత థియేటర్‌లో గుప్త నిధులు లభించగా, రెవెన్యూ అధికారులు, పోలీసులు  విచారణ జరిపి కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కౌలాస్ ఖిల్లాలో అప్పటి రాజులు భారీగా నిధులను దాచి ఉంచారనే ప్రచారం జరుగుతుండడంతో కొన్నేళ్లుగా గుర్తు తెలి యని వ్యక్తులు అప్పుడప్పుడు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు.

బిచ్కుంద మండలం తక్కడపల్లి వద్ద చారిత్రాత్మక మందిరాన్ని గుప్త నిధుల కోసం కూల్చివేశారు. మరో ఘటనలో ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే మూడేళ్ల క్రితం కౌలాస్ ఖిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా, గ్రామస్తులు అడ్డుకొన్న ఘటన తెలిసిందే. గుప్త నిధుల కోసం రాత్రి వేళల్లో కొందరు బృందాలుగా ఏర్పడి తవ్వకాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. బీర్కూర్ మండలంలోని సంగెం, బొమ్మన్‌దేవ్‌పల్లి, దుర్కి తదితర గ్రామాల్లో ఆమావాస్య, పౌర్ణమి రోజులతో పాటు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో గుప్త నిధుల కోసం జోరుగా తవ్వకాలు సాగిస్తున్నారు.

మూడేళ్ల క్రితం సంగెం గ్రామంలో కొందరు గుప్తనిధి కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలుసుకున్న గ్రామస్తులు వారిని పట్టుకుని భారీగా జరిమానా విధించారు. గుప్త నిధుల కోసం లక్షలాధి రూపాయలు వెచ్చిస్తూ ఇల్లును గుల్ల చేసుకుంటున్నవారు సైతం ఉన్నారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ నిధుల వేట ముమ్మరంగా సాగుతోంది. మంత్రగాళ్లుగా చెప్పుకునే వారిని మూఢ విశ్వాసంతో ఇతర ప్రాంతాల నుంచి పిలిపించి పూజలు చేయిస్తూ నిధుల కోసం తవ్వకాలు జరిపిస్తున్నారు. ఈ తంతు వ్యవహారాలు తరుచూగా జరుగుతున్నాయి.పోలీసుల నిఘా కూడా తక్కువగా ఉండటంతో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులు స్పందించి ఈ నిధుల వేటకు అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement